‘‘రంధి’’ నవలను ఆచార్య కొలకలూరి ఇనాక్ గారు రచించారు. ఇందులో ప్రధాన కథ ఊరికి పల్లెకు మధ్య జరిగే అంతర్యుద్ధం. అంటే అగ్రవర్ణాల వారికి, దళితులకు మధ్య జరిగే గొడవ. కథంతా గుంటూరు వేజెండ్ల గ్రామ నేపథ్యంలో జరిగే సంఘటనలు, అగ్రకులాల ఆధిపత్య పోరులో నలిగిపోయే దళితులు, దళిత స్త్రీ అస్థిత్వ సమస్య ప్రధాన సందర్భం. మాదిగపల్లెలో
పుట్టి పేదరికంలో ఉంటూ చదువుకొని టీచరు కావాలన్న కోరికతో ఉన్న ఆడపిల్ల గాథ రంధి.
రంధి నవలలో ప్రధాన స్త్రీ పాత్ర సువ్వి. కథంతా సువ్వి పాత్రను ఆధారంగా చేసుకొనే తిరుగుతుంటుంది. ఈ నవలలో మనకు కనిపించే సమస్యలు రెండు. ఒకటి దళిత సమస్య, రెండవది దళిత స్త్రీ సమస్య. దళిత స్త్రీ తాను జాతిపరంగా ఎదుర్కొంటున్న సమస్యతో పాటు, లింగపరంగా అంటే స్త్రీ అయిన కారణాన ఎదుర్కొనే సమస్య. స్త్రీ పరంగా చూసినప్పుడు ఈ రెండు విధాలైన సమస్యలు మనకు దృశ్యమానమవుతాయి.
కథ విషయానికి వస్తే ‘సవర్ణుడిగా పిలువబడిన రాముడు అవర్ణులుగా పిలిపించుకొంటున్న మాదిగ కులపు స్త్రీ సువ్విని ఇష్టపడడం, కులం వేరు గనుక ఆమెను పెళ్ళి చేసుకోలేడు కనుక ఆమెను పొందాలన్న తపనతో, అహంకారంతో సువ్విపై అత్యాచారం చేయడం, హత్యా ప్రయత్నం చేయడం, రాముడికి భయపడి సువ్వి చదువు ఆగిపోవడం, అత్యాచారానికి గురైందన్న విషయం తెలిసి కూడా తన బాల్య స్నేహితుడు చందిరి సువ్విని పెళ్ళి చేసుకోవడం, చివరకు చందిరి ద్వారా రాముడు సువ్విని చెరచలేదని, ఆ ప్రయత్నం మాత్రమే చేశాడని, రాముడికి అత్యాచారం చేసే శక్తి సామర్ధ్యాలు లేవని తెలియడం, రాముడు అవమానం భరించలేక ఆత్మహత్యకు పాల్పడడం, రాముడి మరణం తర్వాత అతని తండ్రి నాంచారయ్యలో మార్పు రావడం, చందిరిని, సువ్విని తన కొడుకు కోడలిగా స్వీకరించడం’
స్త్రీ దృక్కోణం నుంచి చూసినప్పుడు మనకు కనిపించే ప్రధాన కథ ఇది.
ఈ పత్రం యొక్క ప్రధాన ఉద్దేశ్యం స్త్రీ దృక్పథం కనుక ఆ దృష్టితో చూసినప్పుడు మనకు కొన్ని విషయాలు స్పష్టమవుతాయి. స్త్రీ వాదం పురుషాధిపత్యాన్ని వ్యతిరేకిస్తే దళితవాదం కులాధిపత్యాన్ని వ్యతిరేకిస్తుంది. వెనుకబడిన కులంలో పుట్టిన కారణాన పురుషాధిపత్యంతో పాటు, అగ్రకులాల ఆధిపత్యం క్రింద నలిగిపోయిన స్త్రీ దయనీయ గాథను తెలిపే దళిత స్త్రీ వాద సాహిత్యంగా ‘రంధి’ నిలుస్తుంది. ఇందులో సువ్వి ఎదుర్కొన్న అసమానత, అణచివేత, అవమానాలను పలు కోణాల నుంచి పరిశీలించడం ఈ పత్ర ముఖ్యోద్దేశ్యం.
1. అణచివేత ఉన్నచోట సంఘర్షణ ఉంటుంది. సంఘర్షణ ఉన్నచోట పోరాటమూ ఉంటుంది. ఈ కథ ఒక వ్యక్తితో మరొక వ్యక్తి పోరాటం. స్త్రీగా తాను స్వేచ్ఛగా, స్వతంత్రంగా జీవించడానికి అడ్డుగా ఉన్న పరిస్థితులను ఎదుర్కొనే ప్రయత్నం. సాధారణంగా పురుషులకు స్త్రీలంటే చులకనభావం. అందులోనూ దళిత స్త్రీ అంటే మరింత ఎక్కువగా ఉంటుంది. అన్ని విషయాలలోను తమకంటే తక్కువగా ఉండాలని భావిస్తారు. ఈ నవలలో సువ్వి తెలివైన పిల్ల. మానసిక బలంతో పాటు ఆత్మాభిమానం గలది. చదువుకొని టీచరయి తన సంపాదనతో తల్లిదండ్రుల్ని వృద్ధాప్యంలో కష్టం లేకుండా చూసుకోవాలన్నది ఆమె లక్ష్యం. సువ్వి గుంటూరులో ఆడపిల్లల హైస్కూలులో చేరిందని, రోజూ రైల్లో వస్తుందని తెలిసి అగ్రకులస్థుడైన రాముడు మండిపడ్డాడు. తనతో సమానంగా రైల్లో వచ్చి చదువుకోవడం సహించలేకపోయాడు. ‘వేజెండ్ల మాదిగ పిల్ల దీనికి చదువెందుకు’ అనుకున్నాడు. అంతటితో ఆగలేదు. తాను ఎక్కే రైలు పెట్టెలో ఎక్కకూడదని శాసించాడు. అనుకోకుండా ఒకసారి రాముడే ఆమె ఎక్కి ఉన్న రైలు పెట్టెలోకి ఎక్కాడు. సువ్విని చూడగానే కోపం వచ్చింది. ‘ఆడముండ సీటులో మగరాయుడులాగా కూర్చుని ఉండడం’ సహించలేకపోయాడు. పురుషాహంకారం, కులాహంకారం బయటకు వచ్చాయి. ఏందే, ఏమే, గాడిదా, ముండా అని సంభోదిస్తూ తిట్టాడు. సువ్వి అభిమానం దెబ్బతింది. ‘నేను కాదు ముండను నువ్వే’ అంది. రాముడికి కోపం వచ్చి సువ్విని కొట్టాడు. ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. స్త్రీని కొట్టడం పురుషాహంకారానికి నిదర్శనం. ఇందులో రాముడు సువ్విని ‘నెత్తిమీద కొట్టలేదు, చెంపలు వాయించలేదు, వీపు పగలగొట్టలేదు. ఎదురొమ్ముమీద కొట్టాడు’. అంటే స్త్రీని అణచే సాధనం ఆమెను కొట్టడం, తద్వారా బలహీనురాలిని చేయడమన్నది ఒక అణచివేత సాధనమైతే, ఆమె ఉరస్థలి మీద కొట్టడమంటే స్త్రీని కేవలం సెక్సుకి ప్రతీకగానే చూడడం, శరీరాన్ని అణచడం ద్వారా మనసుని, వ్యక్తిత్వాన్ని అణచడం.
2. పురుషుడికి స్త్రీ పైన పగతీర్చుకునే సాధనంగా లైంగికత్వం ఉపయోగపడుతుంది. స్త్రీ పురుషుల మధ్య తగాదాలు వచ్చినప్పుడు స్త్రీ లైంగికత్వాన్ని ఆయుధంగా చేసుకోవడం. సువ్వి శరీరం, తెలివి, పొగరు ఇవన్నీ రామునిలో సువ్విపట్ల ఆసక్తిని పెంచాయి. ఒకసారి రైలు దిగుతున్న సువ్విని వెనుక నుంచి వాటేసుకున్నాడు రాముడు. ‘ఎందుకురా గాడిదా, నా మీద పడ్డావు’ అంటుంది సువ్వి. ‘నువ్వే నన్ను పడేశావే’ అంటాడు రాముడు. కిందపడేట్టు మీదపడి తోసింది చాలక, లంజ అని తిట్టడంతో రాముడి చెంపమీద చాచి కొట్టింది సువ్వి. పగతో రగిలిపోతున్న రాముడికి రైలులో మరొకసారి తటస్థపడినప్పుడు ‘ఏమే మాదిగ లంజా! చెంప మీద కొడతావా’ అని తిట్టాడు. ‘నువ్వు చెయ్యి ఏడబెట్టా? ఏడ పిసికా? అట్టాంటప్పుడు ఏ ఆడదైనా కొట్టుద్ది’ అంటుంది సువ్వి. మాట మాట పెరిగింది. ఎదురొమ్ముల మీద గుద్దడంతో తన ఆడతనాన్ని అవమానిస్తే తట్టుకోలేక పోయిన సువ్వి పిడికిలి బిగించి మీది మీదికి వస్తున్న రాముడి ముక్కు మీద గుద్దింది. ముక్కు అదిరి రక్తం కారింది. రాముడు కోపంతో ఊగిపోయాడు. ‘లంజా! నిన్ను నెత్తురు కారేట్టు చెరచకపోతే నా పేరు రాముడే కాదు’ అని శపథం చేశాడు. అంతేకాదు ‘నిన్ను నీ పెళ్ళికంటే ముందే చెరిచి చంపకపోతే నేను మొగాణ్ణేకాదు’ అన్నాడు. ‘ముందు దాన్ని అత్యాచారం చేయాలి. ఆ పైన హత్య చేయాలి. తిరగబడినా, అనుకూలించకపోయినా పీకపిసికి అది అల్లాడుతున్నప్పుడు అత్యాచారం చేయాలి’ ఇది రాముడి ఆలోచన. ఆడవాళ్ళపై అత్యాచారం జరపడమంటే స్త్రీలపై తమకున్న కోపాన్ని, పగను, ద్వేషాన్ని ప్రదర్శించుకోవడమే. తమను ఒక స్త్రీ ఎదిరించింది అంటే, అందునా ఒక వెనుకబడిన తరగతి స్త్రీ, ఆమెను అత్యాచారం చేయాలి. అలా చేస్తే ఆమే కాదు ఏ స్త్రీ తిరగబడదు, ఎదురు తిరగదు. ఇదే రాముడి ఆలోచన కూడా.
3. అభద్రతా భావం స్త్రీలను బలహీనులను నిస్సహాయులను చేస్తుంది, మానసికంగా కృంగదీస్తుంది. బయటికి కనిపించకపోయినా అనుక్షణం భయపడేలా చేసి శక్తిహీనురాలిని చేస్తుంది. ఒంటరిగా ఉండాలన్నా, తనను ఇబ్బంది పెట్టేవాళ్ళను ఎదుర్కోవాలన్నా భయపడుతుంది. ఈ కథలో సువ్వి ఆత్మాభిమానం గల ఆడపిల్ల, ధైర్యవంతురాలు, ఆలోచనాశక్తి గలది, పట్టుదల గలది. పెద్దమనిషయ్యాక చదువు మాన్పిస్తాను, పెళ్ళి చేస్తాను అని తండ్రి అంటే అలిగి, తిండి మానేసి, మొండికేసి పట్టుబట్టి అనుకున్నది సాధించింది. చక్కగా చదువుకొంటూ మంచి మార్కులు తెచ్చుకొంది. రాముడు కొట్టినా, బూతులు తిట్టినా చాకచక్యంగా ఎదుర్కొందే గానీ భయపడలేదు. కానీ రాముడు అత్యాచారం చేస్తానంటే భయపడిపోయింది. స్కూలుకి వెళ్ళడం మానేసింది. దాక్కోసాగింది. దడ, వణుకు పుట్టాయి. అత్యాచార భయం పీడిరపసాగింది. ఆ భయం ఆమె భవిష్యత్తుని శాసించింది. పెళ్ళి తప్ప మరో మార్గం లేదని తల్లిదండ్రులు భావిస్తే అందుకు తలవంచింది. ‘తన శరీరం మీద తన ఇష్టం అధికారం చెలాయిస్తుంది కానీ ఎవరి అహంకారమూ చెల్లదనే సువ్వి దృక్పథం భంగపడిరది’. ఆ సమయంలో తనకు ఓ ఆలోచన వచ్చింది. పెళ్ళయితే అత్యాచారం ఉండదు, ఉన్నా తనను రక్షించగలిగే భర్త ఉండాలి. తన ఆలోచనల్లో మెదిలిన వాడు చందిరి. రాముడి నుండి తనను తప్పించగల, రక్షించగల వ్యక్తి తన బాల్యస్నేహితుడు, తనను అర్థం చేసుకోగలవాడు చందిరి అని గ్రహించి అతన్నే వివాహం చేసుకోవడానికి నిశ్చయించుకుంటుంది సువ్వి. అదేమాట కుండ బద్దలు కొట్టినట్టు, నిర్భయంగా చెబుతుంది తన తల్లిదండ్రులతో. అంటే చదువు విషయంలోనూ, పెళ్ళి విషయంలోనూ పెళ్ళి తర్వాత జరిగే కార్యం విషయంలోనూ స్వయం నిర్ణయం తీసుకోవడంలో స్త్రీ అస్తిత్వ చైతన్యం కనిపిస్తుంది. అంతేకాదు సాధారణంగా పెళ్ళయ్యాక స్త్రీలు చదవవలసిన అవసరం లేదని భావించకుండా ధైర్యంగా, ఒంటరిగా తన చదువు కొనసాగించింది. తన శీలానికి వెలగట్టి డబ్బు ఇచ్చి తమ తప్పునుండి బయటపడడానికి అగ్రకులస్థులు భావించినప్పుడు కూడా డబ్బును తిరస్కరించి తన ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకుంది. జరిమానా, పరిహారం గ్రహించడానికి సువ్వికి తగిలిన గాయం శరీరానికి మాత్రమే కాదు, మనసుకు కూడా. స్త్రీ శీలాన్ని డబ్బుతో వెలగడితే సరిపోతుందనుకునే పురుషాధిక్యానికి, కులాధిక్యానికి చెంపపెట్టు సువ్వి తిరస్కారం.
4.అత్యాచారానికి గురైన స్త్రీ యొక్క మానసిక పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. చిన్న చిన్న విషయాలకు కూడా భయపడడం, ఒక రకమైన స్తబ్దత, ఆందోళన, మోసగించబడ్డామన్న బాధ, ఆసక్తిని కోల్పోవడం వంటివి ఏర్పడతాయి. శారీరకంగా పొందే గాయాలకన్నా మానసికంగా పొందే గాయాలే ఎక్కువ. ఈ సందర్భంలో రచయిత ‘ఆడు సెరిసినా సువ్వి బంగారుకొండ, సెడిపోలేదు. ఆడు దాని వంటినే జయించేడు, గుండెను కాదు, మనస్సును కాదు, మనిషిని కాదు, రాయి తగిలి కాలికి పుండైతే, కాలు సెడిపోనట్టే, సువ్వికి పుండయింది. పుండు మానుతుంది. సువ్వి ఎంగిలైతేనేమి? కడుపొస్తే నేమి? సువ్వి తప్పు ఏమీ లేదు, బురదయిన కాలు కడుక్కోమా? పేడయిన చేతులు అట్టాగే వదిలేత్తామా?’ అంటారు. ఇదే ఆధునిక స్త్రీలు కోరుకొనే వివక్షా శృంఖల విముక్తి, అభ్యుదయ కాంక్ష. సువ్వి ఒక స్త్రీగా తాను స్వేచ్ఛగా, స్వతంత్రంగా జీవించడానికి అడ్డుగా ఉన్న పరిస్థితులు ఛేదించుకొని వచ్చినప్పుడు, ‘ఆమెకు భయంలేదు. ఆమె ధైర్యవంతురాలు. లక్ష్యం ఉన్న స్త్రీ! సాధించే అసాధ్యురాలు’ అంటారు రచయిత. దళిత స్త్రీ స్వేచ్ఛా విహంగ వీక్షణం ఆశిస్తున్న సందర్భమిది.