ఒలింపిక్‌ క్రీడల్లో పాల్గొనలేకపోయిన ఒక తిరుగుబాటుదారు మహిళ ‘ఈలా’ -ఎస్‌.రాజ్యలక్ష్మి

(1940వ సంవత్సరంలో ఒలింపిక్‌ ఆటల్లోని పరుగు పందెంలో పాల్గొనవలసిన ఈలా మిత్రా, ఆ తర్వాతి కాలంలో బెంగాల్‌లో అప్పుడే ఊపిరి పోసుకుంటున్న తెభంగా అనే ప్రముఖ రైతు ఉద్యమంలో పనిచేసినందుకు గాను జైలులో బంధింపబడి, ఎంతో హింసకు గురయ్యారు.

ఎంతో ధైర్య సాహసాలు చూపించిన ఆమె కథని సోహిని ఛటోపాధ్యాయ అనే మహిళా జర్నలిస్టు రాశారు. జర్నలిస్ట్‌, విమర్శకురాలు అయిన ఈమె ప్రజారోగ్యం మీదా, రాజకీయాల మీదా, సినిమాల మీదా కూడా రాస్తారు. ఈలా మిత్రా మీద ఈమె రాసిన ఈ రిపోర్ట్‌ కోసం nternational Women’s Media Foundation, మహిళా జర్నలిస్టుల కోసం ఏర్పాటు చేసిన Howard G.Buffett Fund ద్వారా సహకరించింది. 02.08.2021 తేదీ హిందూ దినపత్రికలో ఈ వ్యాసం ప్రచురింపబడిరది.)
1940లో, 12వ ఒలింపిక్‌ క్రీడలకి ఆతిథ్యం ఇవ్వడానికి హెల్సింకి ఆయత్తమవుతున్నప్పుడు, యూరోప్‌ యుద్ధానికి సిద్ధమవుతున్నప్పుడు, డిప్యూటీ అకౌంటెంట్‌ జనరల్‌ అయిన నాగేంద్రనాథ్‌ సేన్‌ ఒక సమాచారం అందుకున్నారు. అది ఏంటంటే, ఆయన కుమార్తె అయిన 15 సంవత్సరాల ఈలాను ఒలింపిక్‌ క్రీడలకు వెళ్ళే జట్టులోకి ఎంపిక చేశామని, ఆమె ఆ ఆటల్లో బ్రిటిష్‌ ఇండియాకు ప్రాతినిధ్యం వహిస్తుందని.
అది అంత పెద్ద ఆశ్చర్యం కలిగించే విషయమేమీ కాదు. ఎందుకంటే 1937 నుంచీ కూడా ఆమె తన విజయాల తాలూకు వార్తలతో కలకత్తాలోని బెంగాలీ, ఇంగ్లీష్‌ వార్తా పత్రికల్లో క్రమం తప్పకుండా కనిపించేవారు. ఈలా తన తల్లిదండ్రుల ఆరుగురు సంతానంలో మొట్టమొదటిది. సేన్‌ తన కుమార్తె ఆటల్లో రాణించడానికి చాలా ఖర్చు పెట్టారు. ఆఫీసు పని చేస్తూ కూడా ఆయన తన కుమార్తె ఈత ప్రాక్టీస్‌ కోసం కాలేజ్‌కి, నగరం చుట్టుపక్కల జరుగుతున్న పరుగు పోటీలకి తన కుమార్తెతో పాటు వెళ్ళేవారు. తన కుమార్తె విజయాల తాలూకు వార్తలని ఆయన వార్తాపత్రికల లోంచి కట్‌ చేసి, ఒక నోట్‌ పుస్తకంలో అంటించి, దానిమీద ఆ వార్త ప్రచురింపబడిన తేదీ, పేపర్‌ పేరు ఒక ఇంకు పెన్నుతో రాసి ఉంచేవారు.
1937 మరియు 1938 లలో బెంగాల్‌లోని జాతీయ జుబా సంఘ అనే స్పోర్ట్స్‌ క్లబ్‌ వరుసగా రెండేళ్ళపాటు ఆమెను బాలికల జూనియర్‌ ఛాంపియన్‌షిప్‌ అవార్డు ప్రదానం చేసింది. 1938లో సచిత్ర భారత్‌ అనే బెంగాలీ జర్నల్‌, 13 ఏళ్ళ ఈలా గురించి సీనియర్‌ స్పోర్ట్స్‌ సాధకురాలిగా పరిచయం చేస్తూ బ్రిటిష్‌ ఇండియన్‌ హాకీ టీం గురించి, పర్వతారోహకుడు టిబెట్‌కు పర్వతారోహణ కోసం వెళ్ళడం గురించి, 10 మైళ్ళ నడక ఛాంపియన్స్‌ గురించి కూడా కవర్‌ చేశారు.
ఈలా అప్పటివరకూ 47 పతకాలు సాధించారు. వివాహమయ్యాక ఈలా మిత్రా అయిన ఆమె ఆ కాలం నాటి రైతు ఉద్యమాల ముఖ్య నేతల్లో ఒకరయ్యారు. చిన్నప్పుడు చంద్రవంక లాంటి మొహంతో కొంచెం సిగ్గుగా నవ్వే ఆమె తర్వాతి కాలంలో సన్నగా, పీలగా, అలసిపోయినట్లు, పలుచని జుట్టుతో, కానీ ఒక స్థిర నిర్ణయం ప్రతిబింబించే ముఖంతో ఉండేవారు. బెంగాల్‌ రాజ్యంలోని ఉత్తమ అథ్లెట్‌లలో ఒకరైన ఆ యువతి పోయి ఈ కొత్త స్త్రీ వచ్చింది.
తన క్రీడా ప్రతిభతో బెంగాల్‌లోని అందరికీ సుపరిచితమైన ఆమెను పత్రికలన్నీ ఒలింపిక్‌ క్రీడల పోటీలకు ఆహ్వానం అందుకున్న తొలి మహిళగా అభివర్ణించాయి. కానీ, ఆమెకు ఆ తర్వాత ప్రభుత్వం నుంచీ ఎటువంటి సమాచారమూ రాలేదు. రెండో ప్రపంచ యుద్ధం కారణంగా ఈ ఒలింపిక్‌ క్రీడలు రద్దవుతాయన్న అభిప్రాయంతో కావచ్చు.
ఈ వ్యాసకర్త దాదాపు ఒక దశాబ్దం కిందట భారత దేశపు మహిళా అథ్లెట్‌ల మీద మొదలు పెట్టదలచిన తన పరిశోధన గురించి వెతుకుతుండగా ఈలా గురించి తెలుసుకున్నారు. ఒక రెండు బ్లాగుల్లో మాత్రం 1940ల్లో ఒక అథ్లెట్‌గా, బాస్కెట్‌బాల్‌ ప్లేయర్‌గా ఆమె గురించిన కొన్ని వివరాలు, దేశ విభజన అనంతరం (పాకిస్తాన్‌లోని) తూర్పు బంగ్లాలో ఆమె నివసించదలచుకున్నట్టు తెలిసింది. అంతకంటే ఏ వివరాలూ తెలియకపోవడంతో వ్యాసకర్త ఆ విషయాన్ని వదిలేశారు. మరలా, కరోనా సెకండ్‌ వేవ్‌ మధ్యలో, ఈ వేసవి కాలంలో ఆమె పేరు గుర్తుకువచ్చింది, ఏదో ఈలానే నిద్రలో తట్టిలేపి 1940 గురించి మళ్ళీ చెప్పినట్లు.
ఈసారి ఇంటర్నెట్‌లో చూస్తే ఆ వివరాలు బెంగాలీలో ఉన్నాయి. చాలా విచిత్రంగా, ఏదో ఈలానే టెలీపతీ గ్రూప్‌ ఏర్పాటు చేసినట్టు, ఆమె కుటుంబాన్ని, అంటే కలకత్తాలో ఆమె కుమారుడినీ, అమెరికాలో ఆమె మనవడినీ కనుక్కోగలిగారు ఈ వ్యాసకర్త.
1940లో ఒలింపిక్స్‌ తలపెట్టినపుడు ఈలా వయసు 15 ఏళ్ళు. ఆ వయసులో నిరాశ చాలా బాధిస్తుంది. ఆమె తన ఫీలింగ్స్‌ గురించి ఎక్కడా రాయలేదు. తన కుటుంబంలో ఎవరితోనూ చెప్పలేదు. ‘‘తన గురించి తను ఎప్పుడూ మాట్లాడడం నాకు గుర్తులేదు’’ అని ఈలా మనుమడు రితేంద్రనాథ్‌ మిత్రా చెప్పారు. ఇతను ఎంటల్లీలో ఒక అద్దె అపార్ట్‌మెంట్‌లో ఈలా దగ్గర పెరిగాడు. ‘‘ఆవిడ సాధారణంగా పార్టీ (సిపిఐ) గురించీ, అది చేసే పొరపాట్లూ, నాయకుల అహంకారం గురించీ మధన పడుతూ ఉండేవారు. 1990ల్లో, నాకు ఊహ తెలిసేసరికి తక్మా (బెంగాలీలో నాయనమ్మ) అంత ప్రముఖ వ్యక్తి కాదు. ఆవిడ పోయిన చాలాకాలం తర్వాత, ఆవిడ వారసత్వం చాలా ప్రత్యేకమైనదని తెలుసుకున్నాను. ఆవిడ జీవించి ఉండగా, తన జీవితం గురించి నేను అడిగి ఉండాల్సింది’’ అని అన్నారాయన.
ఆవిడ జ్ఞాపకార్థం ఆయన రాసిన ఒక వ్యాసంలో ఇలా రాశారు ‘‘తక్మా నన్ను రోజూ తెల్లవారురaామునే, కాక్‌ భోరీ సమయంలో, అంటే బెంగాలీలో కాకులు తప్ప ఇంకెవరూ మేలుకొని ఉండని సమయంలో నిద్ర లేపేవారు. ఇద్దరం ఆండర్సన్‌ క్లబ్‌కి ఈత కోసం వెళ్ళేవాళ్ళం. ఆవిడ పోయే కొద్ది రోజుల ముందు వరకు కూడా ఆమెకు ఇదే అలవాటు. రోజూ అలా ఈతకొడుతూ, ఎక్సర్‌సైజ్‌ చేస్తూ ఉండేవారు. తాను ఎదుర్కొన్న హింసను తట్టుకోగలిగారంటే అది తన ఈ శారీరక ధృడత్వం వల్లే అని ఆమె నమ్మేవారు’’.
1940వ సంవత్సరం బెంగాల్‌కు చాలా విధ్వంసకరమైనది. ఒకవైపున ధాన్యపు కొరత, పెరిగే ధరలు ప్రజలను బాధిస్తుండగా, బ్రిటిష్‌ ప్రభుత్వం రెండో ప్రపంచ యుద్ధానికి సన్నద్ధమయి ఉంది. 1942లో శీతాకాలంలో మేదినిపూర్‌ జిల్లాని ప్రళయం లాంటి తుఫాను దెబ్బ తీసింది. ఈ తుఫాను, యుద్ధం వల్ల ఆహారపు కొరత పెరిగిపోయి, 1943`44లో మానవ తప్పిదం వల్ల వచ్చిన కరువు వల్ల దాదాపు మూడు మిలియన్ల మంది ప్రజలు చనిపోయారు. ఈ కరువే బెంగాల్‌ రాజకీయాలను, ముఖ్యంగా ఈలా జీవితాన్ని మార్చాయి.
1942లో ఈలా బెథూన్‌ స్కూల్‌ నుంచి ఇంటర్మీడియట్‌ పరీక్ష పాసయ్యారు. అదే కాలేజ్‌లో డిగ్రీలో చేరారు. ఆ కాలంలో బెథూన్‌ కాలేజ్‌ మహిళల కోసం ప్రతిష్టాత్మకంగా ఉండేది. దీన్ని మొదటి రోజుల్లో ఈశ్వర్‌ చంద్ర బంధోపాధ్యాయ్‌ (విద్యాసాగర్‌) మేనేజ్‌ చేసేవారు. ఈయన బాలికల చదువు కోసం, వితంతువుల పునర్వివాహం కోసం, బాల్య వివాహాలకు వ్యతిరేకంగా చాలా కృషి చేశారు. ఈలా ధైర్యంగా పనిచేసిందంటే అది ఆ స్కూల్లో నేర్పిన అసాధారణమైన ఆశయాలు, ధృడ విశ్వాసం, తెగువ వల్ల మాత్రమే.
Unclaimed Harvest అనే పుస్తకం కోసం కవితా పంజాబీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఇలా చెప్పారు ‘‘బెథూన్‌ కాలేజిలో చేరాక నేను బాలికా విద్యార్థుల కమిటీలో చేరాను. మేము అప్పుడు మార్క్సిజం గురించి చర్చించుకునేవాళ్ళం. ఇది మేము రహస్యంగా చేసేవాళ్ళం. తర్వాత నేను సహాయ కార్యక్రమాల్లో పాల్గొని, పార్టీ సభ్యురాలినయ్యాను’’.
సిపిఐ పార్టీకి అనుబంధంగా మహిళా ఆత్మ రక్షణ సమితి (ఎంఎఆర్‌ఎస్‌) 1942లో ఏర్పాటయింది. మొదట్లో ఇది మహిళలను సాయుధ దళ సైనికుల దగ్గరకు అక్రమ రవాణాను నిరోధించడం కోసం పనిచేసేది. తర్వాతి కాలంలో, ఈ ఆత్మరక్షణ పరిధి ఆకలికి, పేదరికానికి, హింసకి వ్యతిరేకంగా కూడా అభివృద్ధి చెందింది. ఎంఎఆర్‌ఎస్‌ సంక్షేమ నిధుల కోసం బెంగాల్‌ అంతా తిరగడం, మహిళల రక్షణకై రాత్రిళ్ళు పహారా కాయడం, ఆకలితో అలమటించే వారి కోసం సామూహిక వంటశాలలు ఏర్పరచడం, వ్యక్తిగత హక్కులు కాపాడడం కోసం వంటి పనులు కూడా చేసేది. బహుశా, ఆధునిక భారతదేశంలో ఈ ఎంఎఆర్‌ఎస్‌ ఇలా ప్రజా సంక్షేమ పనుల్లో పాలుపంచుకోవడం మొట్టమొదటిసారి అయి ఉంటుంది.
1944లో ఈలా తండ్రి ఆమె వివాహం కోసం, రామచంద్రపురా లోని జమీందారీ కుటుంబానికి చెందిన రామేంద్రనాధ్‌ మిత్రాని కలుసుకున్నారు. అతను ఎప్పటికీ ఉద్యోగం చేయననీ, తాను సిపిఐ పార్టీకి చెందిన వ్యక్తిగానే ఉంటాననీ అనేవారు.
ఈలా స్త్రీ వాది అయినప్పటికీ, వరుడి ఈ రాజకీయ నేపథ్యం కారణంగా పెళ్ళికి ఒప్పుకున్నారు. 1947లో ఆమె అత్తగారైన బిశ్వమయ మిత్రా అనూహ్యంగా తూర్పు బెంగాల్‌లోనే ఉండాలని నిర్ణయించారు. 17 ఆగస్టున ప్రకటించిన Radcliffe లైన్‌కు కుడివైపుగా ఉన్న నవాబ్‌ గంజ్‌లో వారి జమిందారీ ఎస్టేట్‌ ఉంది. చాలా హిందూ బెంగాలీ కుటుంబాలు భారతదేశానికి వెళ్ళిపోతున్నా, తన ఈ ఎస్టేట్‌ కోసం ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈలా, రామేంద్రనాథ్‌ ఇరువురూ కౌలు రైతుల కుటుంబాల హక్కుల కోసం పనిచేసేవారు. భూస్వాములకు కౌలు తాలూకు వచ్చిన పైకంలో సగం ఇచ్చే పద్ధతి కాకుండా, మూడో వంతు మాత్రమే చెల్లించమని వీరిని సమాయత్తపరిచేవారు. తెభంగా (మూడోవంతు) ఉద్యమం ముఖ్య డిమాండ్‌ ఇదే. వరదలు చేసిన విధ్వంసం ఇంకా వారిని వేధిస్తుండగా, ఇలా రైతులకు ఎక్కువ డబ్బు మిగిలేలా చేయడంతో వారి పేదరికం, ఆకలి కేకలు పోతాయన్న ఆశయం ఇది. మిత్రా కుటుంబం ఇలా పనిచేస్తుండగా, మిగిలిన జమిందారీ వంశస్థులు ఈ కొత్త ఉద్యమాన్ని అణచివేయమని ప్రభుత్వానికి మద్దతు పలికారు. అరెస్టుని తప్పించుకోవడానికీ, ఈ పని చేయడానికీ వీలుగా ఉంటుందని ఈ దంపతులు రైతులతో పాటే నివసించేవారు. ఈలా ఒక ఆశయం కోసం కట్టుబడిన కమ్యూనిస్టు అయినప్పటికీ, ఈ ఉన్నత కులాల పక్షపాతానికి గురవ్వక తప్పలేదని, కవితా పంజాబీ తన పుస్తకంలో రాశారు. సంతల్‌ వారి (పశ్చిమ బెంగాల్‌లోని ఒక గిరిజన తెగ) ఇళ్ళు చాలా మురికిగా ఉండేవి. ఆ రైతులందరూ ఈలాను రాణి మా అని పిలిచేవారు.
జనవరి 5, 1950న నాచోల్‌లో పోలీసుల రైడ్‌ జరిగింది. ఆ ఘర్షణలో నలుగురు పోలీసులు చనిపోయారని, తాను రచించిన ఈలా మిత్రా జీవిత చరిత్రలో మలేకా బానో బేగమ్‌ రాశారు. ఈ సంఘటన తర్వాత ఈలా ఒక సంత్‌ స్త్రీలా తయారయ్యి మిగతా రైతులతో కలిసి ఆ ప్రదేశాన్ని విడిచి వెళ్ళారు. కానీ, అప్రమత్తంగా ఉన్న పోలీసులు నాచోల్‌ రైల్వే స్టేషన్‌లో ఈలా చేతికి పెట్టుకున్న వాచ్‌ని బట్టి ఆమెని గుర్తుపట్టి, నలుగురు పోలీసులను చంపిన అభియోగం మీద ఆమెను అరెస్ట్‌ చేశారు.
నాచోల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఈలాను ఒక్కతినే ఒక సెల్‌లో బట్టల్లేకుండా ఉంచారు. ఆమెకు ఆహారం కానీ, నీరు కానీ ఇవ్వలేదు. రాత్రివేళ, ఒక సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ కొంతమంది పోలీసులతో కలిసి ఆమె సెల్‌కు వచ్చి తుపాకీ మడమతో ఆమె తలపై కొట్టాడు. దాంతో ఆమె ముక్కులోంచి, తలలోంచి రక్తం ధారలుగా కారింది. తర్వాత ఆమెను ఆ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ క్వార్టర్స్‌కు తీసుకువెళ్ళి ఆమె కాళ్ళను రెండు లాఠీల మధ్య నొక్కి ఉంచి, ఆమె నోటికి గుడ్డ కట్టేశారు. తిరిగి ఆమెను సెల్‌కి తెచ్చారు. అక్కడ ఆ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ నాలుగు ఉడికించిన గుడ్లను తెమ్మన్నాడు. ‘‘ఇప్పుడు చెప్తుంది చూడండి’’ అన్నాడతను. నలుగురైదుగురు పోలీసులు ఆమెను నేలమీద పడుకోబెట్టి పట్టుకున్నారు. ఒకడు ఆ వేడి వేడి గుడ్డును ఆమె యోనిలో ఉంచాడు. ఆమె స్పృహ కోల్పోయింది.
కొంతసేపటికి ఆమెకు తెలివి వచ్చి చూస్తే ఆ ఎస్సై, అతని అనుచరులు ఆమె పొట్టపై కొడుతూ కనిపించారు. ఆమె కుడికాలి మడమ మీద, చీలేలా ఒక మేకు కొట్టారు. తర్వాత, ఆమె మీద ఒక పోలీసు అత్యాచారం చేశాడు. ఆమె మళ్ళీ స్పృహ కోల్పోయింది.
ఇలా ఈ హింస ఒక నాలుగు రోజులపాటు సాగింది. ఆమెకు బాగా జ్వరం రావడంతో నవాబ్‌ గంజ్‌ స్టేషన్‌కు తరలించారు. అక్కడ జైల్‌ వార్డెన్‌ ఓ.ఎస్‌.రెహ్మాన్‌, కలకత్తా యూనివర్శిటీలో ఆమె బ్యాచ్‌ మేట్‌. వరదల తర్వాతి సంక్షేమ పనుల్లో అతను ఆమెతో కలిసి పనిచేశాడు. 105 డిగ్రీల జ్వరం ఉన్న ఆమెను చూసి ఒక డాక్టర్‌ని పిలిపించాడు. ఆ తర్వాతి కాలంలో ఆమె 1954 వరకు జైల్లో ఉన్నా, ఆమెకు వైద్య చికిత్స అందేది. తాను ఒక అథ్లెట్‌ అయినందున మాత్రమే కస్టడీలో ఉన్నప్పుడు ఆ హింసను తట్టుకుని కూడా, 1956 సమయానికి తిరిగి నడవగలిగానని ఆమె చెప్పేవారు. ఆ హింసవల్ల ఆమె కాళ్ళు దెబ్బతిని, కొంచెం కుంటుతూనే నడిచేవారు.
1951 జనవరిలో రాజస్థాన్‌ కోర్టులో ఆమెను విచారించారు. బహుశా, ఈ ఉపఖండం మొత్తంలో తన మీద జరిగిన అత్యాచారం గురించి చెప్పిన మొదటి మహిళ ఆమే అయి ఉండొచ్చు. దీనికి ఆమె ఇష్టపడలేదు. కానీ సిపిఐ పార్టీ ఆమెను ఒప్పించి, చెప్పించి, ఆమె చెప్పిన వివరాలను ఒక పాంప్లెట్‌గా వేయించి, తూర్పు బెంగాల్‌లో అంతటా పంచి పెట్టిందని బేగమ్‌ తన పుస్తకంలో రాశారు.
పార్టీ చేసిన ఈ తెలివైన పనివల్ల మొత్తం తూర్పు బెంగాల్‌ ప్రజలు దీనికి నిరసన తెలిపారు. బెంగాల్‌లోని కవులు, పశ్చిమ బెంగాల్‌లోని సుభాష్‌ ముఖర్జీ, తూర్పు బెంగాల్‌లోని గులాం ఖుద్దూస్‌ ఆమె గౌరవార్ధం కవితలు రాశారు. ఆమెను కోర్టులో విచారించాక పోలీసులను చంపినట్టు ఆమె మీద ఉన్న హత్యానేరానికి సాక్ష్యమయితే దొరకలేదు కానీ, ఆ నలుగురు పోలీసులు మరణించడానికి దారి తీసిన ఘర్షణలకు కారకురాలిగా తేల్చి కోర్టు ఆమెకు ఏడేళ్ళ శిక్ష విధించింది.
ఆమె ఇచ్చిన వాంగ్మూలం కూడా జడ్జిని, అధికారులనీ కదిలించి ఉండవచ్చు. 1953లో దాదాపు మరణానికి దగ్గరగా వెళ్ళేంతగా ఆమె ఆరోగ్యం బాగా క్షీణించి పోయినప్పుడు, పోలీసులు ఆమెను ఢాకాలోని హాస్పిటల్‌కు తరలించారు. 1954లో పెరోల్‌ మీద ఆమెను కలకత్తాలో చికిత్స పొందేందుకు తరలించారు. అలా వచ్చిన ఈలా తిరిగి మరలా బంగ్లాదేశ్‌కు 1996 వరకు వెళ్ళలేదు. 1996లో ఆ దేశం ఏర్పాటయి 25 ఏళ్ళయిన సందర్భంగా ఆమె ప్రభుత్వ అతిధిగా అక్కడికి వెళ్ళారు.
కలకత్తాలో హాస్పిటల్‌ నుంచి ఆమెను 1956లో డిశ్చార్జి చేశారు. ఆ సమయానికి ఆమె కొద్ది ఆసరాతో నడవగలిగారు. తన దృఢ సంకల్పంతో, రోజువారీ ఎక్సర్‌సైజ్‌లతో ఆమె తిరిగి మామూలు మనిషై, 1962లో తన మాస్టర్స్‌ డిగ్రీ పూర్తి చేశారు. శివనాథ్‌ శాస్త్రి కాలేజీలో లెక్చరర్‌గా ఉద్యోగం పొందగలిగారు. ఆ తర్వాత మనిక్తల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి గెలిచారు. అలా ఆమె 1977 వరకు ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. ఈ కాలంలో ఆమె 1950, 1960లలో ఖాద్య ఆందోళన్‌లో అంటే ప్రజల కోసం ఆహారాన్ని సరిపోయినంత పంచాలనీ, అక్రమ నిల్వలు చేయకూడదనీ చురుకుగా, శక్తివంతంగా పోరాడారు. విచిత్రంగా, 1977లో వామపక్షం అధికారంలోకి వచ్చాక, ఆమెకు ఇక పోటీ చేయడానికి టికెట్‌ లభించలేదు.
ఆమె కుమారుడు రోనేంద్రనాథ్‌ చెబుతూ ‘‘అమ్మ ఎప్పుడూ స్థిరంగా ఉండేవారు. రోజూ కాలేజి అయ్యాక, పార్టీ ఆఫీసుకి వెళ్ళేవారు. వాళ్ళు చేస్తున్న పొరపాట్ల మీద అక్కడి ఆఫీసు బేరర్స్‌ని మందలించేవారు. పార్టీ ఏం పొరపాట్లు చేస్తోందో అంతా, అన్ని విషయాలూ ఆమె ఇంట్లో చెప్పేవారు. తన గురించి మాత్రం ఏం చెప్పేవారు కాదు. అమ్మ నాకు మంచి స్నేహితురాలు. మీకు తెలుసా, ఏడేళ్ళప్పుడు మీరు ఆమెను కలిసినా, ఆమె మీకు మంచి ఫ్రెండ్‌ అవుతుంది. ఆమె ఫ్రెండ్‌గా నాకిది తెలుసు’’.
ఒక కవి ఫిలాసఫీలాగా, ఒక కళాకారుడి భావుకత లాగా, ఒక క్రీడాకారుడి జాతీయత వ్యక్తికి గుర్తింపుగా
ఉంటుంది. క్రీడాకారులు దేశపు ప్రాతినిధ్యం కంటే కూడా ఎక్కువ ఎదగగలరు. ‘‘జీవితంలో గెలుపు కన్నా ఆ ఘర్షణలు ఎదుర్కోవడమే ఎలా ముఖ్యమో, ఒలింపిక్‌ క్రీడల్లో గెలవడం కన్నా వాటిల్లో పాల్గొనడం చాలా ముఖ్యం. జయించడం కాదు, ఎలా పోరాడామో మాత్రమే చాలా అవసరం’’ అని మోడరన్‌ ఒలింపిక్స్‌ ఫౌండర్‌ అయిన Pierrede Coubertin అన్నారు. ఆమె జీవితంలో ఒలింపిక్స్‌ మిస్సయినా, ఈలా మిత్రా ఒక ఆశయం కోసం శ్రమించారు. మూడుసార్లు దేశ విభజనని, దుర్భరమైన కరువునీ ఎదుర్కొన్న బార్డర్‌కి రెండు వైపుల ఉన్న బెంగాల్‌ ప్రజల కోసమూ, వారి సంక్షేమం కోసమూ ఆమె ఉద్యమించారు.
ఈ ఏప్రిల్‌, మే నెలల్లో సోషల్‌ మీడియా అంతా ఆక్సిజన్‌ కోసం, మందుల కోసం పరిగెడుతుంటే, నీటిలో తేలడానికి ఒక తెప్పలాగా, నేను ఈలా కథని పట్టుకుని ఉన్నాను. హక్కుల కోసం ఈలా మొదలుపెట్టిన ఉద్యమం తెభంగా నుంచి 1960లో ఖాద్య ఆందోళన్‌కీ, 1970ల్లో బర్గా ఆందోళన్‌కీ ఒక దారి చూపిందని చాలా ఆనందం వేసింది. ఈలా కేవలం గతాన్ని గుర్తు చేయడం కోసమే కాదు, తిరిగి మళ్ళీ ప్రారంభించడానికి స్ఫూర్తిగా కూడా నా మనసులోకి వచ్చి ఉంటారని వ్యాసకర్త అన్నారు.

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.