ఆమె ఓ స్త్రీ…
అణచివేతల అగ్నిలోనూ
అసలు తత్వాన్ని కోల్పోని
అనంత శక్తి స్వరూపిణి.
నిన్నటివరకు
వంటింటి పొగల మధ్య
తన కలలను మసకబార్చుకున్న ఆమె జీవితం,
నేడు ఆకాశాన్నే లక్ష్యంగా చేసుకుని
విజయాలకు వీరతిలకం దిద్దుకుంటోంది.
నాలుగు గోడల మధ్య
బంధింపబడిన ఆమె ఆస్తిత్వం,
ఇప్పుడు ప్రపంచాన్నే
తన గుప్పిట్లో ఉంచుకునే స్థాయికి ఎదిగింది.
ఆమె చదువుకుంది…
తన బానిస సంకెళ్లు తెంచుకోవడానికి,
తనలాంటి వేలాది జీవితాలకు
వెలుగుదారిగా నిలవడానికి.
ఆమె ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంది…
తనపై విసిరిన ప్రతి రాయితో
ఓ విజయసౌధం నిర్మించడానికి,
ఆ సౌధం నీడలో
ఎందరో అతివలకు ఆశ్రయంగా నిలవడానికి.
ఆమె ఒక వ్యక్తి కాదు…
ఓ కుటుంబానికి పునాది,
ఓ సమాజానికి స్ఫూర్తి,
ఓ దేశ అభివృద్ధికి మూలస్తంభం.
ఎందుకంటే
మహిళ నిలబడితే
కుటుంబం నిలబడుతుంది…
మహిళ ఎదిగితే
సమాజం ముందడుగు వేస్తుంది…
మహిళ గెలిస్తే
దేశ భవిష్యత్తే వెలుగుతుంది…
