శిక్షణకు ముందు నా ఆలోచనా విధానం అందరి సామాన్య మహిళలలాగే ఉండేది. కానీ శిక్షణ తర్వాత మహిళా సమస్యలను పితృస్వామ్య వ్యవస్థ దృష్టికోణంలో చూస్తూ, వారి సమస్యలను లోతుగా అర్థం చేసుకుని పని ప్రదేశంలోని సమస్యలలో ఉన్న మహిళలకు కూడా
అర్థం చేయిస్తున్నాను. వారి సమస్యలు పరిష్కరించుకోవడంలో నేను ఇచ్చే సలహాలు, సూచనలు వారికి చాలా బాగా ఉపయోగపడుతున్నాయి.
పని ప్రదేశంలో లైంగిక వేధింపులు జరిగినట్లయితే అటువంటి సమస్యల నుండి బయట పడడానికి ఉన్న చట్టం గురించి అసంఘటిత మహిళలకు, ప్రైవేట్ ఉద్యోగాలు చేసే మహిళలకు తెలియజేయడం జరుగుతోంది. దానివల్ల అలాంటి సమస్యలు చెప్పడానికి మహిళలు ముందుకు వస్తున్నారు. ట్రాన్స్‌జెండర్స్ యొక్క సమస్యల గురించి, మరియు సమాజంలో వారు పడుతున్న కష్టాల గురించి తెలిసిన తర్వాత ప్రస్తుతం నేను వారిని చూసే దృష్టి కోణంలో పూర్తిగా మార్పు వచ్చింది.
దేశం ఎంతో అభివృద్ధి చెందుతున్నప్పటికీ ఇంకా కొన్ని గ్రామాలలో బాల్య వివాహాలు చేస్తున్నారు. కావున అలా చేస్తున్న తల్లిదండ్రులకు బాల్య వివాహాల వలన అమ్మాయిలు శారీరకంగా, మానసికంగా, అలాగే కెరియర్ పరంగా నష్టపోయే విధానాల గురించి, అలాగే అమ్మాయిలు అత్తగారి కుటుంబాన్ని సమన్వయం చేసుకునే విధానాలలో అవగాహన లేకపోవడం వలన కుటుంబాల్లో వచ్చే సమస్యలను పరిష్కరించుకోలేరని తెలియజేయడం వలన అమ్మాయిలు చదువుకోవడానికి ఉన్న ప్రభుత్వ అవకాశాలను తెలియజేయడం వలన తల్లిదండ్రులు బాల్య వివాహాలు చేయడం విరమించుకుంటున్నారు.