ప్రపంచ వ్యాప్తంగా స్త్రీ, పురుష సమవాదం ప్రబలి గత 50 ఏళ్ళలో అనేక మార్పులు జరిగాయి. అమెరికా, ఇంగ్లండ్ వంటి అనేక దేశాలలో పారిశ్రామికీకరణ ప్రభావం వలన, 1960 సం॥ తర్వాత స్త్రీ వాద ఉద్యమ ప్రభావం వలన పెద్ద సంఖ్యలో స్త్రీలు ఉద్యోగాలలో ప్రవేశించటం జరిగింది.
తొలినాళ్ళలో స్త్రీలకు పురుషులతో సమాన వేతనం ఇవ్వబడలేదు. ఇటీవలి కాలందాకా సాంస్కృతిక, న్యాయ రంగాలలో స్త్రీలు ఎక్కువగా ప్రవేశించలేదు. చాలాకాలం పాటు ధార్మిక, విద్యా రంగాలలో స్త్రీలు పరిమితమయ్యారు. 19, 20 శతాబ్దాలలో పేదరికం, ఆర్థిక, సామాజిక పరిస్థితుల వల్ల స్త్రీలు, పురుషుల మీద ఆధారపడి బతికారు. కార్మిక రంగాలలోని స్త్రీలకు, పురుషులతో సమాన వేతనం లేదు. ఎక్కువగా స్త్రీలు ఉన్నత విద్య నేర్వని కారణంగా ఉన్నత పదవులు లభించలేదు. చాలా విశ్వవిద్యాలయాల్లో చేరటానికి డిగ్రీలు పొందటానికి న్యాయ శాస్త్రం, వైద్య శాస్త్రానికి సంబంధించిన ఉన్నత విద్య అభ్యసించటానికి స్త్రీలకు ప్రవేశం లేదు. ఉదాహరణకు ప్రతిష్టాత్మకమైన కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం కూడా 1947 సం॥ తర్వాతనే స్త్రీలకు పూర్తిస్థాయిలో డిగ్రీలను ప్రదానం చేయగలిగింది. అలాంటి స్థితిలో స్త్రీలు తక్కువ జీతానికి చిన్న చిన్న ఉద్యోగాలు, పనులు చేసేవాళ్ళు. ఆఫీసుల్లో పనులు, ఉద్యోగాల్లో… స్త్రీలు ప్రవేశించినప్పటి నుంచి ఎక్కువ శారీరక శ్రమ ఉండకపోవడం, ఉన్నత విద్య అభ్యసించటం వల్ల దీర్ఘకాలిక ఉద్యోగాల్లో వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది.
ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో స్త్రీలు వ్యాపార రంగంలో అమ్మకం దారులుగా, వ్యవసాయ కూలీలుగా, గృహ నిర్వహణ, పిల్లల పెంపకాల్లో వేతనాలకు పనిచేసే వారిగా కనిపిస్తున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా అభివృద్ధి చెందాయనుకుంటున్న దేశాల్లో కూడా స్త్రీ, పురుషులు సమానంగా జీవించటం లేదంటే అతిశయోక్తి కాదు. ఈ మధ్య బాపుగారి దర్శకత్వంలో విడుదలయిన ఓ సినిమాలో స్త్రీ, పురుషుల సమానత్వం గురించి వ్యంగ్యంగా ఇలా చెప్పారు ‘‘పురుషులు స్త్రీల కంటే కొంచెం ఎక్కువ సమానం, స్త్రీలు పురుషుల కంటే కొంచెం తక్కువ సమానం’’ అని.
సగటు భారతీయ పురుషుడి మనస్తత్వం ఇంతే! పాశ్చాత్య దేశాల్లో స్త్రీ అంటే కేవలం స్త్రీయే అని, భారతీయులకి స్త్రీ అంటే తల్లి అనీ స్వామి వివేకానంద చెప్పారు. వేదకాలంలో పురుషులతో సమానంగా శాస్త్ర చర్చలలో కూడా పాల్గొన్న విదుషి స్థాయి క్రమేణా విదేశీయుల దండయాత్రలు, ఇతర సామాజిక, ఆర్థిక కారణాల వలన దిగజారిపోయింది. స్త్రీ గృహానికి, ఇంటి పనులకు పరిమితమై విద్యకి, మానసిక వికాసానికి కూడా దూరమైంది.
ఈ ఇరవయ్యొక శతాబ్దంలో కూడా స్త్రీల పరిస్థితి ఇంకా దుర్భరంగా మారుతోంది. గర్భం దాల్చి శిశువుకు జన్మ ఇవ్వటం మగవాళ్ళు చేయలేరు. అలాగే శారీరక వ్యవస్థ రీత్యా ఆడవాళ్ళు కూడా అన్ని పనులు చేయలేరు. కానీ ప్రయత్నిస్తే అన్నీ చేయగలరు. మహాత్మా జ్యోతిబా ఫూలే అందుకే ‘‘స్త్రీలు పురుషుల కంటే ఉన్నతులు’’ అన్నారు. దేహ దారుఢ్యం పురుషులకంటే స్త్రీలకే ఎక్కువ. అందుకే వాళ్ళు ఎక్కువ కాలం జీవిస్తారని వైద్యశాస్త్రం చెబుతోంది.
‘‘ఆధునిక స్త్రీ చరిత్రను తిరగరాస్తుంది’’ అని గురజాడ అన్నారు. కానీ, ఆధునిక సమాజంలో స్త్రీ పలురకాలుగా విద్య కోసం,
ఉద్యోగం కోసం, పని కోసం బయటికి వస్తుంటే ప్రేమ, యాసిడ్ దాడులు, లైంగిక వేధింపులు, అత్యాచారాలు, ఇంకా అనేక విధాల హింసలకు లోనవుతోంది. మగవాళ్ళు నిర్మించిన నీతులు, చరిత్ర, రాజ్యాంగాలు, ప్రభుత్వాలు, న్యాయస్థానాలు, అన్నీ… స్త్రీలకు న్యాయం చేయలేక పోవటం గమనార్హం.
ప్రస్తుతాంశం చర్చకు విస్తృతి ఎక్కువ కాబట్టి మన దేశంలో ఉద్యోగినుల జీవితాలు, హక్కులు, సమాజం, పని స్థలం, కుటుంబం మొ॥ అంశాల గురించి ఆలోచిద్దాం.
ఇతర దేశాలకన్నా మన దేశంలో స్త్రీల పరిస్థితి మెరుగ్గా ఏమీ లేదు. పురుషుడు సంపాదనాపరుడు కానిచోట స్త్రీ సంపాదన మీదే కుటుంబమంతా ఆధారపడాల్సి వస్తోంది. కొన్నిచోట్ల స్త్రీలు కుటుంబ పరిధిని దాటి బయటికి వెళ్ళి ఉద్యోగం చేయటానికి సాంప్రదాయం అడ్డుపడుతోంది. కుటుంబ జీవితంతో మొదలై సమాజంలోంచి పనిస్థలాలకు విస్తరించే ఉద్యోగినులకు అనేక సమస్యలున్నాయి. ఆర్థిక భద్రత కొంతవరకు ఉన్నా దానిమీద కూడా పురుషుని ఆధిక్యతే ఎక్కువగా కనిపిస్తుంది. ఆమె చదువు, ఉద్యోగం, హోదా, ఆర్థిక ఎదుగుదల, వ్యక్తిత్వ వికాసం, పరపతి పురుషునిలో అభద్రతను పెంచుతోంది. స్త్రీని ఒక ఆస్తిగా, వస్తువుగా తరతరాలుగా భావిస్తున్న పురుషునిలోని అహం దెబ్బతింటోంది. ఆస్తులు కొన్నా అతని పేరుమీదే! ఆమె సంపాదనపై హక్కు అతనిదే అవుతోంది. ఒక మహిళ ఉద్యోగినిగా మారినప్పుడు ఆమె ఎదుర్కొనే సవాళ్ళు లేదా సమస్యలను ఇలా వర్గీకరించవచ్చు.
1. కుటుంబ సమస్యలు
2. ఆరోగ్య సమస్యలు (మానసిక, శారీరక)
3. పనిస్థలాల్లోని సమస్యలు
4. ఆర్థిక దోపిడీ
ఉద్యోగిని`కుటుంబం:
ఉద్యోగినిగా ఎదుగుతున్నకొలదీ స్త్రీకి భర్త అహాన్ని తృప్తిపరచటం ఒక పెద్ద సవాలుగా మారుతోంది. మన సమాజంలో ఇది ఆడపని, ఇది మగపని అని పనులు విభజింపబడి మగ మెదళ్ళకు చిన్నప్పటి నుంచి అలాంటి శిక్షణ ఇస్తారు తల్లిదండ్రులు. ఒక పురుషుడు సంపాదనాపరురాలైన భార్య కావాలనుకుంటాడు. కానీ ఆమెకు గల కుటుంబ బాధ్యతల్లో పాలు పంచుకోడు. పనిమనిషికి ఎంత జీతమివ్వాలనే విషయం నుంచి ఆమె జీతంపై, ఆర్థిక ప్రణాళికపై సర్వ అధికారాన్ని అతనే తీసుకుంటాడు. ఉద్యోగినిగా పూర్తి బాధ్యతలు నిర్వర్తించి అలసిపోయి ఇంటికి వచ్చిన మహిళలకు వంటిల్లు స్వాగతిస్తుంటుంది. ఎంత చదువు చదివినా, ఎంత పెద్ద ఉద్యోగాలు చేస్తున్నా వంటిల్లు వదలడం లేదు. అది ఆడవారి పనిగా ముద్రవేశారు తరతరాలుగా. నాడు స్త్రీలు ఉమ్మడి కుటుంబాలుగా ఇంట్లోనే
ఉండేవాళ్ళు. ఊడ్చడం, దంచడం, రుబ్బటం, వంట, పిల్లల పనులు, అతిథుల్ని ఆదరించటం, పెద్దల సేవ అన్ని బాధ్యతలు మహిళలు కలిసి పంచుకునేవాళ్ళు.
నేటికాలంలో న్యూక్లియర్ కుటుంబాలు వచ్చేశాయి. స్త్రీ ఉద్యోగిని అయినా ఇంటి చాకిరీ తప్పటం లేదు. పైగా వంటింటి పనిచేయటం పురుషుడు అవమానంగా భావిస్తాడు. అమెరికా లాంటి ఇతర దేశాలకు వెళ్ళిన భారతీయ పురుషులు అక్కడ అన్ని పనులు చేస్తారు. ఇండియాకి వస్తే చేయరు. మహిళ ఉద్యోగిని అయితే ఏ అవసరం వచ్చినా సెలవు తనే పెట్టాలి. అతనికి సంబంధం లేదనుకుంటాడు. ఇద్దరూ ఉద్యోగస్తులైన భార్యాభర్తలు ఇంటికి రాగానే అతను విశ్రాంతి తీసుకుంటాడు. ఆమె వంటింట్లోకి వెళ్ళాల్సిందే! అందుకే యశశ్రీ రంగనాయకి ఒక నానీలో ఇలా రాశారు.
కాలు మీద కాలేసుకుని
కాలాన్ని చప్పరిస్తున్నాడు
చాకిరీనై
చిక్కానుగా!
క్షేత్రస్థాయి ఉద్యోగినులు, బదిలీల మీద ఉద్యోగం చేసే మహిళల బాధలు వర్ణనాతీతం.
వాళ్ళు ఉద్యోగానికి, కుటుంబ బాధ్యతల మధ్య వత్తిడికి లోనై నలిగిపోతుంటారు. పిల్లలతో ఎక్కువ కాలం గడపలేకపోతారు.
ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాల వల్ల తెలుగు ప్రాంతం రెండు రాష్ట్రాలుగా విడిపోయింది. చాలామంది ఆర్రధ మహిళా ఉద్యోగులు కుటుంబాలు హైదరాబాద్‌లో ఉంటుండగా ఉద్యోగాలు అమరావతిలో చేస్తున్నారు. వారానికి ఐదు రోజులు కుటుంబాలకు దూరంగా ఉండటం వల్ల తల్లిదండ్రులకు, పిల్లలకు మధ్య దూరం పెరిగి పిల్లల సంరక్షణలో పలు సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని చాలామంది అభిప్రాయం. ఇది ఆంధ్ర ప్రాంతంలో పనిచేస్తున్న తెలంగాణాకి చెందిన ప్రభుత్వ ఉద్యోగులకు కూడా వర్తిస్తుంది.
కుటుంబసభ్యులు, ముఖ్యంగా భర్త, అత్తమామలు ఉద్యోగిని వత్తిడిని అర్థం చేసుకుని సహకారం అందించాలి. ఇంటి పనిని అంతా కలిసి చేసుకోవాలి. కార్యాలయంలో ప్రత్యేక సందర్భాల్లో ఎక్కువ గంటలు పనిచేసి ఆలస్యంగా ఇంటికి వచ్చే ఇల్లాలిని అనుమానించే భర్తలున్నారు. కన్న తల్లిదండ్రులు మరణిస్తున్నా లీవు ఇవ్వని అధికారులున్నారు. భార్య ఉద్యోగంలో కలుగజేసుకుని పైరవీలు చేసి లంచాలు తినే భర్తలున్నారు. ఉద్యోగినిని మనిషిగా గుర్తించాలి. ఆమె డబ్బు సంపాదించే యంత్రంగా భావించకూడదు.
ఉద్యోగి అయిన పురుషుడికి కుటుంబంలో ఎంత విలువయిన స్థానముందో ఉద్యోగినికి కూడా అంతే గుర్తింపు ఇవ్వాలి.
ఉద్యోగిని`ఆరోగ్యం:
ఉద్యోగం చేసే మహిళ గురించి నిజాయితీగా మాట్లాడుకుంటే ఆమె మీద కుటుంబం, సమాజం విధించే ఆంక్షల వల్ల, సంపాదనకు కాలాన్ని ఎక్కువగా కేటాయించవలసి ఉన్నందున అనేక సమస్యలను ఎదుర్కోవలసి వస్తోంది. అవి శారీరక, మానసిక, సామాజిక, కుటుంబ సమస్యలుగా విభజించుకోవచ్చు.
ఆరోగ్య సమస్యలు:
ఉగ్యోగినులకు ఇల్లు, ఉద్యోగాలు నిర్వహించుకోవటంలో ఎదురయ్యే వత్తిడి వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తటం స్వానుభవంతో పాటు ఎందరికో అనుభవంలో ఉన్న విషయం. ఉదా॥ ఊబకాయం, డిప్రెషన్, వెన్నునొప్పి, మధుమేహం, రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, గుండె, మూత్రపిండాల వ్యాధులు మొదలైనవి. నేటి మహిళ ఉద్యోగినిగా అనేక పనులు చేస్తూ ‘‘సూపర్ ఉమెన్’’గా వ్యవహరించాల్సి వస్తోంది. ఈ మధ్య ఓ రచయిత్రి రాసిన ‘‘సూపర్ ఉమెన్ సిండ్రోమ్’’ కథను ప్రతి ఉద్యోగిని చదవాలి. తమ కోసం తాము కొంత సమయాన్ని కేటాయించుకొని తప్పకుండా ఆరోగ్యం కాపాడుకోవాలి. వృద్ధాప్యంలో వగచి ఏం లాభం లేదు. అంతా వాడుకొని వదిలేస్తారన్నది జీవిత సత్యం. డాక్టర్ దగ్గరికి వెళ్ళటానికి కూడా సమయం లేదని నా సహోద్యోగులు వాపోవటం నాకు తెలుసు. మిగతా పనులు కొన్ని కుటుంబ సభ్యులకు అప్పగించయినా డాక్టర్ని కలిసి సమయానికి తగు వైద్యం చేయించుకోవాలి. ఒక్కొక్క రంగంలోని ఉద్యోగినుల పని గంటలు ఒక్కో రకంగా ఉంటాయి. ఉద్యోగినుల సంఘాలు ఏర్పాటు చేసుకుని మెడికల్ క్యాంపులు నిర్వహించుకోవటం ద్వారా కొంత మేలు కలుగుతుంది.
మానసిక సమస్యలు:
ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వచనం ప్రకారం ఒక వ్యక్తి మానసికంగా ఆరోగ్యంగా ఉన్నాడంటే ఆ వ్యక్తి తన యొక్క పూర్తి వ్యక్తిత్వ నైపుణ్యాన్ని అర్థం చేసుకుని, తన జీవితంలోని సాధారణమైన వత్తిడిని తట్టుకుంటూ, పూర్తి స్థాయిలో తన సమాజానికి, దేశానికి ఉపయోగపడతాడని అర్థం. అందువల్లనే వ్యక్తులకు, కుటుంబాలకు, సమాజాలకు మనుషుల మానసిక ఆరోగ్యం చాలా అవసరం. శారీరక, మానసిక, సామాజిక ఆరోగ్యాలు పరస్పరాధారితాలు. మానసిక సమస్యలు ఉన్నవారికి శారీరక ఆరోగ్యం కూడా తగ్గిపోతుంది. దీన్నే ‘‘A sound mind in a sound body’’ అని కూడా అంటారు. మహిళల ఆర్థిక పరిస్థితిని బట్టి వాళ్ళు సంఘంలోని సామాజిక, ఆర్థిక కార్యకలాపాలలో పాల్గొనగలుగుతారు. సాధారణ పని గంటలు అంటే ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పనిచేసే స్త్రీలకన్నా షిఫ్ట్ వర్క్ చేసే ఉద్యోగినులకు శారీరక, మానసిక సమస్యలు ఎక్కువ. వాళ్ళలో ప్రవర్తనా సమస్యలు కూడా రావచ్చు. ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, చురుకుదనం మొ॥ అంశాల మీద షిఫ్ట్ ఉద్యోగ ప్రభావం ఉంటుంది.
ఇంటింటికీ తిరిగే ఉద్యోగినులు, ఇంటి పనులు చేసేవాళ్ళు, ఊడ్చేవాళ్ళు, మానసిక విశ్రాంతిని పొందుతారు. డాక్టర్లు, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, లాయర్లు వంటి మేధోపరమైన వృత్తిలో ఉన్నవారికి విశ్రాంతి తక్కువ ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగినులు నిర్ణీత కాలంలోనే పనిచేస్తారు. వీరికి కుటుంబం, పిల్లల పెంపకం, పెద్దల సేవ వంటికి ఎక్కువ వత్తిడినిచ్చి అదనపు బాధ్యతల వల్ల మానసిక రుగ్మతలు ఏర్పడతాయి. ఇటీవలి కాలంలో కార్యాలయంలో లైంగిక వేధింపులు పెచ్చుమీరి పోవటం అందరికీ తెలిసిందే!
ప్రాథమిక హక్కుల్లోని 14, 19, 21 మొ॥ ఆర్టికల్స్ జెండర్ వివక్షతపై అవగాహన గురించి చెప్తాయి. జీవించే హక్కు అంటే గౌరవంగా జీవించడం. ఆర్టికల్ 32 ప్రకారం లైంగిక వేధింపుల నుండి రక్షణ పొందుతూ గౌరవ భంగం లేకుండా పనిచేసుకునే హక్కు ప్రాథమిక మానవ హక్కుగా స్త్రీలకు కూడా ఉంది. ఉపాధిలో వివక్ష ఉండకూడదు. ఆరోగ్య పరిరక్షణ, పూర్తి భద్రత, పునరుత్పత్తి విధుల రక్షణ హక్కు. ఇలాంటి అనేక హక్కులున్నా ప్రతి కార్యాలయంలో స్త్రీల పట్ల వివక్ష, వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. బిడ్డకు పని గంటల్లో పాలివ్వటం, మెటర్నిటీ లీవ్, అబార్షన్ లీవ్, బిడ్డ పరిరక్షణ లీవ్ వంటి హక్కులను ఉద్యోగినులు పూర్తిస్థాయిలో ఉపయోగించుకోలేకపోతున్నారు.
ఇటువంటి సమస్యలకు మహిళా ఉద్యోగినుల కోసం ప్రతి కార్యాలయంలో ఒక కమిటీని ఏర్పాటు చేయాలన్న సుప్రీంకోర్టు రూలింగ్ కూడా అన్నిచోట్లా సరిగ్గా అమలు కావడం లేదు. విడివడిన రెండు తెలుగు రాష్ట్రాల సచివాలయాల్లో కూడా నాలుగేళ్ళయినా ఈ కమిటీలు ఏర్పడలేదు. ఈ కమిటీలో స్త్రీ సభ్యులు ఉండాలి. ఫిర్యాదులను రహస్యంగా విచారించాలి. వత్తిడులకు లొంగకూడదు. ఉద్యోగినులకు తమకున్న హక్కుల గురించి అవగాహన ఉండాలి. ఉద్యోగాల్లో ఉన్న ఒంటరి స్త్రీల పట్ల ఈ వేధింపులు ఎక్కువ. అలాగే వితంతువులు, విడాకులు తీసుకున్న వాళ్ళమీద కూడా ఎక్కువే! లైంగిక హింస అంటే శారీరక సంబంధం కోసం స్త్రీని వత్తిడికి గురిచేయడం, డిమాండ్ చేయడం, ద్వంద్వార్థం, అశ్లీల సంభాషణలు అసభ్య చిత్ర ప్రదర్శన, అసభ్య శారీరక ప్రదర్శన, సైగలు చేయడం మొదలైనవి.
ఇటువంటి స్త్రీ వ్యతిరేక వాతావరణాన్ని కల్పించే వారిపట్ల క్రమశిక్షణా చర్యలను కాలపరిమితిలోగా తీసుకోవాలి. తగిన యంత్రాంగం ఏర్పరచాలి. ఇటువంటి వత్తిడులు, అవమానాలు స్త్రీలను ఉద్యోగ జీవితంలో మానసికంగా గాయపరచనీయకూడదు.
చట్టాలు`శాసనాలు:
ఉద్యోగులకు వర్తించే శాసనాలు, చట్టాలంటే ఉద్యోగినులకు కూడా వర్తించేవే! వేతనాలు, ప్రావిడెంట్ ఫండ్, గ్రాట్యుటీ, ఫ్యాక్టరీ చట్టాలు, నష్ట పరిహారం చట్టం, షెడ్యూల్డు కులాలు, తెగల చట్టం, ఎక్స్ సర్వీస్, దివ్యాంగ, క్రీడాకారుల కోటాలు, సమాన వేతనాలు మొ॥ చట్టాలు, సంబంధిత శాసనాలు మహిళా ఉద్యోగులకూ వర్తిస్తాయి.
ప్రపంచీకరణ ప్రభావం:
అన్ని రంగాలపై ప్రసరించినట్లే ప్రపంచీకరణ ప్రభావం మహిళా ఉద్యోగులపై కూడా ఉంది. సరళీకృత ఆర్థిక విధానాలు విదేశీ వస్తూత్పత్తులకు తలుపులు తీయటం వల్ల స్వదేశీ ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. చేతివృత్తులు కుంటుపడ్డాయి. నిరుద్యోగం మహిళల్లో కూడా పెరిగింది. వ్యవసాయం దెబ్బతినడం వల్ల వ్యవసాయ కూలీలుగా ఉపాధి పొందే మహిళలు పట్టణాలకు వలస వెళ్తున్నారు. డబ్బు ప్రాధాన్యత పెరిగి మానవ సంబంధాలు పల్చబడ్డాయి. అనైతిక ట్రాఫికింగ్ పెరిగింది. మల్టీనేషనల్ కంపెనీల వల్ల జీవితాల్లో ‘ఆకర్షణ’ అంటే వస్తు సంస్కృతిగా మారింది. గ్రామాలు పాడుబడుతున్నాయి.
మహిళలు అన్ని రంగాల్లో అడుగుపెట్టారు. కొన్ని యుద్ధ దళాల ఉద్యోగాలు తప్ప ఆకాశమే హద్దుగా ఎదుగుతున్నారు. అయినా అభద్రత మాత్రం అలాగే ఉంది. కుటుంబం, సమాజం, రాజకీయాలు మహిళల తెలివితేటల్ని అంగీకరించలేక, వినియోగించుకోలేక వత్తిడికి గురిచేస్తున్నాయి. మహిళలు ఆత్మవిశ్వాసంతో అడుగేస్తూ తమని తాము నిరూపించుకుంటున్నారు. సమస్యలకు కుంగిపోకుండా అన్ని రంగాలలో ఉద్యోగాలలో మహిళల శాతం మరింతగా పెరిగితేనే దేశప్రగతి సుసాధ్యమౌతుంది.