“చప్పట్లు కొడుతూ వస్తున్నారు” — హిజ్రాలను చూసినప్పుడు సాధారణంగా సమాజం నుంచి వినిపించే మాట ఇది.
హిజ్రాలు ఎవరు? ఎక్కడి నుంచి వస్తారు? వాళ్లు ఒక సంస్కృతి, అంటే ఒక సాంస్కృతిక సముదాయం. ఎక్కువ శాతం మహానగరాల్లో, అంటే మెట్రో నగరాల్లో కనిపిస్తూ ఉంటారని మనం ఇంతకు ముందే తెలుసుకున్నాము.
అయితే ఎక్కువ శాతం హిజ్రా గురువులు, నాయకుల కింద హవేలీలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో, ఆ ప్రాంతాల్లో ఎక్కువ సంఖ్యలో కనిపిస్తూ ఉంటారు.
వారిని మనం తరచూ దుకాణాల్లో, అంగడిలో అడుక్కోవడం, పండగలప్పుడు, దీపావళి లాంటి పండగల్లో అడుక్కోవడం, ఇంట్లో ఏదైనా శుభకార్యం జరుగుతుంటే వారు వచ్చి భిక్షాటన చేయడం, రైళ్లలో భిక్షాటన చేయడం చూస్తూ ఉంటాము. సాధారణంగా వీళ్లు వస్తున్నారు అని మనకు ముందుగా చెప్పే సంకేతం వాళ్లు కొట్టే చప్పట్లు. దీనిని హిందీలో “తాలీ” అంటారు. ప్రత్యేకంగా హిజ్రా భాషలో కూడా తాలీ అనే పదాన్ని ఎక్కువగా వాడతారు. దీనికి చాలా ప్రాధాన్యత ఉంది. ఇది వారి గుర్తింపుకు సంబంధించిన ఒక మాటలు లేకుండా సంకేతాల ద్వారా భావాన్ని తెలియజేసే విధానం.
ఇటీవల ప్రచురితమైన ఒక శాస్త్రీయ అధ్యయనం కూడా తాలీని ఇదే కోణంలో చూస్తుంది. 2025లో ప్రచురించిన “చివరి వరకు మేము తాలీ కొడుతూనే ఉంటాము”: హిజ్రా కథనాలు అనే పరిశోధనలో తాలీని కేవలం ఒక శబ్దం లేదా బహిరంగ ప్రదర్శనగా కాకుండా, హిజ్రా సముదాయానికి చెందిన భావాన్ని, తమ ఉనికిని, అలాగే తమ ప్రతిఘటనను వ్యక్తం చేసే శరీరంతో ముడిపడిన ఒక సామాజిక-సాంస్కృతిక ఆచరణగా పరిశోధకులు విశ్లేషించారు. సమాజం తాలీని అసహజమైన లేదా భయపెట్టే శబ్దంగా చూస్తే, హిజ్రా అనుభవాల్లో అది సముదాయ భావన, ఉనికి, ప్రతిఘటనను వ్యక్తం చేసే సాంస్కృతిక ఆచరణగా కనిపిస్తుందని ఈ పరిశోధన నిరూపించింది.
తాలీ అంటే కేవలం చప్పట్లు కాదు
హిజ్రా సముదాయంలో తాలీకి చాలా, చాలా గొప్ప గుర్తింపు ఉంది. దానికి ప్రత్యేక స్థానం ఉంది. ఇది ఒక హిజ్రా యొక్క తన సముదాయానికి చెందిన భావాన్ని, మళ్లీ ప్రతిఘటనను కూడా తెలియజేస్తూ ఉంటుంది, ఒక రూపాన్ని అందిస్తూ ఉంటుంది. తాలీతో జీవనోపాధి కూడా జరుగుతుంది. కొన్ని వేలు, కొన్ని లక్షల సంపాదన కూడా తాలీతోటి జరుగుతుంది. అది వ్యక్తిగతంగా సంపాదించొచ్చు లేదా సముదాయాల్లో వెళ్లి సంపాదించొచ్చు. రైళ్లల్లో సాధారణంగా చప్పట్లు వినిపిస్తే చాలు, భయపడి దుప్పట్లు ముసుకేసి పడుకోవడం, లేకపోతే టాయిలెట్‌లోకి వెళ్లిపోవడం, వారిని దూరంగా ఉంచాలని లేదా వారిని తప్పించుకోవాలని చాలా ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. వాళ్లు చప్పట్లు కొట్టి, అంటే తాలీ కొట్టి, ఒక సంకేతాన్ని ఇస్తూ ఉంటారు-“మేము వచ్చాము” అని. అంటే హిజ్రాలు వచ్చారు అనడానికి ముఖ్యంగా ఆ ఒక శబ్దమే పెద్ద గుర్తింపు. కానీ హిజ్రా సముదాయం లోపలికి వెళ్లి చూస్తే ఈ శబ్దం కేవలం “వాళ్లు వచ్చారు” అనే ప్రకటన మాత్రమే కాదు. దానికి అనేక పొరలు, అనేక అర్థాలు ఉన్నాయి.
పునర్జన్మ నుంచి మరణం వరకు
తాలీ అనేది హిజ్రాల పునర్జన్మ, అంటే నిర్వాణం తర్వాత నుంచి చనిపోయే వరకు, మరణం వరకు కూడా వారి జీవితాల్లో, హిజ్రాల జీవితాల్లో చొచ్చుకుపోయి ఉంటుంది. చాలా ప్రత్యేకమైన పాత్ర కూడా వహిస్తుంది. వాళ్లని తాలీ కొట్టకుండా ఉండడాన్ని ఎవ్వరూ ఆపలేరు. అయితే ఈ తాలీకి మనం అంతర్గతంగా చూసినట్టయితే చాలా, చాలా అర్థాలు ఉన్నాయి. ముందుగా తాలీ అనేది హిజ్రాలు వస్తున్నారు అని తెలియడానికి ఒక ప్రకటన లాంటిది, అప్రమత్తం చేస్తున్నట్టు. తర్వాత ఈ తాలీ కొడుతూ కొడుతూ కూడా వచ్చి, ఎవరైనా ఇంట్లో పుట్టినా లేదా ఎవరైనా చనిపోయినా కూడా వాళ్లు వచ్చి చప్పట్లు కొడుతూ ఉంటారు. ఇలాంటి సందర్భాల్లో వీళ్లు కొట్టే చప్పట్లకి సాధారణ జనాభా కొట్టే చప్పట్లకి చాలా తేడా ఉంటుంది. తాలీ అనేది ఒక ప్రచారం కూడా. అంటే వాళ్లు వాళ్లల్లో వాళ్లు మాట్లాడుకుంటున్నప్పుడు, సాధారణ జనాభాతో మాట్లాడుతున్నప్పుడు, తర్వాత అనేక సందర్భాల్లో ఈ తాలీని కొడతారు, తాలీని వాడతారు. కానీ దీనికి అనేక అర్థాలు ఉన్నాయి.
తాలీకి ఉన్న రెండు ప్రధాన అర్థాలు
ప్రధానంగా తాలీ రెండు విధాలు. ఒకటి హిజ్రాతనం చూపించుకోవడానికి. రెండోది నిరసన కోసం. నిరసనప్పుడు కూడా కొడతారు. కానీ రెండిటికి తేడా చాలా ఉంటుంది. ఈ రెండు రకాల తాలీల మధ్య ఉన్న వ్యత్యాసం కేవలం హిజ్రా సముదాయానికి మాత్రమే అర్థమవుతుంది. సాధారణ మనుషులకు అర్థం కాదు. అంటే, మనకు వినిపించేది ఒకే చప్పట్ల శబ్దంలా అనిపించవచ్చు. కానీ ఆ చప్పట్ల యొక్క సందర్భం, లయ, ఉద్దేశం, శరీర భాష, దాని వెనుక ఉన్న సంబంధాలు – ఇవన్నీ హిజ్రా సముదాయంలోని వ్యక్తులకు వేరే అర్థాలను అందిస్తాయి.
ఆరాధన, శుభారంభం, అధికారం
ఒక్కొక్కసారి ఒక హిజ్రా సముదాయానికి నాయకులు ఎవరైతే ఉంటారో, వారు ఉదయాన్నే లేచి గట్టిగా ఒక తాలీ కొడతారన్నమాట. అది ఒక శుభారంభం వంటిది. అది అమ్మవారికి, వారు ఆరాధించే ముర్గీ మాతకి కొడతారు. తర్వాత కొన్ని సందర్భాల్లో అదే నాయకులు ఎవరైనా నిబంధనలు, నియమాలు, చేలాలు అంటే వాళ్ల శిష్యులు పాటించనప్పుడు, నిరసనగా లేదా కోపంతో తాలీ కొడుతూ ఉంటారు. ఎవరైనా అనవసరంగా తాలీ కొడితే కూడా దానికి దండ వేస్తూ ఉంటారు. ఇక్కడ తాలీ కేవలం వ్యక్తిగత వ్యక్తీకరణ కాదు. అది సముదాయంలోని నియమాలు, సంబంధాలు, గురు–చేలా వ్యవస్థ, అధికారం వంటి వాటితో కూడా ముడిపడి ఉంటుంది.
గాయత్రి రెడ్డి యొక్క విత్ రెస్పెక్ట్ టు సెక్స్ : దక్షిణ భారతంలో హిజ్రా గుర్తింపు చర్చలు హిజ్రా సముదాయంలోని గురు–చేలా సంబంధాలు, హిజ్రా ఇల్లు, నిర్వాణం, బధాయి, గుర్తింపు, గౌరవం వంటి అంశాలను విస్తృతంగా చర్చిస్తుంది. ఈ 2005 పుస్తకం హిజ్రా గుర్తింపును స్థానిక గౌరవ ఆర్థిక వ్యవస్థ ద్వారా పునర్నిర్మించి, లింగ, నైతిక, స్థానిక-గ్లోబల్ సంబంధాలను లోతుగా విశ్లేషించింది.
చటాయి, నిర్ణయాలు మరియు ప్రకటన
హిజ్రా సముదాయాలు వాళ్లు పెట్టుకునే సమావేశాలు ఉంటాయి. వాటిని చటాయి అంటారు. ఆ చటాయిల్లో పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకున్నప్పుడు, వారి పరిధి పరంగా కావచ్చు, నగరం పరంగా కావచ్చు, ఊరి పరంగా, ప్రాంతం పరంగా ఎలా తీసుకున్నా కూడా, అందరూ హిజ్రా నాయకుల మధ్యలో, చేలాల మధ్యలో, సముదాయం మధ్యలో నిర్ణయాలు తీసుకున్నప్పుడు కూడా గట్టిగా తాలీ కొడుతూ ఉంటారు. ఇదొక ప్రకటన వంటిది. దీనిని మహాభారతంలో యుద్ధబేరితో పోలుస్తూ ఉంటారు. అంటే, ఇక్కడ తాలీ ఒక నిర్ణయాన్ని బహిరంగంగా ప్రకటించే శబ్దంగా మారుతుంది. ఒక నిర్ణయం తీసుకున్నాం, ఒక మాటకు వచ్చాం, ఒక సముదాయంగా నిలబడ్డాం అనే అర్థాన్ని కూడా అది కలిగి ఉంటుంది.
తాలీ: కోపం, నిరసన మరియు ప్రతిఘటన
ఇప్పుడు ఇటువంటి సంస్కృతి మెల్లగా తగ్గిపోతుంది. ఎందుకంటే హవేలీలు కూడా ఎక్కడెక్కడో ఉండటం, హవేలీ బయటకు వచ్చేసి హవేలీకి వ్యతిరేకంగా చాలా చిన్న చిన్న హిజ్రా సముదాయాలు ఏర్పడటం వల్ల ఈ సంస్కృతి తక్కువ అయిపోవడం జరుగుతూ ఉంది. ఇప్పటికీ కూడా మామూలుగా హిజ్రాల్లో ఎవరికైనా కోపం వచ్చినా, చిరాకు వచ్చినా, వాళ్లను ఎవరైనా విసిగించినా, వెక్కిరించినా, బహిరంగ ప్రదేశాల్లో వెక్కిరించినా, అప్పుడు గట్టిగా నిరసనగా తాలీ కొడుతూ ఉంటారు. కానీ ఇందులో వాళ్లు మానసికంగా చాలా ఆందోళన పడుతున్నట్టు, బాధపడుతున్నట్టు, కోపం వస్తున్నట్టు కూడా చాలా తెలుస్తూ ఉంటుంది. సమాజం తరచుగా తాలీని ఒక అసహజమైన లేదా భయపెట్టే శబ్దంగా చూస్తే, హిజ్రా వ్యక్తుల అనుభవాల్లో అది తమ సముదాయానికి చెందిన భావాన్ని, తమ ఉనికిని, ప్రతిఘటనను వ్యక్తం చేసే సాంస్కృతిక ఆచరణగా కనిపిస్తుందని పరిశోధకులు చూపించారు.
రాత్రి జీవితం, సెక్స్ వర్క్ మరియు పరస్పర సంకేతాలు
అదే విధంగా, హిజ్రాల్లో లేదా లింగాంతర సముదాయంలో చాలా మంది సెక్స్ వర్క్ చేయటం, ప్రత్యేకంగా రాత్రిపూట చేయటం అనేది మనం చూస్తూ ఉంటాము. అలాంటప్పుడు కూడా ఎవరైనా వెక్కిరించినా, ఇబ్బంది పెట్టినా తాలీ కొట్టి వేరే వాళ్లకి సంకేతం ఇస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి రాత్రిపూట ఎవరైనా విటుడు ఇబ్బంది పెట్టినట్టయితే, సాధారణంగా తాగేసి వచ్చి, మద్యం సేవించి వచ్చి, లేదా డబ్బులు ఇవ్వకపోవడమో, లేకపోతే హింసించడమో ఇలాంటివి జరిగినప్పుడు నిరసనగా అందరూ కలిసి తాలీ కొడుతూ ఉంటారు. ఇక్కడ తాలీ ఒక రకమైన అంతర్గత హెచ్చరిక వ్యవస్థగా కూడా పనిచేస్తుంది.
బస్తీలో తప్పిపోకుండా ఉండేందుకు తాలీ
సాధారణంగా ఒక సముదాయం, ఒక గురు కింద పనిచేసే ఒక గుంపు హిజ్రాలు బస్తీకి వెళ్లినప్పుడు, ఒకే ప్రాంతంలో వెళ్లినప్పుడు, వారు ఇద్దరిద్దరు చొప్పునో, లేకపోతే ఒకరొకరిగానో ఒక్కొక్క వీధి తీసుకొని బస్తీ చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు వారు తప్పిపోకుండా, వారు మళ్లీ కలిసేలాగా తాలీ అనేది కొట్టి, గట్టిగా చప్పట్లు కొట్టి, “నేను ఇక్కడ ఉన్నాను” అని సంకేతం ఇస్తూ ఉంటారు. ఇది సముదాయం లోపలి సమాచార మార్పిడికి మరో రూపం. మాటలతో ఒకరికొకరు కనిపించని సందర్భంలో శబ్దం ద్వారా తమ ఉనికిని తెలియజేసుకోవడం.
ఆపత్కాలిక సమయంలో తాలీ
ఆపత్కాలిక సమయాల్లో కూడా తాలీ ఉపయోగపడుతుంది.
రాత్రిపూట సెక్స్ వర్క్ చేసినా లేదా ఇంకా ఎక్కడైనా కొంచెం గొడవగా ఉన్నా, పోలీస్ వాళ్లు వస్తున్నారు అంటే వీళ్లకి ఇది సంకేతం. గట్టిగా, గట్టిగా చప్పట్లు కొట్టుకొని ఒకరికొకరు సంకేతం చెప్పుకుని, అక్కడి నుంచి వేరే ప్రాంతానికి వెళ్లిపోయేలాగా తాలీ అనేది పనికి వస్తూ ఉంటుంది. అంటే బయటి వారికి అది ఒక సాధారణ చప్పట్ల శబ్దంలా కనిపించినా, సముదాయంలోని వ్యక్తులకు అది ఒక అత్యవసర సమాచార సంకేతంగా కూడా పనిచేయవచ్చు.
నిజమైన హిజ్రా — నకిలీ హిజ్రా: తాలీ ద్వారా గుర్తింపు
అయితే ఒక లింగాంతర వ్యక్తిగా బట్టలు ధరించి, వేషధారణ చేసుకుని హిజ్రా అని చెప్పుకుంటే, ఆ హిజ్రా నిజమైన హిజ్రానా లేకపోతే నకిలీ హిజ్రానా అని తెలుసుకోవడానికి కూడా తాలీ ఉపయోగపడుతుంది. తాలీ కొట్టమని చెప్తారు. ఇక్కడ తాలీ కేవలం ప్రదర్శన కాదు; సముదాయంలో ఒక వ్యక్తి తనకు తాను ఎలా పరిచయం చేసుకుంటున్నాడు, తనను తాను ఏ సాంస్కృతిక సముదాయానికి చెందిన వ్యక్తిగా స్థాపించుకుంటున్నాడు అనే ప్రశ్నలతో కూడా అది ముడిపడి ఉంటుంది.
బీలా తాలీ: వ్యతిరేకత, అధికారం మరియు ఆధిపత్యం
తర్వాత తాలీ ఒక్కొక్కసారి నిరసన తాలీతో కూడా, అంటే వ్యతిరేకిస్తూ కూడా జరుగుతుంది. దీనిని బీలా తాలీ అంటారు. దీనిలో ఏంటంటే, సముదాయంలో ఏదైనా మనస్పర్థలు వచ్చినా, గొడవలు వచ్చినా, తర్వాత ఒక మాటపైనా ఇద్దరూ ఒప్పందానికి రాకున్నా, అప్పుడు బీలా తాలీ కొడతారు. అందులో ఏంటంటే, ఈ తాలీలో ప్రత్యేకంగా అధికారాన్ని, ఆజమాయిషీని, ఆధిపత్యాన్ని గట్టిగా చూపిస్తూ ఉంటారు. తర్వాత ఇదే చేలాలు ఏదైనా మాట వినకున్నా కూడా బీలా తాలీ కొడతారు. అందువల్ల తాలీకి ఒకే ఒక అర్థం ఉండదు. ఒక సందర్భంలో అది ఆహ్వానం కావచ్చు; మరొక సందర్భంలో ఆశీర్వాదం కావచ్చు; ఇంకొక సందర్భంలో హెచ్చరిక కావచ్చు; మరొక సందర్భంలో నిరసన కావచ్చు; మరొక సందర్భంలో సముదాయపు అధికారం లేదా నిర్ణయాన్ని ప్రకటించే శబ్దం కావచ్చు.
తాలీ ఎలా కొడతారు?
ఇప్పుడు ఇంకొక ప్రత్యేకత ఈ తాలీలో ఏంటి అంటే, సాధారణ జనాభాకి మాత్రం తెలియదు. మామూలుగా చప్పట్లు కొడేస్తారు. కానీ హిజ్రాల్లో ఎడమ చేతిని తీసుకెళ్లి కుడి చేతి మీద గట్టిగా కొట్టడం తాలీ. ఇది హవేలీల్లో వారు నేర్చుకుంటారు, హిజ్రా సముదాయంలో నేర్చుకుంటారు. తర్వాత ఎక్కువ శాతం తాలీలు హవేలీలోనే కొడతారు. ఒకవేళ బయట కొట్టినట్టు అయితే అది శయతాన్ తాలీ అని కూడా అంటారు. ఇవి సముదాయంలో ఉన్న ప్రత్యేక అర్థాలు, స్థానిక వాడుకలు. కాబట్టి బయటి వారికి ఒకే రకమైన శబ్దంగా వినిపించినా, సముదాయంలో దాని రూపం, సందర్భం, ఉద్దేశం ఆధారంగా అర్థం మారుతుంది.
తాలీకి సంబంధించిన ఇతర రూపాలు
నిజాం పరిపాలన జరుగుతున్నప్పుడు మూడు సార్లు తాలీ కొడితే, అవి ఆశీర్వాదంలాగా కూడా తీసుకుంటుంటారు. ఇప్పుడు అనేక రకాలు చూద్దాం. తాలీలో అనేక రకాలు. రీత్ తాలీ అంటే సంతోషంతోటి చేస్తూ ఉంటారు. తర్వాత ఇందులో లయ కూడా మారుతూ ఉంటుంది, తాళం మారుతూ ఉంటుంది. ఏదైనా భదాయికి వెళ్లినప్పుడు, ఎవరైనా ఇంట్లో జననం జరిగినా, ఏదైనా పెళ్లి జరిగినా, ఏదైనా ప్రత్యేక కార్యక్రమం జరిగినా, అక్కడ కూడా ప్రత్యేకంగా ఆశీర్వాదాలు ఇస్తూ తాలీ కొట్టి డబ్బులు తీసుకొని వస్తారు. ఇక్కడ తాలీ జీవనోపాధితో పాటు ఒక సాంస్కృతిక మరియు ఆచారపరమైన పాత్రను కూడా పోషిస్తుంది. గాయత్రి రెడ్డి తన పరిశోధనలో హిజ్రా సముదాయం మరియు బధాయి, ఆచారాలు, గుర్తింపు, జీవనోపాధి మధ్య ఉన్న సంబంధాలను విస్తృతంగా చర్చించారు.
పాటల్లో, ఆటల్లో, సమావేశాల్లో కూడా తాలీ
హిజ్రా సముదాయం ఏవైనా పాటలు పాడుకుంటున్నా, సముదాయంలో ఏదైనా సమావేశం జరిగినా, ఏదైనా వాళ్ల నాయకులతోటి ఏదైనా సాంస్కృతిక కార్యక్రమాలు, పాటలు, ఆటలు ఉన్నా కూడా తాలీని విరివిగా వాడుతూ ఉంటారు. అంటే తాలీ కేవలం బస్తీ, రైలు, భిక్షాటన లేదా బధాయి సందర్భాలకు మాత్రమే పరిమితం కాదు. సముదాయం లోపల జరిగే సాంస్కృతిక జీవితం, వినోదం, సమావేశాలు, పాటలు, ఆటలు, సామూహిక వ్యక్తీకరణల్లో కూడా అది భాగంగా ఉంటుంది.
తాలీ: సమాజం వినే శబ్దం, సముదాయం మాట్లాడే భాష
మనం మాత్రం కేవలం వాళ్లు వస్తున్నప్పుడు, “అమ్మో, చప్పుడు చేసుకుంటూ వస్తున్నారని” చెప్పి భయపడుతూ ఉంటాము. కానీ ఇది ఒక మాటలు లేకుండా సంకేతాల ద్వారా భావాలను తెలియజేసే విధానం. హిజ్రాల యొక్క తమ సముదాయానికి చెందిన భావాన్ని, తర్వాత హిజ్రాల ప్రతిఘటనను కూడా వ్యక్తం చేసే ఒక సంకేత సాధనంగా పనిచేస్తుంది అని మాత్రం మనము చెప్పుకోవచ్చు. ఇది మాత్రం సాధారణ జనాభాకు అర్థం కాదు. హిజ్రాల యొక్క సంస్కృతిలో ఇది ఒక వినూత్నమైన సాంస్కృతిక ఆచరణగా మనం చూడొచ్చు.
ఒక తాలీ “మేము వచ్చాము” అని చెబుతుంది. మరొక తాలీ “నేను ఇక్కడ ఉన్నాను” అని తన సముదాయంలోని మరో వ్యక్తికి తెలియజేస్తుంది. ఇంకొక తాలీ ఆశీర్వాదంగా మారుతుంది. మరొకటి కోపాన్ని, నిరసనను, బాధను వ్యక్తం చేస్తుంది. ఇంకొకటి సముదాయపు నిర్ణయాన్ని ప్రకటిస్తుంది. మరొకటి ప్రమాదాన్ని సూచిస్తుంది. ఇంకొకటి ఆటపట్టింపుగా, వినోదంగా లేదా ఆకర్షణకు ప్రతిస్పందనగా మారుతుంది. అందుకే తాలీని కేవలం హిజ్రాలు కొట్టే చప్పట్లుగా చూడటం దాని సాంస్కృతిక అర్థాన్ని చాలా చిన్నదిగా చేయడం అవుతుంది. సాధారణ సమాజం దానిని ఒక శబ్దంగా వింటుంది. హిజ్రా సముదాయం దానిలో అనేక సందేశాలను వింటుంది.
అది శరీరంతో పలికే భాష. అది గుర్తింపును ప్రకటించే భాష.
అది సముదాయానికి చెందిన భావాన్ని వ్యక్తం చేసే భాష. అది జీవనోపాధికి తోడ్పడే సాధనం.
అది ఆచారంలో భాగం. అది వినోదంలో భాగం.
అది హెచ్చరిక. అది నిరసన.
అది అధికారాన్ని ప్రకటించే శబ్దం.
ముఖ్యంగా, అది “మేము ఇక్కడ ఉన్నాము” అని చెప్పే ఒక సామూహిక ప్రకటన.
తాలీని అర్థం చేసుకోవడం అంటే హిజ్రా సముదాయాన్ని కేవలం బయట నుంచి చూడటం కాదు; వారి స్వంత సాంస్కృతిక సంకేతాలు, సంబంధాలు, భావోద్వేగాలు, అధికార సంబంధాలు, జీవనోపాధి, ప్రతిఘటనలను వారు ఎలా వ్యక్తం చేసుకుంటారో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం. మనకు సాధారణంగా వినిపించే చప్పట్లు, వారి ప్రపంచంలో ఒక సంపూర్ణ సంకేత వ్యవస్థ కావచ్చు. అందుకే తాలీని భయంతో వినకుండా, దాని వెనుక ఉన్న కథను వినాల్సిన అవసరం ఉంది.
