(ఉర్దూ మూలం : రజియా సజ్జాద్ జహీర్)
ఆ సాయంత్రం ఇంటి ముందు రిక్షా దిగుతూ, సర్వెంట్స్ క్వార్టర్స్ ముందు కూచుని ఉన్న శ్యామలిని తొలిసారి చూసింది సుల్తానా. మరోసారి తిరిగి చూడాలనిపించే ఆకర్షణ ఏదో ఉంది ఆ పిల్ల ముఖంలో.
పనివాళ్ళు అందరిలాగా చేతులు జోడిరచి నమస్కారం చెయ్యకుండా ఓ చిరునవ్వు విసిరి, తలొంచుకుని బియ్యంలో రాళ్ళేరుకుంటుంది. ఆమె ధోరణి సుల్తానాకు నచ్చింది. ధనవంతుల ముందు దేబిరిస్తూ ఉండే పేదవాళ్ళంటే ఆమెకు చిరాకు. తనకు పేదలపై ఎంతో అభిమానం ఉందని గట్టి నమ్మకం కూడా.
సుల్తానా చిన్నతనం నుంచీ శ్యామలి వంటి ఆడవాళ్ళ గురించి ఎన్నో మాటలు వింటోంది. ఈ తక్కువ కులాల ఆడవాళ్ళకు మానాభిమానాలు, మనుషులపై ప్రేమలు ఉండవని, మగవాళ్ళతో సులభంగా సంబంధాలు పెట్టుకోవడం, అంతే సులభంగా వదిలేసి పోవడం వాళ్ళకు అలవాటని నాయనమ్మ అనే మాటలు అప్రయత్నంగా మనసులో మెదిలాయి. ఈ పిల్ల ఎవరో, ఆ గదిలో ఒక్కతే ఉందేమిటో అని ఆలోచిస్తూ స్నానానికి వెళ్ళింది. బాత్రూమ్ కుళాయిలో నీళ్ళు రావటం లేదు. బయటికి చూస్తే శ్యామలి వీథి పంపు దగ్గర బియ్యం కడుగుతోంది.
‘‘ఏయ్ పిల్లా, ఆ పంపు కట్టేయ్’’ అరిచింది చిరాగ్గా.
శ్యామలి వెంటనే ఆపేసి, ‘‘ఈ పంపు తిప్పితే మీ ఇంట్లో నీళ్ళు ఆగిపోతాయని నాకు తెలీదమ్మా. నిన్ననే వచ్చానిక్కడికి’’ అని చిరునవ్వుతో జవాబిచ్చింది. మాట తీరు బావుంది.
‘‘ఫర్వాలేదులే’’ అంది సుల్తానా.
నాలుగు రోజులు గడిచాక, సాయంత్రం కాలేజి నుంచి ఇంటికొచ్చిన సుల్తానా, టపా చూసుకుంటూ కూచుంది. బయటినుంచి నవ్వులు. కిటికీలోంచి చూస్తే, తన చిన్న కూతురు శ్యామలిని వెంట తరుముతోంది.
‘‘ఇంక పరిగెత్తలేను పాపా, అన్నం వండుకోవాలి’’ అంటూ నవ్వుతోంది శ్యామలి. పాప ఊరుకోవడం లేదు.
‘‘ఇట్టా రా, తల్లీ! ఈ పిండితో పిట్ట బొమ్మ చెయ్యనా, కాల్చి తినేద్దాం’’ అంటూ బుజ్జగిస్తూ ఉంది శ్యామల. నవ్వుతూ చూస్తున్న పనివాళ్ళు అందరూ వెళ్ళిపోయారు.
శ్యామలి నవ్వు హాయిగా, నిష్కపటంగా ఉందని అనిపించింది సుల్తానాకు. అయినా పరాయి మగాళ్ళ ముందు అలా పగలబడి నవ్వటం ఎందుకని కూడా అనిపించింది. అక్కడ సుల్తానాను చూసి సిగ్గు పడిరది శ్యామలి.
… … …
మర్నాడు సాయంత్రం వచ్చింది శ్యామలి. ‘‘దుకాణానికి పోదామనుకుంటే చీకటి పడిపోయింది. నాలుగు మిరప కాయలు ఇవ్వండి’’ అంటూ. ఆమెకు మిరప కాయలు ఇవ్వమని వంటాయనకు చెప్పి, ఆ పిల్లను కూర్చోమంది సుల్తానా.
తన విషయాలు చెబుతోంది శ్యామలి. తన భర్త చచ్చిపోయాడట. ఎదురుగా పచ్చ మేడలో ఉండే మేజరు గారి పిల్ల వాడికి ఆయాగా పనిచేస్తూ పొట్ట పోసుకుంటుంది. మిరపకాయలు తెచ్చిన వంటాయన, శ్యామలిని గుడ్లప్పగించి చూస్తూ నిలబడ్డాడు. ఆ అమ్మాయి వాటిని తీసుకుని తలొంచుకుని వెళ్ళిపోయింది.
‘‘ఈ మనిషిని ఇంట్లోకి రానివ్వకండమ్మా’’ అన్నాడు వంటమనిషి.
‘‘సర్లే, నీ పని చూసుకో పో’’ అని విసుక్కుంది సుల్తానా.
‘‘అది మొగుణ్ణి వదిలేసి లేచిపోయిందమ్మా. ఆ రామావతార్‌ను వల్లో వేసుకుంది. మంచి మనిషి కాదు!’’
‘‘ఎవరా రామావతార్?’’
గుర్తొచ్చింది సుల్తానాకు. ఖాకీ యూనిఫాంతో, బరువైన బూట్లు తొడుక్కుని, కర్ర టకటకలాడిస్తూ, రాత్రంతా కాపలా కాస్తుంటాడు. తనకు ఎప్పుడయినా నిద్రపట్టక, పలకరిస్తే ‘‘మరేం భయంలేదు, పడుకోమ్మా. నేను ఉన్నాగా’’ అని భరోసా ఇస్తాడు.
‘‘పాపం రామావతార్‌ది పెద్ద కులమమ్మా. ఠాకూర్ల వంశం. ఈ కులం తక్కువది వలలో వేసుకుంది.’’
‘‘చెత్త వాగుడు వాగకు’’ అని మండిపడిరది సుల్తానా.
అతడు లోపలికి పోయాడు. కానీ సుల్తానా బుర్రలో కల్లోలం రేగింది.
ఎందుకిలా చేసింది ఈ పిల్ల? భర్తను వదిలేసి వచ్చి, మరో మగాడితో సంబంధం పెట్టుకుంది. పైగా మొగుడు చచ్చిపోయాడని అబద్ధాలు. ఈ కులం ఆడాళ్ళకు ప్రేమాభిమానాలు ఉండవేమో. తన ఆలోచనకు తానే భయపడిరది. ఛ! తను కులం గురించి ఆలోచించటం ఏమిటి?
మర్నాడు రాత్రి కిటికీలోంచి చూస్తుంటే, పొయ్యి వెలుగులో శ్యామలి, రామావతార్ కనబడ్డారు. రొట్టెలు కాలుస్తూ, మాటిమాటికీ కొంగుతో కళ్ళు తుడుచుకుంటూ ఉంది శ్యామలి. అతడు ఎప్పటిలా యూనిఫాంలో కాకుండా ధోతీ, కుర్తాలో అందంగా ఉన్నాడు. వీళ్ళిద్దరిదీ చక్కని జంట అనే భావన సుల్తానా మనసులో ఒక్క క్షణం మెదిలింది.
రామావతార్ వెళ్ళాక అక్కడికెళ్ళి, ‘‘ఏం శ్యామలీ, మీ ఆయన బతికి ఉన్నాట్టగా. అంత అబద్ధం చెప్పావేం?’’ అంది. శ్యామలి కాసేపు మౌనంగా ఉండి ‘‘ఉండి ఏం లాభం లేమ్మా. నాకైతే చచ్చినోడి కిందే లెక్క’’ అంది ధృఢంగా.
షాక్ కొట్టినట్టు అయింది సుల్తానాకు. దేవుడా… ఏ ఆడదైనా కట్టుకున్న వాడిని ఇంత మాట అంటుందా. ‘‘నాకు ఇంత తిండీ, బట్టా ఇచ్చినందుకు పెత్తనం చేస్తాడమ్మా. పైసలు పడేస్తే చాలా! నా కాళ్ళూ చేతులూ గట్టిగా ఉండాలి గానీ వాడిలాంటి మనుషులని పదిమందిని సాకగలను’’. చరచరా అక్కడినుంచి వెళ్ళిపోయింది సుల్తానా.
తలలో ఆలోచనలు పోటెత్తుతున్నాయి. శ్యామలి చాలా ధైర్యం గల పిల్ల. అయితే మాత్రం భర్త గురించి అలాంటి మాటలా! భర్తను మించిన సంపద భార్యకు ఏముంది లోకంలో! ఈ కులం తక్కువ ఆడాళ్ళు… అని రాబోతున్న ఆలోచనను వదిలించుకోడానికన్నట్లు, బలంగా తల విదిలించింది.
‘‘నాకు నిజంగానే పెళ్ళనే వ్యవస్థ మీద అంత నమ్మకం ఉందా, ఊరికే మనసును మభ్యపెడుతున్నానా? భర్త అనేవాడు తిండీ, బట్టా ఇవ్వడానికేనా? ప్రేమను, గౌరవాన్నీ, భద్రతనూ ఇవ్వాలి కదా!’’ పిచ్చెక్కిపోతోంది.
… … …
మూడు రోజులు గడిచాయి. హోలీ పండుగ ఆ రోజు. ఏదో రాసుకుంటూ ఉన్న సుల్తానా దగ్గరికి వచ్చింది శ్యామలి. ఆమె చేతిలో ఒక పళ్ళెంలో రంగులూ, మిఠాయిలూ ఉన్నాయి. చటుక్కున రంగు తీసి, సుల్తానా నుదుటికి రాసి, లడ్డూ తుంచి నోట్లో పెట్టబోయింది.
సుల్తానా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. ‘‘నేను మిఠాయి తినను శ్యామలీ. అయ్యగారు తిరిగి వచ్చేదాకా తిననని మొక్కుకున్నా’’.
‘‘బెంగపెట్టుకోకమ్మా. దేవుడు చల్లగా చూస్తాడు. అయ్యగారు రాగానే మేమందరం మీకు మిఠాయిలు తినిపిస్తాం చూస్తుండండి’’ మెత్తగా నవ్వుతున్న ఆ పిల్లను చూస్తూ, ‘‘ఇంత మంచిదానివి భర్తను ఎందుకు వదిలేశావ్ శ్యామలీ’’ అడిగింది.
‘‘మీకు అర్థం కాదులేమ్మా’’ అంటూ వెళ్ళిపోయింది. మళ్ళీ షాక్ కొట్టినట్టు అయింది సుల్తానాకు.
భోజనం తీసుకుని అప్పుడే వచ్చిన వంటాయన ‘‘ఈ పిల్ల మూలాన రామావతార్‌ను పన్లోంచి తీసేస్తున్నారమ్మా. ఎదిగిన పిల్లలున్న కుటుంబాల మధ్యన వీళ్ళ వ్యవహారం ఇబ్బందిగా ఉందని పెద్దయ్య గారికి ఫిర్యాదులు వెళ్ళాయి. రామావతార్ బంధువులు కూడా వచ్చారు. వాళ్ళ కులంలో మంచి అమ్మాయిని చూశారట. వీడేమో ఈ కులం తక్కువ దాన్ని వదలనంటాడు’’.
ఇది చాలా అన్యాయం అనిపించింది సుల్తానాకు. వాళ్ళిద్దరూ ఇష్టపడుతుంటే, వీళ్ళకేమిటి నష్టం! రేపు యజమానితో గట్టిగా చెప్పాలి. అవసరమైతే వాళ్ళకు తనే ఆశ్రయం ఇవ్వాలి అని నిర్ణయించుకుంటే మనసు తేలిక పడిరది.
మర్నాడు సుల్తానా వచ్చేసరికి శ్యామలి గది ఖాళీగా ఉంది. స్వీపర్ భార్య వచ్చి ‘‘అది పారిపోయిందమ్మా!’’ అని చెప్పింది.
‘‘మరి రామావతార్?’’ ‘‘అతనిక్కడే ఉన్నాడు. బాగా ఏడుస్తున్నాడు పాపం. ఈ కులం తక్కువ ఆడాళ్ళకు నీతి ఉండదులేమ్మా!’’
ఆ మాట నిజమే అనిపించింది. శ్యామలిపై విపరీతమైన అసహ్యం వేసింది.
… … …
కొన్నాళ్ళ తర్వాత బజార్లో వెళ్తున్న సుల్తానాకు పళ్ళ గంపతో ఎదురయింది శ్యామలి. ఒళ్ళు మండిపోయింది సుల్తానాకు.
‘‘ఎంత దుర్మార్గురాలివి శ్యామలీ! పాపం రామావతార్ బెంగతో చిక్కిశల్యమయ్యాడు. నలుగురిలో నవ్వులపాలు చేశావు అతణ్ణి’’ అంది ఆగ్రహంతో.
‘‘అతని ఉద్యోగం అయితే పోలేదు కదమ్మా’’ అంది శ్యామలి. సుల్తానా కోపం కట్టలు తెంచుకుంది.
‘‘నా కోసం ఉద్యోగం వదులుకుంటానన్నాడు, ఏదో త్యాగం చేస్తున్నట్టు. మళ్ళీ, నన్ను పోషించటం ఎట్లాగని బెంగగా ఉందంటాడు. నేను కావాలనుకుంది అతన్నా, అతని ఉద్యోగాన్నా? బతుకుదెరువు కోసం ఇంత దిగులా? అతనితో ఉంటే రోజుకు ఎన్నిసార్లు వినాలో ఆ మాటలు. ఇలాంటి మనుషుల్ని పదిమందిని పోషించగలను. నేను చేసిన దాంట్లో తప్పేమీ లేదమ్మా’’ గంపను తలపైకి ఎత్తుకుంటున్న శ్యామలి కళ్ళనిండా నీళ్ళు.
‘‘రామావతార్‌ను అడిగానని చెప్పండి’’ అంది వణికే గొంతుతో.
సుల్తానాకు మనసులో ఏదో తలుపు తెరుచుకుంది.
‘‘చెప్తానమ్మా శ్యామలీ, తప్పకుండా చెప్తా’’.
హాయిగా నవ్వింది శ్యామలి. ‘‘ఈసారి నన్ను బాగా అర్థం చేసుకున్నారమ్మా!’’
(కొలిమి వెబ్ మ్యాగజైన్ నుండి)