నీ గర్భాన కొన్ని నెలలున్నాను
నీ వంతు ఆహారం తిన్నాను
నీ మనసు మాటల్ని విన్నాను
నీ రక్తంతో రూపు దిద్దుకున్నాను!
నీ సంస్కారం నుంచి స్ఫూర్తి పొందాను
నీ కన్నీటి క్లేశాల్నర్థం చేసుకున్నాను
నీ హృదయ స్పందనల్ని తెలుసుకున్నాను
నీ ఆంతర్యపు అక్షరాల్ని చదువుకున్నాను!
నీ సాత్వికతని మదిన పొదువుకున్నాను
నీ సహనాన్ని నాలో నింపుకున్నాను
నీ మూల తత్వాలను కనుగొన్నాను
నీ త్యాగాల పల్లకిలో ఊరేగుతూ పెరిగాను!
అమ్మా… ఒట్టేస్తున్నా…
నీ ఆర్ద్రతని…
నీ అభిమానాన్ని…
నీ ఔన్నత్యాన్ని…
నీ వ్యక్తిత్వాన్ని…
మహిళలందరిలో దర్శిస్తానని!
మాతృమూర్తులుగా గౌరవిస్తానని!