మూడు నిమిషాల్లో ముగిసే ముద్దుల చీకటి ఆటలో
ముచ్చట తీర్చుకొని… ముప్పై ఆరు వారాలపాటు
మూపురాన్ని నీ నడుముపై మోపుతాను
మోయలేని బరువున్నా… ఓపలేని ఓపికతో
మొగుడికి అత్తామామలకు అన్ని సేవలు చేసేందుకు
మొత్తం అవకాశం నీకే ఇచ్చి మురిసిపోతాను
సిరులకై చేసిన సిజేరియన్ చీల్చిన కడుపులోంచి
నాలాంటి కొడుకొస్తే… నాదే ప్రతాపమని మీసం మెలేస్తా
నీలాగ కూతురైతే… నేరమంతా నీదేనని నిందవేస్తా
కామన్సెన్సే లేని నాకు క్రోమోజోముల సెన్స్ ఎందుకు?
చెలిమిలేని బలిమిలో నీ శరీరం నిప్పుల కొలిమైనా సరే
కొరివిపెట్టే కొడుకును కనేవరకు సెగపెడుతూనే ఉంటా
నీవల్ల కాక గుడ్లు తేలేస్తే… నెల తిరక్కుండానే
ఇంగితంలేక ఇంకోదాన్ని ఇంటిదాన్ని చేస్కుని
మగబిడ్డ పుట్టేవరకు పగబట్టిన పామునైత
పుట్టినంక కూడ పట్టించుకోనని ఆడిపోస్కుంటరుగాని
ఏడ్చినపుడు, ఏర్గినపుడు, ఆకలైనపుడు, అవస్థైనపుడు తప్ప
వాడు నవ్వినంతసేపు నాతోనే ఆడిచ్చుకుంటాను కదా
ఏది ఏమైనా… ఎవరు ఏమనుకున్నా
నా కొడుకు కడా నాలాగనే మొ(న)గాడవ్వాలి
వాడు కూడా వారసుడ్ని కని మీసం తిప్పాలి
కాకపోతే ఎవరైనా నా కోడలయ్యేందుకు ఓ బిడ్డను మాత్రం కనండి
లేదంటే మా మగపుట్టుక మట్టిలో కొట్టుకుపోతుంది… ప్లీజ్… ప్లీజ్