గమనమే గమ్యం – ఓల్గా

(గత సంచిక తరువాయి…)
‘‘అదంతా నిజమే. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్ని బట్టి పోవాలిగా. ఏటికి ఎదురీదలేంగా’’
‘‘పరిస్థితుల్ని మార్చటానికా మనం ఉంది, పరిస్థితుల్ని బట్టి పోటానికా? ఏటికి ఎదురీదాలి కమ్యూనిస్టులు. నేను ఆధునిక స్త్రీని రామకృష్ణా. బహుశ మీరు నన్ను

భరించలేకపోతున్నారు. నా తల్లిదండ్రులు, నేనూ ఈ సమాజం మీద ఎంత పోరాటం చేస్తే నా చదువు సాధ్యమైందనుకున్నావు? చదువుకునే రోజుల్లో నన్నెందరు ఎన్ని మాటలన్నారనుకున్నావు. బూజు దులిపినట్లు దులిపేశాను ఆ మాటల్ని. వాటన్నిటినీ పట్టించుకుంటే నేను కమ్యూనిస్టు పార్టీ నిర్మాతల్లో ఒకరినయ్యేదాన్నా. నేను ఎప్పుడూ గలగలా నవ్వటమే మీకు కనిపిస్తోంది. అలా నవ్వటం నా హక్కు అని అర్థం చేసుకుని నవ్వటానికి నాలో జరిగిన స్ట్రగుల్‌ నీకు తెలియదు. నీ భుజం మీద చేయి వేసి మాట్లాడతాను. నిజమే. ఆ పరిస్థితి రావటానికి ఆటంకంగా ఉన్న ఎన్ని పర్వతాలను దాటి, సముద్రాలను ఈది వచ్చానో నువ్వు ఊహించను కూడా ఊహించలేవు. నీకు తెలియదసలు. నీకే తెలియకపోతే ఇంకెవరికి తెలుస్తుంది? ఇంకా నేనెన్నిటికి బందీగా ఉన్నానో, ఎన్ని తెంచుకోవాలో అని ఆలోచిస్తుంటాను. మరిన్ని సంకెళ్ళు వేసుకుని ఎప్పటికీ బందీగా జైల్లో ఉండమంటావా?’’
రామకృష్ణ ముఖం నల్లగా మాడిపోయింది. గొంతు పెగుల్చుకుని ‘‘అందరూ అనుకుంటున్నారని చెప్పా గానీ… నాకేం అభ్యంతరం లేదు.’’
‘‘అబ్బా… చాలా చాలా విసుగ్గా ఉంది. అలిసిపోయాను. ప్రతివాడికీ అభ్యంతరమా లేదా అని ఆలోచించి బతకాలా నేను.’’
‘‘నన్ను సరిగా అర్థం చేసుకోవటం లేదక్కా. నేను మాట్లాడేదంతా పార్టీ కోసం.’’
‘‘పార్టీ అంటే ఏమిటి? మనందరం కాక విడిగా పార్టీ ఏమన్నా రాతి గుహా? దేవాలయమా? మనం కదా పార్టీ ఎలా ఉండాలని నిర్ణయించేది.’’
‘‘జనం ఒప్పుకోని పనులు…’’
‘‘జనం ఒప్పుకునే పనుల కోసం కమ్యూనిస్టు పార్టీ ఎందుకు? భూస్వాముల దోపిడీని ఒప్పుకుంటారు జనం. తమ కర్మ అనుకుంటారు. కులాన్ని ఒప్పుకుంటారు. మనం వాటిని ఒప్పుకోమని చెప్పాలి గదా’’.
‘‘అది వేరు, ఇది వేరు. నీతి నియమాల గురించి జనం అభిప్రాయాలు అంతగా మారవు అప్పుడే.’’
‘‘నీతి! నీతి అంటే ఏంటి? నేను నవ్వటం, చకచకా నడవటం, పెద్దగా మాట్లాడటం అంతా నీతికి విరుద్ధంగా ఉందా? దానినుంచి నేను మారి నీతి మార్గంలోకి రావాలా?’’
‘‘నువ్వు ఆవేశంగా ఉన్నావు. అదంతా తగ్గి నిదానంగా ఆలోచిస్తే నీకే అర్థమవుతుంది.’’
‘‘ఆడవాళ్ళు ఆవేశంగా ఉండకూడదు కాబోలు. ఆర్గ్యుమెంట్లు చెయ్యకూడదు కాబోలు. నువ్వు నా ప్రవర్తన మార్చుకోమనగానే సిగ్గుపడి భయపడి మార్చుకుని…’’
రామకృష్ణ రెండు చేతులూ ఎత్తి దణ్ణం పెట్టాడు శారదకు.
‘‘ఒదిలెయ్‌. నా మాటలు తప్పని ఒప్పుకుంటాను. క్షమించెయ్‌. కానీ మన శత్రువు చేస్తున్న ప్రచారం గురించి పట్టించుకోకపోతే మనకే నష్టం జరుగుతుంది. ఏం చెయ్యాలో ఆలోచించు. నేను వస్తాను’’ అంటూ రామకృష్ణ అక్కడినుండి లేచి వెళ్ళిపోయాడు.
శారద గుండె మండిపోతోంది.
చివరికి… చివరికి… కమ్యూనిస్టులు కూడా కట్టడి చేయటమే.
తమ గురించి ఎవరేం అనుకుంటారో అని ఆలోచించటం మొదలుపెడితే ఇక దానికి అంతెక్కడ?
ఎంతమంది మగవాళ్ళ చూపుల్ని, మాటల్ని ఎదిరించి ఇంతదూరం వచ్చింది? తను నవ్వుతూ ఉంటుందని తన జీవితం పూలబాట అనుకుంటారేమో కానీ ప్రతి సందర్భంలో పోరాటం, ఘర్షణ, రాజీ, రాజీపడక తప్పని పరిస్థితి గురించి వేధించే మనసు. వీటన్నిటినీ పక్కన బెట్టి కమ్యూనిస్టు పార్టీలో చేరి పనిచేస్తోంది. ఎందుకు? ఇక్కడొక కొత్త ప్రపంచం గురించిన కల, ఆశ. ఆ ప్రపంచంలో కూడా ఆంక్షలూ, నిర్బంధాలూ అయితే ఇంక ఏముంది? చదువుకుని, ఉద్యోగం చేస్తూ, గుట్టుగా, గుంభనంగా ఉంటూ పెళ్ళి చేసుకుని, మొగుడికి ఒళ్ళు, మనసు, సంపాదన, అన్నీ అప్పగించి… ఎక్కడుంది ఆధునికత. ఆరేళ్ళ వయసునుండీ తనను ఆశపెట్టీ, ఆలోచన రేకెత్తించి, పరుగులు పెట్టించిన ఆ మాటకు అర్థం ఏమిటి? పరిథుల లోపలి మాటేనా?
ఇంత మంటా సూర్యం తనను ఈ దాడి గురించి మర్చిపోయేలా చెయ్యటానికి చేసే ప్రయత్నాలు చూసి చల్లబడేది. సూర్యం శారద బాధను చూడలేడు. ఆమె ముఖం అప్రసన్నంగా ఉంటే భరించలేడు.
ఈ చిచ్చు ఆరేది కాదని అనిపించింది శారదకు. అనుకున్నట్టే అయింది. పార్టీ అత్యున్నత కమిటీ శారద వ్యవహారాన్ని పరిష్కరించాలని కూర్చుంది. ఆ సమావేశానికి శారద వెళ్ళింది. చర్చలలో అందరినీ కడిగి పారేయాలని అనుకుంది. అటో ఇటో తేల్చుకోవాలనుకుంది. స్త్రీల గురించీ, వారిని చూసే దృక్పథం గురించీ పార్టీలో ఒక తీర్మానం చేయించాలనుకుంది. ఆధునిక స్త్రీ గురించి నిర్వచించాలని పార్టీని డిమాండ్‌ చేయాలనుకుంది. కానీ సమావేశంలో ఈ అంశం గురించి చర్చ మొదలవుతూనే మొట్టమొదటి వాక్యంలోనే వెంకట్రావు శారద పెళ్ళి చేసుకోవాలని ప్రతిపాదించాడు.
‘పెళ్ళా? నేనా?’ శారద అనుకోని ఈ దాడికి విస్తుపోయింది. వెంకట్రావుని మించి అక్కడున్న వారందరూ ఒక్క గొంతుతో శారద పెళ్ళి చేసుకోవాలని తీర్మానించారు.
అందరూ అదే మాటంటే, వాళ్ళందరికీ తెలిసిన విషయమే అయినా శారద తాను మూర్తిని ప్రేమించాననే విషయం చెప్పింది. ‘‘మేం పెళ్ళి చేసుకోమనేది కూడా మూర్తినే’’ అత్యుత్సాహంగా చెప్పారు.
‘‘మూర్తికి పెళ్ళయిందని తెలిసీ మీరి మాట ఎలా అంటున్నారు?’’ శారదకంతా అయోమయంగా ఉంది.
‘ప్రేమించిన వాడిని పెళ్ళాడటం తప్పుకాదు’’.
‘‘మీ పెళ్ళికి మూర్తి భార్య అంగీకరించింది.’’
‘‘మూర్తికి కూడా అభ్యంతరం లేదు.’’
ఒక్కొక్కరూ ఆనందంగా చెబుతుంటే శారద నోట మాట రాలేదు. అందరి ఉత్సాహమూ, మాటలూ అణిగాక అంది ‘‘నాకసలు పెళ్ళి చేసుకునే ఉద్దేశం లేదు. మూర్తినే కాదు, ఎవరినీ’’
‘‘పెళ్ళి చేసుకోకుండా మహిళా ఉద్యమాన్ని నువ్వు నిర్మించలేవు. స్త్రీలు నిన్ను ఆదర్శంగా తీసుకోవాలన్నా, నాయకురాలిగా అంగీకరించాలన్నా నువ్వు పెళ్ళి చేసుకోవాలి. పెళ్ళికాని ఒక స్త్రీ నాయకురాలిగా ఉండటంలో ఎన్నో చిక్కులున్నాయి. ఎన్నో సమస్యలొస్తాయి. నువ్వు వివాహం చేసుకు తీరాలని పార్టీ నిర్ణయించింది’’ వెంకట్రావు ఇక ఆ మాటకు తిరుగులేదన్నట్లు చెప్పాడు.
‘‘వివాహమైన వాడితో పెళ్ళి ఎలా సాధ్యం?’’
‘‘సాధ్యమే. మీరిద్దరూ పరస్పర అంగీకారంతో భార్యాభర్తలుగా జీవించటాన్ని పార్టీ ఆమోదిస్తుంది. ఆ ప్రకారం పత్రాలు రాసుకుని సంతకాలు చేయటమే. సంప్రదాయ పద్ధతిలో మనం పోముగదా! దండలు మార్చుకుని ఒప్పంద పత్రాల మీద సంతకాలు పెడితే సరిపోతుంది’’ బాపయ్య తేలికగా చెప్పేశాడు.
శారదకు కోపం వచ్చింది. బాధ కలిగింది.
‘‘పెళ్ళి నా వ్యక్తిగత విషయం. పార్టీ ఎందుకు జోక్యం చేసుకోవాలి?’’
‘‘పార్టీ సభ్యుల వ్యక్తిగత జీవితం కూడా పార్టీ నిర్దేశిస్తుంది. మన స్వీయ ప్రయోజనాలకంటే పార్టీ ప్రయోజనాలే ముఖ్యం.’’
‘‘మేం నీకు ఇష్టంలేని మనిషిని కట్టబెట్టాలనుకోవటం లేదు. నువ్వు ప్రేమించిన మనిషినే పెళ్ళాడమంటున్నాం.’’
‘‘ఎవరి ప్రేమకు కట్టుబడి అసలు పెళ్ళే వద్దనుకున్నావో ఆ మనిషినే పెళ్ళాడమంటోంది పార్టీ’’.
‘‘పెళ్ళికాని స్త్రీని సమాజం అనుమానంగా చూస్తుంది. పార్టీ నాయకురాలైన నిన్నలా చూడటం అంటే పార్టీకి ఎలా ఉంటుందో ఆలోచించు’’ ఒక్కొక్కరూ మాట్లాడుతున్న ఆ మాటలు శారదకు కంపరంగా ఉన్నాయి.
పెళ్ళికాని స్త్రీకి విలువ లేదు. ఆమెను అనుమానిస్తారు. చిన్నచూపు చూస్తారు. వీళ్ళంతా తనను ఇప్పుడలా చూస్తున్నారు. ఆ చిన్నచూపు ఇంకా పెద్దదవకుండా తను పెళ్ళాడాలి, దాంతో గౌరవం వస్తుంది. దీనిని మింగటానికి శారద సిద్ధంగా లేదు, పెళ్ళితో వచ్చే నాయకత్వం, ఆ గౌరవం, ఆ విలువ తనకొద్దని వాదించింది.
‘‘అదంతా మేం నమ్మటం లేదు. మేం అంత సంస్కార హీనులం కాదు. కానీ జనం కోసం. జనానికి మనం విలువలు నేర్పాలి. నిజమే, కానీ జనానికి ఏం నేర్పాలన్నా ముందు వాళ్ళకు మనమీద గౌరవం ఉండాలి.’’
వాద ప్రతివాదాలు చాలాసేపు సాగాయి. శారద ఒక్కత్తీ ఒకవైపు, మిగిలిన వారంతా ఒకవైపు.
‘‘పార్టీ కోసం త్యాగం చేస్తున్నాననుకో. పెళ్ళి మాత్రం చేసుకోవాల్సిందే’’ గట్టిగా అన్న రాజు మాటకు శారదకు
ఒళ్ళు మండుకొచ్చింది. ఆ కోపాన్ని అణచుకోటానికి చాలాసేపే పట్టింది. అందరూ ‘త్యాగం’ అనే మాటను పట్టుకుని శారద త్యాగం చెయ్యాల్సిందేనని పట్టుబట్టారు. తను చేయాల్సిన త్యాగాలు ఎప్పుడూ ఇలా ఉంటాయేమిటనుకుంటే శారదకు దుఃఖంతో పాటు నవ్వూ వచ్చింది. శారద చదువు మానేసి సహాయ నిరాకరణ ఉద్యమంలో వెళ్తానంటే చదువుకోవటమే త్యాగమని పెద్దలందరూ కలిసి వాదించి శారదను ఒప్పించారు. ఇప్పుడు పెళ్ళి అనే బంధం లేకుండా పార్టీలో పనిచేస్తానంటే పెళ్ళి చేసుకోవటమే త్యాగమని ఒప్పించాలని చూస్తున్నారు. ప్రేమించిన మనిషిని పెళ్ళాడమని అందరూ నిర్బంధించటం, స్త్రీ నిరాకరించటం. ఎవరి జీవితంలోనైనా ఈ విచిత్రం జరుగుతుందా అనుకుంది శారద.
తల్లి తన సంప్రదాయపు ఆలోచనలన్నీ పక్కనబెట్టి మూర్తిని పెళ్ళాడమని అడిగితే శారద ఒప్పుకోలేదు. ఇపుడు పార్టీ అడుగుతోంది. పార్టీ ఆడది పెళ్ళి చేసుకు తీరాలనే సంప్రదాయాన్ని కాపాడటం కోసం పెళ్ళి చేసుకోమంటోంది. మగవాడు పెళ్ళి మానేసి బ్రహ్మచారిగా దేశసేవ చేస్తానంటే అది త్యాగం అవుతుంది. ఆడవాళ్ళు పెళ్ళి మానేసి దేశసేవ చేస్తానంటే సంఘాలకీ, పార్టీలకు ఎక్కడలేని అప్రదిష్ట వచ్చి పడుతుంది. శారద పెళ్ళాడితే ప్రజల మనసులు శాంతిస్తాయి. ఇంటికి ఒక మగదిక్కు ఏర్పడుతుంది. ఒక పద్ధతిలోకి వస్తుంది. ఇప్పుడున్నది ఇల్లు కాదు. అరాచక సత్రం. అక్కడి నుంచి పార్టీ పనులు జరగటం పార్టీకి ఇష్టంగా లేదు. ప్రతిష్ట దెబ్బ తింటుంది. తను ఇదుగో నా మొగుడని ఒక మగవాడిని తీసికెళ్తే అందరూ తనని గౌరవిస్తారు. ఒక మొగుడంటూ లేకపోతే తన చదువు, జ్ఞానం, సాహసం, పార్టీ నిర్మాణ దక్షత, తెలివి, మేధావితనం, ఇవన్నీ ఎందుకూ పనికిరావు. తనలోని శక్తులన్నీ రాణింపుకు రావాలంటే ఒక మగాడు కావాలి. ఆ మగాడు మూర్తి. శారదకు నవ్వొచ్చింది.
పాపం మూర్తి… లోపల తనమీద ఎంత ఆశ ఉన్నా తను అంగీకరించదని ఆ ప్రస్తావనే తీసుకురాలేదు. తను ఎన్నో సంవత్సరాలుగా మూర్తి మీద ప్రేమను తన మనసులోనే అణిచేసుకుంది. ఇప్పుడు నిర్బంధిస్తున్నారు మూర్తిని పెళ్ళాడాల్సిందేనని. పెళ్ళాడాలా? పార్టీని వదలాలా? పెళ్ళాడితే పార్టీ, మూర్తి తన జీవితంలో భాగం. పెళ్ళాడకపోతే మూర్తి ఎలాగూ ఉండడు. తను పార్టీకి రాజీనామా చెయ్యాలి? దేనికోసం, పార్టీని వదలాలనే ఆలోచన భరించలేకపోతోంది. పార్టీ పొరపాటుని లోపల ఉండి మార్చాలి. పార్టీ నుంచి తప్పుకుంటే ఇక ఈ ధోరణి ఎన్నటికీ మారదు. ప్రజలను అనేక విషయాలలో చైతన్యం చేసే అవకాశం రాదు. ఆలోచనలతో శారద మనసు అలిసిపోయింది.
చివరకు తనకు కొంత గడువు కావాలని అడిగింది. వారం పది రోజులలో తేల్చమన్నారు పార్టీ ముఖ్యులు.
ఇంటికి వచ్చిన శారద ముఖం చూసి ఆశ్చర్యపోయింది సుబ్బమ్మ. ఇంత నీరసంగా నిరుత్సాహంగా శారద ఈ మధ్యకాలంలో ఎన్నడూ లేదు. అందులోనూ ఫాసిస్టు వ్యతిరేక ప్రచార కార్యక్రమం తీసుకున్న తర్వాత మహా ఉత్సాహంతో పనిచేస్తోంది.
‘‘ఏంటమ్మా అలా ఉన్నావు’’ వద్దనుకుంటూనే అడిగింది సుబ్బమ్మ.
‘‘ఇలా రామ్మా చెప్తాను’’ అని వెళ్ళి మంచం మీద పడుకుంది శారద.
సుబ్బమ్మ వెళ్ళి పక్కన కూచుంది. తల్లి చేతిని తన చేతిలోకి తీసుకుని నిమురుతూ ‘‘పార్టీవాళ్ళు నన్ను పెళ్ళాడమంటున్నారు. ఎవర్ననుకున్నావ్‌? మూర్తిని’’. సుబ్బమ్మకు ఆ మాట మనసులో ఇంకగానే సంతోషంతో ముఖం వికసించింది.
‘‘నాకు తెలుసు. పార్టీవాళ్ళు నిన్ను కన్నవాళ్ళలా కాపాడతారని. చూశావా? నేను చెప్పిన మాటే వాళ్ళూ చెప్పారు. శారదా… పెళ్ళి చేసుకోమ్మా. నేను నిన్ను ఎప్పుడూ ఏదీ అడగలేదు. నాకిది ఇష్టం, ఈ పని చెయ్యమని అనలేదు. కానీ ఏ సుఖం లేకుండా మోడులా తిరుగుతున్న నిన్ను చూస్తుంటే నాకు బాగోలేదు. జీవితంలో అన్నీ అనుభవించాలమ్మా. నీకు పిల్లలు పుడితే వాళ్ళను పెంచాలనే కోరికతో నా మనసు కొట్టుకుపోతోంది. నా తల్లీ… నా బంగారు తల్లీ… పార్టీ వాళ్ళు కూడా నాలాగే ఆలోచించి ఉంటారు. నా ఈ ఒక్క కోరికా తీర్చు శారదా. ఇంక నేనేం అడగను. మూర్తిని పెళ్ళి చేసుకో!!’’ నీ పెళ్ళి జరిగితే సూర్యం కూడా పెళ్ళి చేసుకుంటాడు. వాడికీ ఓ తోడు, పిల్లలు, సంసారం ఏర్పడితే బాగుంటుంది కదమ్మా!’’
శారద రెండు, మూడు నిమిషాలు తల్లినలాగే చూసింది.
తన చిన్నప్పటి నుంచీ తనే లోకంగా బతికిన తల్లి తన చేతులు పట్టుకుని అడుగుతోంది. తన ప్రపంచం అనుకున్న పార్టీ దాదాపు ఆజ్ఞాపిస్తున్నట్టే చెబుతోంది. సూర్యం గురించి కూడా ఆలోచించాలి.
శారద గబుక్కున లేచి కూర్చుని ‘‘సరేనమ్మా! నీ మాట వింటాను. మూర్తిని పెళ్ళాడతాను. పిల్లల్ని కంటాను. నువ్వు పెంచుదువు గాని…’’ అని అటు తిరిగి పడుకుంది. కళ్ళవెంట ఆగకుండా
నీళ్ళు కారుతున్నాయి. సుబ్బమ్మ కాసేపు శారద తల నిమురుతూ అట్లాగే కూచుని తరువాత లేచి మెల్లిగా అక్కడినుంచి తన గదిలోకి వెళ్ళింది. శారద ఏడుస్తూ ఎప్పటికో నిద్రపోయింది.
తెల్లవారి సూర్యంతో అన్నీ వివరంగా మాట్లాడిరది శారద. ‘‘నీకెలా ఉచితమనిపిస్తే అలా చెయ్యక్కా. అమ్మ సంతోషం మనిద్దరికీ ముఖ్యమే. పార్టీ ఆదేశం అందరం పాటించాల్సిందే’’ అన్నాడు.
యుద్ధం… యుద్థం… యుద్ధం… ఎక్కడ చూసినా, ఎవరి నోట విన్నా ఇదే మాట. రెండవ ప్రపంచ యుద్ధం మొదలైంది. హిట్లరు విజృంభిస్తున్నాడు. సామ్రాజ్యవాద దేశాల దగ్గరున్న సంపద, అధికారాల మీద అతని కన్ను పడిరది. బ్రిటన్‌తో సహా మిగతా యూరోపియన్‌ దేశాలను జయిస్తే ప్రపంచమంతా పాదాక్రాంతమవుతుందనుకున్నాడు. బ్రిటిష్‌ ప్రభుత్వం అన్ని వలస దేశాల ప్రజలనూ యుద్ధంలో తమకు సహకరించమంది. ఆ మాట అన్నది గానీ బలవంతంగానే యుద్ధంలోకి ప్రజలను లాగుతోంది. కాంగ్రెస్‌ వారికి, కమ్యూనిస్టులకు కూడా బ్రిటిష్‌ ప్రభుత్వంతో వ్యవహరించాల్సిన తీరుమీద ఎన్నో ఆలోచనలు. చర్చలు, వాదాలు. యుద్ధంలో ప్రభుత్వానికి సహకరించే సమస్యే లేదని కమ్యూనిస్టు పార్టీ తీర్మానించింది. గాంధీ వ్యక్తిగత సత్యాగ్రహ కార్యక్రమం ఇచ్చారు. అది బ్రిటిష్‌ ప్రభుత్వాన్ని అంతగా ఇబ్బంది పెట్టేది కాదనే విమర్శలను కమ్యూనిస్టులు చేశారు. కమ్యూనిస్టుల మీద బ్రిటిష్‌ ప్రభుత్వం నిషేధం విధించింది. దొరికిన వాళ్ళను అరెస్టు చేస్తుండడంతో అనేకమంది అజ్ఞాతవాసానికి వెళ్ళారు. నవశక్తి పత్రిక కూడా అజ్ఞాతంలోనే అచ్చయి పంపిణీ అవుతోంది. శారద పని ఇంకా పెరిగింది. అజ్ఞాతంలో ఉన్నవారికి కావలసిన బస, తదితర ఏర్పాట్లు, వారి కుటుంబాలను రాజకీయంగా చైతన్యపరచటం, డాక్టరుగా పని… ఒకటి కాదు, పది పనులను ఇరవై చేతులతో చేస్తున్నా చేయవలసింది ఇంకా మిగిలే ఉంటోంది.
శారద ఉపన్యాసాలకు కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాల ప్రజలు విపరీతంగా వస్తున్నారు.
‘‘మన దేశ సంపదను, ప్రజలను తన సామ్రాజ్య రక్షణకు బ్రిటిష్‌ ప్రభుత్వం వాడుకుంటుంటే మనం చూస్తూ ఊరుకోకూడదు. మనం బ్రిటిష్‌ సామ్రాజ్యానికి వ్యతిరేకం. యుద్ధంలో ఆ సామ్రాజ్యం బలహీనమైతే మన బలం పెరుగుతుంది. హిట్లర్‌ నియంత, ఫాసిస్టు. సందేహం లేదు. కానీ, బ్రిటిష్‌ ప్రభుత్వం ప్రజాస్వామ్యం పేరుతో వలస దేశాలలో నియంతల్లా వ్యవహరించటం లేదా? ఫాసిస్టు చర్యలు చేయటం లేదా? ఉరి తీశారే విప్లవకారులను… జలియన్‌వాలాబాగ్‌ ఫాసిస్టు చర్య కాక మరేమిటి? అసమ్మతిని, నిరసనను నొక్కివేయటంలో హిట్లర్‌ రాజకీయాలలోకి రాకముందే బ్రిటిష్‌ వాళ్ళు నిపుణులయ్యారు. వారు హింసించటంలో సుశిక్షితులై ఉన్నారు. కాకపోతే చట్టమనే పేరుతో పార్లమెంటు పేరుతో ఫాసిజానికి ప్రజాస్వామ్యపు రంగు పూసారు. దానివల్ల వారి పని తేలికైంది కానీ వలస దేశాల ప్రజల మీద ఆంక్షలు, నిర్బంధాలు పెరగలేదా? ఇంగ్లండు, జర్మనీల వైరం వాళ్ళనీ, వాళ్ళనీ తేల్చుకోనివ్వండి. మనం మాత్రం సహకరించకూడదు’’.
బిట్రిష్‌ వాళ్ళమీద నిప్పులు చెరుగుతూ శారద ఈ మాటలను ఉదాహరణలతో చెబుతోంటే ప్రజల రక్తం మరిగేది. వారు వ్యక్తి సత్యాగ్రహం చెయ్యకుండా ఉండలేకపోయేవారు. జైళ్ళు నిండిపోతున్నాయి. కాంగ్రెస్‌ మంత్రులందరూ రాజీనామా చేశారు.
జాతీయ, రాష్ట్రీయ ప్రభుత్వాల ఏర్పాటుకు అనుమతిస్తే యుద్ధంలో సహకరిస్తామని కాంగ్రెస్‌ పార్టీ పూనా మీటింగులో తీర్మానం చేసింది. గాంధీజీకి ఈ తీర్మానం ఇష్టం లేకపోయినా సమావేశంలో ఆమోదంలో పొందిందంటే అర్థం ఏమిటని శారద, అన్నపూర్ణ ఆవేదన పడ్డారు. దీని వెనకాల రాజాజీ ఉన్నారని అన్నపూర్ణ విశ్వాసం. ప్రకాశం పంతులు గారు, ఉన్నవ లక్ష్మీనారాయణ గారితో ఈ సంగతులు చర్చించేటప్పుడు అన్నపూర్ణ, అబ్బయ్య కూడా ఉన్నారు. ప్రకాశం గారి ఆవేదన వారికి పూర్తిగా అర్థమయింది. నిజానికి ప్రకాశం గారికి ప్రజలలో ఉన్న పలుకుబడికీ, ఆయనలోని నాయకత్వ లక్షణాలకు, త్యాగానికీ, సాహసానికీ ఎవ్వరూ చాలరు. కానీ కేంద్ర నాయకత్వం ప్రకాశం గారికి ఇవ్వవలసినంత విలువ ఇవ్వటం లేదని అన్నపూర్ణకు కోపం వస్తుండేది. శారదకు కూడా ప్రకాశం పంతులు గారంటే గౌరవం ఉంది గానీ, ఆయన బలాలతో పాటు బలహీనతలు కూడా ఆమెకు తెలుసు. చిన్నతనం నుంచీ ఆయనను దగ్గరగా చూసింది.
ఏమైనా రాజకీయాలే ఊపిరిగా బతికే స్రీల సంఖ్య పెరుగుతోంది. ఇంతలో ప్రపంచ పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయి.
హిట్లర్‌కీ, సోవియట్‌ రష్యాకీ మధ్య జరిగిన నిర్యుద్ధ ఒడంబడికను హిట్లరు ఖాతరు చేయబోవటం లేదనీ, రష్యా మీదికి కూడా దండెత్తుతాడనీ రాజకీయ వేత్తలు చెప్పుకోసాగారు. సోవియట్‌ రష్యా యుద్ధానికి సన్నద్ధమవుతోందనే వార్తలు మెల్లిగా వినపడటం ప్రారంభమై గట్టిగా ప్రతిధ్వనించసాగాయి.
దీంతో కమ్యూనిస్టులు పెద్ద చిక్కులో పడ్డారు. వారి దృష్టిలో సోవియట్‌ రష్యా ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమానికి చుక్కాని. అది ప్రమాదంలో పడకుండా కాపుకాయాలా? మన సంగతి మనం చూసుకోవాలా? సోవియట్‌ రష్యా తనను తను రక్షించుకోగలదు. మనం మన సంగతి చూసుకోవాల్సిందే అన్నారు కొందరు. రష్యా యుద్ధంలో ఓడిపోతే ఇక ఏ దేశంలోనూ కమ్యూనిస్టు పార్టీ బతికి బట్టకట్టలేదన్నారు మరి కొందరు. చర్చలు ఎడతెగకుండా సాగాయి.
శారద మనసు, మెదడు మండిపోతున్నాయి. ప్రపంచానికి సోవియట్‌ రష్యా ఒక ఆశాజ్యోతి. ఆ జ్యోతి ఆరిపోకూడదు. బ్రిటిష్‌ ప్రభుత్వం వెయ్యి చేతుల రాక్షసి. దాని చేతులు నరకకుండా ఆ చేతులకు ఆయుధాలు అందించే పనికి పూనుకోకూడదు.
అసలీ యుద్ధమేమిటి? దీనినెలా అర్థం చేసుకోవాలి?
అగ్ర నాయకులందరూ సమావేశమయ్యారు. రోజుల తరబడి చర్చలు జరిగాక జోషిగారు తన వాదనతో అందరినీ ఒప్పించగలిగారు.
‘‘ఇది ప్రజా యుద్ధం’’ అన్నాడాయన.
సోవియట్‌ రష్యా యుద్ధంలోకి రాకముందు, ఇది సామ్రాజ్యవాదుల మధ్య పంపకాలు, దోపిడీల కోసం జరిపిన యుద్ధం. కానీ ఇప్పుడా స్వభావం మారింది. హిట్లర్‌ సోవియట్లను మింగదల్చుకున్నారు. అది ప్రపంచ ప్రజలందరికీ హాని చేస్తుంది. సోవియట్‌ యూనియన్‌లో ప్రజలు యుద్ధానికి దిగారు. ఆ ప్రజలకు తోడు మనం. ప్రజా యుద్ధం మన యుద్ధమే.
మాటలే మంత్రాలు. మాటలకు మంత్రశక్తి ఉంటుంది. వాటిలో ఉన్న భావానికీ, వాటిని విన్నవారికీ మధ్య ఒక గొప్ప సమన్వయం కుదురుతుంది. ఇక వాళ్ళు ఆ మాటలకు మంత్రముగ్ధులైపోతారు, వశులైపోతారు. ‘‘ప్రజాయుద్ధ’’మనే మాట కమ్యూనిస్టులలో అనేకమంది మీద మంత్రంలాగే పనిచేసింది.
శారదకు మాత్రం అది ఒక పట్టాన కొరుకుడు పడలేదు. యుద్ధంలో బ్రిటిష్‌ వాళ్ళకు సహకరించటం ఆత్మహత్యా సదృశ్యమనిపించింది. ఇన్నాళ్ళూ ప్రజల్లో యుద్ధ వ్యతిరేకతను ప్రచారం చేసి, ఇప్పుడు హఠాత్తుగా యుద్ధానికి అనుకూలంగా మాట్లాడటమెట్లా! వాళ్ళకేం చెప్పాలి? ఎలా చెప్పాలి? శారద చాలాసేపు వాదించింది. కానీ ఫలితం లేదు. మెజారిటీ సభ్యులు ‘‘ప్రజాయుద్ధం’’లో పాల్గొనటానికి సిద్ధమైపోయారు. శారద మద్రాసు వెళ్ళి మూర్తితో మాట్లాడిరది. మూర్తి కూడా అది ప్రజాయుద్ధమనే అంగీకరించాడు. సోవియట్‌ రష్యా ప్రజలు హిట్లర్‌నెదిరించి చేస్తున్న యుద్ధం, పోరాటం, భారతదేశంలో అసమాన త్యాగాలుగా కీర్తిస్తున్నారు. స్టాలిన్‌ తిరుగులేని కమ్యూనిస్టు నాయకుడిగా ప్రజల హృదయాలలో ముద్ర వేసుకుంటున్నాడు. శారద పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి ప్రజాయుద్ధ భావనను అంగీకరించింది. సోవియట్‌ రష్యా ప్రభుత్వమూ, ప్రజలూ ప్రదర్శిస్తున్న సాహసం గురించి ఆమెకెలాంటి సందేహమూ లేదు. కానీ ఆమె మనసులో ఎంతో సంచలనం. జ్ఞానం వచ్చిన నాటినుంచీ ద్వేషించి వ్యతిరేకించిన బ్రిటిష్‌ పాలకులతో సహకరించాలంటే ఆమె భరించలేకపోతోంది. కానీ అది మింగేసి ప్రజలందరితో ఆ మాట చెప్పాలి. ఎలా చెప్పటం? చెప్పక తప్పదన్నది కమ్యూనిస్టు పార్టీ.
సూర్యంతో తన వ్యథనంతా పంచుకుంది. సూర్యానికి అక్క బాధ బాగా అర్థమైంది. పార్టీని కాదని ఆమె కానీ, తను కానీ ఏమీ చెయ్యలేరనీ తెలుసు. అక్కని అర్థం చేసుకోగలడంతే.
బెజవాడలో బహిరంగసభ పెట్టి ప్రజలకు ప్రజాయుద్ధ భావన గురించి వివరించే పని పార్టీ శారదకే అప్పచెప్పింది. శారద మనసులో ద్వైదీ భావం పోయిందా లేదా? పూర్తిగా పార్టీ లైనుకి కట్టుబడిరదా లేదా అన్నది తేల్చుకోవాలని కొందరు సభ్యులు ఆతృత పడుతున్నారు. శారదలో ఏ మాత్రం బలహీనత కనబడినా దాని ఆధారంగా క్రమశిక్షణా చర్యలు చేపట్టాలని వారి కోరిక. శారద ఒక ఆడదనే సంగతి వాళ్ళకు అనుక్షణం గుర్తొస్తుంది. శారద చదువువల్లా, చిన్నతనం నుంచీ ఉద్యమాల్లో భాగమవటం వల్లా, కమ్యూనిస్టు తొలి తరం నిర్మాతలలో మొదటి స్త్రీ కావటం వల్లా, తన ఇల్లుని పార్టీ కేంద్రంగా చేసి, తన సంపాదన లెక్కచూడకుండా పార్టీకి ఖర్చు పెట్టటం వల్లా, పార్టీ తప్ప ఇక వేరే కుటుంబం లేకుండా బతకటం వల్లా, మార్క్స్‌, ఎంగెల్స్‌ రచనలు అర్థం చేసుకుని వివరించగల శక్తివల్లా, శారదను అగ్రనాయకురాలిగా అంగీకరించక తప్పదు వారికి. జనంలోకి, స్త్రీలలోకి చొరవగా చొచ్చుకుపోయే స్వభావం వల్లా, ఇతరులకు ఏ ఆపద, అవసరం వచ్చినా నేనున్నానంటూ దూకే స్వభావం వల్లా శారదంటే ప్రజల్లో విపరీతమైన అభిమానం. దానివల్ల ఆమెకు పార్టీలో కొందరు వ్యతిరేకులు తయారయ్యారు. కొందరికైతే వారికే తెలియకుండా అంతరాంతరాల్లో శారదంటే వ్యతిరేక భావం పెరుగుతోంది. ఆమె చొరవను, ఒక ఆడదానికి ఉండకూడని లక్షణంగా వాళ్ళు భావించేవారు. పురుష నాయకులతో సమానంగా తిరుగుతూ, వారి భుజాలపై చేతులు వేసి మాట్లాడుతూ, బెరుకన్నది లేకుండా ఉండే ఆమె తీరు వారికి నచ్చదు. పెళ్ళి చేసుకోలేదు. ఎవరినో ప్రేమించింది. రకరకాల పుకార్లు. వీటన్నిటితో ఆమెమీద వారికే తెలియని వ్యతిరేకత. జ్ఞానం కలిగిన స్త్రీని, మేధావి అయిన స్త్రీని, నాయకత్వ లక్షణాలు కలిగిన స్త్రీని సహించి భరించగలిగిన స్థితిలో ఉండే పురుషులు చాలా తక్కువ. అలాంటి స్త్రీలూ తక్కువమందే కానీ జాతీయోద్యమం కొందరినైనా అలాంటి స్త్రీలను తయారుచేసింది. వాళ్ళు తయారయ్యారు. వాళ్ళను ఎప్పుడెలా అణిచివెయ్యాలా అనే తత్వమూ తయారైంది. నాయకులుగా ఎదగాల్సిన అనివార్యతకు, నాయకులుగా తమను సహించలేని పురుష ప్రపంచానికీ మధ్య శారదలాంటి మహిళలెందరో నలుగుతున్నారు.
1942వ సంవత్సరం నాటికి కమ్యూనిస్టులంతా దాదాపు బహిరంగంగా పనిచేస్తున్నారు. ఆ రోజు శారదకు పరీక్ష. బెజవాడలో బహిరంగ సభ నిర్వహణ బాధ్యత ఆమెదే.
‘‘జనం వస్తారంటారా?’’ అడిగింది తనతో పాటు ఆ సభలో మాట్లాడాల్సిన సుబ్బారావుని.
‘‘చూద్దాం. ఎంతమంది వస్తే అంతమందితోనే’’ అన్నాడాయన. శారద కమ్యూనిస్టు పార్టీ తీర్మానాలు, డాక్యుమెంట్లు వీటికంటే సోవియట్‌ యూనియన్‌ నాజీలను ఎదుర్కొంటున్న తీరూ, నాజీల దుర్మార్గం గురించి వివరించాలనుకుంది. నాజీల మీద ప్రజలకు ద్వేషం కలగాల్సిందే. ఫాసిజం ఏ మూలనున్నా ప్రపంచానికి కీడేగాని మేలు జరగదు. ఆ కీడుని ప్రజల చేత గుర్తింపు చేయటంలో తప్పులేదు. దానిమీద కేంద్రీకరించి మాట్లాడాలనుకుంది.
కానీ ప్రజలెంతమంది వస్తారు? కాంగ్రెస్‌ వాళ్ళొచ్చి మీటింగ్‌ భగ్నం చేస్తారా? రాళ్ళు వేస్తారా? సందేహాలున్నా ముందుకి దూకక తప్పదు. సాయంత్రం అన్సారీ పార్కులో మీటింగ్‌ దగ్గరున్న జనాన్ని చూసి శారద నిట్టూర్చింది. ఫరవాలేదు… మూడొందల మంది దాకా ఉన్నారు. కాంగ్రెస్‌ వాళ్ళూ వచ్చారు గానీ అల్లరి చేయకుండా మర్యాదగానే కూర్చున్నారు. శారదాంబ అంటే వారికున్న గౌరవం అది.
శారద ఏం చెబుతుందో విందామని వాళ్ళంతా వచ్చారు.
శారద గంటకు పైగా ఫాసిస్టు ప్రమాదం గురించి మాట్లాడిరది. ప్రపంచాన్ని ఫాసిజం నుంచి రక్షించుకోవడం ప్రపంచ ప్రజలందరి కర్తవ్యం అని ప్రజలకు అర్థమయ్యేలా మాట్లాడిరది. మీటింగయిపోయాక జనం గ్రూపులుగా విడిపోయి మాట్లాడుకుంటుంటే వింటూ వారి మధ్యగా నడుస్తోంది శారద. పార్కు చివరికొచ్చేసరికి అక్కడ అన్నపూర్ణ నించుని ఉంది. ఆమె కళ్ళల్లో కోపం, నిరసన, అసహనం.
‘‘నువ్వూ వచ్చావుటోయ్‌. రా పోదాం. మా ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం.’’ అంటూ అన్నపూర్ణ భుజం మీద చేయి వేసి లాక్కుపోయింది శారద. ‘‘రా అక్కా, ఇవాళ మా శారదక్క ఎంత బాగా మాట్లాడిరదో విన్నావుగా. కాస్త పొగిడి వెళ్ళు’’ అన్నాడు సూర్యం హాస్యంగా. అన్నపూర్ణ, శారద చేసే రాజకీయ చర్చలంటే అతనికి మహా ఇష్టం. మధ్యలో ఓ మాట కలుపుతూ నవ్విస్తూ వింటుంటాడు. ఇల్లు చేరి సుబ్బమ్మను పలకరించి ఆమె చేతివంట తినేసరికి అన్నపూర్ణ కోపం సగం తగ్గింది. మిగిలిన సగం తగ్గకముందే మాట్లాడాలని…
‘‘మీ పార్టీకి పద్ధతి, పాడూ లేదా’’ అంటూ మొదలెట్టింది.
‘‘ఫాసిజం’’ అంది శారద దానికి తిరుగు లేదన్నట్లుగా.

Share
This entry was posted in ధారావాహికలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.