అందరికీ ఒక మాట సుపరిచితమయింది. అదే ‘కనీస మద్దతు ధర’ (వీూూ-వీఱఅఱఎబఎ ూబజూజూశీత్‌ీ ూతీఱషవ). ఇది దేశ రాజధాని చుట్టూ మోహరించిన రైతు ఉద్యమం వలనే సాధ్యమయింది. అనేక దశాబ్దాలుగా రైతులు వ్యవసాయంలో సమస్యలను ఎదుర్కొంటూ వస్తున్నారు. ఇప్పటివరకూ 3.5 లక్షలకు పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకుని చనిపోయారు. వీటి పరంపర ఇంకా కొనసాగుతూనే
ఉంది. కానీ ఏనాడూ వారి సమస్యలపై జాతీయస్థాయిలో చర్చ జరగలేదు. ఇప్పుడు చేస్తున్న ఈ ఉద్యమానికి ముందు కూడా వారు ఎన్నో పోరాటాలు చేసినా ఎవరూ ఖాతరు చేయలేదు. ఇప్పుడు చూడండి దేశ రాజధానికి వెళ్ళే దారులు బంధించేసరికి అందరూ మాట్లాడడం మొదలుపెట్టారు. నూటికి 60 శాతం మంది దేశ ప్రజలు వ్యవసాయం మీద ప్రత్యక్షంగా ఆధారపడి ఉన్నారు. 130 కోట్ల మంది దేశ ప్రజలకు మూడు పూటలా ఆహారం కావాలంటే వ్యవసాయం జరగాల్సిందే. వారి ఓట్లతోనే పార్టీలు అధికారంలోకి వస్తాయి. వ్యవసాయ రంగం సమస్యలపై వేసిన జాతీయ కమీషన్ (దీనినే స్వామినాథన్ కమీషన్ అంటారు) తన నివేదిక ఇచ్చి 15 ఏళ్ళు గడిచినా, ఇంతవరకూ పార్లమెంటులో చర్చ జరగలేదు. రైతు సమస్యలను చర్చించడానికి ఒక ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహించమని కోరితే మోడీ సర్కార్ ఆ డిమాండ్‌ను ఖాతరు చేయలేదు. రైతు సమస్యలలోని వివిధ అంశాలను చర్చించడానికి ఈ రైతు ఉద్యమం ఒక అవకాశం ఇచ్చింది.
ఈ మొత్తం ఉద్యమంలో చాలా కీలకమైన అంశం ‘కనీస మద్దతు ధర’ అన్న మాట నిజం. అయితే, ఇది ఒకటే సమస్య అన్నట్లుగా కొందరు/కొన్ని టీవీ ఛానళ్ళు చూపిస్తున్నాయి కానీ అది నిజం కాదు. ఈ ‘కనీస మద్దతు ధర’ చుట్టూ తిరుగుతున్న వాదప్రతివాదనలు అర్థం చేసుకోవాలంటే అసలు ”కనీస మద్దతు ధర” అంటే ఏమిటి, అందులో ఉండే మూలకాలు ఏమిటో తెలుసుకోవాలి. అవి తెలిస్తే దాని చుట్టూ ముసురుతున్న వాదప్రతివాదనలు మనం తేలికగా అర్థం చేసుకోగలుగుతాం.
మనం ఒక హోటల్‌కి వెళ్ళి ఒక ప్లేట్ సాంబారు ఇడ్లీ తిన్నాక 25 రూపాయలు దానికి ఇస్తున్నాము. అంటే మనకు కనీసం రెండు విషయాలు తెలుసు. ఆ 25 రూపాయలలో 1. ఆ ప్లేట్ ఇడ్లీ తయారుకయిన ఖర్చు అనగా పెట్టుబడి, 2. హోటల్ యజమాని వేసుకున్న లాభం ఉన్నాయని మనకు తెలుసు. మీరు ఎప్పుడైనా ”కనీస వేతనం” అనే మాట విన్నారా? మరి దానర్థం ఏమిటి? బ్రతకడానికి మరే సాధనసంపత్తి లేనప్పుడు, ఒక వస్తువును అమ్మినట్లు, అతను/ఆమె తన శరీరంలో ఉన్న తమ శ్రమశక్తిని మార్కెట్‌లో అమ్ముతారు. ఆ శ్రమశక్తి అనే సరుకు చెల్లించే ధరనే మనం వేతనం లేదా కూలి అంటున్నాం. అప్పుడు ఆ ధర (వేతనం/కూలి)లో ఉన్న మూలకాలు ఏమిటి? అందులో కూడా ‘లాభం’ అనేది ఉంటుందా? కనీస వేతనం – కనీస మద్దతు ధర రెండింటికీ ఒక లింకు ఉన్నట్లు కనిపిస్తోంది కదా?!
మళ్ళీ మనం హోటల్ ఉదాహరణ దగ్గరికి వద్దాం. మన పట్టణంలో ఒకే హోటల్ ఉండదు కదా, చాలా ఉంటాయి. మరొక హోటల్ యజమాని అదే ప్లేట్ ఇడ్లీని 20 రూపాయలకు అమ్ముతున్నాడనుకుందాం. అప్పుడు వినియోగదారులు అక్కడికే వెళ్తారు. మొదటి హోటల్ ఆసామి తన రేటును అప్పుడు 20 రూపాయలకు తగ్గించవలసి వస్తుంది. అయితే 25 నుండి 20కి తగ్గిన ధరలోని తగ్గిన ఆ 5 రూపాయలు ఎక్కడ సర్దుబాటయ్యింది? లాభంలోనా లేకా యజమాని పెట్టిన పెట్టుబడిలోనా? ఒకవేళ పెట్టిన పెట్టుబడి కూడా రావటం లేదనుకుందాం. అప్పుడు ఆ యజమాని ఎంతకాలం నష్టంతో హోటల్ నడుపుతాడు. తక్కువ వనరులతో హోటల్ పెట్టిన యజమాని ముందుగా రంగం నుండి తప్పుకుంటాడు. దీన్నే మనకు ఆర్థిక శాస్త్రవేత్తలు సరఫరా (సప్లై), గిరాకీ (డిమాండ్) సూత్రం అని చెప్తారు. సరుకులు (వస్తువులు) ధరని మార్కెట్‌కు వదిలేయాలని వారు వాదిస్తారు. ఉదాహరణకు అంబానీ జియో ఫోన్ వినియోగదారులకు ఉచితంగా ఇస్తానని మొదలుపెట్టాడు. దాంతో ఇతర కంపెనీలు దుకాణం సర్దుకోవాల్సి వచ్చింది. సెల్ ఫోన్ వినియోగదారులు గుండగుత్తగా జియో సేవలకు ఫిరాయించారు. సరుకు యొక్క ధర మార్కెట్ నియమాలకు వదిలేయడం వలన వినియోగదారునకు నాణ్యమైన వస్తువులు/ సేవలు చవకగా అందుబాటులోకి వస్తాయని మార్కెట్ వాదులు అంటారు. అందుచేత ఒక కార్మికునికి ఇంతకు మించి తక్కువ వేతనం / కూలి ఇవ్వకూడదని, రైతుల పంటకు ఇంతకు మించి తక్కువకు ధర ఇవ్వకూడదనే వాదన ఈ మార్కెట్ సూత్రాన్ని దెబ్బ తీస్తుంది కనుక కనీస వేతనం, కనీస మద్దతు ధర అనే రెండు భావనలను వారు వ్యతిరేకిస్తారు. శ్రామిక మార్కెట్ సంస్కరణలు, వ్యవసాయ మార్కెట్ సంస్కరణలు అంటే వారి దృష్టిలో ధరల నిర్ణయం (అది శ్రామికుని శ్రమైనా-రైతు పండించిన పంటైనా) మార్కెట్ శక్తులే చేయాలి గాని ఒక చట్టం ద్వారా చేయకూడదన్నది వారి వాదన. అందుకే వారు ఎలాంటి చట్టబద్ధమైన నిర్ణయాన్ని, ఎలాంటి పర్యవేక్షణను అంగీకరించారు. అప్పటి కాంగ్రెస్ మన్మోహన్ సింగ్ ప్రభుత్వం, ఇప్పుడు సంఘ్ పరివార్ బిజెపీ మోడీ ప్రభుత్వం ఏదైనా సారాంశం ఇదే. ఒక్క మాటలో చెప్పాలంటే ”మార్కెట్‌లో మీ అంతట మీరు నిలబడగలగాలి లేదా మట్టికొట్టుకు పోవాలి” అంతే.
ఇక ఇప్పుడు మీరు వ్యవసాయానికి రండి. ఒక రైతు తన పొలంలో చేసే వ్యవసాయం, ఒక పెట్టుబడిదారు లేదా ఒక న్యాయవాది ఇచ్చే సేవ మూడూ ఒకటేనా? పైకి ఒకేలా కనిపిస్తాయి. తరచి చూస్తే మీకు తేడా తెలుస్తుంది. వ్యవసాయం మానవులందరికీ జీవనావసరమైన ఆహారాన్ని ఇస్తుంది. కోవిడ్ లాక్‌డౌన్ సమయంలో కర్మాగారాలు, కోర్టులు పని చేయలేదు. అలా అని మనుషులు ఆకలి చావులతో చచ్చిపోయారా? అదే తిండి లేకపోతే? వ్యవసాయం చేసి, ఇంతటి ముఖ్యమైన సరుకును పండించే రైతుకు లాభం సంగతి ప్రక్కన పెడదాం కనీసం తాను పెట్టిన పెట్టుబడయినా తిరిగి రావాలి కదా?! అలా రాకపోతే సమాజం/ప్రభుత్వం బాధ్యత వహించాలా వద్దా అన్నది మన ముందున్న ప్రశ్న.
మరొక ముఖ్యమైన విషయం ఉంది. రైతు చేసే వ్యవసాయం అది ఒక గదిలో లేదా షెడ్డులో చేసే ఉత్పత్తి కాదు కదా. అది ప్రకృతిలో భాగంగా జరుగుతుంది. ఒక కంపెనీ యజమాని తన ఉత్పత్తి ప్రక్రియ మీద నియంత్రణ కలిగి ఉంటాడు. కానీ రైతుకు అలాంటి నియంత్రణ ఉండదు. ”ఆకులో అన్నం, అంగట్లో సరుకు పడేవరకు ఆటంకాలెన్నో” అన్నట్లుగా పంట చేతికి వచ్చేవరకూ ఎలాంటి హామీ లేదు. అంటే ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి రైతు చేసే కార్యకలాపం మానవాళికి ప్రాణాధారమైనది. రెండు, ఆ ప్రక్రియ మొత్తం ప్రకృతిలో, ప్రకృతిపై ఆధారపడి, ముడిపడి జరిగేది కనుక దాన్ని సరఫరా (సప్లై) గిరాకి (డిమాండ్) అనే మార్కెట్ సూత్రానికి వదిలేయకూడదు. అందుకే కార్మికులు చేసే శ్రమకు కనీస వేతనం, రైతులు పండించే పంటకు కనీస ధర ఉండి తీరాలి. దానికి సమాజం / ప్రభుత్వం హామీపడి తీరాలి. అయితే ఈ భావనను అంగీకరించడానికి మార్కెట్ పండితులు సిద్ధంగా ఉండరు.
రైతు పండిస్తున్న ఉత్పత్తికి కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి) అనేది ఒకటి ఉండకూడదని, ధర నిర్ణయాన్ని మార్కెట్ శక్తులకు వదిలేయాలనే వారిని ప్రక్కన పెడితే, కనీస మద్దతు ధరను ఎలా లెక్కగట్టాలనే దానిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. పైన ప్రస్తావించిన స్వామినాధన్ కమీషన్ రూపొందించిన ఫార్ములాకు చాలా రైతు సంఘాలు అంగీకారం తెలిపాయి. దీన్నే సి2 అంటున్నారు. రైతుకయిన పెట్టుబడి, కుటుంబ సభ్యుల శ్రమ, దానితోపాటు భూమికి అద్దెను కూడా లెక్కలోకి తీసుకుని ఉత్పత్తికయిన ఖర్చును లెక్కగట్టి అలా వచ్చిన మొత్తానికి 50% కలిపి ”కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి)”గా లెక్కిస్తుంది. ఈ ఫార్ములా సులువుగా చెప్పాలంటే, ఇందాక నేను చెప్పిన అన్ని ఖర్చులు కలిపితే 100 రూపాయిలయ్యిందనుకుందాం. దానికి 50% కలిపితే అప్పుడు 150 రూపాయిలవుతుంది. అప్పుడు ఆ 150 రూపాయిలు కనీస మద్దతు ధర. 2014 ఎన్నికల ప్రణాళికలో స్వామినాథన్ కమీషన్ సిఫార్సులను అమలు చేస్తామని బిజెపి రాసుకుంది. అంతేకాదు, స్వామినాధన్ కమీషన్ సిఫార్సులను అమలు చేయని అప్పటి కాంగ్రెస్ సర్కారుపై ఒంటికాలి మీద లేచేవాడు మోడీ. తాను అధికార పీఠం ఎక్కాక, ”ఏరు దాటాక బోడి మల్లన్న” అన్నట్లుగా సుప్రీంకోర్టుకు ఇచ్చిన అఫిడవిట్‌లో ఈ ఫార్ములాను అమలు చేయడం సాధ్యం కాదని మోడీ సర్కార్ చెప్పింది. మరి కొద్ది రోజుల తరువాత అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి తాము ఈ ఫార్ములాను ఎప్పుడో అమలు చేసేశామని చెప్పడంతో అందరూ ముక్కున వేలేసుకున్నారు. ఇలాంటి దొంగ మాటలు చెబుతూ వస్తున్నందున నేడు ప్రభుత్వం మాటలు ఎవరూ నమ్మడం లేదు.
ప్రస్తుతం అమలవుతున్న కనీస మద్దతు ధరను లెక్కగట్టడంలో ఉన్న లోపాలను అలా ఉంచినా, ప్రభుత్వం ప్రకటిస్తున్న మద్దతు ధర రైతులందరికీ అందటం లేదు. ఒకటి, ప్రభుత్వం ప్రకటిస్తున్న మద్దతు ధర రైతుకైన ఖర్చుకంటే తక్కువగా ఉంది. రెండు, అది కూడా అందరికీ అందడం లేదు. పాఠకునికి ఇందులోని మతలబు అర్థం కావడానికి, విషయాన్ని కొద్దిగా సరళీకరిస్తాను. ధాన్యం పండించడానికి ఈ ఏడాది (2020-2021) ఒక క్వింటాకి 1902 రూపాయిలయినట్లు రాష్ట్ర ప్రభుత్వం లెక్కగట్టింది. కానీ కేంద్రంలోని కమిటీ వారు 1591 రూపాయిగా లెక్కగట్టి 1862 రూపాయిలుగా కనీస మద్దతు ధరను ప్రకటించారు. ఇంతకీ రాజ్యాంగం ప్రకారం ”వ్యవసాయం” రాష్ట్రాల పరిధిలోనిది.
ఇప్పుడు రైతుకయిన ఖర్చు (1902 రూపాయలు) సంగతి మర్చిపోదాం. ప్రభుత్వం చెప్పిన కనీస మద్దతు ధరనే (1862 రూపాయలు) రైతుకయిన ఖర్చుగా తీసుకుందాం. అయితే ఒక క్వింటాలు ధాన్యానికి ఆ 1862 రూపాయలకు ప్రైవేటు వ్యాపారులు కొనకపోతే రైతు ఏం చేయాలి? అలాంటప్పుడు రైతుకు ఆ కనీసం గిట్టుబాటు ధర ఎలా వస్తుందన్నది ప్రశ్న. కనీస మద్దతు ధరను ప్రభుత్వం ప్రకటించింది. ఆ ధరకు ప్రైవేటు వ్యాపారులు కొనడానికి సిద్ధంగా లేరు (అలా అనుకుందాం). అప్పుడు రైతులు ఏం చేయాలి? ప్రభుత్వం ఏం చేయాలి? రైతులు ఈ కనీస మద్దతు ధర సంగతి వదిలేసి వచ్చినకాడికి (అంటే పైవేటు వ్యాపారి ఇచ్చిన ధరకు) అమ్ముకోవాలి లేదా ప్రభుత్వమైనా కొనాలి. ఇప్పుడు ఈ రెండూ జరుగుతున్నాయి. ప్రైవేటు వ్యాపారులు మద్దతు ధరకు కొనటం లేదు. ప్రభుత్వం మద్దతు ధరకు కొంటున్నది కానీ అందులో సమస్యలు ఉన్నాయి. 1. మార్కెట్‌లోకి వచ్చే పంటలో కేవలం 6 శాతం మాత్రమే ప్రభుత్వం కొంటోంది. అంటే 94 శాతం ప్రైవేటు వ్యాపారులకే అమ్మకం జరుగుతోంది. అంటే రైతులు ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర కంటే తక్కువకే వ్యాపారులకు అమ్ముకోవలసి వస్తోంది. ఈ ప్రభుత్వ కొనుగోలులో కూడా కొన్ని సమస్యలు లేకపోలేదు. ప్రభుత్వం కొనుగోలు కేవలం వరి, గోధుమ పంటలకే పరిమితమయింది. అంటే మిగిలిన పంటలకు ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించినా అది కాగితం మీద తప్ప రైతులకు అందుబాటులోకి రాదు. ఇక ప్రభుత్వం కొంటున్న వరి, గోధుమలలో కూడా ఒక సీజన్‌లో రైతులు పండించిన మొత్తం పంటను కొనుగోలు చేయడం లేదు. అంటే వరి, గోధుమ రైతులందరూ కనీస మద్దతు ధర వలన లబ్ది పొందటం లేదు. ఏతావాతా చెప్పేది ఏమిటంటే ప్రతి ఏడాది ప్రభుత్వం ప్రకటించే కనీస మద్దతు ధర వలన రైతులందరికీ జరిగిన మేలంటూ ఏమీ లేదు.
అలాంటప్పుడు, తమకు ఏనాడూ పెద్దగా మేలు చేయని ఈ కనీస మద్దతు ధర గురించి రైతులెందుకు ఆందోళన చేస్తున్నారు? తమకు సరయిన సౌకర్యాలు గానీ, ధరను గానీ ఇప్పించని ప్రభుత్వ మార్కెట్ యార్డులను (క్రమంగా) రద్దు చేసే కేంద్ర చట్టాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఇవి చాలా మంది అడుగుతున్న ప్రశ్నలు. రైతులేమీ పిచ్చివాళ్ళు కాదు. ఈ ప్రశ్నలకు వారి వద్ద జవాబులు ఉన్నాయి. వాటిలోకి వెళ్ళేముందు కనీస మద్దతు ధరకు ప్రభుత్వం కేవలం వరి, గోధుమలు మాత్రమే కొంటున్నదని, అందులోను మొత్తం పంటలో కొనుగోలు కేవలం 6 శాతమే ఉందని ముందు చెప్పాను. ఇందులో మరో కోణం ఉంది. అదేమిటో ముందుగా తెలుసుకుందాం.
పచ్చ విప్లవం (గ్రీన్ రివల్యూషన్)లో భాగంగా వరి, గోధుమ సాంద్ర వ్యవసాయం మొదలై విస్తరించింది. ముందుగా ఉమ్మడి పంజాబ్ (నేడు హర్యానా, పంజాబ్), ఉత్తరప్రదేశ్‌లోని కొంత ప్రాంతంలో అక్కడ పండుతున్న పంటలను కొనుగోలు చేసి చౌక ధరలకు పేద వర్గాలకు పంపిణీ చేయడం, రైతుకు ప్రోత్సాహం కల్పించడం కోసం ప్రభుత్వం ”కనీస మద్దతు ధర”తో రంగంలోకి దిగింది. క్రమంగా అక్కడ ప్రభుత్వ పర్యవేక్షణలో ఉండే మార్కెట్ యార్డుల వ్యవస్థ బలపడి, విస్తరించింది. ఈలోగా నెమ్మదిగా మిగిలిన రాష్ట్రాలకు కూడా వరి పంట విస్తరించింది. కానీ ప్రభుత్వ కొనుగోలు మాత్రం అక్కడికి విస్తరించలేదు. ఉదాహరణకు 2018-2019 ఖరీఫ్‌లో పంజాబ్ రాష్ట్రంలో పండిన వరి పంటలో 89 శాతాన్ని ప్రభుత్వం కనీస మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేసింది. అదే ప్రధానంగా వరి పండించే పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్‌లలో పండిన పంటలలో 20.89% పంటను మాత్రమే కనీస మద్దతు ధరతో ప్రభుత్వం కొనుగోలు చేసింది. ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న వరి, గోధుమలలో సింహ భాగం పంజాబ్, హర్యానాలలో ఉంది. దీని నుండి మనకు మూడు సంగతులు తెలుస్తున్నాయి. 1. ప్రభుత్వం కనీస మద్దతు ధర ఎన్ని పంటలకు ప్రకటించినా, ఆచరణలో అది వరి, గోధుమలను పండించే రైతులకు, అది కూడా ఎంతో కొంత ఉపశమనం కలిగిస్తున్నది. 2. మిగిలిన పంటలకు కనీస మద్దతు ధర ఉన్నా దాని వలన రైతులకు మేలు ఏమీ లేదు. అది ‘నామ్‌కే వాస్తే’. 3. ప్రభుత్వం కొనుగోలు చేయడం వలన ఆ వరి, గోధుమల కనీస మద్దతు ధరను కూడా రెండు రాష్ట్రాల రైతులు మాత్రమే పొందగలుగుతున్నారు. సరే! ఇలా కనీస మద్దతు ధరతో కొనుగోలు చేసిన వరి, గోధుమలను ప్రభుత్వం ఏం చేస్తుంది. అది (ఎఫ్‌సిఐ) గిడ్డంగులలో దాచిపెడుతోంది. రేషన్ దుకాణాల ద్వారా సబ్సిడీ ధరలకు పంపిణీ చేసినా ఇంకా టన్నుల ఆహార పదార్థాలు గోదాముల్లో ఉన్నాయి. ఒక నివేదిక ప్రకారం 16 ఏళ్ళ క్రితం కొన్నవి కూడా గోదాములలో మూల్గుతున్నాయి. అదే సమయంలో ఆకలి (హంగర్), పౌష్టికాహార లేమి (మాల్ న్యూట్రిషన్) సూచికలలో మన దేశం స్థానం అంతకంతకూ దిగజారుతోంది.
ఒకవైపు ”కనీస మద్దతు ధర”ను చట్టబద్ధమైన హక్కుగా గుర్తించమని రైతు సంఘాలు కోరుతూ వస్తున్నాయి. ప్రభుత్వం దశల వారీగా దీనినుండి బయటపడాలని చూస్తోంది. రైతును మార్కెట్ నియమాలకు వదిలివేయడానికి సిద్ధమయింది. కనీస మద్దతు ధరకు ప్రభుత్వం కొనదు, ప్రైవేటు వారు కొని తీరాలని చెప్పదు. మోడీ సర్కార్ తెచ్చిన మూడు చట్టాలలో మూడవది నిత్యావసర వస్తువుల చట్టానికి తెచ్చిన సవరణ. ఇక ఇప్పుడు ఎవరైనా, ఎంతైనా ప్రజల దైనందిన ఆహార సరుకులను కొని నిల్వ చేసుకోవచ్చు. దాని మంచి చెడ్డలను మరోసారి చర్చించుకుందాం.