చాలా కాలం తర్వాత ఒక నవల రోజంతా కదలకుండా కూర్చోబెట్టింది. జనాలు వినాయకచవితి పూజల్లో నిమగ్నం అయ్యుంటే నేనేమో “కొండమల్లు” నవల చదువుతూ నల్లమలలో చక్కర్లేస్తూ ఉన్నాను. చెంచుల నాయకుడు బయ్యన్న కారుకోడి కోసం నల్లమలంతా వెతుకుతూ దానిని పట్టుకున్న దగ్గర నుంచి ఒక ఉద్వేగంతో నవల నడుస్తుంది.
ఈ నవల కధానాయకుడు ఎవరయ్యా అంటే “చప్పిడి ముక్కు, రింగుల జుట్టు, పొడŠవాటి దవడలు, పిల్లి గడ్డం, బక్కపలచని ఒళ్ళు. నడీడు మనిషి. జబ్బకు దబ్బ, చేతుల కెయ్య కట్ట, మొలకు నార గోచిపెట్టుకున్నడు” ఈయనే ఈ నవలా నాయకుడు. కుడువుల బయ్యన్న, మండాది పెంటకు చెందిన వాడు. కారు కోడి కోసం నల్లమలంతా జల్లెడ పడుతున్న సమయంలో అతని ఉచ్చులో పడింది కారు కోడి. అదెలా ఉందయ్యా అంటే “కోర ముక్కు, కంచు కంఠం, మొనతేలిన గోళ్ళు, చురుకు చలనం, బిళ్ళ కంటి చూపు. ఒడుపు తెలిసిన పక్షి. అడవిజాతి పుంజు. ఈ కారుకోడి” రెండో హీరో అన్నమాట. ఈ బక్కపలచని బయ్యన్న, పులిని కూడా ఓడించగలిగిన కారుకోడి కలిసి మాచర్ల మహా మంత్రి బ్రహ్మనాయుడు అనగా మాచర్ల రాజ్యాన్ని కోడి పందాల్లో ఓడించి అడవుల పాల్చేసిన గొప్ప సన్నివేశం గురించి ఈ నవలలో చదవాల్సిందే. మందాడి పెంట మీద దాడి చేసిన బ్రహ్మనాయుడి సేనలు మొత్తం నల్లమల చెంచుల్ని చంపి అడవంతా ఆక్రమించుకోవాలన్న బ్రహ్మనాయుడి కుతంత్రాన్ని ఎదిరించినది బయ్యన్న అతని కారుకోడి. ఈ నవలలో హీరోలు, షీరోలు అందరూ చెంచులే. పలనాటి రాజులు, నాగమ్మ అంతర్లీనంగా ఉన్న పాత్రలు. మనం చదువుకున్న చరిత్రలో బ్రహ్మనాయుడు చాపకూటితో సమతను నేర్పిన వాడుగా, ఆదర్శనీయుడుగా శ్లాగిస్తే, చెంచుల కోణం నుంచి పల్నాటి సో కాల్డ్ హీరోలు.
చెంచు జాతిని నిర్మూలించి మందాడి ప్రాంతాన్ని ఆక్రమించి చెంచు జాతి మొత్తాన్ని బానిసలు కావించుకోవాలనే దుర్బుద్ధి, దురాశ మాచర్ల బ్రహ్మనాయుడిది. ఎంతోమంది చెంచుల్ని, చంపి వారి ఇళ్ళను కాల్చి, వారి చేత వెట్టి చేయించిన దుష్ట, దుర్మారుడు బ్రహ్మనాయుడు. బ్రహ్మానాయుడిని యుద్ధంలో ఓడించే శక్తి చెంచులకు లేదు. కోడి పందాల పట్ల మాచర్ల రాజుల బలహీనతను ఉపయోగించుకోవాలని, అందుకు గురజాల మంత్రి నాగమ్మ సహాయం తీసుకోవాలనే ఉద్ధేశ్యంతో బయ్యన్న కారుకోడి కోసం నల్లమల అడివంతా గాలించి కోడిని సంపాదించడం కారుకోడిని నాగమ్మకు అందించే క్రమాన్ని వర్ధెల్లి వెంకటేశ్వరులుగారు వర్ణిచిన తీరు నేను రాసేకన్నా ఎవరికి వారు చదివి తీరాలి. నల్లమల అడవి అంతర్భాగంలో అనేక పెంటల్లో నివాసముండే చెంచుల జీవిత విధానం, వారి ఆహారపు అలవాట్లు, వారి సంస్కృతీ సంప్రదాయలు ముఖ్యంగా వారి భాష, మాట్లాడే విధానాన్ని చాలా సునిశితంగా పరిశీలించి, చాలాకాలం పాటు చెంచు పెంటల్లో చెంచులతో కలిసి ఉంటే తప్ప అంత వివరంగా రాయడం సాధ్యం కాదు. నేను నల్లమలలో కొన్ని పెంటలను చూసాను. వారి ఇళ్ళను చూసాను. వారితో మాట్లాడాలని ఎంత ప్రయత్నం చేసిన సాధ్యం కాలేదు. అప్పాపూర్ పెంట, మల్లాపూర్ పెంటలు రెండేసి సార్లు వెళ్ళాను కానీ వారితో మాట్లాడటం కుదరలేదు.
వెంకటేశ్వర్లు గారు ఎన్ని రోజులు ఎన్ని పెంటల్లో వారితో గడిపి చెంచుల జీవనవిధానాన్ని, మిగిలిన వారి పధ్ధతులను అతి నిశితంగా పరిశీలించి కొండమల్లు నవలలో రాయగలిగారో అర్ధం చేసుకోవాలి. నవల చదువుతున్నంతసేపు చెప్పలేని ఉద్వేగం కలుగుతుంది.
పులితో కారుకోడి పోరాటం, కొండచిలువ, అడవి జంతువులు ఇంకా ఎన్నో జంతువుల వర్ణనలు.
నవల కధానయకుడు బయ్యన్న పుట్టినప్పుడు అతని తల్లి మంతమ్మ చెంచు గడ్డ, సిర్రకూర కోసం అడవికి వెళ్ళింది. కష్టపడి చెంచు గడ్డ, సియ్యకూర సంపాదించి ఇంటికి రాబోతున్న సమయంలో బీభత్సమైన వాన, ఉరుములు, మెరుపులు మొదలౌతాయి. అదే సమయంలో ఆమెకు పురిటి నొప్పులు వస్తాయి. అడవి మధ్యలో, భయంకరమైన వానలో మంతమ్మ ప్రసవించి స్పృహ కోల్పోతుంది. పురిటి నెత్తుటి వాసనకు కౄరమృగాలు, గండు చీమలూ అప్పుడే పుట్టిన బిడ్డ దగ్గరికి రావాలని ప్రయత్నిస్తున్న సమయలో మంతమ్మకు మెలుకువ రావడం… ఇదంతా చవుతుంటే భయంతో ఒళ్ళు గగుర్పొడుస్తుంది.
“తనకు పురిటి నొప్పులొస్తున్నయి” అని అర్ధమైంది. కానీ పురుడుపోసే దిక్కు లేదు. ఆమెకు చీకటే దిక్కు. వాన దేవుడే అండ. జలప్రవాహాలే రక్షణ కవచాలు. ప్రాణం తీసినా ప్రాణం పోసినా పంచభూతాలే. బాధను పంటి బిగుతున అదిమి పట్టుకుంది. పిడికిళ్ళు బిగబట్టి తన్లాడుతున్నది.” ఇలాంటి ప్రకృతి బీభత్సంలో బయ్యన్న పుట్టాడు. కీకారణ్యంలో ప్రతి చెంచు తల్లి ప్రకృతి, పంచభూతాలతో పోరాడుతూ పురుడు పోసుకుంటుంది, వీరున్ని కంటుంది. ప్రతి బిడ్డ పుట్టుకతోనే ధనుర్ధనుడు. అట్లా ప్రతి తల్లి వీరమాతే. అలాంటి వీర మాత మంతమ్మకు బయ్యన్న జన్మించాడు. అలాంటి వీరుడు బయ్యన్న కారు కోడి సాయంతో నల్లమల అడవిలో ఎంతోమంది చెంచుల్ని చంపి, వాళ్ళ పెంటలను తగలబెట్టించి, చెంచులను బానిసలుగా మార్చాలని దుష్ట పన్నాగం పన్నిన బ్రహ్మనాయుడి పొగరణిచి, రాజ్య భ్రష్టుడిని చేసి అడవులు పట్టించిన కొండవీటి బయ్యన్న, కొండమల్లుల కధని “కొండమల్లు” పేరుతో గొప్ప నైపుణ్యంతో, ప్రేమతో రాసిన వర్ధెల్లి వెంకటేశ్వర్లు గారికి అబినందనలు. మరిన్ని రచనలు వీరి నుంచి ఆశిస్తూ…
