ఓ దిక్కు మాసిపోయిన మూసి కన్నీరు యేరై ప్రవహిస్తుంటే/
మరోదిక్కు బొండికాయ తెగ్గోసిన గుట్టల దుఃఖం/ మండ్రగబ్బలా గుడగుడలాడి భయపెడుతుంటే/
చెమట ఉప్పునీటి దోసిళ్ళతో పల్లీలమ్ముకుంటున్న చెవి తెగిన గెంటీల/
ఖాళీ కీసల సంచిల ఎండిపోయిన సున్నం కాచులు తమలపాకుల జతలేక వెలవెల బోతున్నవి/
పుట్ పాత్లపై గోనెపట్టాల గోతాంలో కుక్కిన దేహం/
కలల విశ్రాంతిలోనూ పట్టెడన్నానికై అర్రులు జాస్తుంటే /
ముత్యాల నగరంలో ముర్శేటి సుందరాంగుల నున్నటి దేహాల తోలుబొమ్మలాట/
బొంబై తమాషా జెర దేఖో భయ్యా !/
నలభై ఏండ్ల గానుగెద్దు చాకిరికి /
పిఎఫ్ ఫండుల జమకాని మొత్తానికి/ కిరనాయిలు డబ్బాతో అగ్గిపుల్ల మాటామంతీ/
నాజూకు స్వప్నసుందరులకు చార్మినార్ తనబ్బీ గూట్ల/
వెలిగించిన మఖ్మలి చాందినీ మహల్లేఖ గాజుల నజరానాలు/
చుడి బజార్ షామియానాల మత్తెక్కించే పహాడిపూల్ అత్తరు గుబాళింపుల స్వాగతాలు /
చౌమహల్లా ప్యాలెస్ నియాన్ బల్బుల మాటున ఆకాశం దించి ఇంద్రధనుస్సును వంచి/
వేస్తున్న చలువ పందిట్లో లక్షరూపాయల థాలీ భోజనాన్ని /
ఆ పల్సటి పేగులు అరిగించుకోలేక వదిలేస్తుంటే/ పాచిన ఆహారానికై చెత్తకుప్పల నీడన వేచి ఉన్న ఆకలికళ్ళు/
ఏమి అందాల పోటీలు ఇవి?/
చెత్త ఊడ్సి నడినెత్తిన ఎండమిటమిటలాడిస్తుంటే/
చెమటకొంగుతో బిడ్డ ముఖం తుడ్సి తల్లిపాలు కుడుపుతున్న /
ఆ సపాయి శ్రామిక మహిళ ముఖంలోని చిర్నవ్వుకు సాటిరావు/
ఏమి అందాల పోటీలు ఇవి ?/
జానాబెత్తెల కొలతల ఫ్రేంలో బిగించిన అతివల రక్త మాంసాలను/
కెమెరా దుర్భిణి కళ్ళతోటి కాటేస్తూ/
అందమంటే ఇదీ అన్న
ట్యాగ్ లైన్లను బిగిస్తుంటే/
అనోరెక్సియా గుప్పిట చిక్కిన కిషోర బాలికల యౌవనాలు/
సత్తువ తగ్గి మనోవైకల్యాల చీకటి నీడన మగ్గుతున్నాయి /
అందమంటే మన అమ్మల ఆత్మ విశ్వాసమని చెప్పరెవ్వరు?/
అందమంటే నిరంతరం నీ పెదవులను వెలిగించే అభిమాన దరహాస విజయచంద్రిక అని చెప్పరెందుకు?/
అందమంటే రోజూ చూసే అద్దాన్ని అడుగు /
తలపై క్రౌన్ లేకున్నా సెల్ఫ్ కేర్ తీస్కునే/
నా ‘‘ఫెయిరీ క్వీన్’’ నీవేనని ముడుతల అద్దం ముద్దుగా నవ్వుతుంది/
