ఐక్య ఉద్యమాల ద్వారా మాత్రమే మార్పును సాధించగలం: అనేక ఉద్యమ పాయల కూడలి -జ్యోత్స్న ఆవులజ్యోత్స్న ఆవుల

ఈ వేదికకు ఎందుకు రూపకల్పన జరిగింది?
మేము ప్రస్తుతం ఐక్యతారాగం కార్యక్రమం యొక్క రెండవ సంవత్సరంలో ఉన్నాం. మొదటి సంవత్సరంలో జెండర్‌, లైంగికత, జెండర్‌ ఆధారిత హింస, రాజ్యాంగం, మానవ హక్కులపై భూమిక, వేదిక, గ్రామ్య సంస్థలకు చెందిన టీం సభ్యులకు సమగ్ర శిక్షణలు

నిర్వహించాము. ఈ శిక్షణల్లో జెండర్‌, కులం, మహిళా ఉద్యమం (ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలపై దృష్టి పెట్టి) మరియు మహిళా రైతుల సమస్యలపై విశ్లేషణాత్మక చర్చలు చేయగలిగేలా టీం సభ్యులకు శిక్షకులు దిశానిర్దేశం చేశారు. అంతేకాకుండా, శిక్షకులు టీం సభ్యులకు ఎంతో జ్ఞానాన్ని అందించారు, వారి దృక్పథాలను బలోపేతం చేశారు, వారి నైపుణ్యాలు, సామర్ధ్యాలను పెంపొందించుకోవడంలో సాయపడ్డారు. ఇంకా గత సంవత్సరంలో కులం, వికలాంగత, మతం, వర్గం వంటి సామాజిక నిచ్చెనమెట్ల వ్యవస్థల్లో జెండర్‌ మరియు లైంగికత ఎలా చొచ్చుకొనిపోయాయో చర్చించాము. ఐక్యతారాగం సభ్యుల అవగాహన దినదినానికి వృద్ధి చెందింది. ఈ నేర్చుకునే ప్రక్రియ సమగ్రంగాను, ఉత్తేజభరితంగాను ఉంది. సభ్యులకు ఇంకా చాలా ప్రశ్నలు మిగిలి ఉన్నాయి. తరువాతి దశలో భాగంగా, ఐక్యతారాగం సభ్యులుపై అంశాలపై సంక్లిష్టమైన చర్చలను క్షేత్రస్థాయిలో వారు పనిచేస్తున్న సముదాయాలు ముఖ్యంగా మహిళలు, యువత వద్దకు తీసుకెళ్ళాలి. ప్రస్తుతం కార్యక్రమంలో ఇది రెండవ సంవత్సరం. ఐక్యతారాగం కారవాన్‌ సరిక్రొత్త ఆలోచనలతో సానుకూల మార్పును ఆశిస్తూ ముందుకు సాగడానికి సిద్ధంగా ఉంది.
ఈ శిక్షణల్లోని అనుభవాల ఆధారంగా హక్కులపై అంతర్వుద్యమాల వేదిక ఆలోచన పుట్టింది. వివిధ ఉద్యమాలకు చెందిన వ్యక్తులతో ముఖాముఖి సమావేశం కావడం వలన సభ్యులు తమకు సంబంధించిన అనేక అంశాలపై ఒక ‘‘విహంగ వీక్షణ దృష్టి’’ని పొందడానికి సాయపడుతుందని శిక్షకులు భావించారు. ఈ వేదిక యొక్క ముఖ్య ఉద్దేశ్యాలు ఏమిటంటే వక్తలు ఆహ్వానించే చెందిన
ఉద్యమాలలోని ప్రధాన అంశాలను పంచుకోవడంÑ వారి ఉద్యమాల్లో సాధించిన తాము విజయాల గురించి చెప్పడంÑ ప్రస్తుతమున్న సవాళ్ళకు ఉద్యమం ఎలా స్పందిస్తోందనే అంతర్‌ దృష్టిని పంచుకోవడం.
శిక్షకులు ఆంధ్రప్రదేశ్‌ మరియు తెలంగాణ రాష్ట్రాలలోని కులం, వికలాంగత హక్కులు, ట్రాన్స్‌జెండర్‌ వ్యక్తుల హక్కులు, గృహ కార్మికులు, సెక్స్‌ వర్కర్లు, ముస్లిం మహిళలు మరియు మహిళా రైతుల సమస్యలపై పనిచేస్తున్న వ్యక్తులను ప్యానలిస్టులుగా ఆహ్వానించారు. ఆహ్వానితులలో విద్యావేత్తలు, రచయితలు, పరిశోధకులు, క్షేత్రస్థాయి కార్యకర్తలు ఉన్నారు. ఈ రెండు రాష్ట్రాలలో ఉద్యమాలకు చెందిన చాలామందికి ఆహ్వానాలు వెళ్ళినప్పటికీ, ఈ వేదికకు అందరూ వస్తారని ఊహించలేదు. ఆ ఉదయం ఒకానొక సమయంలో ఐక్యతారాగం సభ్యులతో తమ ఆలోచనలను మరియు అనుభవాలను పంచుకోవడానికి దాదాపు ఇరవైమంది వక్తలు ఈ సమావేశంలో ఉన్నారు. మూడు గంటల చర్చాగోష్టిగా ప్లాన్‌ చేయబడిన ఈ వేదిక నాలుగు గంటల కంటే ఎక్కువ సమయం కొనసాగి ఒక ఉన్నతమైన, ఉత్కంఠభరితమైన సెషన్‌గా మారింది.
నలుగురు వక్తలు వికలాంగత, కులం, ట్రాన్స్‌జెండర్‌ వ్యక్తుల మరియు ముస్లిం మహిళలకు చెందిన అంశాల గురించి చర్చించడం ద్వారా ఈ వేదికను ప్రారంభించారు. ఈ చర్చా వేదికకు కొండవీటి సత్యవతి మోడరేటర్‌గా వ్యవహరించారు. మీరా సంఘమిత్ర, ట్రాన్స్‌జెండర్‌ ఉద్యమం, సమస్యలు, హక్కులు, నల్సా తీర్పు గురించి మాట్లాడారు. ఈమె నేషనల్‌ అలయెన్స్‌ ఆఫ్‌ పీపుల్స్‌ మూవ్‌మెంట్‌ మరియు తెలంగాణ హిజ్రా ఇంటర్‌ సెక్స్‌ ట్రాన్స్‌జెండర్‌ సమితిలతో కలిసి పనిచేస్తున్నారు. భాషా అవార్డు గ్రహీత.
మీరా తమ ఉద్యమ అనుభవాలను పంచుకుంటూ ` భారతదేశంలో ట్రాన్స్‌జెండర్‌ ఉద్యమం గత పది సంవత్సరాలుగా క్రియాశీలకంగా ఉంది, మంచి గుర్తింపు పొందింది. ట్రాన్స్‌జెండర్‌ వ్యక్తుల జీవితాలు, అనుభవాలు పితృస్వామ్య వ్యవస్థచే ప్రభావితమవుతున్నాయి. పోరాటాల ఫలితంగా 2014లో సుప్రీంకోర్టు నల్సా తీర్పు వచ్చింది. రాజ్యాంగం ప్రకారం పౌరులందరికీ హక్కులు ఉన్నప్పటికీ ట్రాన్స్‌ వ్యక్తులకు సంబంధించి రాజ్యాంగం హక్కు 2014లో మాత్రమే వచ్చింది. ఈ తీర్పుతో ట్రాన్స్‌ వ్యక్తుల రాజ్యాంగ హక్కులపై చర్చ అందరి దృష్టిని ఆకర్షించింది. వివక్షత లేకుండా జీవించే హక్కు, విద్య, ఉపాధి అవకాశాలు పొందే హక్కు మరియు స్వీయ గుర్తింపు హక్కులు శోధించడానికి, అర్థం చేసుకోవడానికి ముఖ్యమైన అంశాలుగా మారాయని అన్నారు. స్వీయ గుర్తింపు గురించి మాట్లాడుతూ, ట్రాన్స్‌జెండర్‌ వ్యక్తులు తమని తాము సమాన స్త్రీలుగా, సమాన పురుషులుగా గుర్తించుకుంటున్నారు కాబట్టి చాలామంది ట్రాన్స్‌జెండర్‌ వ్యక్తులు ‘మూడవ లింగం/జెండర్‌’ అనే పదజాలాన్ని తిరస్కరిస్తున్నారు. జెండర్‌ అనేది ఒక విస్తృతమైన వర్ణపటం వంటిది. వ్యక్తులు దీనిలో తమని తాము ఏ విధంగానైనా గుర్తించుకోవచ్చు. ఒక వ్యక్తి జీవితంలో బహుళ గుర్తింపులు ఉండవచ్చు. ఈ విధమైన వైవిధ్యాన్ని, బహుళత్వాన్ని గుర్తించడం చాలా ముఖ్యం. తమని తాము ట్రాన్స్‌జెండర్‌గా గుర్తించుకున్న వ్యక్తులు వివక్ష లేని జీవితాన్ని జీవించే హక్కు కలిగి ఉన్నారని చెప్పారు.
ప్రతి వ్యక్తికి వివిధ గుర్తింపులు, వివిధ రూపాలైన ఉపాంతికరణాలు (ఎaతీస్త్రఱఅaశ్రీఱ్‌ఱవం) ఉంటాయి. ఆధిపత్య కులాలకు చెందిన ట్రాన్స్‌ మహిళ ఎదుర్కొనే వివక్షత అణచివేయబడిన కులాలకు చెందిన ట్రాన్స్‌ మహిళ ఎదుర్కొనే వివక్షతకు భిన్నంగా ఉంటుంది. పితృస్వామ్యం, ఆధిపత్యం, హింస, అధికారం మొదలైన వాటితో కూడిన సంక్లిష్ట సామాజిక నిర్మాణంలో వివక్షత పాతుకొని ఉండడం వలన ఈ సమస్యలను పరిష్కరించడానికి, సాలిడారిటీ పొందడానికి అన్ని ఉద్యమాల మధ్య సమన్వయాన్ని నిర్మించుకోవాలని మీరా అన్నారు. తరువాత జమీలా నిషాత్‌ ముస్లిం మహిళల హక్కుల ఉద్యమం గురించి మరియు హైదరాబాద్‌ పాతబస్తీలో యువతులను అరబ్బుషేకులు వివాహం చేసుకోవడానికి వ్యతిరేకంగా వారు చేస్తున్న పోరాటాల గురించి వివరించారు. ఈమె ముస్లిం మహిళల హక్కుల సాధన కోసం ‘‘షాహీన్‌ ఉమెన్స్‌ రిసోర్స్‌ అండ్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌’’ అనే సంస్థను స్థాపించారు. ఈమె మంచి రచయిత.
ముస్లిం మహిళల ఉద్యమం ఎప్పుడు, ఎలా ప్రారంభమైది, ఎలా తీవ్రరూపం దాల్చింది చెపుతూ ట్రిపుల్‌ తలాక్‌ నిషేధం తర్వాత ముస్లిం మహిళలు, మరీ ముఖ్యంగా యాక్టివిస్టులు హిందూ ముస్లిం మత ఛాందసవాదుల మధ్య జరుగుతున్న సంఘర్షణకు లక్ష్యంగా మరియు బాధితులుగా మారారని, ముస్లిం మహిళల హక్కులపై పని చేయడం మొదలుపెట్టిన తరువాత షాహిన్‌ సంస్థ అనేక సవాళ్ళను ఎదుర్కొందని జమీలా చెప్పారు.
హైద్రాబాద్‌ పాత బస్తీలోని చౌష్‌ కమ్యూనిటీలో బాల్య వివాహాలు సర్వసాధారణం. ముసలివారైన అరబ్బుషేకులు మెహర్‌ (అమ్మాయి కుటుంబానికి చెల్లించే కట్నం) ఆశ చూపించి పడుచు ఆడపిల్లలను వివాహం చేసుకుంటున్నారు. అమ్మాయి కుటుంబానికి, పెళ్ళి సాక్షులకు, మతాధికారికి, స్థానిక పోలీసులకు ప్రతి వివాహం లాభాన్ని ఆర్జించి పెట్టే వ్యాపారంగా ఉండడంతో, ఇది పాతబస్తీలోని ఇతర ముస్లిం కమ్యూనిటీలలో ఉన్న పేద కుటుంబాలకు కూడా వ్యాపించి ఒక పెద్ద రాకెట్టుగా మారింది. ఈ విధంగా 17 సార్లు పెళ్ళైన ఒక ముస్లిం అమ్మాయి ఉంది!! ఈ బాధ నుండి విముక్తి పొందడానికి ఆ పేద అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. దారుణమైన ఈ పద్ధతి, వివాహాలను గల్ఫ్‌ దేశాలకు ముస్లిం మైనర్‌ బాలికలను అక్రమ రవాణా చేసే వ్యాపారంగా మార్చింది. గత సంవత్సరం షాహిన్‌ సంస్థ వారు 150 వివాహాలను నిలిపివేశారు. కానీ, సుమారు 2000 మంది బాలికలు ఈ వివాహాలకు బలయ్యారు. ఈ సమస్యకు పరిష్కార దిశగా ముస్లిం బాలికలలో నాయకత్వాన్ని పెంపొందించడం ద్వారా వారు తమ హక్కుల కోసం ఉద్యమాన్ని నడిపించేలా షాహిన్‌ సంస్థ క్షేత్రస్థాయిలో వారితో ఒక కేడర్‌ని నిర్మిస్తోంది. బాలికా వధువులు యోధులుగా మారే ప్రయాణం గురించి ఒక డాక్యుమెంటరీని రూపొందించామని, ‘‘పింజ్రోంకి ఉడాన్‌’’ అనే పేరుతో ఉన్న ఈ చిత్రం నలుగురు బాలికా వధువుల కథలను, వారిపై జరిగిన లైంగిక వేధింపులను వివరిస్తుందని జమీల చెప్పారు.
సమాజంలో అత్యంత వెనుకబడిన జోగినీలు, పాకీ పనిచేసే మహిళల దయనీయ పరిస్థితి గురించి, దళిత ఉద్యమం గురించి బలమైన దళిత గొంతుక డాక్టర్‌ వినోదిని చెప్పారు. ఈమె కడపలోని యోగి వేమన విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. అనేక కథలు, కవితలు, వ్యాసాలు వ్రాశారు.
దళితలంటే కేవలం మాల, మాదిగ కులాలు మాత్రమే కాదు, సఫాయి కార్మికులు, జోగినీలు కూడా దళితుల్లో భాగమే. నిజానికి వీరు దళితుల్లో దళితుల్లా ఉన్నారు. మాల, మాదిగలతో పాటు సఫాయి కార్మికుల, జోగినీల సమస్యలపై కూడా పనిచేసినప్పుడే దళితులందరితో పనిచేసినట్టు అవుతుంది. అప్పుడే దళిత ఉద్యమం సంపూర్ణమవుతుందని వినోదిని చెప్పారు.
తరువాత దళిత ఉద్యమం గురించి వివరించారు. మన దేశంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా పరిగణించబడే సావిత్రిబాయి ఫూలే బ్రిటిష్‌ పాలనలో కుల అణచివేతను ప్రశ్నిస్తూ ఒక ఉద్యమాన్ని నిర్మించారు. దళితుల విద్య కోసం ఆమె పని చేశారు. దళిత పిల్లలకు బోధించడానికి వెళ్తున్నప్పుడు ఆధిపత్య కులాలకు చెందినవారు ఆమెపై రాళ్ళను, అశుద్ధాన్ని వేసేవారు. అయినా ఆమె తన ఉద్యమాన్ని కొనసాగించారు. అయితే, ఆమె పోరాటాన్ని కొనసాగించడానికి అప్పట్లో దళిత మహిళలు ఎవరూ లేరు. కొన్ని దశాబ్దాల తరువాత దళిత మహిళలు కుల అణచివేతకు వ్యతిరేకంగా పోరాటాలను వ్యవస్థీకృతం చేయడం, బహిర్గతం చేయడం ప్రారంభించారు. మద్యపాన వ్యతిరేక ఉద్యమాన్ని నడిపింది దళిత మహిళలే. అయినప్పటికీ, గతంలో, ప్రస్తుతం కూడా ఉద్యమాలలో ఆధిపత్య కులాల మహిళల పేర్లే వినిపిస్తాయి. మహిళలందరి సమస్యలు ఒక్కటే కాదు అనే విషయాన్ని అర్థం చేసుకోవడానికి కారంచేడు, లక్ష్మీపేట, ఖైర్లంజీ వంటి అనేక సంఘటనలు ఉన్నాయి. ఆరెస్సెస్‌ కార్యకర్తలు దళిత అమ్మాయిలపై అత్యాచారాలు చేసి, ఈ అరాచకాలను చిత్రీకరించి యూట్యూబులో అప్‌లోడ్‌ చేయడం ద్వారా ఈ దేశంలో వారే రాజ్యాంగమని, వారు కోరుకున్నదే చట్టమని తెలియచేస్తున్నారు. దళిత మహిళలపై ఇంత భయంకరమైన హింస జరుగుతోంది. కుల అణచివేత బలంగా వేళ్ళూనుకుపోయి దళిత మహిళలపై హింసను స్థిరీకరిస్తోంది. స్త్రీల విముక్తి కోసం జరిగిన ఉద్యమాల రూపకర్త కందుకూరి వీరేశలింగం అని చెప్పబడిరది. కానీ, మన దేశంలో అంబేద్కర్‌ లేకుండా మహిళల ఉద్యమం జరిగిందని చెప్పడం, నమ్మడం అన్యాయం, అబద్ధం. మన దేశంలో చాలామంది ప్రజలు మార్క్స్‌ను అర్థం చేసుకోగలిగారు, కానీ అంబేద్కర్‌ను అర్థం చేసుకోవడంలో విఫలమయ్యారు. రంగనాయకమ్మ మార్క్స్‌ను అర్థం చేసుకున్నారు కానీ అంబేద్కర్‌ను కాదు. ఎందుకంటే, ఆమె బ్రాహ్మణ స్త్రీవాద పాఠశాల నుండి వచ్చిన స్త్రీవాది కావడం వలన. కాబట్టి, సమాజంలో తీవ్రమైన అణచివేతకు గురవుతున్న మహిళల యొక్క ప్రధాన సమస్యలను గుర్తించి, వాటినుండి పోరాటాలు ప్రారంభించినపుడే ఉద్యమాలు విజయవంతమవుతాయని వినోదిని తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. తరువాత, వికలాంగత ఉద్యమం నుంచి వచ్చిన శ్రీనిధి వికలాంగుల హక్కులు, వారికున్న సౌకర్యాల పరిస్థితి, సమాజంలో వారి గురించి వ్యాపించి ఉన్న అవగాహన మరియు వికలాంగత గురించి తెలియచేశారు.
మన సమాజంలో వికలాంగ మహిళలకు సరైన సౌకర్యాలు లేవు. చట్టాలు వారికి సమాన అవకాశాలు కల్పిస్తున్నప్పటికీ, సమాజంలో అవి ఎక్కడా ఆచరణలో లేవు. బహిరంగ ప్రదేశాలలో శారీరకంగా వికలాంగులైన మహిళలకు తగిన ర్యాంపులు, వీల్‌ఛైర్‌లు, మరుగుదొడ్లు వంటి సౌకర్యాలు ఎక్కడా లేవు. ఆసుపత్రులు, పాఠశాలలు, పోలీస్‌ స్టేషన్లు, బస్సులు, రైళ్ళు మొదలైన వాటిని ఉపయోగించుకోవడానికి అనేక కష్టాలు పడుతున్నారు. మన సమాజంలోని పరిస్థితులు, వాస్తవాలు వికలాంగుల హక్కులకు చెందిన చట్టాలను తీవ్రంగా ఉల్లంఘిస్తున్నాయి. ఆధిపత్య కులానికి చెందిన, తన హక్కుల గురించి బాగా తెలిసిన ఒక మహిళను విమానాశ్రయంలో నాలుగు గంటల పాటు ఒక గదిలో పెట్టి తాళం వేసి ఉంచారు. ఆధిపత్య కులానికి చెందిన వికలాంగ మహిళ కూడా వివక్షకు గురైతే, ఒక దళిత లేక ట్రాన్స్‌జెండర్‌ అయిన వికలాంగ మహిళ పడే బాధలను, వివక్షతను మనం ఊహించవచ్చు. ప్రభుత్వ విభాగాలు, అధికారులు కూడా వికలాంగ మహిళల పట్ల సున్నితంగా వ్యవహరించరు. కార్యాలయాలు కూడా లిఫ్టు సౌకర్యం లేని భవనాల్లో ఉన్నాయి. వికలాంగులకు న్యాయం కూడా ఎండమావి చందంగానే ఉంది. ఒక అంధ మహిళ తనపై జరిగిన అత్యాచారం గురించి పోలీసులకు ఫిర్యాదు చేసినప్పుడు, అంధ మహిళపై ఎవరు అత్యాచారం చేస్తారని పోలీసులు అన్నారు!! బాధితులు అంధులైనప్పుడు కేసును పరిశీలించే సమయంలో చట్టప్రకారం వాయిస్‌ను, ఆడియో పరీక్షను తప్పకుండా నిర్వహించాలి. చట్టాలు ప్రగతిశీలకంగా ఉన్నప్పటికీ సమాజం, అధికారులు మాత్రం సున్నితంగా లేరు. అలాగే, వికలాంగులకు సమాన అవకాశాలను అందిపుచ్చుకోవడం గగనమే. ఒక అంధురాలు మన దేశంలో ఐఏఎస్‌ అధికారి కాగలిగారు కానీ, ఒక చక్రాల కుర్చీ కలిగిన మహిళ యూపీఎస్సీ పరీక్ష నాలుగుసార్లు ఎదుర్కొన్నప్పటికీ, కదలిక సమస్యల వలన ఆమె ఎంపిక కాలేదు.
వికలాంగుల చట్టం, 1995 (పీపుల్‌ విత్‌ డిసెబిలిటీస్‌ యాక్ట్‌ ` పిడబ్ల్యుడి యాక్ట్‌, సమాన అవకాశాలు, హక్కుల పరిరక్షణ మరియు సమాన భాగస్వామ్యం) ఏడు రకాల వైకల్యాలను గుర్తించింది. ఇటీవలే ఒక కొత్త వికలాంగుల హక్కుల చట్టం (ఆర్పీడబ్ల్యుడి), 2016 అమల్లోకి వచ్చింది. ఈ చట్టంలో 21 రకాల వైకల్యాలు ఉన్నాయి. వికలాంగుల హక్కులపై ప్రజల్లో అవగాహన కల్పించడం ద్వారా వారి పట్ల సమాజ దృక్పథంలోనూ, ఆలోచనల్లోనూ మార్పు తీసుకురావడానికి ఈ చట్టం సహాయపడుతుంది. మహిళ, దళిత, ముస్లిం మైనారిటీ, ట్రాన్స్‌జెండర్‌, ఆదివాసీ ఉద్యమాలు వారి వారి కమ్యూనిటిలలోని వికలాంగుల ఆందోళనలను ఉద్యమంలో చేర్చాలని, వినిపించాలని శ్రీనిధి కోరారు.
నలుగురు ప్యానలిస్టులు మాట్లాడిన తర్వాత వివిధ ఉద్యమాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న సామాజిక కార్యకర్తలు వారి ఉద్యమాలు, వారి అనుభవాలు, పని చేయాల్సిన సవాళ్ళ గురించి పంచుకున్నారు. పని ప్రదేశంలో ఏ విధమైన భద్రత, రక్షణ, హక్కులు లేకుండా నిర్లక్ష్యానికి గురైన అసంఘటిత రంగ కార్మికులు గృహ కార్మికులు. వీరిని సంఘటితపరిచి వారి హక్కులను సాధించే దిశగా సిస్టర్‌ లిజి చాలాకాలంగా కృషి చేస్తున్నారు. గృహ కార్మికుల బలమైన గొంతుక కోసం గృహకార్మిక సంఘాన్ని ఏర్పాటు చేశారు. గృహ కార్మికుల పరిస్థితి గురించి మరియు వారి ఉద్యమం యూనియన్‌ ఏర్పాటు దిశగా, వారి హక్కుల సాధన దిశగా ఎలా సాగిందనే అనుభవాలను ఆమె వివరించారు.
గృహ కార్మికులలో ఎక్కువ మంది మహిళలే. వీరిలో చాలామంది దౌర్జన్యం, మొరటు ప్రవర్తన, లైంగిక వేధింపులు, శారీరక వేధింపులు, అత్యాచారం, మానవ బలులు, హత్యలు వంటి సమస్యలకు గురౌతున్నారు. సమాజంలో ఈ కార్మికుల పట్ల గౌరవం లేదు. వారి పని తక్కువగా, విలువ లేనిదిగా పరిగణించబడుతోంది. వారికి చాలా తక్కువ వేతనం ఇవ్వబడుతోంది. ఇంట్లో ఏ వస్తువైనా కనిపించకపోతే వీరినే నిందిస్తారు. తమమీద జరుగుతున్న హింస గురించి పోలీసులకు ఫిర్యాదు చేసినప్పుడు గృహ కార్మికుల కోసం చట్టాలు లేవని పోలీసులు చెప్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో గృహ కార్మికులు వారి మౌనాన్ని, న్యూనతాభావాన్ని ఛేదించేలా, వారి సమస్యల గురించి మాట్లాడగలిగేలా, వారి హక్కుల గురించి పోరాడేలా సిస్టర్‌ లిజి వారిని చైతన్యపరిచారు. గృహ కార్మికులు తమ కోసం సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. హక్కుల కోసం వారు చేసే పోరాటాలకు, పని ప్రదేశంలో లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా మహిళల రక్షణ, భద్రత కోసం మరియు కనీస వేతనాల చట్టం సాధించడం కోసం ఈ సంఘం ఒక సాధనం లాంటిది. కొన్ని సంవత్సరాల పోరాట ఫలితంగా గృహ కార్మికులను సామాజిక భద్రత చట్టం పరిధిలోనికి చేర్చగలిగారు. వేధింపులకు గురైన గృహ కార్మికులు పోలీసు కేసులను పెట్టడానికి యూనియన్‌లు సహాయపడతాయని సిస్టర్‌ లిజి చెప్పారు.
తరువాత గృహ కార్మిక సంఘానికి చెందిన రేణుక యూనియన్‌ కార్యక్రమాలు, యూనియన్‌ ద్వారా సభ్యులు సాధించిన విషయాల గురించి పంచుకున్నారు. పాట పాడారు.
సంఘం సంఘం ఎన్నియల్లో
గృహ కార్మిక సంఘం ఎన్నియల్లో
అక్కాచెల్లెండ్లు ఎన్నియల్లో
మన బంధువులేగా ఎన్నియల్లో
సంఘముంటే ఎన్నియల్లో
మన సంగతి తెలుపు ఎన్నియల్లో
ఎన్నియల్లో ఎన్నియల్లో
మన సంఘం పుట్టెర ఎన్నియల్లో
గృహ కార్మికుల కోసం యూనియన్లు ఏర్పాటు చేయడం వలన వారిలో ఆత్మగౌరవం, ధైర్యం పెరిగాయని రేణుక చెప్పారు. సంఘాలుగా ఏర్పడిన తరువాత సంఘటితంగా వేతనాలను పెంచుకోగలిగామని అన్నారు. అంతేకాకుండా, సంఘాల ఏర్పాటు వారిలో చైతన్యం పెరగటానికి దోహదం చేసింది. సంఘం సమావేశాలు ఎక్కడ జరిగినా సభ్యులు హాజరు కాగలుగుతున్నారు, ప్రభుత్వ కార్యాలయాలను సందర్శించగలుగుతున్నారు. వారిపై హింస జరిగినప్పుడు పోలీస్‌ స్టేషన్లలో ఫిర్యాదులు కూడా చేయగలుగుతున్నారు. అలాగే, గృహ కార్మికులకు గుర్తింపు కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నామని, ప్రభుత్వం వాటిని జారీ చేసేవరకు పోరాటం చేస్తామని రేణుక చెప్పారు.
తరువాత, రూరల్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ సంస్థ వ్యవస్థాపకురాలు భానుజ ఉపాధి హామీ పథకం సక్రమంగా అమలు కావడానికి, ఒంటరి మహిళల హక్కుల కోసం వారు చేస్తున్న పోరాటాల గురించి పంచుకున్నారు. ఈమె అనంతపురం జిల్లాలో పనిచేస్తున్నారు. మానవ అక్రమ రవాణా, అటవీ నిర్వహణ, రైతుల ఆత్మహత్యలు వంటి అంశాలపై కూడా పనిచేస్తున్నారు. ఏపీ ఉమెన్స్‌ నెట్‌వర్క్‌లో ఆమె భాగంగా ఉన్నారు.
పోరాటాలు చేసి తెచ్చుకున్న చట్టాలు సక్రమంగా అమలు కావడానికి కూడా పోరాటాలు చేయాల్సి వస్తోందని భానుజ పేర్కొన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా ఇవ్వబడిన సౌకర్యాలు, హక్కులు సమర్ధవంతంగా అమలు కావడానికి వీరు పోరాటం చేస్తున్నారు. చట్టంలో చెప్పిన విధంగా వంద రోజుల పని కల్పించకపోవడం వలన వంద రోజుల పనిని సాధించడంపై దృష్టి పెట్టారు. అలాగే, పని ప్రదేశంలో ప్రాథమిక సదుపాయాలను కల్పించడం, పిల్లలను చూసుకోవడానికి ఆయాలను నియమించడం, వికలాంగులతో సమాఖ్యలను ఏర్పాటు చేయడం వంటి అంశాలపై వీరి పోరాటాలు దృష్టి పెట్టాయి. ఈ పథకాన్ని అమలు చేసే అధికారులను చైతన్యపరచడానికి క్షేత్రస్థాయి ఉద్యమాలను నిర్మించాల్సిన అవసరం ఉందని భానుజ అభిప్రాయపడ్డారు. అనంతపురంలోని 18 మండలాల్లో సర్వే నిర్వహించి 3,800 మంది ఒంటరి మహిళలను వీరు గుర్తించి జిల్లా స్థాయిలో ఒంటరి మహిళల సమాఖ్యను ఏర్పాటు చేశారు. ఒంటరి మహిళల హక్కుల సాధన కోసం సమస్యలను చర్చిండానికి, పరిష్కరించడానికి ఈ సమాఖ్య సభ్యులు ప్రతి నెలా సమావేశమవుతారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 35 సంవత్సరాలు పైబడిన వితంతువులకు మాత్రమే పెన్షన్‌ వస్తుంది. ఈ నియమం వలన చాలామంది యువ వితంతువులకి పెన్షన్‌ లేక కుటుంబాన్ని నెట్టుకురావడానికి అనేక అవస్థలు పడుతున్నారు. వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి వితంతువుకి పెన్షన్‌ లభించేలా వయో పరిమితిలో సడలింపు కోసం తాము పోరాటం చేస్తున్నామని భానుజ చెప్పారు.
దళిత మహిళల మాదిరిగానే ముస్లిం మహిళలు కూడా అనేక వేధింపులు, దోపిడీ, హింస, లైంగిక వేధింపులను ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్‌ పాత బస్తీలోని ముస్లిం మహిళల సమస్యలపై పని చేస్తున్న ఖలీదా పర్వీన్‌ ఈ ప్రాంతంలోని ముస్లిం మహిళలను, బాలికలను మద్యం, జూదం సిండికేట్లు ఒక ప్రణాళిక ప్రకారం దోచుకుంటున్న పరిస్థితి గురించి తెలియచేశారు. చార్మినార్‌ సమీపంలో వీథి వ్యాపారులుగా పనిచేస్తున్న పురుషులకు ఈ మద్యం, జూదం సిండికేట్లు వలవేసి, వారిని మద్యానికి, జూదానికి బానిసలుగా చేస్తున్నాయి. వీథి వ్యాపారం ద్వారా వచ్చే ఆదాయాన్నంతటినీ ఈ పురుషులు వీటికి ఖర్చు చేస్తారు. దీని మూలంగా కుటుంబ పోషణ కోసం ఈ పురుషుల భార్యలు స్థానికంగా ఉండే రుణదాతల నుండి డబ్బు అప్పుగా తీసుకొని చిన్న వ్యాపారాలు నడుపుకునే పరిస్థితుల్లోకి నెట్టివేయబడుతున్నారు. వ్యాపారంలో నష్టం వచ్చి అప్పు తీర్చలేని దుర్భల పరిస్థితుల్లో మహిళలు, బాలికలు లైంగిక వేధింపులతో పాటు అక్రమ రవాణా బారిన కూడా పడుతున్నారు. వీరిపై అత్యాచారాలు చేసి, వాటిని చిత్రీకరించి, ఈ వీడియోలను వేల రూపాయలకు అమ్ముతారు. ఇంత జరుగుతున్నా ఈ బాధితులు తమపై జరుగుతున్న దోపిడీ, వేధింపుల గురించి, వారి దయనీయమైన పరిస్థితి గురించి ఎవరికీ చెప్పుకోలేక మౌనంగా బాధపడుతున్నారని ఖలీదా చెప్పారు.
దళిత హక్కుల కార్యకర్త, విద్యావేత్త అయిన సూరేపల్లి సుజాత దళిత మహిళల సమస్యలు, పరిస్థితుల గురించి వివరిస్తూ వీరి సమస్యలను ఏ దృక్పథంలో చూడాల్సిన అవసరం ఉందో చెప్పారు. జెండర్‌, దళితుల హక్కులు, పర్యావరణ సమస్యలపై పోరాటాల్లో ఆమె చురుగ్గా పాల్గొంటారు. ఒక దళిత వ్యక్తి హత్య చేయబడినప్పుడు దళిత ఉద్యమం ఆ వ్యక్తి హత్య వరకు మాత్రమే పరిమితమవుతుంది. అయితే ఆ దారుణం ఆ పురుషుడి హత్యకు మాత్రమే పరిమితం కాదు. వారి స్త్రీలు కూడా దోపిడీకి గురవుతారు. ఈ దళిత మహిళలు యవ్వనంలో ఉన్నా లేదా ఒంటరివారైనట్లయితే ఈ వేధింపులు ఇంకా ఎక్కువగా ఉంటాయి. మహిళలపై జరిగే ఈ హింసలన్నీ ఖచ్చితంగా కుల హింసలే మరియు కుల అణచివేతలే. కాబట్టి దళిత ఉద్యమాలు ఈ రకమైన హింసపై కూడా పని చేయాలి. దళిత మహిళలపై జరుగుతున్న మరొక రకమైన హింస ప్రేమ పెళ్ళిళ్ళ పేరిట మోసం చేయడం. విద్యావంతులైన దళిత మహిళలను ఆధిపత్య కులాల పురుషులు ప్రేమ మరియు వివాహం పేరిట మోసం చేస్తున్నారు. ఇటువంటి సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. అలాగే బాధితుల ఆత్మహత్యలు కూడా పెరుగుతున్నాయి. ఈ దోపిడీపై పోరాటం చేయడానికి, అవగాహన పెంచడానికి ఇటువంటి అంశాలపై విస్తృత చర్చ జరిపి వీటిని బహిర్గతం చేయాలని సుజాత పేర్కొన్నారు.
భారతదేశంలో వికలాంగత, ట్రాన్స్‌జెండర్‌ మరియు ఒంటరి మహిళల అంశాలను కుల వ్యవస్థ నేపథ్యంలో చూడాలని, కుల దృక్పథంతో పరిశీలించకపోతే వీటిలోని దుర్భలత్వాలను మనం సంపూర్ణంగా అర్థం చేసుకోలేమని చెప్తూ యాక్టివిస్టులు మూడు విషయాలను దృష్టిలో ఉంచుకోవాలని చెప్పారు. ప్రతి సంఘటనను కుల దృక్పథంతో చూడాలి. మహిళలందరూ ఒకేలా ఉండరని, మహిళల దోపిడీ కూడా కుల దోపిడీలో భాగమని అర్థం చేసుకోవాలి. మహిళల సమస్యలను కుల దృక్పథంతో చూసినపుడు ఉద్యమం యొక్క స్వభావం మారుతుంది. సమగ్ర పద్ధతిలో హక్కులపై పని చేయడానికి అన్ని ఉద్యమాలు ఐక్య పోరాటాన్ని చేయాలని సుజాత సూచించారు.
ఆశాలత రైతుల ఆత్మహత్యలు, మహిళా రైతులు మరియు ఆదివాసీ హక్కులకు సంబంధించిన ఉద్యమాలలో పని చేస్తున్నారు. ఈమె మకామ్‌ మరియు జాతీయ స్థాయి సంస్థ అయిన మహిళా రైతుల హక్కుల ఫోరం (ఫోరం ఫర్‌ రైట్స్‌ ఆఫ్‌ ఉమెన్‌ ఫార్మర్స్‌)తో కలిసి పని చేస్తున్నారు. ఈ ఫోరం మహిళా రైతులకు భూ చట్టాలు, హక్కుల గురించి అవగాహన కల్పిస్తోంది. వ్యవసాయ విధానాలను సమర్ధవంతంగా అమలు చేయడానికి వీరు రైతులను, వ్యవసాయ కూలీలను కూడగడుతున్నారు. ఆశాలత వ్యవసాయంలో జెండర్‌ వివక్షత గురించి, ఆదివాసీలపై జరుగుతున్న దోపిడీ గురించి వివరించారు.
కుటుంబంలో, సమాజంలో స్త్రీల పట్ల వివక్షత మరియు వారిపై దోపిడీ వ్రేళ్ళూనుకుని ఉన్నట్లే వ్యవసాయంలో కూడా ఈ జెండర్‌ కోణం ఉంది. ఈ రంగంలో మహిళా రైతులు అలక్ష్యానికి గురవడమే కాకుండా కనీసం గుర్తింపునకు కూడా నోచుకోవడం లేదు. వ్యవసాయ కూలీలలో ఎక్కువ మంది దళిత మహిళలే. వీరికి హక్కులు కానీ, భూమి కానీ లేవు. విధానాలు రూపొందించే సంస్థలలోనూ, పరిపాలనలోనూ దళిత మహిళల కోసం రిజర్వేషన్లు అడిగినప్పుడు, మొదట స్త్రీల కోసం 33 శాతం రిజర్వేషన్ల గురించి పోరాటం చేయాలని, తరువాతే అధికారంలో దళిత మహిళల భాగం గురించి చర్చించవచ్చని చెప్పి తిరస్కరిస్తున్న విధంగానే మహిళా రైతుల అంశాలు, సమస్యల గురించి అడిగినపుడు అసలు మొదట వ్యవసాయ విధానమనేది ఉండాలని వాదిస్తూ నిరాకరిస్తున్నారని ఆశాలత చెప్పారు.
బ్రిటిష్‌ కాలం నుండి మొదలైన ఆదివాసీలపై దోపిడీ, వారి వనరుల ప్రాంతం నుండి వారిని స్థానభ్రంశం చేయడం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఆదివాసీలను వారి ఆవాసాల నుండి దూరం చేసే వలస విధానం వారిని చాలా ప్రమాదకర పరిస్థితుల్లోకి నెట్టివేస్తోంది. సుమారు పది లక్షల మంది గిరిజనులను అడవుల నుండి తొలగించే చర్యను సుప్రీంకోర్టు ప్రస్తుతానికి నిలిపివేసింది. సుమారు నలభై వేల మంది గిరిజనులు తాము సాగు చేస్తున్న భూముల కోసం, ఆవాసాల కోసం పట్టాలు పొందడానికి దరఖాస్తు చేసుకున్నారు. అందులో ఇరవై మూడు వేల దరఖాస్తులు తిరస్కరించబడ్డాయి. వన్యప్రాణి సంరక్షణ, పర్యావరణ ప్రయోజనాలను పరిరక్షించడం లేదా ఇతర సాకులతో వీటిని తిరస్కరించారు. అటవీ హక్కుల చట్టాన్ని దాని నిజమైన స్ఫూర్తితో అమలు చేయడం కంటే ఆదివాసీలను అడవి నుండి తరిమివేయడానికే అటవీ అధికారులు ఎక్కువ ఆసక్తిని చూపుతున్నారు. మన సమాజంలోని అత్యంత దుర్భలమైన వర్గాలకు మద్దతునివ్వడం కంటే ఆ ప్రాంతాలలో వాణిజ్య ప్రయోజనాలకు, లాబీలకు వారు ఎక్కువ స్పందిస్తున్నారు. గిరిజనులు తాము కోల్పోయిన భూములను తిరిగి పొందడానికి, వారి హక్కులను పునరుద్ధరించడానికి అన్ని ఉద్యమాల మధ్య ఐక్యతను పెంపొందించడం అత్యవసరమని ఆశాలత చెప్పారు.
తరువాత, సామాజిక మరియు సాంస్కృతిక కార్యకర్త అయిన దేవి సాంస్కృతిక ఉద్యమం గురించి వివరించారు. ‘సంస్కృతి’ అనేది పాట, నాటకం, కళలు, చేతి పనులు (ఆర్ట్‌ అండ్‌ క్రాఫ్ట్స్‌) మరియు లలితకళలకు (పెర్ఫార్మింగ్‌ ఆర్ట్స్‌) మాత్రమే పరిమితం కాదు. సాంస్కృతిక ఆధిపత్యం, అణచివేతలు మన సమాజంలోని ప్రతి రంగాన్ని, వ్యవస్థను ప్రభావితం చేస్తున్నాయి. ఇతర సమాజాలు, దేశాలవలే కాకుండా మన సమాజంలోని సంస్కృతి అత్యంత రాజకీయం చేయబడిరది. సమాజంలోని అసమానతలు, ఆధిపత్య వ్యవస్థలు సాంస్కృతిక వ్యవస్థలోకి కూడా క్రమంగా వ్యాపించి స్థిరపడ్డాయి. సాంస్కృతిక వారసత్వంగా ఈ అసమానతలు ఒక తరం నుండి ఇంకొక తరానికి కొనసాగుతున్నాయి. మహిళలు తక్కువ అనే చులకన భావం సాంస్కృతిక రూపంలో అందరి మనసుల్లో స్థిరపడిరది. ఎవరైనా సంస్కృతి గురించి మాట్లాడాలనుకునే వారు, ఆధిపత్యాన్ని మరియు వివక్షతను స్థిరీకరించి నిలబెట్టే విలువలను, భావజాలాన్ని వ్యాప్తి చేసే అన్నింటి గురించి మాట్లాడాలి. ఈ ఆధిపత్యాలు, అంతరాలు ఒక నాటిక రూపంలో లేదా పాట రూపంలో ఉన్నప్పుడు గుర్తించడం తేలిక. కానీ వీటిని కుటుంబంలో, సమాజంలో గుర్తించడం చాలా కష్టం. ఎందుకంటే సంస్కృతి అనేది కుటుంబం, సమాజం, మన స్నేహితులు మరియు విలువల నుండే వస్తుంది. వీటి ద్వారానే ఒక రూపం సంతరించుకుంటుంది అని దేవి వివరించారు.
జానపద సాంస్కృతిక కళారూపాల గురించి, వాటి ప్రాముఖ్యత గురించి దేవి ఈ విధంగా వివరించారు. అణగారిన వర్గాలు, గిరిజనులు, సంచార తెగలు, దళితుల ఉపకులాలు లలితకళలను (పెర్ఫార్మింగ్‌ ఆర్ట్స్‌) ఉపయోగించుకుంటాయి. ఉపకులాలను జానపదులు అంటారు. వ్యవస్థలు విస్ఫోటనం కాకుండా, భగ్గుమనకుండా ఉండడానికి, సామాజిక వ్యవస్థకు భద్రతా కవాటాలుగా కొన్ని జాగాలు ఉన్నాయి. జానపద కళారూపాలు, లలిత కళలు ఇటువంటి జాగాలే. ఉదాహరణకు, ఆంధ్రప్రదేశ్‌ ఉత్తర తీర ప్రాంతంలోని ‘‘వాలకం’’ మరియు తెలంగాణ రాష్ట్రంలోని ‘‘జాంబ పురాణం’’ వంటి కళారూపాలు దౌర్జన్యపూరితమైన భావజాలం, ఆధిపత్యం, బానిసత్వం, వివక్షతకు వ్యతిరేకంగా ప్రతిఘటనను అభివ్యక్తీకరించే జాగాలు. ఈ జానపద కళారూపాలు హింసించేవారికి వ్యతిరేకంగా నిజాలను వ్యంగ్యంగా, అవహేళనగా, సరదాగా వినిపించడానికి అనుమతినిస్తాయి. అయితే, ఈ జాగాలు క్రమక్రమంగా కుచించుకుపోతున్నాయి. అణగారిన వర్గాల ఈ సాంస్కృతిక ప్రతిఘటన తరతరాలుగా మౌఖిక సంప్రదాయంగానే మిగిలిపోయింది. భారతదేశంలో ఇంతకాలం అణగారిన వర్గాల గొంతుకగా మిగిలిన మౌఖిక సాంప్రదాయాన్ని పోరాటాలు మరియు ఉద్యమాలలోకి దృఢంగా చొప్పించలేదనే చెప్పవచ్చు. ఇంతకు ముందు యాక్టివిస్టులు చేసిన ప్రజంటేషన్లు, అణచివేయబడిన సామాజిక నిర్మాణాలను కేవలం వీటికి విరుద్ధమైన సంస్కృతి ద్వారా మాత్రమే నిర్మూలించగలమని పేర్కొన్నాయి. కాబట్టి, అణచివేతలన్నింటినీ భావజాలపరంగా ప్రతిఘటించడానికి ఉపయోగపడే ఒక సాధనం సంస్కృతి. అణగదొక్కే భావజాలానికి, రాజకీయ, ఆర్థిక, సమాచార వ్యవస్థలకు వ్యతిరేకంగా ప్రతిఘటన సాంస్కృతిక వ్యవస్థ ద్వారా మాత్రమే వస్తుంది. అన్ని ఉద్యమాలలో భావజాలపరంగా పోరాడాల్సిన ప్రాధాన్యతను ఉద్యమకారులు అంగీకరించడంలో విఫలం కావడమే వారి ముఖ్యమైన బలహీనత అని దేవి అభిప్రాయపడ్డారు. సమాజంలో లోతుగా వ్రేళ్ళూనుకుని ఉన్న ఆధిపత్యాన్ని, వివక్షతను నిర్మూలించడానికి సాంస్కృతిక ఉద్యమంతో ఇతర ఉద్యమాలన్నీ అనుసంధానమైనపుడు ఈ ఉద్యమాలు తప్పకుండా విజయాన్ని సాధిస్తాయని దేవి నొక్కి చెప్పారు.
(ఈ వేదిక సమస్యల జాతరలా ఉంది. ఇక్కడున్న ఉద్యమకారులందరూ వెలుతురు కిరణంలా ఉన్నారు. హిందుత్వ మబ్బులు కమ్ముకున్నాయి. కానీ ఈ మబ్బులు తరలిపోతాయి. మనం చూడాలని కోరుకుంటున్న కొత్త సూర్యుడు ఖచ్చితంగా ఒకరోజు ఉదయిస్తాడు. మనం అనుకున్న ఉదయం అప్పుడు తప్పకుండా వస్తుంది ` రచన)
చివరగా తెలంగాణ హిజ్రా ఇంటర్‌ సెక్స్‌ ట్రాన్స్‌జెండర్‌ సమితి నుండి వచ్చిన రచన ట్రాన్స్‌జెండర్‌ ఉద్యమం గురించి, అన్ని ఉద్యమాలు సమన్వయం కావాల్సిన అవసరం గురించి చెప్పారు. జెండర్‌ మరియు లైంగికతను చుట్టుముట్టి ఉన్న అణచివేత పితృస్వామ్యం యొక్క విలువల వ్యవస్థలో పాతుకుపోయి ఉంది. ట్రాన్స్‌ జెండర్‌ కమ్యూనిటీ ఈ విలువల వ్యవస్థను చాలా కాలం నుండి ప్రతిఘటించి సవాలు చేస్తోంది. పురాణకాలం నుండీ ట్రాన్స్‌ జెండర్‌ వ్యక్తులు ఉన్నప్పటికీ, వీరి కోసం తెలుగు భాషలో సరైన పదం లేదు. సమాజం, కులం, మతం, వర్గం మరియు భాష వీరి పట్ల వివక్షను చూపాయి, వీరిని వెలివేశాయి. వారికి వారి జీవితమే ఒక పోరాటం. ఈ వివక్షలు, చిన్నచూపు ఉన్నప్పటికీ వాటిని తట్టుకుంటూ వారు జీవిస్తున్నారు. సమాజంలో విభిన్న వివక్షతలపై అనేక పోరాటాలు జరుగుతున్నాయి. ఈ పోరాటాలన్నింటినీ సమన్వయం చేసుకోవాల్సిన సమయమిదే. ట్రాన్స్‌ జెండర్‌ ఉద్యమం అన్ని రకాల ఉద్యమాలకు కూడలిగా ఉంది. ఆధిపత్యం మరియు హింసకు వ్యతిరేకంగా ప్రతిఘటన, పోరాటాలు బలహీనపడి ఉండొచ్చు, కానీ అవి ఆగిపోలేదు. ప్రతి ఉద్యమం నిర్లిప్తమై నిద్రాణమై దాని రూపును మార్చుకుని ముందుకు సాగుతోంది. వివక్షత, బానిసత్వం సమసిపోనంత కాలం సమాజంలో అణచివేతకు వ్యతిరేకంగా ఉద్యమాలు కొనసాగుతూనే ఉంటాయి. ప్రతిసారీ అవి సమసిపోయినట్లుగా లేదా అణగద్రొక్కబడినట్లుగా పరిగణించబడినప్పుడు, ఎక్కడో ఒక దగ్గర ఒక తిరుగుబాటు స్వరం ఉంటుంది. అది ప్రతిఘటన యొక్క గొంతుకలను పునఃప్రారంభిస్తుంది, జ్వలింపచేస్తుంది. వివిధ రూపాల అణచివేతలు, వివక్షతలకు వ్యతిరేకంగా అన్ని ఉద్యమాలు ఐక్యపోరాటం చేయడానికి, కలిసి పనిచేయడానికి ఏకం కావాలి. అప్పుడే హిందుత్వ చీకటి మేఘాలు మాయమై మనం చూడాలని కోరుకుంటున్న క్రొత్త సూర్యుడు ఖచ్ఛితంగా ఒకరోజు
ఉదయిస్తాడు. యాక్టివిస్టులందరూ ఈ విజయంపై నమ్మకంగా ఉన్నారని రచన ఆశాభావంతో చెప్పారు.
వివిధ రూపాల దోపిడీ, వివక్షతలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాలపై జరిగిన చర్చలో పాల్గొని తమ ఉద్యమ అనుభవాలను పంచుకున్న వక్తలకు, యాక్టివిస్టులకు, సభ్యులకు సత్యవతి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఓ మహిళా బాధల బ్రతుకులు ఎన్నాళ్ళే
నీవు ఎదిరించి లోకం పోకడ మార్చాలే
ఆడపిల్ల పుడితే చాలు గుండెలపై కుంపటి అంటారు
పీక నులిమి చంపేస్తారు పీడ వదిలేననుకుంటారు
స్త్రీ లేని సమాజమెక్కడిదే
స్త్రీలు సమాజాన సగభాగమని చాటాలే
జీవితమే ఒక రథమైతే స్త్రీ పురుషులు రథ చక్రాలు
ఒంటరిగా సాగదు పయనం ఇద్దరికీ జంట అవసరం.
ఈ చర్చా వేదిక ఆద్యంతమూ ఉద్వేగభరితంగా, ఆసక్తికరంగా సాగింది. సమాజంలోని వివిధ అణచివేతలను, హింసలను ఏ దృక్పథంతో అర్థం చేసుకోవాలి, వీటికి వ్యతిరేకంగా ఎలాంటి పోరాటాలు, ఉద్యమాలు జరుగుతున్నాయనే అవగాహన ఐక్యతారాగం సభ్యులలో పెరిగింది. ఈ చర్చా వేదిక అనుకన్న దానికన్నా ఎక్కువ సమయం కొనసాగినప్పటికీ, ఈ చర్చలు సభ్యులలో ఉత్తేజాన్ని, శక్తిని నింపాయి. అన్ని రకాల అన్యాయాలు, అణచివేతలకు వ్యతిరేకంగా ఐక్యపోరాటం రూపొందించాలని అన్ని రకాల ఉద్యమకారులు ఆసక్తిని వ్యక్తం చేశారు. ఆధిపత్య శక్తులను ప్రతిఘటించి సానుకూల మార్పును సాధించడానికి అన్ని ఉద్యమాలు ఏకమై, పోరాటరూపును మార్చుకుని ముందుకు సాగే క్రమంలో ఈ వేదిక ఒక మైలురాయిగా నిలిచిపోతుంది.

Share
This entry was posted in ఐక్యతారాగం ప్రత్యేక సంచిక. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.