నేను ఒంటరినెట్లవుతా!?! -పి. ప్రశాంతి

కవిత రుసరుసలాడుతూ ఇంటికొచ్చింది. సంతలో ఆక్కూరలు అమ్మడానికి తీసుకెళ్ళిన తట్టని ఒక మూలకి విసిరేసింది. బొడ్లో దోపు కున్న డబ్బుల సంచీ లాగి విసురుగా బల్లమీద పెట్టింది. ఆ విసురుకి కొన్ని నాణాలు కిందపడి ఘల్లుమన్నాయి. కాళ్ళు తపతపలాడిచ్చుకుంటూ వెళ్ళి

ఇంటిముందున్న తొట్లో నీళ్ళు దోసిట్లోకి తీసుకుని పదేపదే ముఖానికి కొట్టుకుంటోంది. ఈ మోతలకి దేవమ్మ బైటికొచ్చింది. ఖాండ్రిరచి ఉమ్మేసిన కవితని చూసి ‘మళ్ళీ ఏదో అయింది’ అనుకుంటూ అదే అడిగింది. చేతిలో లోటాని తొట్లోకి విసిరేసి ఒక్కుదుటున వచ్చి ‘అత్తమ్మా… నేనొంటరినెట్లవుతా?’ అని రోషంగా అంటూ గడపమీద కూలబడిరది. ‘పదే పదే అదే మాట… ఒంటరి మహిళ? నాతో నువ్వు, మామ ఉండగా… నా కూతురు, అల్లుడు… నా కొడుకు లిద్దరూ ఉండగా… నేను ఒంటరినెట్లవుతా?’ అంటూ అరిచింది. దేవమ్మకి అర్థమయింది. చెంబుతో మంచినీళ్ళు తెచ్చి ఇస్తూ అను నయంగా వచ్చి పక్కనే కూర్చుంది.
నీళ్ళు తాగి నిమ్మళించిన కవిత అత్తని చూస్తూ చెప్పటం మొదలెట్టింది. ‘నీ కొడుకు పోయి పదేళ్ళయింది. నా కొడుకులకీ మీసాలు, గడ్డాలొచ్చినాయి. ఇంకా ఏంది నాకీ గోస? ఆడోవడో ఇయ్యాల సంతకెల్లేటప్పటికే తగ లడ్డాడు. రవివర్మకి అందని అందాన్నంట. ఆడు సొంతం చేసుకుంటాడంట! ఒంటరిగా ఎన్నా ళ్ళుంటావ్‌. నీకు తోడవుతా ఒప్పుకో అంటాడు. కసిరికొట్టా. చెప్పు తీసుక్కొడతా అన్నా. పోయా డనుకున్నా. కానీ తిరిగొచ్చేటపుడు ఆటోలకాడ నన్నే చూస్తూ అగుపిచ్చాడు. ఎదవని కట్టేసి కొట్టాల’ అంది కోపంగా.
‘ఇదొకెత్తైతే అమ్మలక్కల కూతలు ఇంకో ఎత్తు. ఆ భారతికైతే అసలు ఇవరం లేకుండా పోయింది. ముప్ఫయ్యేళ్ళు నిండినా చిన్నపిల్లలాగే మాట్లాడతాంది. మొగుడు కనిపించకుండా పోయి ఏడేళ్ళయిందా… పెద్దల్లో కాయితం రాసుకుని మళ్ళీ పెళ్ళి చేసుకోమని ఏనాడో చెప్పా. అందరేమనుకుంటారంటూ నెట్టు కొచ్చింది. ఇప్పుడు ఒంటరిగా అనిపిస్తాందంట. తోడు కావాలంట. అంటే ఇష్టమున్న శీనూతో మాట్లాడ్తా పెళ్ళి చేసేస్కో అన్నా. మిన్నిరిగి మీదపడ్డట్టు భయపడి… ఒద్దొద్దు ఇప్పుడు మళ్ళీ పెళ్ళేంటి. ఇంటి పరువేం కావాల, ఆళ్ళు సస్తామంటారు, ఇయ్యన్నీ ఒద్దు అంటూనే తలకిందకేసుకుని ఎప్పుడన్నా కలిసుంటే సాలక్కా అంటాంది. తెలిస్తే అందరూ కలిసి సంపెయ్యరూ!’
వింటున్న దేవమ్మ ఒక మాటంది. ‘అన్నీ ఉన్నా… అందర్లో ఉన్నా… తోడు కోసం అల్లాడుతున్న ఆ భారతి ఒంటరిది. ఆ ఒంటరితనాన్ని అర్థం చేసుకోపోతే అదెప్పుడో పిచ్చిదైపోతుంది. సచ్చిపోతుంది బలవంతం గానో, గుండాగో…’ అని.
అప్పుడే అక్కడికొచ్చిన జయ అందుకుని ‘పెద్దమ్మ చెప్పే దాంట్లో అర్థముంది. ఇలాంటి విషయాల మీద ఒంటరి మహిళల్తో పనిచేసే సంస్థ ఒకటుంది పట్నంలో. మొన్నీమధ్య ఎవరి ద్వారానో తెలిసి నాకు ఫోన్‌ చేశారు నన్ను
ఉద్ధరిస్తామని’ పెద్దగా నవ్వుతూ అంది. ఇంకా ‘ఏదన్నా దారి దొరుకుతుంది. భారతిని నాల్రోజులు ఎల్లి రమ్మను వదినా’ సలహా ఇచ్చింది జయ.
‘‘మొగుడు పోయి కవిత, మొగుడొదిలేసిన భారతి, అసలు పెళ్ళే వద్దనుకుని ఒంటరిగా
ఉండిపోయిన జయ, మొగుడ్నొదిలేసి వచ్చేసిన ఆ దేవి… ఇలా మనూర్లో రకరకాల పరిస్థితుల్లో ఉన్న ఒంటరి మహిళలు చాలా మందే ఉన్నా రుగా…’’ ఇంకా ఏదో అనబోయింది జయతో పాటే వచ్చిన లక్ష్మి. మధ్యలోనే అందుకుని గయ్యిమంది కవిత ‘ఎన్నిసార్లు చెప్పాలి? అర్థం కాదా? నేను కావాలనుకున్న, నన్ను కావాలను కుంటున్న అందరూ, నా కుటుంబ మంతా నాతో ఉండగా నేను ఒంటరినెలా అవుతా??’
‘సరేసరే వదినా, కోప్పడకు. నువ్వే చెప్పు పోనీ ఏమనాలో. మరి ప్రభుత్వం కూడా పాపం ఈ మహిళలంతా ఒంటరిగా బతుకుతున్నారు, సాయం చేద్దాం అని ఒంటరి మహిళల పెన్షన్‌ కూడా ఇస్తోందిగా. అది తీసుకోవట్లేదా’ అమాయకంగా అంది లక్ష్మి. ఈసారి కస్సుమంది జయ… ‘మేం చెప్పామా మేం బతకలేక పోతున్నామని? నిన్న, మొన్న వచ్చిన ఈ పెన్షన్‌ కంటే ముందు మాలాంటి వాళ్ళు బతకలేదా? బతుకుదెరువు లేని ఆడోళ్ళకి అది చూపిచ్చ మను. అంతేకాని ఎటూ చాలని డబ్బిచ్చి ఒంటరి ఆడోళ్ళని ఉద్ధరిస్తున్నాం అంటూ రాజకీయం చెయ్యొద్దను’ అంటూ ఆవేశపడిరది.
‘అదేం చెప్తుంది, ఎవరికి చెప్తుంది కానీ అసలు ఒంటరి ఇది కాదూ? మొగుడుండీ లేనట్టే. పెళ్ళయీ కానట్టే. పిల్లా జెల్లా లేరు. ఇల్లూ వాకిలీ లేదు. జబ్బుపడున్న అత్త ఏ రకంగానూ సాయం చెయ్యలేదు. అన్నున్నాడా అంటే తిరిగి చూడడు. అటూ ఇటూ ఎవరూలేని ఈ లక్ష్మి పరిస్థితేంటి?’ అన్న దేవమ్మ సానుభూతి మాటలకి లక్ష్మికి దుఃఖం తన్నుకొచ్చింది.
అమ్మానాన్న లేని లక్ష్మిని పదో తరగతిలో బడి మాన్పించి దూరపు బంధువైన, వేణుకిచ్చి పెళ్ళిచేసి చేతులు దులుపుకున్నాడు అన్న. ఆర్థికంగా చితికిపోయి ఆత్మహత్య చేసుకున్న తండ్రి చేసిన అప్పులు తీర్చడానికి ఉన్న అరెకరం అమ్మేశాడు వేణు. ఐటిఐ చేసిన వేణుకి ఇక్క డెక్కడా ఉద్యోగం దొరకలా. వాళ్ళనీ వీళ్ళనీ పట్టుకుని ఎలాగో దుబాయ్‌లో ఉద్యోగమని వెళ్ళాడు, పెళ్ళయిన ఆర్నెల్లకే.
‘మనేద పెట్టుకుని అత్తమ్మ మంచం పట్టింది. రెణ్ణెల్లకో, మూణ్ణెల్లకో ఆయన పంపే డబ్బులు అత్తమ్మ మందులకే సాలవు. ఏడాదిపాటు దాచుకున్న డబ్బులు వచ్చిపోటానికే సరిపో తయ్యంట. వచ్చేటప్పుడు తెచ్చే ఆ నాలుగైదు చీరల్నే మళ్ళొచ్చేదాకా జాగ్రత్తగా కట్టుకుంటా. పొట్టకూటి కోసం కూలిపనుల్కి పోటం తప్ప నాకింకో దారిలేదు. ఎప్పుడో ఏడాదికోసారి వారం, పదిరోజుల కోసం చుట్టం చూపుగా వచ్చే నా మొగుడు ఉన్నాట్టా లేనట్టా? నేను ఒంటరి మహిళనవ్వనా?’ ఏడ్చేసింది లక్ష్మి.
కవిత లేసొచ్చి లక్ష్మిని సముదాయిస్తూ ‘కనీసం ఆ పింఛను పైసలన్నా వస్తే కొంత నిమ్మళంగా ఉంటుందని ఒంటరి మహిళల పింఛన్ని దరఖాస్తు పెట్టిస్తే తనకి పెళ్ళై భర్తు న్నాడు, ఇక్కడ లేకపోయినా బతికే ఉన్నాడు, పైగా ఏడాదికోసారి వచ్చి పోతుంటాడు, ఒంటరి దెట్టవుద్దంటూ తిప్పికొట్టారు. జయ, నేను బతిమాలాం… మాలాంటి వాళ్ళకవసరం లేదు, ఏదన్నా చేసి లక్ష్మికి ఇప్పించమని ఎంతో అడిగాం. వింటేనా! రూల్స్‌ ఒప్పుకోవని గెంటేశారు. ఎవరికోసం పెడ్తారో ఈ రూల్స్‌’ వాపోయింది.
నిజమే కదా! అన్నీ ఉండి, అందరూ ఉండి కూడా భర్త పోయిన మహిళని ఒంటరి మహిళ అనాలా? ఇష్టపూర్వకంగా పెళ్ళొద్దనుకుని, స్వతంత్రంగా జీవించాలనుకున్న మహిళల్ని ఒంటరి మహిళలు అనాలా? ఏ పరిస్థితుల వల్లో భర్త వదిలేసినా, దూరంగా వచ్చేసినా మరో పెళ్ళి చేసుకోడానికి అవకాశమివ్వని చట్టం, సమాజం ఒంటరితనాన్ని తీర్చగలవా??? భర్త ఉండీ, లేనట్టే ఉండాల్సొస్తున్న లక్ష్మిలాంటి వాళ్ళ ఒంటరితనానికి జవాబేంటి? ప్రత్యామ్నాయ మేంటి?

Share
This entry was posted in పచ్చి పసుపు కొమ్ము. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.