స్త్రీవాదం, ఫాషన్‌ : సంక్లిష్ట సంబంధం – ఎ. సునీత

హైదరాబాదులో జరుగుతున్న మిస్‌ వరల్డ్‌ పోటీలు స్త్రీవాద కార్యకర్తల్లో భిన్నమైన భావోగ్వేగాలను కలుగ చేశాయి. ముప్ఫయి ఏళ్ల క్రితమే ఈ పోటీలు స్త్రీలని వస్తువులుగా మార్చి మార్కెట్‌లో కొత్త ఉత్పత్తులని అమ్ముకోవటానికి వాడుకుంటాయంటూ వ్యతిరేకించిన చరిత్ర ఒక పక్క, అది మూడు దశాబ్దాల్లో తారా స్థాయికి చేరుకున్నప్పటికీ ఇప్పటి తరం వాళ్లకి అది ఏ మాత్రం సమస్యగా కనిపించకపోవడం మరో పక్క, రెండు వాస్తవాలు ఇప్పుడు మన ముందున్నాయి.

బెంగుళూరులో అప్పుడు మనతో పాటు ఈ పోటీలని మన సంస్కృతికి విరుద్ధమైన పాశ్చాత్య సంస్కృతిని దేశంలోకి తెస్తున్నాయంటూ వ్యతిరేకించిన హిందూత్వ గుంపులు ఇప్పుడు లేవు. కష్టపడి వారి నుండి మన వాదనలని విడదీసి అప్పుడు చెప్పుకున్నాం కానీ వస్తు సంస్కృతి ప్రబలిన కాలంలో పెరిగి పెద్దయిన ఈ తరం స్త్రీలు, పురుషులు, స్త్రీవాదులకి మన వాదనలు అర్ధమవుతున్నాయా? మన నిరసనలని చూసి స్త్రీవాదం అందం, ఫ్యాషన్‌, అలంకరణలకి వ్యతిరేకులనే అభిప్రాయం రావొచ్చు కదా? ఫ్యాషనబుల్‌గా వుండే స్త్రీలు స్త్రీవాదులు కాలేరా? ఫ్యాషన్‌ రంగంలో, అది మోడలింగ్‌ కావచ్చు, దానితో పాటు అందం, అలంకరణ, ఫ్యాషన్‌ ముఖ్యమైన టెలివిజన్‌ రంగం, సినిమా రంగం ఇవన్నింటిలో పని చేసే ఆడవాళ్ల గురించి స్త్రీవాదులుగా మన దృక్పధం ఏమిటి? వాళ్ళు వస్తు సంస్కృతి ప్రధాన రంగంలో వున్నారు కాబట్టి వాళ్ళని మనం బాధితులుగానే, అంటే, తామేం చేస్తున్నారో తమకి తెలియని వాళ్ళుగా, తమకంటూ ఆలోచనలు లేని వాళ్ళుగా చూద్దామా? అసలు వాళ్ళ పరిస్థితులు, జీవితం, దృక్పధాలు ఎట్లా ఉంటాయి? ఈ ముప్ఫయి ఏళ్ళల్లో స్త్రీవాదులుగా మన బట్టలు, అలంకరణ, ఫ్యాషన్‌ మారలేదా? మునుపటి లానే ఉన్నాయా?
ఢల్లీిలోని జాగోరి సంస్థలో అనేక సంవత్సరాలు పని చేసి, అందాల పోటీలని యుక్త వయసులో వ్యతిరేకించిన మంజిమా భట్టాచార్జ్య తన మానెక్విన్‌: ఫ్యాషన్‌ రంగంలో పని చేసే స్త్రీలు (2015) పుస్తకంలో ఈ క్లిష్టమైన ప్రశ్నలకి సమాధానం వెతికే ప్రయత్నం చేస్తారు. ఫ్యాషన్‌ రంగంలో పని చేసిన 30 మంది స్త్రీలతో వాళ్ళ నేపధ్యం, మోడలింగ్‌ రంగంలో చేసే పని, వారి నిజ జీవితానికి, పని స్థలానికి మధ్య వుండే అంతరాలు, కుటుంబ జీవితం, పని స్థలాల్లోని సమస్యలు, ట్రేడ్‌ యూనియన్‌ ఏర్పాటు చేసుకునే ప్రయత్నాలు, ఎదుర్కొనే లైంగిక వేధింపులు, శరీర ఆరోగ్యం గురించి లోతయిన చర్చలు చేసి, తెలుసుకున్న విషయాలని స్త్రీవాద దృక్పధంలో విశ్లేషిస్తారు. చదివే వారిని తనతో పాటు వారి జీవితాల్లోకి తీసుకెళ్లి వారి ప్రపంచాన్ని, ఆశలని, ప్రయాణాన్ని అర్ధం చేయిస్తారు.
2005లో తన డాక్టరల్‌ ఫీల్డ్‌ వర్క్‌ కోసం ఫ్యాషన్‌ రంగంలో పని చేసే వారిని కాంటాక్ట్‌ చేసినప్పుడు, వాళ్ళు ‘మీ స్త్రీవాదులు మా పైన నైతిక తీర్పులు ఇస్తారు’ అంటూ రచయిత్రిని కలవటానికి ఇష్టపడలేదు. ఆ రంగంలో పని చేసే స్నేహితుల బంధువుల ద్వారా మొత్తానికి లాక్మే ఫ్యాషన్‌ వీక్‌లో ప్రవేశం సంపాదించిన తనకి వేరే ప్రపంచమే కనిపించిందని మంజిమ అంటారు. దేశంలో జరిగే రెండు పెద్ద ఫ్యాషన్‌ వీక్‌లలో ఒకటైన ఈ ఫ్యాషన్‌ వీక్లో రోజుకి 10 రాంప్‌ షోల పైగా దాదాపు 90 పైగా డిజైనర్లు తమ కొత్త డిజైన్ల దుస్తుల్ని చూపెడతారు. ఇండియాలో ఇలాంటి ఫ్యాషన్‌ వీక్స్‌ ఇప్పుడు అనేకం ఉన్నాయని, ఈ పరిశ్రమ ఇప్పుడు మల్టి బిలియన్‌ డాలర్ల పరిశ్రమ అని చెప్తారు. డిజైనర్ల దుస్తులకి మోడల్స్‌ శరీరం ఒక కాన్వాస్‌. ప్రతి వాళ్ళ దుస్తులకి అనువుగా తయారవటానికి గంటల తరబడి ఒకే స్థలంలో మేకప్‌ చేస్తుంటే, బరువైన విగ్గులు పెట్టుకుని గంటల పాటు కదలకుండా నుంచోవాలి. ప్రతి షో కోసం మేకప్‌, విగ్గులు మార్చుకుంటూ వివిధ డిజైనర్లు తయారు చేసిన దుస్తుల్ని రాంప్‌ మీద తొణక్కుండా నడిచి ప్రదర్శించాలి. ఈ ఫ్యాషన్‌ వీక్‌లలో రాంప్‌ మీద నడవటం ఫ్యాషన్‌ రంగంలో పేరు తెచ్చుకోవాలనుకునే ప్రతి భారతీయ మోడల్‌కి అత్యవసరం. దీనిలో హెచ్చు తగ్గులు ఉంటాయి. పేరు తెచ్చుకున్న మోడల్స్‌కి సౌకర్యాలు, డబ్బు ఎక్కువ లభిస్తాయి. పారిస్‌లో, న్యూయార్క్‌లో రాంప్‌ మీద నడిచే అవకాశం కోసం అందరూ ఎదురు చూస్తారు. అక్కడ పని చేసి వచ్చిన మోడల్స్‌కి ఇక్కడ అవకాశాలు, పేరు పెరుగుతాయి.
అయితే ఇది 1990ల తర్వాతి పరిణామం. మంజిమ ఫీల్డ్‌ వర్క్‌ చేస్తున్న సమయంలోనే గోధుమ రంగు చర్మం రంగు వుండే భారతదేశ మోడల్స్‌కి ప్రపంచ రాంప్‌ రంగంలో పేరొచ్చింది. దీనికి భారత దేశ ప్రపంచీకరణ విధానాలు దారులు వేసాయి. 1970ల నుండి భారతదేశంలో ఫెమినా పత్రిక మిస్‌ ఇండియా పోటీలని నిర్వహిస్తూ ఉండేదని, కానీ దానికి రమ్మని యాదృచ్చికంగా బస్టాపుల్లోనో, ఆఫీసుల్లోనో చూసిన అందమైన అమ్మాయిలకి ఫోన్లు చేసి బ్రతిమాలాల్సి వచ్చేదని ఫెమినా సంపాదకురాలు చెప్తే, ఆ పోటీల్లో గెలిచినప్పుడు మిక్సీ, ఐరన్‌ బాక్స్‌, కిచెన్‌ సామాగ్రి, నగదు వచ్చాయని, గెలిచిన రెండేళ్ళకి పెళ్లి చేసుకున్న తనకి ఇవి పనికొచ్చాయని అప్పటి మిస్‌ ఇండియా చెప్పారు. ఆ రంగంలో కెరీర్‌లు లేని రోజులవి. ఫెమినా కూడా ఇంట్లో ఆడవాళ్లకి వంటలు, ఇంటి అలంకరణతో పాటు కాస్త ఆనందం కలిగించే విషయాలని ప్రచురించేది. సుష్మితా సేన్‌, పొడుగు తక్కువయిన ఐశ్వర్య రాయ్‌ 1994లో ప్రపంచ అందాల పోటీలు గెలవటం మారుతున్న రాజకీయ ఆర్ధిక సంబంధాలకి ఒక సూచిక అయింది.
ఫెమినా రూపం మారిపోయింది. ఎల్లే, ఆ తర్వాత వోగ్‌ పత్రికలూ భారతదేశానికి వచ్చాయి. సరిగ్గా అదే సమయంలో ప్రపంచ దుస్తుల రంగంలో చేతి కుట్టు పనికి, ఇండియన్‌ చేనేత పట్ల ఆసక్తి పెరగటంతో భారతీయ డిజైనర్‌ దుస్తుల రంగం ప్రపంచ దృష్టిలోకి వచ్చి పెద్ద ఎత్తున పెరిగింది. గోధుమ రంగు భారతీయ స్త్రీల అందం ఒక పెద్ద వ్యాపారం, వ్యాపార వనరూ అయింది. మొదట్లో ముఖం పైనే వుండిన కెమెరా శరీరం మొత్తం చూపించటం మొదలుపెట్టింది. ఆ సందర్భంలో భారతీయ మోడలింగ్‌ ని పెంచి పోషించి కూడా ఫెమినా వంటి సంస్థలే. మిస్‌ ఇండియా పెద్ద ఈవెంట్‌ గా మారిన ఈ సమయంలో వచ్చిన వందలాది అప్లికేషన్ల నుండి కొంత మందిని ఎంపిక చేసి వారికి దుస్తులు, మేకప్‌, నడక, ఆహార్యంలో ప్రాధమిక ట్రైనింగ్‌ ఇచ్చి వారిని పోటీలో ప్రవేశ పెట్టేది. ఆ పోటీల్లో అప్పటికే చిన్న చిన్న యాడ్‌లలో నటిస్తున్న వాళ్ళతో పాటు ఎంతో మంది చిన్న చిన్న పట్టణాల నుండి ఈ రంగంలోకి వద్దామనే యువతులు కూడా ఎక్కువే.
అటువంటి యువతుల జీవిత ప్రయాణాలని మంజిమ తన పుస్తకంలో మనకి పరిచయం చేస్తారు. ఉత్తరప్రదేశ్‌, అస్సాంలోని చిన్న పట్టణాలు, ముంబై, ఢల్లీిలలో దిగువ మధ్య తరగతి, శ్రామిక కుటుంబాల్లో పెరిగిన అమ్మాయిలకి అందం, ఫొటోల్లో బాగా కనిపించటం, శరీర సౌష్టవం ఇవన్నీ ఈ రంగంలో ప్రవేశానికి, పైకి రావటానికి భౌతిక పెట్టుబడి. వున్న ఊర్లలో కొన్ని యాడ్స్‌లో నటించిన తర్వాత, ఫ్యాషన్‌ రంగంలో కెరీర్‌ కోసం ఢల్లీి, ముంబయి నగరాలకి రావటం, చిన్న రూముల్లో వుండి, పోర్ట్ఫోలియో తయారు చేసుకుని, యాడ్‌ ఏజెన్సీల చుట్టూ తిరుగుతున్న క్రమంలో, మిస్‌ ఇండియా లేక మిస్‌ గ్లాడ్రాగ్స్‌ వంటి పోటీలలో పాల్గొనటం వాళ్లకి పై మెట్టుకెక్కటానికి పనికొస్తాయి. రాంప్‌ మీద నడవటానికి పొడుగు కాళ్ళు కావాలి, ముఖం మీద, రంగు మీద ఫోకస్‌ కాస్త తక్కువ. సౌందర్య సాధనాల యాడ్స్‌లో నటించటానికి కన్ను, ముక్కు తీరు, పలు వరుస బాగుండాలి. లేకపోతే బాగు చేయించుకోవాలి. అవి టెలివిజన్‌ రంగంలోకి ప్రవేశించటానికి కూడా పనికొస్తాయి. వీటితో పాటు మేకప్‌ చేసుకోవటం, పని క్రమంలో వేసే రంగులు, ట్రీట్‌మెంట్ల నుండి జుట్టుని కాపాడుకోవటం, ఇంకా ముఖ్యంగా మోడల్‌లా కనిపించటం, అంటే పైస్థాయి, వర్గపు అలవాట్లు, ఇంగ్లీషు భాష, ఆహార్యం నేర్చుకోవటం అత్యవసరం. లేకుంటే ఈమె మాకొద్దు అని తమ వ్యాపార ప్రచారం చేసే మోడల్స్‌ కోసం యాడ్‌ ఏజెన్సీ లకి వచ్చే వ్యాపార వేత్తలు తేలిగ్గా చెప్పేస్తారు. బరువు ఏ మాత్రం పెరగకూడదు. పైగా, పని గంటల తర్వాత, ‘క్లయింట్లని ఆనందపరచండి’ అనే వాళ్ళ నుండి జాగ్రత్తగా తప్పించుకోవాలి.
కొరియోగ్రాఫర్లు, ఏజెంట్లు, డిజైనర్లు ఈ ఫీల్డ్‌లో మోడల్స్‌ కెరీర్‌ని పైకి తీసుకెళ్లగలరు, పాతాళంలోకి తొక్కగలరు. తమ కెరీర్‌ ఎంత లాగినా 30 ఏళ్ల వరకేనని ఆ తర్వాత వేరే చోటికి వెళ్లాలని, లేకుంటే రిటైర్‌ అవ్వాలని వాళ్లకి తెలుసు. 40 పైబడి మోడలింగ్‌ రంగంలో కొనసాగే ఆడవాళ్లు చాలా తక్కువ. ఈ అమ్మాయిలో ఆ స్పార్క్‌ పోయింది, ఏజ్‌ కనిపిస్తోంది, బరువు పెరిగింది, పనిచేసే ఉత్సాహం లేదు అంటూ ఎవరయినా రూమర్‌ మొదలుపెట్టినా ఆ మర్నాడే కెరీర్‌ ముగిసిపోయే అవకాశం ఉంటుంది. పని స్థలాల్లో సమస్యలు మామూలే. పని చేయించుకుని డబ్బు లేటుగా ఇవ్వటం, ఎగ్గొట్టడం, చెప్పినంత ఇవ్వకపోవటం జరుగుతూ ఉంటాయి. షూటింగ్‌ అప్పుడు, రాంప్‌పై నడిచేటప్పుడు, ఫ్యాషన్‌ షోలలో మోడల్స్‌ ముందు వెళ్లి హాజరు వేయించుకోవాలి. కొరియోగ్రాఫర్లు తీరిగ్గా వస్తారు. ఓవర్‌ టైం అనేది ఉండదు. కొన్ని సార్లు 24 గంటల షెడ్యూల్‌ ఉంటుంది. బరువు చూసుకోవాల్సిన వృత్తిలో వుండే వీళ్ళకి పని స్థలాల్లో బర్గర్లు, అన్నం, పిజ్జాలు భోజనం ఇస్తారు. వేరే చోటికి వెళ్లి తినే అవకాశం ఉండదు. వేసుకున్న బట్టలు అత్యంత ఖరీదయినవి కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. యాడ్‌ కోసం తాను తెల్ల డ్రెస్సు వేసుకుంటున్నప్పుడు, వేలు తెగితే ముందు డ్రెస్‌ గురించి ఆలోచించి, ఆ షాట్‌ అయ్యేంత వరకూ చేతిని దూరంగా పెట్టానని ఒక మోడల్‌ రచయిత్రికి చెప్పింది. కొంత మంది ఎక్కడ షూటింగ్‌ చేస్తున్నారో చెప్పారు. వెళ్లిన తర్వాత కొండలు ఎక్కాలని అంటారు. సరయిన షూస్‌ వుండవు. తిండి లేకున్నా, ఎంత సేపయినా, షూట్‌లో ఎంత కష్టమయినా నోరు మెదపకుండా పని చెయ్యటాన్నే ఇక్కడ ప్రొఫెషనలిజం అంటారు. అయితే, ఇది రెండు వైపు పదునుండి, వీళ్ళని నియంత్రించే కత్తి.
ఇటువంటి సమస్యల కోసం 2006-07ల మధ్యలో ట్రేడ్‌ యూనియన్‌ స్థాపిద్దామని ఒక ప్రయత్నం జరిగింది. కేరళ నుండి వచ్చిన ఒక మోడల్‌ ఈ ప్రయత్నం చేస్తే అనేక మంది ముందుకొచ్చారు కానీ, చేరిన అందరికీ పని అవకాశాలు వెంటనే తగ్గిపోవటం లేక తగ్గిపోయే వాతావరణం ఏర్పడటం, అందరూ ఒకరికి ఒకరు దగ్గరిగా వుండే పరిశ్రమలో ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడినా సమస్యాత్మకంగా మారటం వల్ల ఆ ప్రయత్నం సంవత్సరం లోపలే నీరుకారి పోయింది. 2000 చివర్లో అంతర్జాతీయంగా పేరున్న ఎల్లే మోడల్‌ ఏజెన్సీ భారతదేశంలో కూడా ఫ్రాంచైజ్‌ పెట్టటంతో వీటిల్లో రిజిస్టర్‌ చేసుకున్న మోడల్స్‌కి కొంత ఈ సమస్యల నుండి వెసులుబాటు దొరికింది. తప్పని సరి కాంట్రాక్టులు, క్లయింట్లని కలవటానికి ఆఫీస్‌, నిబంధనలు ఉల్లంఘిస్తే మరింత ఫీజులు పని పరిస్థితులని నియంత్రించటానికి మోడల్స్‌కి పనికొచ్చాయి. ఈ ఏజెన్సీని నడిపేది రిటైర్‌ అయిన సీనియర్‌ మోడల్‌.
సమస్యలు ఉన్నప్పటికీ ఈ రంగంలో వుండే గ్లామర్‌, గుర్తింపు, డబ్బు, కీర్తి, ప్రయాణాలు ఇవన్నీ తమకి నచ్చుతాయని కూడా మోడల్స్‌ అందరూ రచయిత్రికి చెప్పారు. పేపర్లలో, మాగజీన్లలో, రోడ్ల మీద హోర్డింగ్స్‌ పైన తమ ఫోటోలు వచ్చినప్పుడు, స్వంత ఊర్లలో, కుటుంబంలో వారికి గుర్తింపు వచ్చి, మర్యాద పెరిగింది. అయితే, కుటుంబాలతో దాగుడు మూతలు మాత్రం తప్పదు. వృత్తి పరంగా శరీరాన్ని చూపించే యాడ్స్‌ చెయ్యాల్సి వచ్చినప్పుడు, వాటిని కుటుంబాల నుండి దాచాల్సి వస్తుంది. ఎప్పటికైనా బయటికొచ్చి పెళ్లి చేసుకోవాలి అనే కుటుంబ వత్తిడి కొన్ని సార్లు కెరీర్‌లో వాళ్ళని పైకి వెళ్ళకుండా ఆపుతుంది. కొన్ని కుటుంబాలు ఢల్లీి వరకు సరే, పారిస్‌, న్యూయార్క్‌ వెళ్లకూడదని నిబంధనలు పెడతాయి. మరి కొన్ని, ఒక వయసు తర్వాత వచ్చేయాలని అంటాయి. గ్లామర్‌ జీవితాలపై నైతిక తీర్పులిచ్చే ఇరుగు పొరుగు వాళ్ళకి తెలియకుండా కాపాడుకోవాల్సి వస్తుంది.
ఫ్యాషన్‌ రంగానికి మోడల్స్‌ చేసే పని అత్యవసరమైనప్పటికీ, వారి పనిని సృజనాత్మకమైనదిగా ఆ రంగంలో ఎవరూ కూడా గుర్తించరు. సృజనాత్మకత అంతా డిజైనర్లది, కొరియోగ్రాఫర్లది, మోడల్స్‌ కేవలం వారికి కాన్వాస్‌ లేదా మానెక్విన్‌ మాత్రమే నన్న ఒక నమ్మకం ఈ రంగంలో పరుచుకుని ఉంటుంది. సమాజంలో మోడల్స్‌కి ఉద్యోగస్తులుగా, పనిచేసే స్త్రీలుగా గుర్తింపు లేదు. వాళ్ళని కేవలం గ్లామర్‌ బొమ్మలుగా మాత్రమే చూస్తారు. చేసే పనికి ‘పనిగా’ గుర్తింపు లేకపోవటం వల్ల ఫ్యాషన్‌ పరిశ్రమలో, బయటా కూడా ‘గౌరవం’ లేని మనుషులుగా పరిగణించబడుతున్నామని చాలా మంది అభిప్రాయ పడ్డారు. పారిస్‌లో, న్యూయార్క్‌లో మోడలింగ్‌ చేసే ఆడవాళ్లు ఈ రకంగా పరిగణించబడరనీ, వాళ్ళు తమని తాము పనిచేసే స్త్రీలుగా చూసుకోగలుగుతున్నారని అక్కడ ఇతర ఉద్యోగస్తులలాగే వాళ్ళు కూడా పని స్థలం నుండి బయటికి వెళ్ళంగానే సాధారణ జీవితాలని గడుపుకుంటారని అక్కడికి వెళ్లి కొంత కాలం మోడలింగ్‌ చేసిన స్త్రీలు రచయిత్రికి చెప్పారు. మంజిమ ఇతర పని స్థలాల్లో వుండే స్త్రీలతో వీళ్ళని సరి పోల్చి, అందరికీ వుండే ఉమ్మడి సమస్యలని చర్చిస్తారు: వేతనాల్లో వ్యత్యాసం, యూనియన్‌ పెట్టుకునే అవకాశాలు లేకపోవటం, లైంగిక వేధింపులు, కుటుంబ సభ్యులు పని స్థలంలో డిమాండ్స్‌ని అర్ధం చేసుకోలేకపోవటం మొ.వి. ఇంట్లో పనిచేసే గృహిణుల ఇంటి అలంకరణకి, రోజంతా చేసే చాకిరీకి లేని గుర్తింపుకి, మోడల్స్‌ సృజనాత్మకతని గుర్తించని ఫాషన్‌ రంగానికి మధ్య సారూప్యతని కూడా ఎత్తి చూపుతారు. అయితే వీళ్ళని స్త్రీల సాధికారతకు ఉదాహరణగానో, బాధితులుగానో చూడటం కష్టమని కూడా అర్ధం చేయిస్తారు.
మోడల్స్‌ ఎదుర్కునే అతి పెద్ద సమస్య ఇంట్లో, కుటుంబంలో, సమాజంలో దీన్ని ‘గౌరవప్రదమైన పని’గా చూడక పోవటం అంటూ ఎక్కడయితే శ్రమ, లైంగికత, శరీరం కలిసి వుంటాయో మన సమాజం దానికి గౌరవం ఇవ్వటం మానేస్తుందని విశ్లేషిస్తారు. దాన్ని అర్ధం చేసుకోవటానికి ఒక మంచి ఊహా చిత్రాన్ని మన ముందుంచుతారు. ఒక కొలను ఈ చివరి నుండి ఆ చివరి వరకూ స్త్రీలు చేసే పనిని వరసగా ఉంచి, సమాజమిచ్చే గౌరవాన్ని థెర్మోమీటర్‌ ద్వారా కొలిచామనుకోండి. ఒక చివర నన్స్‌ వుంటారు. వాళ్ళు లైంగికతని వదిలేసుకున్న వాళ్ళు. అక్కడ థెర్మోమీటర్‌ ముల్లు కదలదు. కొంచెం ఇవతల కొస్తే, 9 నుండి 5 వరకూ వివిధ ఫ్యాక్టరీల పనులు, ఆఫీసు ఉద్యోగాలు చేసుకునే ఆడవాళ్లు వుంటారు. అక్కడ కూడా థెర్మోమీటర్‌ ముల్లు కొంచెమే కదులుతుంది. ఉద్యోగాల బయట యూనియన్లలో, సామాజిక, రాజకీయ కార్యకర్తలుగా పనిచేసే ఆడవాళ్ళ దగ్గర ముల్లు ఎక్కువ ఊగుతుంది. అది ఫ్యాషన్‌, సినిమా రంగాల కొచ్చేటప్పటికి వేడెక్కి పోతుంది. సెక్స్‌ వర్కర్లు, ప్రాస్టిట్యూషన్‌లో వుండే ఆడవాళ్ళ దగ్గర తీవ్రంగా వేడెక్కి పోతుంది.
ఈ సామాజిక నేపథ్యంలో స్త్రీవాదులు ఈ శ్రమ, లైంగికత, శరీరం కలిసుండే పనిని ఎలా అర్ధం చేసుకోవాలి? ఈ శ్రమలో పాల్గొనే వివిధ రంగాల స్త్రీలు, సెక్స్‌ వర్కర్లు, వ్యభిచారంలో వుండే స్త్రీలు, డాన్స్‌ బార్‌లలో పనిచేసే స్త్రీలు రెండు దశాబ్దాలలో తమ దృక్పధాలని ముందుకి తెచ్చి స్త్రీవాదులు ద్రుష్టి కోణాలని ప్రభావితం చేశాయని రచయిత్రి గుర్తు చేస్తారు. వీరితో పాటు సమాజ మూసల్లో ఇమడని శరీరాలు గల స్త్రీలు, ట్రాన్స్‌ మహిళలు, యువ స్త్రీవాదులు కూడా ఫ్యాషన్‌ తమ ఆత్మ విశ్వసాన్ని పెంచుతుందని, తమకు ఫ్యాషన్‌తో వుండే భిన్నమైన సంబంధాన్ని రచయిత్రితో పంచుకున్నారు. మొదట్లో అందాల పోటీలని స్త్రీలని వస్తువులుగా మారుస్తుందని విమర్శించిన స్త్రీవాదులు కూడా తమకి మంచిగా తయారవటంలో, స్టైలిష్‌గా ఉండటంలో ఆసక్తి ఉందని ఆమెకి చెప్పారు. మంజిమ తనక్కూడా థీసిస్‌ రాసే క్రమంలో కొంత ఫ్యాషన్‌ సెన్స్‌ అబ్బిందనీ, ఇప్పుడు తాను కూడా ఫ్యాషనబుల్‌గా తయారవుతాననీ రాసుకున్నారు.
ఈ పుస్తకంలో మనకి అందం, అందాల పోటీలు, ఫ్యాషన్‌ రంగం గురించి ఒక బ్లాక్‌ అండ్‌ వైట్‌ చిత్రణ లభించదు. ఫ్యాషన్‌ రంగం ఆడవాళ్ళ శ్రమని దోచుకుంటుందనే విమర్శని చేస్తుంది కానీ ఇది మాత్రమే అత్యంత క్రూరమైన రంగమని, ఆడవాళ్ళని మాడ్చి, లైంగికంగా వాడుకుని, వ్యభిచారంలో దింపుతుందనే విమర్శ చెయ్యదు. మంజిమ సెక్స్‌ వర్క్‌ చేసే ఆడవాళ్ళ గురించి కూడా పరిశోధన చేసి ఇటువంటి పుస్తకం రాయటం వల్ల కాబోలు, మధ్యతరగతి నైతికతని పక్కన పెడతారు. స్త్రీవాది కావటం వల్ల ఇతర రంగాల్లో స్త్రీలకి వుండే సమస్యలకి, ఈ రంగంలో వుండే సమస్యలకి సారూప్యతలని మనకి ఎత్తి చూపుతారు. సాధికారం/బాధితులు అనే ద్వివిధ ధ్రువాల నుండి పక్కకి జరిగి, వీరిని కూడా పనిచేసే స్త్రీలుగా గుర్తించాలని సూచిస్తారు. లైంగికత, శరీరం, శ్రమతో కూడిన రంగాల్లో టెలివిజన్‌, సినిమా, ఫ్యాషన్‌, సెక్స్‌ వర్క్‌ రంగాల్లో వుండే స్త్రీలని మెయిన్‌స్ట్రీమ్‌ సమాజం చూసినట్లు గ్లామర్‌ డాల్స్‌గా చూడకూడదని, వారి గొంతులని విని, వారిని కూడా ఇతర దోపిడీతో కూడుకున్న వ్యవస్థలలో పనిచేసే వారి లానే, శ్రామికులు, ఉద్యోగులుగా గుర్తించాల్సిన సమయం వచ్చిందని ఈ పుస్తకం మనకి అర్ధం చేయిస్తుంది.

Share
This entry was posted in ఇంకు పెన్ను. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.