నిన్ను నిన్నుగా తెలుసుకుని
సాటి మనిషిగా గుర్తించి
నీకు వలచే హృదయం ఉందని
అందుకోవాలనే ఆశలున్నాయని
కళ్ళనిండుగా కలలున్నాయని
రెక్కలున్న ఊహలున్నాయని
స్వేచ్ఛకోరే మనస్సుందని
ప్రేమింపబడాలనే అపేక్షలున్నాయని
గ్రహించాడొక మహామనీషి!
నీ కోసం కథలు రాశాడు
నవలలు రచించాడు
నీ హక్కుల కోసం
సమాజాన్నెదిరించాడు!
రాసిన రాతల్లాగే
నిజ జీవితంలో జీవించాడు!
అనురాగం, ఆకర్షణ
మోహం, మమకారం
స్త్రీ పురుష బాంధవ్యాల కాలంబన
అవి మృగ్యం అయితే
శృంఖలాలు తెంచుకుని
వెతుక్కుంటూ పోవడం
తప్పులేదన్నాడు!
మహిళల దుస్థితికి దుఃఖించాడు
మార్పు రావాలని కోరుకున్నాడు
స్త్రీల ఆరోగ్య సమస్యలు
పిల్లల పెంపకాలు
గర్భనిరోధకాల గురించి
సైతం రాశాడు!
చక్కని చిక్కని వ్యావహారికంలో
అసమాన కథాశిల్పంతో
చేశాడు రచనలెన్నో…
అప్పటికి అవి కాలాతీతము
ఇప్పటికీ అవి కాలోచితము
తెలుగు సాహిత్యంలో
స్త్రీ స్థానం తెలియాలంటే
చదివి తీరాల్సిందే ఆయన్ని!
అరుణ, శశిరేఖ, పద్మ
రాజేశ్వరుల సృష్టికర్త!
ఎందరికో అర్థంకాని ఎనిగ్మా!
ఆయనొక మహా ప్రవాహం!
ఒక ఉప్పెన!
సాంప్రదాయ సమాజాన్ని
ఎదిరించిన రెబల్!
నిజాయితీలో పర్ఫెక్షనిస్ట్
మొట్టమొదటి మేల్ ఫెమినిస్ట్
ఆయనో ప్రేమ పిపాసి!
అసలు సిసలైన స్త్రీ పక్షపాతి!
(చలం ప్రభావంతో రాసిన కవిత)