వసంతమేదో అర్థాంతరంగా
ముగిసిపోతున్నట్లుగా
దేహ ఋతురాగానికి అంతరాయం
యవ్వన వనాలని మాయంచేసి
ఎడారి ఇసుక మేటలు వేస్తున్నట్లు
వేడిగాడ్పులు
చెమట ఆవిర్లు వెలిబుచ్చే
నిస్సత్తువ నిస్తేజాలు
ఒక్క క్షణం సంతోషం
మరుక్షణానికి మసకబారుతుంది
క్షణానికో రకమైన ఒంటరితనం
చుట్టూ ముళ్ళకంచెలు పేరుస్తుంటుంది
ఏ రాకాసో ఆవహించినట్లు మానసికస్థితి
కండరాలు కోల్పోతున్న సత్తువ
అదుపు చేయలేని బరవు
నియంత్రించలేని రక్తస్రావం
ఒక్కొక్కటిగా చేరి బలహీనపరుస్తూ…
ఋతుచక్రానికి, మాతృత్వానికి
కారణమై గుభాళించే
స్త్రీత్వపు జాడలన్నీ
కొద్దికొద్దిగా విరమించుకుంటున్నట్లు
శరీరమిచ్చే సంకేతాలు
హార్మోన్ వరాల
ఉపసంహారం మొదలైన వేళ
నలభై దాటిన ఆమె దేహం
అనేక సంఘర్షణలతో ఒక యుద్ధక్షేత్రం!