ఐక్యతారాగానికి ముందు నేను ఏదైనా ఆఫీసులకు వెళ్ళవలసి వచ్చినపుడు, ఎక్కడికైనా ఒక్కదాన్నే వెళ్ళవలసి వచ్చినపుడు, మీటింగులలో మాట్లాడాలన్నప్పుడు, మీటింగులలో ఎక్కువమంది ఉన్నప్పుడు, నాకు తెలిసిన విషయాలు కూడా మాట్లాడేదాన్ని
కాదు. నాలో భయం, మొహమాటం చాలా ఉండేవి. జెండర్ విషయాలు, జెండర్ అంటే ఏంటి అనేది నాకు కొంచెం మాత్రమే తెలుసు. నాకు పాటలు పాడడం, కవితలు రాయడం వచ్చేది కాదు.
ఐక్యతారాగం తర్వాత నాలో చాలా మార్పు వచ్చింది. నేను ధైర్యంగా ఆఫీసుకి వెళ్ళగలుగుతున్నాను. ఎలాంటి భయం, మొహమాటం లేకుండా, కేసుల విషయంలో పోలీస్ స్టేషన్లకి వెళ్ళి మాట్లాడగలుగుతున్నాను. ఎక్కడికైనా ఒక్కదాన్నీ ఎలాంటి భయం లేకుండా వెళ్ళగలుగుతున్నాను. నేను ఏ మీటింగ్‌కైనా వెళ్ళి మాట్లాడగలుగుతున్నాను. అలాగే ప్రతి విషయాన్ని స్త్రీవాద దృక్పథంతో మాట్లాడగలుగుతున్నాను. ట్రాన్స్‌జెండర్‌ల విషయంలో నాలో చాలా మార్పు వచ్చింది. ట్రాన్స్ జెండర్లతో మాట్లాడగలుగుతున్నాను. నాతోటి వారికి పని చేసేచోట చెప్పగలుగుతున్నాను.
నేను కవితలు, పాటలు రాయగలుగుతున్నాను, అలాగే పాటలు కూడా పాడగలుగుతున్నాను. సమాజంలో ఉన్న మహిళల సమస్యలు, వారు పడుతున్న హింసల గురించి పూర్తిగా అర్థం చేసుకున్నాను. మహిళల హక్కుల గురించి తెలుసుకున్నాను. దేశ రాజకీయ, కుల వ్యవస్థ, ఆధిపత్య పోరు గురించి తెలుసుకున్నాను.
ఐక్యతారాగం కుటుంబానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు.
జనజీవన స్రవంతిలో సత్ప్రవర్తన మూలంగా
ఏ బంధంలేని స్నేహబంధానికి ప్రతిబింబంగా నిలిచి
మనమంతా ఒక్కటై వెలిసిన ఐక్యతారాగమా…
ఓ నా ప్రియ నేస్తమా…
మమతానురాగాలకు నిలయమా ఐక్యతారాగమా…
కొనసాగాలి మన ఈ ప్రయాణం