సంబరాలు అంబరాన… ప్రగతి అథోగతిన… -ప్రత్యూష వెలగా

ఎప్పటి మాదిరిగానే మరో ఏడాది జాతీయ బాలికా దినోత్సవం ముగిసింది. శుభాకాంక్షలు చెబుతూ, సెల్ఫీలు పెట్టుకుంటూ, ‘‘బేటీ భారత్‌ కీ’’, ‘‘గర్ల్‌ చైల్డ్‌ డే ఆన్‌ స్వస్థ్‌ భారత్‌’’ అంటూ హ్యాష్‌ ట్యాగ్లను ట్రెండ్‌ చేస్తూ, సంబరాలు జరపమన్నారు, జరుపుకున్నారు కూడా. ఈ సెల్ఫీలు వేల సంవత్సరాలుగా నెలకొన్న అసమానతలను అంతం చేస్తాయా?

ఆ హ్యాష్‌ ట్యాగ్స్‌ బాలికల భవితను కూడా మహోన్నతంగా మార్చేస్తాయా? అలా జరిగితే ఎంత బాగుంటుందో కదా భవిషత్‌ భారతం బాలికల కలలంత అందంగా, ఆరోగ్యంగా, వాళ్ళ తుళ్ళిందతలంత చైతన్యంగా… అది కదా సంబరమంటే.
2008లో జాతీయ మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ జనవరి 24ను నేషనల్‌ గర్ల్‌ చైల్డ్‌ డే గా ప్రకటించింది. మన సమాజంలో ఆడపిల్లలు ఎదుర్కొంటున్న అసమానతలను, వారి హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన వాస్తవాలను వాళ్ళకు తెలియజేయడానికి, చదువు, ఆరోగ్యం వంటి విషయాలలో చైతన్యం కల్పించడానికి వివిధ కార్యక్రమాలను ఈ రోజున నిర్వహిస్తూ వస్తున్నాయి మన ప్రభుత్వాలు.
ఏమి సాధించామని ఈ సంబరాలు?
75 ఏళ్ళ స్వతంత్ర భారతంలో నేటికీ బాల్యవివాహ దురాచారం మన ఆడపిల్లలను పట్టి పీడిస్తూనే ఉంది. ఆడపిల్లల అభివృద్ధికి ఈ బాల్యవివాహాలు పెద్ద ఆటంకంగా మారుతున్నాయి. బాల్యవివాహ నిరోధక చట్టం చేసి అది విఫలమైందని బాల్యవివాహ నిషేధ చట్టం చేసుకున్నాం. కానీ, ఇప్పటికీ ప్రపంచంలో బాల్యవివాహాలు చేసుకునే ప్రతి ముగ్గురిలో ఒకరు భారతీయ బాలికే కావడం చూస్తే మన చట్టాలు ఎంత పటిష్టంగా అమలవుతున్నాయో అర్థమవుతుంది. నేటికీ మన దేశంలో ప్రతి సంవత్సరం ఒక కోటి యాభై లక్షల ఆడపిల్లలకు 18 సంవత్సరాల వయసు దాటకుండానే పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి. 2020లో లాక్‌డౌన్‌ సమయంలో ఏప్రిల్‌ నుండి ఆగస్టు మధ్యలో చైల్డ్‌ లైన్‌కు సహాయం కోరుతూ దాదాపు పదివేల ఫోన్‌కాల్స్‌ వచ్చాయి అంటే పరిస్థితి ఎంత దయనీయంగా తయారైందో అర్థం చేసుకోవచ్చు.
భారంగా… భయంతో…
ఆడపిల్ల అంటే గుండెలపై భారం అని నేటికీ ఎంతో మంది తల్లిదండ్రులు భావిస్తున్నారు. ఇందుకు మన చుట్టూ ఉన్న పరిస్థితులు, మన ఆలోచనల్లోని వెనుకబాటుతనం, మన ఆచరణలో చోటు చేసుకుంటున్న లోపాలు, కొన్ని సందర్భాల్లో మన పిరికితనం… ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే కారణాలున్నాయి.
పుట్టక ముందే…
మరో పక్కన లింగ వివక్షను అరికట్టడంలో మన ప్రభుత్వాలు విఫలమవుతూనే ఉన్నాయి. సేవ్‌ ది గర్ల్‌ ఛైల్డ్‌ స్వచ్ఛంద సంస్థ చేసిన సర్వే ప్రకారం లింగ వివక్ష వల్ల ప్రతి ఆరుగురు బాలికలలో ఒకరు మరణిస్తున్నట్లు తెలిసింది. పుట్టబోయేది ఆడపిల్ల అని నిర్ధారణ అయితే, గర్భంలో ఉండగానే చిదిమేసే రోజుల నుండి ఇంకా మనం బయటపడనే లేదు. ఒకవేళ అదృష్టం బాగుండి, ఆరోగ్యవంతంగా తల్లి కడుపు నుండి బయటపడినా, ఆ శిశువును చెత్తకుప్పలోకో, మురుగు కాల్వలోకో విసిరేస్తున్న వార్తను ఇవ్వాళ్టికీ పత్రికల్లో కనపడటం ఆగలేదు. ఇది ఎంత సాధారణ వార్తగా మారిందంటే ఒకప్పుడు ఇటువంటి వార్త వస్తే దినపత్రికల మెయిన్‌ పేజీలోనో, టాబ్లాయిడ్‌లోని మొదటి పేజీలోనే ప్రచురించేవారు. ఇప్పుడు క్రైమ్‌ పేజీలో తరచూ వచ్చే వార్తల మరుసలోకి చేరిపోయింది. ఇంతకంటే దయనీయమైన పరిస్థితి వేరే ఏమైనా ఉంటుందా? 2020లో ఖచీఖీూA విడుదల చేసిన రిపోర్ట్‌ ప్రకారం 2013`17 మధ్యలో మన దేశంలో 4,60,000 మంది ఆడపిల్లలు పుట్టుకతోనే మాయమయ్యారు. వీరిలో కొంతమందిని కడుపులోనే చిదిమేయగా, మరికొంతమందిని పుట్టగానే మాయం చేశారు. ఈ పరిస్థితి దాపురించడానికి కారణాలేంటి?
కీచక వలయంలో…
ఆడపిల్ల పుట్టిన దగ్గర్నుండీ ఇంటా బయటా తనను కాపాడుకోవడానికి ఎంత కష్టపడాలో మనకు తెలియని విషయమేమీ కాదు. బయటికెళ్తే ఏ కీచకుడి కంటా పడకుండా జాగ్రత్తపడాలి. సరే అని ఇంట్లోనే ఉంచేస్తే భద్రంగా ఉంటుందా అంటే అదీ లేదు. వావి వరుసలు చూడకుండా దాడులు చేస్తున్న (రా)బంధువులు ఇంటి చుట్టుపక్కలే దాపురించి ఉంటారు. వారి నుండి రక్షణ ఏది? అలా రక్షించుకోవడానికి భయపడే, కొంతమంది ఆడపిల్లలే వద్దనుకుంటున్నారు. ఒకవేళ అటువంటి భయాలున్నా పక్కన పెట్టి ఒక ఆడశిశువుకు జన్మనిచ్చినా, తనని ఆరోగ్యంగా పెంచడం తల్లిదండ్రులకు మరో పెద్ద సవాల్‌.
రక్తహీనత`పౌష్టికాహారలోపం:
NFHS 2019`21 సర్వే రిపోర్టు ప్రకారం 52.2%, అంటే దేశంలో సగానికి పైగా గర్భిణులు రక్తహీనతతో బాధపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలని ఎంత ఆరోగ్యంగా కనగలుగుతారు? తల్లికే లేని ఆహారం బిడ్డకు ఎక్కడనుండి వస్తుంది? ఇలాంటప్పుడు పుట్టింది ఆడ శిశువయితే ఆ బిడ్డ ఆకలి తీర్చాలన్నా లింగ వివక్ష అడ్డుపడుతుంది. ఇంట్లో ఒక మగపిల్లవాడు, ఒక ఆడపిల్ల ఉంటే మగపిల్లవాడికి ఒక ముద్ద ఎక్కువ పెట్టి ఆడపిల్లకు తక్కువ పెట్టే మన దేశంలో బాలికలకు ఆరోగ్యకరమైన ఆహారం పెట్టే చైతన్యం వచ్చిన రోజున మార్పు ప్రారంభమవుతుంది. మన దేశంలో 15% పైన అనారోగ్య సమస్యలు తల్లీ పిల్లల పౌష్టికాహారం లోపం కారణంగానే వస్తున్నాయని పరిశోధనలు చెబుతున్నాయి. 2015`16లో విడుదలైన NFHS రిపోర్టుల ప్రకారం మన దేశంలోని 5 సంవత్సరాల లోపు వయసుగల పిల్లల్లో 35.7% బరువు తక్కువగా ఉండగా, 21% చాలా బలహీనంగా ఉన్నారు. మరో 38.4% ఎదుగుల లోపంతో ఇబ్బంది పడుతున్నారు. ఇటువంటి పరిస్థితులలో ప్రభుత్వం బడ్జెట్లో మహిళలు, పిల్లల పౌష్టికాహారంపై కేటాయింపులను పెంచాల్సింది పోయి 27%కి కుదించడం వలన ఈ పరిస్థితులు మరింత దయనీయంగా మారతాయి తప్ప ఏమీ మెరుగుపడవు.
విద్యకూ దూరమే…
విద్య విషయంలో ఆడపిల్లలు ఎంత వివక్షకు గురవుతారో మనకు తెలియని విషయం కాదు. ఇద్దరు పిల్లలు ఉంటే, మగపిల్లవాడిని కాన్వెంటుకు పంపి ఆడపిల్లను ప్రభుత్వ స్కూలుకు పంపే సందర్భాలు మన దేశంలో కోకొల్లలు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఆడపిల్లలని చదివించడానికి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి ఉండొచ్చు. అయిదు, ఆరు తరగతుల వరకు ఎలాగోలా అటువంటి పథకాల సహాయంతో చదువును లాక్కొస్తారు. ఆ తరువాత అర్థాంతరంగా చదువులు ఆపేస్తున్న బాలికలెందరో. తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితులో, బడిలో మరుగుదొడ్ల వంటి కనీస సౌకర్యాలు లేకపోవడమో, బడి దూరంగా ఉంటే అల్లరి మూకల వేధింపులో బాలికల చదువును కొనసాగించలేకపోవడానికి కారణమవుతున్నాయి. ఇవన్నీ ఇలా ఉంటే ఈ కరోనా మహమ్మారి వలన పాఠశాలలు మూతపడడంతో డిజిటల్‌ విద్యను అందించే స్థోమత లేక ఆడపిల్లలను చదువు మాన్పించే తల్లిదండ్రుల సంఖ్య మరింత పెరిగిపోయింది. 2014`15 విద్యా సంవత్సరంలో మన దేశంలో 3.88% అమ్మాయిలు ప్రాథమిక స్థాయిలోనే చదువుకు దూరం కాగా, మిగిలిన వారిలో 4.60% ప్రాథమికోన్నత విద్యతో చదువులకు ఫుల్‌స్టాప్‌ పెట్టారు. అందులో 16.88% ఆడపిల్లలు సెకండరీ విద్యకు నోచుకోలేదు. ఈ గణాంకాలను గడిచిపోయిన కాలంతో పోలుస్తూ మెరుగుపడ్డాయని ప్రభుత్వాలు జబ్బలు చరుచుకుంటున్నాయే తప్ప, బాలికల విద్యావకాశాలు మెరుగు పడకపోవడానికి వాస్తవ కారణాలను గుర్తించేందుకు మాత్రం సిద్ధపడడం లేదు. అంతే కాకుండా కొత్తగా ప్రవేశపెట్టిన జాతీయ విద్యా విధానం, బడ్జెట్లో విద్యా శాఖకు కేటాయింపులలో పెట్టిన కోతలు, ఉన్న పరిస్థితులను మరింత దిగజార్చే విధంగా ఉంది.
బాలికల అక్రమ రవాణా:
మన దేశంలో బాలికలను పట్టి పీడిస్తున్న మరో పెద్ద సమస్య ట్రాఫికింగ్‌… అంటే, అక్రమ రవాణా. 2018లో యూఎన్‌ విడుదల చేసిన ఒక రిపోర్టు ప్రకారం ప్రపంచంలో అక్రమ రవాణా కాబడిన పిల్లల్లో 40.22% ఆడపిల్లలే
ఉన్నారు. అయితే, ప్రస్తుత కరోనా కాలంలో ఈ లెక్కలు మరింత ఆందోళనకరంగా మారాయని మరో సర్వేలో తేలింది. ఈ కాలంలో ఎన్నో కుటుంబాలు ఆర్థికంగా పతనమయ్యాయి. ఈ క్రమంలో అత్యధికంగా బాధపడిరది పిల్లలే అని ఈ సర్వేలో తేలింది. ఇలాంటి సమయంలోనే అక్రమ రవాణాదారులు కుటుంబ సభ్యులకు ఉద్యోగాలనో, డబ్బులనో ఎరగా చూపించి పిల్లలను కాజేస్తారు. ఉదాహరణకు, అలాంటి సంఘటనే ఒకటి ఈ కరోనా కాలంలో బీహార్‌లో జరిగింది. ఒక తండ్రి తన భార్యకు తెలియకుండా తన నాలుగు నెలల పసికందును ఒక డబ్బున్న భార్యాభర్తలకు అమ్మేశాడు. చుట్టుపక్కల వారి సాయంతో ఆ తల్లి అతన్ని నిలదీయగా, డబ్బులేక కుటుంబాన్ని నెట్టుకురాలేకనే ఆయన ఈ పని చేశానని చెప్పుకొచ్చాడు. ఇలాంటి ఎన్నో ఘటనలు మన చుట్టూ జరుగుతూనే ఉన్నాయి. ఈ లాక్‌డౌన్‌ కాలంలోనే ఒక 11 రోజుల వ్యవధిలో ప్రభుత్వ హెల్ప్‌ లైన్‌కు 92,000 కేసులు పిల్లలమీద జరిగిన వివిధ దాడులపై రిజిస్టరయ్యాయి. అంటే, మన భావి పౌరులు ఎలాంటి పరిస్థితుల్లో ఎదుగుతున్నారో మనం అర్థం చేసుకోవాలి.
పెరిగిపోతున్న లైంగిక దోపిడీ, మానసిక వేధింపులు:
అక్రమ రవాణా కాబడిన పిల్లల్లో ఎక్కువశాతం లైంగిక దోపిడీకి గురయ్యేవారే. వీరిని మన దేశంలో కానీ లేదా మన చుట్టుపక్కల ఉన్న భూటాన్‌, బంగ్లాదేశ్‌, నేపాల్‌ దేశాలకు కానీ తరలించి ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారు. వీరిలో ఎక్కువమంది గ్రామీణ ప్రాంతాల్లోని పిల్లలే. ఇందులో కొద్దిమందికి ఉద్యోగమిప్పిస్తామని మాయ మాటలు చెప్పి తీసుకువస్తే, మరికొంతమందిని బలవంతంగా అపహరించుకుని తీసుకువస్తుంటారు.
నేషనల్‌ క్రైమ్‌ రికార్డు బ్యూరో (NCRB) గణాంకాల ప్రకారం మన దేశంలో ప్రతిరోజూ 109 మంది పిల్లలు లైంగిక వేధింపులకు గురవుతున్నారు. పోక్సో చట్టం కింద నమోదైన ఈ కేసుల సంఖ్య 2017లో కన్నా 2018లో 22% పెరిగాయంటే మన పిల్లలు ఎంతటి అభద్రత మధ్య జీవిస్తున్నారో గ్రహించవచ్చు. 2018లో మొత్తం 21,605 మంది పిల్లలపై అత్యాచారం జరిగినట్టు కేసులు నమోదు కాగా, అందులో 21,401 మంది ఆడపిల్లలు, 204 మంది మగపిల్లలని ఈ డేటాలో తెలిపారు. 2018లో మొత్తం 67,134 మంది పిల్లలు తప్పిపోయారని కేసులు నమోదైతే అందులో 47,191 మంది ఆడపిల్లలే ఉండడం మరింత ఆందోళన కలిగించే విషయం. అంతేకాదు శరణాలయాల్లో ఉండే ఆడపిల్లలు, మహిళల మీద లైంగిక వేధింపుల కేసులు 2018లో 30% పెరిగాయి. ఇవన్నీ చూస్తుంటే మన దేశంలో ఆడపిల్లలు, మహిళలు ఎంత అభద్రతల మధ్య పెరుగుతున్నారో అర్థం చేసుకోవచ్చు.
కేవలం లైంగిక వేధింపులే కాక ఆడపిల్లలను ఎన్నో రకాలుగా మానసికంగా వేధిస్తోంది మన సమాజం. ఇటువంటి వేధింపులని కనీసం వేధింపుల కింద కూడా పరిగణించని పరిస్థితుల మధ్యలో మన ఆడపిల్లలు పెరుగుతున్నారు. అయితే, అంత చిన్న వయసులో వాళ్ళు ఇటువంటి వేధింపులకు గురైతే దాని ప్రభావం వారి ఎదుగుదల మీద ఉంటుందన్న విషయాన్ని మనం విస్మరించకూడదు. ఇలాంటి పరిస్థితుల మధ్య ఇటీవలి కాలంలో సోషల్‌ మీడియా వేదికగా పిల్లలకు, మరీ ముఖ్యంగా ఆడపిల్లలకు ‘‘గుడ్‌ టచ్‌ ` బ్యాడ్‌ టచ్‌’’ గురించి తెలియచేస్తూ కొంతమంది తల్లులు వీడియోలు పెడుతూ దానిపై అవగాహన కల్పించడానికి ప్రయత్నం చేయడం ఒక ఆహ్వానించదగ్గ పరిణామం. ఇలా ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి ఎవరి స్థాయిలో వాళ్ళు ఆడపిల్లల రక్షణ కోసం, ఆడపిల్లలకే కాదు, మగపిల్లలకు కూడా అవగాహన కల్పించడం చాలా అవసరం.
అత్యాచారాలు`హత్యా రాజకీయాలు:
ఒక పక్క ఇలాంటి సమయంలో రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులే భక్షకులుగా మారుతుంటే, ఇక ఆడపిల్లలు వాళ్ళ గోడును ఎక్కడ వెళ్ళగక్కాలి? అత్యాచారాలను అత్యాచారాలుగా చూడాలి తప్ప రాజకీయం చెయ్యకూడదు అన్న దేశ ప్రధాని, తన పార్టీలో ఉన్న నాయకత్వం ఎలా అత్యాచార నిందితులను కాపాడటానికి ప్రయత్నాలు చేసిందో మనం మరువలేము కదా! కథువాలో అత్యాచారానికి గురయిన అసిఫా నిందుతులను అక్కడి బీజేపీ నాయకులు కాపాడడానికి ఎలా ప్రయత్నించారో మనకు తెలుసు. యూపీలో ఉన్నావ్‌ ఘటనలో 16 ఏళ్ళ బాలికపై అత్యాచారం చేసిన అక్కడి బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్‌ సింగ్‌ ఎంతటి ప్రజా వ్యతిరేకతకు గురైతే ఆ పార్టీ నుండి బహిష్కరింపబడ్డాడో కూడా మనకు తెలుసు. ఇవే కాదు, మన ప్రభుత్వాలు అత్యాచార నిందితులను ఎన్‌కౌంటర్‌ చేస్తూ చేతులు దులుపుకుంటున్నారు తప్ప న్యాయబద్ధమైన మార్గం చూపకపోవడంతో ఛైత్రలాంటి (ఆరేళ్ళ సింగరేణి కాలనీ అత్యాచార బాధితురాలు) ఎంతోమంది అమాయక పిల్లలు అసువులు బాస్తున్నారు.
బడ్జెట్‌లో కోతలు:
ఇన్ని సమస్యల మధ్య కొట్టుమిట్టాడుతున్న బాలికలకు ఊరట ఇవ్వకపోగా వారి అభివృద్ధికి అడ్డం పడే విధంగా వారి కోసం కేటాయించే బడ్జెట్లో కోత వేయడం మరింత ఆందోళన కలిగించే విషయం. మన దేశంలో మొత్తం జనాభాలో 42%గా ఉన్న పిల్లలకు 2019`20లో 2.99% అంటే రూ.80,440 కోట్లు కేటాయించగా, 2020`21లో 3.17% అంటే రూ.96,400 కోట్లు కేటాయించారు. ఇక 2021`22 ఆర్థిక సంవత్సరంలో దీన్ని మరింత కుదించి 2.46% బడ్జెట్‌ మాత్రమే పిల్లలకు కేటాయించారు. మరో పక్క విద్యాశాఖకు ఈ అర్థిక సంవత్సరంలో కేటాయింపులను రూ.59,370 కోట్ల నుండి రూ.53,600 కోట్లకు కుదించారు. పిల్లల రక్షణకై కేటాయించే బడ్జెట్లో 40% కోత విధించారు. అంటే గత సంవత్సరం రూ.1500 కోట్లు కేటాయించగా ఈ సంవత్సర బడ్జెట్లో కేవలం రూ.900 కోట్లు మాత్రమే పిల్లల రక్షణ కోసం కేటాయించారు. ఈ రకంగా కోతలు విధించే వీళ్ళు ఆ ఉన్న కాస్త బడ్జెట్‌ని కూడా ఎంతవరకు సక్రమంగా ఖర్చు చేస్తారన్నది ఒక ప్రశ్న అయితే, అందులో ఎంత భాగం ఆడపిల్లల అభ్యున్నతికి వినియోగిస్తారన్నది మరో పెద్ద ప్రశ్న. అంతేకాదు ఈసారి బడ్జెట్లో మహిళలు, పిల్లల పౌష్టికాహారంపై కేటాయింపులను 27% కుదించారు. ఈ విధంగా కేటాయింపులను తగ్గించుకుంటూ పోతే కొత్తగా ఏమీ సాధించకపోయినా వాళ్ళు ఇంకాస్త సంకట స్థితిలోకి నెట్టబడతారు. కాబట్టి బడ్జెట్‌ని సరిపడా కేటాయించడం, దాన్ని సక్రమంగా వినియోగించడం చేస్తే ఈ సమస్యలు పూర్తిగా పరిష్కారం కాకపోయినా కొంతవరకైనా మెరుగవ్వచ్చు.
ఇవన్నీ ఒక వంతు అయితే, ఎక్కడ ఏ సమస్య వచ్చినా మొదట దాని ప్రభావం పడేది కుటుంబంలోని పిల్లల పైనే. మరీ ముఖ్యంగా ఇంట్లోని ఆడపిల్లల మీద! వారి హక్కులు వాళ్ళకి తెలియనివ్వరు. చదువు అనేది ప్రాథమిక హక్కు అని తెలియని ఆడపిల్లలు కోకొల్లలు. బాల కార్మికులుగా బ్రతకడం వారి హక్కులని కాలరాయడం వల్లనే అని తెలిస్తే ఎంతమంది ఆడపిల్లలు ఈ వ్యవస్థలో బాధితులుగా మారడానికి సిద్ధపడతారు? తమ శరీరం గురించి తెలుసుకోవడం కూడా ఆడపిల్లల హక్కే. గట్టిగా మాట్లాడితే ప్రతి పిల్లల హక్కు అది. పిల్లలు స్వేచ్ఛా జీవులు. కానీ సొంత నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ఉంటుందని కూడా తెలియని అమాయకులు! కాబట్టి వారికి ఆ స్వేచ్ఛా వాయువులను అందించే దిశగా కృషి చేయాల్సిన బాధ్యత వాళ్ళ చుట్టూ ఉన్న మన ఈ సమాజానిది. తను చదువుకోవాలా వద్దా, ఏమి చదవాలి, ఏమి ఆడాలి, ఏమి పాడాలి, ఉద్యోగం చెయ్యాలా వద్దా, ఏ ఉద్యోగం చెయ్యాలి, ఎలాంటి బట్టలు వేసుకోవాలి, ఏమి తినాలి, తను ఎలా బ్రతకాలి, ఇతరులకు ఎంతవరకు ఆసరా అవ్వాలి… ఇలా ఎన్నో విషయాలలో తనకంటూ స్వేచ్ఛ ఉందని తెలియచెయ్యడం బాలికల దినోత్సవ ఉద్దేశ్యం.
ప్రభుత్వమేదైనా ప్రతి సంవత్సరం ఈ రోజున ఒక థీమ్‌ని నిర్దేశించి దాని ఆధారంగా వైవిధ్య కార్యక్రమాలను నిర్వహిస్తూ
ఉంటుంది. అలా 2017లో థీమే ఇప్పుడు మనకు వినపడుతున్న ‘‘బేటీ బచావో బేటీ పఢావో’’. ఎన్ని థీమ్‌లు పెట్టినా, ఎన్ని కార్యక్రమాలు నిర్వహించినా, క్షేత్ర స్థాయిలో సమస్యను పరిష్కరించకుండా ఒక స్లోగన్‌ ఇచ్చేసి, సెల్ఫీలు పెట్టమని, హ్యాష్‌ట్యాగ్స్‌ను ట్రెండ్‌ చేస్తూ సంబరాలు చేసేసుకున్నంత మాత్రాన అసమానతలు తొలగిపోవు. ఎక్కడినుండో చైతన్యం పరిగెత్తుకుని వచ్చేయదు. ప్రజలను చైతన్యపరచకుండా, వాళ్ళను మరింత అంధత్వంలోకి నెట్టేసి రాజకీయం చేస్తున్న మన సో కాల్డ్‌ నాయకుల గారడీలో పడి వాస్తవాలను మరచిపోతున్న ప్రజలకు దిశా నిర్దేశం చెయ్యాల్సిన బాధ్యతను ప్రతి వ్యక్తి తన భుజాలపైకి వేసుకోవాలి. ఇటువంటి పరిస్థితులలో మన కర్తవ్యం సంబరాలు చేసుకోవడం కాదు. సమాజంలో పెరుగుతున్న ఈ రుగ్మతల్ని కూకటివేళ్ళతో పెకలించడానికి నడుం బిగించి ముందుకు రావడం.

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.