సావిత్రీబాయి రోడే -డా॥ చల్లపల్లి స్వరూపరాణి

19వ శతాబ్దంలో ప్రారంభమైన సంఘసంస్కర ణోద్యమం సమాంతరంగా రెండు భిన్న వర్గాల నాయకత్వం కింద సాగింది. పాశ్చాత్య విద్య ద్వారా ప్రభావితమైన బ్రాహ్మణీయ వర్గాల మేధావులు ఒకవైపు తమ వర్గాల స్త్రీల సమస్యలైన సతీ సహగమనం, బాల్యవివాహాలు, నిర్బంధ వైధవ్యం వంటి సమస్యలపై సంస్కరణోద్యమం ప్రారంభిస్తే బ్రాహ్మణేతర వర్గాల మేధావులు సమాజంలోని

స్త్రీలందరి సమస్యలతో పాటు ఇతర సామాజిక రుగ్మతలైన కులవివక్ష, అంటరానితనం, అవిద్య, వెట్టిచాకిరీ, పేదరికం వంటి సమస్యలపైన కూడా ఒక సమగ్రమైన దృష్టితో దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో సామాజిక ఉద్యమాలు ప్రారంభించారు. అయితే, బ్రాహ్మణీయ సంస్కర్తలైన రాజారామ మోహనరాయ్‌, ఈశ్వరచంద్ర విద్యాసాగర్‌ వంటివారు సంఖ్యాపరంగా సమాజంలో అతి కొద్దిమందిగా
ఉండే బ్రాహ్మణ, క్షత్రియ కులాల స్త్రీల సమస్యల పరిష్కారం కోసం చేసిన ఉద్యమం ఈ దేశ సంఘ సంస్కరణో ద్యమంగా ప్రాచుర్యం పొందింది. అంతేకాదు, అది చరిత్ర పుస్తకాలకెక్కి పాఠశాల స్థాయి నుంచి విశ్వవిద్యాలయ స్థాయి వరకు పాఠ్యాంశంగా మారడం వలన ఈ దేశంలో సంఘ సంస్కరణ అంటే పైవారే అని అందరి మెదళ్ళలో స్థిరపడిపోయింది. స్త్రీ సమస్యతో పాటు అన్ని సామాజిక రుగ్మతలపై దీర్ఘకాలిక ఉద్యమం చేసిన బ్రాహ్మణేతర సంస్కర్తలైన మహాత్మా జ్యోతిరావు ఫూలే, నారాయణగురు, అయ్యంకాళి, పెరియార్‌, అంబేద్కర్‌ వంటి వారి కృషి చాలాకాలం పాటు మరుగున పడిపోయింది. అయితే విదేశీ పరిశోధకులైన రోజ్లండ్‌ ఒహన్లాన్‌, గెయిల్‌ ఆమ్వెద్ట్‌, జెఫర్లట్‌, ఎల్లినార్‌ జెల్లియట్‌ వంటి వారి కృషి వల్ల గత రెండు, మూడు దశాబ్దాల నుంచి బ్రాహ్మణేతర మేధావుల నుంచి సంస్కరణవాదం వెలుగులోకి వస్తుంది. వారి కృషికి తోడు 1980, 90వ దశకాలలో దేశవ్యాప్తంగా పెల్లుబికిన దళిత ఉద్యమం, మండల్‌ కమిషన్‌ అనుకూల ఉద్యమం, అంబేద్కర్‌కు భారతరత్న అవార్డు ప్రకటించడం వంటి సందర్భాల వల్ల ఫూలే, అంబేద్కర్‌ రచనలు వెలికితీయడం, అవి క్రమంగా ప్రాంతీయ భాషల్లోకి అనువాదం పొందడం వలన కూడా వారి
ఉద్యమ స్వభావం తెలియవస్తుంది. వారు సమాజంలో పితృస్వామిక అణచివేత విధానాలతో పాటు బ్రాహ్మణవేదం, కులతత్వానికి తరతరాలుగా బలైపోయిన వెనుకబడిన కులాలు, దళితులు, స్త్రీలు అంతా పీడితులేనన్న ఎరుకతో విశాలమైన ప్రాతిపదికన వారి విముక్తి కోసం బలమైన కుల వ్యతిరేక సామాజిక ఉద్యమాలు నిర్మించారు. ఆయా ఉద్యమాలను ముందుకు తీసుకెళ్ళడంలో తమ జీవితాలను ధారపోసిన బ్రాహ్మణేతర సంస్కర్తల కృషిపై ఇప్పుడు దేశ విదేశాలలో విస్తృతంగా పరిశోధన జరుగుతోంది. రూపంలో, సారంలో బ్రాహ్మణ వర్గాల సంస్కరణ ఉద్యమానికి భిన్నంగా రూపొందిన ఆయా ఉద్యమాల తీరుతెన్నులపై అంతటా ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.
ఫూలే సత్యశోధక సమాజం
మహాత్మా ఫూలే సత్యశోధక సమాజాన్ని తన మిత్రులు, తన జీవన సహచరి అయిన సావిత్రీబాయి తో కలిసి ప్రారంభించి అణగారిన కులాలు, స్త్రీల విద్యకోసం, కుల నిర్మూలన కోసం బ్రాహ్మణవాదంపై ఆయన నడిపిన పోరాటాలన్నింటిలో సావిత్రీబాయిని క్రియాశీలక భాగస్వామిని చేశాడు. ఆగిపోయిన ఆమె చదువును కొనసాగించి టీచర్‌ ట్రైనింగ్‌ చేయించాడు. ఫూలే ప్రోత్సాహం, ఆమె స్వీయ కృషితో సావిత్రీబాయి భారతదేశపు మొదటి మహిళా ఉపాధ్యాయిని అయింది. ఇది స్త్రీ విముక్తిపరంగా మహాత్మా ఫూలే ఆచరణ శీలతకు నిదర్శనం.
సత్యశోధక సమాజ కార్యక్రమాలలో సావిత్రీబాయి తో పాటు సుమారు తొంభై మంది స్త్రీలు పాల్గొన్నారు. ఆమె సత్య శోధక సమాజ మహిళా విభాగానికి అధ్యక్షురాలు. ఫూలే మేనత్త ‘సుగుణా బాయి’ మొదట్లో వారికి అన్ని విధాలుగా సహకారం అందించింది. సావిత్రీబాయితో పాటు పరమహంస మండలి సభ్యుడు భావల్కర్‌ దగ్గర టీచర్‌ ట్రైనింగ్‌ తీసుకున్న ముస్లిం మహిళ ఫాతిమా ఫేక్‌ కూడా వారితో కలిసి ఉద్యమంలో భాగస్వామి కావడమే కాక ఫూలే దంపతులు స్థాపించిన పాఠశాలలో సావిత్రీబాయితో పాటు టీచర్‌గా పనిచేసింది. ఫూలే స్త్రీలు, అణగారిన కులాల విద్యకోసమే కాక వారిపై బ్రాహ్మణ పురుష పెత్తనదారులు సాగించే దాష్టీకాలపై కూడా రాజీలేని పోరాటం చేశారు. బ్రాహ్మణ వింతువులకు శిరోముండనం చేయించి వారిని నాలుగు గోడలకు పరిమితం చేసే ఆచారాన్ని విలక్షణ రీతిలో అడ్డుకున్నాడు. ఆ స్త్రీలకు శిరోముండనం చేసే మంగలి వృత్తి వారితో ఆ పని చెయ్యకుండా నిరసన ప్రదర్శన చేయించడం విశేషం. దీనికి ఫూలే ఉద్యమం సహచరుడు, భారత కార్మికోద్యమ పితామహుడు నారాయణ మేఘాజీ లొఖాండే నాయకత్వం వహించాడు. ఫూలే కులాంతర, మతాంతర వివాహాలను ప్రోత్సహించడమే కాకుండా బ్రాహ్మణ పురోహితుడిని పిలవకుండా హిందూ సాంప్రదాయానికి ప్రత్యామ్నాయ వివాహ పద్ధతిని ప్రారంభించి మనువాదులకు గుండెల్లో గుబులు పుట్టించాడు. ఆయన అణగారిన కులాల స్త్రీలు గ్రామ దేవతల పూజా విధానంలో దేవుడికి అంకితమిచ్చే జోగినులుగా చెయ్యబడి హిందువుల శవయాత్రల ముందు, ఊరేగింపుల ముందు ‘తమాషా’ అనే పేరున నాట్యం చెయ్యడాన్ని అడ్డుకున్నాడు. ఆ దురాచారం నుంచి బయటపడి ఆత్మగౌరవం పొందమని, దానికి చదువే పరిష్కారమని సూచించాడు. బ్రాహ్మణ వితంతువులు ఇతర పురుషుల వల్ల గర్భం దాల్చితే అది వారికి మరణ యాతనతో సమానంగా ఉండేది. గత్యంతరం లేని స్థితిలో ఆ స్త్రీలు కాశీవంటి పుణ్యక్షేత్రాలకు వెళ్ళి అక్కడే బిడ్డను కని పారేసి రావడమో లేక తామే ఆత్మహత్యకు పాల్పడడమో జరిగేది. అటువంటి స్త్రీల కోసం ఫూలే దంపతులు కాశీలో ‘శిశుహత్యా నిరోధక గృహం’ పేరున ఒక సంరక్షణాలయాన్ని ఏర్పాటు చేసి వారికి ఆశ్రయం కల్పించారు.
ఫూలే అనంతర సత్యశోధక సమాజం ` సావిత్రీబాయి రోడే
ఫూలే దంపతులు బ్రాహ్మణ మేధావులు ప్రారంభించిన సంఘ సంస్కరణకు భిన్నంగా విశాలమైన ప్రాతిపదికన సంస్కరణ ఉద్యమాన్ని నిర్మించారు. ఆయన మరణానంతరం సత్యశోధక సమాజం ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంది. అయినప్పటికీ రెండవ తరం సత్యశోధక సమాజ కార్యకర్తలైన లోఖాండే, బాబూరావు, భాస్కరరావు యాదవ్‌ వంటివారు బ్రాహ్మణ వాదుల ఎత్తుగడలను తిప్పిగొట్టి ఫూలే దంపతుల స్ఫూర్తిని బతికించారు. సత్యశోధక సమాజం రెండో తరం కార్యకర్తల్లో ‘రామోషీ’ అనే సంచార జాతికి చెందిన ‘సావిత్రిబాయి రోడే’ స్త్రీ విముక్తిపరంగా చేసిన కృషి చెప్పుకోదగినది. ఆమె ఫూలేపై హత్యాయత్నానికి బ్రాహ్మణ వాదులు పంపిన రామోష్‌ తెగకు చెందిన నేరగాడు దొండీరాం రోడేకి కోడలు. దొండీరాం మనసు మార్చుకుని ఫూలే అనుచరుడు, వ్యక్తిగత రక్షకుడు అవ్వడమే కాక తన కుటుంబం కూడా సత్యశోధక సమాజం పనిలో భాగమయింది. సావిత్రీబాయి రోడే సత్యశోధక సమాజం ప్రారంభించిన పాఠశాలలను నడిపిస్తూ అనేక ఇతర కార్యక్రమాలు కూడా చేపట్టిందది. బ్రాహ్మణ వాదులకు పట్టుకొమ్మగా భావించే పూనే పరిసర ప్రాంతాల్లో ఫూలే మరణానంతరం వారు తిలక్‌ నాయకత్వంలో తిరిగి మనువాదాన్ని అమలుపరచడం మొదలుపెట్టి అందులో భాగంగా పూనే మున్సిపాలిటీలో ఉండే పాఠశాలల్లో ఆడపిల్లల ప్రవేశాలను అడ్డుకున్నారు. అప్పటివరకూ అందరికీ నిర్బంధ ఉచిత విద్య అందించాలనే ఉద్దేశ్యంతో నడిచిన విద్యా విధానానికి గండికొట్టి ఆడపిల్లలు, అణగారిన కులాల విద్యార్థులను బడిలో చేరకుండా ఆటంకపరిస్తే సావిత్రీబాయి వారు తిరిగి స్కూల్లో చేరడానికి కృషి చేసింది. సావిత్రీబాయి రోడేతో పాటు గంగూ బాయి, పుత్లా బాయి, మరికొందరు యూరోపియన్‌ స్త్రీలు కూడా ఆ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు. సావిత్రీబాయి రోడే కృషికి గుర్తింపుగా ప్రజలు ఆమెకి ‘విద్యాదేవి’ బిరుదునిచ్చి గౌరవించారు. ఆమె సత్యశోధక సమాజం యాభై ఏళ్ళ ఉత్సవాన్ని కూడా నిర్వహించింది.
అయితే సావిత్రీబాయి రోడే గురించి సమగ్రమైన సమాచారం మనకు అందుబాటులో లేదు. మరాఠీ పత్రికలలో అడపా దడపా ఆమె గురించిన ప్రస్తావన తప్ప సావిత్రీబాయి ఫూలే గురించి లభించినంతగా ఈమె గురించి దొరకకపోవడమే కాక ఆమె ఫోటో కూడా లభ్యం కాకపోవడం గమనార్హం. నిజానికి ఆమె ఫూలే ప్రారంభించిన సామాజిక విప్లవోద్యమాన్ని నీరుగార్చి దాని స్థానంలో మనువాదాన్ని ముందుకు తీసుకెళ్ళే ప్రతిఘాత హిందుత్వ శక్తులను గట్టిగా అడ్డుకున్నారు. ఆమెకి యూరోపియన్ల సహకారం లభించినట్టు స్థానికంగా ఎవరూ సహకరించినట్టు కనిపించదు. ఈ కోణంలో మరిత పరిశోధన జరగాల్సిన అవసరం ఉంది.

Share
This entry was posted in మిణుగురులు . Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి)


తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.