మారిన ధోరణి -తమ్మెర రాధిక

వడగాలి వరండాలోంచి గుయ్యిమంటూ హాల్లో పడుకున్న పరమేశం గారి చెవుల్లోకి ఈడ్చి కొడుతోంది. మనవలు అటూ ఇటూ ఇల్లంతా పరిగెడుతూ ఆడుకుంటుంటే ‘‘నాయనలూ కాస్త పెద్ద దర్వాజా ఓరగా వేసి ఆడుకోండిరా, తలుపు తీస్తే వడగాలి ఇల్లంతా సుడి తిరుగుతోంది’’ అన్నాడు నీర్సంగా. ‘‘తలమీద కాస్త తడిగుడ్డ వేసుకోకూడదూ… చల్లటి నీళ్ళు తాగారుగా ఇంకా ఉడుకు తగ్గలేదూ… పిల్ల మూకనలా అదిలించకపోతే దగ్గర కూచోబెట్టుకుని ఏవయినా నేర్పరాదూ…!’’

కామాక్షి యధాలాపంగానో… అనాలనేనో… నిరాసక్తంగానో ఒక మాట పడేసింది తడిబట్ట మీద వత్తి గిల్లుతూ. మనసాలను ఆనుకొని వంటగది ఉంది, ఆ గడప మీద దిండు పెట్టుకుని తడి బట్ట పర్చుకుని దానిమీద పడుకొని ఉందామె.
‘‘మిడి మిడి ఎండ నిప్పులు చెరుగుతోంది. కాసేపలా నడుం వాల్చాలి గానీ ఈ గాలి మూకనేసుకుని ఏం నేర్పుతాం… ఏం నేర్చుకుంటారు?’’ విసనకర్ర మీద నీళ్ళు జల్లుకుని దులిపి విసురుకుంటూ అన్నాడు.
‘‘ఉక్క పోత బాగా ఎక్కువగా ఉంది. వైశాఖ మాసం వెళ్తూ తుదకు నాలుగు చినుకులు విదిలిస్తే బాగుండు కాలం.’’
కామాక్షి మాటలకు ఆయన మెదలకుండా ఊరుకున్నాడు.
వాళ్ళ వంటింటికి పడమటి వాకిలి ఉంది. అక్కడ మెట్టు దిగితే పెరడు, కాస్త దూరంలో మంచి నీళ్ళ నుయ్యి, దాన్ని ఆనుకొని దొడ్డి వాకిలి. దాని తలుపు ఎప్పుడూ తాళం వేసే ఉంటుంది. ఎందుకంటే అక్కడినుండి గోదారి పాయ ఒకటి కాస్త దూరంగా పోతూ
ఉంటుంది. అత్తగారి మాటలు వింటూ వంటింటి పెరడు వాకిలిలో కుంపటిని కొబ్బరి పీచుతో వెలిగించి విసుర్తూ ఆపసోపాలు పడుతోంది ద్రాక్షాయణి. చిరాకు, కోపం అంతా టపటపమని విసనకర్ర శబ్దంతో కలిసిపోయాయి.
‘‘ఈనగారికి ఇప్పుడే ఆకలి కావాలీ! నా ఖర్మ కాకపోతే, ఎలక్షన్‌ డ్యూటీ అయిపోయి ఇంటికొస్తూ దార్లో తిని రావచ్చుగా! అబ్బ…బ్బ… ఈ ఎండలో మినపట్టు తింటాననటం ఇదో విపరీతం. ఇప్పుడు కుంపటి రాజెయ్యంగానే పిల్ల మూకంతా ఇక్కడే వాలి నా ప్రాణం తియ్యరూ అట్టు పెట్టమనీ… ఏం సంసారమో ఏమిటో… ప్రతి వాళ్ళకీ పంతాలూ పట్టింపులూ… నాకే ఏం లెవ్వు… గ్యాసు మీద నిమిషంలో వండుతానంటే మినపట్టూ, వంకాయ పూర్ణం రెండూ ఆయనకు కుంపటి మీదే కావాలంటారు. ఈ ఎండాకాలంలో మిట్ట మధ్యాహ్నం కుంపటి వంటంటే మాటలా! వేసవి సెలవులకని ఆడపడుచు కొడుకూ, తన అన్నయ్య కొడుకూ వచ్చారు. వీరితో పాటు తన కొడుకులిద్దరూ కలిసి రోజూ ఇల్లు పీకి పందిరేస్తుంటిరి. ఎన్నని సవరించుకుంటూ రాగలదు తనొక్కత్తీ…’’ ఆలోచన ఆపేస్తూ పెనం మీద అట్టు వేసింది. మూకుడు సుయ్యి మంటంతో పిల్ల గుంపంతా కుంపటి దగ్గర చేరిపోయారు. ఈలోపు రామారావు చల్లని నీటితో మొహం తడుపుకుని వచ్చి కుంపటి ముందు పీట వాల్చుకుని కూర్చున్నాడు.
ఈ ఎండకు కుంపటి తిండేంటి మీ పిచ్చిగాకపోతే. ఇప్పుడీ పిల్లలందరికీ నేను అట్లూ జుట్లూ వేసివ్వలేను. హాయిగా నూతి పక్కనున్న కొబ్బరి చెట్టుకున్న గెల తెంపించి నీటి తొట్లో పడేయిస్తే అందరం తలా ఒకటో, రెండో తాగేవారంగా అంది ద్రాక్షాయణి.
అది నిజమే అన్పించింది రామారావుకి. ‘‘సరే… సరే ద్రాక్షా! నేను కాయలు దింపించే పనిలో ఉంటాను. వీళ్ళందరూ అవి త్రాగే పనిలో ఉంటారు. నువ్వు మటుకు నాకు అట్లేసే పనిలో ఉండు’’ నవ్వుతూ పెరట్లోకి నడిచాడు. ఎండాకాలం ఉక్కబోతకు వడగాలులకు పిట్టలు రాలినట్టు రాలుతున్నారు జనం. ఈనగారికేమో అట్లూ జుట్లూనూ. ఏదో మాతోపాటు ఇంత చారూ అన్నమూ తిని ఉండరాదూ… విసుక్కుంది ఆమె మనసులో. పెరట్లో ఒక మూలకు చిన్న పాక ఉంది. దాన్లో ఆవు మనుష్యుల సందడికి తాడు గుంజుకుంటూ అరుస్తోంది.
నీళ్ళు పెట్టాలేమో, నిద్రపట్టక ఒళ్ళంతా చిట చిట లాడుతూ చెమటతో తడుస్తుంటే విసనకర్ర పక్కన పారేసి లేచాడు పరమేశం, ఆవుకు నీళ్ళు పెట్టి మేత వేద్దామని. ఊరంతా అద్దం పరిచినట్టుగా ఎండ విశ్వరూపం చూపిస్తోంది. భూమ్మీద ఎక్కడా గడ్డి పరకంటూ మొలక ఆనవాలు లేకుండా పోయింది. చెట్లు మోళ్ళయి పక్షులకు నిలువ నీడ లేక గుడి ఆవరణలోనూ, పోస్టాఫీస్‌ పెంకుల క్రిందా దాక్కొని అరుస్తున్నాయి. అంతటి ఎండ క్రమంగా సాయంకాలానికి గాలిదుమ్ము రూపం తీసుకుంది.
సాయంకాలం గాలి ఒక్కసారిగా బిర్రుగా వీచడం మొదలుపెట్టింది. మెరుపులు… ఉరుములు… కొబ్బరి చెట్టు మెరుపు వెలుగులో నిప్పు ముద్దలా కనిపిస్తోంది. అది చూసి పిల్లలు భయపడ్డారు. ఆవునూ, దూడనూ పాకలో రాటకు గట్టిగా కట్టేసి వచ్చి తలుపు వేసుకున్నాడు పరమేశం. ద్రాక్షాయణి పిల్లలందరికీ కాస్త వేడన్నం, కాస్త చద్దన్నం కలిపి బేసిన్‌లో కొత్తావకాయ పచ్చడీ, నూనె వేసి కలిపి చేతుల్లో ముద్దలు పెట్టి, అందరూ తిన్నాక పక్కలు వేసి పడుకోబెట్టింది. ఉరుముల శబ్దానికి పిల్లలు భయపడుతుంటే పరమేశం ఆంజనేయ బడబానల స్త్తోత్రం చదివి ధైర్యం చెప్పాడు ఏం ఫరవాలేదు పడుకోండంటూ.
‘‘గాలి వానకు చెట్లకున్న అడుగూ బొడుగూ మామిడి కాయలు రాల్తాయి ఎలాగూ… పొద్దున్నే వాటిని తీసుకురండి. మిక్సీలో వేసి ఉప్పు, పసుపు వేసి పట్టుకుంటే అవి ఎప్పుడైనా పులిహోరకీ, పప్పులోకీ పనికొస్తుంది.’’
కామాక్షి మాటలకు కరెంటు పోయి ఢమాలని పిడుగు పడిరదెక్కడో. కిసుక్కున నవ్వింది ద్రాక్షాయణి. చీకట్లో ఆమె ముక్కు పుడక ధగధగమని మెరిసింది.
‘‘పడుకోబోమే ముందు కూడా తిండియావేనుటే నీకు?’’ అన్న భర్త మాటలకు ‘‘నోట్లోంచి మాట రానివ్వరుగదా… కాచుక్కూర్చుంటారు’’ ఆవిడ పక్క దుప్పటి విసురుగా దులుపుకుంటూ కోపంగా అంది. ‘‘మరే నీ గుణం చూద్దామనీ…’’ ఎకసెక్కెంగా నవ్వాడు.
‘‘అవునవును నిక్కమైన నీలం ఏదో, గాజుపూస ఏదో మహా కనిపెట్టే కంసాలిలాగా…’’ కామాక్షి హేళన చేసింది. వాళ్ళ గోలకు విసుక్కుంటూ ‘‘ద్రాక్షా… కాస్త మంచినీళ్ళు పట్రా!’’ గదిలోంచి కేకేసాడు రామారావు. బతుకు జీవుడా అనుకుంటూ గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుంది ద్రాక్షాయణి. బయట ఇంకా అలానే వాగ్యుద్ధం జరుగుతోంది వాళ్ళకు. కాలం రాత్రి ఒళ్ళోకి జారింది నిద్ర తూగుతో.
పరమేశం జారిపోతున్న ధోవతీని ఒక చేత్తో గట్టిగా పట్టుకుంటూనే మరో చేత్తో పాల చెంబు జాగ్రత్తగా పెరట్లోంచి వంటింట్లోకి తీసుకొచ్చి పెట్టి పంచెను గట్టిగా కట్టుకున్నాడు. కామాక్షి ఎప్పుడు లేచి వాకిట్లో మెట్టా పెట్టిందో గానీ, కంసాలి రాజయ్య పనివాడు కవరు నిండుకు వర్షానికి రాలిపడ్డ మామిడి కాయలు వసారాలో గుమ్మరించి వెళ్ళడం చూసి, దీని బుద్ధి ఇక మారదు అనుకొని, ‘‘మంచయినా చెడ్డయినా ఒకరు నేర్పితే వస్తాయిటే…పుట్టుకతో ఉండాలి గానీ, రాత్తిరి నుంచీ మామిడి కాయల ముచ్చటేనాయే…తెల్లారేటప్పటికి తెప్పిస్తివి…’’ చురక అంటించాడు పరమేశం.
‘‘చాల్లెండి నేర్చుకు పోయారు. ఈ కాయలు వరుగులు చేసి పోస్తే ఎప్పుడంటే అప్పుడు పప్పులో వేసుకుని, చల్ల మిరపకాయలతో, వడియాలతో ఒక పట్టు పడితే అప్పుడు తెలుస్తుంది, రాలిపడ్డ కాయల భోగం’’ అంది పరవశంగా. ‘ఇక ఈవిడ నన్ను చంపుతుంది కాబోలు కాయల్ని తరిగి ఉప్పులో ఊరేయించి ఎండబెట్టించి డబ్బాలో దాచేదాకా’ అనుకుంటూ టీ పెట్టింది ద్రాక్షాయణి. ‘‘మీ అత్తగారు మహారాజ భోగంలో పడనే పడిరదమ్మాయ్‌… ఇవ్వాళ్టి నుంచి వెండి కంచంలో తింటానంటుందేమో జాగర్త!’’
మామగారి కారెడ్డం మాటలకు జవాబివ్వకుండా పెరట్లోని జామ చెట్టు క్రిందికి వెళ్ళింది టీ తాగుతూ. అత్తగారు ఏ వస్తువునూ ఊరికే పోనివ్వదు. కొబ్బరి చెట్టూ, అరటి చెట్టూ పెరటి కల్పవృక్షాలామెకి. పగలు ఏ మాత్రం విరామం దొరికినా కొబ్బరి మట్టలు ఊడబెరికించి చీపుర్లూ, చిన్నపాటి తడకలూ అల్లించి పైసాకో, పరకకో అమ్మడం సాగిస్తుంది. అరటి పిలకలు పెరడంతా నాటించడం, వాటి ఆకులు గుళ్ళో ప్రసాదాలకు పంపడం చేస్తుంటుంది. పైగా ముఖమూ, మాటా కూడా బహు ప్రసన్నంగా ఉంటాయి ఆవిడకు. దాంతో చిన్నపిల్లల దగ్గర్నుంచీ పెద్దల వరకూ వీధిలో అందరూ ఆవిడ మాట వింటుంటారు. అలాగే తెప్పించింది ఆవిడ గాలి దుమ్ము మామిడి కాయలు. ఇవ్వాళ మొత్తం ఆ పనిమీదే ఉంటుంది, ఒకరు చెబితే వినే రకమా!
ద్రాక్షాయణి గబగబ స్నానం చేసి వచ్చి గ్లాసు బియ్యం ఎసరు పడేసి, రెండు అరటికాయలు వేపుడు చేసి, వంకాయలు కాల్చి పచ్చడి చేసి రామారావుకు క్యారేజీ రెడీ చేసి పక్క ఊర్లోని స్కూలుకు పంపేసింది. ఉదయం ఎనిమిది గంటలకే ఎండకు కడుపులో ఎలుకల హడావిడి ఎక్కువైంది పిల్లలకి. అందర్నీ కూర్చోబెట్టి సన్న కారప్పూసలో నాలుగు ఉల్లిగడ్డలు సన్నగా తరిగి పోసి నిమ్మరసం పిండి పేపర్లో వేసిచ్చింది. మావగారు గుళ్ళో పూజారిగా చేస్తూనే ఊర్లో పౌరోహిత్యం చేస్తుంటారు. ఆయన శిష్యుడు భార్గవాచారి వచ్చి గుడికి కావల్సిన సరంజామా అంతా పట్టుకెళ్తాడు. పరమేశం గారు మడి కట్టుకొచ్చాక ప్రసాదం తయారీ పనిలో పడ్డారు. ఏకాదశి, శనివారం వచ్చింది గనుక పులిహోర, తులసి దళాలూ, పచ్చ కర్పూరం, మడిపంచా, అగ్గిపెట్టె లాంటివి గబగబా సర్దుకుని గుడికి వెళ్ళారు. అది చూసి పిల్లలు తామూ వెళ్తామని లేవబోతోంటే బాగా కోప్పడిరది ద్రాక్షాయణి.
‘‘లేచింది మొదలూ ఇరవై నాలుగ్గంటలూ ఇలా వేపుకు తింటుంటే మిమ్మల్ని మీ ఇళ్ళకు పంపేస్తా ఏవనుకున్నారో ఆ… తాతగారెంబడి ఇలానే వెళ్తారా గుడికీ? ఓ స్నానం పాడూ లేకుండా!’’
కోడలి కోపాన్ని అడ్డుకోబోయింది అత్తగారు ‘‘పోనీలేవే! కుర్రకుంకలూ… ప్రసాదం కోసం…’’ అంటూ నవ్వుతూ ‘‘కంఠ స్నానము, కటి స్నానమూ అంటుంటారుగా. కంఠ స్నానం అయినట్టేలే’’ అంది కామాక్షి. ‘‘ఇవ్వాళ శనివారం… మనమే ఇలా తగలబడితే లోకులకేం చెబుతాం?’’ అంటూ పిల్లలు తిన్న కారప్పూస కాగితాలు ఉండ చుట్టి అవతల పారేసి, అందర్నీ నూతి దగ్గరికి లాక్కుపోయింది స్నానాలు చేయించడానికి. కోడలు ఎదురు వాదం పెట్టుకోకుండా వెళ్ళడం చూసి, మామిడి కాయల పని తనకు తప్పదనుకొని ఆ పనిలో పడిరది కామాక్షి.
ఆదివారం పొద్దున్న పూట రామారావు పిల్ల గుంపును పట్టుకుపోయి గోదారి స్నానాలు చేయిస్తానన్నాడు తనకెలాగూ స్కూలు లేదని. ఆ మాట పిల్లలు విని ఒకటే కేరింతలు పోదాం పదమని. పరమేశం అందర్నీ చూస్తున్నాడు. ఇప్పుడు వైశాఖం వెళ్ళే సమయం కనుక గోదారి పాయలో నీరు పెద్దగా లేదు. అందునా పెరటివైపున్న సరుగుడు తోట దాటాక గోదారి పాయ! భార్య ఎలాగూ అడ్డుపుల్ల వేస్తుందని అతనెరుగున్న సత్యమే!
‘‘ఆ నీళ్ళ గోలెందుకిప్పుడు? హాయిగా కథల పుస్తకాలేమన్నా తెచ్చి పడెయ్యక పోయావురా రావుడూ. వాళ్ళకొకసారి ఈత అనుభవం తెలిస్తే గోదారి వదుల్తారా? అందులో మనవైపున్న పాయలో వేసంగిలో కూడా ఏనుగు ఈతకొట్టే నీరుంటుంది మరి!’’ ఎండ పొడ తగలకుండా నుదుటికి చెయ్యి అడ్డం పెట్టుకొని రోట్లో కంది పచ్చడి రుబ్బుతూ అంది కామాక్షి.
‘‘అయితే ఊర్కోమనూ మరీ!’’ సాగదీస్తూ అన్నాడు పరమేశం, వాళ్ళు ఏమంటారో విందామని.
‘‘అంత తొందరయితే ఎలాగూ. కాస్త లోతుగా ఆలోచించవద్దూ. ఈతంటే మాటలా… అదీ ఓ విద్యే. ఒక్క పూటలో వస్తుందా ఏం? పైగా పిల్ల గుంపుతోనాయె. రోజూ వాళ్ళని తీసుకుపోవాలి ఈతొచ్చేదాకా…’’
ఆవిడ మాటలకు అడ్డు వస్తూ ‘‘ఈత పండు సులభంగా నోట్లో వేసుకు తినొచ్చు. పనస తొనలు సాధించుకోవడమే శ్రమ. విద్యరావాలీ, శ్రమ ఉండకూడదూ అంటే ఎలా?’’ అన్నాడు పరమేశం.
‘‘బాగుంది బాగుంది ఊరి పొలిమేరలు దాటని వాళ్ళు కూడా నా మాటలు తప్పు పట్టడమే’’ అంది నిరసనగా కామాక్షి. ఆవిడకు తెలుసు పరమేశానికి ఈతలో ఓనమాలు కూడా తెలియవని.
‘‘ఔను మరి పొట్ట చింపితే అక్షరం ముక్క రానివాళ్ళు కూడా సుద్దులు చెప్పబోతుంటే ఎలా ఉంటుందో తెల్సా?’’
ఆయన మాటకు ఎదురు మరో మాట అనబోతుంటే పిల్లలు పొలోమంటూ వచ్చి రామారావును ఈడ్చుకుపోవడానికి సిద్ధమయ్యారు. చిన్నపిల్లల్లా ఒకటే వాదన, పక్కన ఎవరున్నా పట్టించుకోనితనం చూపే అత్త మామల్ని చూస్తే తెగ విసుగు ద్రాక్షాయణికి. రామారావు గోదారికి వెళ్ళడం కోసం బైటికి అడుగేస్తుంటే ఆమెకు నెత్తిమీద కొండ దింపుకున్నంత హాయిగా ఉంది. ‘‘ఒరే రావుడూ పిల్లలు జాగ్రత్త.. త్వరగా రండి వంట చేస్తాను’’ వెనుక నుంచి కామాక్షి అరుస్తూనే ఉంది వాళ్ళు వెళ్ళేవరకు.
అత్తగారు వంట పనిలో పడితే ద్రాక్షాయణి పిల్లల బట్టలు ఉతికి ఆరేసి భోజనాల వేళకంతా వసారా, పంచా ఒకసారి ఊడ్చి చిరు చాపలు పరిచి, టీవీ పెట్టుకుని కూర్చుంది కాసేపు. ఆమెకీ మధ్యన బస్తీ కాపురం మీద ధ్యాస ఎక్కువవుతోంది. ఈ పల్లెటూళ్ళో, ముసలాళ్ళతో కలిసి బ్రతకడం, ప్రతీ విషయానికీ వాళ్ళ అజమాయిషీలో ఉండడం అనేది కష్టంగా తోస్తోందామెకు.
పిల్లాడి పై చదువుకు ఎలాగూ బస్తీకి మారాల్సిందేగా ఇంకో సంవత్సరం ఓపిక పట్టు అంటాడు రామారావు. భర్త ఉద్యోగరీత్యా మొదట్లో వేరే ఊర్లో ఉన్నా తర్వాత ఈ ఊరు ట్రాన్స్‌ఫర్‌ అయ్యాక ఇక కదల్లేదు రామారావు. రెండో పిల్లాడు ఏడో ఏడుకు వస్తున్నాడు. ఈ మధ్యనే సిరిపురానికి బదిలీ అయింది. రోజూ అతనెళ్ళి వస్తున్నాడే తప్ప, కాపురం ముచ్చట ఎత్తడం లేదు. వెళ్ళడం రెండు గంటలు, రావడం రెండు గంటలు. యాతన పడే బదులు అక్కడే ఉండి పండుగ పబ్బాలకు వస్తే సరిపోతుందని ద్రాక్షాయణి ఆలోచన.
ఒకనాడు భర్తను గట్టిగానే నిలదీసింది. ‘‘మీ మావయ్య గారికి ఊరి పౌరోహిత్యమాయె. జనం గుడికి వచ్చినా రాకపోయినా అడిగేవారు లేరు. కానీ పౌరోహిత్యానికి వెళ్ళకపోతే నాన్నగారు అంగవస్త్రం పరుచుకుని మండువాలో పస్తు పడుకోవాల్సి ఉంటుంది!’’
పెళ్ళానికి తత్వం బోధపర్చాడు రామారావు.
‘‘సొంత ఇల్లూ, పాడీ, కొద్దో గొప్పో గుడి ఆదాయం, ఇహ అత్తయ్యగారు చిట్టుడుకు నీళ్ళల్లో చింతపండు వేసి అద్భుతమైన వంట చేసి పొదుపు చేస్తారు. అయినా అసలు దేనికి భయపడుతున్నారు మీరు?’’ నిగ్గదీసిందతన్ని.
‘‘పెద్దవాళ్ళ కాలం అయిపోయింది. మన పిల్లలు ఎదిగి వృద్ధిలోకి రావాల్సినవాళ్ళు. మనం ఆ రెండు తరాలకూ వారధిలాంటి వాళ్ళం. ఎవర్నీ అడ్డుకోకూడదు. అత్తయ్యగారు వాళ్ళు వచ్చి ఉండలేరు. మనం వాళ్ళతో కలిసి ఇక్కడ ఉండి ఎదగలేం. నువ్వెంత ప్రయత్నం చేసినా ఈ గడ్డ విడిచి మనతో వచ్చి ఉండలేరు ఆ పై నీ ఇష్టం’’
ఖరాఖండిగా చెప్పింది ద్రాక్షాయణి.
‘…………..’
‘‘పూజారిగారని ఊరివారంతా వేయి కనులు పెట్టి చూసుకుంటారు. పర్వతమంత మనిషి, గుడే సర్వస్వంలా
ఉంటారు. ఆయన పలకరింపే జనాలకు నిత్య దీవెన. ఇహ అత్తయ్య సరేసరి, సకలమూ దిద్దుకుపోతూ ఉంటుంది. ఇహ దేనికి మీకు భయం!’’ ఆమెలో అసహనం కట్టలు తెంచుకుంటోంది.
‘………….’
‘‘ఇప్పుడున్న సత్తువ వాళ్ళకు ఇక ముందు ఉండబోదు. వాళ్ళు అప్పుడెలాగూ మన దగ్గరికే వస్తారు. అందుకే మనం వెళ్దామంటున్నాను. అలాగని నాకు వాళ్ళతో ఏం పోరూ పొచ్చెమూ లేదు…’’
భార్య ముక్తాయింపు అతనికి కోపం తెప్పిస్తోంది.
‘‘వింటున్నకొద్దీ బాగానే చెప్తున్నావు సుద్దులు. నీదేం పోయింది? మనం ఈ స్థితికి రావడానికి మా అమ్మానాన్నలు ఎన్ని అవస్థలు పడ్డారో నీకు తెలియదా? చేతిలో పైసల్లేక ఎన్ని అవసరాలు మానుకున్నారో నాకు తెలుసు. కాస్త నాకు ప్రమోషన్‌ వచ్చి జీతం పెరిగి కాయా కసురుకూ చేయి చాచే అవసరం లేదు ఇప్పుడు వాళ్ళకు. కానీ అంతకు మందు సాయంత్రం ఇంటిముందుకు వచ్చే సోడా కాయల బండి వాడి దగ్గర కూడా అరువు తీసుకుని సోడా తాగిన రోజులు ఉన్నాయి వాళ్ళకు తెల్సా?’’
ద్రాక్షాయణి అతని కోపానికి ఆశ్చర్యపోయింది. ఎందుకీ అసందర్భపు మాటలు? తను అంటున్నదేంటీ అతను చెప్తున్నదేంటీ? ఆయన తల్లిదండ్రులే పెద్ద కష్టపడ్డట్టూ, వాళ్ళని భుజాలమీద వేసుకుని తిరగడమే తన ప్రథమకర్తవ్యం అన్నట్లు ఏంటా కోపం?
‘‘మీరిలా మాట్లాడ్డం చూస్తుంటే అసలిక్కడి నుంచి మీకు కదలాలని లేనట్టు తోస్తోంది. అందరం ఇక్కడ ఒక దగ్గరుంటే పిల్లల్ని హాస్టల్లో వేయాల్సి ఉంటుంది. ఆ ఖర్చు ఇబ్బడి ముబ్బడై బ్రతికున్నన్నాళ్ళూ మనకు పరగడుపే. పెద్ద వాళ్ళతో సుఖంగా ఉండలేం, చిన్నవాళ్ళనీ సుఖపడనీయం. ఇలా రోతమారితనంతో ఎంతకాలం?’’ ఆగ్రహంగా లేచిపోయిందక్కడి నుంచి ఆమె.
రామారావుకు అది నిజమే అనిపించినా, భార్య మాటలకు లోలోన ఉడికిపోయాడు. ఈ పల్లెటూళ్లో తల్లిదండ్రులతో ఉండే గౌరవం, వాళ్ళను విడిచి వెళ్తే రాదు. ఎంత పండగ, పబ్బాలకు ఇంటికి వచ్చినా జీవచ్ఛవాల్లా తిరిగే అమ్మా నాన్నలను చూళ్ళేడు తను. ఊరి వాళ్ళ ప్రశ్నించే చూపులని భరించలేడు.
మునుపటికన్నా ఊరి తరహా చాలా మారింది. ఎక్కడా డబ్బులు చులాగ్గా పుట్టడం లేదు. తండ్రికి సంపాదన కూడా ఇదివరకటిలా లేదు. ఊళ్ళో మరో ఇద్దరు, ముగ్గురు పురోహితులు పుట్టుకొచ్చారు. తను ఇక్కడుంటున్నాడు కనుక పాత ఇల్లు పోనీయకుండా తండ్రి ఒకచోటికటు వెళ్తే, తను ఇంకో చోటికి వెళ్ళి సంభావనలూ, కట్నాలూ లాంటి ఏటెడు సామానుతో ఇంటికి తెచ్చేవాడు. మరిప్పుడు తండ్రి ఒక్కడూ నిభాయించుకోలేడు, ఆదాయమూ తగ్గుతుంది. వచ్చే కాసో… వీసమో క్షవరం చేసుక్కూచుంటే వీళ్ళకు మున్ముందు ఎలా గడుస్తుంది? అతని వాలకం, మౌనం చూసి ‘‘మీరు మరీ ఎక్కువ ఆలోచన చేస్తున్నారు. ఊరి గురించి ఆలోచించకండి. ఎల్లకాలం పౌరోహిత్యంపై మనమే ఉట్టి కట్టుకు ఊరేగం. కాలంతోపాటు మనమూ మారాలి. నేనూ ఎక్కడోక్కడ స్కూల్లో చెప్తాను. వేణ్ణీళ్ళకు చన్నీళ్ళలా… నేను చెప్తున్నా వినండి. ఎదుట ఉన్న సిద్ధాన్నాన్ని చెడగొట్టుకోకుండా గుర్తించమంటున్నా’’ అంటూ కాఫీ తెచ్చి ఇచ్చింది తనని తాను సంభాళించుకుంటూ. కామాక్షి పిల్లలిద్దరికీ ఒకే రకం బట్టలు తెప్పించి చొక్కా లాగులు కుట్టించి కొత్త ఊరుకు వెళ్ళేనాడు వేసింది. తల్లి కళ్ళల్లో నీటి తడి కోసం వెతికాడు రామారావు. తండ్రి మొహంలో దైన్యం మూట కట్టుకుంటుందని ఆందోళన చెందాడు. కానీ ఆ రెండూ వాళ్ళ కళ్ళల్లో లేవు. ‘‘ఇన్నాళ్ళూ మీరు బుకాయింపుల మీద నెట్టుకొచ్చారు. వాళ్ళు సంతోషంగానే ఉన్నారు’’ అత్తగారు తనకు పెట్టిన చీర సూట్‌కేసులో పెట్టుకుంటూ వ్యంగ్యంగా అంది ద్రాక్షాయణి భర్తతో. ఇరకాటంలో పడ్డట్టుగా అయింది అతని పరిస్థితి.
కోడలి మాట గదిలోంచి కామాక్షికి వినిపించింది. బైటికొచ్చాక అందరితో ‘‘ఒంట్లో సత్తువ ఉన్నన్ని రోజులూ ఆయనకు వేళకింత వండిపెట్టి కనిపెట్టుకోవడం నా డ్యూటీ. వాళ్ళమ్మా, నాయనా ఆయన్ని అరచేతుల్లో పెట్టుకు పెంచి నాకప్పచెప్పారు మరి’’ అంది.
‘‘ఎన్నటికయినా ఈ చాకిరీ అంటే మొహం మొత్తకపోదా! కొడుకెంబడి పడి ప్రయాణం కట్టకపోదా అని ఎదురు చూశాను. అబ్బే దీని పద్ధతి మార్చుకోదు కదా! దీనికి మొదటినుంచీ అలవాటయ్యే…’’ తనూ నవ్వుతూ చురక అంటించాడు పరమేశం.
‘‘మీకు మటుకూ… సాయంకాలం పూట నులక మంచం వాకిట్లోని వేప చెట్టు క్రింద వేసుకుని వచ్చేపోయే వాళ్ళతో బాతాఖానీ వెయ్యంది పూట గడుస్తుంది. ఉదయాన్నే గోదారొడ్డుకు వెళ్ళి నాలుగు చెంబులు నీళ్ళోసుకుని ఆ మట్టితో ఒళ్ళంతా రుద్దుకోంది. నిద్దర్రాదంటుంటారే కొడుకుతో వెళ్తే ఎక్కడ స్నానం చేస్తారేం?’’ అంది చిరాగ్గా. తల్లిదండ్రుల పరిహాసాలకి రామారావు మొహంలో నవ్వు పూసింది. వీళ్ళిద్దరికీ ఇదో చతురోక్తి! అంటూ తెల్లవారు జామున పారిజాతాలు రాలిపడ్డట్టు కులాసాగా నవ్వాడు రామారావు.
కొడుకును పెరట్లోకి తీసుకుపోయి బొడ్లోంచి చిన్న మూట తీసి చేతిలో పెడుతూ ‘‘పదివేలు కూడేసాను ఈ ఆరునెలల్లో… దాచుకో వాళ్ళ చదువుకు అక్కరకొస్తుంది’’. పరమయ్య కొడుకును దగ్గరకు తీసుకుని హాల్లోకి వస్తుంటే అత్తగారిని ఆనుకొని నిలబడి ఆవిడ నడుం చుట్టూ చేతులేసింది ద్రాక్షాయణి. ‘‘అక్కడ మీరూ.. ఇక్కడ మేమూ.. రెండు గాదు నాలుగు చేతులా సంపాదించాలి. నువ్వన్నట్టు అందరం గంగొడ్డున కూర్చొని దాహం పుచ్చుకుందామంటే ఎలా కుదుర్తుందీ. ఇప్పుడు మనదగ్గరున్నవి ఉద్దరుణలే. ఇక్కడే జీవితం వెళ్ళమారుద్దామని రావుడంటే ఈ డబ్బులు దాచుకో… నేనేం నూరుకు తాగుతానా… మనకూ కాలం కలిసొస్తుందెప్పుడో కొబ్బరి బోండాంలోకి నీరొచ్చినట్టు…’’ అత్తగారు కోడలి జుట్టు సవరిస్తూ చెప్తోంది. పిల్లలు ఇద్దరూ రెండు జంటల్లి కన్నార్పకుండా చూస్తూ ఆశ్చర్యపోతున్నారు. కొడుకుగా అతను స్థిమితపడ్డాడు. కోడలిగా ధైర్యంగా అడుగు బైటికేసింది. వాళ్ళ బస్సొచ్చేదాకా చూసి పెద్ద దర్వాజా వేసుకుని లోపలికెళ్ళాక పరమయ్య కళ్ళు తుడుచుకుంటూ పంచాంగం పట్టుకుంటే, వంటింటి గడపలో చీర మెత్తలాగా చేసుకుని కొంగులో మొగం దాచుకుని కుమిలిపోయింది కామాక్షి!!
నిజమే కదూ!
వెన్నెల మర్రి చెట్టుపై వాలిపోయింది,
చల్లదనాన్ని విస్తృతం చేస్తూ…
ఉద్భవించే కాలం ముగిసిపోయి ఉండవచ్చు
వెలుగు చీకటికి కరుగుతోంది
రేపటి వేకువ కోసం ఇప్పుడే కోయిలల గొంతులను సత్తకు తీసుకుంది గాలి
విషాదకర ఆశ్చర్యం పొందు పరుస్తున్న వార్త ఒకటి
పరిసరాలలో గిరికీ కొడుతోంది
ఆకాశం కనబడటం లేదు!! చల్లని తెలుపు మాత్రమే
నింగి నిండా పరుచుకు పోయిందనేదా విషయం!
దొంగ నవ్వుల కాలం
గాయంమీద పూసే మలాముగా మారితేనే
మహితాత్ముడొకడు జాతికొక యాదిని సృష్టిస్తాడు!
జాము రాతిరి ఆకాశ వీథిలోకి పయనిస్తూ` నేరేడు పళ్ళలాంటి కళ్ళను కదిలిస్తూ
మేత మేస్తున్న భయ భీత జింకను
నెలరేడు నింగిలో గమనిస్తూనే ఉన్నాడు
నెలవంక నుంచీ పూర్ణ బింబం వరకూ వెన్నెల మండుతూనే ఉంది రాత్రంతా!!
హరిణ ప్రాణాలకు చీకటి తెరలు కడుతూ!
కాల బిలంలో నిక్షిప్తమై పోయిన పురాస్మృతులు నెమరేస్తోందేమో!
మరో సంక్షోభపు మజిలీని దాటేదాకా
అడుగులు వేస్తోనే ఉంటుంది మర్రి క్రిందికి
ఆత్మలేని ఈ నిర్జీవ స్థలాల్లో మర్రి ఒక్కటే బాహుబలి
జింకా అక్కడే చేరింది, మృత్యు దళాలు చేస్తున్న కవాతు శబ్దాలకు స్పందిస్తూ
అందుకే వెన్నెల్లో అందమే కాదు
అపమృత్యువూ ఉద్వేగంగానే ఉంటుంది
మర్రి మీద వాలిన వెన్నెలలా!!

Share
This entry was posted in కథలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.