ఎక్కడా…
సొంతంగా నిలబడలేని
వానికే ఎక్కువ ఆరాటం…
పక్క వాళ్ళ దారిని వెతుకుతూ వెళ్ళి
కళ్ళు మూసుకొని తమను తామే పొగుడుకుంటూ…
ఈర్ష్యే ప్రాణంగా పులుముకున్న దేహాలు
పొగడ్తల పొంగులు పొంగిస్తూ
మాడిపోయిన చద్దిమూటల్ని విప్పుతుంటాయి.
……
ఇక్కడ
చిన్న చేపలు పెద్ద చేపల్ని మింగే గాలాలుంటాయి.
ఒడుపుగా అల్లే సుడిగుండాల్లో…
ఒత్తిగిల్లుకు పోతుంటారు కొందరు
……
ఇంతలో…
ఆవగింజల మెదళ్ళు
దండోరాలు వాయిస్తాయి
రాతి పలకల పలకరింపులే… పూల నవ్వులని
పున్నమి మాయ
కావలసిన పువ్వుల్ని ఏరుకొస్తానంటూ బైలెల్తుంది.
ఇదంతా అంగడి మాయే కదా… అంటే
కాదనగలనా!!
……
బరిలో నిలవాలి అంటే
సత్తా ఉండాలి
ఆలోచనా సరళి ఉండాలి
ఆత్మస్థైర్యం ఉండాలి
మొత్తంగా నీకు నీ మీద నమ్మకం ఉండాలి.