ఏ మాటకామాటే…
నామట్టుకు నేను దేవాలయాల సందర్శన
కాస్తా తక్కువే…!
అదీ అక్కడి సహజ సుందర దృశ్యాలను
ఆస్వాదించడానికే తప్ప…
ముక్కుమూసుకుని
మొక్కులప్పగించడానికి ఏ మాత్రం కాదు.
ఓరుగల్లు దగ్గరి పాలంపేట
రామప్పాలయాన్ని మాత్రం ఏడాదికోమారైనా పోరిపోరి కోరికోరి
సందర్శించకుంటే… ఊపిరి సలుపదేమో…!
లోకానెక్కడైనా…
ఆలయాలు దేవుడి పేర్లమీదే ప్రశస్తి
ఇక్కడ మాత్రం… వృత్తి నైపుణ్యానికి నివేదన…
అద్భుత కళాఖండాలు చెక్కిన
ఆ మహా శిల్పి ‘రామప్ప’ పేరుతోనే…!
ఈ శిల్పాలయం….!
అపురూప పనితనానికి ఇచ్చిన వెలలేని గౌరవం…
అన్నట్టు…
మూలవిరాట్ రామలింగేశ్వరుడే…!
నామమాత్రుడిక్కడ అయినా చిన్నబోడు…
తనను రూపొందించిన ఆ చేతులకే
చేతులెత్తి నమస్కరిస్తున్నట్టుంటాడు
అది ఎనిమిది వందల ఏండ్లనాటి
సర్వాంగ సుందరంగా చెక్కిన
నక్షత్రాకారపు ఎత్తైన కట్టడం…!
ఆలయం చుట్టూతా జీవకళ ఉట్టిపడే
నల్లరాతి నర్తకీమణులు నాట్యభంగిమల్లో…
అద్దంలా మెరుస్తూ…
మంత్రముగ్ధులను చేస్తారు
రాతి నిర్మాణంలో
సూదిదూరే ఆకృతులు లెక్కలేనన్ని…!
పురాణ గాధలను పొదుముకున్న
ఈ శిలాస్తంభాలను చూడ
రెండు కళ్ళేం సరిపోతాయి
ఒళ్ళంతా కళ్ళను మొలిపించుకొనే వెళ్ళాలి…!
ఆలయ ప్రాకారాలే కాదు
ఆ పైకప్పూ అపురూపమైన కార్వింగే…!
ఆహా! అది క్షీరసాగర మధనం…!
రెండు వర్గాల మధ్య పోటీ ఆనాడూ…ఉంది
అమృతం తాగి చిరస్థాయిగా
బతకాలని ఆశ ఇద్దరికీనూ…!
రాష్ట్ర నృత్యమై వెలుగొందుతున్న
పేరిణీ శివతాండవం
ఆ శిల్పభంగిమల ప్రేరణవల్లే ఆకృతి దాల్చిందట…!
నీళ్ళల్లో తేలే ఇటుకలు పుస్తకాల్లో మాత్రమే విన్నాం ఇప్పుడు చారిత్రక
గోపురం లోంచి పలుకరిస్తున్నాయి…
పలుకరిస్తే చాలు…
స్పందించేందుకు సిద్ధంగా ఉన్న సర్వాలంకృత నల్లరాతి భారీ నంది
అది శిలాప్రతిమంటే ఎంతకూ నమ్మం
ఆలయానికే కాదు ఆ పక్కనే…
వేల ఎకరాలకు ప్రాణం పోస్తున్న
కొలనుకూ రామప్ప చెరువనే నామకరణం…!
ఆనాటి వైభవానికి అద్దం పట్టే శిల్ప చాతుర్యం… అనన్యసామాన్యం…
వినడానికే సంభ్రమాశ్చర్యం…!
స రి గ మ లు పలికే
సప్తస్వరాల రాతిస్థూపాన్ని చెక్కిన
రామప్పా…!
నీ చేతి ఉలి నిజంగా ఓ కలికితురాయి
ఏ సాంకేతిక జ్ఞానాన్ని వినియోగించి సంగీతాన్ని ఒలికిస్తివో ఈ నేలమీద
నువ్ నిజంగా అజరామరుడివయ్యా….!