గమనమే గమ్యం – ఓల్గా

(గత సంచిక తరువాయి…)
అతను శారద వంక చూసి స్నేహంగా నవ్వాడు. శారద అప్రయత్నంగా నవ్వింది.
‘‘ఈయనకు మారు పేర్లు చాలా ఉన్నాయి. అసలు పేరు అమీర్‌ హైదరాలి ఖాన్‌. ఎన్నో దేశాలు తిరిగాడు. రష్యాలో అనేక సంవత్సరాలున్నాడు. భారతదేశంలో… ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ నిర్మించాలని వచ్చాడు’’ వడివేలు క్లుప్తంగా ఆయన పరిచయం చేశాడు.

‘‘ఈ రోజు నా పేరు శంకరం’’ అంటూ అమీర్‌ హైదరాలి ఖాన్‌ చాలాసేపు మాట్లాడాడు. ముఖ్యంగా వర్గ సిద్ధాంతం గురించీ, వర్గాలనూ, వర్గ ప్రయోజనాలనూ కాపాడే రాజ్యం గురించి మార్క్స్‌, ఏంగెల్స్‌, లెనిన్‌లు ఏం చెప్పారో దాని సారాంశాన్ని చెప్పాడు. శారద ఆయన చెప్పిన వాక్యాలన్నీ శిలా శాసనంలా మనసులో చెక్కుకుంది. పార్టీ నిర్మాణం గురించి, పాటించాల్సిన క్రమశిక్షణ గురించి, రహస్యంగా కార్యక్రమాలు నడపాల్సిన తీరు గురించీ ఆయనతో పాటు మరో ఇద్దరు ముగ్గురు మాట్లాడారు.
‘‘మనం కాంగ్రెస్‌లోనే ఉండాలి. కాంగ్రెస్‌లోని అతివాదులతో, సోషలిస్టు భావాలున్న వాళ్ళతో కలిసి పని చెయ్యాలి. ఆ పని చేస్తూనే ప్రజలలో కమ్యూనిస్టు భావాలు వ్యాపింప చేయాలి. ఈ పని పరమ రహస్యంగా జరగాలి. భావాలు ప్రజలలోకి తీసికెళ్ళాలి గానీ మనం వీలైనంతవరకూ రహస్యంగానే ఉండాలి’’ అంటూ కొన్ని సూచనలు చేశాడాయన. ఆయన కోసం అప్పటికే పోలీసులు వెతుకుతున్నారు. పట్టుబడితే చంపుతారనే భయం ఉంది.
శారదకు ఎంతో బాధ్యత వచ్చి మీదపడినట్లయింది.
కమ్యూనిస్టు సాహిత్యం, మార్క్స్‌, ఎంగెల్స్‌, లెనిన్‌ రచనలు సంపాదించి చదవటం అత్యవసరమని, అవి చదివి చర్చించుకోవాలని అనుకున్నారు. త్వరలో భగత్‌సింగ్‌ని ఉరితీసి సంవత్సరం అవుతుందనీ, ఆ రోజు ఏదో ఒక పని చేసి ప్రజలలో సంచలనం తెచ్చి, భగత్‌సింగ్‌ ఆశయాలను వారి హృదయాలను హత్తుకునేలా చేయాలని అన్నారు వడివేలు, అమీర్‌.
‘‘దానికింకా నాలుగు నెలల సమయముందిగా’’ అంది శారద.
‘‘మనం రహస్యంగా పని చెయ్యాలి గనుక అది తక్కువ సమయమే. మనం బహిరంగంగా సభలు పెట్టి మాట్లాడలేం. కానీ మనం ఆలోచనలు, మన భిన్న స్వరం ప్రజలకు వినిపించాలి. అది తేలిక కాదు.’’
‘‘ఒక పత్రిక భగత్‌సింగ్‌ ఆశయాలు వివరిస్తూ తెద్దాం’’ శారద వడివేలుతో అంది.
‘‘ఇక్కడ అచ్చేస్తే పోలీసులకు తెలుస్తుంది. పత్రిక అమ్ముతుంటే వారిని పోలీసులు పట్టుకోవచ్చు. ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో ఆలోచిద్దాం’’ హైదర్‌ఖాన్‌ మాటలతో అందరూ అంగీకరించారు.
రాత్రి తొమ్మిది గంటలవుతుండగా సమావేశం ముగిసిందన్నారు. ఒక్కొక్కరుగా పది పదిహేను నిమిషాల వ్యవధానంలో బైటికి వెళ్ళాలనుకున్నారు. శారదను ముందుగా పంపించారు.
శారద ఇంటికి వచ్చేసరికి పది గంటలయింది.
‘‘ఇంకా ఆలస్యమవుతుందనుకున్నా. త్వరగానే వచ్చావే. ఏం మీటింగమ్మా’’ అప్పుడే పడుకోబోతున్న సుబ్బమ్మ లేచి వచ్చింది.
‘‘తల్లితో కూడా చెప్పకూడని రహస్య సమావేశం’’ మనసులో అనుకుంది శారద.
‘‘ఏదో విద్యార్థుల మీటింగ్‌లేమ్మా. ఉద్యమమంతా చల్లారింది గదా. మళ్ళీ వేడెక్కాలంటే ఏం చెయ్యాలా అని మాట్లాడుకున్నాం’’.
‘‘ఆ గాంధీ గారు ఏం చెయ్యమంటే అది చేస్తారు. దానికి మీ ఆలోచనేమిటి? మీరు చెప్పింది ఆయన ఒప్పుకుని చేస్తాడా?’’
‘‘ఆయనకి ఎన్నో పనులమ్మా. ఇక్కడ మనం ఒక్కొక్కరం ఏం చెయ్యాలో పిలిచి చెప్తారా? పెద్ద ఉద్యమమైతే ఆయన అందరికీ పిలుపిస్తాడు. మళ్ళీ పెద్ద సత్యాగ్రహం చేసే లోపల మనం ఊరికే కూర్చోలేం కదా’’.
‘‘ఊరికే ఎక్కడ కూర్చుంటున్నారు. దుర్గ కాకినాడలో సమావేశాలు జరిపి అరెస్టయిందిగా. మధుర జైల్లో ఉందిట. ఆ మీనాక్షి అమ్మవారే కాపాడాలి’’.
శారదకు దుర్గను తల్చుకుంటే బాధనిపించింది. సత్యాగ్రహపు రోజుల్లో అందరితో కలిసి జైలుకెళ్ళటం వేరు. ఇప్పుడు తనొక్కతే వెళ్ళటం వేరు. అప్పుడు జైలంతా సత్యాగ్రహం స్నేహితులు. ఇప్పుడు ఒంటరిగా మామూలు దొంగలతో, ఖూనీకోర్లతో… ఎలా ఉందో. దుర్గకు తను కమ్యూనిస్టునని తెలిస్తే ఏమంటుందో, కానీ చెప్పకూడదు. అన్నపూర్ణకూ చెప్పకూడదు. మూర్తికి మటుకు చెప్పాలి. చెప్పటమేంటి మూర్తిని పార్టీలో చేర్పించాలి. ఎందుకు? తనకెందుకు మూర్తి విషయం? తనకు కాకపోతే మరెవరికి? మూర్తి మంచి స్నేహితుడు. స్నేహితుల గురించి ఆలోచించటం తప్పెలా అవుతుంది? అసలీ తప్పు అనే ఆలోచనే తన మనసులోకి రాకూడదు. ఒక మనిషి మీద ప్రేమ, స్నేహం కలిగి మనసులో ఆనందం కలుగుతుంటే అది తప్పవటమేమిటి?
భోజనం ముగించి తల్లి హెచ్చరికలతో నిద్ర నటిస్తూ రాత్రంతా మేలుకొని ఉంది. అక్క నిద్రపోవటం లేదని గ్రహించి సూర్యం పక్కన చేరాడు. తమ్ముడితో అప్పటికే కమ్యూనిస్టు మేనిఫెస్టో గురించి మాట్లాడిరది శారద. కమ్యూనిస్టు పార్టీ గురించి చెప్పకుండా ఉండలేకపోయింది. శారద మాటలు వింటూ రోమాంచితుడయ్యాడు సూర్యం. ‘‘అక్కా నేనూ కమ్యూనిస్టునే’’ అన్నాడు. ‘‘మరి? నేను కమ్యూనిస్టునైతే నువ్వు కాకుండా ఎలా ఉంటావు సూర్యం’’ అంటూ సూర్యానికి సమసమాజ స్వప్నాన్ని వివరించి చెప్పింది.
కమ్యూనిస్టు పార్టీ పనులు చురుకుగా సాగుతున్నాయి. ముఖ్యమైన పని… విద్యార్థులకు, కార్మికులకు కమ్యూనిస్టు సిద్ధాంతాలు వివరించటమే. గ్రూపు సమావేశాలు ఏర్పాటు చేసుకుని వాటిల్లో మాట్లాడుతూ, చదువుతూ, చర్చిస్తూ…
ఇంకోవైపు కాంగ్రెస్‌ సోషలిస్టులుగా కాంగ్రెస్‌ కార్యక్రమాలు కొన్నింటిలో పాల్గొనటం, ఆ మీటింగులు ఏర్పాటు చేయటం.
కమ్యూనిస్టు పార్టీ సమావేశాలు అతి రహస్యంగా నిర్వహించాలి. అది ఎక్కడ ఎప్పుడు ఎంత రహస్యంగా నిర్వహించాలనేది నిర్ణయించడానికే ఎక్కువ సమయం పట్టేది. పత్రిక తీసుకురావటం మరింత కష్టంగా ఉండేది. అన్ని కష్టాలు పడుతూనే భగత్‌సింగ్‌ వర్థంతికి కరపత్రాలు ముద్రించారు. ఆ కరపత్రాలు చేతుల్లో పట్టుకుని భగత్‌సింగ్‌ తనే అయినట్లు గర్వపడుతూ స్టేషన్‌లో, బీచ్‌లో పంచింది శారద. ఆ కరపత్రం ఎలాంటిది? రక్తాన్ని సలసలా మరిగించే కరపత్రం. బ్రిటిష్‌ పాలకుల మీద ద్వేషాన్ని బుసబుస పొంగించే కరపత్రం. భగత్‌సింగ్‌ జీవించి ఉంటే తప్పక కమ్యూనిస్టు అయ్యేవాడు అనుకుంది శారద.
ఒకవైపు పరీక్షలు తరుముకు వస్తున్నాయి. ఆఖరి సంవత్సరపు పరీక్షలు. ఈ పరీక్షలయిన తర్వాత తండ్రి కోరిక ప్రకారం ఇంగ్లాండ్‌ వెళ్ళాలి. అది గుర్తొస్తే శారదకు నీరసం వస్తోంది.
పార్టీ పనులు, జాతీయోద్యమం, ఇక్కడి స్నేహితులు, తల్లి… అంతటినీ, అందరినీ వదిలి ఇంగ్లండ్‌ వెళ్ళాలంటే అస్సలు మనసొప్పటం లేదు.
కానీ తండ్రి చివరి కోరిక. తన చిన్నతనంలో తండ్రితో రాజ్యలక్ష్మమ్మ అమ్మమ్మ అదే చెప్పింది. చివరి రోజుల్లో దగ్గరై తాతయ్యా అనిపించుకున్న వీరేశలింగం పంతులు గారూ అదే చెప్పారు.
ఏం చెయ్యాలి? పరీక్షలు, అప్రెంటిస్‌షిప్‌ అయ్యేసరికి దాదాపు సంవత్సరం పడుతుంది. అప్పుడు ఆలోచించొచ్చులే అని పక్కకు పెట్టేసింది. దేనినైనా మనసులో పెట్టుకుని కుమలటం శారద తత్త్వం కాదు. నిర్ణయం తీసుకుందా అందులో మనసు నిమగ్నం చేస్తుంది.
కానీ ఇంగ్లండ్‌ ప్రయాణం అంత తేలికైంది కాదు. కేవలం నిర్ణయంతో జరిగేదీ కాదు. డబ్బుతో కూడిన పని. శారదకు తన కుటుంబపు ఆర్థిక స్థితి గురించి తెలుసు. మేనమామల సాయంతో, రామారావు గారి వైపు బంధువులతో కలిసి ఆ విషయాలు చూస్తోంది. పొలాల మీద వచ్చే ఆదాయం తగ్గిపోతోందని, ఆర్థిక కాటకం వల్ల రైతులు చాలా దరిద్రంలో
ఉన్నారనీ, అప్పులు చెయ్యక తప్పటం లేదనీ అప్పుడప్పుడు మేనమామ చెబుతుండేవాడు. ఆర్థిక కాటకం గురించి శారద సంఘపు సమావేశాల్లో చర్చించేది కూడా. విద్యార్థి మిత్రులందరూ దాని బారిన పడినవారే. ఊళ్ళనుంచి తల్లిదండ్రులు డబ్బులు పంపలేకపోతున్నారు. ఉద్యోగాలు దొరకటం లేదు. అంతకు ముందు మూడు పూటలా తినేవాళ్ళు ఇప్పుడు రెండు పూటలే తింటున్నారు. ఒక్కోసారి సగం తిండితో సరిపెట్టుకుంటున్నారు.
శారద డబ్బు విషయాలు తల్లితో మాట్లాడబోతే ఆమె ఊరుకునేది కాదు.
‘‘అవన్నీ మేం చూసుకుంటాంగా. నువ్వు చదువుకో’’ అనేది. అంతకంటే మాట్లాడడానికి ఆమెకూ ఆ విషయాలు తెలియవు. అంతా చూసుకునేది శారద.
శారద అంతటితో ఆ సంగతి వదిలేసేది.
ఇంటినిండా ఎప్పుడూ బంధువులు, స్నేహితులు ఉంటూనే ఉంటారు. ఖర్చుకి మితిలేదు. తండ్రి ఉన్నప్పటి దర్జా లేదు కానీ ఇది తక్కువైంది అనుకోవటానికీ లేదు. శారద చేతిలో డబ్బు నిలవదని సుబ్బమ్మగారి అభిప్రాయం. ఎవరైనా అవసరం అంటే చాలు అది తీర్చేదాకా శారద అల్లాడిపోయేది. సుబ్బమ్మగారికి అది కొంచెం కష్టంగా ఉండేది. శారద తనకంటూ పెట్టుకునే ఖర్చేమీ ఉండదు. నూలు చీరెలు, ఖద్దరు చీరెలు కడుతుంది. నగలేమీ పెట్టుకోదు. కమ్యూనిస్టు సిద్ధాంతాలు, గాంధీగారి ప్రభావమూ ఆమెను మరింత నిరాడంబరంగా తీర్చిదిద్దాయి. కానీ తన చుట్టూ ఉన్నవారి అవసరాలు చూడటం, అవి తీర్చటం తన బాధ్యత అనుకుంటుంది. ఈ స్వభావం ఆమెకు తండ్రి నుంచి వచ్చిందని సుబ్బమ్మ అంటుంది.
‘‘ఈ కాటకం ఇప్పట్లో పోయేలా లేదు. ఇంగ్లండ్‌ వెళ్ళి చదవటం జరిగే పనేనా’’ అంది సుబ్బమ్మ.
‘‘జరక్కపోతే మరీ మంచిది మానేద్దాం’’ అంది శారద ఉత్సాహంగా.
‘‘ఎంత కష్టమైనా పడాల్సిందే. ఇంగ్లండ్‌ వెళ్ళాల్సిందే. నేను బతుకుతున్నదే అందుకు’’ అంది సుబ్బమ్మ.
‘‘డబ్బు లేకుండా ఎలాగమ్మా’’
‘‘డబ్బు ఎలాగోలా పుడుతుంది. మామయ్యలు చూస్తారు. ఇవాళ్టి నుంచీ నువ్వు అనవసరపు ఖర్చులు తగ్గించు. నే చెప్పినట్టు విను’’ కాస్త గట్టిగా అంది.
‘‘అనవసరపు ఖర్చులు నేనేం పెడుతున్నానమ్మా’’ తల్లి నుంచి ఎన్నడూ చిన్నమాట అనిపించుకోవటం అలవాటు లేని శారదకు కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.
‘‘నిన్ను ఎవరైనా అవసరంలో ఉన్నామని అడగడమే పాపం కదా… ఇవ్వకుండా ఊరుకుంటావా? అది కాస్త తగ్గించు, అంటున్నా. అంతకంటే ఏమీ లేదు’’.
‘‘ఎవరైనా పది రూపాయలు కావాలని అడిగితే నేను ఇంగ్లండ్‌ వెళ్ళాలి. అంచేత ఇవ్వలేను అనమంటావా?’’ దుఃఖాన్ని మింగేసి నవ్వబోయింది శారద.
‘‘నువ్వేమంటావో నాకనవసరం. ఆ ఖర్చులు తగ్గించు’’. శారద కోపంగా అక్కడినుంచి వెళ్ళింది కానీ తల్లి మాటల్లో అబద్ధం లేదు. చాలా ఖర్చులు తగ్గిస్తే గానీ ప్రయాణం కుదరదు.
శారదతో పాటు చదువుతున్న సరళను, మార్తాను మిషనరీ వాళ్ళే పంపుతున్నారు.
శారద పరీక్షలు పూర్తయ్యాయి. మిగిలిన విద్యార్థులంతా ఇళ్ళకు వెళ్ళారు. శారద తన పనుల్లో తానుంటూనే, కమ్యూనిస్టు సాహిత్యంతో పాటు ఇతర సాహిత్యం చదవటం, ఇంగ్లండ్‌ వెళ్ళటానికి కావలసిన ఏర్పాట్లు చేసుకోవటంతో తీరిక లేకుండా ఉంది.
శారద ఇంగ్లండ్‌ ప్రయాణం సూర్యం భరించలేకపోతున్నాడు. అక్కను చూడకుండా రెండు సంవత్సరాలు ఎలా
ఉండాలి? శారదను ఆ ప్రశ్న అడుగుతూనే ఉన్నాడు. ‘‘నువ్వు చదువులో మునిగిపోవాలి సూర్యం. శలవల్లో బొంబాయి
వెళ్ళు. మన స్నేహితులున్నారు. నీకెన్ని విషయాలో తెలుస్తాయి. హైదరాబాదు వెళ్ళు. అసలు మనిద్దరం ముందు హైదరాబాద్‌ వెళ్ళొద్దాం. అక్కడ మనవాళ్ళతో కలిసి తిరిగితే నీ దిగులు పోతుంది’’. శారద ఎన్ని చెప్పినా సూర్యం దిగులు పెరిగిందే కానీ తగ్గలేదు. అక్కలేని ఇంటిని, మద్రాసును ఊహించలేకపోతున్నాడతను.
దుర్గాబాయి మధుర జైలు నుంచి విడుదలై కాకినాడ వచ్చిందనీ, ఆమె ఆరోగ్యం బాగా దెబ్బతిన్నదనీ కాకినాడ నుంచి అన్నపూర్ణ ఉత్తరం రాసింది. శారదకు ఇంగ్లండ్‌ వెళ్ళేముందు ఒకసారి దుర్గాబాయిని చూసి రావాలనిపించింది. పైగా కృష్ణా గోదావరీ జిల్లాల్లో కూడా కమ్యూనిస్టు భావాలతో యువతీ యువకులు పనిచేస్తున్నారు. అక్కడివాళ్ళను కలిసి వస్తే ఉత్సాహం పెరుగుతుంది. తల్లిని అడిగితే రాలేనంది. ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకుంటూ ఒకసారి విశాలాక్షిని కలిసి వద్దామనుకుంది.
శారద వెళ్ళేసరికి విశాల చాలా ఆందోళనలో ఉంది. ఈసారైనా యూనివర్శిటీలో ఎకనామిక్స్‌ శాఖలో సీటు దొరుకుతుందా లేదా అనే దిగులు పెట్టుకుంది. పైగా కోటేశ్వరి నాటకం కంపెనీ కోసం ఇంకెవరినో ఇంట్లో చేర్చింది. అతన్ని చూస్తుంటే విశాలకు కంపరంగా ఉంది. పాపం అతను విశాల జోలికి రావటం లేదు కానీ విశాల అతని ఉనికినే భరించలేకపోతోంది. అమ్మ ఇట్లా ఎందుకు చేస్తుందనే కోపం, దుఃఖంతో ఉడికిపోతోంది. దానికి తోడు ఇన్నాళ్ళూ ఎక్కడుందో తెలియని ఒకావిడ పిన్నంటూ ఇంట్లో దిగింది. ఆమెకు పధ్నాలుగేళ్ళ కూతురు. వాళ్ళిద్దర్నీ తల్లి ఆప్యాయంగా చూసుకుంటుంటే విశాలకు ఒళ్ళు మండిపోతోంది.
‘‘ఇన్నాళ్ళూ ఏమయ్యారమ్మా వీళ్ళు. నాకెప్పుడూ చెప్పనన్నా లేదు నాకో పిన్ని ఉందని’’ అనడిగింది తల్లిని.
‘‘నా పిన్నమ్మ కూతురమ్మా. మేమూ చిన్నతనంలో చూసుకోటమే. రాజమండ్రిలో ఓ వెలుగు వెలిగింది. ఇప్పుడు కూతురిని పైకి తేవాలని పట్నం వచ్చింది. నాలుగైదు నెలల్లో ఏదో ఒక దారి చూసుకుని వెళ్ళిపోతారు. వాళ్ళతో మరీ అంటీ ముట్టనట్టు ఉంటావెందుకు’’ అని కూతురిని సముదాయించబోయింది కోటేశ్వరి. విశాలకు ఆ పిల్లను చూస్తే ఒంటికి కారం రాసుకున్నట్లుండేది.
‘‘పధ్నాలుగేళ్ళ పిల్ల. బళ్ళోకి వెళ్ళి చదువుకునే వయసు. ఎప్పుడూ అద్దం ముందు చేరి సింగారం, ఆ బట్టలు, ఆ తల దువ్వుకోవటం. నాకు చూస్తుంటే చీదరగా ఉంది. ఇల్లు ఒదిలి ఎటన్నా పోదామని
ఉంది’’.
విశాల ఈ చిరాకులో ఉండగానే శారద వచ్చింది. విశాల చాటంత ముఖం చేసుకుని ‘‘నువ్వెంత మంచిదానివి శారదా. ఇన్నిసార్లు మా ఇంటికి వస్తావు. నేను మీ ఇంటికి రావటం లేదని పట్టించుకోవు’’ అని ఆహ్వానించింది.
‘‘దాన్లో ఏముందోయ్‌. ఎవరింటికి ఎవరొస్తే ఏంటోయ్‌’’ అని గలగలా నవ్వింది శారద.
‘‘మా ఇంటికి రావటానికి చాలామంది సందేహిస్తారు. వచ్చేవాళ్ళను చూస్తే నాకు చిరాకు’’ అంటూ తన మానసిక పరిస్థితంతా శారదతో చెప్పుకుంది విశాల.
‘‘పోనీ ఒక పని చెయ్యి. నేను దుర్గను చూడటానికి కాకినాడ వెళ్తున్నాను. నువ్వూ నాతో రా. మార్పుగా ఉంటుంది. మనం తిరిగి వచ్చేసరికి నీ సీటు సంగతి కూడా తేలుతుంది’’.
విశాలకు కూడా ఆ మాట నచ్చింది. కానీ వెంటనే ఓ సందేహమూ వచ్చింది.
‘‘శారదా! మనం వెళ్ళే చోట్ల నిన్నూ, నన్నూ ఒకేలా చూస్తారా? నిన్నో చోటా నన్నో చోటా భోజనం చెయ్యమంటారా?’’
‘‘అలాంటి చోటికి నేను వెళ్ళనే తల్లీ. దుర్గ దగ్గరికే వెళ్దాం. దుర్గ సంగతి నీకెంత తెలుసో నాకు తెలియదు. చిన్నతనంలోనే నువ్వే ఇష్టపడని మీ ఇళ్ళకు వచ్చి గాంధీ పురాణం చెప్తానని, గాంధీ గారి గురించి చెప్పింది. మనకంటే చిన్నదే గానీ ఎన్నో విషయాల్లో మనల్ని దాటి ముందుకెళ్ళింది’’.
‘‘నాకా రాజకీయాలు పడవు తల్లీ’’.
‘‘అనారోగ్యంతో ఉన్న దుర్గను పలకరించడానికి రాజకీయాలక్కర్లేదు గానీ నువ్వు రావాలి. వస్తున్నావు. అంతే’’ తొందర చేసింది.
‘‘మా అమ్మతో చెప్పాలిగా’’.
‘‘మీ అమ్మగారితో నేను మాట్లాడుతాలే’’ అంటూ శారద లోపలికి వెళ్ళింది. శారదంటే కోటేశ్వరికి ఎంతో ఇష్టం. మనసులో ఉన్నదంతా వెళ్ళబోసుకోటానికి ముఖ్యంగా కూతురి గురించి చెప్పుకోటానికి ఆమెకు శారద కంటే ఎవరూ దొరకరు. శారదను చూడగానే కూతురి ఆగడాల గురించి మొత్తుకుంది.
‘‘విశాల మనసు వేరుగా ఆలోచిస్తోందమ్మా. కాలేజీలో చేరితే అన్నీ కుదిరిపోతాయి. ఈ లోపల ఒక నెల రోజులు నాతోపాటు కాకినాడ తీసుకుపోదామనుకుంటున్నా మీరు ఒప్పుకుంటే…’’
‘‘అయ్యో! నేనెందుకు ఒప్పుకోను. నువ్వడగటం నేను కాదనటమా? బంగారంలా తీసుకుపో. నీకున్న బుద్ధి దానికుంటే ఎంత బాగుండేది. నువ్వెంత గొప్పింటి బిడ్డవు. మీ నాయనమ్మెంత నిష్టాపరురాలు. మీ నాన్నెంత పండితుడు. ఆ ఇంటి పిల్లవు మా ఇంటికొచ్చి నా చేతి వంట తింటున్నావు. దానికింత కంటే ఏం గౌరవం కావాలి? ఎప్పుడూ ఏదో కుములుతుంటుంది. దాని కుములుడు చూడలేకుండా ఉన్నాను. తీసుకుపోమ్మా. నెల రోజులు నేనూ సుఖపడతాను’’ అంది.
శారద నవ్వి ‘‘విశాలకు చదువైపోయి పెద్ద ఉద్యోగం వస్తే తనూ, మీరు కూడా సుఖపడతారు’’ అంది.
‘‘ఉద్యోగాల్లోనామ్మా సుఖం, శాంతి ఉండేది. మనసులో ఉండాలి. దాని మనసు మంచిది కాదు’’ అంది కోటేశ్వరి.
‘‘అట్లా కాదులే అమ్మా. మంచిదే. నే చెప్తాగా’’ అంటూ విశాల దగ్గరికి వెళ్ళి ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకోమంది.
ఇక కృష్ణా, గోదావరి జిల్లాల్లో పార్టీ సభ్యులను కలుసుకుంటానని పార్టీ అనుమతి కోసం అడిగింది. పార్టీ సభ్యులకు కబుర్లు వెళ్ళాయి. అందరికీ అనుకూలమైన రోజేదో తెలుస్తుంది. శారదకది మహా ఉత్సాహంగా ఉంది. ఆంధ్ర ప్రాంతంలో కమ్యూనిస్టు పార్టీ చాపకింద నీరులా, నీళ్ళల్లో చేపలా పాకుతోంది. గ్రామాలకు గ్రామాలు జమీందారీ వ్యతిరేక, భూస్వామ్య వ్యతిరేక భావాలతో చైతన్యమవుతున్నాయి. వితంతు వివాహాలు చేయటం, వయోజన విద్య వంటి కార్యక్రమాలతో ప్రజల్లోకి చొచ్చుకుపోతూ తమ ప్రత్యేకత చూపుతున్నారు. కాంగ్రెస్‌ సోషలిస్టులుగా చెలామణి అవుతున్నా అంతర్గతంగా వాళ్ళలో కమ్యూనిస్టు భావాలే జ్వలిస్తున్నాయి. గుంటూరులో ఏర్పడిన కమ్మ హాస్టల్‌ ఇలాంటి భావాలున్న యువకులకు కేంద్రమైంది.
ముదునూరు, వీరులపాడు లాంటి గ్రామాలలో మహిళలు కూడా ఇళ్ళు దాటి ముందుకు వస్తున్నారు.
శారదకు అదంతా చూసి రావాలని ఉంది. పార్టీ అనుమతి కోసం ఎదురుచూస్తోంది. ఓ వారం రోజుల ఎదురుచూపు తర్వాత పార్టీ శారద ఆ ప్రాంత కమ్యూనిస్టులను కలుసుకునేందుకు అంగీకరించటం లేదనే అనంగీకార పత్రం అందుకుంది. అన్ని ప్రాంతాలలో పోలీసుల నిఘా చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు శారద వెళ్తే సమావేశాలు ఏర్పాటు చేయగలరనే నమ్మకం లేదు అని రాశారు. శారద ఉత్సాహం సగం చల్లారిపోయింది.
దుర్గ దగ్గర పదిరోజులుండి వస్తే చాలని విశాలతో కలిసి పది రోజులు గడపటం కూడా మంచిదని అనుకుని సమాధానపడిరది. సూర్యాన్ని ఈ ప్రయాణం ఉత్సాహపరుస్తుందనుకుంది.
కాకినాడలో రైలు దిగి దుర్గాబాయమ్మ గారిల్లు అంటే చెప్పలేని వారెవరూ ఉండరు. తేలిగ్గా దుర్గ ఇంటికి చేరారు. దుర్గను చూసి శారద భయపడిరది. ముఖంలో ఆ కళ, వర్చస్సు ఎటు పోయాయో నిలువెల్లా నీరసంతో ఉంది. సన్నగా, నల్లగా, బలహీనంగా ఉంది. శారదను చూసి దుర్గ చాలా సంతోషించింది.
దుర్గ వాళ్ళమ్మా, తమ్ముడూ కూడా వీళ్ళకు చాలా మర్యాద చేశారు. విశాల చదువు సంగతి శారద చెప్పగానే దుర్గ ముఖంలో కాంతి వచ్చింది. విశాల చేతులు రెండూ గట్టిగా పట్టుకుని ‘‘తప్పకుండా చదువు. ఎట్టి పరిస్థితుల్లోనూ చదువు మానకు’’ అంది.
‘‘ఈ సంవత్సరమన్నా సీటు వస్తే’’ అని నిరుత్సాహంగా అంటున్న విశాల నోరు మూసి…
‘‘ఎందుకు రాదు? తప్పకుండా వస్తుంది. నేను ముత్తులక్ష్మీరెడ్డికి ఉత్తరం రాసిస్తాను. ఇక నీకు సీటు ఇప్పించడం ఆవిడ బాధ్యత. అవసరమైతే ప్రకాశం గారికి, కాశీనాథుని గారికి కూడా ఉత్తరాలు రాసిస్తాను. వాళ్ళూ సాయం చేస్తారు. నీకు తప్పకుండా వస్తుంది’’.
‘‘ఔను’’ అంది శారద.
‘‘విశాలా… ముత్తులక్ష్మీరెడ్డి నీకు తప్పకుండా సాయం చేస్తుంది. మీ కులం వాళ్ళు ఆ వృత్తి వదలాలని ఆమె చాలా కృషి చేస్తోంది’’ అంది దుర్గ.
విశాలకు కొత్త ఆశ కలిగింది.
ఆ సాయంత్రం దుర్గని వీణ వాయించమని అడిగింది శారద.
దుర్గ వీణ వాయిస్తుంటే, శారద పాడుతుంటే త్యాగరాజకృతులకు విశాల అభినయం చేసింది.
చాలా రోజుల తర్వాత దుర్గ ఉత్సాహంగా ఉందని తల్లి సంతోషించింది.
‘‘ఈ వీణ నన్ను జైల్లో కాపాడిరది. నాకు పిచ్చెక్కకుండా చేసింది. సంగీతానికున్న శక్తి మరింక దేనికీ లేదు’’ అంది దుర్గ.
‘‘జైల్లోకి వీణ తీసుకెళ్ళారా’’ అంది విశాల ఆశ్చర్యంగా.
‘‘తీసుకెళ్ళలేదు. జైల్లో ఒంటరితనం, భయంకరమైన వాతావరణం భరించలేకపోయా. పిచ్చెక్కుతుందేమో అనిపించింది. ఆ స్థితిలో జైలు సూపర్నెంటుని ఒక వీణ ఇప్పించమని అడిగా. నన్ను చూసి జాలిపడ్డాడేమో, తెప్పించి ఇచ్చాడు. వీణ వాయిస్తుంటే మళ్ళీ మనిషినయ్యాను నెమ్మదిగా. అబ్బా… ఆ రోజులు… ఆ మనుషులు…’’
అదంతా మర్చిపోవాలమ్మా. ఆ జ్ఞాపకాలు నీ ఆరోగ్యానికి మంచివి కావు. అమ్మా శారదా. మీ ముగ్గురూ కలిసి ఇంకో కీర్తన పాడండి. దుర్గ వీణ వాయిస్తూ పాడుతుంది’’ అంది అమ్మ.
ముగ్గురూ ఏం పాడదామంటే ఏం పాడదామనుకున్నారు.
ముగ్గురికీ నచ్చిన, వచ్చిన కీర్తన ‘సంగీత జ్ఞానము భక్తి వినా’ హాయిగా గొంతెత్తి పాడుతుంటే, ముగ్గురి గొంతుల మధ్యనుంచీ వీణ మధురంగా పలుకుతుంటే వాతావరణమంతా ఆనందమయమైంది.
దుర్గ అప్పటికే బెనారస్‌ మెట్రిక్‌ పరీక్ష ఇవ్వాలని నిర్ణయించుకుంది.
నాస్తిక భావాలు ప్రచారం చేస్తూ, కాకినాడ కాలేజీలో ఉద్యోగం చేస్తున్న గోరా గారింటికి వెళ్ళి ట్యూషన్‌ చెప్పించుకుంటోంది. శారద తనున్న నాలుగు రోజులూ దుర్గకు సైన్సు పాఠాలు చెప్పింది. విశాల ఇంగ్లీషు గ్రామరు చెప్పింది.
ముగ్గురూ కలిసి సూర్యాన్ని తీసుకుని గోరా గారింటికి వెళ్ళారు.
ఆ ఇంటి వాతావరణం విశాలను ఆశ్చర్యపరిచింది. శారదా వాళ్ళిల్లు కుల మత భేదాలకతీతంగా నడుస్తున్నా ఇంట్లోకి రాగానే అది బ్రాహ్మణుల ఇల్లని తెలుస్తుంది. సుబ్బమ్మగారు దేవతల విగ్రహాలు, పటాలు ఇంట్లో అలంకరణగా పెడుతుంది. పెద్ద ఇల్లు.
గోరా గారి ఇల్లు ఒక పాక. విశాలమైన ఆవరణ ఉంది. దాని నిండా రకరకాల మొక్కలు. చెట్లు, పూల చెట్లు విరగబూసి
ఉన్నాయి. పాకలో ఒకవైపు గోరాగారి ఇల్లు ఏ మత చిహ్నాలూ లేకుండా ఉంది. పక్కనే ఉన్న గదిలో గోరాగారి తల్లిదండ్రుల పూజ గది
ఉంది. సరస్వతి గోరాగారి భార్య. ఆమె నాస్తికురాలు. అయినా అత్తమామల పూజలకు కావలసిన ఏర్పాట్లు చేసేది.
శారద, సరస్వతి క్షణాల్లో స్నేహితులయ్యి ఎన్నాళ్ళబట్టో ఎరిగున్న వాళ్ళలా కబుర్లు చెప్పుకున్నారు.
గోరా గారితో శారద నాస్తికవాదం గురించి చిన్న వాదన చేసింది. ప్రజలు ఈ భావాలకు భయపడతారని శారద, ప్రజలలో అనవసర భయాన్ని పోగొట్టి జ్ఞానాన్ని ఇవ్వటమే గదా మనం చెయ్యాల్సింది అని గోరాగారూ…
విశాలకిదంతా కొత్త ప్రపంచం. తన ఇంటి వాతావరణానికి ఇక్కడి ఈ ఇళ్ళకూ పోలికే లేదనుకుంది. ఐనా విశాల ఇక్కడ కూడా కదలలేకపోయింది. వీళ్ళు కూడా తనవాళ్ళు కాదనిపించింది. వాళ్ళు శారదను చూస్తున్నట్టే విశాలనూ చూస్తున్నారు. కానీ విశాలకు ఎక్కడో ఏదో తేడా ఉందనే అనిపిస్తోంది. ఆ ఆదర్శాలు విశాలకు ఎక్కడం లేదు. వాళ్ళ మాటల్లో విశాల లీనం కావటం లేదు.
విశాల మనసు మద్రాసు వెళ్ళగానే తను కలవబోయే ముత్తులక్ష్మీరెడ్డి, ఆమె తనకు ఇప్పించబోయే సీటూ తప్ప మరింకే ఆలోచనా నిలవటం లేదు. సూర్యం కూడా అంతే. అక్క రెండేళ్ళు కనబడదనే మాట మర్చిపోలేకుండా ఉన్నాడు. ఆ దిగులు అతని ముఖం మీదా, మనసులోనూ తిష్ట వేసుకుని కూర్చుంది. శారద మాత్రం కాకినాడ వచ్చి మంచిపని చేశాననుకుంది. కాంగ్రెస్‌ సోషలిస్టు పార్టీ గురించి దుర్గతో మాట్లాడదామనుకుంది. కానీ ఆమెతో రాజకీయాలు మాట్లాడవద్దని దుర్గ తమ్ముడు నారాయణరావు హెచ్చరించాడు. చూస్తుండగానే పది రోజులు గడిచాయి. దుర్గ బలవంతం మీద మరో ఐదు రోజులు ఉన్నారు.
తిరిగి ప్రయాణమవుతుంటే దుర్గ తను ఒడికిన నూలుతో చేసిన చీరెలు చెరొకటీ ఇచ్చింది.
‘‘జీవితాంతం ఇది దాచుకుంటా దుర్గా. ఎంతో అమూల్యం నాకిది’’ అంది శారద ఆ చీరెను గుండెలకు హత్తుకుంటూ.
ముగ్గురూ కలిసి మళ్ళీ త్యాగరాజ కీర్తన అందుకున్నారు. దుర్గ మధురంగా వీణ వాయించింది.
విశాల, శారద తిరిగి వచ్చీ రాగానే శారద తన పలుకుబడిని ఉపయోగించి ముత్తులక్ష్మీరెడ్డిని కలిసే ఏర్పాటు చేసింది.
విశాల తన పరిస్థితీ, తన కోరికా ఏమీ దాచకుండా ఉన్నది ఉన్నట్టు చెప్పింది. దుర్గాబాయి రాసిన ఉత్తరం ఇస్తే లక్ష్మీరెడ్డి నవ్వి, ‘‘నీ మాటలన్నీ విన్నాక ఇంక ఎవరి సిఫారసూ అక్కర్లేదు. దుర్గాబాయి అంటే నాకెంతో గౌరవం. నిజమే. ఇప్పుడు నువ్వంటే ఎంతో ప్రేమ కలిగింది నాకు. నువ్వు ఎం.ఎ.లో చేరటానికి ఏర్పాట్లు చేసుకో. శారదా. నువ్వు ఇంగ్లండ్‌ వెళ్తావా? మంచి పని. నాకూ ఇంగ్లండ్‌ రావాలని ఉంది.’’

Share
This entry was posted in ధారావాహికలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.