ప్రకృతి బిడ్డలు -రమాదేవి చేలూరు

పచ్చగా, దట్టంగా, నిండుగా, ఏపుగా అడవి అల్లిబిల్లిగా ఉంది. అడవికావల ఏరు యదేచ్ఛగా తేటగా వయ్యారంగా పారుతూ ఉంది. ఏటిగట్టున ఊరుంది. ఊరు ఒద్దికగా, ముద్దుగా, చిక్కుడు పందిరి ప్పుకున్న గుడిసెల్లో నవవధువులా ముచ్చటగా ఉంది. ఊరు చుట్టూ మైదానంలో పోడు వ్యవసాయ భూములున్నాయి. జొన్న, మొక్కజొన్న, ఉలవలు, సామలు పండుతాయి. అది ఆదివాసీల గూడెం.

అరుణ వర్ణాన్ని అలుముకున్న సూర్యుడు కొండల్ని ఎగబాకి వడివడిగా ఎదిగి ఊర్లోకి తొంగిచూస్తున్నాడు. చిక్కుళ్ళ కూరా, జొన్న రొట్టెలతో పొగలు గక్కుతూ ఘుమఘుమలాడుతోంది ఊదరు.

పిల్లోళ్ళు నలుగురూ చెట్టాపట్టాలేసుకున్నారు. చెప్పుల్లేని కాళ్ళు, ఒళ్ళంతా దుమ్మూ, ధూళి, బట్టలన్నీ చిరుగులూ, మురికీ. కానీ, వాళ్ళ హృదయాలు తృప్తి, ఆనందంతో నిండి ఉన్నాయి. అందరూ స్నేహంగా, ఐకమత్యంతో ఒకరి కోసం ఒకరుగా, ధైర్యంగా దుమ్ము లేపుతూ మైదానం వైపు పోతున్నారు. ఎండంటే లెక్కలేదు. పాములు బుస్సుమన్నా, ఎలుగుబంటి కస్సుమన్నా బెదిరేది లేదు. వాళ్ళు స్నేహితులు. ఏ కోరికలూ లేని ధీరులు. అనంత ప్రకృతికి వారసులు. మన దృష్టిలో వాళ్ళు నిరుపేదలు. కానీ, వాళ్ళు ఆ మాటను ఒప్పుకోరు. ‘చేతినిండా పనుంది. ఆడుతాం, పాడుతాం, తింటాం, తిరుగుతాం. అడవి మాకు అండాదండా’ ఇంకేం గావల్ల అనంటారు. అయితే వాళ్ళు పేదోళ్ళు కాదు మరి. అడవి వాళ్ళ సంపద. తలుపుల్లేని ఆహారపు బ్యాంకు. అది అందరిదీ. కార్డ్స్‌, పిన్‌కోడ్‌లు అవసరం లేదు. దాన్ని కొట్టి నాశనం చెయ్యరు, కొల్లగొట్టి దాచరు. ఎవరి పొలంలో పనుంటే, అక్కడ అందరూ కలిసి ఆ పని చేసేసి, మరుసటి రోజు ఇంకొకరి పొలంలోకి పనికి పోతారు. ఎప్పుడూ ఎవరి దగ్గరా కూలి తీసుకోరు. అంతా సహకార పద్ధతిలో. ఆ పిల్లలు ఆడుతూ, పాడుతూ పనిచేస్తారు. ఒకరి కోసం అందరూ, అందరి కోసం అందరూ.

వాళ్ళు జొన్న, మొక్కజొన్న పొలాల్లో కంకులేరి, కుప్పపోసి, గింజల్ని రాల్చి ఇళ్ళకు చేర్చారు. అందరి ధాన్యం ఇళ్ళకు చేరింది. సొప్ప తెచ్చి ఇండ్ల కాడి పశువులకు వాముల్లో కుప్పలేశారు. పొలాల్లో పనులన్నీ ముగిశాయి. ఎప్పుడూ ఏ ఒక్క రోజూ వాళ్ళు ఖాళీగా పనిలేక కూర్చోరు, జ్వరాలొస్తే తప్ప. ఒకరోజు దగ్గర్లో ఉన్న అడవిలో విప్పపూలేరడానికని అందరూ చెట్టాపట్టాలేసుకుని ఝాంఝామ్మంటూ బయలుదేరారు. విప్పమాన్లు పెద్ద వృక్షాలు. చుట్టూ పూత రాలుంటుంది. గూడెంలో ఆడా మగా అందరూ విప్పపూతను కాంచి, విప్ప సారాయి తయారు చేసుకుని తాగుతారు. కొంత పూతను సంతల్లో అమ్మి కావాల్సినవి కొంటారు, వస్తు మార్పిడి పద్ధతిలో.

ఆ రోజు పిల్లలకి విప్పపూత ఏరే పని. వాళ్ళడవికి చేరారు. ఆడుతూ, పాడుతూ పూతల్ని కుప్పపోశారు. పిట్టలు కువకువలాడు తున్నాయి. వడ్రంగి పిట్టలు చెట్లబెరడును తొలుస్తున్నాయి. మృదంగాల్ని సవరిస్తున్నట్లు, నెమళ్ళు ప్రియులను పిలుస్తున్నాయి. కరి మబ్బుల సందడి చూసి పాలపిట్టలు అదే పనిగా కూస్తున్నాయెందుకో. చల్లగా, హాయిగా, ఆహ్లాదంగా ఉందా హరితవనం. థింసా పాటల్ని, గూడెంలో పాడే పాటల్ని పిల్లలు విప్పపూలు ఏరుతూ మైమరచి పాడితే, చిరుగాలి రాగరంజితమైంది. ఆ గానలాలిత్యానికి అడవితల్లి మురిసిపోయింది. పిల్లోల్లు అడవిలో దొరికిన కాయకసుర్లు కోసి నమిలారు. ఊసుపోక చెట్లెక్కి దిగారు. ఏరిన పూలన్నీ మూట గట్టారు. ఇక ఇళ్ళకు పోవల్ల.

అలసి పొలసి పడమటి అరుగుమీద కూలబడ్డాడు సూర్యుడు. వాలుతోన్న పొద్దులో సంధ్య ముద్దుగా పరికిణీ వేసుకున్న పడతిలాగుంది. పిల్లలకి ఇంటి దారి గుర్తొచ్చి మూటల్ని భుజానేసుకున్నారు. అంతలో ఒక పిల్లాడు గావుకేకలు వేశాడు. అందరూ ఉలిక్కిపడి కుతూహలంగా వానివైపు చూశారు. అందరికంటే చిన్నోడు వాడు. దూరంగా వేలు చూపిస్తూ భయంతో వణికిపోతున్నాడు. అక్కడ హైనా ఉంది. అందరూ చూశారు. ఏ మాత్రం భయం లేక అందరూ వెంటనే అక్కడున్న పొడుగాటి కర్రలు చేతికి తీసుకున్నారు. అందరూ ఒక చోట చేరి, కర్రల్ని తిప్పుతూ దాన్ని భయపెట్టారు. అది జంకలేదు. కదల్లేదు. కేకలేసి భయపెట్టారు. కానీ అది భయపళ్ళేదు, వెనుకడుగు వెయ్యలేదు. వాళ్ళల్లో పెద్దవాడు అందరికీ ధైర్యం చెబుతున్నాడు. భయం లేదు, కర్రల్ని తిప్పండి. కేకలు వేస్తూ ముందుకు నడవండి. అడవి అంచులో ఉన్నాము, భయం లేదని చెబుతున్నాడు. అందరూ ధైర్యంగానే ముందడుగు వేస్తున్నారు. భుజాన మూటలు, చేతిలో కర్రలు. అది వీళ్ళను వెనుకనుంచి అనుసరిస్తోంది. రాళ్ళు రువ్వారు. వెనక్కు తగ్గి మళ్లీ వెంటపడుతోంది. చీకటి కమ్ముకొచ్చే తరుణమైంది. ఒక మర్రిమాను కనబడింది. ఈ చెట్టెక్కితే రక్షణగా ఉంటుందని తలపోశాడు పెద్ద పిల్లాడు. చెట్టెక్కి రాత్రంతా చెట్టుమీదనే ఉండాలి తప్పదనుకున్నాడు. లేదంటే దాన్ని రాళ్ళతో, కర్రలతో భయపెడుతూ పరిగెత్తాలనుకున్నాడు. ఎటూ తేల్చేలోపు మిన్ను విరిగి నెత్తిన పడ్డట్టు, వాళ్ళ ముందు నుంచీ మరొక హైనా వస్తోంది. అంతే… వాళ్ళు మూటల్ని కిందికేశారు. హైనాలతో తలపడేందుకు సిద్ధపడ్డారు.

మనిషికి ఒక్కోసారి చీకటి కూడా శత్రువవుతుంది. జంతువుకు చీకటి బలాన్నిస్తుంది. వాళ్ళకు ముందు నుయ్యి వెనుక గొయ్యిలాగుంది. తప్పదు చెట్టెక్కుదామనుకుని చెట్టెక్కేశారు. కర్రల్ని పట్టుకుని, చెట్టు కొమ్మను గట్టిగా పట్టుకొని ధైర్యంగా ఉన్నారు. హైనాలు చెట్టు కిందకు చేరాయి. అయినా వాళ్ళు ధైర్యం వీడలేదు. భయం వద్దనీ, నిద్ర పోవద్దనీ, కొమ్మ పట్టును గట్టిగా పట్టుకోవాలనీ ఒకరికొకరు సలహాలు, సూచనలు చేసుకున్నారు. క్షణాలు, నిమిషాల్లోకి మారిపోతున్నాయి. పిల్లల్లో భయం లేదు. వాటితో పోరాటానికే సిద్ధమయ్యారు. కొమ్మల్ని గట్టిగా కరచుకుని ఉన్నారు. అవి అసహ్యంగా, భయంకరంగా అరుస్తూ చెట్టు చుట్టూ తిరుగుతున్నాయి. వాన మొదలైంది. చీకటి కమ్ముకొచ్చింది. నక్కలు ఈలలేసి విసిగిస్తున్నాయి. కీచురాళ్ళ రొద మొదలైంది. అడవే ఆలంబనగా బతికినోల్లకు అవి లెక్క కాదు.

వాళ్ళు చెట్టెక్కి గంట దాటిపోయింది. కొమ్మల్ని ఉడుముల్లా కరచుకున్నారు. వాన ఆగింది. జంతువులు చెట్టు చుట్టూ తిరుగుతూనే

ఉన్నాయి. క్రూర జంతువులకు, చీకటికి, ఎండావానకు, ఆకలి దప్పులకు దేనికీ వెరవని వాళ్ళు ప్రకృతి సమానులు. సహజ జీవనం వాళ్ళ విధానం. భయమంటే ఏమిటో తెలీదు. పోరాటమే వాళ్ళకలవడిన జీవనరీతి.

పొద్దు వాలుతోంది. అప్పటికే ఆలస్యమైంది. ఎప్పుడో ఊరు చేరాల్సింది. గూడెంలో వాళ్ళు కూడా ఈ పిల్లోళ్ళు రాలేదని ఎదురు చూస్తున్నారు. నిద్రొచ్చి చెట్టుమీద నుంచీ జారి కిందపడకుండా పాటలు పాడుకున్నారు, కథలు చెప్పుకున్నారు. ఆకలి లెక్కలేదు. దూరాన మిణుకు మిణుకు వెలుతురు కనపడసాగింది పిల్లలకు. అది మరింత దగ్గరైంది. పిల్లల్లో ఏదో ఆశ, ఆనందంతో కేరింతలు కొట్టారు. ఊరి జనం వస్తున్నట్లు తెలుసుకున్నారు. పిల్లల్ని వెతుకుతూ వస్తున్నారు. కొమ్మల్ని గట్టిగా పట్టుకొని తలలు రిక్కించి చూశారు. దివిటీ వెలుగు దగ్గరైంది. ఓయ్‌…ఓహోయ్‌… అనే కేకలు వేశారు. దానికి బదులుగా పిల్లలు కూడా ఓయ్‌… ఓహోఓహో… అని జవాబులిస్తూనే ఉన్నారు. జనం ఆగి, నిశ్శబ్దంగా నిలబడి పిల్లల కేకల్ని విన్నారు. పిల్లల ఆచూకీ తెలిసి ఇక నడక వేగం పెంచి, పిల్లలున్న చెట్టు దగ్గరికొచ్చి, దివిటీ వెలుగులో పిల్లల ముఖారవిందాల్ని చూసి మురిసిపోయారు. చెట్టు మీద నుంచి పిల్లలు వాళ్ళ తండ్రుల భుజాలమీదికి దూకేశారు. దివిటీ జ్వాలల్లో మనుషుల గుంపును చూసి హైనాలు ఎప్పుడో తోకముడిచి దౌడు తీశాయి.

బారెడు పొద్దును చూస్తూ ఇళ్ళు చేరల్ల, పొద్దు మునిగేదాకా అడవిలో ఉండకూడదని పెద్దోళ్ళు పిల్ల్లోల్లకి చెబుతూ వడివడిగా ఊరు దావ నడుస్తున్నారు.

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.