కనీ వినీ ఎరుగని జల ప్రళయం
నేపాలమా..!
నువ్వెట్లా కోలుకుంటావో తెలియదు..
మట్టి రేణువులా కొట్టుకుపోతున్న
నిన్ను చూస్తే
హృదయం ద్రవిస్తోంది.!
గుట్టల కొద్దీ విగత జీవులు
మట్టిలో కూరుకున్న దేహ శకలాలు
దుఃఖానికి కారణం చెప్పిన నేల
నేడు నిండా దుఃఖమే .!
ప్రకృతి ఒక్కసారి..
విసిగి వికటించి కన్నెర్ర చేస్తే చాలు..
మనిషి కట్టుకున్న కలలన్నీ
పేక మేడల్లా కూలిపోతాయి.
విచిత్రం కదా..!
జానెడు నేల కోసం, బెత్తెడు నీడ కోసం
మూరెడు హద్దు కోసం
చిన్నెమెత్తు మాట కోసం..
మనిషి మనిషితో తలపడడం
మారణ హోమాలకు తెర లేపడం
పిచ్చితనమే..
కులం కోసం.. మతం కోసం..
పంతాల కోసం
ప్రాణాలని పణంగా పెట్టడం
మూర్ఖత్వం కాక మరేమి!?
ఒక్క గాలి తాకిడికి
గడ్డిపోచలా కొట్టుకుపోయే మనిషి
ఒక్క విపత్తుకి
ఆనవాలు సైతం మిగలని జీవులం ..!
అయినా..
మనలో మనకు ఎందుకీ ద్వేషాలు?
ఎందుకీ ఆధిపత్యాలు?
గాలికి ఆరిపోయే ఈ చిన్ని దీపం
ఎంత కాలం వెలుగుతుందో తెలియదు..
ఉన్న క్షణాల్లో నన్నా
ఒకరినొకరం వెలిగించుకుంటూ ముందుకు
సాగిపోదాం..
