ఐక్యతారాగంకి రాకముందు నా ఆలోచనా విధానం సాధారణంగా మహిళల ఆలోచనలు, అభిప్రాయాలు ఎలా ఉంటాయో అలాగే ఉండేది. అంటే మన పెద్దవాళ్ళు పెట్టిన కట్టుబాట్లలోనే ఆడవారు ఉండాలి,
ఒకవేళ మహిళలు కట్టుబాట్ల నుండి బయటికి వచ్చి స్వేచ్ఛగా వారికి నచ్చినట్లుగా బ్రతికితే అది చాలా పెద్ద తప్పని నేను అనుకునేదాన్ని. అలాగే కుటుంబ పెద్దగా పురుషులకే నిర్ణయాధికారం ఉంటుందని నేను చిన్నప్పటి నుంచి ఆలోచించేదాన్ని. కానీ ఐక్యతారాగంకి వచ్చిన తర్వాత నా ఆలోచనా విధానంలో చాలా మార్పు వచ్చింది. ఐక్యతారాగంలో ముఖ్యంగా లైంగిక, పితృస్వామ్య వ్యవస్థ, జెండర్ బాక్సుల గురించి తెలుసుకున్నాక మహిళలను కంట్రోల్‌లో పెట్టుకోవడానికే వారిపై ఇన్ని ఆంక్షలు, కట్టుబాట్లు పెట్టారా అనేది తెలుసుకున్నాను. ఇప్పుడు ప్రతీదీ స్త్రీవాద దృక్పథంతో ఆలోచిస్తున్నాను. మన సమాజంలో పితృస్వామ్య వ్యవస్థ ఇంకా ఎంత బలంగా ఉందో అర్థం చేసుకుంటున్నాను.
సమావేశాల్లో మాట్లాడడానికి, నాకు తెలిసిన అంశాన్ని అందరితో పంచుకోవడానికి భయంగా, మొహమాటంగా
ఉండేది. కానీ ఇప్పుడు నేను ఎక్కడైనా ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాను. నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఐక్యతారాగంకి వచ్చిన తర్వాత ట్రాన్స్‌జెండర్స్‌పై నాకు చాలా గౌరవం పెరిగింది. అంతకు ముందు ట్రాన్స్‌జెండర్స్‌ని చూసి పక్కకు వెళ్ళిపోయేదాన్ని. కానీ ఇప్పుడు వారు కనిపించగానే నేనే దగ్గరికి వెళ్ళి పలకరిస్తున్నాను.
ఐక్యతారాగం ఇచ్చిన స్ఫూర్తితోనే నేను కవితలు రాయగలుగుతున్నాను, పాటలు పాడగలుగుతున్నాను.
థాంక్యూ ఐక్యతారాగం.