కాలంతో పాటు మారాల్సిన ఆచారాలు -శీలా సుభద్రాదేవి

ఆ కళ్ళల్లో తోడు కోల్పోయిన దిగులు, అంతలోనే జావకారిపోతున్న గుండెకు ధైర్యాన్ని అద్ది గట్టిపరచుకోవాలన్న తపనతో పొడారిపోతున్న కళ్ళు. మరి కాసేపటికే అతని తోడి జీవితంలోని సంఘటనలు గుర్తుకువచ్చి అతను లేని లోటును తలచుకుంటూ చెలమలైపోతున్న కళ్ళు. నిద్రలో కూడా భవిష్యత్తు భయంకరంగా కనిపిస్తుంటే నిద్రని తోలుకుంటూ వాడిపోతున్న

ముఖం. ఇలా… ఇలా పది రోజులు పది యుగాలయ్యేసరికి వేకువ రేఖలు తొంగి చూడకమునుపే నిండు ముత్తయిదువులా తయారుచేసి తిరిగి అనాగరికంగా వాటినన్నింటినీ తొలగించి తెల్లచీరా, జాకెట్టూ మాత్రం ధరింపచేసి చీకటి కూపంలాంటి గదిలోనో, లేదా చుట్టూ తెరలు కట్టి అస్పృశ్యతా వస్తువులా దాచి, ఇతర కర్మకాండలు అయ్యేవరకూ ఆమెను అలాగే ఒంటరిగా కుమిలి కుమిలి ముద్దయి పొమ్మని శపించి, ఆ తర్వాత ఒక్కొక్కరిచే నోట ఉప్పు, జీలకర్ర వేసుకొని ముఖాన్ని వికారంగా పెట్టుకొని ఆమెని చూసి, ఆ దోషాన్ని పోగొట్టుకోటానికి నోరు పుక్కిలించి కడుక్కొని… ఎంత నీచ సంప్రదాయం. ఒక్కో కులంలో, ఒక్కో మతంలో కొద్దిపాటి తేడాలో ఆ పరిస్థితిలో అటువంటి సంఘటన జరుగుతూనే ఉంటుంది.
ఈ ఘోర కలి ఇలా జరగవలసిందేనా? దీనికి ముగింపే లేదా? ఇది సాంఘిక దురాచారం కాదా? దీనిని ఆపేందుకు మళ్ళీ మరో రాజారామమోహనరాయో, వీరేశలింగమో, మరొకరెవరో వచ్చే వరకూ ఎదురు చూస్తూ ఉండాల్సిందేనా?
‘అష్ట వర్షా భవేత్‌ కన్యా’ అని ఎనిమిదేళ్ళలోపు పిల్లలకే పెళ్ళి చేయడం ఒకప్పటి సత్‌ సాంప్రదాయం. ఇప్పటికీ సాంఘికంగా వెనకబడిన ప్రాంతాలలో, జాతులలో కొన్ని చోట్ల బాల్య వివాహాలు జరుగుతూనే ఉన్నా, దాని వలన జరిగే అనేక దుష్పరిమాణాలు బేరీజు వేసుకోవటం, అది చట్టరీత్యా నేరం అనే విషయాన్ని ప్రజలందరూ తెలుసుకుంటున్నారు. మీడియాల ద్వారా ఖండిస్తున్నారు. ఆ ప్రాంతాలలో ప్రజలను జాగృతిపరిచే ప్రయత్నాలు అన్వేషిస్తున్నారు.
సహగమనం చేసిన రూప్‌కన్వర్‌ లాంటి సంఘటనలు ఎదురైతే ప్రజలు చైతన్యం కలిగి సతీ సహగమనంపై తిరుగుబాటు ప్రదర్శించగలుగుతున్నారు. వితంతు వివాహాలు కొన్నయినా జరగటానికి సమాజం నుండి అడ్డంకులు తొలగించుకుంటున్నారు. లింగ నిర్ధారణ పరీక్షలు నిరోధించే చట్టం సాధించగలిగారు. భ్రూణ హత్యలు జరగకుండా చట్టాన్ని తోడు తెచ్చుకోగలుగుతున్నారు. కట్నాలకై వధువుల దహనాలు నిరసించగలుగుతున్నారు. అత్యాచారాలు చేసే పశువులను చట్టాలకు అప్పగించాలని ప్రదర్శనలు జరుగుతున్నాయి.
ఈ మార్పులన్నీ ఒక్కసారిగా వచ్చినవి కాదు. ఎందరో సమాజానికి ఎదురు నిలిచి కాలక్రమేణా సాధించినవే. ఈ సంఘటనలన్నింటిలోనూ మానసికంగా, శారీరకంగా హింసించబడిన స్త్రీకి చట్టపరంగా భద్రత ఉంది.
కానీ భర్త చనిపోయిన స్త్రీకి సహజంగా భర్తని కోల్పోయిన దుఃఖం ఉంటుంది. దానికి తోడు పెద్ద కర్మ రోజున బలిపశువులా వితంతువుగా మార్చే విధానాన్ని ఎవరూ వ్యతిరేకించరేం? ఇది మానసికంగా హింసకు గురిచేసే స్త్రీ సమస్యగా గుర్తించరేం?
భార్య చనిపోయిన భర్తకి పదవ రోజున వచ్చిన బంధువులు పెళ్ళి మాటలు జరపటం కూడా చాలా చోట్ల చూస్తుంటాం. కానీ భర్త చనిపోయిన భార్య ఈ బలికి ఎందుకు సిద్ధపడాలి?
అసలు ఈ పద్ధతి, ఈ సాంప్రదాయం ఎప్పటి నుండి మొదలై ఉంటుంది? ఎవరు పెట్టారు? ఎందుకు మొదలు పెట్టారు అని విషయం ఆలోచించవలసి ఉంది. సతీసహగమనం నిషేధించబడిన తరువాత, బాల్య వివాహాల కారణాన, వరకట్నాల కారణాన బాల్యంలోనే వృద్ధుడైన భర్త మరణించడంతో యువతి అయిన వితంతువుపై అపనమ్మకం వలన పురుషస్వామ్యం విధించిన ధర్మ శాసనమే ఈ విధానం. ఇతరులకు ఆకర్షణీయంగా కనపడకూడదని వికారిగా మార్చి ఉప్పు, కారం లేని చప్పిడి కూడు తినమని విధించి ఆమెలోని కోరికలు అణచుకోవాలని శాసించబడిరది.
సుమారు కొన్ని దశాబ్దాల క్రితం వరకూ శిరోముండనం కూడా చేయించి, అంచులేని సైను పంచె ధరించవలసి వచ్చేది. కాలక్రమేణా శిరోముండనం చేసే పద్ధతి పోయింది. తర్వాత్తర్వాత అనేక మార్పులకు లోనవుతున్నా పదో రోజు కర్మకాండలో మాత్రం తూ.చా. మార్పులేకుండా యధాతథంగా జరుగుతూనే ఉన్నాయి. దాని ప్రభావం ఆమెని జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. ఆ సంఘటనకు బలయిన కొందరు యువతులు మానసిక ఒత్తిడికి తట్టుకోలేక మానసిక వ్యాధిగ్రస్థులు కావటం కూడా జరుగుతూనే ఉన్నాయి. ఆడపిల్లలకు పుట్టిన దగ్గర నుండీ పసుపు, కుంకుమలు, గాజుల ప్రాముఖ్యాన్నీ, వాటికీ, భర్తకు గల సంబంధాన్నీ ఉగ్గుపాలతోనే నేర్పిస్తుందీ సమాజం. అన్నప్రాసన రోజున ఈ వస్తువులు ముట్టుకున్న ఆడపిల్లను చూసి మురిసిపోతారు. పతివ్రతల కథలు చెప్పి నోములూ, వ్రతాలూ చేసి భర్త ఆయురారోగ్యాలు కాపాడుకోవాలనీ, భర్త తోడిదే జీవితమనీ ఆడపిల్లలకు నూరిపోస్తున్నాము. కానీ భార్య విలువలను భర్తకు తెలియచేసే కథలేవీ మనకు లేవు.
స్త్రీ జీవితం పురిటికందుగా కళ్ళు తెరిచినది మొదలుకొని అనేక సమస్యలు ఎదుర్కొంటూనే ఉంది. మగపిల్లలతో సమానంగా పెరిగే అవకాశాలు మన సమాజంలో తక్కువగా ఉండటం, ఆటపాటల కాలం నుండీ స్త్రీకి సంబంధించిన… అంటే వంటా వార్పూ, పిల్లల్ని సాకటం ఇలా లక్కపిడతల గిన్నెలు, బొమ్మ పాపాయిలతో ఆటపాటలుగా పెరుగుతోంది. వయసు పెరుగుతున్న కొద్దీ పరుగులు తీయటం, మగపిల్లలతో మాట్లాడటం, చివరికి హాయిగా నవ్వటం కూడా ఆడపిల్లలకు నిషేధింపబడతాయి.
(ఏ కొద్ది కుటుంబాల సంగతో చెప్పటం లేదు. సమాజంలో అధిక శాతం ఆడపిల్లల జీవితాల్ని వివరిస్తున్నాను) తర్వాత పెళ్ళి, భర్త, పిల్లలు, చాకిరీ, కుటుంబం ఈ గాడిలో చిక్కుకుపోయి గానుగ బ్రతుకైపోతుంది. అందువల్ల కొన్ని కోట్ల మంది తాను, తన కుటుంబం తప్ప బయట ప్రపంచం ఎరగరు. అటువంటి వాళ్ళు భర్తని కోల్పోయినప్పుడు ఏమవుతున్నారు?
ఈ పదో రోజు చేసే వితంతు కర్మకాండకు బలవుతున్నారు. ఆ తర్వాత శుభకార్యాలలో పాల్గొనకూడదనీ, ఎదురుపడితే అపశకునమని అంటూ చెప్పే మరిన్ని ఆంక్షలకు తలొగ్గి నత్తలలా ముడుచుకుపోతున్నారు.
మగవాడికి లేని ఈ ఆంక్షలన్నీ కేవలం స్త్రీకే ఎందుకున్నాయి. ఈ ధర్మ శాసనాలు నెత్తిన పెట్టుకొని మోస్తున్న వాళ్ళెవరు?
పుట్టుకతోనే స్త్రీకి గల అలంకరణ హక్కుని పెళ్ళితో ఎవరు జతపరిచారు. పెళ్ళితో అదనంగా వచ్చినవి మట్టెలు, మంగళసూత్రం, నల్లపూసలు… అవి తీసేస్తే చాలదా? స్త్రీని ఆ విధంగా విరుపులు చేయటంలో గల రాజకీయాలు స్త్రీ లోకానికి తెలియాలి. స్త్రీ మీద పురుషుడికి గల అపనమ్మకం బయటపెట్టాలి.
నిజానికి ఈ వ్యవస్థ ఇలా ఉండటం వలనే పూలు, కుంకుమ, గాజులు ధరించే అర్హత కోసం, వాటిని కోల్పోవటం ఇష్టం లేకనే భర్త ఎంత దుర్మార్గుడైనా, కర్కోటకుడైనా రాజీపడి బతికే పరిస్థితులలో కూడా స్త్రీ ఉంటున్నదేమో అనిపించే సంఘటనలు కూడా జరుగుతున్నాయి.
ఈ రోజుల్లో స్త్రీ పురుషుడితో సమానంగా చదువుతోంది. పోటీ పరీక్షలలో ముందడుగులో ఉంది. అన్ని రకాల ఉద్యోగాలలోనూ నెగ్గుకువస్తోంది. లలిత కళారంగాలలోనూ తన ప్రత్యేకతని చూపుతోంది. అయినా ధర్మ శాస్త్రాలకు కట్టుబడి అతడు ఎలాంటి వాడయినా పురుషుడి నీడలో ఒదిగే ఉంటుంది. ఆ కారణం వల్లనే అన్ని రకాల కర్మకాండలకూ నిరక్షరాస్యులైన స్త్రీలాగే తలవంచుతోంది. మానసిక ఒత్తిడికి గురౌతోంది.
మామూలుగా రంగు చీరలు, బొట్టూ ధరించినంత మాత్రాన తీరేదీ కాదీ సమస్య. నిజానికి ఈ మాత్రానికి కూడా మెజారిటీ శాతం స్త్రీలు కూడా వ్యతిరేకిస్తారు. కారణం వాళ్ళ నరనరాలలో నిండిపోయిన సాంప్రదాయపు వాసనలే. మరణించిన వ్యక్తికి పిండాలు పెట్టే కర్మకాండలు జరుపుకుంటారో, మానుకుంటారో అది కుటుంబ విషయం. కానీ ఆమెని బతికుండగానే చిత్రవధ చేసి మానసికంగా చంపేసే వితంతువుగా మార్చే తంతులను మాత్రం ఎందుకు ఎవ్వరూ వ్యతిరేకించటం లేదు?
ఇది ఒకరి వల్లనో, ఓ పదిమంది వల్లనో జరిగే పనికాదు. సారా వ్యతిరేక ఉద్యమానికి పూనుకున్నట్లుగా పల్లెపల్లెల్లో పట్టణాలలో మారుమూల ప్రదేశాలలో స్త్రీలందరినీ జాగృతం చేయాల్సిన విషయం.
పెళ్ళికి ముందు, పెళ్ళయ్యాక, భర్త పోయాక స్త్రీ వేషధారణలో మార్పును చూపించటం సంప్రదాయంగా ప్రజలలో నాటుకుపోయింది. దానిని తుడిచి పెట్టేలా ప్రజలలోనే ముఖ్యంగా స్త్రీలలోనే మార్పును తీసుకురావాలి. ముఖ్యంగా సినిమాలలోనూ, దూరదర్శన్‌ నాటకాలలోనూ వితంతు వేషధారణను చూపటాన్ని వ్యతిరేకించాలి. నిజానికి నిజ జీవితంలో అదే వేషధారణతో నిత్యం ఎవ్వరూ ఉండరు. ఉద్యోగాలపై నలుగురిలోకి రావాల్సిన అవసరం స్త్రీని కొంత మారుస్తూనే ఉంది. ఇంకా ఆ మార్పు సరిపోదు.
చిన్నపిల్లలకి కూడా తెలిసే విధంగా అతి ధోరణిని ప్రదర్శిస్తూ చూసే సినిమాలు, నాటకాలని నిరసించాలి. అశ్లీల దృశ్యాలని నిరోధించినట్లుగానే ప్రచార సాధనాలలో వితంతు వేషధారణని వ్యతిరేకించాలి.
భర్త మరణానికి తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న స్త్రీలని సతీమతల్లులుగా చిత్రించి ప్రచారం చేసే ప్రచార సాధనాలన్నింటినీ వ్యతిరేకించాలి. శారీరకంగా, మానసికంగా స్త్రీలపై వేధింపు చర్యలపై వ్యతిరేకంగా పోరాడే స్త్రీ స్వేచ్ఛా సంఘాలన్నీ సంఘటితమై దీన్ని ఒక సాంఘిక సమస్యగా గుర్తించి ఈ సాంఘిక దురాచారాన్ని ఆపటానికి ప్రయత్నించాలి. ఈ సంఘటనలు జరగకుండా చట్టరీత్యా భద్రత కలిగిస్తే బాగుంటుంది. వీథి నాటకాల ద్వారా మారుమూల స్త్రీలలో కూడా ఈ విషయాన్ని ఒక సాంఘిక సమస్యగా జాగృతి చేయాల్సిన అవసరం చాలా ఉంది.

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.