చుట్టూ చలి. ఏం పట్టుకున్నా చల్లగా తాకుతోన్న వేళ ఈ పుస్తకాన్ని చదవటం మొదలుపెట్టాను. మెల్లగా నెగడు చుట్టూ చేరి చలి కాచుకొంటున్నప్పటి వెచ్చదనం అరిచేతుల్లోకి చిన్నగా ప్రసరిస్తోంది. మెల్లమెల్లగా శరీరమంతా పాకుతోంది. చలి, వెచ్చదనం శరీరానికి
సంబంధించినవా… మనమున్న మనఃస్థితివా ఏమో… ప్రస్తుతం నా యీ ఉక్కబోత ఓ ఆశ్చర్యవంతమైన సాహసి జీవితం. సాహసవంతమైన జీవితాలని చదవటం… ఊపిరి బిగపెట్టి తెలుసుకోవటం… వినటం… బొత్తిగా అలవాటు లేదని కాదు… చిన్ననాటి నుంచి ఎన్నెన్ని సాహసాలు వినలేదు. అయితే ఇప్పటి నా ఆశ్చర్యానికి కారణం క్యూబా విప్లవ యోధురాలు ‘‘సెలియా సాంచెజ్’’! చిత్రంగా ఈ యోధురాలు అమెరికా వాళ్ళకి చాలా కాలం వరకు పెద్దగా తెలియదని చదివి మరింత ఆశ్చర్యపోయాను. గూగుల్ కాలమిది. విషయాలను వెతికితే ఎంతో కొంత సమాచారం దొరుకుతుంది. అలా అప్పుడప్పుడూ చూసినా ఒక విషయం మీద లేదా వ్యక్తుల మీదా కొంతమేరకైనా వచ్చిన వాటిని చదివినప్పుడు లేదా చూసినప్పుడు మరింత లోతుగా అర్థమవుతాయి. అలా అప్పుడప్పుడూ చూపుకి తాకినప్పుడు ఓ ఫోటో కుతూహలంగా అనిపించి అప్పుడు ఈ అమ్మాయి ఎవరు అని తెలుసుకోవటం మొదలు పెట్టి అలా ఆ పుస్తకాన్ని అందుకొని… ఇంకా ఏమేమి ఉన్నాయో వెతుక్కుంటూ ప్రతి పుస్తకం అందుకొన్నప్పుడు కలిగిన అనుభవం. నిజమే… అర్మాండో హార్ట్ డావలోస్ అన్నట్టే ‘‘ఆమె ఎల్లప్పుడూ విప్లవం అత్యంత ప్రామాణికమైన వైల్డ్ ఫ్లవర్‌గా ఉంటుంది’’ అనిపించింది. అవును ఆమె వైల్డ్ ఫ్లవర్ సెలియా సాంచెజ్… వైల్డ్ ఫ్లవరే.
సెలియా సాంచెజ్ అధికారిక క్యూబా ప్రభుత్వం ఏర్పడిన సందర్భంగా తీసిన ఫోటోలో క్యూబా తిరుగుబాటు సైన్యం యూనిఫాంలో చాలా సన్నగా, చాలా చిన్నగా కత్తిరించి ఉన్న దట్టమైన జుట్టుతో, బూడిద రంగులోని ముఖంతో చాలా అస్పష్టంగా కనిపిస్తారు.
మనం ఎప్పుడూ అంటుంటాం స్త్రీల జీవిత చరిత్రలు చరిత్రలో చాలా తక్కువగా నమోదయ్యాయని. ఇలాంటివి చదివినప్పుడు ఎప్పుడో నమోదు కావాల్సిన సెలియా సాంచెజ్ జీవిత చరిత్ర ఆలస్యంగానే వెలుగులోకి వచ్చింది. ఆ విషయాలని మరింత ఆలస్యంగా చదివినప్పుడు పుస్తకాలు చదవటం, ముఖ్యంగా స్త్రీల గురించి చదవటం తెలుసుకోవటం ఎంతో ఆసక్తి, ఇష్టం ఉండి కూడా ఇప్పటికి వీలయింది. ప్రతి ఏడాది పుట్టినరోజుకి లేదా వెళ్ళిపోయిన రోజును తలచుకుంటూ అదే సమయంలో క్యాస్ట్రో గారిని గుర్తుచేసుకుంటూ వారి గురించి చదువుతూ, రాస్తూ కొన్నేళ్ళుగా కొన్ని వాక్యాలు, ఓ పిక్చర్‌ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ కూడా చాలాకాలం వరకూ సెలియా సాంచెజ్ గురించి శ్రద్ధగా చదువుకోలేదు.
రష్యన్, చైనా సాహిత్యాన్ని చదువుకోవటం వల్ల పోరాటం, విప్లవం… ప్రజాపోరాటాల్లో ఎందరో విప్లవ స్త్రీల సాహసం మనకి వారి పట్ల గౌరవం… ఆరాధన కలుగుతాయి. వారి జీవితాల్లో వారు నింపుకొన్న రాజకీయాల పట్ల భిన్నాభిప్రాయాలు ఉన్నవారు సైతం వారి పోరాటపటిమకి… సాహసానికి ఆశ్చర్యపోతారు, గౌరవిస్తారు, ఆరాధిస్తారు.
సెలియా సాంచెజ్ జీవితం గురించి తెలుసుకుంటున్న కొద్దీ నిశ్శబ్దమైపోయింది మనసు. హృదయమంతా బరువైపోయింది, ఉద్వేగభరితమైంది. ‘‘యుద్ధానికి స్త్రీ ప్రకృతి విరుద్ధం’’ పుస్తకం మదిలో మెదలింది. మళ్ళీ తీసి చదివాను. అందులో రష్యన్ మహిళల యుద్ధ అనుభవాలు, సెలియా సాంచెజ్ అనుభవాలు ఎలాంటివో అని అనుకోగానే నిస్సందేహంగా ‘‘సెలియా సాంచెజ్’’ జీవితం ఒక అసాధారణ వ్యక్తీకరణ అని అనిపించింది. ఆమె విప్లవంలో ఎంత రహస్య జీవితాన్ని గడిపారంటే ‘‘సెలియా సాంచెజ్ ఎవరు?’’ అని సి.ఐ.యే నివేదికలో ఆమె పేరు కనిపించినప్పుడు అధ్యక్షుడు జాన్ ఎఫ్.కెన్నెడీ కూడా అడిగారంట. అప్పుడు ‘క్యూబా విప్లవ ప్రభుత్వంలో సెలియా హవానాలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తి. అత్యున్నత ర్యాంకులో ఉన్న గౌరవనీయురాలైన మహిళ’ అని రాయబారి ఎ.ఎ.బెర్లే చెప్పారు. అంతేకాకుండా సెలియా సియెర్రా మాస్ట్రా మొదటి గెరిల్లా హోదాను పొందిన ఆమె ఫిడెల్ కాస్ట్రోకి అత్యంత విశ్వసనీయురాలని, విధేయురాలనే వివరాలు తెలిసాయట జాన్.ఎఫ్.కెన్నెడీకి.
సెలియా సాంచెజ్ జీవితాన్ని గురించి మనకి నాన్సీ స్టౌట్ అందించిన పుస్తకం చదువుతున్నప్పుడు అరే… విప్లవానికి ఇంత సమర్ధవంతమైన రూట్ మ్యాప్‌ని స్త్రీలు రచించగలరా అనే ఒక ప్రశ్న మనలో మొలకలు వేసి వటవృక్షమై విస్మయం శాఖోపశాఖలుగా విస్తరిస్తూ మనలో సంచలనాన్ని కలిగిస్తుంది. నిజంగా ఆమె మానవ మాత్రురాలేనా? అనే ప్రశ్న మనలో ఉద్భవించి తీరుతుంది. ఒక విప్లవాత్మక మహిళ అద్భుతమైన వెల్లడి, డాక్యుమెంటేషన్‌లతో నిండి ఉన్న ఈ పుస్తకం వల్ల మెరుగైన మహిళా నాయకత్వం ఎలా ఉంటుందో అనే స్పష్టమైన దృష్టిని, అన్నింటి కంటే ప్రధానంగా స్త్రీ, పురుష సంబంధాల నిజమైన సమానత్వ విప్లవ నాయకత్వం ఎలా ఉంటుందోననే చేదైన విషయం కూడా మనకి స్ఫురిస్తుంది.
క్యూబా విప్లవం అనగానే మనకు తలపుకొచ్చేది చే గువేరా, ఫిడెల్ కాస్ట్రో. వీళ్ళిద్దరూ, మిగిలిన విప్లవకారులు విప్లవ విజయం కోసం చేసింది కొంతైతే సైద్ధాంతికపరమైన కృషి రిక్రూట్‌మెంట్స్, సప్లయ్స్, రూట్ మాప్ వరకూ మొత్తం రూపొందించిన అద్భుతమైన ఒక వ్యక్తి ఆలోచనలు, కృషి వెలుగులోకి చాలాకాలం రానేలేదు, రావాల్సినంతగా రాలేదు కూడా. ఇలా ఎందుకు జరిగి ఉంటుందో తెలియదు కానీ స్త్రీ అవ్వటం వల్ల… అనేయటం తేలిక. కానీ మనకి తెలియని ఆ కాలానికి ఆ సంక్షోభంలో ఎవరెవరి పేర్లు రావాలి అనే దృష్టికంటే సాధించాల్సిన గమ్యం ముఖ్యమైనది అయినప్పుడు కొన్ని చరిత్రలో రికార్డు కాకపోవచ్చు. అలా కాని వాటిల్లో అధికశాతం స్త్రీల కాంట్రిబ్యూషన్ అవ్వటంలో సందేహం ఏమీ లేదు. విప్లవ సమయంలో తల్లిదండ్రులను కోల్పోయిన అనేకమంది క్యూబా పిల్లలను సెలియాతో పాటు ఫిడేల్ కాస్ట్రో కూడా దత్తత తీసుకున్నారు. పిల్లలను దత్తత తీసుకోవడమే కాకుండా, చాలా సంవత్సరాల పాటు జరిగిన హత్యా ప్రయత్నాలు, అనేక ఇతర సామాజిక రాజకీయ ఒత్తిళ్ళ మధ్య కూడా వారు వారిని పెంచగలిగారు.
ఆశ్చర్యకరంగా ఫిడేల్, సెలియా వారు కలుసుకోవడానికన్నా చాలా కాలం ముందు నుంచే చేయవలసిన పనిని వివరించే రహస్య సందేశాలను ఒకరికొకరు పంపుకునే పనిని కలిసి పనిచేశారు. వారు కలుసుకున్నాక ఆమె మరణించేవరకూ వారు కాలాకాలం వరకు విడదీయరాని విధంగా జీవించారు. అయితే వారు ప్రేమికులా? సెలియా జీవించి ఉండగా, క్యూబన్లు, క్యూబనేతరులకు మిగిలిన ఒకే ప్రశ్న ఇది. వీరిద్దరూ అభివృద్ధి చెందిన విప్లవాత్మక భాగస్వామ్య నమూనాను ఎలా అందచేశారు. గోప్యతా క్షణాలలో వారేమి చేశారు? అనే విషయాలు ఈ జీవిత చరిత్రలో కనిపిస్తాయి. నిజానికి ఇది వారి స్వంత వ్యవహారం. కానీ ప్రశ్న, సూక్ష్మ రూపాలలో పరిగణించబడుతుంది. ఏ మేరకు వారి మధ్య సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి? వారు ప్రేమికులా? ఆత్మ సహచరులా? విప్లవ సహచరులా? కేవలం స్నేహితులా? ఒకరి సన్నిధాన్ని మరొకరు ఆనందించారా? క్యూబా ప్రజల్ని క్రూరమైన నియంతృత్వం, దాని వారసత్వం నుండి విముక్తి చేయడానికి వారి జీవితాలను అంకితం చేసిన ‘‘ది న్యూ పర్సన్స్’’.
ప్రపంచంలోని చాలా ప్రాంతాలకు క్యూబా ఇప్పటికీ భవిష్యత్తు దిక్సూచి. ప్రపంచానికి, ముఖ్యంగా మొదటి ప్రపంచ ఆధిపత్య దేశాలకు, దశాబ్దాలుగా, భరించలేని, కనికరం లేని ప్రాణాంతకమైన ద్వేషాన్ని భరించడం అంటే ఏమిటో నేర్పింది. ఎందరో వ్యక్తులు హింసించబడ్డారు, హత్య చేయబడి, అదృశ్యమయ్యారు, విముక్తి కోసం ఆరాటపడి తప్పిపోయారు. ఫ్రాంక్ పైస్… ఇరవై ఏళ్ళ యువ పాఠశాల ఉపాధ్యాయుడు, ఇతర కమాండెంట్, నియంతను పడగొట్టడంలో మార్గనిర్దేశనం చేయడంలో ఫిడేల్ భాగస్వామి. విప్లవం ప్రారంభ రోజుల్లో సెలియా ప్రాథమిక పరిచయస్తుల్లో ఒకరు బాటిస్టా పోలీసులచే, అతని తమ్ముడు జోసుయే చంపబడిన ఒక నెల తర్వాత హత్య చేయబడ్డాడు. వారి శరీరాలను క్లెయిమ్ చేసుకున్న వారి తల్లి, రోసారియో కూడా ఇప్పుడు లేరు. ఈ విషయాలను చదువుతున్నప్పుడు ఆమె అనుభవించిన వేదనలో దుఃఖం మనసుకి తడుతూనే ఉంది. ఇద్దరు లొంగని తిరుగుబాటు మహిళలు క్లోడోమిరా, లిడియా, పోలీసుల కస్టడీలో చనిపోయే ముందు క్రూరంగా హింసించబడ్డారు. ఇప్పటికీ, ఎప్పటికీ ప్రపంచంలోని చాలామందికి చేగువేరా చాలా చిన్న వయసులోనే హత్య చేయబడడం దుఃఖం కలిగిస్తూనే ఉంది. ఇటువంటి అమానవీయతని అంతమొందించే సమాజం కోసం చేసే క్యూబా విప్లవంలో సెలియా ముఖ్య పాత్రను పోషించారు.
ఎన్నోన్నో బాధలను అనుభవించిన క్యూబా ప్రజల లోతైన భావాలను పంచుకున్న సామూహిక అనుభవమే గొప్ప సంపన్న దేశమనే భావన, చాలా ధైర్యంగా పోరాడి మరణించిన వారందరూ, కొన్నిసార్లు భయంకరంగా, వారి పంధాని వదిలిపెట్టిన విప్లవకారుల చేత కూడా ఉద్రేకంగా ప్రేమించి, ప్రశంసించబడడం… ఈ రెండూ పరస్పరం జీవించిన ఈ చరిత్ర గొప్పదనం అనే నమ్మిక అనేక మందిలో ఉంది. దేశాన్ని కలిపి ఉంచే స్వేచ్ఛ, ఆరోగ్యకరమైన క్యూబాను సృష్టించాలనే ఆశ ఈ పుస్తకంలో దర్శనమిస్తూనే ఉంది. అది ఈ నాటి ఆకాంక్ష కూడా.
ఫిడెల్ కాస్ట్రో, సెలియా సాంచెజ్‌ను ఎందుకు ఆరాధించారో, చే, సెలియా ఎందుకు మంచి స్నేహితులో అని వారి గురించి వచ్చిన పుస్తకాలను, దొరికిన సమాచారాన్ని, కథలను చదువుతున్నప్పుడు మనకు ఖచ్చితంగా ఒక విషయం తడుతుంది. ఈ ముగ్గురు విప్లవకారులూ అత్యున్నత నైతిక స్వభావం, సమగ్రత కలిగిన వ్యక్తులు. అంతేకాదు లోతైన మానవులు కూడా. వారి అతిక్రమాలు, అసంపూర్ణతలలో వారు భయంకరమైన సమానులు. వారందరి తలలపై ధర కూడా ఉండేది.
సెలియా సాంచెజ్ మే 9, 1920న తూర్పు క్యూబాలో మీడియా లూనాలో జన్మించారు. సెలియా ఆరు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఆమె తల్లి మరణించారు. ఎనిమిది మంది పిల్లలను పెంచడంలో ఆమె తండ్రికి సహాయపడడానికి ఆమె అమ్మమ్మ అక్కడికి వెళ్ళారు. సెలియా తన చిన్నతనంలో ఆ సమయంలో తన సామాజిక వర్గంలో చాలామందిలానే గృహ నిర్వాహకురాలు, తోటమాలి, డ్రైవర్లతో కూడిన విస్తృమైన గృహ శ్రామికదళం సహాయం తీసుకునేవారు. సెలియా తండ్రి, అమ్మమ్మ పిల్లలందర్నీ క్యూబా సార్వభౌమాధికారం పట్ల దృఢమైన గౌరవ సామాజిక సమస్యలను పరిష్కరించడంలో నిబద్ధతతో పెంచారు. ఒక వైద్యుని కుమార్తె అయిన సెలియా పేదలకు వైద్యం చేయడానికి తన తండ్రిని ఎప్పుడూ మోటివేట్ చేసేవారు, అలాగే ఆయనకు సహాయం కూడా చేసేవారు.
ఒక హై సొసైటీ అమ్మాయి, హైస్కూల్ అందాల రాణి, ఎర్రని లిప్‌స్టిక్, వెడల్పు స్కర్టులు, హైహీల్స్‌తో తిరిగే ఈ మహిళ తిరుగుబాటు చేసే ఆర్మీ యూనిఫాం ధరించి చే, ఇతర విప్లవకారులతో కలిసి తూర్పు క్యూబా పర్వతాలను అధిరోహించటమంటే చిన్న విషయం కాదు. కానీ ప్రపంచానికి ఆమె యోధురాలిగా అంతగా తెలిసినవారు కాదు. సంపద, అవినీతి, అధికారం అనే హత్యా యంత్రానికి వ్యతిరేకంగా ఆమె తన జీవితాన్ని పరదాల వెనకే దాచి ఉంచి ఆమె ప్రియమైన దేశం ఆమెను గాయపరిచింది.
సెలియా ఎలిమెంటరీ స్కూల్ టీచర్. ఆమె వ్యక్తిత్వం మీద ఆమె తండ్రి అత్యధిక ప్రభావాన్ని చూపారు. ఒక యువతిగా, బలమైన రాజకీయ అభిప్రాయాలను ఏర్పరచుకున్న సెలియా చర్చివర్జిన్ ఆఫ్ ఛారిటీ విగ్రహానికి దుస్తులు కుట్టడం, కేకులు కాల్చడంతో పాటు వెడ్డింగ్ ప్లానర్‌గా కూడా పనిచేశారు. అద్భుతమైన గృహ నిర్వాహకురాలని అందరూ ఆమెని మెచ్చుకునేవారు. ఆమె అద్భుతంగా వండేది, బేకర్‌లో నైపుణ్యం సాధించింది. కుట్టడం, ఎంబ్రాయిడరీ కూడా చేయగలరు. అటువంటి అమ్మాయి రూట్ మ్యాప్‌ని ఆవిష్కరించగలదని ఎవరైనా ఊహించగలరా…!!! ఎలా అలవడిరదో కానీ విప్లవాత్మక కేంద్రాన్ని రూపొందించటంలో మాత్రమే కాక విప్లవ విజయాల చరిత్రను రూపొందించడంలో సెలియా పాత్ర అద్భుతమైనది. ప్రతి ఒక్క కాగితం ముక్కని, ప్రతి ఒక్క విషయాన్ని ఆమె భద్రపరిచేవారు. డాక్యుమెంటేషన్‌లో అద్భుతమైన ముందు చూపున్న ప్రతిభాశాలి అయిన ఆమె వ్యక్తిగతంగా పత్రికల వారితో మాట్లాడడానికి ఏ మాత్రం ఆసక్తి చూపకపోవడమే కాక ఫోటోలు తీయించుకోవడానికి కూడా ఇష్టపడేవారు కాదు. పైగా ‘‘ఎలర్జీ’’ అని నవ్వుతూ అనేవారంట.
మైదానాల్లో ఉండటం ఆమెకు చాలా ప్రమాదకరంగా మారినప్పుడు, ఆమె కాస్ట్రోతో కలిసి సియెర్రా మాస్ట్రాలో చేరారు. లా ప్లాటా కమాండ్ పోస్ట్ వద్ద ఆమె ఆహారం, బట్టలు, ఆయుధాలు పర్యవేక్షణను చూసేవారు. గెరిల్లా యుద్ధంలో తిరుగుబాటు దళాలను నిలబెట్టడానికి అవసరమైన ప్రతి విషయాన్నీ ఆమె చూసేవారు. ఆమె క్యాస్ట్రో నుంచి ఎప్పుడూ దూరంగా లేరు. ఆమె కూడా యుద్ధానికి దిగారు. పదిహేనేళ్ళ వయసులో ఆమె మాజీ గెరిల్లా ఫైటర్ బ్రిగేడియర్ జనరల్ టెట్ ప్యూబ్లాను సియెర్రా మాస్ట్రాలో కలిశారు. సెలియా ప్రారంభంలో ఇతర మహిళలతో కలిసి నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాడడానికి ఎప్పుడూ ఆయుధాలతో ఉండేవారు. క్యూబా మహిళలు విప్లవంలో పూర్తి భాగస్వాములు, పోరాట యోధులు, రహస్య కార్యకర్తలు, సహ ప్రేరకులని వారి గురించి చదువుతున్నప్పుడు స్పష్టంగా తెలుస్తుంది.
ఫిబ్రవరి 1957 వరకు సెలియా ఫిడెల్‌ను వ్యక్తిగతంగా కలవలేదు. ఆ సమయానికి, అతను మెక్సికోలో ప్రవాసం నుండి తిరిగి రావడానికి ఆమె ప్రణాళికను వేశారు. తిరుగుబాటు కోసం లాజిస్టిక్స్, పరిచయాలను సమన్వయం చేయడంలో ఆమె చేసిన పని ఫిడెల్ నుండి ప్రశంసలు అందుకుంది. ‘‘ఆమె రహస్యంగా వ్యవహరించి, పోరాటంలో అపారమైన కష్టాలను ఎదుర్కొని, అద్భుతమైన పరాక్రమాన్ని ప్రదర్శించింది’’ అని ఫిడెల్ ఆమెను ప్రశంసించారు.
విప్లవం తరువాత, ఫిడెల్‌తో కలిసి రాజధానికి చేరుకున్నాక సెలియా క్రమంగా యెల్ వెడాడోలోని 11వ వీథిలో ఒక భవనంలో అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేసి ఆ కాంప్లెక్స్‌ను పాక్షిక`పబ్లిక్ హోమ్‌గా మార్చారు. అక్కడినుండి ఆమె ఫిడెల్ కోర్టును నిర్వహించారు. యుద్ధ అనాథలను స్వాగతించారు. అంతర్జాతీయ నటులు, రచయితలు, పాత్రికేయుల వర్గానికి ఆమె ఆతిథ్యమిచ్చారు. అప్పటికి, డిఫరెన్షియల్ భాగస్వామి పాత్రలో స్థిరపడినట్లు అనిపించిన సమయంలో ఒకసారి జర్నలిస్ట్ ఫిలిస్ బాటెల్లె రాజకీయ విషయంపై సెలియా అభిప్రాయాన్ని అడిగినప్పుడు, ‘‘ఫిడెల్‌తో మాట్లాడండి’’ అని చెప్పారు.
ఫిడెల్‌ను రక్షించడంతో పాటు, క్యూబా నిజమైన గమ్యస్థాన నాయకురాలిగా, ఎప్పుడూ దాడికి పాల్పడుతున్న నాయకురాలిగా, సిద్ధాంతాన్ని పూర్తిగా అర్థం చేసుకున్న విప్లవకారిణిగా ఆమె చేసిన లోతైన బాధాకరమైన, ఒత్తిడితో కూడిన పనిని ఆమె ప్రేమించారని అనిపిస్తుంది. విప్లవం, దేశానికి తన బాధ్యతలను నెరవేర్చడానికి వ్యక్తిగత నష్టాలు, విషాదాలు జోక్యం చేసుకున్నప్పుడు ఆమె అణచుకోవలసిన దుఃఖం కూడా ఆమెపై అదనపు బరువుగా ఉండేది.
పర్వతాలలో వారి జీవితాన్ని ఆమె ఎప్పుడూ గుర్తుచేసుకునేవారు. అక్కడ అన్ని రకాల కష్టాలను, సంతోషాలను మననం చేసుకునేవారు. సంగీతాన్ని వినేవారు, యుద్ధ వార్తలను రేడియో ప్రసారాలలో తెలియచేసేవారు. ఆగస్ట్‌లోని అత్యంత ఆవిరి రోజులలో, త్వరలో విజయం సాధిస్తారనే విశ్వాసంతో వారు పార్టీ, ఐస్‌క్రీం కేక్‌తో తమ నాయకుడి పుట్టినరోజును జరుపుకున్నారు.
సెలియా సాంచెజ్ అసాధారణ జీవితం ధైర్యాన్నిస్తుంది, ప్రోత్సహిస్తుంది. విప్లవ సమయంలో తన చుట్టూ ఉన్నవారు చేసిన ప్రతి విషయాన్ని ఆమె రికార్డులలో భద్రపరిచేవారు. నిస్వార్ధపరురాలైన ఆమె, తన జ్ఞానంతో, క్యూబా తాను కలలు కంటున్న కలల సాకారానికి మారగ్దర్శకత్వం వహించే ప్రదేశంలో తానున్నానని భావించారు. తిరుగుబాటుదారుల గురించి భవిష్యత్తులో అందరికీ తెలియజేసేందుకు రికార్డ్ చేయాల్సిన విషయాల మీద ఆమె శ్రద్ధ వహించేవారు.
ఆమె ఎవరు? ఆమె ఎందుకు పెద్దగా ప్రసిద్ధి చెందలేదు? ఈ ప్రశ్నలకు క్యూబాలో సమాధానం చెప్పగల ఏకైక వ్యక్తి కూడా ఇప్పుడు లేరు. ఆమె జీవించడానికి, తన జీవితాన్ని వివరించడానికి ఆమె అజ్ఞాతత్వం కొంతవరకు స్వీయసృష్టి అని అర్థమవుతుంది. ‘‘నా రసహీనమైన జీవితం రాయడానికి అర్హమైనదే, కానీ వెర్రి విషయాలు చాలా ఉన్నాయి అందులో’’ అని ఆమె మార్చి 1, 1958న తన డైరీలో రాసుకున్నారు. ఈ జీవిత చరిత్ర రచయిత్రి నాన్సీ స్టౌట్ అంతర్దృష్టితో, ఆమె పరిపక్వతతో సాహసోపేతమైన వ్యక్తిత్వపు అన్వేషణ కోసం సాగించిన ప్రయాణాన్ని తప్పకుండా అభినందించాలి.
1956లో ప్రవాసం నుండి ఫిడెల్ కాస్ట్రో క్యూబాకి తిరిగి రావడానికి సమన్వయం చేయడంతో పాటు క్యూబా నియంత ఫుల్జెన్సియో బాటిస్టాను పడగొట్టే ప్రయత్నంలో ఫిడెల్, అతని తిరుగుబాటు సైన్యానికి మద్దతునిచ్చే రహస్య నెట్‌వర్క్‌ను నిర్మిస్తూ ఆమె నాటికల్ చార్టులను దొంగిలించారు. రైతులతో పొత్తులు పెట్టుకుని నగదుని సేకరించి రహస్య సందేశాలను పంపారు.
సంపన్న మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన సెలియా సాంచెజ్ క్యూబా విప్లవంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తులలో ఒకరిగా ఎదిగారు. అదే సమయంలో మహిళలపై విధించిన ఆంక్షలు సమాజాన్ని అంతర్గతీకరించడం, కొన్నిసార్లు దోపిడీ చేయడం కూడా చేశారు. ఆమె స్త్రీ అయినందువల్ల ఉన్న సౌలభ్యాలను ఆమె అనేకసార్లు తనకు అనుకూలంగా మార్చుకున్నారు. ఒకసారి ఆమె తన పనికి వెళ్ళే దారిలో గృహిణిగా నటిస్తూ పట్టుబడకుండా తప్పించుకున్నారు, మరొకసారి తన బ్లౌజ్ కింద కుషన్‌ను అతికించి గర్భవతి లాగా శత్రువుల కన్నుగప్పారు.
ఆమె ఓ గెరిల్లా నాయకురాలిగా కఠినంగా కనిపించడం సహజం. కానీ ఆమె ఔదార్యం కూడా ఎంతో గొప్పది. ఆమె ఎం`1 రైఫిల్‌ను తీసుకుని మే 1957లో యువేరొ యుద్ధంలో తిరుగుబాటుదారులతో చేరి పోరాడారు. ‘‘ఆమె కొత్తగా కనిపించలేదు. ఆమె చాలా సహజంగా, ఎంతో అనుభవమున్న గెరిల్లా యోధురాలిగా కనిపించింది’’ అని రావుల్ కాస్ట్రో ప్లాటూన్‌లో ప్రయాణిస్తున్న యెలోయ్ రోడ్రిగ్జ్ చెప్పారు. ‘‘సెలియా బాగా పోరాడిరది. కానీ నిర్దిష్ట వివరాలు లేవు. స్వయంగా సెలియా రూపొందించిన క్యూబా విప్లవ చరిత్రలో కూడా ఆమె తన పాత్రని చాలా తక్కువగా నమోదు చేశారు’’ అని ఆమె చరిత్ర రాసిన స్టౌట్ పేర్కొన్నారు.
2011లో బీబీసీ నివేదిక శీర్షికలో ‘‘సెలియా కాస్ట్రో ప్రేమికురాలా?’’ అని రాశారు. ఇటువంటి ప్రశ్నలు ఇప్పటికీ వినిపిస్తుంటాయి. స్త్రీ, పురుషులు కలిసి పనిచేసినప్పుడు ఇలాంటి ప్రశ్నలు తరచుగా వినిపించటం సర్వసాధారణం. ఏ కాలంలోనైనా, ఏ రంగంలోనైనా స్వయానా వారికి వారు ప్రకటించే వరకూ ఇటువంటి ఊహాజనిత కథనాలు అనవసరం. ఊహకి, సత్యానికి దూరం కొలతలకి అందనంత. క్యూబా నాయకుడు ఫిడెల్ కాస్ట్రో జీవితంలో మహిళా విప్లవకారిణి సెలియా కీలక పాత్ర పోషించారు. అయితే వారిద్దరూ నిజంగా ఎంత సన్నిహితంగా ఉండేవారు అనే చర్చ ఆమె మరణించిన ఇన్నేళ్ళ తర్వాత కూడా కొనసాగుతోంది. సెలియా రెండు దశాబ్దాలకు పైగా క్యూబా విప్లవానికి గుండెకాయగా ఉన్నారు. 1957లో కాస్ట్రోను కలిసిన తరువాత ఆమె అనివార్య కారణాల వల్ల సహాయకురాలిగా మారారు. వీరిద్దరూ ప్రేమికులు అనే ఊహాగానాలు, పుకార్లపై వీరిద్దరూ ఎప్పుడూ ఏమీ మాట్లాడలేదు. వారిద్దరూ విప్లవ కార్యాచరణలో ప్రజా విముక్తి కోసం నిరంతరం పనిచేసేవారు. సెలియా బతికి ఉన్నప్పుడు క్యూబా బయట ప్రపంచంలో ఆమె పోషించిన పాత్ర గురించి చాలా తక్కువగా రికార్డయింది. సెలియా, కాస్ట్రో కలిసి ఉన్న తొలి చిత్రం 1957లో మొదటిసారిగా కలుసుకున్నప్పుడు తీసింది.
1958లో ఫిడెల్ కాస్ట్రో తాను అంగీకరించిన మాచిస్మోను పక్కనపెట్టి, స్త్రీల పోరాట విభాగాన్ని ప్రతిపాదించినప్పుడు అతని తోటి గెరిల్లా పురుషులు దాదాపు తిరుగుబాటు చేశారు. ఆయుధాలు తక్కువగా ఉన్నాయని వారు వాదించారు. కానీ, చివరికి స్త్రీలే విజయం సాధించారు. ‘‘చాలామంది పురుషుల కంటే స్త్రీలే చాలా ప్రమాదకరమైన చర్యలు చేశారు’’. స్వాతంత్య్ర వీరుడు మరియానా గ్రజలేస్ పేరుతో పెట్టిన ఈ యూనిట్‌లో కేవలం 14 మంది మహిళలు మాత్రమే ఉండేవారు. అయితే వారు బాటిస్టా సైన్యంతో ‘‘కనీసం పది ఎన్‌కౌంటర్ల’’లో పాల్గొని విజయం సాధించారు.
కానీ, కొన్ని సంవత్సరాల తర్వాత, ఆమె చేస్తోన్న పనులు ఆమెను క్యూబా నాయకత్వంలో అగ్రస్థానానికి చేర్చినప్పుడు, ఆమె ప్రజల గుర్తింపును పొందకుండా ఉండడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. విప్లవం ప్రారంభ రోజులలో ఒక విలేఖరి తన ‘‘జీవిత చరిత్ర’’ కోసం తీవ్రంగా ప్రయత్నించినప్పుడు అతనికి ఎలాంటి సమాచారాన్ని ఇవ్వొద్దని చెబుతూ, ‘‘నా గురించి ఎవ్వరూ అతనికి ఒక్క విషయాన్ని కూడా చెప్పకండి. అచ్చులో నా పేరు చూసిన ప్రతిసారీ నేను చాలా కుంగిపోతున్నాను. నేను పేరుని ద్వేషిస్తున్నానని, నేను దాన్ని సహించలేనని మీకు తెలుసు’’ అని తన కుటుంబ సభ్యులను హెచ్చరిస్తూ సెలియా తన సోదరి అకేసియాకు ఒక లేఖను పంపారు.
విప్లవం తర్వాత కూడా సమూహంలో కలిసి చేసే కీలక పదవులు, పనులు కాకుండా విప్లవం అధికారిక ఆర్కైవ్స్, హవానాలోని పార్క్ లెనిన్, ప్రసిద్ధ కొప్పెలియా ఐస్‌క్రీం పార్క్ నిర్మాణంతో సహా అనేక ప్రాజెక్టులను పర్యవేక్షిస్తూ, సెలియా నిరాడంబరమైన జీవితాన్ని కొనసాగించారు. వందలకొద్దీ ఇంటర్వ్యూల ఆధారంగా క్యూబా విప్లవ చరిత్రని కూర్చడం సెలియా సాధించిన గొప్ప విజయం. తాననుకున్న వాటన్నింటినీ సాధ్యం చేయడానికి ఆమె చేసిన కృషి కనిపిస్తుంది. ఆ కృషి వల్లే క్యూబన్ విప్లవంలో ఆయుధాన్ని ప్రయోగించిన మొదటి మహిళ సెలియా, జనవరి 1959లో విజయవంతమైన ఫిడెల్ కాస్ట్రో, అతని బార్బుడోస్‌ను హవానాలోకి తీసుకెళ్ళిన జీప్‌లో నిలబడే హక్కును సంపాదించుకున్నారు.
దాదాపు అరవై సంవత్సరాలు జీవించిన సెలియా ఒక అమరవీరురాలు. క్యాన్సర్‌ను సహజమని భావించగలిగితే ఆమె సహజ కారణాలవల్లే మరణించారని భావించవచ్చు. జనవరి 11, 1980న ఆమె మరణించిన ఆ చలికాలంలో ఆమెకి నివాళులర్పించేందుకు వేలాదిమంది సంతాపకులు వచ్చారు. సామూహిక ర్యాలీల కోసం కార్మికులు తమ కార్యాలయాల నుండి తరలి వెళ్ళారు. ఆమె అంత్యక్రియల ఊరేగింపు హవానాస్ రివల్యూషన్ ప్లాజా నుండి కొలన్ స్మశానవాటికకు నెమ్మదిగా చేరుకుంది. ఫిడెల్ కాస్ట్రో బహిరంగంగా ఏడవడం అదే మొదటిసారని ప్రత్యక్షసాక్షులు పేర్కొన్నారు. ఆమె క్రిప్ట్ ‘‘43’’ అనే సంఖ్యతో మాత్రమే గుర్తించబడిన ఆసమెకి సందర్శకులు టార్చ్ ఆకారంలో ఉండే క్యూబా జాతీయపుష్పం వైట్ మరిపోసని ఉంచి నివాళులర్పించారు. ఇప్పటికీ క్రమం తప్పకుండా ఆమెకి ఆ పువ్వులతో నివాళులర్పిస్తారు.
ఆమె మరణించిన తర్వాత క్యూబా ఆమె చిత్రాన్ని ఇరవై`పెసో నోట్‌లో వాటర్ మార్క్‌గా ముద్రించింది. రాష్ట్ర మీడియాలో సంపాదకీయం ఆమెను ‘‘విప్లవ అపారమైన సముద్రంలో అదృశ్యపువ్వు’’ అని ప్రశంసించింది. సెలియా ప్రాథమికంగా పోరాట యోధురాలిగానే కాకుండా, క్యూబా ‘‘అత్యంత స్థానిక వైల్డ్ ఫ్లవర్’’గా ప్రసంశలను అందుకున్నారు. సెలియా గొప్ప సృష్టిలలో పార్క్ లెనిన్ ఒకటి. భారీ స్థాయిలో రూపొందించిన ఈ పార్క్ దాదాపు 2,000 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. సెలియా నాయకత్వం వహించిన 14 వాస్తు శిల్పాలతో 1969లో రూపకల్పన చేసిన ఈ పార్క్ 1972లో ప్రారంభించబడిరది. పన్నెండు సంవత్సరాల తరువాత, ప్రభుత్వం 9 మీటర్ల ఎత్తైన లెనిన్ విగ్రహాన్ని ఆ పార్కులో ఎత్తైన కొండపై ప్రతిష్టించింది. ఆ లెనిన్ పార్క్‌లో నిరాడంబరమైన సెలియా స్మారక చిహ్నం ఆకులలో దాగి ‘‘ఆమెలా పరిమళించే పువ్వుల మధ్య, ఆమె ఆప్యాయతా చిరునవ్వుల స్పష్టమైన నీటి ప్రవాహంతో’’ అని ఒక కవి రాశారు.
‘‘సెలియా విప్లవకాలంలో గొప్ప యోధురాలు. ఆ విప్లవం నుంచి ఆమె వ్యక్తిగతంగా ఏమీ ఆశించలేదు. ఆమె కేవలం తన నేలని ప్రేమించింది. ఆమె తన నేల విముక్తిని కోరుకుంది. అందుకే తనను తాను చెరిపేసుకుంది’’ మొన్న జనవరి 11న సెలియా సాంచెజ్ వర్ధంతి నాడు ఈ మాటలు పదేపదే గుర్తొచ్చాయి. అర్మాండో హార్ట్ డావలోస్ అన్నట్టు ‘‘ఆమె ఎల్లప్పుడూ విప్లవం అత్యంత ప్రామాణికమైన వైల్డ్ ఫ్లవర్‌గా ఉంటుంది’’.
(కొలిమి వెబ్‌మ్యాగజైన్ సౌజన్యంతో)