నబనీత దేవసేన ప్రముఖ బెంగాలీ రచయిత. కలకత్తాలోని జాదవ్ యూనివర్శిటీలో ప్రొఫెసర్. ఆమె బెంగాలీ భాషలో రాసిన చాలా రచనలు ఇంగ్లీష్‌లోకి అనువాదమయ్యాయి. నవలలు, కథలు, కవిత్వం, నాటకాలు, ట్రావెలాడ్స్ వంటి ఎన్నో ప్రక్రియల్లో ఆవిడ రచనలు చేశారు. ఆమెను నేను రెండుసార్లు కలిశాను. చాలా సరదాగా, సంబరంగా ఉంటారావిడ.
ఈ మధ్య ప్రసూన బాలాంత్రపు గారి ఎఫ్.బి. వాల్ మీద నబ్‌నీత రాసిన పుస్తకం గురించి చదివాను. ఆ పుస్తకం పేరు ఁూఅ a ్‌తీబషస Aశ్రీశీఅవ ్‌శీ వీష వీaష్ట్రశీఅఁ. వెంటనే ఆ పుస్తకాన్ని కిండిల్‌లో కొనేసి చదవడం మొదలుపెట్టాను. లాక్‌డౌన్ కాలం. బయటకు వెళ్ళే వీలులేని పాడుకాలం. బంధువులు, మిత్రుల మరణాలు కుంగదీస్తున్న సందర్భం. మనసెంత రోదిస్తున్నా ఎవ్వరి దగ్గరకు వెళ్ళలేని నిస్సహాయ స్థితి. ఇంటిచుట్టూ పాజిటివ్ కేసులు. అప్పుడప్పుడూ మరణ మృదంగాల కఠోర శబ్దాలు. గుండెల్ని గొంతులోకి లాక్కొచ్చే అంబులెన్స్‌ల సైరన్‌లు.
అలాంటి ఓ భయానక రాత్రి నబ్‌నీత పుస్తకం చదవడం మొదలుపెట్టాను. సర్వం మర్చిపోయాను. దిగుళ్ళు, భయాలు అన్నీ ఆ క్షణాన మాయమైపోయాయి. నబ్‌నీత వెంట నా ప్రయాణం మొదలైంది. కళ్ళు అక్షరాల వెంట, మనసు నబ్‌నీత ప్రయాణం వెంట. నాకు ప్రయాణాలంటే ఉండే ప్రేమ, అదీ ఏకాంతంగా చేసే ప్రయాణాల మీదున్న మోజు నన్ను ఈ పుస్తకం వెంట పరుగు తీయించింది.
ఒక సాహిత్య కార్యక్రమంలో పాల్గొనడానికి కలకత్తా నుండి అస్సామ్ టీ తోటలకి వస్తుంది నబ్‌నీత. జోర్‌హాట్‌లో జరిగే అస్సామ్ ఉమన్ లిటరేచర్ కాన్ఫరెన్స్‌లో పాల్గొనడానికి వస్తుంది. అక్టోబర్ 1977 నాటి మాట. తనని కాజిరంగా నేషనల్ పార్క్‌కి తీసుకెళ్తేనే ఆ సమావేశానికి ముఖ్య అతిధిగా వస్తానని కండిషన్ పెట్టి మరీ వస్తుంది. నబ్‌నీతని కాన్ఫరెన్స్‌కి ఆహ్వానించిన షీలా ఈ కండిషన్‌కి ఒప్పుకుంటుంది. సమావేశం అయిపోగానే ‘కామ్‌రూప్ కాంప్లెక్స్’ అనే అద్భుతమైన వసతి గృహానికి తీసుకెళ్తుంది. చిన్న నది పాయ ప్రవహిస్తున్న ప్రదేశంలో నబ్‌నీతకి రూమ్ దొరుకుతుంది. తన ఏకాంతానికి భంగం కలగని చక్కటి రూమ్ అది.
మర్నాడు కాజిరంగా అడవి చూడడానికి వెళ్తుంది. ఆ అడవిలో తన అనుభవాలను, అనుభూతులను పుస్తకంలో చదవాల్సిందే. ఏనుగెక్కి అడవిలో ఊరేగడం, హఠాత్తుగా వర్షం కురవడం, పులి కనబడడం… ఆ వివరాలన్నీ ఆమె వర్ణించిన తీరు భలేగా ఉంటుంది. ఆ తర్వాత బ్రహ్మపుత్ర నది మీద ఫెర్రీలో ప్రయాణం. అసంఖ్యాకమైన ద్వీపాలతో అలరారే బ్రహ్మపుత్ర నది మీద ప్రయాణం గురించి వివరంగా రాస్తుంది. ఫెర్రీ మీద బ్రహ్మపుత్ర నదిలో ప్రయాణం చేస్తున్నప్పుడు, అదే ఫెర్రీమీద జీప్‌తో సహా ప్రయాణిస్తున్న ఒక బెంగాలీ బాబు ద్వారా తేజ్‌పూర్, బొమ్‌డిల, తవాంగ్ గ్రామాల పేర్లు వింటుంది. చైనా యుద్ధ సమయంలో కేవలం పది రోజుల్లో లాసా నుండి తవాంగ్ వరకూ వేసిన మెక్ మహోన్ లైన్ (వీష వీaష్ట్రశీఅ శ్రీఱఅవ) గురించి, అలాగే తవాంగ్ లోని ప్రసిద్ధమైన బుద్ధిస్ట్ మొనాస్ట్రీ గురించి వివరాలు తెలుసుకుంటుంది.
‘తవాంగ్’ ఎలా వెళ్ళాలి అని బెంగాలీ బాబును అడిగినపుడు ‘తవాంగ్ ఎందుకు వెళ్ళడం’ అంటూ రకరకాల కారణాలడుగుతాడు. తనకి వెళ్ళాలని ఉందని, తవాంగ్ చూడాలని ఉందని, అంతే. వేరే కారణమేమీ లేవని చెబుతుంది. ‘నన్ను నీ జీప్‌లో బోమ్‌డిలా తీసుకెళ్తావా’ అని అడుగుతుంది. ‘ఇటానగర్ నుండి పర్మిషన్ తెచ్చుకుంటే తీసుకెళ్తాన’ని చెప్తాడు. తన ఫోన్ నంబర్ కూడా ఇస్తాడు. ‘తవాంగ్ ఒంటరిగా వెళ్ళకూడదు. ఎవరైనా తోడుండాలి’ అని సలహా చెబుతాడు. ‘నేను ఒంటరిగానే వెళ్ళాలి’ అనుకుంటుంది నబ్‌నీత.
‘తవాంగ్’ ప్రయాణం గురించి షీలాకి చెప్పినపుడు ఆమె షాకవుతుంది. నీ దగ్గర సరిపడిన ఉలెన్ దుస్తులు లేవు, ‘తవాంగ్’ చాలా చలి ప్రదేశం. ఆ ఆలోచన మానుకోమంటుంది. నబ్‌నీత తేజ్‌పూర్‌లో ఒక బెంగాలీ కుటుంబంతో అతిధిగా ఉంటుంది. వాళ్ళంతా కూడా నబ్‌నీత ‘తవాంగ్’ ప్రయాణాన్ని వ్యతిరేకిస్తారు. ‘నేను ఒక్కదాన్నీ కుంభమేళాకి వెళ్ళాను. తవాంగ్ ఎందుకెళ్ళకూడదు’ అని ఆమె వాదిస్తుంది. అన్ని అడ్డంకుల్ని, అందరి వ్యతిరేకతల్ని తోసిరాజని, తవాంగ్‌లో అడుగుపెట్టడానికి అనుమతి సంపాదించి ప్రయాణానికి తయారవుతుంది. జీప్‌లో బొమ్‌డిలా తీసుకెళ్తానన్న బెంగాలీ బాబు చెప్పాపెట్టకుండా వెళ్ళిపోతాడు. ప్రభుత్వ జీప్‌లో వెళ్ళాలన్న ఆలోచన కూడా ముందుకెళ్ళదు. ఆ జీప్ రిపేర్‌లో ఉంటుంది. తవాంగ్ వెళ్ళాల్సిన ఒక మెడికల్ ఆఫీసర్ డా॥లాల్‌వానీ జీప్ కూడా పాడైపోయి వర్క్‌షాప్‌లో ఉంటుంది. కానీ డాక్టర్ అర్జంటుగా తవాంగ్ వెళ్ళాల్సి ఉంటుంది. మర్నాడు బయల్దేరే రేషన్ ట్రక్కులో వెళ్ళాలని అనుకుంటాడు. ఆ ట్రక్కులోనే అతి ప్రమాదకరమైన ప్రయాణం చేయాలని నబ్‌నీత నిర్ణయించుకుంటుంది.
మొత్తం సరుకులతో నిండిన లారీలో నలుగురు మగాళ్ళతో పాటు నబనీత తవాంగ్ ప్రయాణం మొదలవుతుంది. లారీ నిండా దారిపొడవునా దింపుకుంటూ వెళ్ళాల్సిన రేషన్ సరుకులు. డ్రైవర్ పక్క నుండే సీట్లలో డాక్టర్, నబ్‌నీత, మరో ఇద్దరి ప్రయాణం. ఉత్తుంగ పర్వత శ్రేణులు, అడవులు, విపరీతమైన చలిగాలుల మధ్య ఈ ప్రయాణం సాగుతుంది. నబ్‌నీతతో ప్రయాణం చేస్తున్న డాక్టర్‌తో ఎదురైన అనుభవాల గురించి చాలా హృద్యంగా, సరదాగా రాస్తుంది. మార్గమధ్యలో ఆ రాత్రి విశ్రాంతి కోసం డ్రైవర్ ఆపినప్పుడు ఇన్‌స్పెక్షన్ బంగ్లాలో తను నిద్రపోవడానికి నబ్‌నీత చేసుకున్న ఏర్పాట్లు, ఆమెతోపాటు ఒకే గదిలో పడుకోవడానికి డాక్టర్ పడిన అగచాట్లు, అతన్ని ఆటపట్టించిన వైనాలు భలే సరదాగా రాస్తుంది. అర్థరాత్రి జలపాత సవ్వడి విని అడవిలోకి నడుచుకుంటూ వెళ్ళిన నబ్‌నీత సాహసం అతన్ని విస్మయపరుస్తుంది. ‘‘క్రేజీ ఉమన్’’ అంటూ అరుస్తాడు డాక్టర్. ‘నాకిద్దరు కూతుళ్ళున్నారు. భయపడకు డాక్టర్. నీ శీలానికొచ్చిన భయమేమీ లేదు. హాయిగా నిద్రపో’ అని చెప్పి తను నిద్రపోతుంది. డాక్టర్ రాత్రంతా నిద్రపోలేదని నబ్‌నీతకు తెలుసు. అతన్ని బాగా ఆటపట్టిస్తుంటుంది.
లారీ చాలాచోట్ల ఆగుతూ కొండల మధ్య, అడవిలోంచి వెళ్తూ ఉంటుంది. మధ్యలో టీ కోసం ఆగుతుంటుంది. ఆ దట్టమైన అడవిలో కేరళ వాళ్ళు నడుపుతున్న మద్రాస్ హోటల్ ఉంటుంది. ఇడ్లీ, చట్నీ, అన్నం, కాఫీ అన్నీ దొరుకుతాయక్కడ. కేరళ వాళ్ళు నడుపుతున్న హోటల్‌కి మద్రాస్ పేరేంటి అని అడిగినపుడు త్రివేండ్రం అంటే ఎవరికీ తెలియదు. మద్రాస్ చాలా ఫేమస్. అందరికీ తెలుసు అని ఓ ఆశ్చర్యకరమైన విషయం చెప్పారు వాళ్ళు.
ట్రక్ రాత్రివేళ కొండల మధ్య నుంచి వెళ్తుంటుంది. రోడ్డు పక్కన గల గల పారుతున్న నది శబ్దం విన్పిస్తుంటుంది. అప్పటివరకు చీకటిగా ఉన్న దారంతా వెన్నెల వెలుగుల్లో మెరుస్తుంది. ధగధగలాడే పూర్ణచంద్రుడు కొండల వెనుక నించి పైకి రావడంతో పరిసరాలన్నీ తెల్లగా మెరుస్తుంటాయి. డ్రైవర్ మన్‌చంద్ తప్ప అందరూ నిద్రపోతున్న వేళ నబ్‌నీత అడవిలో విరగకాస్తున్న వెన్నెల్ని ఆనందంగా చూస్తుంటుంది.
ఆ రాత్రి బాగా పొద్దుపోయాక నిద్రపోవడానికి అడవి మధ్యలో చిన్న హోటల్ దగ్గర లారీ ఆగుతుంది. ఒక్క మహిళ కూడా కనబడని ఆ సమయంలో తాను ఎక్కడ నిద్రపోవాలి అనే ప్రశ్నను నబ్‌నీత పరిష్కరించుకున్న విధాన్ని పాఠకులు చదివి తీరాల్సిందే. ఆమెతో పాటు గదిని షేర్ చేసుకున్న డాక్టర్ తిప్పలు, భయాలు చాలా వినోదాత్మకంగా రాస్తుంది. డాక్టర్‌ని బాగా ఆటపట్టిస్తుంది. తను ఒంటరిగా అపరిచిత పురుషుడితో ఉన్నాననే ఊహ కూడా ఆమెకు రాదు. హాయిగా ముసుగు పెట్టి నిద్రపోతుంది.
నబ్‌నీత ప్రయాణం చేస్తున్న లారీ తవాంగ్ దారిలో కాకుండా వేరే దారిలో వెళ్ళాల్సి ఉండడం వల్ల మధ్యలోనే దింపేసి వెళ్ళిపోతాడు డ్రైవర్ మన్‌చంద్. డాక్టర్, ఆమె మిగిలిపోతారు. తవాంగ్ వెళ్తున్న వేరే రేషన్ లారీలో వీళ్ళకు సీటు దొరుకుతుంది. మళ్ళీ ప్రయాణం మొదలవుతుంది. ఎన్నో వింతల్ని చూసుకుంటూ ప్రయాణం సాగుతుంది. చిన్న చిన్న హోటళ్ళు, టీలు తాగడాలు, ఏవో జంతువులు లారీకి అడ్డు రావడం, కొంతసేపు ఆగడం… ఇలా ప్రయాణం సాగుతూ ఉంటుంది.
తవాంగ్‌కి సమీపంలో ఒకచోట లారీ ఆపమని డాక్టర్ దిగేస్తాడు. ‘మేమ్ సాబ్ మీరెక్కడ దిగుతారు?’ అని డ్రైవర్ ఘనశ్యామ్ అడిగినపుడు ఇక్కడ ఇన్‌స్పెక్షన్ బంగ్లా లేదా? అని అడుగుతుంది. సర్క్యూట్ హౌస్ ఉంది. కానీ ఇప్పుడది మూసేసి ఉంటుంది అని చెబుతాడు. నాకు లేటవుతోంది నేను వెళ్తాను అంటూ డాక్టర్ వెళ్ళబోతాడు. నన్ను వదిలేసి ఎక్కడకు వెళ్తావ్, నేనూ నీతో వస్తాను అని నబ్‌నీత అన్నప్పుడు ‘నో…సాధ్యంకాదు. నేను బ్యాచిలర్‌ని. ఒక్కడినే ఉంటాను’ అని కంగారు పడిపోతాడు. ‘‘అయినా బహదూర్ ఏమనుకుంటాడు?’’ అని కూడా అంటాడు. ‘‘బహదూర్ ఎవరు?’’ ‘‘నా ఇంటిని చూసుకునే సహాయకుడు’’. ‘‘సో… నువ్వు ఒంటరిగా లేవు. బహదూర్ కూడా ఉన్నాడు. నీకేం కాదు. బహదూర్ నిన్ను రక్షిస్తాడులే’’ అని ఆటపట్టించి ట్రక్ దిగేసి డాక్టర్‌తో అతని క్వార్టర్‌కి వెళ్తుంది. చేసేదేం లేక కోపంగా ఆమె సూట్‌కేస్ మోసుకుంటూ తనూ వెళ్తాడు. బహదూర్ డాక్టర్ లగేజ్ తీసుకెళ్తాడు. ఇక్కడితో రేషన్ ట్రక్కుమీద తవాంగ్ ప్రయాణం ముగుస్తుంది. ప్రయాణం పొడుగూతా ఎదురైన అనుభవాలను, సంఘటనలను తనదైన శైలిలో హాస్యస్ఫోరకంగా, సరదా సరదాగా వర్ణిస్తుంది, ముఖ్యంగా డాక్టర్ గురించి.
‘తవాంగ్’ చేరాక తను చూడాలని ఉవ్విళ్ళూరిన, అసలు దాన్ని చూడడానికే ఇంత సాహస ప్రయాణం చేసిన తవాంగ్ మొనాస్ట్రీ గురించి, బౌద్ధ భిక్షుణుల గురించి, లామాల జీవన విధానం గురించి రాసిన అంశాలను రెండో పార్టుగా తీసుకోవచ్చు. ఒక లామా కుటుంబంతో కలిసి ఉన్నప్పటి అనుభవాలు చాలా బాగా రాస్తుంది. టిబెటన్ సంస్కృతి, ఆచార వ్యవహారాలు, వాళ్ళ తిండి తిప్పల గురించి, ముఖ్యంగా ఉప్పేసుకుని తాగే టీ గురించి తను రాసింది చదివి తీరాలి.
బహుశా ప్రపంచంలో ఎక్కడా లేని ఒక ఆచారం, భారతంలో మాత్రమే కనబడే బహుభర్తృత్వం గురించి తెలుసుకుని చాలా ఆశ్చర్యపోతుంది నబ్‌నీత. తాను అతిధిగా ఉన్న లామా భార్య అక్క, చెల్లెళ్ళకు ఇద్దరు, ముగ్గురు భర్తలున్నారని, వాళ్ళంతా చాలా అన్యోన్యంగా కలిసి మెలిసి ఉంటారని వినడంతోపాటు వాళ్ళని చూసినపుడు నబ్‌నీత ‘ద్రౌపదులు’ అంటుంది. ఎన్నో కొత్త కొత్త విషయాలను ఆకళింపు చేసుకుంటూ గొప్ప సాహసంగా మొదలైన తవాంగ్ ప్రయాణం తన తిరుగు ప్రయాణంతో ముగింపుకొస్తుంది. ముఖ్యంగా మెక్‌మహోన్ రోడ్డును మిసెస్ సెహగల్ అనే ఆమె కేవలం పది రోజుల్లో పూర్తి చేయడం గురించి వివరంగా తెలుసుకుంటుంది. చాలా సంభ్రమానికి గురవుతుంది. చైనాకు చెందిన 26 సంవత్సరాల యువ ఇంజనీర్ ఆలోచనకు ఫలితం లాసా మెక్‌మహోన్ రోడ్డు నిర్మాణం. 19000 అడుగుల ఎత్తులో కొండల మధ్య అడవిలో నిర్మితమైన ఆ రోడ్డు చూసిన సంతృప్తితోనే నబ్‌నీత తన పుస్తకానికి ‘‘మెక్‌మహోన్ రోడ్డు వరకు రేషన్ ట్రక్కుమీద ప్రయాణం’’ అని పేరు పెట్టింది.
ఈ పుస్తకం చదవడం పూర్తవగానే నబ్‌నీత దేవసేన చేసిన ఒక సాహసభరితమైన ప్రయాణం గొప్ప ఉత్తేజాన్నివ్వడంతో పాటు ఏకాంతంగా నేను చేసిన ప్రయాణాలు నా కళ్ళముందుకొచ్చాయి. నా ప్రయాణాల్లో నాతో అపరిచిత డ్రైవర్ తప్ప మరెవ్వరూ లేరు. ఎలాంటి ప్లానింగ్‌లు, రూమ్ బుకింగ్‌లు ఏమీ చేసుకోలేదు. ఎప్పుడూ వెళ్ళని కొత్త ప్రాంతాలు, అడవి దారులు, అవతల ఏముంటుందో తెలియని ఉద్విగ్న ప్రయాణాలు నేను చాలా చేశాను. కోయంబత్తూరు నుండి మున్నార్‌కి చేసిన ఏకాంత ప్రయాణం నిజంగా సాహసమే. మహా సౌందర్యం
ఉట్టిపడే ఆయా ప్రాంతాలకు వెళ్ళిపోవాలనే తపన తప్ప ఏమి ఏర్పాట్లు చేసుకోవాలనే దానిమీద ధ్యాసలేని ఒక మైకం కమ్మిన ప్రయాణాలవి.
నర్సీపట్నం నుండి మహారణ్యాల గుండా సీలేరు వరకు చేసిన ఏకాంత ప్రయాణం నేను ఎప్పటికీ మర్చిపోలేను. చిమ్మచీకట్లో అడవిలో, అదీ భయంకరమైన రోడ్డుమీద, నిజానికి రోడ్డేలేదు… చేసిన సీలేరు ప్రయాణం తల్చుకుంటే ఇప్పటికీ నా ఒళ్ళు గగుర్పొడుస్తుంది. ఆ మహారణ్యం మధ్యలో కారు ఆగిపోతే ఏమై ఉండేది? గుర్తొస్తే గుండె రaల్లుమంటుంది. అయినా నా ప్రయాణాలు అలాగే సాగాయి. ఒక పౌర్ణమి రాత్రి రాజమండ్రి నుండి రంపచోడవరం, మారేడుమిల్లి మీదుగా చింతూరుకు చేసిన ప్రయాణం, ఆ వెన్నెల రాత్రి, అడవిలో కురుస్తున్న వెన్నెల, అడవి మధ్యలో కారాపించి వెన్నెల్లో నడిచినప్పుడు గగ్గోలు పెట్టిన డ్రైవర్ కేకలు ఇంకా గుర్తే. ‘‘మేడం గారు! వద్దండి. చాలా పెద్ద అడవండి. చాలా జంతువులుంటాయండి’’ అని చాలా బతిమిలాడాడు. ఇలాంటప్పుడు నా మనసు ఉద్విగ్నంగా ఉండి ఎవరి మాటా వినదు. నా మాట కూడా వినదు. కానీ ఆ అనుభవాలన్నీ ఈ గుండెలో నిక్షిప్తమైపోయి ఉన్నాయి. ఇలాంటి సాహసాలు అవసరమా అంటే కొందరికి అవసరం లేదు. నాకు, నబ్‌నీత లాంటి వాళ్ళకి అవే ప్రాణం మరి. కొంతమందికి ప్రయాణమంటే సవాలక్ష ప్లానింగులుంటాయి. లిస్టులు రాసి పెట్టుకుంటారు. ఒక దారిలో ప్రయాణం ప్లాన్ చేసుకుంటే ఆ దారిలోనే పోవాలి. చిన్న మార్పు కూడా వాళ్ళు భరించలేరు.
నా ప్రయాణాలు, ముఖ్యంగా ఒంటరిగా చేసే ప్రయాణాలు అచ్చం నబ్‌నీత దేవసేన ప్రయాణాల్లాగే ఉంటాయి. మనుష్యుల మీద గొప్ప నమ్మకముంటేనే ప్లానుల్లేని ప్రయాణాలు సాగుతాయి. రాత్రి పదకొండు గంటలకు నేను మున్నార్ చేరినప్పుడు నాకక్కడ ఏ హోటల్లోను రూమ్ బుక్ అయిలేదు. టాక్సీ డ్రైవర్‌కి మున్నార్ పరిచయం కాబట్టి మంచి హోటల్‌కి తీసుకెళ్ళాడు. మంచి రూమ్ దొరికింది. ఆ రాత్రి హాయిగా, ఏ భయం లేకుండా నిద్రపోయాను. నబ్‌నీత డాక్టర్ ఇంటికి జబర్దస్తీగా వెళ్ళి అతని బెడ్‌రూమ్‌లో నిశ్చింతగా నిద్రపోయిన సంఘటన చదివినపుడు నాకెదురైన ఎన్నో అనుభవాలు గుర్తొచ్చాయి. అందుకే నాకు ఆ పుస్తకం అంత నచ్చింది. పుస్తకం నిండా ఆమె వ్యక్తం చేసిన కొన్ని భావాలు, ఆలోచనలు ముఖ్యంగా హాస్యం, వ్యంగ్యం భలేగా ఉన్నాయి. చాలాకాలం తర్వాత ఓ చక్కటి ప్రయాణానుభవాన్ని, అంతే చక్కగా రాసిన పుస్తకాన్ని చదివాను. బహుశా చాలామందికి, ముఖ్యంగా పర్‌ఫెక్షనిస్టులకి, అనుమాన పక్షులకి, ఆర్గనైజ్డ్‌గా ఉండాలనుకునేవారికి ఈ పుస్తకం నచ్చదు. ఆడకూతురేంటి అంతలా బరితెగించి రేషన్ ట్రక్కులో, ముక్కు మొఖం తెలియని మగాళ్ళతో కలిసి ప్రయాణం చేయడమేంటి? అపరిచిత డాక్టర్ రూమ్‌లో భయం, భక్తి లేకుండా అలా నిద్రపోవడమేంటి? ‘‘ఏమైనా జరిగుంటే…?’’ ఇదే సమస్య. ఏదో జరుగుతుంది? ఆ లారీలో ఉన్నవాళ్ళంతా ఆమెని అడవుల్లోకి లాక్కెళ్ళి సామూహిక అత్యాచారం చెయ్యరా? డాక్టర్ ఏ రాత్రో ఆమె మీద పడడా? ఇలాంటి చెత్త ఆలోచనలు బుర్రని ఆక్రమించడం వల్ల దాన్ని మించి ఆలోచనలు సాగవు కొందరికి.
కానీ నబ్‌నీత దేవసేన మనసులో ఈషణ్మాత్రం కూడా తన తోటి ప్రయాణికుల పట్ల సందేహాలు, అపనమ్మకాలు లేని మానవీయ దృక్పథం ఉండడం వల్ల ‘‘తవాంగ్’’ ప్రయాణాన్ని రమణీయంగా మలుచుకుని అద్భుతానుభవాలు పొందగలిగింది.