సోషల్ మీడియాలో తన రచనల ద్వారా ఎంతోమంది అభిమానులను సంపాదించుకొని
తను ఎవరో చెప్పకుండా నిశ్శబ్దంగా నిష్క్రమించిన ఓ ఉత్తేజం నిషేధి
ఎప్పుడో కానీ ఓ కవిత నిద్రలేపదు. ఎప్పుడో కానీ ఓ కవిత గుండె గదుల ఖాళీలని పూరించదు. ఎప్పుడో కానీ కొన్ని వాక్యాలు ఆలోచనని రేకెత్తించవు. ఇదిగో ఇప్పుడు దొరికింది అలాంటిదే ఓ కవితలాంటి పిలుపు, మేల్కొలుపూనూ. నిశీధి కవితలో!
ఈమె కవితలలో కనిపించే ర్తీశీఅస్త్ర ఎవ్aజూష్ట్రశీతీం కోసం కనపడిన ప్రతీసారీ ఈ కవితలని చదువుతూంటాను. దానికి మించి అంతకంటే బలమైన ఆవేశపూరిత వాతావరణాన్ని సృష్టించే పదచిత్రాలకోసమూ వెతుకుతుంటాను. ఎక్కడో ఒకటో రెండో కవితల్లో తప్ప ఈమె నన్ను నిరుత్సాహపర్చలేదు. ముఖ్యంగా కవిత్వానికున్న శృంఖలాల్ని తెంచడానికోసమేనన్నట్టుగా రాసే ఈ కవితల్లో శీర్షిక నుంచీ ఎంచుకున్న డిక్షన్ వరకూ తనదైన ఓ ముద్రకోసం తపించకుండా వాడిన డిక్షన్నే మళ్ళీ వాడకుండా ఓ ప్రవాహంలా సాగిపోయే ఈమె కవితల్లో ఓ మాజిక్ ఉంటుంది. పైడ్ పైపర్ ఆఫ్ హామ్లిన్లాగా నిశీధి పైడ్ పైపర్ ఆఫ్ మాడర్న్ పొయిట్రీ!! ఓసారి మొదలుపెట్టాక చివరివరకూ చదవాల్సిందే.
ఓ బలమైన జలపాతాన్ని అనుభూతిస్తుండగా హఠాత్తుగా మనల్నేవరో అందులోకి తోసేస్తే అంతే స్పీడుగా బయటకొచ్చి చూసుకుంటే ఒళ్లంతా ఆ నీళ్ళన్నీ మన ఒంటి మీదే ఉన్నాయన్న ఓ అద్భుత ఫీలింగ్ నుంచి బయటపడ్డానికి కొంచెం సేపు పడుతుంది. దాదాపు అదే అనుభూతి నిశీధి కవితలు.
తన ఓ కవిత ‘‘ఫైట్ ఫర్ లైఫ్’’ లో
‘‘జారిపోతున్న ఇసుకల్లాంటి నవ్వులు ఒడిసిపట్టుకోవటానికి
నిజాల నీడ నుండి పారిపోతూ సూర్యుడి కాన్వాస్‌ని
ఉమ్ముల రంగులతో ఎన్ని సార్లు నింపుతావు ’’
జారిపోతున్న ఇసుకల్లాంటి-ఓ సిమిలీ
నిజాల నీడ, సూర్యుడి కాన్వాస్, ఉమ్ముల రంగూ-ఓ స్ట్రాంగ్ మెటాఫర్
మనక్కనిపించే చాలా కవితల్లో ఇలాంటి ఉపమానాలక్కొదవేమీలేదు. ఐతే ఇదే ఎందుకంత ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే దాదాపు ప్రతీ వాక్యంలోనూ ఇన్నేసి ఉపమానాలున్నా అవి విసుగనిపించక మళ్ళీ ఓ సారి వెనక్కెళ్ళి చదివి గుండెకెక్కించుకుని ఊరేగుతూ నలుగురికీ చెప్పాలనే తపన కలగచేయటంలో నిశీధి ఎఫోర్ట్లెస్ ప్రయత్నం అభినందనీయం.
ఇదే కవితలో –
‘‘మెలుకువగా ఉండు, మగతలని కనుచూపు మేరలో కనబడనివ్వకు
రెప్ప వాల్చే సెకనులోనే నీ అస్తిత్వం మరుగు చేసే రక్కసులున్నాయి ’’
అసలేవరీమె? ఎలా శాసించగలుగుతుందిలా? ఏమిటి తనకున్న ఆయుధాలు? ఒఠ్ఠి మాటల మంత్రమేనా? ఒఠ్ఠిమాటల యుధ్ధమేనా?
కొత్తైనా, కొంతైనా పాతవాసనేమీ లేని ఈ యువతరపు ఫీమేల్ వాయిస్‌కి కావల్సిందేమిటి?
మనచుట్టుపక్కలే ఉన్నా మనమేత్రాం పట్టించుకోని ఇన్ని ఖతర్నాకీలనీ ఎలా ఒడిసి పట్టుకుందేమో కానీ అవన్నీ ఓ నిశీధి శతకంలా మారి మన డెడ్ బ్రెయిన్‌ని ఉరకలెత్తిస్తుంటే మరి ఆమెందుకు తన కలం పేరుని బ్రెయిన్ డెడ్ అని పెట్టుకున్నట్లు? ఆమె కవితల్ని ఇంకొన్ని చదవాల్సిందే!
‘‘అసాధారణ ఆలోచన శబ్దాలు కొన్ని గుప్పిట్లో దాచుకోని
ప్రవహిస్తున్న నీలపు ఆకాశ ప్రవాహం లో మునిగితేలుతూ
ఇంద్రధనస్సు కిరణాలలో సమతత్వపు సమాధానాలు వెతుకు’’
బహుశా మొదటి వాక్యంలో ‘‘దాచుకోని’’ కాదేమో, ‘‘దాచుకుని’’ అనుకుంటా!
ఐనా ఇంధ్రధనుస్సు కిరణాలలోనూ సమతత్వపు సమాధానాలు వెతకమనడంలో ఉద్దేశ్యం మనకి మనమే ఓ అద్దంలా మారి మనలోకి మనమే తొంగి చూసుకుంటే ఏం కనిపిస్తుందో నిర్మొహమాటంగా చెప్పమంటుందనుకుంటాను.
please unlock yourself blatantly and reveal shamelessly
‘‘గత సమస్యల శంకువు తోకచుక్కలా పగిలినప్పుడు
రక్తపర్వతాలు బ్రద్ధలయిన లావాలో నువ్వు మునగకముందే
స్టాగ్నేటేడ్ వాటర్లా వాసన రాకుండా మనసుని కొంచం చలించనివ్వు’’
తోకచుక్క శంకువులా పగలటం కొంచెం అసమంజసమైనా తరువాతి వాక్యపు గాఢతలో అది కొట్టుకుపొతుంది. అలాగే ‘‘స్టాగ్నేటేడ్ వాటర్లా వాసన రాకుండా మనసుని కొంచం చలించనివ్వు’’ ఇదీ కొంచెం బలమైనదే. ‘‘ఆగి వెళ్ళుము’’ అన్న సైన్ బోర్డ్ లాగా మనసు స్టాగ్నేటేడ్ వాసన రాకుండా ఉండాలంటే ఏం చెయ్యాలా అని అలోచింపచేసే కమాండ్మెంట్.
‘‘నీరసించిన హృదయాలతో నీతో పాటు రాత్రి నీడల్లో
చలి ముచ్చట్లు వినే కొన్ని గుండెలని తట్టి లేపు’’ ఈ ముగింపే కాదు కవితలోని మరికొన్ని వాక్యాల్లోనూ విభిన్న భావాలనీ, different trendsని కలిపేసి మరీ అతికినట్లు కుట్టినట్లుగా అనిపించినా పాఠకుడికొచ్చే నష్టమేమీ లేదు. చదవాల్సిన కవిత ఇది అనటంలో నిర్మొహమాటేదీలేదు.
ఇదీ పూర్తి కవిత
నిశీధి !ఫైట్ ఫర్ లైఫ్!
వైవిధ్యపు వైర్ చివర జీవితానికో జడ్జ్మెంట్ డే దొరుకుతుందో లేదో అంటూ
పూల కోసం యే మార్గంలో వెతుకుతున్నావు చీకట్లో
పరిపూర్ణత కోసం ఎన్ని సార్లు పాత మొహాన్నే పగలకోట్టుకుంటూ
అసందర్భంగా యే వాదాన్ని యాచిస్తున్నావు రెస్క్యూ కోసం
జారిపోతున్న ఇసుకల్లాంటి నవ్వులు ఒడిసిపట్టుకోవటానికి
నిజాల నీడ నుండి పారిపోతూ సూర్యుడి కాన్వాస్ ని
ఉమ్ముల రంగులతో ఎన్ని సార్లు నింపుతావు
యుద్ధాలన్నీ శాంతికోసమేనట
ఇంకా మొదలవని యుద్ధాల వెనక
అశాంతి నీడల కదలిక తెలుస్తుందా నీకు
జనోద్దరణ పేరుతో భారీహస్తాల
పెట్రోలు యుద్ధాలు తెలుస్తున్నాయా ?
మెలుకువగా ఉండు, మగతలని కనుచూపు మేరలో కనబడనివ్వకు
రెప్ప వాల్చే సెకనులోనే నీ అస్తిత్వం మరుగు చేసే రక్కసులున్నాయి
నిన్ను శాశ్వత నిద్రకి పంపి నీ ఎముకల పొడితో వ్యాపారం చేసే
నయా వలస వాదం మరోసారి మతం ముకౌటా తగిలించుకొని
నీ రక్తం తాగడానికి సిద్దమయింది
అందుకే
అసాధారణ ఆలోచన శబ్దాలు కొన్ని గుప్పిట్లో దాచుకోని
ప్రవహిస్తున్న నీలపు ఆకాశ ప్రవాహం లో మునిగితేలుతూ
ఇంద్రధనస్సు కిరణాలలో సమతత్వపు సమాధానాలు వెతుకు
గత సమస్యల శంకువు తోకచుక్కలా పగిలినప్పుడు
రక్తపర్వతాలు బ్రద్ధలయిన లావాలో నువ్వు మునగకముందే
స్టాగ్నేటేడ్ వాటర్లా వాసన రాకుండా మనసుని కొంచం చలించనివ్వు
నీరసించిన హృదయాలతో నీతో పాటు రాత్రి నీడల్లో
చలి ముచ్చట్లు వినే కొన్ని గుండెలని తట్టి లేపు
భయాలన్నీ సమూలంగా బహిష్కరించి బ్రతుకు కోసం పోరాడు
