వ్యవస్థాగతమైన మార్పు కోరుకున్న వ్యక్తి -వి.ప్రతిమ

‘మరణం అన్నది జీవితంలో ఒక భాగమని నమ్మడానికి సాధన చేయాలి కదా’ అంటారు మిత్రులు. కొన్ని మరణాలు ఎంతకీ మింగుడుపడవు. కొన్ని కఠినమైన వాస్తవాలు ఎంతకీ అంగీకరించడం సాధ్యపడదు. శక్తుల్ని కూడదీసుకోవడానికి చాలా సమయమే పడుతుంది.

ప్రముఖ సాహితీవేత్త, అనేక ఉద్యమాలకు మద్దతుదారుడు, అందరికీ ఆత్మీయ మిత్రుడు సింగమనేని గారు ఇక లేరనుకుంటే గొంతు పూడుకుపోతుంది, మనసు మూగబోతుంది.
అంతా వారి గురించి రాశారు కదా… మళ్ళీ ఇప్పుడెందుకు అన్పించవచ్చు. అయితే కవి చెప్పినట్లుగా ఈ లోకం తిన్న అన్నమే ప్రతిరోజూ తింటోంది, చేసిన కాపురమే మళ్ళీ మళ్ళీ చేస్తోంది. ఎవరి రుచులు వారివి గాన, ఎవరి అనుభూతి వారిది గాన అన్నట్లుగా సింగమనేని గారితో ఎవరి స్నేహం వారిది గాన…
సింగమనేని గారిని మొదటిసారిగా ఎప్పుడు కలిశానన్నది గుర్తు చేసుకుంటే 1994లో అనుకుంటాను కీ.శే. మధురాంతకం రాజారాం గారికి అజోవిభోకందాళం సంస్థ వారు జీవనసాఫల్య పురస్కారం అందించినపుడు ఒక్క రాయలసీమ నుండే కాక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని నలుమూలల నుంచి కూడా కథా రచయితలు ఆ అపురూపమైన సభకి హాజరు కావడం జరిగింది. అదిగో అక్కడ చూశాను మల్లెపువ్వు వంటి తెల్లటి పంచెకట్టుతో కథా పరిమళాలు వెదజల్లుతోన్న ఈ ఎత్తయిన మనిషిని…
సభంతా పూర్తయి మరలిపోతుండగా ఎవరో నన్నాయనకి పరిచయం చేశారు. అప్పటికే ఆయన కథలు చదివి స్ఫూర్తి పొంది ఉన్నానేమో నా అభిప్రాయాన్ని, అభిమానాన్ని ప్రకటించకుండా ఉండలేకపోయాను. తిరిగి వారు నాతో మాట్లాడిరది రెండు, మూడు మాటలే అయినా మనిషి ఎంత ఉన్నతుడో, మనసు అంతే ఉన్నతమైనదని ఆ క్షణం నాకు కలిగిన అభిప్రాయం తిరిగి ఎన్నడూ మార్చుకోవలసిన అవసరం నాకు కలగలేదు.
ఆధునిక సమాజం అర్థం కానిదే, ఆధునిక సమాజం చలన సూత్రాలు అర్థం కానివే. జీవితాన్ని నడిపించే శక్తులేమిటో అర్థం కానిదే ఆధునిక సాహిత్యం. అర్థం కాదు అన్న సూత్రాన్ని జీర్ణించుకున్న సాహిత్యజీవి సింగమనేని నారాయణ గారు. ఆయనకి సాహిత్యమూ, జీవితమూ కూడా ఒకే కుదురులో నుండి విచ్చుకున్న రెండు ఆకుపచ్చని కలలు.
వారు ఓరియంటల్‌ కాలేజీలో చదువుతుండగా తెలుగు మాస్టారు శ్రీశ్రీ గురించి చెప్పిన పాఠం, చేసిన పరిచయం తననెంతగానో ఆకట్టుకున్నదనీ ఆ ఒక్క సీరియల్‌, ఆ నలభై నిమిషాల కాలం మొత్తంగా తన జీవితాన్నే మార్చివేసిందనీ ఆయన చెప్పేవారు. ఆ ఇష్టంతోనే ఊరంతా తిరిగి వంద మహాప్రస్థానం కాపీలు కొని కాలేజీ గేటు వద్ద నిలబడి లోపలికి వెళ్ళే ప్రతి విద్యార్థికీ పంచానని కూడా ఆయన చెప్పేవారు. శ్రమైక జీవన సౌందర్యాన్ని మొట్టమొదటిసారిగా తెలుగు పాఠకలోకానికి విప్పి చెప్పిన శ్రీశ్రీ అన్నా, గతి తార్కిక చారిత్రక భౌతికవాదాన్ని తెలుగు పాఠకుల మెదళ్ళలోనికి ప్రవేశపెట్టిన మహాప్రస్థానం అన్నా ఆయనకి చెప్పలేనంత ఆరాధన. ఆ భావజాలమే అతని నిరంతర చింతన. మనందరికీ తెలుసు మహాప్రస్థానం ఆయనకి కంఠోపాఠమని.
ఒక్కోసారి కలిసినప్పుడు ఒక్కో కోణం నుండి శ్రీశ్రీని పరిచయం చేస్తూ గొంతెత్తి ఆ గీతాలను ఆలపించేవారు. అవి గొంతులో నుంచి కాకుండా హృదయంలోనుంచి వచ్చినట్లుగా ఉండేవి. అందరం కలిసినప్పుడు సింగమనేని, ఓల్గా పోటీపడి పాడే ఆ గీతాలను విని స్ఫూర్తి పొంది నేనూ కొన్ని నేర్చుకున్నాను. సింగమనేని గారి స్నేహ సాన్నిహిత్యంతోనే మా తమ్ముడు మురళి మహాప్రస్థానాన్ని ఎప్పుడూ బ్యాగ్‌లో పెట్టుకుని తిరుగుతుండేవాడు ఎక్కడ ఖాళీ దొరికితే అక్కడ చదువుకోడానికి.
సింగమనేని గారికి ‘మహాప్రస్థానం’ ఒక ఆబ్సెషనయితే, వారు మహాప్రస్థాన గీతాలు గొంతెత్తి పాడుతుండగా వినడం చుట్టూ ఉన్న కవులకూ, రచయితలకూ ఒక ఆబ్సెషన్‌.
‘‘ఈ సమాజంలో ఒక డాక్టర్‌ తన కొడుకు డాక్టర్‌ కావాలని కోరుకుంటాడు, ఒక యాక్టర్‌ తన కొడుకుని యాక్టర్ని చేయాలని కలలు కంటాడు. ఒక వ్యాపారి తన కొడుకు వ్యాపారాన్ని అందిపుచ్చుకుని ఎదగాలని కోరుకుంటాడు. ఒక లాయర్‌ తన కొడుకుని లాయరుగా చూడాలని ఆశపడతాడు.’’ కానీ రైతు మాత్రమే తన కొడుకు రైతు కావాలని ఎందుకు కోరుకోవడం లేదో, ఆ దుర్భర పరిస్థితులకు వెనుకనున్న మూలకారణాలను వెతికి పట్టుకొని విశ్లేషించిన రచయిత సింగమనేని. కరువు సీమ వ్యవసాయాన్ని సారవంతం చేయడమే ఆయన ప్రధాన లక్ష్యం. 1953 ప్రాంతంలో జి.రామకృష్ణ వంటివారు రాసిన ‘గంజికోసరం’ వంటి కథలు అనంతపురం జిల్లాలోని ఇనుపగజ్జెల తల్లిని పరిచయం చేసినప్పటికీ ఆ తర్వాత చాలా కాలం పాటు ఆ జిల్లా పరిస్థితులేవీ ఇతర ప్రాంతాల వారికి తెలీదు.
ఈ నేపథ్యంలో నుండి అనంతపురం జిల్లా భౌగోళిక స్వరూపాన్ని, సాగునీటి, తాగునీటి కొరతతో గ్రామాల్లో ఏర్పడిన దుర్భర పరిస్థితులను మొట్టమొదటిసారిగా పాఠకుల ముందు ఆవిష్కరించడమే కాకుండా, ప్రభుత్వాలతో పోరాటం చేసిన రచయిత సింగమనేని. రాయలసీమలో మొత్తం మూడున్నర దశాబ్దాలలో జరిగిన క్రమపరిణామాన్నంతా కూడా ఆయన తన రైతు కథల్లో నమోదు చేసి ‘చేదువిషం’గా చరిత్ర మంజూషలో నిక్షిప్తం చేసి ఉంచారు.
భూమికీ, రైతుకీ నడుమ వ్యవస్థ కల్పించిన విధ్వంసాన్నీ, భూమికీ, రైతుకీ మధ్య వైరుధ్యాలలో మార్కెట్‌ దోపిడీ రూపాలు ప్రవేశించడాన్నీ నిగ్గదీసి, నిలదీసిన సింగమనేని గారికి ఎప్పటికయినా ఈ ప్రభుత్వాలు రైతు కాళ్ళదగ్గరికొచ్చే రోజొకటి అతి తొందరలోనే ఉన్నదనీ, మొత్తం విధ్వంసం జరిగాక ప్రపంచమంతా రైతు వద్దకే వస్తుందనే ప్రగాఢమైన విశ్వాసం ఉండేది.
చాలా తరచుగా మేమిద్దరం ఫోన్లో మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. ‘‘అమ్మాఁ పనిలో ఉన్నావా తల్లీ’’ అంటూ అత్యంత స్నేహంతో కూడిన ఆత్మీయత ముందుగా ఫోన్లోనుండి ప్రసరించేది. ఇది నిజానికి నా ఒక్కదాని అనుభవమే కాదు. రచయితలందరితోనూ ఆయన ఇంత స్నేహంగానే ఉండేవారు. అనేక సాహిత్య విశేషాలతో పాటు, వ్యక్తిగత విషయాలు కూడా మా సంభాషణల్లో భాగమయ్యేవి. ఆ మధ్య నాకు అనారోగ్యమయినప్పుడు తిరుపతి మిత్రులకు ఫోన్‌ చేసి ‘‘ప్రతిమకు బాలేదు వెళ్ళి చూసి రండి’’ అని కోరారు. అంతేకాకుండా అనంతపురం నుండి తానే స్వయంగా నాయుడుపేట వచ్చి నన్ను ఆ నెగటివ్‌ చింత నుండి బయటపడేసి వెళ్ళారు. మనుషుల పట్ల అంత మానవీయంగా ఉండే సుమానుషి ఆయన. స్త్రీల ఇంటి చాకిరీ పట్ల ఆయనకి చాలా సహానుభూతి ఉండేది. ఎన్నోసార్లు ఆ విషయాన్ని ప్రస్తావనకు తెచ్చేవారు. స్త్రీల పట్ల పురుషుడి అవగాహనను, సంస్కార స్థాయిని పెంచాలని కోరుకునేవారు. పితృస్వామ్యం పురుషుల హస్తగతం చేసిన అన్ని రకాల పెత్తనాలనూ, అధికారాలనూ సమూలంగా అర్థం చేసుకుని, అదే స్థాయిలో పురుష పాఠకులకు అర్థం చేయించాలని తపన పడేవారు. ఆత్మవిశ్వాసంతో, ఆత్మగౌరవంతో తమకి తాముగా ఎదిగే స్త్రీలంటే విపరీతమైన అభిమానం ఆయనకి. అటువంటి కొత్త తరం స్త్రీలతో ఈ ప్రపంచమంతా నిండిపోవాలన్నదే ఆయన అభిలాష. అటువంటి ధైర్యసాహసాలతో కదిలే అమ్మాయిలను పరిచయం చేస్తూ కథలు రాశారాయన. స్త్రీల పట్ల దౌష్ట్యం చూపించే దుర్మార్గులైన భర్తలను గురించి ఎత్తి చెప్పి పురుష పాఠకులలో చైతన్యాన్ని, సంస్కారస్థాయినీ పెంచే కథలు రాసి ‘‘నీకూ నాకూ మధ్య నిశీధి’’గా గుదిగుచ్చారు.
గురజాడ కన్న కల సామూహిక వంటశాలల గురించి కూడా చాలాసార్లు ప్రస్తావించేవారు. స్త్రీల సహజ శక్తులన్నీ వంటిళ్ళలో మగ్గిపోకుండా సమాజ ఉత్పత్తిలో భాగం కావాలనీ, అందుకు సామూహిక వంటశాలల అవసరం ఉందనీ అనేవారు. ఆ ఇష్టమే వారిచేత ‘‘గురజాడ అపార్ట్‌మెంట్స్‌’’ కథ రాయించి ఉండొచ్చు. వారి ఉపన్యాసం వినడం మరో గొప్ప అనుభవం.
మాతృ భాషా దినోత్సవం రోజు తిరుపతిలో జరిగిన ఒక సభలో వారు మాట్లాడిన తీరు (మన భాష, సంస్కృతి, మానవ సంబంధాలు అన్నింటినీ కూడా మార్కెట్‌ ఎలా కబళిస్తోందో చిన్న చిన్న ఉదాహరణలతో మామూలు మనుషులకు కూడా మార్కెట్‌ మాయ అర్థమయ్యేలా గంటకు పైగా వారు చేసిన ప్రసంగం) ఎంత మంత్రముగ్ధను చేసిందంటే ఎక్కడ వెళ్ళి వారిని ఆలింగనం చేసుకుంటానో అని భయపడి వారు వేదిక దిగకముందే వచ్చేశాను. ఆ మాటే ఫోన్‌లో చెప్తే ‘‘ఎంత గొప్ప మాట చెప్తివి తల్లీ’’ అని ఆనందపడిపోయారు. మార్కెట్‌ మాయ గురించి ఏదయితే మనకు చెప్పేవారో, అదే ఆచరించి చూపించేవారు. అనంతపురం ఎండలను తట్టుకోలేక కేవలం సంవత్సరం ముందు మాత్రమే వారి ఇంట్లోకి ఏసి వచ్చింది. చాలాకాలం ఫ్యాన్లు కూడా ఉండేవి కాదట. అంత నిరాడంబర జీవితం ఆయనది.
వారికి పెద్దిభొట్ల పురస్కారం అందినప్పుడు పెద్దిభొట్ల గారి కోరిక మేరకు నేను విజయవాడ వెళ్ళి మాట్లాడాను. ఆ రోజు సోమవారం ‘వివిధ’లో సింగమనేని గారి మీద నేను రాసిన వ్యాసం అచ్చయింది. పొద్దున్నే ఫోన్‌ చేసి ‘అసలు పురస్కారం కన్నా నీ వ్యాస పురస్కారం బావుంది తల్లీ’ అంటూ చాలా సంతోషపడ్డారు. ఆ సాయంత్రం ఆ సభలో మాట్లాడడం నాక్కలిగిన గౌరవంగా నేను భావించాను.
లాక్‌డౌన్‌కి ముందు వారి పేరుతో ఒక పురస్కారాన్ని ఏర్పాటు చేశారు నన్నపురెడ్డి గారు. ఆ కథా సంపుటాలన్నీ చదివి మిత్రులు పాపినేని గారితో కలిసి న్యాయ నిర్ణయం చేయడం నాక్కలిగిన మరో మంచి అవకాశం. ఆయనకి వర్చ్యువల్‌ (పఱత్‌ీబaశ్రీ) సభల పట్ల ఆసక్తి ఉండేది కాదు. కరోనా వెళ్ళాక సభ పెట్టుకుందాం నువ్వు తప్పకుండా రావాలమ్మా ఆ సభకి అనేవారు. మాయదారి కరోనా వెళ్ళలేదు… ఆత్మీయులంతా ఒకరొకకరూ చెప్పకుండా మాయమైపోతున్నారు…
మా తమ్ముడు ఎప్పుడూ అంటుండేవాడు. ‘సింగమనేని గారిని చూస్తే మన నాన్నని చూసినట్లు ఉంటుంది కదక్కా’ అని. ఆ మాటలు పదే పదే గుర్తొచ్చి దుఃఖాన్ని పంచుతున్నాయి. అక్కడ ఆత్మలు వాలిన చెట్టు మీద ఇద్దరూ బహుశా కలుసుకునే ఉంటారు. నన్ను గురించి మాట్లాడుకునే ఉంటారు. శ్రీశ్రీ గీతాలు పాడుకునే ఉంటారు. ప్చ్‌..! కొన్ని మరణాలు ఎంతకీ మింగుడుపడవు. కొన్ని కఠినమైన వాస్తవాలు అంగీకరించడం కుదరదు.
ఎందరో అపురూపమైన వ్యక్తులు.
ఒక చలసాని, ఒక బాలగోపాల్‌, ఒక సింగమనేని… ఇక మళ్ళీ పుట్టరేమో..!

Share
This entry was posted in నివాళి. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.