దళితుల విజయగాథలు ‘దళిత్‌ డైరీస్‌’ -మల్లవరపు ప్రభాకరరావు

నాగప్పగారి సుందర్రాజు తన ‘చండాల చాటింపు’ కవితా సంపుటిలో ఒక కవితలో ‘‘ఇకనుంచి నా పాట నేనే పాడుకుంటా’’ అంటాడు. అవును ఎవరూ పాడని తన జీవితాన్ని తనే ప్రకటించుకోవాలనే ఒక కోరికను వ్యక్తపరుస్తాడు. దళితుల విజయాలు మన దగ్గర నమోదు

చేయరు. ఇవేమీ వ్యక్తిత్వ వికాస పాఠాలలో సిలబస్‌గా మారదు. కులాన్ని విస్మరించే ఏ విజయమైనా ప్రధాన స్రవంతి మీడియాకు సమ్మతమే. ఈ దేశంలో ప్రధాన స్రవంతి ఉద్దేశ్యపూర్వకంగా విస్మరించే విజయగాథలు నమోదు చేసిన పుస్తకమే రజిత కొమ్ము రాసిన ‘‘దళిత్‌ డైరీస్‌’’. ఇందులో రాసిన 25 మంది విజయగాథలు… అన్నీ కోల్పోయిన జీవితాలలో వెలుగు రేఖలు నింపిన ఆత్మగాధలు. నిజంగా దళిత సమాజానికి ఈ సమయంలో కావలసిన కథలు. తమ వేదనామయ జీవితాలలో ఒక ఆశ మొలకెత్తుతుందన్న నమ్మకాన్ని ఇవ్వగలిగిన ప్రేరణాత్మక వచనం ఈ పుస్తకం. ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా ఈ దేశంలో దళితుల విజయగాథలు విస్మరించబడ్డాయి. వారికి స్ఫూర్తినిచ్చే చరిత్ర అందరిదీ కాకుండా పోయింది. అందుకే ఇప్పుడీ పనిని కొత్తగా అక్షరాలు తలకెత్తుకున్న దళిత యువత తమ మూలాల్లోకి వెళ్ళి మరీ వెలికి తీస్తోంది. అలాంటి పనినే సమర్ధంగా నిర్వహించారు కొమ్ము రజిత. ఒక కాలమ్‌గా వచ్చిన ఈ జీవన రేఖలు అన్నింటినీ ఇప్పుడీ పుస్తకంగా మన ముందుకు తీసుకువచ్చింది. మొత్తంగా 25 విజయగాధలు ఈ పుస్తకంలో నమోదు చేసింది. ఈ దేశంలో నదులు పారుతున్నా గుక్కెడు నీళ్ళ కోసం తమ చెలమను తామే తవ్వుకోవలసిన పరిస్థితి దళితులది. ఇదిగో ఇలాంటి మట్టి మనుషుల కొత్త చరిత్రను ఈ పుస్తకంలో చూస్తాం. పదిమంది మహిళలు తమ జీవితాలను డోలు వాయించడం ద్వారా తమ అస్తిత్వాన్ని ప్రకటించడం, ముఖ్యంగా భూస్వామ్య, పితృస్వామ్య, కులవివక్ష, ఖాప్‌ పంచాయతీలు, నిరక్షరాస్యత, పేదరికం ప్రధాన పాత్ర పోషించే ఉత్తర ప్రదేశ్‌లోని ఒక చిన్న గ్రామం నుంచి తమ విజయాన్ని చాటడం ప్రధాన స్రవంతి మీడియాలో కనిపించని విజయగాధ.
ఏమి తినాలో, ఏమి తినకూడదో సవాలక్ష ఆంక్షలు ఇప్పుడు. దళితుల ఆహారపు అలవాట్ల మీద దాడి ఆధ్మాత్మిక వేత్తల నుంచి, అగ్రవర్ణాల నుంచి ఎంత తీవ్రంగా ఉందో అందరికీ తెలిసిందే. ఇలాంటి సందర్భంలో మా ఆహారపు అలవాట్లు ఇవి అంటూ అంతర్జాతీయ వేదికపై నినదించిన 23 ఏళ్ళ మరాఠీ అమ్మాయి రాజ్యశ్రీ గుడీ విజయం మనందరిదీ. దక్షిణ భారతదేశంలో పా.రంజిత్‌, మారి సెల్వరాజ్‌ లాంటి దళిత దర్శకుల విజయాలు మనం చూస్తున్నాం. అయితే ఉత్తర భారతదేశంలో పాతుకుపోయిన కులవ్యవస్థ దృఢత్వం గమనించినప్పుడు అక్కడ సాధించిన ప్రతి విజయమూ దళిత జీవితాలలో భవిష్యత్తు పట్ల ఆశలు రేకెత్తించేవే అవుతాయి. తన దళిత ఐడెంటిటీని బహిరంగంగా ప్రకటించిన దర్శకుడు నీరజ్‌ గేవాన్‌, బాలీవుడ్‌ కులం ఫ్యాక్టర్‌ను అడ్రస్‌ చేయలేదని తాను ఇప్పుడు ఆ ప్రయత్నం చేస్తానని ప్రకటించడం ఒక సాహసం. పా.రంజిత్‌, నాగరాజు మంజులే లాంటి దళిత దర్శకులతో DALIFF (దళిత్‌ ఫిల్మ్‌ అండ్‌ కల్చరల్‌ ఫెస్టివల్‌)ను 2019లో ఏర్పాటు చేయడాన్ని భవిష్యత్తులో దళితుల విజయంగా చూడాలి. అలానే అంబేద్కర్‌ చెప్పిన మాస్టర్‌ కీ ఆచరణ అయిన కాన్షీరాంపై సినిమా తీసిన అర్జున్‌ సింగ్‌ మౌర్యది ఒక విజయ గాథ. బూట్‌ పాలిష్‌ చేసే సన్నీ ఇండియన్‌ ఐడిల్‌ పోటీల్లో పాల్గొనడం, దళిత జర్నలిస్టుగా విజయాన్ని లిఖించిన శివాదేవి, పెళ్ళి ఊరేగింపుకై అధికార, కుల వ్యవస్థపై పోరాడి విజయం సాధించిన సంజయ్‌ జాథవ్‌, భాషకు లిపినిచ్చిన 16 సంవత్సరాల యువకుడు ఆకాష్‌… వీళ్ళందరూ స్ఫూర్తి దాతలే.
ఒక మిఠాయి దుకాణంలో పనిచేస్తూ దాదాపు 22 కవిత్వ గ్రంథాలు ప్రచురించి పద్మశ్రీ అవార్డు పొందిన హల్దార్‌ నాగ్‌ మరో స్ఫూర్తి ప్రదాత. సాహిత్య సముదాయాలలో అసహ్యంగా పిలవబడిన వాడుక భాషలో, అట్టడుగు జనం మాట్లాడే భాషను వాడి రాసిన తన ఆత్మకథ ’కరుక్కు’ ద్వారా అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించిన తమిళనాడుకు చెందిన రచయిత్రి బామా ఫాస్తినా సూసైరాజ్‌ది మరొక విజయగాథ. చరిత్రలో మరుగుపడిన గొప్ప దళిత వ్యక్తుల జీవితాలను కూడా ఈ పుస్తకంలో చూస్తాం. అంబేద్కర్‌తో పాటుగా రెండు రౌండ్‌ టేబుల్‌ సమావేశాల్లో పాల్గొన్న దళిత మేధావి, దళితుల పట్ల వివక్షను అంతర్జాతీయ దృష్టికి తీసుకొచ్చిన తమిళనాడుకు చెందిన రెట్టమలై శ్రీనివాసన్‌, భారత రాజ్యాంగ పరిషత్‌లో ఏకైక దళిత మహిళ దాక్షాయణి వేలాయుధన్‌, మలయాళంలో మొదటి కథానాయకి రోజీ, మొట్టమొదటి దళిత క్రికెటర్‌ పాల్వాన్కర్‌ బాలూ, దేశంలో పిన్నవయస్సులో ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన దామోదరం సంజీవయ్య, హిందీ సినిమాకు తన పాటలతో రక్తమాంసాలద్దిన పాటల రచయిత శైలేంద్ర, కేరళ సామాజిక సంస్కర్త అయ్యంకాళి వంటి అనేకమంది దళిత వ్యక్తుల జీవితాలను ఈ పుస్తకంలో చూస్తాం. దళిత పారిశ్రామికవేత్తలు రాజా నాయక్‌, దళితుల ఆత్మగౌరవాన్ని చాటేలా వినియోగ వస్తువులను ఉత్పత్తి చేసే చమార్‌ స్టూడియోని స్థాపించిన సుధీర్‌ రాజభర్‌లవి స్ఫూర్తినిచ్చే విజయగాధలు. ఇలాంటి విజయాలు దళితుల జీవితాల్లో భవిష్యత్తు పట్ల ఒక ఆశను మొలకెత్తించేవే అవుతాయి. ప్రధాన స్రవంతి విస్మరించే ఈ గాథలు చేరాల్సిన వాళ్ళకు చేర్చే ప్రయత్నాన్ని చేసిన రచయిత్రి కొమ్ము రజిత అభినందనీయురాలు. ఈ పుస్తకం పాఠశాలల్లోకి, దళిత కమ్యూనిటీల్లోకి విస్తృతంగా చేరాల్సిన అవసరం ఉంది.

Share
This entry was posted in పుస్తక సమీక్షలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి)


తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.