“ఈడెను గార్డెన్లో నువ్వు నేనూ
అరమరికలు లేకుండా తిరిగినప్పుడు
నీ కళ్ళకు నేను స్త్రీగా కనిపించలేదు
మనిషిగానే చూసావు!
రాతిగుహల్లో చలికి ఆకులే దుస్తులైనప్పుడు కూడా
నీ చూపు పవిత్రమేనీ చేతల్లో తేడా ఏమి లేదు..
పచ్చిమాంసాన్ని తిని
యథేచ్ఛగా మనిద్దరం తిరగడం
నాకింకా గుర్తే!
నువ్వు మరచిపోయావు..
నాగరికత అంటూ వచ్చి
మొదట పడింది నా దేహానికి సంకెళ్ళు!
కాచిబోసి చీర కట్టించింది
ఊపిరి కూడా ఆడనంతగా
నిలువెల్లా నల్లటి ముసుగేసి
నన్ను వంటింట్లోకి నెట్టిందీ నువ్వే..
ఏడు మీటర్ల చీర నీ భయం
నల్లటి ముసుగు నీ అనుమానం!
లో నెక్లు బికినీలు తగిలించి
కాసుల కోసం నన్ను విపణివీధిలో
అంగడి బొమ్మను చేసిందీ నువ్వే..
ఒక చేత్తో పరువు బోధించి
మరో చేత్తో నన్ను వ్యాపార వస్తువుగా
వాడుకున్నది నీ ద్వంద్వ నీతి!
నా నడకపైనా నీ నిఘా కెమెరాలు
నా నవ్వుపై నీ అనుమానాలు
నా దుస్తులపై నీ తీర్పులు-
ఇవి రక్షణ కాదు
నాపై నీ సంకుచిత ఆంక్ష ..
నేనంటే దేహం కాదు నీ గౌరవ పతాకం కాదు
నీ కుటుంబ పరువు కాదు!
నేనేంటే..
ఆకాంక్ష.. ఆలోచన.. ఆత్మగౌరవం!
