బాంబుల పొగలు కమ్ముకున్న ఆకాశం,
రొట్టెవాసన లేని ఉదయాలు
పసిప్రాణాల పొట్టలో గుగ్గిలమంటిన శబ్దం,
గాజా గోడల వెనుక ఆకలిగీతం!
తల్లిపాలు ఎండిపోయిన పెదవులపై
నీటిబిందువే మధురస్వప్నం
అరగంటకో ముద్ద అన్నం కోసం
పసివాడి కళ్ళు ఆకాశంకేసి చూస్తున్నాయి.
కఠిన హృదయాల పగుళ్ల మధ్య
ఆటబొమ్మలు బూడిదైపోయాయి,
వీధుల్లో చెల్లాచెదురైన రక్తపు ఆనవాళ్ళు
బాల్యం మిగిల్చిన అవర్ణ పీడకలలు
కన్నీళ్లు జాలువారుతున్న బుగ్గలపై
భయం జాడలు గడ్డకట్టాయి
మానవత్వం మూగబోయినప్పుడు
చిన్నారుల రోదనే
గాజా వినిపిస్తున్న మృత్యుసంగీతం
అస్తవ్యస్తంగా ముక్కలవుతున్న నేలపై
పసికలలు విత్తనాలై మొలుస్తున్నాయి.
బుల్లెట్ల అగ్నికణాల మధ్యకూడా
పువ్వుల్లాంటి చిరునవ్వులు విరియాలని ఎదురుచూస్తున్నాయి
భయంలేని రేపు కోసం
ఒకరినొకరు ఓదార్చుకుంటున్నారు,
ఆశాతైలంలో తడిపిన పసిమనసుల వత్తిని
భవిష్యత్ దీపంగా వెలిగిస్తున్నారు
ఓ శాంతీ! నీ చిరునామా ఎక్కడ?
ఓ మానవత్వమా! నీ కళ్ళు ఎందుకు మూసుకున్నాయి?
గాజా చిన్నారుల ఆకలి కేకలు
ప్రపంచమంతా ప్రతిధ్వనించటం లేదా?
ఆకలి మిగిలిస్తున్న కంచం
కన్నీళ్లలో కరిగిపోతున్న రాత్రి బదులు
సుమ పరిమళాలు నిండిన లోగిళ్ళు
అన్నం సువాసనను పంచే పవనాలు
శాంతిగీతం ఆలపించే మనిషికోసం
గాజా గాలిని వేడుకుంటున్నచిన్నారుల చేతులకు
మనందరి చేతులను చేర్చకపోతే
బతికున్నా బండరాళ్ళమే కదా!!
