ఆర్థిక స్వాతంత్య్రపు పెనుగులాటల్లో
గెలిచావో… ఓడావో
అలిసిపోయి వాలిన నీ రెప్పలకు
వంటింట్లో అంట్లగిన్నెల స్వాగతం, ఎప్పట్లాగానే
జారిపోయిన అవయవాలను అసహ్యించుకొని
పబ్బు దారిపట్టిన నీ పురుషోత్తముడు
తల్లివవటం తగని నేరమయినపుడు
నీదెంత స్వేచ్ఛో చూసి ఎగరలేని
గర్భసంచి పొరలు…కుట్లలో చివుక్కుమంటాయి, చివరిసారిగా
కన్నింగ్ చూపుల అత్యాచారాలను తప్పించుకోలేక
ఎండోమెట్రియం అరుపులు… నువ్వెంతైనా కాస్త తక్కువ సమానమని వెక్కిరించేస్తుంది
మోడర్న్ యుగంలో మోయలేని అస్తిత్వపు కిరీటాలు
వదిలించుకోనూలేని మనుధర్మ సూత్రాలు
బానిసత్వపు ముసుగుల్లో సమానత్వం వెతుకుతూ నవతరపు ఫెమినిజం
ఇప్పటికీ, నువ్వో రెక్కలు చిక్కుకుపోయిన పావురం