రాజ్యాలు వారి వారి మకుటాలను నెత్తి మీద గట్టిగా పట్టుకుని కూర్చోడానికి చేసే సర్కస్ ఫీట్లలో సాధారణ జనాలకు జరిగే నష్టాలను – అవమానాలు, ఆకలి, ప్రాణాలు, హింస ఇవన్నీ అతిసాధారణంగా చూస్తాయి. పుచ్చు పెట్టిన అధికార మెదళ్ళకు సమాజపు అరలలో దొరికే చిరుతిండ్లు ఎప్పుడెప్పుడు గుంజుకుందామా అనే యావ తప్ప మరేమి కనిపించదు.
ఆ అరల్లో మతం, కులం, జెండర్ ఏమైనా ఉండొచ్చు – అక్కడికి వెళ్లి తమ నియంత్రణని అమలులో పెట్టడమే రాజ్యలక్ష్యం. పౌరుల పట్ల బాధ్యత అనే మాట ప్రదర్శనకు కూడా పనికి రాకుండా పోయింది. నిజానికి ఈ అన్యాయమే ప్రదర్శనగా మారింది. ప్రశ్నిస్తే మళ్ళీ సంస్కృతికి సంస్కరణలకు ముడి పెడతారు.
ఈ బాధంతా ఎందుకంటే ఇటీవల పార్లమెంట్లో విడుదలైన ట్రాన్స్ యాక్ట్ గురించి. ఎన్ని వ్యతిరేకతలొచ్చినా, ఈ యుద్ధ సమయంలో హుటాహుటిన కొన్ని వారలలోనే ఈ బిల్‌ను యాక్ట్‌గా మార్చిన వైనం చుస్తే గతంలో కోవిడ్ సమయంలో తీసుకు వచ్చిన వ్యవసాయ చట్టాలు గుర్తుకొచ్చాయి. సంక్షోభంతో సంబంధంలేని చట్టాలెందుకంటా అని వాపోయే ముందు ఈ చట్టాల వెనుక ఎటువంటి ఆలోచన ఉందో గమనించుకోవాలి. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు, ప్రపంచంపై పెత్తనం చేస్తున్న ఒక అన్యాయపు అభివృద్ధి చెందిన రాజ్య పోకడలు అర్థం చేసుకుని, అక్కడ జలుబు చేస్తే ఇక్కడ తుమ్మే మన రాజ్య బలహీనతలను చూసి జాలిపడాలి.
… … …
ప్రస్తుత ట్రాన్స్ యాక్ట్ ప్రకారం ఒక వ్యక్తి ట్రాన్స్ అని గుర్తింపు పొందాలంటే తమ లైంగికావయవాలను డాక్టర్లకు చూపి నిర్ధారణ పొందాలి. ఆడా, మగాలానే ట్రాన్స్ అనేది కూడా ఒక జెండర్ అయినప్పుడు, వారికి మాత్రమే ఈ ప్రత్యేకమైన బహుమతి ఏమిటో! వారికి ఇచ్చే సంక్షేమ పథకాల కోసమే ఇదంతా జరుగుతుంది అనుకుంటే, ఆ ప్రత్యేక సంక్షేమ పథకాలేమిటో రాజ్యానికైనా తెలుసో లేదో. ఉన్న ఒకటి అరా, కంటితుడుపుగా ఒక బోర్డు పెట్టి రెండు ప్రకటన లతో సరిపెట్టేస్తున్నారు. ఉదాహరణకు మన తెలంగాణాలో చూస్తే పోలీస్ శాఖలో హోంగార్డులు గా ఉద్యోగాలు ఇవ్వడం తప్ప ఒకటి రెండు క్లిని క్కులు (అవి కూడా ఎప్పటికప్పుడు నిలిపి వేయ బడుతుంటాయి) తప్ప ట్రాన్స్ జెండర్ వ్యక్తులకు రాజ్యం చేసిన లాభం ఏమిటో ఎవరికీ తెలీదు.
ఆ లెక్కన మహిళలకు ఇచ్చే సంక్షేమ పథకాలు, లేదా దళిత బహుజన యువతీ యువకులకు ఇచ్చే పథకాలకు ఇటువంటి జెండర్ పరీక్షలు ఉన్నాయా? వారు పురుషులనే లేదా మహిళలనో గుర్తింపు ఏమిటి?
జెండర్ అనేది సామాజిక నిర్మాణం అని, అది స్వయం ప్రకటితమైందని: లింగం (సెక్స్ గుర్తింపు) మాత్రమే శారీరకమైందని రాజ్యానికి ఇంకా తెలీయదా? ట్రాన్స్‌జెండర్ వ్యక్తులు కుటుంబంలో, సమాజంలో ఎదుర్కునే హింస గురించి రాజ్యానికి అవగాహన ఉందా? బతకడానికే సంఘర్షించే ఈ వ్యక్తుల కొరకు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టక ముందే, ఎక్కడ వీరంతా గుమిగూడి అధికార బలాలని ఎదుర్కుంటారో అనే అభద్రతని చూస్తే దుఖ్ఖంగా అనిపిస్తుంది.
అసలు సంక్షేమమేమిటండి? ముందుగా జీవించే హక్కే సరిగ్గా అమలుకాని సందర్భాలలో ఈ అమానవీయ నియంత్రణ దేనికని.
… … …
అడా మగా అని పిలవబడే బైనరీల అస్తిత్వాల పై నియంత్రణ సులభం ఎందుకంటే అది వందల సంవత్సరాలుగా మచ్చిక చేయబడ్డది. ఆడ-మగా మధ్య అస్తిత్వాలు, వారి మధ్య మాత్రమే లైంగిక సంబంధాలు పెళ్లి, కుటుంబం, ఆస్తి అనే వ్యవస్థకు అవకాశం ఉంటే వాటి ద్వారా రాజ్యపు నియంత్రణ హాయిగా సాగుతుంది.
కానీ ఇటువంటి నియంత్రణలు లొంగనిది ట్రాన్స్ అస్తిత్వమే. మరో మాటల్లో చెప్పాలంటే పితృస్వామ్యం విధించిన ఈ చట్రాలలో ఇరుక్కో కుండా విప్లవాన్ని వ్యక్తపరిచేది ట్రాన్స్ అస్తిత్వాలే. దానికి వారిపై ఈ సమాజం విధించే శిక్షలు సాధారణమైనవి కాదు. ఇళ్ళ నుండి వెళ్లగొట్టడమే కాదు, ఘోరమైన శారీరక హింస, కుటుంబ సభ్యులతోనే లైంగిక హింస, అర్థంలేని షాక్ ట్రీట్మెంట్లు, మానసిక అనారోగ్యమనే అవమానాలు, చంపివేయడాల వరకు సాగుతుంది. ఇక ఇంటి నుండి వెళ్లగొట్టబడి, పారిపోయి వచ్చిన వారికి సమాజంలోకి వచ్చాక అవమానాలు, హింస, లైంగిక హింసతో పాటే ఉద్యోగావకాశాలు లేకపో వడం, చదువు ఆగిపోవడం వలన సమాచారం అందుబాటులో లేకపోవడం, ఆరోగ్య సంక్షేమ వ్యవస్థలు లేకపోవడం చివరికి సెక్స్‌వర్క్ లేక అడుక్కోడం మాత్రమే మార్గంగా వదలడం; ఈ పరిస్థితులన్నీ సమాజం రప్పించినవే, ఇంకా చెప్పా లంటే రాజ్యం ఇటువంటి హింసను నిర్మూలించే వ్యవస్థ కొరకు పాటుపడక ఇలా గౌరవాన్ని హరించే మార్గాలు మాత్రమే దిక్కయ్యే పరిస్థితికి తెచ్చింది.
… … …
అసలు ట్రాన్స్‌జెండర్ వ్యక్తులకు ఏ అవయవ భాగాలుంటాయి కూడా అవగాహన లేని అధికార శక్తులతో ఎటువంటి సంభాషణ చేయగలం? ఒకవేళ వీరు చెప్పిన విధంగా ఎవరైనా ఒక ట్రాన్స్ జెండర్ వ్యక్తి ట్రాన్సిషన్ సర్జరీ (సెక్స్ మార్పిడి, లేదా జెండర్ అఫర్మేటివ్ సర్జెరీ) చేయించుకోకపోతే ట్రాన్స్ కాకుండా పోతారా? మరి వారి వద్ద ఆ సర్జరీకి డబ్బులు ఎక్కడ నుండి వస్తాయి. ఒక ట్రాన్స్ వ్యక్తి తమ జీవిత కాలంలో ఐదు సంవత్సరాలు కేటాయించి ఎన్నో లక్షల రూపాయిలను ఖర్చు పెడితే తప్ప ట్రాన్సిషన్ కాలేరు. మరి రాజ్యం వద్ద ఇటువంటి ట్రాన్సిస్టయిన్ను సులభం చేయడానికి ఏదైనా నిధి ఉందా? ఒకవేళ ఉంటే ట్రాన్సిషన్ అవుతున్న ఈ ఐదేళ్ల సమయం వారి జెండర్ ఏమని గుర్తిస్తారు? ఒకవేళ ట్రాన్స్ వ్యక్తి అటువంటి సర్జరీ చేయించుకోనంటే గుర్తింపు కోసం బలవంతగా చేయిస్తారా?
అంటే ట్రాన్సిషన్ కాని ట్రాన్స్‌జెండర్ వ్యక్తులను, ట్రాన్స్ వ్యక్తులు కారని నిర్ధారించడమే ఈ చట్టం చేసే పని. దీనిని చట్టం అనరు, రాజ్యం ఒక సముదాయంపై చేసే వ్యవస్థీకృత అవమానం.
ఈ సమస్య ట్రాన్స్ జెండర్ వ్యక్తులది మాత్రమే కాదు, సరిగ్గా గమనిస్తే సమాజపు ఏదో ఒక అరలో ఇరికించి అణచివేయబడుతున్న మనందరికి వ్యతిరేకంగా ఎన్నో చట్టాలు వస్తున్నాయి. మతం మారినా, కులహింసను ఇంకా ఎదుర్కుంటున్న అణగారిన వర్గాలదో, తమకు నచ్చిన వారిని వివా హం చేసుకోలేని మహిళలదో అనే కాదు; మతాంతర, కులాంతర వివాహాలను చట్టబద్ధం కాకుండా నియంత్రిస్తూ, రేపిస్టులను విజయకేత నాలతో సమాజంలోకి ఆహ్వానించే ఈ రాజ్యపు లక్ష్యం ఒకటే – బ్రాహ్మణీయ భావజాలంలో
ఉండే పితృస్వామ్య సంబంధాల వలన వారి అధికా రాన్ని భద్రతను బలపరచుకోవడం.
ఇది బ్రాహ్మణీయ భావజాలమైన కులానికి, మతానికి, పితృస్వామ్యానికి, మగ పెత్తనానికి, మిగిలిన జెండర్ల పై నియంత్రణకు సంబంధిం చినది- ఆయా వర్గాలకు చెందిన అందరిపై నియంత్రణకు అణిచివేతకు సంబంధించినది.
ఇటువంటి చట్టాలను ఒప్పుకోవడం అంటే మత మౌడ్యాన్ని, కులభావనను సమర్ధించడం, అడ-మగ మాత్రమే మనుషులని మిగిలినవారంతా గుర్తించతగిన వారు కాదని చెప్పడం. గుర్తింపు కోరుకుంటే బట్టలు విప్పి శరీర సాక్షాలను బయట పెట్టడం.
ప్రభుత్వం, పార్లమెంట్, న్యాయస్థానాలు అందరు కలిసికట్టుగా చేసే ఈ వ్యవస్తీకృత అవమానం, వివక్ష, హింస ఏదో ఒకరోజు మనింటి తలుపు కూడా తడుతుంది. ఆ రోజు రాకూడని ఆశిద్దాం.
