“నిండుకుండ తొణకదు,” “ఏమీ లేని విస్తరాకు ఎగిరెగిరి పడుతుంది. అన్నీ వున్న విస్తరాకు అణిగి మణిగి ఉంటుంది.” అనే సామెతలు వసంతగారి జీవితానికి అక్షరాలా అవ్వయించవచ్చు. ఒక కవితా సంకలనాన్ని, లేదా కథాసంకలనాన్ని రాసి, ప్రచురించి, ప్రచారం కోసం, బహుమతుల కోసం, అవార్డుల కోసం అర్రులు చేస్తున్న ఈ రోజుల్లో తెలుగు, హిందీ, రెండు భాషల్లో అపారమైన కృషి చేసి కూడా ఈనాడు సాహితీలోకంలో చాలా మందికి తెలియకుండా వసంతగారు మరుగున ఉన్నారు.
తెలుగు సమాజాల్లో సంచలనం సృష్టించిన ప్రముఖ రచయిత గుడిపాటి వెంకట చలం జీవితాన్ని “రమణీ సే రమణాశ్రమ్ తక” పేరుతో ఉత్తర భారతీయులకు అందించారు. అది ఆమె ఉన్నత సంస్కారానికి నిదర్శనం. తన పని తాను చేసుకుంటూ పోవడమే ఆమె తత్వం. డెబ్భై యారేళ్ళ వయసులో నేటికీ సృజన, అనువాద, రంగాలలో ఆమె కలం పరుగులు పెడుతోంది. భూమిక పాఠకులకోసం ఆమెతో ముఖాముఖి…
ప్ర. నమస్తే వసంతగారు, బాగున్నారా?
జ. నమస్తే గిరిజా, బాగున్నాను.. రండి.. కూర్చోండి.
ప్ర. భూమిక స్త్రీవాద మాస పత్రిక ఇంటర్వ్యూ కోసం వచ్చానండీ!
జ. భూమిక పత్రికతో నాకు అనుబంధం ఉంది. కీ.శే రమణికా గుప్తా ఆత్మ కథను నా జీవితం- ఉద్యమాలు – పోరాటాలు అనే పేరుతో హిందీ నుండి తెలుగులోకి అనువాదం చేసాను. దానిని సత్యవతిగారు ప్రతి నెలా భూమికలో ప్రచురించారు. అందుకుగాను ఆమెకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను.
ప్ర. మీ తల్లిదండ్రుల గురించి చెప్పండి.
జ. అమ్మ పేరు శ్రీమతి చింతలపాటి అనసూయమ్మ. గృహిణి. నాన్న పేరు శ్రీ చింతలపాటి అప్పారావు. హైదరాబాదులోని కట్టెలమండి ఆంధ్రవిద్యాలయ ఎయిడెడ్ పాఠశాల ప్రిన్స్‌పాల్‌గా పదవీ విరమణ చేసారు. దోమలగూడాలోని ఏ.వి కళాశాల ఫౌండర్ మెంబర్. నాన్నగారు ఆడపిల్లల చదువును ప్రోత్సహించారు. అందువల్ల మేమందరం బాగా చదువుకోగలిగాం.
ప్ర. మీ తోబుట్టువుల గురించి చెప్పండి.
జ. మేం మొత్తం ఎనిమిది మందిమి. నాకు ముగ్గురు అక్కలు. నా తర్వాత ఒక తమ్ముడు, ముగ్గురు చెల్లెళ్ళు. మా పెద్దక్క ప్రముఖ సాహితీవేత్త, అభ్యుదయవాది, అభ్యుదయ రచయితల సంఘం సెక్రటరీ ఏటుకూరి ప్రసాద్ సహచరి.
ప్ర. మీ పుట్టుక, బాల్యం గురించి చెప్పండి.
జ. 1/7/1950న హైదరాబాదులోని చిక్కడపల్లిలో జన్మించాను. నా బాల్యం అంతా అక్కడే ఆనందంగా గడిచింది. చిన్నప్పడు గాలిపటాలు ఎగురవేస్తూ ఊహల్లో విహరిస్తూ ఉండేదాన్ని. చిక్కడపల్లి వెంకటేశ్వర స్వామి గుడిలో హరికథలు, బుర్రకథలు లాంటి కార్యక్రమాలు జరిగేవి. వాటిని చూస్తూ పెరిగాను. వాటి ప్రభావం నామీద ఉంది. పన్నెండో తరగతి దాకా హైదరాబాదులోనే చదువుకున్నాను. ఆ తర్వాత నా వివాహం జరిగింది.
ప్ర. మీ పెళ్లి, సంతానం గురించి చెప్పండి.
జ. 12/2/1969న సంప్రదాయ పద్ధతిలో నా వివాహం చిక్కడపల్లిలోనే జరిగింది. మావారి పేరు కీ.శే తంగిరాల కామేశ్వర సోమయాజి. బ్యాంకు ఉద్యోగి. మాకు ఒక అబ్బాయి. పేరు ప్రశాంత్. ఒక ప్రైవేట్ కంపెనీకి డైరెక్టరుగా పని చేస్తున్నాడు. హైదరాబాదులోని బాచుపల్లిలో ఉంటారు. కోడలు రేణుక. వాళ్ళకు ఒక కూతురు. పేరు కావ్య. ఆమె పెళ్లి కూడా అయింది. ప్రస్తుతం భర్త సోయేశ్‌తో పూనేలో ఉంటోంది. జీవితంలో ఎన్నో ఎత్తు పల్లాలు చూశాను.
ప్ర. మరి, ఉన్నత విద్యాభ్యాసం ఎప్పుడు? ఎక్కడ? ఎలా జరిగింది?
జ. మా వారికి కూడా స్త్రీలు చదువుకోవాలనే అభిప్రాయం ఉండేది. అందువల్ల బీఏలో చేరాను. బాబు పుట్టిన తర్వాత ఎం.ఏ హిందీ సబ్జెక్టుతో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ప్రైవేటుగా పూర్తి చేసాను. ఆయనది బ్యాంకు ఉద్యోగం కావడం వల్ల దేశంలోని భిన్న రాష్ట్రాలలో ఉండవలసి వచ్చింది. హైదరాబాద్‌లో ఉన్నప్పుడు హిందీ సాహిత్యరత్న పూర్తి చేశాను. 1987లో మహారాష్ట్ర అంబేద్కర్ విశ్వవిద్యాలయం ఔరంగాబాద్ నుంచి పి.హెచ్.డి పూర్తి చేసాను.
ప్ర. పరిశోధనలో మీ అంశం ఏమిటి?
జ. “గీత్ కార్ నీరజ్ “ అనేది నా పరిశోధనాంశం. ఆయన హిందీ సాహిత్యంలో కవి. ఎస్. డి బర్మన్, శంకర్ – జైకిషన్‌లతో కలిసి ఆయన చేసిన పాటలు చలనచిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టించాయి. పద్మశ్రీ, పద్మ భూషణ్ లాంటి ప్రతిష్ఠాత్మకమైన అవార్డులు ఆయనను వరించాయి. నా పరిశోధన గ్రంథం 1997లో అచ్చయింది. ప్రస్తుతం ప్రముఖ రచయిత కస్తూరి మురళీకృష్ణ దానిని తెలుగులోకి అనువదిస్తున్నారు.
ప్ర. మీ హిందీ, తెలుగు సాహిత్యాల కృషికి గల నేపథ్యం చెప్పండి.
జ. నా చిన్నప్పుడు మా యింట్లో సాహితీ వాతావరణం ఉండేది. మా నాన్నగారికి సాహిత్యం అంటే అభిమానం. ప్రముఖ అభ్యుదయ రచయిత, మేధావి ఏటుకూరు ప్రసాద్ మా బావగారు. ఆదిరాజు వీరభద్రరావు గారు మొదలైన వాళ్ళను నేను మా యింట్లో తరచూ చూసేదాన్ని. వాళ్ళ చర్చలు వింటూ పెరిగాను. మా ఆయన బాంక్ ఉద్యోగి కావడం వల్ల మహారాష్ట్రలో ఎక్కువ కాలం ఉన్నాం. అందువల్ల హిందీ, తెలుగు భాషల్లోకి అనువాదం చేస్తున్నాను. నా స్వీయ రచనలు తెలుగులో కూడా ఉన్నాయి.
ప్ర. మీరు తెలుగు భాషలో రాసిన సొంత రచనలు ఏవి?
జ. మొదట్లో కొన్ని కథలు రాశాను. కానీ నా మొదటి నవల ‘రేపటి వసంతం’ యువ మాసపత్రికలో నవంబర్ 1985లో వచ్చింది. ఇది సైన్స్ ఫిక్షన్ నవల. ‘విముక్తి’ నవలలో దళిత వడ్డెర్ల కులస్తుల జీవితాలలోని సంక్షోభాన్ని వివరించాను. “భూతల స్వర్గంలో గాయపడ్డ వసంతం” ఇది కార్గిల్ సైనికులు, స్త్రీ స్వేచ్చ కేంద్ర బిందువుగా రాసిన నవల. ఈ నవల చదివి చాలామంది తెలుగు సైనికులు బాగుందని ఉత్తరాలు రాశారు. ఈ నవలను ‘విద్రోహి వసుంధర’ పేరుతో హిందీ భాషలోకి అనువాదం చేశాను. తెలుగు సైనికులు రాసిన కొన్ని ఉత్తరాలను హిందీ భాషలోకి తర్చుమా చేసి విద్రోహి వసుంధర పుస్తకంలో చేర్చాను. నేను తెలుగులో రాసిన “భూతల స్వర్గంలో గాయపడ్డ వసంతం” అనే నవలను హిందీలోకి కూడా అనువాదం చేసాను. దానిని డా. అరుణా లోఖండే “భూతల్ స్వర్గాతీత్ ఘాయాల” అనే పేరుతో మరాఠీ భాషలోకి అనుసృజన చేసింది. ఈ పుస్తకాన్ని రంగారావుగారు “I want to fly పేరుతో ఇంగ్లీషులోకి అనువాదం చేశారు. అన్నీ ప్రచురితమయ్యాయి..
ప్ర. మీరు హిందీ భాషలో రాసిన స్వీయ రచనలు ఏమిటి?
జ. “మృత్యులీల-జీవనహేల” నవల హిందీలో రాశాను. ఇందులో మహారాష్ట్రలో వచ్చిన భూకంప బాధితుల వ్యథలు ఇతివృత్తం. అప్పట్లో ఎస్.బి.హెచ్ (ఇప్పుడు విలీనమై ఎస్ బి ఐ అయింది) వాళ్ళు చాలా గ్రామాలను దత్తత తీసుకున్నారు. మా వారు, మరికొందరు బ్యాంకు ఆఫీసర్లతో నేను కూడా వెళ్ళాను. భూకంప బాధితులను ప్రత్యక్షంగా కలుసుకొని, హృదయవిదారకమైన వారి కథలు, వ్యథలు తెలుసుకొని ఈ నవల రాసాను. నా పరిశోధన కూడా హిందీ సాహిత్యంలోనే చేశాను. తెలుగు సాహిత్యంలో తనదైన గాఢమైన ముద్ర వేసిన గుడిసాటి వెంకటచలంను ఉత్తర భారత ప్రజలకు పరిచయం చేయాలనే దృఢ సంకల్పంతో చలం జీవిత చరిత్రను “రమణి సే రమణాశ్రమ్ తక” అనే పేరుతో రాశాను. దీనిని సుమారు ఆరు సంవత్సరాలు పరిశోధన చేసి, దాదాపు పదమూడు వందల పుటల్లో రాశాను. ఇది మూడు భాగాలుగా అచ్చయింది. ఇందులో నేనొక విశ్లేషణ చేశాను. దానికి మంచి స్పందన వచ్చింది.
ప్ర. అయితే చలంను మీరు విశ్లేషించిన తీరుకు ఒక ఉదాహరణ చెప్పండి.
జ. కవిని (రచయిత) క్రాంతదర్శి అంటారు. అంటే భవిష్యత్తును ఊహించగలరు అన్నమాట. చలం కథానాయికలలో ఒకరు..” పురుష సంపర్కం లేకుండా సంతానం కలిగితే ఎంత బాగుంటుంది.” అనుకుంటుంది. సైన్సు ఈనాడు ఈ ఊహను ప్రయోగాత్మకంగా నిజం చేసింది. అలాగే ఆ రోజుల్లో కొందరు పురుషుల వీర్యం ఊరికే పోకూడదు. అది పాపమని వాదించేవారట. అప్పుడు చలం వీర్యాన్ని సంచయనం చేయవచ్చు కదా! అన్నారట. ఈనాడు స్పెర్మ్ బాంక్ ద్వారా సైన్స్ దానిని నిజం చేసింది. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే..
ప్ర. తెలుగు భాష నుంచి హిందీ భాషలోకి ఏయే పుస్తకాలను అనువాదం చేశారు?
జ. అది ఒక పెద్ద జాబితానే ఉంది. తాపీ ధర్మారావు రాసిన ఇనుప కచ్చడాలు, దేవాలయాల మీద బూతు బొమ్మలెందుకు?, పెళ్ళి – దాని పుట్టు పూర్వోత్తరాలు అనే పుస్తకాలను వరుసగా లోహేకీ కమర్ పేటియా, దేవాలయోశీ పర్ మిథున్ మూర్తియా క్యోం, వివాహ్ సంస్కార్ స్వరూప్ ఏవం వికాస్ అనే పేర్లతో అనువదించాను. డా. ఏటుకూరి ప్రసాద్ గారి పి.హెచ్.డి పరిశోధనా గ్రంథం “తాపీ ధర్మారావు జీవితం – రచనలు” అనే గ్రంథంలో కొంత భాగాన్ని హిందీలోకి అనువదించాను. దాని పేరు “ప్రజనన్ తంత్ర్ తథా దైవీ భావన.” ఓల్గా రాజకీయ కథలను రాజ నైతిక్ కహానియా అనే పేరుతో అనువదించాను. సమ్మెట ఉమాదేవి రాసిన రేలపూలు కథలను అమల్ తాస్ కే ఫూల్ పేరుతో అనుసృజన చేసాను. ఇందులో ఆదివాసీల జీవితం ఇతివృత్తం. రాసాని రాసిన ఒలికల బీడు నవలను, ముని సుందరం గారి ఒక యుద్ధం తర్వాత, (మహాభారత యుద్ధం తర్వాత ఏం జరుగుతుంది? అనేది ఇందులో ఇతివృత్తం.) అత్తలూరి విజయలక్ష్మి రాసిన తెల్ల గులాబి, పిట్టకొంచెం కూత ఘనం, ప్రముఖ రచయిత్రి గీతాంజలి రాసిన ఆమె అడవిని జయించింది అనే పుస్తకాలను వరుసగా మర్ఘట్, ఏక్ యుద్ధకే బాద్, నన్హీ పంఖ్ ఉంచీ ఉడాన్, సంధ్యానే జంగల్ కో జీత్ లియా అనే పేర్లతో అనుసృజన చేశాను. చివరి పుస్తకానికి నాతోపాటు బి. శ్రీలక్ష్మి కూడా సహ అనువాదకురాలు. డా. విజయానంద్ రాసిన నేను క్యాన్సర్‌ను జయించాను అనే పుస్తకాన్ని మై క్యాన్సర్ కో జీత్ లియా అనే పేరుతో తెలుగు చేసాను. ఇందులో 108 మంది క్యాన్సర్ ను జయించిన వ్యక్తుల జీవన రేఖలున్నాయి. ఈ పుస్తకానికి సహ అనువాదకురాలు డా. సుమన్ లత.
ప్ర. ఇంగ్లీషు నుంచి తెలుగులోకి కూడా మీరు అనువాదం చేశారా?
జ. ఒక పుస్తకం చేసాను. బర్మ హేబిస్ రాసిన “who stolen American dreams” అనే పుస్తకాన్ని మీ కలలను కొల్లగొట్టిందెవరు అనే పేరుతో తెలుగులోకి అనుసృజన చేశాను.
ప్ర. మీరు తెలుగు భాషలో కవిత్వం రాశారా? తెలుగు కవిత్వాన్ని హిందీలోకి అనువదించారా?
జ. ఎక్కువగా కవిత్వం రాయలేదు. కానీ తెలుగులో పలువురు రాసిన కవితలను హిందీలోకి అనువాదం చేసాను. పెరుగు రామకృష్ణ రాసిన ఒక పరిమళభరిత కాంతి దీపం అనే కవితా సంకలనాన్ని ఏక్ పరిమళ్ భరిత్ కాంతి దీప్ పేరుతో, రొక్కం కాళేశ్వర రావు రాసిన అంతర్ముఖం అనే కవితా సంకలనాన్ని అంతర్ముఖ్, ఐనంపూడి శ్రీలక్ష్మి రాసిన కవిత్వమే ఒక గెలాక్సీ కవితా సంపుటాన్ని, కవిత్వ్ హీ ఏక్ గెలాక్సీ హై అనే పేరుతో, ఇటీవల ఆమెనే సంకలనం చేసినా సలాం సైనికా అనే పుస్తకంలోని పలువురి కవితలను హిందీలోకి తర్జుమా చేసాను. ఆపరేషన్ సింధూర్‌ని కేంద్రబిందువుగా చేసి తెలుగు, హిందీలో దీర్ఘ కవిత రాసాను. ఇది మరాఠీ, బెంగాల్ భాషల్లోకి అనువాదమైంది.
ప్ర. తెలుగు నాటకాలను కూడా హిందీలోకి అనువాదం చేశారా?
జ. చేశాను.. సి.యస్. రావుగారు రాసిన ఊరుమ్మడి బతుకులు, రాళ్ళకు నోళ్ళుస్తే.. అనే నాటకాలను లోహార్ కా ఆంగన్, పథర్ బోల్ ఉఠేతో అనే పేర్లతో అనువాదం చేశాను. పతంజలిశాస్త్రి మాధవి నాటకాన్ని ఏక్ ఔ ర్ మాధవి పేరుతో రాసాను. అనువాద రేడియో నాటకాలు ఆకాశవాణిలో ప్రసారమయ్యాయి.
ప్ర. హిందీ భాషలో నుంచి తెలుగులోకి మీరు అనువాదం చేసిన పుస్తకాల గురించి చెప్పండి.
జ. అమృత్‌లాల్ నాగర్ రచించిన నాచ్య బహత్ గోపాల్ అనే నవలను ‘ఆడలేనురా గోపాలా’ అనే పేరుతో తెలుగులోకి అనుసృజన చేసాను. ఇది చతుర మాసపత్రికలో ఆగస్టు 1992లో వచ్చింది. విష్ణు ప్రభాకర్ రాసిన ఢిల్లీ సాహిత్య అకాడమీ అవార్డు పొందిన అర్థనారీశ్వర్ నవలను తెలుగులో అర్ధనారీశ్వరుడు పేరుతో రాశాను. ఈ పుస్తకాన్ని కేంద్రీయ సాహిత్య అకాడమీ ప్రచురించింది. నరేంద్ర మోహన్ రాసిన ప్రసిద్ధ ఉర్దూ రచయిత సాదత్ హసన్ రాసిన మంటో జిందా హై అనే పుస్తకాన్ని నేను మంటో జీవిత చరిత్ర అనే పేరుతో తెలుగులోకి అనువదించాను. లక్నో వాసి డా. అమితా దూబే రాసిన ఏకాంత వాసి శతృఘ్న్ అనే పుస్తకాన్ని ఏకాంత వాసి శత్రుఘ్నడు అనే పేరుతో తెలుగులోకి తీసుకవచ్చాను. శ్రీమతి మధు కాంక్రియా రాసిన సుఖతే చినార్ అనే పుస్తకాన్ని ఎండి పోతున్న చినారులు శీర్షికతో తెలుగుచేసాను. ఇది కాశ్మీర్ సైనికులకు సంబంధించింది. బి. మురళీధర్ రాసిన నెమలి నార అనే కథా సంకలనాన్ని మోర్ పంఖీ పేడ్ అనే పేరుతో తర్జుమా చేసాను.
ప్ర. మరాఠీ భాష నుంచి కూడా తెలుగులోకి అనువాదం చేశారా?
జ. చేశానండీ! మా వారి ఉద్యోగ రీత్యా దాదాపు ముప్పైయేళ్ళు మేం మహారాష్ట్రలోనే ఉన్నాం. అందువల్ల నాకు ఆ భాష పట్టుబడింది. మరాఠీకి లిపి హిందీ కాబట్టి అనువాదం చేయడం కష్టం కాలేదు. జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత శివాజీ సావంత్ లక్ష్మణ్ రాసిన మృత్యుంజయ్ నవలను మృత్యుం జయుడు పేరుతో తెలుగులోకి అనువదించాను. ఇది కర్ణుడు కేంద్ర బిందువుగా రాసిన నవల. లక్ష్మణ్ గాయక్ వాడ్ ఆత్మకథను ఉచల్యా పేరుతో తెలుగులోకి అనువదించాను (ఇందులోని కథావస్తువు దళిత వడ్డెరుల జీవిత వ్యథలు)
ప్ర. త్వరలో రానున్న మీ యితర పుస్తకాల గురించి చెప్పండి.
జ. దూస్ రా ఏక్ ఔర్ మహా భారత్ (పల్నాటి యుద్ధం)అనే పుస్తకం హిందీలో రాస్తున్నాను. త్వరలో రానుంది. తెలుగులో సామ్రాట్ సముద్ర గుప్తుడు అనే పేరుతో శ్రీరామ మూర్తి రాసిన సామ్రాట్ సముద్రగుప్త, కస్తూరి మురళీకృష్ణ పాడుతా తీయగా అనే పేరుతో హిందీ సంగీత దర్శకులు, గేయ రచయితలు, గాయనీ గాయకుల జీవిత విశేషాలను తెలుగులో రాశారు. అవి హిందీలోకి రానున్నాయి. ఆయనదే సౌశీల్య ద్రౌపది అనే పేరుతో వచ్చిన నవలను హిందీలో సౌశీల్య ద్రౌపది పేరుతో రాబోతోంది. మాటల్లో పనికొచ్చే మాటలు అనేది ఇంగ్లీషు నుంచి తెలుగులోకి రానుంది. ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ వాళ్ళ కోసం తాపీ ధర్మారావు జీవిÔ áచరిత్రను రాస్తున్నాను.
ప్ర. మీకు వచ్చిన అవార్డుల గురించి చెప్పండి.
జ. అంబేద్కర్ మరాఠ్ వాడా విశ్వవిద్యాలయ్, హిందీ పరిషత్ ఔరంగాబాద్ వారి అనువాద పురస్కార్, లక్నో హిందీ సంస్థాన్ సౌహార్ద్ర పురస్కారం లభించింది. హైదరాబాదు వారి ఆచార్య ఆనంద రుషి సాహిత్య పురస్కార్, ఆచార్య భీమ్ సేన్ నిర్మల్ రాష్ట్రీయ పురస్కార్, సుగుణ స్మృతి పురస్కార్, గుత్తి నారాయణరెడ్డి సాహితీ పీఠం వారి పురస్కారాలు వచ్చాయి. కడప నుంచి కొమ్మారెడ్డి శివశంకర్ రెడ్డి పురస్కారం వచ్చింది. జబల్పూర్ వారి కేశవ ప్రసాద్ పాఠక్ సమ్మాన్ కాదంబరి వచ్చింది. విజయవాడ వారి కృష్ణా జిల్లా రచయితల సంఘం సాహిత్య పురస్కారం వచ్చింది. సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంవారి సాహితీ పురస్కారం అనువాదం రంగంలో ఇచ్చారు. నా రచనలపై ఇద్దరు పి.హెచ్.డి చేస్తున్నారు. తెనాలి వారి శ్రీ బోయపాటి నాగేశ్వరరావు, సుభద్రాదేవి గురు దంపతుల 24 ఏళ్ళ హిందీ ప్రచార గురుపీఠ్ పురస్కారం 2026 అక్టోబర్ రెండో తేదీన వస్తుంది.
ప్ర. సాహిత్యంపై మీ అభిప్రాయం చెప్పండి.
జ. సాహిత్యం సమాజానికి వెన్నెముక. ఇది సమాజంలో మార్పు తెస్తుంది. మనసుకు వసంతాన్ని ఇస్తుంది. శిశిరాన్ని దగ్గరకు రానీయదు. ఇది నా నమ్మకం. మన భారతీయ సంస్కృతి విశ్వానికి తలమానికం. సైనికులు, రైతులు, సైంటిస్టులు, సాహిత్య కారులు, సంఘసంస్కర్తలు, స్వాతంత్య్ర సమరయోధుల పట్ల నాకు ఎనలేని అభిమానం. మన భరతభూమి మట్టిలోనే శ్రమ సౌందర్యం మమేకమై ఉంది. చెమట చుక్కల గర్భంలో శ్రమ శక్తి నిబీడీకృతమై ఉంది. శ్రమశక్తే అభ్యుదయ బాటకు పునాది. హింసలేని ఆరోగ్యవంతమైన సమాజం కోసం కలాల శక్తితో ముందుకు సాగాలి.
ప్ర. మీ దృష్టిలో కళకు, విజ్ఞానానికి ఉన్న అవినాభావ సంబంధం ఎలాంటిది?
జ. కళ గర్భం నుంచి విజ్ఞానం జన్మించింది అని నా నమ్మకం. మన ప్రాచీనులు, ఆదివాసులు గుహలలో ఎన్నెన్నో బొమ్మలు వేశారు. గ్రహాంతర వాసులు ఉండేవారని వారు ఊహించారు. విమానం నుంచి దిగుతున్నట్లుగా బొమ్మలు వేశారు. అలాగే భూమి నుంచి ఆకాశం వైపు మానవులు ప్రయాణం చేస్తున్నట్లుగా బొమ్మలు లభించాయి. వైజ్ఞానికులు ఈ ఊహను సైన్సు ద్వారా నిరూపించారు.
ప్ర. ప్రస్తుతం మీరు చేస్తున్న విశేష కృషి ఏమిటి?
జ. ప్రసిద్ధ హిందీకవి గోపాల్ దాస్ నీరజ్ గారి జీవితం – రచనల పైన “గీత్ వసంత్ మహాకవి నీరజ” అనే శీర్షికతో తెలుగులో విశ్లేషణ చేస్తున్నాను. కొంత భాగం ప్రచురితమైంది.
