గమనమే గమ్యం – ఓల్గా

రాజమండ్రికి ఎక్కడెక్కడి నుంచో పెద్దలు వస్తున్నారు. పంతులు గారిని పరామర్శిస్తున్నారు. అందరికీ రాజ్యలక్ష్మి అంటే గౌరవం. అందరూ ఆమె చేతి అన్నం తిన్నవారే.

ఆమె కొన్ని బీజాలను నాటింది. అవి తన తోటలోనే నాటలేదు. దేశమంతా నాటింది. దేశంలో ఎక్కడైనా మొలకెత్తగల చేవగల విత్తనాలవి.

ఆ ఇంటికి జనం తెంపు లేకుండా వస్తున్నారు. కన్నీరు కారుస్తున్నారు. ”తనకు ఇంతమంది ఆప్తులున్నారని రాజ్యలక్ష్మమ్మకు తెలుసా?”

ఏమో! జీవితమంతా తన భావాల కోసం సంఘంతో యుద్ధం చేసిన మనిషి. తను చనిపోయాక సంఘం తనని ఇంత దగ్గరగా తీసుకుంటుందని ఆమె ఊహించి ఉండదేమో.

ఆ సమయంలోనే ఆ వీథి చివర ఎవరికీ కనపడకుండా ఒక మూలన ఒక యువకుడు విపరీతంగా ఏడుస్తున్నాడు.

”నా పేణం నిలబెట్టావు నీకో దణ్ణం కూడా పెట్టుకోలేనమ్మా”

అంటూ ఏడుస్తున్న ఆ యువకుడు మాలవాడు. అతనొక రోజు ఆ వీథిలో నడుస్తూ పడిపోయాడు. ఎండాకాలం, విపరీతమైన దాహం. ఊళ్ళో ఎవరూ మంచినీళ్ళు పొయ్యరు. అడగాలని కూడా అతనికి అనిపించలేదు. వాళ్ళు చీదరించుకుంటూ ఇంతెత్తు నుంచి మంచినీళ్ళు పోస్తే తాగాలని అతనికి ఇష్టంగా లేదు. ఎట్లాగైనా వెళ్ళి మాలపల్లిలో పడితే బతికిపోతాను అనుకుంటున్నాడు.

రాజ్యలక్ష్మమ్మ ఇంటి దగ్గరకొచ్చేసరికి కళ్ళు తిరిగాయి. ఉన్నవాడు ఉన్నట్లు పడిపోయాడు. తర్వాత మెలకువ వచ్చేసరికి తను పెద్ద ఇంటి లోగిట్లో నీడ పట్టున ఉన్నాడు. రాజ్యలక్ష్మమ్మ కొద్ది కొద్దిగా నీళ్ళను అతని నోట్లో పోస్తోంది.

అతను లేవటానికి ప్రయత్నించాడు. ఆమె దయగా వారించింది.

”లేవొద్దు నాయనా. ఈ నీళ్ళు తాగి కాసేపు పడుకో. మజ్జిగ అన్నం తెస్తాను. తింటే ఓపికొస్తుంది. అప్పుడు వెళ్దువు గాని” అన్నదామె.

అతని తల తిరిగిపోయింది. ఆ పెద్దావిడ తనను తాకింది. మైలపడింది. ఇదంతా ఊరికే పోతుందా, తనను చంపేస్తారేమో.

భయపడుతున్న అతని భయం పోగొట్టి అన్నం పెట్టి పంపించింది.

తను మైల పడ్డానని గానీ, స్నానం చెయ్యాలని గానీ ఒక్క మాట అనలేదు. అతను అనబోతే అననివ్వలేదు.

”ఈశ్వరుడు ఒక్కడే. ఆ ఈశ్వరుడు అందరిలో ఉన్నాడు. మనందరం ఒక్కటే. నువ్వు భయపడకుండా ఇంటికి వెళ్ళు నాయనా” అంది.

ఇంటికి వెళ్ళే దోవ పొడుగునా అతను ఏడుస్తూనే ఉన్నాడు.

వారం రోజుల తర్వాత రాజ్యలక్ష్మమ్మ తెల్లవారుఝామున లేచి వాకిలి తెరిచేసరికి వాకిలి ముందు పాతిక పైగా కలువ పూలను ఎవరో అందంగా అమర్చి వెళ్ళారు. రాజ్యలక్ష్మమ్మ ఆనందంతో, ఆశ్చర్యంతో పంతులు గారిని పిల్చి చూపింది.

ఎవరో మనకు కృతజ్ఞతలు చెప్పి వెళ్ళారు అన్నారాయన.

ఇద్దరి మనసులూ ఆ ఉదయాన వీస్తున్న చల్లగాలిలా తేలిపోయాయి. దూరంగా నిలబడి వీరిని చూసి ఆనందించే అతన్ని వీళ్ళు చూడలేదు. ఆ కలువ పూలతో కృతజ్ఞతలు తెలుపుకుంది ఆనాటి మాల యువకుడని రాజ్యలక్ష్మమ్మకు తెలియదు. ఇవాళ ఆ యువకుడు ఆమె పాదాల మీద కలువ పూలు ఉంచి ఒక్క దండం పెట్టుకోవాలని ఏడుస్తున్నాడు. ఆ పని చేసే ధైర్యం అతనికి లేదు.

గంటసేపట్లా ఏడ్చి ఏడ్చి వెళ్ళిపోయాడు.

రామారావు రాజమహేంద్రవరం చేరి వీరేశలింగం గారిని చూసేసరికి నోట మాట రాలేదు. చాలాసేపు మౌనంగా కూర్చుని ”ఆధునిక స్త్రీ గురించి కలలు కన్న కళ్ళు మూతబడిపోయాయి. ఆ కలలు నిజం చేసే పిల్లలు పుట్టి పెరుగుతున్నారు. వాళ్ళందరిలో మనం రాజ్యలక్ష్మమ్మను చూసుకోవాలి” అన్నాడు రామారావు. రాజ్యలక్ష్మి కలలు ఎవరికైనా తెలుసా? పంతులు గారికీ, చనిపోయిన శారదాంబకు తెలుసా కలలు. శారదాంబ, రాజ్యలక్ష్మి ఒకటే కలలు కన్నారు. నిజానికి రాజ్యలక్ష్మి కలలు శారదాంబకే బాగా తెలుసు. రాజ్యలక్ష్మి పంతులు గారితో వాస్తవ జీవితాన్ని పంచుకున్నంతగా స్వప్న జీవితాన్ని పంచుకోలేదు. పంతులుగారి కాలాన్ని వృధా చేయగూడదనే ఉద్దేశంతో ఆమె తన కలలను శారదాంబతోనే ఎక్కువగా పంచుకుంది. ఆ శారదాంబ ఈమెకంటే ముందే మరణించింది. ఆధునిక స్త్రీల గురించి వారి కలలకు సాక్షులెవరూ లేరు.

పంతులు గారు అతి ప్రయత్నం మీద దుఃఖాన్ని నిగ్రహించుకుని ”నేను జీవచ్ఛవాన్ని” అన్నారు.

”అంత మాట అనకండి” అన్నాడు రామారావు.

”అది నా దుఃఖం ముందు చిన్నమాట రామారావ్‌. రాజ్యలక్ష్మి మరణంతో నేను ప్రతి క్షణమూ నరకయాతన అనుభవిస్తున్నాను. ఇంక నేను ఏమీ చెయ్యలేననిపిస్తోంది” ఈ సారి దుఃఖం నిగ్రహించుకోవడం ఆయన వల్ల కాలేదు.

అది చూసి రామారావు కళ్ళవెంట నీళ్ళొచ్చాయి.

”మీరు ధైర్యం తెచ్చుకోవాలి. మాబోటి వాళ్ళకు ధైర్యం చెప్పాలి” అన్నాడాయన కన్నీళ్ళు తుడుచుకుంటూ.

”నాకు ధైర్యం ఎక్కడినుంచి వస్తుందయ్యా. నా ధైర్యమంతా రాజ్యలక్ష్మే కదా. ఆమె లేనిది నేనేమీ చెయ్యలేను. నేను మొదట నాలుగడుగులు నడిచానేమో, నేను పడిపోకుండా ఈ దారంతా నా చెయ్యి పట్టుకుని నడిపించింది రాజ్యలక్ష్మే. ఈ ఇల్లూ, తోటలూ, శరణాలయం, పాఠశాల… ఇవన్నీ ఆమె లేకుండా ఎట్లా నడుస్తాయో అర్థం కావటం లేదు”.

ఆ ప్రశ్నకు సమాధానం కాలం తప్ప ఎవరు చెప్పగలరు?

… … …

కృష్ణానదీ తీరంలో ఉన్న పెద్ద గ్రామంలో స్థితిమంతుల కుటుంబం రామారావుది. నాలుగైదొందల ఇళ్ళున్న ఆ గ్రామంలో మాగాణి భూములు బంగారం పండుతాయి. అన్ని వసతులూ ఉన్న గ్రామం. బ్రాహ్మణ కుటుంబాలు ముప్ఫై, నలభై మధ్యలో ఉన్నాయి. మిగిలినవి రైతు కుటుంబాలు, చేతి వృత్తుల వారి కుటుంబాలు. ఊరి చివర ఓ వంద గుడిశల మాలపల్లి ఉంది. మంచి బడి, పెద్ద గుడి ఉన్న గ్రామం. బెజవాడకు దగ్గరగా ఉండడంతో పట్టణ పోకడలను తొందరగా అందిపుచ్చుకునే అవకాశం ఉన్న గ్రామం. రామారావు తండ్రి చిన్నప్పుడే చనిపోయాడు. తల్లి అన్ని బాధ్యతలూ మోసి పెంచింది. అక్క శారదాంబ తమ్ముడిని అమితంగా ప్రేమించేది. పెళ్ళయి తను పట్నంలో కాపురం పెడుతూ తనతో పాటు తమ్ముడినీ తీసుకెళ్ళి కాలేజీ చదువు వరకూ తనే బాధ్యత తీసుకుంది. తమ్ముడి పెళ్ళి చేసిన రెండేళ్ళకే ఆమె మరణించింది. రామారావు అక్క మరణం నుంచి కోలుకోవటానికే రెండేళ్ళు పట్టింది. చిన్న శారదాంబ పుట్టిన తర్వాత ఆయన మళ్ళీ మనిషై తనకు ఆసక్తి ఉన్న సాహిత్యం, చరిత్ర విషయాల మీద పని చేస్తున్నాడు.

నెలకు పది రోజులకు పైగా రామారావు మద్రాసు, విశాఖపట్నం, గుంటూరు, బెజవాడలు వెళ్ళడం ఇంట్లో వాళ్ళకి అలవాటే. ఇంటి పనులూ, పొలం పనులూ అన్నీ తల్లి నరసమ్మే చూసుకుంటుంది. ఆవిడ చాలా సమర్ధురాలు. ఇల్లూ, పొలం రెండూ ఆవిడ ఆదేశాల ప్రకారమే నడుస్తాయి. అన్ని పనులూ ఆవిడ మీద ఒదిలేసి రామారావు తన శాస్త్ర, సాహిత్య విషయాల్లో మునిగిపోయే వీలుంది కాబట్టి ఎవరికీ ఏ ఇబ్బందీ లేకుండా గడిచిపోతోంది. శారదాంబ పెంపకం, ఇంటిపని, వంటపని రామారావు భార్య సుబ్బమ్మ అతి తేలికగా చేసేస్తుంది. పాతికెకరాల సేద్యం, మామిడి తోటలున్నాయి. ఆర్థికంగా లోటు లేకపోవడంతో ఆయన జీవితం గురించి ఆలోచించే అవసరం లేకుండా ఇతర విషయాల మీద శ్రద్ధ పెట్టగలుగుతున్నాడు. పండితులతో స్నేహం, చర్చలు, సంఘం గురించి ఆలోచనలు, సామాన్య జనం గురించి, వారికి విద్య, సాహిత్య, శాస్త్ర విషయాలు అందుబాటులోకి తేవడం గురించి ఆయనకు ఆసక్తి ఎక్కువ. ఆ పని ఏ ఆటంకమూ లేకుండా చేసుకోవడానికి పెద్ద అండగా తల్లి నరసమ్మ ఉంది.

శారదాంబ అంటే ఇంట్లో అందరికీ ప్రాణం. నరసమ్మ, సుబ్బమ్మలు ఆమెను కింద నడవనివ్వరు. చనిపోయిన కూతురు మళ్ళీ పుట్టిందని నరసమ్మ నమ్మకం. కంటిపాపలా చూసుకుంటుంది. మనవడు సూర్యారావుని ఒళ్ళో బుజ్జగిస్తూనే, శారదాంబను గుండెలకు హత్తుకుంటుంది. సూర్యారావు శారద వెంట వెంటే బుడిబుడి నడకలతో నడుస్తుంటాడు. ఆ ఊళ్ళో ఉన్న బడిలో ఎనిమిదో తరగతి వరకూ చదువు చెప్తారు. శారదాంబను ఆ బడికి పంపడానికి రామారావు తల్లితో చిన్నపాటి యుద్ధమే చేయాల్సి వచ్చింది. ఇంట్లోనే చదువు చెప్పించమని తల్లి, బైటి బడికి వెళ్ళి నలుగురితో పాటు చదువుకోవాలని రామారావు, చివరికి శారద బడికి వెళ్తానని పట్టుబట్టడంతో నాయనమ్మ లొంగిరాక తప్పలేదు. బడికి వెళ్ళేనాటికే శారదాంబకు రాయటం, చదవటం బాగా వచ్చు. ఏడో ఏట మూడో తరగతిలో చేరింది శారదాంబ. ఆ రోజు బడంతా పండగ వాతావరణం. పిల్లలకు లడ్లు, బూందీ పంచి పెట్టారు. శారదాంబ తరగతిలో అంతకుముందే ఇద్దరాడపిల్లలు ఉన్నారు. విశాలాక్షి, ధనలక్ష్మి. విశాలాక్షి దేవదాసి కుటుంబం నుంచి వచ్చింది. ధనలక్ష్మి వాళ్ళు బ్రాహ్మణులు. తండ్రి పౌరోహిత్యం చేస్తాడు. పెద్ద కుటుంబం. ఇంట్లో ఏటా పిల్లలు. ఊళ్ళో పెరిగే అప్పులు. కుటుంబాన్ని భారంగా లాగుతున్నాడు. శారదాంబ చేరిన నాలుగు రోజులకు అన్నపూర్ణ అనే రైతు కుటుంబపు అమ్మాయి చేరింది. నలుగురమ్మాయిలకూ మంచి స్నేహం కుదిరింది. రోజూ కలిసి బడికి రావటం, పోవటం మొదలైంది. విశాలాక్షి బ్రాహ్మణ వీథికొస్తే ధనలక్ష్మి కలుస్తుంది. ఇద్దరూ కలిసి శారదాంబ ఇంటికి చేరేసరికి ఆ పాప వీథి వాకిట్లో వీళ్ళ కోసం ఎదురు చూస్తుంటుంది. ముగ్గురూ కలిసి తూర్పు వీథిలోకి వెళ్తే అన్నపూర్ణ ఎదురొస్తుంది. నలుగురూ కలిసి బడికి వెళ్తుంటే దారిలో ఇళ్ళవాళ్ళంతా విడ్డూరంగా చూసేవారు. చదువు కోసం ఆడపిల్లలు బడికి వెళ్ళడం ఆ ఊళ్ళో అదే మొదలు. శారదాంబ తండ్రి రామారావుకి ఇంగ్లీషు చదువుల పిచ్చి ఉందని తెలుసు. పైగా వాళ్ళు స్థితిమంతులు. ఏం చేసినా చెల్లిపోతుంది. విశాలాక్షి గురించి ఎవరికీ పట్టింపు లేదు. ధనలక్ష్మి బడికి పోవటం ఊళ్ళో బ్రాహ్మణులెవ్వరికీ ఇష్టం లేదు. మూతులు విరుచుకుంటూ, ధనలక్ష్మి తల్లిని సూటిపోటి మాటలంటూ అక్కసు తీర్చుకునేవారు. అన్నపూర్ణ గురించి గొణుక్కునేవారు. నలుగురాడపిల్లలూ బడికి వెళ్ళి హెడ్‌మాస్టారు గదిలో కూర్చుంటారు. గంట కొట్టిన తర్వాత, మగపిల్లలందరూ క్లాసులో కూర్చున్న తర్వాత తమ క్లాసు టీచరు వెనకాల నడుచుకుంటూ క్లాసులోకి వెళ్ళి ఒక పక్కన కూర్చుంటారు. మగపిల్లలకీ, వీళ్ళకీ మధ్య చాలా దూరం. పాఠాలు జాగ్రత్తగా విని పంతులుగారి వెనకాలే హెడ్‌మాస్టారు గారి గదిలోకి వచ్చి, మగపిల్లలంతా వెళ్ళిపోయాక నలుగురూ ఒక జట్టుగా బయల్దేరతారు. మొదటి రెండేళ్ళూ ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు. ఐదో తరగతిలోకి వచ్చాక అందరూ సాయంత్రం ఒక గంట శారదాంబ ఇంట్లో ఆగి ఆడుకుని, కబుర్లు చెప్పుకుని ఇళ్ళకు వెళ్ళటం అలవాటయింది. శారదాంబ వాళ్ళది పెద్ద దొడ్డి. జామ, మామిడి, సపోటా చెట్లతో అందంగా

ఉంటుంది. బోలెడు పూల మొక్కలు, పిల్లలు ఆడుకున్నంత సేపు ఆడుకుని సన్నజాజి మొగ్గలు కోసుకుని మాలకడతారు. అన్నపూర్ణ వెతికి వెతికి సంపెంగ పూలు కోసుకుంటుంది. సుబ్బమ్మ అందరికీ శనగపప్పు, బెల్లం, అటుకులు, కాల్చిన అప్పడాలు, ఉప్పుడు పిండి రోజుకో రకం తింటానికి పెడుతుంది. అవి తిని ఎవరింటికి వాళ్ళు వెళ్తారు. మళ్ళీ ఎప్పుడు తెల్లవారుతుందా ఎప్పుడు కలుస్తామా అనుకుంటూ నిద్రపోతారు.

శారదాంబ నరసమ్మ పక్కలో పడుకుంటుంది. ఆమె ఏవో పాటలు పాడుతుంది. రామాయణం, భారతం కథలుగా చెబుతుంది. విశాలాక్షికి కూడా తల్లి కోటేశ్వరి కీర్తనలు నేర్పుతుంది, కథలూ చెబుతుంది. ధనలక్ష్మి తల్లికి అంత తీరికుండదు. అన్నపూర్ణకూ ఇంట్లో చెప్పేవాళ్ళు లేరు. విశాలాక్షి, శారదాంబ చెప్పే కథలూ, పాడే పాటలూ కళ్ళూ చెవులూ అప్పగించి వింటారు. పాటలు నేర్చుకుంటారు. శారదాంబది మంచి కంఠం. ఆ పిల్ల గొంతెత్తి పాడితే ఎంతో బాగుంటుందని నలుగురూ చేరతారు.

తమ్ముడికి కథలు చెప్పి, పాటలు పాడి నిద్రపుచ్చే పనంటే శారదకి చాలా ఇష్టం. ఇద్దరి మధ్యా ఐదేళ్ళ ఎడం. అందువల్ల ఇంట్లోవాళ్ళకు ఇద్దరు పిల్లలు చేసే పనులు ప్రత్యేకంగా ఉండి ముద్దొస్తుండేవి.

రామారావు ఇంటిపట్టున ఉన్నప్పుడు శారదకు ఎన్నో విషయాలు చెప్పేవాడు. సైన్సు, చరిత్ర గురించి తండ్రి చెప్పే మాటలు అర్థమైనా, కాకపోయినా నోరు తెరుచుకుని వినేది శారదాంబ. విన్నది విన్నట్లు అక్షరం పొల్లుపోకుండా స్నేహితురాళ్ళకు చెప్పేది. వాళ్ళు విని అడిగే ప్రశ్నలకు శారదాంబ దగ్గర సమాధానం ఉండేది కాదు. ”మా నాన్నగారిని అడిగి చెప్తా”ననేది. మళ్ళీ రామారావు మద్రాసు నుంచి వచ్చేసరికి కొత్త సంగతులు ఎన్నో ఉండేవి.

”మా నాన్న నన్ను డాక్టర్‌ చదివిస్తాడు”. ఈ మాట ప్రతిరోజూ ఒకసారన్నా శారదాంబ తన స్నేహితులకు చెప్పాల్సిందే.

ధనలక్ష్మి శారదాంబ వంక భక్తిగా చూసేది. తను కూడా డాక్టరైతే అన్న కోరిక లీలగా ఎక్కడో ఆ అమ్మాయి కళ్ళల్లో కనిపించేది. ఎప్పుడన్నా ఆపుకోలేని రోజు ”నేనూ డాక్టరైతే బాగుంటుంది కదా” అనేది.

”మనమందరం డాక్టర్లమైతే” శారదాంబ మిగిలిన ఇద్దరివంకా చూసిందోనాడు. విశాలాక్షి భయంగా ”అమ్మో! నేను డాక్టరవను. నాకు భయం. నేను హాయిగా ఆడుకుంటూ, పాడుకుంటూ ఉంటా. ఆ రోగాలూ నొప్పులూ నాకొద్దు” అంది.

అన్నపూర్ణ కూడా ముఖం చిట్లించింది.

శారదాంబ నిరుత్సాహపడకుండా ”పోన్లేవే. మేమిద్దరం డాక్టర్లమవుతాం. మీకు మందులిస్తాం” అంది.

నలుగురూ నవ్వుకుని కాసేపు డాక్టర్‌, రోగి ఆట ఆడుకున్నారు.

ఇంకో నాలుగు నెలలకు ఐదో తరగతి పూర్తయి ఆరో క్లాసులోకి వస్తారనగా ఓ రోజు ధనలక్ష్మి బడికి రాలేదు. ముగ్గురు స్నేహితురాళ్ళకూ ఏమీ తోచలేదు. బడి వదలగానే శారదాంబ ఇంటికి వెళ్ళకుండా ధనలక్ష్మి ఇంటికి వెళ్ళారు. అన్నపూర్ణకి, విశాలాక్షికి ధనలక్ష్మి ఇంట్లోకి ప్రవేశం లేదు. శారదాంబ లోపలికి వెళ్ళి ధనలక్ష్మిని పిల్చుకొచ్చింది.

వాళ్ళ వెనకే ధనలక్ష్మి వాళ్ళమ్మ కోటమ్మ వస్తూ ”మీ సావాసగత్తె పెళ్ళి కుదిరింది. ఇంక మీ ఆటలు కుదరవు” అంది నవ్వుతూ. ముగ్గురూ దనలక్ష్మి వంక ఆశ్చర్యంగా చూశారు.

”నన్ను చూసుకోవడానికి పెళ్ళివారొచ్చారు. అందుకే బడికి రాలా” అంది ధనలక్ష్మి సిగ్గుపడుతూ.

”పెళ్ళికొడుకు బాగున్నాడా?” విశాలాక్షి ఆత్రంగా అడిగింది.

”పెళ్ళికొడుకు రాలేదుగా” అమాయకంగా చెప్పింది ధనలక్ష్మి.

”ఐతే నువ్వింక బడికి రావా?” శారదాంబ అనుమానంగా అడిగింది.

”పెళ్ళయితే ఎట్లా వస్తారు? మీరు మాత్రం వస్తారా?”

ధనలక్ష్మి ప్రశ్నకు ముగ్గురూ ముఖముఖాలు చూసుకున్నారు.

”మరి నువ్వు డాక్టర్‌ చదువుతానన్నావు” ధనలక్ష్మి ఏదో ఆడిన మాట తప్పి తనకు ద్రోహం చేస్తున్నట్లు అడిగింది శారదాంబ.

”పెళ్ళయితే ఇంక చదువెలా కుదురుతుంది? నువ్వయినా పెళ్ళి చేసుకోకుండా డాక్టరెలా చదువుతావు?”

నెమ్మదిగా అడిగిన ధనలక్ష్మి మాటలకు రోషం వచ్చింది.

”నేను అసలు పెళ్ళి చేసుకోను. డాక్టర్‌నవుతా”

ముగ్గురూ శారదాంబ వంక ఆశ్చర్యంగా చూశారు. ధనలక్ష్మి ఆలోచనలో పడింది. కాసేపు నిశ్శబ్దం తర్వాత ధనలక్ష్మి మెల్లిగా చెప్పింది.

”మా నాన్న నన్ను చదివించలేడు. ఈ పెళ్ళివారు నేనంటే ఇష్టపడి చేసుకుంటున్నారట. కట్నం ఇవ్వక్కర్లేదు. ఖర్చులన్నీ వాళ్ళే పెట్టుకుంటారట. ఈ సంబంధం చేసుకుంటే మా అన్నయ్యకు ఏదో

ఉద్యోగం కూడా ఇప్పిస్తారంట. అందుకని నేను పెళ్ళి చేసుకోవాలి. తప్పదు. ఐనా నేను సంతోషంగానే ఉన్నా”.

ధనలక్ష్మి తన ముఖంలోకి రాబోతున్న నీలినీడలను తరిమి చిన్నగా నవ్వింది.

కోటమ్మ వచ్చి నలుగురి చేతుల్లో నాలుగు బెల్లం ముక్కలు పెట్టింది. నలుగురూ అవి నోట్లో వేసుకుని ఆ తీపి మింగుతూ తమ దిగులు మర్చిపోయారు.

… … …

”నాన్నమ్మా! నాన్నమ్మా! ధనలక్ష్మి పెళ్ళి తెలుసా?” పుస్తకాలు ఓ పక్కన పెట్టి నాన్నమ్మ మీదికి దూకబోయింది శారద.

”ముందు కాళ్ళూ, చేతులూ కడుక్కుని ఆ కిరస్తానం గుడ్డలు విప్పి శుభ్రమైన బట్టలు కట్టుకుని రా” కసిరింది నరసమ్మ.

శారద రోజూ అలాగే చేసేది. ఆ రోజు ధనలక్ష్మి పెళ్ళి కబురు ఎప్పుడెప్పుడు అమ్మకూ, నాన్నకూ చెబుదామా అనే హడావిడిలో మర్చిపోయింది.

గబగబా స్నానాల దొడ్లోకి వెళ్ళి నానమ్మ చెప్పినట్లు చేసి వచ్చింది.

నరసమ్మ అప్పటిదాకా చేసిన వత్తులన్నీ తీసి వత్తుల పెట్టెలో పెట్టి లేవబోతోంది. శారద వచ్చి నానమ్మ ఒళ్ళో ఎక్కి కూర్చుంది. నరసమ్మ శారద నెత్తిన ముద్దుపెట్టి గట్టిగా తనకేసి లాక్కుంది.

”నాన్నమ్మా ధనలక్ష్మి పెళ్ళి తెలుసా?”

”తెలుసులేవే. వాళ్ళ నాన్న వచ్చి చెప్పాడు నిన్ననే. ఐనా స్నేహితురాలి పెళ్ళికే ఇంత హడావిడి పడుతున్నావు. నీ పెళ్ళి కుదిరితే ఇహ గంతులేస్తావా?”

శారద నవ్వింది.

”నాన్నమ్మా, నీకు తెలియదా? నేను పెళ్ళి చేసుకోనుగా. డాక్టర్‌ చదవాలిగా. పెళ్ళెలా చేసుకుంటాను?”

”డాక్టరమ్మవవుతావూ? నయమే. నా బంగారు తల్లి ఎప్పుడు పెళ్ళికూతురవుతుందా అని నేను చూస్తుంటే”.

శారద నాన్నమ్మ ఒడినే ఉయ్యాల చేసుకుని ఊగుతూ ”నాన్నమ్మా. నిజంగా నేను పెళ్ళి చేసుకోను. కావాలంటే నాన్ననడుగు. నాన్న నన్ను డాక్టర్‌ చదివిస్తానన్నాడు. నా చిన్నప్పుడు మేం రాజమండ్రి వెళ్ళాం. అక్కడా అమ్మమ్మ చెప్పింది. గుంటూర్లో పెద్దమ్మ కూడా చెప్పింది. నేను డాక్టర్నవ్వాలట. నాన్న వాళ్ళందరికీ చెప్పేశాడు. నన్ను ఇంగ్లండ్‌ కూడా పంపుతాడు. నీకు ఇంగ్లండ్‌ అంటే తెలుసా?”

కూతురు ముద్దు మాటలను మురిపెంగా వింటున్న సుబ్బమ్మను చూసింది నరసమ్మ. కోడలంటే ఆమెకు ఇష్టమే కానీ కొడుకు ఏ మాటంటే ఆ మాటకు గంగిరెద్దులా తలూపుతుందనే కోపం కూడా

ఉంది. ఇప్పుడు శారద మాటలకు చిరాకు పడకుండా సంతోష పడుతున్న కోడలిని చూస్తే కోపం ముంచుకొచ్చింది.

”చిన్న పిల్లలకు ఈ మాటలేనా నేర్పించేది. అసలు బడికి పంపొద్దంటే వినకుండా పంపుతున్నారు. డాక్టరు చదివిస్తాడేం. ముందు మంచి సంబంధం చూసి పెళ్ళి చేసి ఆ తర్వాత ఏం చేసుకుంటాడో చేసుకోమను. వాడంటే మగాడు. పది ఊళ్ళు తిరుగుతున్నాడు. కిరస్తానీ స్నేహాలు పట్టి అటూ ఇటూ ఊగుతున్నాడు. తల్లివి. నువ్వు పిల్లకు బుద్దులు నేర్పుకోవద్దూ. కట్టుకున్నవాడు ఎట్లా ఆడమంటే అట్లా ఆడడమేనా? మొగుడికి బాధ్యతలు గుర్తు చేయొద్దూ. అయ్యోరాత! చక్కగా ముస్తాబు చేసుకుని కూచోటం తప్ప నీకింకేం చేతకాదు. అన్నీ నేనే సమర్థించుకు రావాలి”.

నాన్నమ్మ గొంతు పెంచి అమ్మను కేకలెయ్యడం చిన్ని సూర్యారావుకు అసలు ఇష్టం ఉండదు. దాంతో ఆ పిల్లాడు గొంతెత్తి ఏడవడం మొదలుపెట్టాడు. సుబ్బమ్మ వాడిని ఎత్తుకుని బుజ్జగించింది.

నాన్నమ్మ అమ్మని ఎందుకు కేకలేస్తోందో శారదకు అర్థం కాలేదు. మొత్తానికి నాన్నమ్మకు తను డాక్టరవడం ఇష్టం లేదని మాత్రం అర్థమైంది.

”నాన్నమ్మా! అమ్మనేం అనకు. నన్ను డాక్టర్‌ను చేసేది నాన్న”.

”సరేలే సంబరం. పద. దీపాలు వెలిగించే వేళయింది. ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి” మనుమరాలిని ఒళ్ళోంచి కిందికి దించి విసురుగా లోపలికి వెళ్ళింది.

నాన్నమ్మ కోపం చూసి శారద బిక్క ముఖంతో నుంచుంది. సుబ్బమ్మ శారదను దగ్గరకు తీసుకుని ”నాన్నమ్మ అంతేలేమ్మా. నాన్న వస్తే నాన్నమ్మ కోపం పోగొడతారు. నువ్వు చదువుకో” అని ఆమె కూడా వంటింటి వైపు నడిచింది.

… … …

విశాలాక్షి కూడా ఇంటికి వెళ్ళగానే తల్లితో ఇదే విషయం హడావుడిగా చెప్పేసింది. కోటేశ్వరి పెద్ద ఆసక్తి చూపకుండా ‘అలాగా’ అని తన పని చూసుకుంటూ ఉండిపోయింది. ఐతే ఆమె మనసు మాత్రం విశాలాక్షికి ఎప్పటికైనా తను పెళ్ళి చేయగలదా అనే ఆలోచనతో కొంత దిగులు నింపుకుంది.

కోటేశ్వరిది దేవదాసి కులం. ఆ ఊళ్ళోని వేణుగోపాల స్వామి ఆలయం చాలా పెద్దది. ఆ దేవుడి మాన్యం కూడా చాలా ఉంది. దాన్లో కొంత ఆదాయం కోటేశ్వరికి వస్తుంది. దాన్ని కోటేశ్వరి బెజవాడలో ఉంటూ వృత్తి చేసుకుంటున్న ఇద్దరక్కలకూ కొంత కొంత పంచి తను కొంత వాడుకుంటుంది. ఉత్సవాల రోజుల్లో ఆలయంలో నృత్యం చేస్తుంది. పక్క ఊళ్ళోని ధనిక రైతు రంగయ్య వీళ్ళ ఇంటికి వస్తూ పోతూ ఉంటాడు. ఆయనే విశాలాక్షి తండ్రి. కోటేశ్వరి ఆయననే నమ్ముకుంది. ఊళ్ళో కూడా కోటేశ్వరి అంటే ఆదరమే ఉంది. తిండికి, బట్టకు లోటు లేదు. అన్ని అవసరాలూ రంగయ్య చూస్తాడు. విశాలాక్షి అంటే ఆయనకు చాలా ప్రేమ. కూతుర్ని బాగా చదివించాలని అంటుంటాడు. పరిస్థితులు అనుకూలిస్తే అమ్మాయిని సీమ పంపించి చదివిద్దాం అంటాడు. ఐతే కోటేశ్వరి కూతురికి ఎలాంటి ఆశలూ పెట్టలేదు. సంగీతం, నాట్యం నేర్పటం మానలేదు. ఎటుపోయి ఎటు వచ్చినా కులవృత్తే కూడు పెడుతుందని ఆమె నమ్మకం. కానీ దేవదాసి వృత్తి మీద లోకానికి చిన్నచూపు ఏర్పడుతోందని, రాబోయే కాలంలో అసలు దేవదాసీలే

ఉండకుండా చట్టాలు తెస్తారని రంగయ్య చెబుతుంటే కోటేశ్వరి గుండె దడదడలాడేది. నాట్యం చేయడం, పాటలు పాడడం, ఓ పెద్ద దిక్కుని అండగా చూసుకుని నమ్ముకోవటం తప్పెందుకవుతుందో కోటేశ్వరికి అర్థమయ్యేది కాదు. ఆమె పూర్వీకులు అలాగే బతికారు. గౌరవంగానే బతికారు. దేవుడి దయవల్ల తనకీ ఓ అండ దొరికింది. ఓ కూతురు పుట్టింది. అంతా సవ్యంగానే ఉందనుకుంటుంది. కానీ ఆమెకు తెలుస్తూనే ఉంది. గుళ్ళో ఉత్సవాలలో ఆర్భాటం తగ్గుతోంది. నాట్యానికి ఇంతకుముందులా ఆనందించే వారు తగ్గుతున్నారు. తన కులానికి గౌరవం తగ్గుతోంది. నిజమే… తన కులంలో అవినీతి పరులూ, దురాశాపరులూ ఉన్నారు. కానీ అలాంటి వాళ్ళు ఏ కులంలో లేరు? మోసం చేసి బతికేవారు అన్ని కులాల్లోనూ ఉంటారు. ఎవరి వృత్తి వారు న్యాయంగా, ధర్మంగా చేసి కట్టు తప్పకుండా బతికేవారు. ఎప్పుడూ వేళ్ళమీద లెక్కపెట్టేంతమందే ఉంటారు. పైగా ఆర్థికంగా కటకటలాడే రోజుల్లో మోసాలు జరగక ఆగుతాయా?

వీరేశలింగం గారు తమ కులం గురించి మాట్లాడే మాటలు రంగయ్య చెబుతుంటే కోటేశ్వరికి ఆగ్రహం వచ్చేది.

”మా కులం గోల ఆయనకెందుకు? ఆయన కులాన్ని ఆయన ఉద్ధరించుకోమనండి” అనేది.

రంగయ్య కాసేపు ఆయన్ని సమర్థించేవాడు. కాసేపు విమర్శించేవాడు.

”నా కూతురు మాత్రం చదువుకుని తగినవాడిని పెళ్ళాడాల్సిందే” అనేవాడు. కోటేశ్వరి మనసు చివుక్కుమన్నా కన్న తండ్రి అలాగే అనుకుంటాడని ఊరుకునేది.

”మీ కులవృత్తి మీద ఇంగ్లీషు వాళ్ళ కన్ను పడింది. వాళ్ళ కన్ను పడిన ఏ కులవృత్తి సజావుగా నడిచింది? నేతపని వారు నాశనమయ్యారు. రైతులూ కటకటలాడుతున్నారు. ఒక్కో వృత్తిని నాశనం చేయడమే పనిగా పెట్టుకున్నారు” అనేవాడు. కోటేశ్వరికి భయం పుట్టుకొచ్చేది. తనకు దేవుడి మాన్యం నుంచి వచ్చే ఆదాయం లేకపోతే ఇద్దరక్కలూ వీథిన పడతారు. రంగయ్య తనను చూసుకున్నా అక్కలిద్దరూ నిరాధారంగా నిలబడాలి. రంగయ్య చెప్పినట్లు విశాలాక్షిని చదివించటమే మేలని అనుకుంది. విశాలాక్షి పెళ్ళి జరగటం అంత తేలిక కాదని కోటేశ్వరికి తెలుసు. కానీ చక్కని పిల్ల. ఎవరో ఒకరు చేరదీస్తారనే నమ్మకమూ ఉండేది. ఈ ఆలోచనలన్నీ ఒక్కసారి చుట్టుముట్టి ఆమె ధనలక్ష్మి పెళ్ళి గురించి సంతోషించనూ లేదు, విచారించనూ లేదు. విశాలాక్షి రోజులాగే సంగీతం పాడుకుంటూ కూర్చుంది.

అన్నపూర్ణ ఇంట్లో మాత్రం ధనలక్ష్మి వార్త సందడి రేకెత్తించింది. అన్నపూర్ణ పెళ్ళి ఎప్పుడు చెయ్యాలి, ఎలాంటి సంబంధం తేవాలి అని తల్లిదండ్రులు వాదించుకున్నారు. తండ్రి చదువుకున్నవాడినే చూస్తానంటాడు. ఆస్తిపరుడు కావాలని తల్లి, నాయనమ్మా వాదించారు. అన్నపూర్ణ వాళ్ళ మాటలన్నీ వింటూ కూర్చుంది.

చదువు, పొలం రెండూ ఉన్నవాడు ఉండడా? అలాంటి వాడిని చూడొచ్చుగా ఎందుకిలా తగవు పడుతున్నారనే విసుగొచ్చేదాక వాళ్ళ మాటలు విని ఆ తర్వాత పుస్తకాలు తీసుకుని దీపం ముందు చేరింది.

Share
This entry was posted in ధారావాహికలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.