నో రూమ్‌ -కాళీపట్నం రామారావు

వెన్నెల పిండి ఆరవేసినట్లు లేదు. నగరం కొత్తగా ఉంది…
అత్తవారి ఇల్లులా.
‘‘రూమ్‌ కావాల.’’
‘‘సింగిలా, డబులా?’’

తగిన వ్యవధిలో జవాబు రాకపోయేసరికి తలెత్తి చూసేడు ఒంటి కంటి గుమస్తా.
అతడి మసక కంటికి నూకరాజు వేషం హనీమూన్‌ పెండ్లి కొడుకు వేషంలా కనిపించలేదు. పక్కనున్న పల్లెపిల్ల కన్నెపిల్లలా కనిపించింది. రెండో కంటితో ఎంత వెతికినా పెట్టె, బెడ్డింగ్‌, కనీసం చేతి సంచైనా కనిపించలేదు.
కాబట్టి,
‘‘లేదు.’’
‘‘ఏఁవిటి?’’
‘‘రూమ్‌ లేదు’’ అన్నాడు గుమాస్తా.
అంతఃపురద్రోహిగా అనుమానించి చిన్న ఇంటి పెద్దవీరుని అటకాయించే రాజుగారి బావమరిదిలా.
తను చేయబోయిన ప్రభుద్రోహమేమిటో తెలియలేదు నూకరాజుకి. క్షణకాలం నివ్వెరపడి నించున్నాడు. తరువాత ‘మధ్యలో ఈ కూసుగాడెవడు’ అనిపించగా కోపం ముంచుకొచ్చింది.
కాని ఆసరికే గుమాస్తా బుట్ట క్రాఫింగ్‌ ముందుకు వంగి కూడికల లెక్కల్లో కూరుకు పోయింది. నూకరాజు వేడి కళ్ళలోంచి వచ్చే వాడి చూపులు వాడి ఆఁవదం తలమీద జారిపోతుండడం గమనించి పక్కనున్న దేవుళ్ళ మీదికి తిప్పేడు. దేవుళ్ళ కళ్ళల్లో అతడికి ఢీకొనడానికి ఏమీ కనిపించలేదు. అతడు వేసుకొన్న కాకీ గుడ్డలు అతడిలాగే నలిగి నలిగి చిరగడానికి సిద్ధంగా ఉన్నాయి. అతడి మూపురం కాడిని మోసి మోసి కాయలు పక్కలకు జార్చుకుంటున్న ముసిలి ఎద్దు మూపురంలా ఉంది. గుమాస్తా మీద కోపం అతడి దగ్గరకు వచ్చేసరికి అసహ్యంగా మారిపోయింది. ‘‘టక్‌ టక టక’’మంటూ బూట్లూ మెట్లూ కొట్లాడుతుండగా వీథిన పడ్డాడు నూకరాజు. అతని వెంటనున్న అమ్మడు అతడి నీడలాగే అడుగులు వేసుకుంటూ వెంట నడిచింది.
‘‘ప్రతి తొత్తుకొడుక్కూ ఇదో వేషమైపోయింది.’’
గుమాస్తా ఎవర్ని తిట్టాలన్నా వాళ్ళు వెనుతిరగ్గానే తిడతాడు. వాళ్ళు తిరిగి వచ్చి తంతారన్నట్టు భయపడిపోతాడు దేవుడు.
‘‘ఆడెవడంటావ్‌?’’
దేవుడికి తెలియదు. అయినా గుమాస్తా ప్రశ్నడిగేక ఏదో ఒక జవాబివ్వటం అతనికి అలవాటు.
‘‘ఆడెవడో నాన్చెప్పలేను గాని ఆ పిల్లదాయి మాత్రం ఆడికి పెళ్ళఁవే.’’
‘‘నువ్వాళ్ళ నెరుగుదువా?’’
‘‘నా నెరగను. ఆ పిల్లదాని మెడలో తాళిబొట్టుంటే అన్నాను’’ నానుస్తూ అన్నాడు.
‘‘అందరి మెడలోనూ ఉంటుంది తాళిబొట్టు! అది ఆడే కట్టిందని దానిమీద రాసుందా?’’
‘‘నువ్వు కట్టిన్దాని మీద మాత్రం రాసి కట్టినావురా నాయాలా?’’ అనుకున్నాడు దేవుళ్ళోని దేవుడు. బయటకు మాత్రం ఏ మాటా అనకుండా తుండుగుడ్డ దులిపి భుజాన వేసుకున్నాడు.
భోజనానికి బయల్దేరిన దేవుడు మెట్లు దిగేసరికి మొదటి ఆట సినిమాలు చూసిన, రెండో ఆట సినిమాలకు పోయే జనంతో కార్లూ, బస్సులూ, రిక్షాలుగా ఉంది రోడ్డు. ఎదురుగా రోడ్డు కవతల కిళ్ళీకొట్టు మీద జనం పురుగుల్లా మూగుతున్నారు. నల్లగా నీడల్లా ముసిరే జనం. తెల్లగా వెన్నెలకన్నా తెల్లగా కురిసే వెలుగు! ఆ పిల్లదీ, పిల్లోడూ అక్కడే ఉన్నారు. అక్కడ మూగే జనంవంక అబ్బురంగా చూస్తూ నించున్నది అమ్మడు. ఆ కుర్రాడి చూపులు ఇంకా లాడ్జింగ్‌ హౌస్‌ మీదే ఉన్నాయి ‘పాపం’ అనుకున్నాడు దేవుడు.
భోజనమై చుట్ట వెలిగించి చంకన దుప్పటి గుడ్డా, తలని తువాల చుట్టతో దేవుడు గుడిసె వెలువడేసరికి వెన్నెల జామున్నర పొద్దెక్కి కురుస్తున్నది. చుట్టూ ఓసారి చూసి పదిన్నరవ్వాలనుకున్నాడు దేవుడు. అతడు మున్నూట అరవై రోజులూ, ముప్పొద్దులా బయటికి బయలు దేరినప్పుడల్లా టైము అంచనా కడుతూనే ఉంటాడు. దొరికినచోటల్లా గడియారంతో సరి చూస్తుంటాడు. సాధారణంగా అతని అంచనాలు తప్పు కావు. కై రాత్రి మెట్టమీంచి క్రింద వెలుగుతున్న నగరాన్ని చూశాక ‘అంతే పదిన్నర’ అని ధ్రువపరచుకొన్నాడు మరోసారి. ఆ మెట్ట ఊరికి చివర ఉన్నది. దానిమీద పాకలు దాటేక బంగళాలే తప్ప ఊరులేదు. పడమట సరిహద్దుకి మైలు దూరంలో పెద్ద ఫ్యాక్టరీ వెనుక చిన్న కాలనీలు ఉన్నాయి. ఫ్యాక్టరీ నుంచి టౌనులోకీ, అటు వాయవ్యం మూలగా రైల్వే కూడలికీ మెలికలు తిరుగుతూ పోయే రోడ్లమీద దగ్గరౌతూ ఊర్లోకొకటీ, స్టేషనుకొకటీ రెండు లారీలు కావోలు పరుగెడుతున్నాయి. ఇళ్ళల్లో చాలా వరకు లైట్లు ఆరిపోయేయి. నగరం చీకటి మాసికల్లా, వెలుతురు చారికల్లా కనపడుతోంది.
అడుగులో అడుగు వేసుకొంటూ దేవుడు లాడ్జింగ్‌ హౌస్‌ చేరేసరికి ఎలా లేదన్నా పదకొండూ పదకొండుం పావు అవుతుంది.
నడుస్తూ ఉన్న దేవుడి కెదురుగా ఓ జంట గబ గబా వస్తున్నారు. ఊరికి దక్షిణపు చివర హాలు నుండి వస్తున్నారనుకున్నాడు దేవుడు. ఆ ఆడమనిషి చేతిలో ఒక చంటిపిల్లా, అతగాడి భుజాన మూడేళ్ళ కుర్రాడూ ఉన్నారు. నెమరుకు వచ్చిన హాస్య సన్నివేశాలనన్నిట్నీ పెద్ద గొంతుతో వర్ణిస్తోందావిడ. ఒక వంక నడకలో ఆయాసం, రెండవ వంక మనసానందం, ఉక్కిరి బిక్కిరవుతోంది.
‘‘ఆ కుర్రదీ, కుర్రోడూ ఏమైనారో?’’ అనుకున్నాడు.
ఇంకో లాడ్జిలో ఎక్కడో గది సంపాదించుకోవచ్చుÑ దొరక్కపోతేÑ ఉన్న ఊరు వాళ్ళైతే రెండో ఆట సినీమా ఏదేనా చూసుకొని రిక్షా యెక్కీవచ్చు. పొరుగూరు వాళ్ళైతే తెల్లార్లూ ఏ సత్రవ్‌ అరుగు మీదో గడపాలి పాపం.
‘‘ఈ కాలపు కుర్రోళ్ళు పూర్వపోళ్ళలా మరీ మాలోకాలు కార్లే’’ అనుకున్నాడు దేవుడు.
దేవుళ్ళకు ఈ కాలంలో కుర్రాళ్ళలో కనిపించే చొరవా, బతకడంలో వాళ్ళకుండే సరదా చూస్తే చాలా ఇష్టం. ఏ అయిలింజన్లలో పనిచేసినా, ఏకాడ కూలి బతుకు బతికినా, ఆదివారం వచ్చేసరికి ఆ మురికి గుడ్డలొదిలేసి మడత గుడ్డల్లో దూరిపోతారు. ఆనాడు వాళ్ళింక మహారాజు కొడుకులో, మార్వాడీ మనఁవలో పోల్చుకోలేం. రోజల్లా క్లబ్బులూ కబుర్లూ, ఆటలూ పాటలూ, పొద్దోతే సినీమాలు, బేడాపరక టిక్కెట్టుగాడు కూడా దొరకడం నేదంటే, ‘మేడమీది టిక్కెట్టు కొయ్యెస్‌’ ` అంటాడు, రేపు తనది కాదన్నట్టు.
పోతిరాజు అన్నది అక్షరాలా నిజం అనిపిస్తది దేవుడికి.
కూలోడు కూడబెడితే మేడగడతాడన్నది జరగని పని. ఎన్ని ఏకులు వడికితే బూబమ్మకు పోగులొస్తాయి ` అని సావెఁత. అందుచేత ఉన్నదాంట్లో, దొరికిన కాడికి అనుభవించిందే ఆడికి దక్కుడు. ఈ సంగతి తెలిసీ తనవంటి వారికి చెయ్యాలంటే చేతులు రావు. పోతిరాజులూ, ఆడిలాంటి కుర్రోళ్ళూ సాహసవంతులు.
పోతిరాజు అంటే ఇప్పుడు దేవుడు పనిచేసే లాడ్జింగు హౌస్‌ కట్టిన మేస్త్రీల్లో ఒకడు.
పేరుకు ముసలి మేస్త్రీని పెద్ద మేస్త్రీ అనేవోరు కాని అసలు పని పురమాయింపూ, అజమాయిషీ అంతా పోతిరాజుదే.
నిండా ముప్ఫై ఏళ్ళుండవు. కాని ఆడికి పనెంత బాగా తెలుసో మనుషుల్చేత పని చేయించుకోవడం అంత బాగా తెలుసు. సమయం వొచ్చినప్పుడు ఆళ్ళనంత వెనకేసుక వచ్చీవోడు. పెద్ద మేస్త్రీ కాదు ` కాంట్రాక్టరైనా ఆడే యీడికి జడాలన్నది ఆడి తాలూకా రూలు. ఈ లెంజకొడుకుల్కి మనం తలొంచేదేందిరా? మనం ఆళ్ళని పెంచుతున్నాఁవా, ఆళ్ళే మనని పెంచుతున్నారా ఆలోచించు. ఈ మేడే వుంది. మీరూ, మేఁవూ, ఈ కంట్రాక్టరు గాడిదికొడుకూ కలిసి కడతన్నాం. పూర్తయిన్నాటికి నీ దగ్గిరేం మిగులుద్దిÑ నా దగ్గిరేం మిగులుద్ది? కంట్రాక్టరుకంత మిగలాలంటే ఎవడెవడిక్కావాలి? నువ్వో నేనో మరింకొకడో కూలోడుంటే అప్పుడు కంట్రాక్టరున్నాడు, ఆడు లేకపోయినా పని కావలసిన గాడిద కొడుకులు అత్తెల్సినోళ్ళ దగ్గరికీ వొళ్ళొంచి అది చేసీ వోళ్ళ దగ్గరకీ రావలసిందే.
అందుచేత ఆ గాడిదకొడుకే మనకి జడవాల!
ఇదే కాదు ` పోతిరాజు వోదనలన్నీ యిలాగే ఉంటాయి.
కాని ఆడి యజమాని ఆడికన్నా లోకం చూసినోడు. ఈడి సంగతి పసిగట్టగానే ఈడెనక తైనాతీగా మనిషినుంచేడు. ఆడు టీ అంటే టీ, టిపినంటే టిపిన్‌, సిగిరెట్టంటే సిగరెట్టు పేకెట్లు, రెడీగుండాలన్నాడు. వొచ్చినప్పుడల్లా పిన్నా పెద్దా ముందు ఆడినీ, ఆడి పనోడితనాన్నీ మెచ్చుకునే వోడు. ఒకపాలి మేడమీద ఎంటిలేటర్లలో డిజేన్లు సెక్కుతూ భోజనం కూడ మానుక్కూసున్నాడు పోతిరాజు. సింహాలని ఓ ఆడ గుంటుండేది. అది మా కాన్ది. అదన్నదిగదా `
‘‘ఔనయ్యా మేస్త్రీ, నువ్విన్ని కబుర్లు సెపతావు గదా. నీకీ టీలు, టిఫెన్లు, సిగిరెట్లూ, గిగిరెట్లూ ఉబ్బరగ ఎందుకందుతున్నాయో తెలీదా?’’ ‘‘నేను యీడిచ్చే టీల కోసం, టిఫెన్ల కోసఁవే ఈ పనంతా సేస్తన్నానటే! అలాగే అనుకుంటే ఆ యిచ్చినోడు యెంత యెర్రి మొకవో, నువ్వూ అంత యెర్రి లెంజవి…’’
అంటూ సిగరెట్‌ ముట్టించి తలెత్తి పొగ దాని మొగమ్మీదికి ఒదుల్తూ అన్నాడు.
‘‘మేస్త్రీకింత రేటని ఆడిస్తాడు. ఆడిచ్చిన దానికి సరిపడే నేను నా పనీ యివ్వొచ్చు. కాని నేనంతకన్నా కరీదైన పని చెయ్యగల్ను. నా పనికి ఇలవకట్టి ఇచ్చే గాడిదకొడుకు లేడు. మరేం జేసుకోవాల? నా పని దాసుకోవాల. దాసుకుందును. రేప్పొద్దున సూసిన గాడిద కొడుకులికి ఆడి పిసినారితనం కనపడదు. నేను సేతకానోణ్ణి అనుకుంటారు.
అదే పనోడికి, పని చేయించుకునే వోడికి తేడా.
ఈ మేడే వుంది. రేప్పొద్దున ఇందలో లాడ్జింగ్‌ యెడతారట. అందరిచ్చిందాని కంటే అర్ధో, రూపాయో ఎక్కువిస్తానుÑ నన్నోరాత్తిరి కిందల తొంగోనియ్‌ అను. నీ నిలువెత్తు దనం ఇచ్చినా నువ్వు కూల్దాని గున్నంత కాలం ఇందల అడుగెట్టనియ్యరు.
ఆడి సొత్తు ఆడు నీ కందకండ దాయగలడు. నువ్వలా దాయలేవు. పనోడితో వొచ్చిన సావే అది.
అలా అసురుసురుమంటూనే పోతిరాజులు చేసిన పని జయమయింది.’’
కంట్రాక్టర్ని తొండల్తోలి తోలి, మేస్త్రీలను వుబ్బేసి, బతిమాలీ, రాత్రీ, పగలూ, దీపాలు పెట్టీ, కూలీలను బెదిరించీ, బుజ్జగించీ, కొత్తాఁవాసకు తెరుస్తారా తెరవరా అనుకున్న లాడ్జింగ్‌ సంకురాత్తిరెళ్ళగానే తెరిపించేసేడు.
అలాగా, ఇలాగానా? వూరు వూరంతా మోత మోగిపోయింది!
ఆ గచ్చులేటి, ఆ పూతలేటి, ఆ పెయింట్లేటి, రంగు రంగుల గోడలేటి! పాలరాతి బొమ్మలతో, కుండీల్లో పువ్వులతో, గోలేల్లో మొక్కలూ, మంచాలూ, పరుపులు, రంగురంగుల దీపాలు, డాబా మీద తోటలు ` ఓ యెలుగు యెలిగించేసినారు కొంతకాలం. తరవాత్తరవాత ఈదికొక లాడ్జింగు లెగిసిపోయింది. ఆ మద్దె యజమాని కూడా పోయేడు. పెత్తనం గుమాస్తాచేతా, యజమాని బామ్మరిది పాలా పడ్డది. అయినా ఇంగువ కట్టిన గుడ్డ! బిజినేసు మరీ డల్లయ్‌ పోలేదు. దేవుడి తలంపు మళ్ళీ జంట వేపు పరిగెత్తింది. గుమాస్తా గాడి నీలుగుడికి కారణం బిజినెసు ఇంకా కొంత బతికుండటమే. పాపం, ఆ కుర్రోడు ఎయ్యగలిగిన కాడికి ఏషం బాగానే యేసినాడు. నల్ల పేంటేసి అంతకన్నా నల్లని బూట్లేసినాడు. తెల్ల టెర్లీను కమీజు టకపు సేసి కమీజు సేతిమీంచి రిస్టువోచి తగిలించినాడు. నున్నగ దువ్విన క్రాపు అక్కడ కొచ్చే ముందు జేబు దువ్వెనతో దువ్వుండాల. ఏసం గీసం అన్నీ బాగానే వున్నాయి. కాని బాగా లేంది కూడా ఏదో ఒకటి ఉండుంటాది. రెండు కళ్ళలో ఒకటి గుడ్డిదైనా గుమాస్తాగాడు, సూడగానే దాన్ని పట్టేసినాడు.
దానికితోడు ఆ బుల్లెమ్మది మరీ సత్తెకాలం వోటం. అంతా కలిపితే ఆ పిల్లకు పదారేళ్ళుండవ్‌. కట్టూ, బొట్టూ, పెట్టుకున్న నగలూ ` ఒక్కటీ యీ కాలంది కాదు. అంత ముస్తాబులో ఎప్పుడూ లేదు. కాని పెళ్ళీడు రోజుల్లో పెద్దమ్మీ, అంతకన్నా ఒడికట్టుకోకతో కాపరాని కొచ్చినప్పుడు అప్పాయమ్మా అచ్చం యిలాగే వుండోవోరు.
పెద్దమి ఇప్పుడే రాజ్జంలో వుందో తెలీదు. అప్పాయమ్మ ఈ లోకంలోనే లేదు.
చూపులకు కరవైన ఆ యిద్దరి స్మృతితో దేవుడి గుండె ఇరువైపుల నుండి ఇనుప హస్తాలతో అదుమబడుతున్నట్టు నలిగిపోయింది.
తమదేం పుట్టుకోగాని ఒక ఇంటినుండి ఇంకొక ఇంటికి సుఖపడాలని వొచ్చే ఆడకూతుళ్ళను ఆవగింజల అరవంతైనా సుఖపెట్టలేరు. అప్పాయమ్మను తను కూడా చాలామందిలా యెన్నెన్నో బాధలు పెట్టేడు. చిన్నప్పుడల్లా తెలీక, గొప్పకోసం ` ఆఁ అంటే తప్పు ` ఊఁ అంటే తప్పు, లెగిస్తే తప్పు, కూకుంటే అంతకన్నా తప్పు ` కొట్టీసీవాడు.
కొంచెం పెద్దయ్యాక సంసారం బరువు మొయ్యలేక, చాలినంత డబ్బు తేలేక, తెచ్చిం డబ్బుతో తాగేసి ` ఒక చుట్టాలొచ్చినా, ఈదిలో తగువులు పడినా, సంకటాలొచ్చినా, దానికే ఏ కాలో చెయ్యొ నొచ్చినా, ఒక మంచనక, చెడ్డనక పండుగే అవనీ, పున్నఁవే కానీ, ఓపలేని మనిషి! పచ్చి పురటాలు! అనకుండా చేతికేది దొరికితే దానితో బాదీవోడు.
ముసిల్దీ, ముసిలోడూ అడ్డే లేకపోతే తను పెట్టిన బాధలకి అది యెప్పుడో ప్రాణాలొగ్గేసును.
తరవాత్తరవాత తను మారేడు. ఎప్పుడు? ఎలా? అంటే చెప్పలేడు.
అమ్మా, అయ్యా ఏడాత్తేడాతో ఒకళ్ళ యెంబడి ఒకళ్ళు పోయేరు. ఆళ్ళు పోకముందే తనకోసారి పెద్ద జబ్బు చేసింది. ఆ మరుసటేడే పెద్దమ్మి ఎందులోనో పడి చచ్చి పోయిందన్నారు. దాని అత్తోరు, కిట్టనోళ్ళు, ఎవరితోనో లేచిపోయిందన్నారు. ఆ తరువాత అప్పాయమ్మకి పెద్ద ఖాయిలా చేసింది. ఇన్నీ నాలుగైదేళ్ళలో జరిగాయి.
ఈటన్నిటి తరవాత ఎప్పుడేనా కసురుకున్నాడేఁవోకాని ఎన్నడూ చేయి చేసుకోలేదు. దానికి ముప్ఫై యేళ్ళు దాటేక తను నలబయ్యోపడి తొక్కేక ఐదారేళ్ళు ఏం సుఖపడ్డారో పడ్డారు. బ్రతికినంత కాలానికీ అదే సుఖం.
అదేనా ఎంత? తీరీ తీరని కోరికలు!
చచ్చిపోయే ముందు ` జబ్బుకీ, తిరగేతకీ మధ్య ` వాళ్ళోపాలి కలుసుకొన్నారు అంతా అయ్యేక అప్పాయమ్మ,
‘‘ఒక్క మనసు తీరిపోతే నానింక సచ్చిపోయినా తకరారు నేదురా’’ అంది స్వగతంలా.
గుడిసెలో తెర కవతల గుడ్డిదీపం వెలుగుతోంది. అసలే ఆ దీపం గుడ్డిది. అప్పాయమ్మ అవసరానికై దాన్ని మరీ తగ్గించేసింది. అందుచేత దేవుడికి ఆమె ముఖం కనబడలేదు. కళ్ళు మాత్రం తళతళ మెరుస్తున్నాయి.
‘‘ఏటే’’ అంటూ దేవుడు కదులాడేసరికి కాళ్ళకాడి అంట్లగిన్నెలు దడదడలాడేయి.
అప్పాయమ్మకి అలాట్టయిములో చప్పుళ్ళంటే చచ్చినంత బెంబేలు. చప్పున లేచి కూర్చొని చింకి తెరకున్న ఒక చింకిలోంచి అవతల పక్కకి చూసింది. అదురుష్టం బాగుండి అవతల పిల్లలెవరూ లేవలేదు.
‘‘రేపు సెపతానులే’’ అంటూ లేచిపోయింది.
జుట్టురేగినా, పెట్టిన మెట్టకొప్పు వీడిపోలేదు. చెమటకు తడిసినా నుదుటి మీది కుంకంబొట్టు చెదిరిపోలేదు. మొహం తుడుచుకున్నప్పుడు పెట్టుకున్న కాటిక మాత్రం చెదిరిపోయింది. గెడ్డంతో పైట కరచిపెట్టి రైక తొడగబోతుంటే దేవుడు ఎడం చెయ్యట్టుకు గుంజేడు. ‘అమ్మ!’ అని చతికిల పడిరది. అప్పాయమ్మ ఒప్పుకోలేదు గాని ఆమెకు ఏ నడుమో చాలా నొచ్చే వుంటుంది.
మరికొంతసేపు మళ్ళా మళ్ళా బతిమలాడగా ‘‘బయటకు పద, సెపతాను’’ అంటూ చప్పున ఒళ్ళోంచి లేచిపోయింది.
ఎన్నెల ఈనాడంత బాగా లేదానాడు. ఎటుజూసినా నిద్రమత్తులో వుంది లోకం.
గుడిసెలో దీపం పెద్దది చేసి, అవసరానికి కట్టిన తెరలూ గిరలూ తీసేసి దేవుడికి బయటా, తనకు లోపలా పక్కవేసింది. పిల్లలకు కప్పిన చింకిగుడ్డలే చిరుగులు సరిచేసి కప్పింది. వచ్చి గుమ్మం దగ్గర వత్తిగిలి కూచుంది. వాళ్ళు కాపరమంటూ ఆరంభించి ఇరవై సంవత్సరాలు గడిచేయి. అమ్మా, అయ్యా ఒకరి తరువాత ఒకరు పోయేరు. అయ్య పక్కేసుకు పడుకునే మంజూరు చీడీ అప్పుడు కాళీ అయింది. ఒక మంచానికి సరీగా సరిపోతుంది ఆ చీడీ. కాని అయ్య మంచం అయ్యతోనే పోయింది. దేవుడు నేలమీదే పడుకుంటాడు.
అయినా గోనిగుడ్డమీద, విశాలంగా, ఒక్కడే, కాళ్ళు కొసంటా చాపుకొని, చింకిచీర ముక్కయినా పంపకాలు లేకుండా కప్పుకొని పడుకుంటే తల దగ్గర గుమ్మానికి చేరబడి అప్పాయమ్మ కబుర్లు చెపుతూ వుంటే చల్లగా మెల్లగా తెరలు తెరలుగా నిద్దర దిగివచ్చి కళ్ళు మూస్తూ వుంటే మనిషికింకేం కావాలి అనిపిస్తుంది దేవుడికి. కాని ఆ మహా సుఖమైనా రోజూ లభించదా దేవుడికి.
అప్పాయమ్మ నల్లుల కోసరం వీపు తడుముకొంటుంటే, ‘ఇప్పుడు సెప్పు’ అన్నాడు దేవుడు ` ఆమెకేసి ఒత్తిగిలి తిరుగుతూ.
కొంచెంసేపు నల్లుల్ని వెతుక్కుంటూ, నసిగి కొంతసేపు, ‘ఆ తరువాత రా’ అంటూ మురిపించి, మరికొంతసేపు సిగ్గులు పోయేక అన్నది… ‘ఒక రాత్రల్లా ఇడవకుండా ఒకే పక్కమీద నీతో పడుకోవాలని వుందిరా!’ అన్నది జాలిగా.
మొదటి సగం స్పష్టంగా వినడంవల్లే రెండో సగం బోధపడిరది దేవుడికి. ఇది ఇటు జరుగుతుండగా మనిషిలో చైతన్యం తలనుండి పాదాలకూ, పాదాలనుండి తలకూ పరుగులు తీసినట్టయింది. ఆ తరువాత దేవుడి కంటి ముందు ఎన్నో బొమ్మలు స్పష్టాస్పష్టంగా పరుగులెత్తేయి. అప్పాయమ్మ కాపురానికి వచ్చింది మొదలు నేటిదాకా వాళ్ళు ఒంటిగది గుడిశల్లోనే అద్దెలకున్నారు. మూడు రాత్రుళ్ళూ, ఆ కొత్త రోజుల్లోనూ తప్ప ఏకాంతం ఎక్కడుంటుందో ఎరగరు.
ఆదిలో అప్పచెల్లెళ్ళూ, అన్నదమ్ములతో పదిమంది. ఆ తరువాత వాళ్ళ పిల్లలూ, తమ పిల్లలూ వచ్చేరు. ఇప్పుడు తామూ, తమ పిల్లలే పదిమంది వున్నారు. అందులోనే అలాంటి చిన్న కొంపల్లోనే మూడేసి జోడీలు, నాల్గేసి జోడీలు వంతులేసుకు సర్దుకొన్న రోజులున్నాయి. పురుళ్ళతో, సంకటాలతో పిల్లాజల్లా కుమ్ములాటల్తో మనుష్యుల మీద మనుష్యులు. మంచం కిందా, మీదా పక్కలేసుకొన్న రోజులున్నాయి. ముందూ వెనకా భయంకరమైన అంటువ్యాధులతో, పైనా, అడుగునా నీళ్ళూ, బురదా ఓడుతుండగా ముడుచుకొని, కూచొని, వడ వడ వడుకుతూ, వెలిపిరికి తడుస్తూ, మార్చ గుడ్డలేకుండా, గడిపిన రాత్రులూ పగళ్ళూ వున్నాయి.
ఒంటిమీద గుడ్డ కానకుండా, సగం నిద్రమత్తులో, మళ్ళా నిద్రలేచి, జాగరణాలు చేసీ చేసీ, దీపాల్‌ గపుచుప్‌గా ఆర్పేసి, తప్పనప్పుడు బాగా తగ్గించేసి, చీకటి తెరలూ ` గోనెపరదాలూ ` తడికలూ ` మంచాలూ చాటున భయం భయంగా బితుకు బితుగ్గా, ఎవరో చెయ్యరాని వారితో ఏదో చెయ్యరాని పని చేస్తున్నట్టు ` అసహ్యాలు దిగమింగుకొని, చల్లారీ చల్లారని నరాల తీపులతో, కుట్టే నల్లుల్నీ, ముసిరే దోమల్నీ, జుమ్ముమనే ఈగల్నీ నలిపికొట్టి తోలుకుంటూ, పిల్లల రొచ్చుల్లో, పెద్దల రోతల్లో, చుట్టూరా కంపులే ఇంపులుగా యింతకాలం జీవనవ్యాపారం సాగిస్తూ వచ్చారు వాళ్ళు. దేవుడు ఎప్పుడూ గమనించలేదు. అయితే అప్పాయమ్మకూ మనసులున్నాయన్నమాట!
కడుతూ కడుతూ వున్న ఇళ్ళముందు చూస్తూ నిలుచుండి పోయేది అప్పాయమ్మ. పెద్ద పెద్ద ఇళ్ళను ` ఎంతెంత పేద్ద ఇళ్ళో అన్నట్టు చూసేది. ఒకసారి ఒక పెద్దింటివారి బవంతికి సున్నాలు వెయ్యటానికి వెళ్ళి పది పదిహేను రోజులు అదేపనిగా దానిని వర్ణించింది. అందులో తన లెక్కకందని గదుల్ని, ఆ గదుల్లో వుండే విలువైన అలంకారాల్నీ, అతి మెత్తని పట్టు పరుపుల్నీ, సుతిమెత్తని సోఫా సెట్లనూ, వాటి పరిశుభ్రతనీ, వాటన్నింటినీ అనుకూలంగా వాడుకోగల నాజూకైన మనుషుల్నీ, మళ్ళా మళ్ళా ఎన్నోసార్లు వర్ణించింది.
ఇంకొకసారి ఓ పేద్ద ఇంటిని గురించి చెప్పి, అందులో ఆడమనిషికి ఒక పెనిమిటీ, ఇద్దరు పిల్లలూ తప్ప ఇంకెవ్వరూ లేరంది.
తలుపులకు తాళాలు వేసుండే ఇళ్ళుÑ మనుషులు వుండకుండా పాడు పడుతున్న భవనాలు గురించి ఆమె మాటాడినట్టు లేదు. ఏనాటికయినా రెండు గదుల కమ్మ ఇల్లు కట్టుకోవాలనే వుద్దేశం చాలా పెద్దకోరిక అని తెలుసుకొని ఇప్పుడు వదిలేసుకున్నట్టుంది.
ఇప్పుడీమెకు వున్న కోరికల్లా ఇదన్నమాట!
జాలిగా, చాలా సానుభూతితో ఆమె కోర్కెను తీర్చే ఉపాయం కోసం అన్వేషించాడు దేవుడు. కాని ఎంత వెతికినా, దేవుడికి ఆనాడు ఏ ఉపాయమూ కనిపించలేదు. ఎప్పుడో ఒకప్పుడు ఆ మాత్రం అవకాశం దొరక్కపోతుందా అనుకునేవాడు కొంతకాలం. ఇంతలో ఒకనాడు అప్పాయమ్మ హరీ మనేసింది ` అన్ని కోర్కెలకూ అతీతంగా. దేవుడు కళ్ళు చెమ్మగిల్లకపోయినా ఒక దీర్ఘనిశ్వాసం విడిచేడు ` అప్పాయమ్మ జ్ఞాపకానికి. పేదతనమంత ఘోరమైనది యీ ప్రపంచంలో ఇంకేదీ లేదు అనుకున్నాడు ` అప్పాయమ్మను తలచుకొంటూ. పేదతనమంత క్రూరమైనది ఇంకేముంది? అనుకున్నాడు ` ఆ జంట తలపున పడగా. ఆసరికి నడుస్తున్న దేవుడు మెయిన్‌ రోడ్డున పడ్డాడు. మార్కెట్‌ రోడ్డుకు ఇరువంకలా భవనాలు విందులు కుడిచి విశ్రమిస్తున్న భూతాల పంక్తుల్లా వున్నాయి. ఆ టైముకి వెన్నెల పిండార పోసినట్లుంది. నిర్మలమైన నీలాకాశంలో చంద్రుడు వెలిగి వెలిగి పడి పోతున్నాడు.
రోజూలాగే నగరం మూడు సినిమాహాళ్ళ కూడలిలో పచారీ ఫలహారశాలలు మూగుతున్నాయి. వాటి పెట్రోమాక్సు లైట్ల కాంతిలో వెన్నెలలూ, విద్యుద్దీపాల కాంతులూ వెలవెల పోతున్నాయి. వాటి మధ్య అటూ ఇటూ ఎడంగా మనుషులు నీడల్లా వెలుతురు డాగుల్లా కదులుతున్నారు. ఈసురోమంటూ వచ్చిన రిక్షాలు ఇటూ అటూ కదిలి క్యూల్లో సర్దుకుంటున్నాయి.
… … …
చూసి చూసి ‘ఇంక ఆశ లేదు, కాక లేదు’ అనుకొన్నాక నూకరాజు దక్షిణ దిశగా బయలుదేరాడు. బయలుదేరే ముందు అతని మనసులో ఏమున్నా బయలుదేరేక అతడిలో భూమీ, భూలోకం పట్టనంత కసి పోగులు పడుతున్నది.
అతడికి ఇలాంటి అనుభవాలు ఇంతకు ముందు రెండున్నాయి.
ఒకసారి నెహ్రుగారి పుట్టింరోజు పండుక్కి ఆటలు వగైరా పోటీలు జరిగేయి. అప్పటికి అతడు రెండవ ఫారం చదువుతుండేవాడు. వాళ్ళ డ్రాయింగు మాస్టరు మంచి చొరవ గల మనిషి. నూకరాజునీ, ఇంకో ఇద్దర్నీ డ్రాయింగు పోటీకి పట్టుకపోయేడు. అక్కడకు వచ్చిన వారిలో ఎక్కువ మంది పిల్లలు. పెద్ద పెద్ద ఆఫీసర్ల పిల్లలు. చాలా మంది డబ్బున్న వాళ్ళ పిల్లలు. నూకరాజుకి డ్రాయింగులో ఫస్టు ప్రైజు వచ్చింది. సభాప్రారంభానికి ముందు ప్రైజులు వచ్చిన వాళ్ళందర్నీ ముందు వరసలో నిలబట్టేరు. టెరిలిన్‌ జుబ్బాల మధ్య, నైలాన్‌ సాక్సు పంక్తిలో పచ్చగా మీగడ తరకల్లా నున్నగా ఉండే రబ్బరు బొమ్మలమధ్య, నల్లగా మాసిన కాకీ నిక్కర్లో రంగువెలిసి తెగ మాసిన చారల కమీజులో, తన కళ్ళకే తను దిష్టిబొమ్మలా కనిపిస్తున్నాడు. పంక్తిలోంచి బయటకు రాబోతే డ్రాయింగు మాస్టరు పడనివ్వలేదు.
బహుమతులు ఇవ్వడం ప్రారంభమయింది. ఆనాటి అధ్యక్షుడెవరో తనకు గుర్తులేదు. ఎవడో పెద్దవాడే అన్నది గుర్తున్నది.
ఆయన బహుమతులు అందుకునే వారిలో కొందరితో ఫోటోలు దిగుతున్నాడు. కొందరి బుగ్గల మీద చిటికెలు వేసి చిరునవ్వులు చిందిస్తున్నాడు. మరికొందరి తలలో చేయిపెట్టి క్రాపింగులు చెరుపుతున్నాడు. బహుమతి ఇవ్వడానికి ముందూ వెనకా ప్రతివారికీ షేక్‌ హాండ్‌ ఇస్తున్నాడు. తన పేరు పిలిచేరు. తను వెళ్ళేలోగా పక్కవాళ్ళేదో అంటే వాళ్ళతో మాట్లాడుతున్నాడు. చేతికందిన బహుమతి పుచ్చుకుని చిరునవ్వు మొహాన పులుముకొని తన వంక తిరిగేడు. అకస్మాత్తుగా అతని మొహం ఏదోలా అయిపోయింది.
తనేదో తప్పు చేసినట్టనిపించగా షేక్‌హాండుకై ముందుకు చాచిన చేయి వెనక్కు తీసుకోబోయేడు నూకరాజు. చా! జంకడం దేనికని ముందుకే చాచేడు. అతని తత్తరపాటుని సానుభూతితో అర్థం చేసుకుంటున్న వాడిలా పోజుపెట్టేడు అధ్యక్షుడు. నమస్కారం నేర్పిస్తున్న వాడిలా నమస్కారం పెట్టి తను చేసిన నమస్కారాన్ని చిరునవ్వుతో అందుకొంటూ ఆ తరువాతి ప్రైజు కోసరం చెయ్యి చాచేశాడు ఆ పెద్దమనిషి. ఇంకొకసారి ఒక స్నేహితుని ఇంటకూడా ఇలాంటిదే జరిగిపోయింది.
ఆ రోజుల్లో తమ ఫుట్బాల్‌ టీమ్‌కి తాను గోలీ. కెప్టెన్‌ ఒక బ్రాహ్మర్లబ్బాయి. ఆవేళ ఆట ఐపోయాక మాట్లాడుకొంటూ వాళ్ళింటికేసి నడిచేరు. వీథి గుమ్మం దగ్గర నిలబడి అతనేదో చెప్పుక పోతున్నాడు. తనకు విపరీతమైన దాహమౌతున్నది. పక్కనే వున్న వాళ్ళ చిన్నతమ్ముడ్ని పిలిచి నీళ్ళు తెమ్మన్నాడు. నిమిషం తరువాత లోన వాళ్ళమ్మగారి గొంతు వినిపించింది… ‘నీళ్ళెవరికిరా’ అని. గోలీ నూకరాజుకని తెలుసుకున్నాక ‘ఆ గ్లాసక్కడ పెట్టి చెంబుతో తగలడు’ అంటోంది గట్టిగానే. స్నేహితుడు ఏదో చెపుతూనే వున్నాడు. మళ్ళా కలుస్తా అంటూ తను కదిలిపోయేడు. నీళ్ళు నీళ్ళంటూ అరచే అరుపులు అంతదూరం దాకా వినపడుతున్నా తను తిరిగి చూడలేదు.
మరీ చిన్నవయసులో జరిగిన మొదటి సంఘటన అంతగా అతడ్ని గాయపరచలేదు. వయసు వచ్చేక జరిగినా రెండవ దాన్నతడు క్షమించగలిగేడు. దీనిని మాత్రం అతడు ఎంత ప్రయత్నించినా హరాయించుకోలేక పోతున్నాడు. నూకరాజు పుట్టింది పూరిగుడిసెలలోనే. కాని అతడికి పెంకుటిళ్ళ వాళ్ళూ భవనాల మనుష్యులతో ` స్నేహాలూ, పరిచయాలూ వున్నాయి. చదువు సగంలో ఆగినా ఈ యేడో వచ్చే యేడో మెట్రిక్‌ పరీక్షకు కూర్చోబోతున్నాడు. అతని స్నేహితుల్లో క్లబ్బు మెంబర్లూ, భజన పార్టీల వారేకాక కాబోయే రౌడీలూ, కాగల లోకల్‌ పొలిటీషియన్లూ, హోటల్‌ ప్రొప్రైటర్లూ, సినిమా యజమానుల కొడుకులూ వున్నారు. అతడికొక ఫ్యాక్టరీలో చిన్నదే ఐనా మంచి ఉద్యోగం వుంది. అతడికి ఆడవాళ్ళంటే అమితమైన గౌరవముంది. దేశమాత పేరు చెబితే అతడి ఒళ్ళు పులకరిస్తుంది. గాంధీ, నెహ్రులంటే అతడికి దేవుళ్ళు. జవహర్‌లాల్‌ నెహ్రు, జాన్‌ కెనెడీ, నికటా కృశ్చేవ్‌ ఆరు చేతులూ మూడు జతలుగా కలిసి కరచాలనం చేయడం అతడు ఎన్నడూ మరువలేని దృశ్యం. నూకరాజుకు సంగీతమంటే చాలా పిచ్చి. అతడి పోకెట్‌ మనీలో మూడొంతులు సినిమాలకే ఖర్చవుతుంది.
నూకరాజు తాలూకు యీ రకం స్వభావం ఇరుగుపొరుగులకు ఎంత ముచ్చట కొలిపేదో అతడి తల్లికి అంత భయం కలిగించేది. అతడి తండ్రి ఆ వయసుకి పక్కా తాగుబోతు. అతడికి ఏభయ్యేళ్ళు నిండక ముందే నూరేళ్ళూ చెల్లిపోవడానికి అదో కొంత కారణం. అతడి అన్నలిద్దరూ తండ్రంత మనుషులు కారు కాని అంతో ఇంతో తాగి హరాయించుకోగలరు. నూకరాజుకు అటుకేసే మనసు పోకపోవడం ఆ తల్లికి ఏదోలా కనిపించేది. ఇంతలో పాకిస్తాన్‌ దాడి వచ్చింది. నూకరాజు పిచ్చెక్కిన వాడిలా తయారయి శ్రమదానం, రక్తదానం అంటూ చివరకు ప్రాణదానానికి సిద్ధపడ్డాడు.
తల్లి తుళ్ళిపడి, కళ్ళు తుడుచుకొని, ఒట్లూ సత్యాలు వేసి, ఉరి పోసుకుంటానని బెదిరించింది. చివరకు హోమ్‌గార్డుల్లో చేరడానికి ఒప్పుకుంది. ఎందుకేనా మంచిదని మూడో మేనమామకు కబురుపెట్టి అతని కూతురు ముత్యాలమ్మనిచ్చి పెళ్ళి చేయించింది.
పిల్ల పల్లెటూరిదని గునిసినా పిల్లని చూసేక, అంతకన్నా ఆమె పెద్దకళ్ళను చూసేక మరి మాటాడలేదు నూకరాజు. పెళ్ళయిన ఆర్నెల్లకు అమ్మడు పెద్దమనిషయ్యింది. తరువాత కొన్నాళ్ళు ఒళ్ళు ఆరాలన్నారు.
ఈలోగా పాకిస్తాన్‌ బెడద చల్లారింది. హోమ్‌గార్డుల్లో చేరాక దేశభక్తిని గూర్చిన అతని అభిప్రాయాలు మారాయి. ఇప్పుడు డ్యూటీకి వెళ్ళడం, తిరిగి రావడం, వార, పక్ష, మాస పత్రికలు చదువుకోవడం. క్లబ్బుకు వెళ్ళడం కూడా మానుకొన్నాడు. రాత్రుళ్ళు ట్యుటోరియల్‌ కాలేజీలో చదవాలనే ప్లాను, డబ్బు వెసులుబాటు కాక, ప్లాను ప్లాను రూపంలోనే వుండిపోయింది.మూడునెల్ల క్రితం కార్యమయింది. ఆనాటి రాత్రి నుంచి ఆ మాటకొస్తే అంతకు ముందు నుంచే ఎన్నో రాత్రింబగళ్ళు అతడి ఆలోచనలన్నీ ఒకే సుఖం కోసరం కలలుగన్నవి. అప్సరా హోటల్‌లో ఆరో అంతస్తు గది కాదు. అంతకు మాత్రమైనా శుభ్రమైన లాడ్జింగ్‌ హౌస్‌లో ` మారుమూల గదైనా ఫరవాలేదు ` అమ్మడుతో ఒక్కరాత్రి. దానికోసరం మూడు నెల్లుగా ముష్టి ముష్టి కోరికలు కూడా ఎన్నెన్నో చంపుకొని డబ్బు మూటకట్టేడు. మూడు నాళ్ళుగా అమ్మడుతో శతపోరి దాని ముదల సంపాదించేడు. చెప్పిన అబద్ధం చెప్పకుండా ఒక రాత్రి వాళ్ళ గైరుహాజరుకు కళ్ళు మూసుకునేటట్టు పెద్దలను గికురించగల్గేడు. ఇంత చేయగా చివరకు జరిగింది ఇదీ. ఊరుచివర ఊడల మర్రినీడలో మునిసిపల్‌ ఆసుపత్రి గేటు దగ్గరకి వచ్చేక నూకరాజుకు తెలివి వచ్చింది. తుళ్ళిపడి వెనక్కి చూస్తే అమ్మడు వెంటే వుంది. అలాంటి వేళప్పుడు అట్టిచోట ఆడా మగా జంట కనిపిస్తే ఏ రిక్షా వాలా అయినా గంట మోగిస్తాడు. అలా మోయించాడని మొదట కోపం వచ్చినా అతడి తప్పేముందని? అందులో ఎక్కి కూర్చున్నాడు నూకరాజు.
అమ్మడి స్పర్శతో పూర్తిగా ఈ లోకంలోకి వచ్చాడు నూకరాజు `
‘‘వెంకటేశ్వర టాకీస్‌ పోనీయ్‌’’ అన్నాడు వెనక్కి చేరబడుతూ.
వెంకటేశ్వర టాకీసే కాదు కనకదుర్గా పేలస్‌ కూడా హౌస్‌ఫుల్‌.
క్షణకాలం నూకరాజు కోపానికి అవధులు లేకపోయేయి. కాని ఎవరి మీద `
‘‘ఆకలేస్తున్నదా?’’ అన్నాడు అమ్మడితో.
అతని మాట కోసరమే ఒళ్ళంతా చెవులు చేసుకువున్నట్టు, అతని చూపుకోసరమే చెవులంతా కళ్ళు చేసుకొన్నట్టూ…
‘‘ఊహుఁ’’ అని, ‘‘నువ్వు తింటే తిను’’ అంది బతిమాలుతున్నట్టు.
ఆ పిల్ల కళ్ళల్లో జాలి, ఆమె మాటల్లో కళ్ళల్లో ఆత్రుతా, నూకరాజు గుండెలు తోడేశాయి.
‘పద’ అంటూ పెట్రోమాక్సు లైటుతో దేదీప్యమానంగా వెలిగిపోతున్న ‘‘ఓపెనైర్‌’’ హోటల్లోకి దారితీసేడు.
ఉడిపి శ్రీ కృష్ణ విలాస్‌. వీలైతే ఎయిర్‌ కండిషన్డు రూమ్‌లో దంపతులు ఏకాంతంగా కూర్చుని చేయదలచిన భోజనమది. కనకదుర్గా టీ షాపులో కుళ్ళు కాలువ పక్కన ఎగుడు దిగుడు బెంచీ ఏకైక ఆసనంగా, నీటికి తడిసి ఎండకు ఎండి బీటలువారి నల్లబడి మొదటి ఆట రష్‌ తరువాత బురద బురదగా ఉన్న టేబిల్‌ మీద అంచులు విరిగి సొట్టలు దేరిన ప్లేట్లలో ఫలహారంగా మారింది.
అల్లంత దూరాన మూడు చాయ్‌ ఆరు చేయించేసుకు తాగుతున్న రిఖామీసరుకు ఎందుకో పగలబడి నవ్వుతున్నారు. ఏదోవిధంగా వాళ్ళతో తగువు వేసుకుని ఒకర్నిద్దర్నన్నా చావదన్న గలిగితే మనసు తేలిక కాదా అనిపిస్తోంది నూకరాజుకు.
బిల్లు చెల్లించి బయటకు వచ్చేక కావాలని వాళ్ళ ముందు నుంచి నడిచేడు నూకరాజు. ఒకళ్ళిద్దరు అమ్మడి వంక వెకిలి చూపులు చూసేరు. ‘రానీ నా…ఒకళ్ళనో, ఇద్దర్నో ఇవాళ సఫా’ అనుకుంటూ ముందుకు సాగేడు. వాళ్ళెందుచేతో ఆ జంట వెంట పడలేదు.
వెన్నెల పిండార పోసినట్లున్నది. రోడ్డుకు రెండు ప్రక్కలా ఇళ్ళు నిద్రపోతున్నాయి. రోడ్డున పడ్డ నూకరాజు వెంట అమ్మడు నీడలా నడుస్తోంది. ఒకచోట అరుగుమీద మనుషులు మందల్లా పడుకొన్నారు. ఇంకొకచోట పేవ్‌మెంట్‌ మీద బారులుతీరి పడుకున్నారు. ఎదురుగా మేడమీద లైటు ఇంకా వెలుగుతోంది. తూము గట్టుమీద ముష్టిదీ, ముష్టివాడూ ఏం మాటలాడుకొంటున్నారో మాటలాపేసేరు.
‘వాళ్ళకు ఇల్లంటూ ఉండదు. యెలా బతుకుతారో’ అనుకున్నాడు నూకరాజు.
‘అలానే. కుక్కల్లా.’
నూకరాజు తుళ్ళిపడ్డాడు మనసులో.
వేలకు వేలు జనం బతుకుతున్నారు ఆ నగరంలో. చెట్లకింద సంసారాలు, గట్లమీద వంటలూ, వడ్డనాలూ, వానొస్తే, వరదొస్తే కనపడ్డ అరుగులు యెక్కుతారు. కరకర ఎముకలు కొరికే చలిలో, జరజర వర్షంలా కురిసే మంచులో, భగభగ మండి మసిచేసే ఎండలో, నీడంటూ లేని బ్రతుకులు. వెళ్ళు, వెళ్ళండి!… లే లే… ఇక్కడ కాదు అంటూ కుక్కల్ని తరిమినట్టు తరుముతారు. బురదలో, రొచ్చులో దీపాల్లేని బ్రతుకులు. దుప్పట్ల ముసుగులూ, పక్కవాళ్ళ రెప్పల బరువులూ తప్ప మరుగుల్లేని చీకటి కాపరాలు.
జాలి కలగడానికి బదులు కోపం వస్తున్నది నూకరాజుకు. ఏదో సినీమాలో, ఎక్కడో ఎవరో జనం, రోతకి, అన్యాయానికి, హింసకు విరగబడి తిరగబడడ్డం చూసేడు. ఈ జనం మాత్రం ఎన్నాళ్ళయినా ఇంతే. పందులకు బురద రోత కాదు అనుకున్నాడు మనసులో. రయ్‌మంటూ ఒక లారీ దూసుకుపోయింది. ఒక షోకైన కారు స్లోగా మలుపు తిరుగుతోంది. అందులో తెల్లచీరలో అతి తెల్లటి ఆడపిల్ల కెంపు రంగు రవిక వేసుకొని మలుపులో ఒరిగిపోతూ కూర్చుంది. నల్లటి ఆమె తలకట్టులో తెల్లటి మల్లెలు. నిశ్చయంగా లాడ్జింగ్‌ నుంచో, లాడ్జికో అయ్యుండాలి. దూరాన మూడు సినీమా హాళ్ళ మొగలో మూడు హాళ్ళూ, పెద్ద రాక్షసి పొయ్యి తాలూకు మూడు పొక్కిళ్ళలా వున్నాయి. నూకరాజు వాటిని సమీపించే వేళకు, చంద్రుడు నడినెత్తిన నిలచి వెన్నెలలు కురిపిస్తున్నాడు.
నూకరాజుకు వూరు స్వంతం కాకపోయినా హాళ్ళు కొత్తవి కావు. హాళ్ళలోనూ జనం ఎప్పుడూ కిక్కిరిసి వుంటారు. వాళ్ళు వేసుకున్న మురికి గుడ్డలు వాళ్ళకు పట్టవు. వాళ్ళ కారుతున్న చెమటలు వారికి ఏ మాత్రం తెలియవు. వాళ్ళను కుడుతున్న నల్లుల వల్ల బాధ వాళ్ళెరగనే ఎరగరు. వాళ్ళు మాత్రం గుర్తించలేరు. ఎదురుగా తెరమీద పెద్దమేడలు. వాళ్ళు చూసే బొమ్మల్లాగే నిజమైనవి కావా మేడలు. అందులో అందాల కన్యలు మేకప్పులు విప్పితే వాళ్ళ పెళ్ళాలకు, అమ్మమ్మలూ నాయనమ్మలూ, వాళ్ళు పాడే మధురమైన పాటలు వాళ్ళు పాడలేదని తెలిసీ వాళ్ళే పాడినట్టు భ్రమ. జరగని కథలు జరిగినట్టు నమ్మడం ` లేనిపోని మమతలు ఉన్నట్టూ, కన్నట్టూ నటన.
తెరమీద చూపిస్తున్నదే మాయ. ఆ మాయను కూడా మాయగా చూపిస్తారు మాయ వెధవలు.
జనానికి నిజమైన అనుభవాలు అందవు. అందాలనే కోరికలు ఊహలలో కదలినా ప్రమాదం.
అందుచేత పెద్దవాళ్ళు పిల్లల్ని ఉత్తుత్త కబుర్లతో మభ్యపెట్టినట్టు, ప్రజల్ని ప్రభువులు మాయ వాగ్దానాలతో మోసగిస్తున్నట్టు కొందరు మాయగాళ్ళు జనంగాళ్ళను మాయ అనుభవాలతో మోసగిస్తున్నారు. జనం మోసపోవడానికి సిద్ధంగా వున్నారు. అందుకు ముడుపులు కూడా చెల్లిస్తున్నారుÑ ఆ ముడుపులు బ్లాక్‌రేట్లలో చెల్లించడానికి కూడా వారు సిద్ధం. మోసగిస్తున్నారంటే వాళ్ళది తప్పుకాదేమో? జనాలకు కలేజాలు లేవు. ఉంటే ఉత్తుత్త మొగుడూ పెళ్ళాలు ఉత్తుత్త శోభనపు గదుల్లో బొత్తిగా ఉత్త దొంగచూపులు చూస్తున్నారని తెలిసీ, చొంగలు కార్చుకుంటూ ఈలల వెయ్యరు. నూకరాజు కోపం ఈవిధంగా సినిమా చూసేవారి మీద, సినీమా తీసే వారిమీద, దానిని తీయించే వారిమీదా, అద్దానిని చూపించే వారిమీదా ` అంచెలు అంచెలుగా పెరుగుతున్న సమయంలోనే అతడు సరిగ్గా సినీమా మొగ సెంటర్లోకి వచ్చేడు. దేవుడు కూడా సరిగ్గా ఆ వేళకే అక్కడికి వచ్చేడు.
… … …
‘‘ఏం బుల్లె, యే వూరు?’’ అన్నాడు దేవుడు.
నూకరాజు చహరా చూస్తే బుల్లే కలుపుగోరుగా కనిపించింది దేవుడికి.
అమ్మడు దేవుణ్ణి గుర్తించలేకపోయింది.
‘‘ఎవరిదీ?’’ అన్నది మెరిసే కళ్ళతో.
‘‘మీదే ` మీదే ఊరు?’’
నూకరాజు వంక చూడబోయి మానుకున్నాడు దేవుడు.
‘‘మాదా? అనకాపల్లి?’’, ‘‘మీరెవరూ?’’ అంది అనుమానంగా.
అప్పటికి నూకరాజు ఇటు తిరగేడు. ఈ లోకంలోకి వచ్చినా వెంటనే దేవుణ్ణి పోల్చుకోలేకపోయాడు.
‘‘మీరల్లా లాడ్జింగ్‌కి రాలేదా? నాకు ఆ లాడ్జింగ్‌లోనే పని’’.
అని తనకేసి చూస్తున్న నూకరాజుతో `
‘‘పాపం! నీకు దొరకలేదా?’’ అనబోయి ‘‘నీకా బొట్టె ఏవఁవుద్ది?’’ అన్నాడు అలవాటుగా.
అంతే, నూకరాజుకి ఆ ప్రశ్నలో అమాయకపు ఆప్యాయతకు బదులు అనుమానపు అన్వేషణ కనిపించింది. దాని వెనక ఒంటి కంటి గుమాస్తా, గొంతుతోకాక కంటితో అడిగిన ప్రశ్న కోటి గొంతులతో ప్రతిధ్వనించినట్టయింది.
‘‘ఏం బుల్లె’’ వాక్యం పూర్తికాకముందే ఠాప్‌మంది దేవుడి దవడ.
‘‘లంజకొడకా! నా ఆడదానితో మాట్లాడవలసిన అవసరం నీకేందిరా`’’ అంటూ ఆ స్లోగన్‌ ఇచ్చిన ఊతంలో
ఉద్రేకం పెంచుకొని `
టప్‌టప్‌, దబ్‌దబ్‌ మంటూ దేవుణ్ణి ఎడాపెడా మోదుతూ ఎక్కడ తగుల్తుందో చూడకుండా బూటుకాలితో అమాంతం ఉరికేడు. కమీజుపట్టి ఎత్తుతూ `
‘‘లంజకొడకా, ఎవరనుకున్నావు ` ఎవరనుకున్నావురా నీ మనసులో…?’’ రొప్పడం ఆరంభించేడు.
క్షణకాలం దిమ్మెరపోయిన షాపులవాళ్ళూ, రిక్షాజనం మైకం వీడి పరిగెత్తడం ఆరంభించేరు.
ఆ పిల్ల చిన్న బొంగురు గొంతుకతో ‘‘ఓలమ్మో! ఓలమ్మో! సంపేస్తాడు. మా బావ సంపేస్తాడు, ముసిలోడు సచ్చిపోతాడు’’ అంటూ గజగజ వణికిపోతూ ఏడవసాగింది. ఈలోగా చుట్టూ మూగిన జనం ముసలి దేవుణ్ణి పడుచు నూకరాజు చేతుల్నుండి తప్పించి, అతని బారినుండి రక్షించి, అతడికి దూరం చేసేరు. నూకరాజు నున్నటి క్రాపింగ్‌ చెరిగిపోగా, కమీజు చిరిగిపోగా, రిస్టు వాచీ గొలుసు జారిపోగా, వాటిని సరిచేసుకుంటూ అరుస్తున్నాడు. ‘‘లంజకొడకా, నీ నెత్తురు తాగుతా. నీ ప్రాణం తీస్తా. ఆడది రోడ్డుమీద కనిపించినంత మాత్రాన లంజైపోద్దిరా! అది నీ లాడ్జికొచ్చినంత మాత్రాన లంజే! గొప్పోడు లంజన్దెస్తే సంసారా? సంసారి మొగుడితో వొచ్చినా లంజే! నీది లంజల్లాడ్జి…! నిన్నూ, నీ గుడ్డికంటి గుమస్తానీ, నీ లంజల్లాడ్జి ప్రొప్రైటర్నీ ఒక్క దెబ్బతో సఫాచేస్తాను. ఒక్క గుద్దుకు సరి!…’’
నూకరాజు చుట్టూ మూగిన జనం ఏ కారణంవల్ల అనుకున్నారో నూకరాజుది తప్పు కాదనుకొని వుండాలి. రావాకులా అల్లల్లాడుతూ వచ్చి అల్లంత దూరం నుండే ‘‘బావా! రా, ఎలిపోదాం, నా మాటిను! ఆ ముసలోడితో ఏటి? రా ఎలిపోదాం!’’ అంటూ బ్రతిమాలే అమ్మణ్ణి చూసేక వాళ్ళ అనుమానాలు పూర్తిగా పోయి వుండాలి. దేవుణ్ణెరిగిన మనిషి అక్కడ ఒక్కడూ లేకపోవడం, ఒక్క మాటకూ దేవుడు నోరు విప్పి బదులు చెప్పకపోవడం దేవుడిదే తప్పై వుంటుందనే వూహకు బలమిచ్చి వుండాలి. ఆ కాడికి ` ‘‘పోనీ అదే పోయెను యెల్లవయ్యా! ముసిలోణ్ణి ఇప్పటికే సగం సంపేసినావు. ఇంక నీ దార్న నువ్వెళ్ళు!’’ అన్నాడో నడికాలం మనిషి. ‘‘ఆడా ముసిలోడు! ఆడు ముసలాడా! ఆడు తారుపుగుల్ల నాయాలు. తప్పుడు లంజాకొడుకు…’’ అంటూ నూకరాజు ఉద్రేకం పెంచుకొంటున్నాడు. ఈసారి సాహసించి అమ్మడు అతడి చెయ్యి పట్టుకుంది. ఇంతలో ఇంటర్వెల్‌, జనం నలుప్రక్కల నుండి వచ్చి చల్లగా ముంచేశారు. కనుమూసి తెరచేలోగా వాళ్ళో పెద్ద జనసందేహం నడుమ ఉన్నారు.
… … …
మూడు సినిమాలకు ఐదు, పది నిమిషాల తేడాతో ఒకే సమయంలో ఇంటర్వెల్‌ అవుతుంది. ఒక్కొక్కసారి ఆ తేడా తగ్గి మూడు హాళ్ళ జనం ఒకేసారి షాపుల మీద పడతారు. అలాంటప్పుడు సోడాల కీచు శబ్దాలతో, టీ దుకాణాల కేన్వాసులతో, పచారీ షాపుల పకోడీ అరుపులతో రాసుకొని, తోసుకొని, సిగ్గులూ, బిడియాలూ విడిచి రోడ్డు ఖరాబు చేస్తూ, తింటూ, తాగుతూ, బొమ్మలకేసి, మనుషులకేసీ ఆకలిగా చూస్తే తమలోకి తాము చూసుకొనే వేళ ఎవరికి వాళ్ళే ‘ఏం మనుషులం’ అనుకోవడం జరుగుతుంది.
అలాంటివేళ, అట్టి జనానికి అవతలి వంక, ముసలి దేవుడు దిమ్మెక్కిన తలతో, తిమ్మిరెక్కిన శరీరంతో అక్కడక్కడ మంటలూ, పోట్లూగా ఒక్కడే ఒక అరుగుమీద చతికిలబడి వున్నాడు.
మూకలు పలచబడే వేళకు, ఎవరో ఇచ్చిన సోడా తాగి ఇంకెవరో వెతికి తెచ్చిన గుడ్డలేరుకుని, ఇందుకో ఇంకెందుకో గుబులుకొస్తున్న దుఃఖాన్ని అణచుకోలేక అణచుకొంటూ, దెబ్బలపై దెబ్బలతో, దుఃఖాలతో శోషిల్లుతున్న కట్టెనీడ్చుకుంటూ, లాడ్జింగ్‌కేసి నడుస్తున్నాడు.
ఆ రెండో వంక, ఆ జనానికల్లంత దూరాన, ఎదురుగా వస్తున్న కాళీ రిక్షానాపి ఆ కుర్రదీ, కుర్రాడూ అందులో యెక్కి కూర్చున్నారు. అమ్మడికి అక్కుర్లు బుక్కుర్లుగా వస్తున్న దుఃఖం ఆగడం లేదు. నూకరాజు ఆమె నూరడిరచడం లేదు. ఒకచేత ఆమెను పొదివి పట్టుకుని ఇంకోచేత నీటుగా మడచిన జేబు రుమాలుతో చిట్లిన పెదవిని అడ్డుకొంటున్నాడు. రిక్షా వెన్నెలలో దూరమయ్యింది.
(ఆంధ్రజ్యోతి, 13.12.1968)

Share
This entry was posted in కథలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.