గమనమే గమ్యం -ఓల్గా

(గత సంచిక తరువాయి…)
చదువు సాగుతోంది. ఉద్యమం చల్లబడినట్లుంది. యువమిత్రులు తమ చదువుల్లో, పనుల్లో పడిపోయారు. ఒకటి రెండేళ్ళ కిందటి పరిస్థితికీ, ఇప్పటికీ పోలికే లేదు. శారద సోషలిస్టు సాహిత్యం సంపాదించి చదువుతోంది. ఆ పుస్తకాలు కలలను అందిస్తున్నాయి. ఆ కలలు నిజమవుతాయా? ఏదో నిరాశ, సందిగ్ధత. మూర్తితో ఆ విషయం స్పష్టంగా మాట్లాడాలనుకుంటూనే జాప్యం చేస్తోంది శారద

.
ఏదో బలహీనత తనలోనూ ఉందా అనుకుంటోంది.
ఈ నిరాశనుంచి, సందిగ్దత నుంచీ బైటపడటానికి శారదకు ఈ మధ్య వడివేలు ఆలంబన అయ్యాడు. వడివేలు నడిపే పత్రిక శారద తప్పనిసరిగా చదివేది. ఒకసారి సుదర్శనం తెచ్చిచ్చాడు. అంతే, శారద వడివేలు పత్రిక అచ్చయ్యే చోటికి వెతుక్కుంటూ వెళ్ళింది.
మద్రాసు నగరంలో ఇటువంటి ప్రదేశాలు కూడా ఉన్నాయా అని సంపన్నులు ఆశ్చర్యపడే మురికివాడలోని ఒక గది ముందు ఆగింది.
తలుపు ఓరగా తీసే ఉంది.
‘‘లోపలికి రావచ్చాండీ’’ కాస్త గట్టిగానే తమిళంలో అడిగింది. లోపల్నుంచి సన్నగా, నల్లగా
ఉన్న ఒకాయన లేచి బైటికి వచ్చాడు. ఎవరన్నట్టు చూశాడు శారద వంక.
‘‘నా పేరు శారద. డాక్టర్‌ కోర్సు చదువుతున్నాను. చాలా మంచి పత్రిక నడుపుతున్నారు. మిమ్మల్ని చూడాలని వచ్చాను’’
ఆయన ముఖంలో ఆ ప్రశంసకు ఎలాంటి సంతోషం కనపడలేదు. సరికదా కనుబొమ్మలు ముడివేసి… ‘‘పత్రిక చదవండి. నన్ను చూడటం ఎందుకు?’’ అన్నాడు.
‘‘మీ పత్రికకు సహాయం చెయ్యాలనుకుంటున్నా’’ పర్సు తీసి మూడు పదులు వడివేలుకు ఇచ్చింది. ఇప్పుడాయన ముఖంలో ముడి కాస్త వీడిరది.
‘‘పత్రిక అమ్మి పెడితే ఇంకా పెద్ద సహాయం అవుతుంది’’.
‘‘తప్పకుండా అమ్ముతాను. కాపీలుంటే ఇప్పుడే ఇవ్వండి’’.
వడివేలు ప్రసన్నుడై ‘‘లోపలికి రామ్మా’’ అని తను నడిచాడు. లోపలికి వెళ్ళింది శారద. ఆఫీసు, ఇల్లు, ప్రెస్సు అన్నీ ఆ చిన్న గదిలోనే. పది కాపీలు తీసి ఇచ్చాడు.
‘‘నాది బ్రాహ్మణ కులం. కానీ మీరు రాసే బ్రాహ్మణ వ్యతిరేక వ్యాసాలు బాగా నచ్చుతాయి. బ్రాహ్మణ తత్త్వం పోతే కానీ దేశం బాగుపడదు’’. వడివేలు నవ్వాడు. శారద తలమీద చేయిపెట్టి దువ్వాడు. ‘‘కమ్యూనిజం వస్తేగాని దేశం బాగుపడదు’’ అన్నాడు.
శారద ఉలిక్కిపడిరది. ఈ బలహీనుడైన వ్యక్తి కమ్యూనిస్టా?
ఆశ్చర్యంగా అడిగింది ‘‘మీరు కమ్యూనిస్టా?’’
‘‘ఏమో నాకు సరిగా తెలియదు. కానీ కమ్యూనిస్టునని చెప్పుకోవాలని ఉంది. దానికేం చెయ్యాలో తెలియదు’’. ‘‘ఏముంది? చెప్పుకోవటమే. ఈ రోజునుంచీ నేను కమ్యూనిస్టునని చెప్పుకుంటాను. ఇద్దరు కమ్యూనిస్టులుంటే మంచిదే కదా?’’ వడివేలు మనసారా నవ్వాడు.
‘‘నీలాంటివాళ్ళే ఈ దేశానికి కావాలమ్మా’’ అన్నాడు.
శారద కాసేపు అక్కడ కూర్చుని వచ్చేసింది. ఆ రోజు నుంచీ అప్పుడప్పుడూ వడివేలుని చూడడానికి వెళ్ళేది. వట్టి చేతుల్తో ఎప్పుడూ వెళ్ళేది కాదు. ఏదో ఒకటి తినటానికి తీసుకెళ్ళేది. ఇద్దరూ కలిసి అవి తింటూ బ్రాహ్మణులను, వారి ఆచారాలనూ, బ్రిటిష్‌ వాళ్ళనూ, వాళ్ళ దోపిడీని తిట్టుకుంటూ కూచునేవారు. వడివేలు పనిలో తను చేయగలిగిన చిన్న సాయమైనా చేసేది.
వడివేలంటే ఎంతో గౌరవం శారదకు. ఆ పేదరికంలో, ఆ బలహీనతతో, అతి తక్కువ వనరులతో ఆయన ఎలాంటి పని చేస్తున్నాడో చూస్తే తనెంతెంత పనులు చెయ్యాలో గదా అనుకునేది.
ఎలాంటి మనుషులున్నారు దేశంలో….
తను వడివేలుని కలిసిన సంగతి సుదర్శనంతో, మూర్తితో చెప్పింది.
‘‘అక్కడికెందుకెళ్ళావు? పోలీసులు చూస్తే ప్రమాదం’’ అన్నారు ఇద్దరూ కూడబలుక్కున్నట్టు.
‘‘పోనీలే.. ఒక్క ప్రమాదకరమైన పనైనా చేశానని తృప్తి పడనీయండి’’ అని నవ్వేసింది శారద.
మూర్తి గురించి అతని సమక్షంలో శారదకు ఏ ఆలోచనలూ రావు. మిగిలిన స్నేహితులతో ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. కానీ ఏ రాత్రి పూటో ఒంటరిగా ఉన్నప్పుడు మూర్తి గురించిన ఆలోచనలు చుట్టుముట్టి అలజడి చేస్తుంటాయి. నియంత్రించబోతే శరీరం, మనసూ కూడా సహకరించవు.
ఏదో పనిమీద పరశువాకం వెళ్ళిన శారదకు వడివేలుని చూడాలనిపించింది. చాలా రోజులే అయింది అతన్ని కలిసి. ఆలోచన వస్తే ఇక శారద ఒక్క క్షణం తటపటాయించదు. వెంటనే ఆచరణలో పెట్టేస్తుంది. ట్రాము దిగి సందుగొందులు తిరుగుతూ ఉత్సాహంగా వడివేలు గదిలోకి వెళ్ళింది. ఆయన హడావుడిగా ఏదో పని చేసుకుంటున్నాడు. శారదను చూడగానే ఒక్కసారి అతను ముఖంనిండా నవ్వాడు. కూర్చోమని కూడా అనకుండా పత్రిక కాపీల కట్టను శారద చేతిలో పెట్టి ‘‘ఇంక ఈ పేరుతో పత్రిక రాదు. ఇదే చివరిది’’ అన్నాడు. శారద ఆందోళనగా ‘‘ఏమైంది. పోలీసులు వచ్చారా?’’ అని అడిగింది.
‘‘పోలీసులు కాదు. కమ్యూనిస్టులే వచ్చారు’’ అన్నారు వడివేలు.
‘‘కమ్యూనిస్టులా? మనిద్దరం కాక కమ్యూనిస్టులింకా ఉన్నారా?’’ తేలిగ్గా నవ్వుతూ అడిగింది శారద.
‘‘ఉన్నారు. మనలాంటి వాళ్ళు కాదు. నిజం కమ్యూనిస్టులు. ఒకతను రష్యా నుంచి వచ్చాడు. త్వరలో మనలాంటి వాళ్ళందరం అతనితో కలిసి కూర్చొని మాట్లాడదాం. కమ్యూనిస్టు పార్టీ పెడదాం. మేం కమ్యూనిస్టులమని చెప్పుకుందాం’’ వడివేలు ఆపకుండా ఉత్సాహంగా మాట్లాడుతున్నాడు.
శారదకు శరీరం మీద పులకలు వచ్చాయి.
‘‘రష్యా నుంచి కమ్యూనిస్టు వచ్చాడు. తను కమ్యూనిస్టు… కమ్యూనిస్టు పార్టీ సభ్యుడు’’ ఏదో తన్మయత్వంలో పడి తేరుకుంటూ.
‘‘నాకంతా చెప్పండి. ఇదంతా ఎప్పుడు జరిగింది?’’
‘‘నాకిప్పుడు సమయం లేదు. త్వరలో సమావేశం జరుగుతుంది. అంతా తెలుస్తుంది’’.
వడివేలు పని తెమిలేలా లేదు. శారదను పట్టించుకునే తీరిక లేకుండా కాగితాలతో కుస్తీ పడుతున్నాడు.
శారదకు అక్కడనుంచి కదలక తప్పలేదు.
ఇంటికి వెళ్ళాలనిపించలేదు. ఇదంతా… ఈ ఉద్వేగానుభూతినంతా వెంటనే ఎవరితోనైనా పంచుకోకపోతే ఊపిరాడేలా లేదు. పొంగుతున్న ఉత్సాహం ఎవరితోనైనా చెప్పందే నిలవనిచ్చేలా లేదు.
మూర్తి తప్ప ఎవరూ దీనిని, తను అర్థం చేసుకున్నట్టు అర్థం చేసుకోలేరు. మూర్తిని చూడాలి. ఈ సమయంలో మూర్తి ఎక్కడుంటాడు. ఇంటి దగ్గరకు వెళ్ళి చూస్తే… ఏమవుతుంది? ఏమీ కాదు.
శారద చకచకా ముందుకు నడిచి ట్రాము ఎక్కేసింది.
ట్రాము దిగి నాలుగు ఫర్లాంగులు నడిస్తే కానీ మూర్తి ఇల్లు రాదు.
మూర్తి ఇల్లు తలుపులు తడుతుంటే గుండె దడదడలాడిరది.
మూర్తే వచ్చి తలుపు తీశాడు. శారదను చూసి కంగారు పడ్డాడు.
‘‘ఏమైంది? ఎందుకొచ్చావ్‌’’ హడావుడిగా అడిగాడు.
‘‘రాకూడదా?’’ నవ్వింది శారద.
శారద నవ్వు చూసి స్థిమితపడి ‘‘ఎందుకు రాకూడదు? ఇంతకు ముందెప్పుడూ రాలేదుగా?’’ అని లోపలికి తీసికెళ్ళాడు.
ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. మనుషులున్న అలికిడే లేదు.
‘‘ఎవరూ లేరా?’’ ‘‘లేరు. బంధువులింట్లో పెళ్ళయితే వెళ్ళారు. నాకు ఆ పెళ్ళిళ్ళకు వెళ్ళటం విసుగు. ఇంటికి కాపలా
ఉండిపోయాను. ఉన్నందుకు చూశావా ఎంత అదృష్టం కలిసొచ్చిందో’’.
శారద గలగలా నవ్వింది.
‘‘శారదా! నువ్వు నవ్వుతుంటే ప్రాణాలు ఇచ్చెయ్యాలనిపిస్తుంది’’.
‘‘మూర్తీ… మనిద్దరం ప్రాణాలు అర్పించాల్సిన గొప్ప విషయం ఒకటుంది’’.
‘‘ఏమిటది’’ ఆశ్చర్యంగా అడిగాడు మూర్తి.
‘‘కమ్యూనిజం. మూర్తీ… నేను కమ్యూనిస్టుని. నువ్వూ కమ్యూనిస్టువే కదూ…’’ శారద ఆనందంగా కళ్ళనీళ్ళతో అడిగింది. మూర్తి ఆశ్చర్యానికంతు లేదు. ‘‘శారదా… కమ్యూనిస్టేమిటి? ఇంత ఆనందంగా ఉన్నావు. ఏం జరిగింది?’’
‘‘కమ్యూనిజం అంటే నీకు తెలియదా? దేశంలో ఆకలి, దరిద్రం, బీదా, గొప్ప తేడాలు లేకుండా చేసేస్తుంది. అందరూ సమానులే. సొంత ఆస్తి ఉండదు. అందరూ ఒళ్ళు వంచి పనిచేస్తారు. కావలసినంత తింటారు. చదువుకుంటారు. దేనికీ లోటుండని స్వర్గం. ఆ స్వర్గాన్ని నిర్మించేవాళ్ళు కమ్యూనిస్టులు’’.
‘‘ఏమిటీ ఆవేశం శారదా?’’
‘‘ఈ మధ్యే కమ్యూనిస్టు మానిఫెస్టో చదివాను. అది చదువుతుంటే నా రక్తం ఎలా ఉప్పొంగిందనుకున్నావు. ఎలా పోటెత్తిందనుకున్నావు. శరీరమంతా తేలిపోయింది. నరాలన్నీ మీటటానికి సిద్ధంగా ఉన్న వీణ తీగల్లా అయిపోయాయి. జలపాత స్నానానుభూతి. గొప్ప సౌందర్యం నా కళ్ళముందు. దానికి రూపం లేదు. రూపం లేని సౌందర్యం, సవ్వడి లేని సంగీతం, బ్రహ్మానందమంటారే అదేదో నాకు అనుభవంలోకి వచ్చినట్లయింది. ఇప్పటికీ కమ్యూనిజాన్ని తల్చుకున్నంత మాత్రాన ఒళ్ళంతా పులకరిస్తుంది. ఇది నా తొలి వలపులా ఉంది. నేను కమ్యూనిస్టుని. నేనూ, కమ్యూనిజం వేరు కాదు. ఒకటే… అద్వైతం ఇదే కదూ…’’
‘‘శారదా! ఉండు. నన్ను ఊపిరి పీల్చుకోనివ్వు. ఇవాళేమైంది? ఎక్కడి నుంచి వస్తున్నావు. అది చెప్పు’’.
శారద మెల్లిగా వాస్తవ ప్రపంచంలోకి వస్తున్నట్లుగా చెప్పింది.
‘‘ఇవాళ వడివేలు గారి దగ్గరికెళ్ళాను. ఆయన కూడా కమ్యూనిస్టే తెలుసా? ఇవాళ ఆయనే చెప్పాడు. రష్యానుంచి కమ్యూనిస్టు పార్టీ సభ్యుడు వచ్చాడట. మద్రాసులో మనలాంటి వాళ్ళందరం కలుస్తాం. పార్టీని నిర్మిస్తాం. మూర్తీ… మనం… మనం కమ్యూనిస్టు పార్టీని నిర్మిస్తాం. ఇది అద్భుతంగా లేదూ?’’
మూర్తి చేతులు పట్టుకు ఊపేసింది శారద.
‘‘పరమాద్భుతంగా ఉంది శారదా. నేనూ, సుదర్శనం కూడా కమ్యూనిజం గురించి మాట్లాడుకున్నాం. నువ్వు గాంధీ భక్తురాలివి కదా కమ్యూనిస్టువి కావేమో అనుకున్నా…’’
‘‘మూర్తీ… ఇవాళ నా మనసులో ఇంకే సందేహాలూ లేవు. నేను కమ్యూనిస్టుని. అయామ్‌ ఎ కమ్యూనిస్ట్‌’’.
‘‘నేనూ… నేను కూడా’’ శారదను ప్రేమగా దగ్గరకు తీసుకున్నాడు.
శారదకా క్షణంలో ఏ సంశయాలూ, సందేహాలూ లేవు.
‘‘మూర్తీ! ఎంత గొప్పగా ఉందీ భావన. కమ్యూనిస్టు కావడమంటే ఏమిటో తెలుసా? ఒక గొప్ప సత్యాన్ని తెలుసుకోవటం. జ్ఞానాన్ని సంపాదించటం బుద్ధునిలా. కమ్యూనిస్టు మానిఫెస్టోలో మొట్టమొదటి వాక్యమే సూర్యోదయంలా అద్భుతంగా
ఉంది. ఏమంటున్నారో విను! ‘ఇంతవరకూ నడచిన సమాజపు చరిత్ర అంతా వర్గ పోరాటాల చరిత్రే’. మూర్తీ… అంతా తేటతెల్లమైపోవటం లేదూ? ప్రపంచమంతటినీ పట్టి చూసినట్టు లేదూ? ఆ వాక్యం చదివినప్పుడు నా ఎదుట ఒక మహా విశ్వరూప సందర్శనం జరిగినట్లు అనిపించింది. నిజంగా… ఈ సమాజపు నగ్న స్వరూపం కూడా చూశాను కమ్యూనిస్టు ప్రణాళికలో. బూర్జువా వర్గం మనిషికీ మనిషికీ మధ్య నగ్నమైన స్వలాభం తప్ప కిరాతకమైన డబ్బు లావాదేవీ తప్ప ఇక ఏ సంబంధాన్నీ మిగలనివ్వలేదు. ఇంకా మార్క్స్‌ రాస్తాడిలా… అది మనిషి విలువను రూపాయల్లోకి మార్చేసిందనీ, వైద్యులనూ, న్యాయవాదులనూ, కవులనూ, శాస్త్రవేత్తలనూ అది తనకింద కూలికి పనిచేసే సేవకులుగా మార్చేసిందనీ… ఎలాంటి మాటలివి… ఎంత అచ్చమైన, స్వచ్ఛమైన, సత్యమైన మాటలవి. అబ్బా మూర్తీ! ఈ బ్రిటిష్‌ సామ్రాజ్యం ఎలా కూలిపోతుందో నా కళ్ళకు కట్టినట్లు కనిపించింది. ఈ ఆర్థిక సంక్షోభం, ఈ దరిద్రం, ఈ పీడన అంతా బ్రిటిష్‌ సామ్రాజ్యం తన నెత్తిమీదకు తాను తెచ్చుకున్నదే. ఇదుగో నే చెప్తా విను…’’ శారద గలగలా నవ్వింది.
నవ్వుతూ, నవ్వుతూ చెప్తోంది. పొంగుతున్న సంతోషంతో మాటలు ఆగుతూ, ఆగుతూ వస్తున్నాయి.
‘‘ఈ బూర్జువా సమాజం తన మంత్ర శక్తితో సృష్టించిన భూతాలను తాను అదుపు చేసుకోలేక వాటి చేతిలో మంత్రగాడిలా చస్తుంది’’ ఆ నవ్వులో కసి, కోపం కలగలిసి ఉన్నాయి.
‘‘మూర్తీ… మనిద్దరం కలిసి చదువుదాం. మళ్ళీ మళ్ళీ చదువుదాం. అర్థం చేసుకోవాలి ఇంకా. ఇవాళ రామకృష్ణ ఎంత గుర్తొస్తున్నాడో. మేం చాలా పుస్తకాలు కలిసి చదివాం. ‘ఆడవాళ్ళను సమాజం ఎప్పుడూ సమిష్టి ఆస్తిగా ఉంచిందన్నారు’ కమ్యూనిస్టు మానిఫెస్టోలో. ఆ చరిత్రంతా తెలుసుకోవాలి’’. ‘‘మూర్తీ… చివరిగా పరమాద్భుతమైన మహా సత్యం చెప్పారు. అది చదువుతూ నేనేమయ్యానో నాకే తెలియదు. అదో విశ్వ రహస్యాన్ని కనుగొన్న, చూసిన గొప్ప అనుభవం. ‘కార్మికులు పోగొట్టుకున్నదేమీ లేదు. తమ సంకెళ్ళు తప్ప. వారికి గెలవవలసిన ప్రపంచం ఉంది’. ప్రపంచమంతా ఒక్కటే… మనదే మూర్తీ… మనదే… ఎలా ఉంది?’’
‘‘శారదా. నేనెప్పుడూ అనుకోలేదు నాకింత అదృష్టం పడుతుందని. నీ కలలు నాతో ఇంత ఆత్మీయంగా, నువ్వే నేనన్నట్టు పంచుకుంటావని’’ శారదను మరింతగా హత్తుకున్నాడు.
శారద అతన్నుంచి విడిబడి నవ్వింది.
‘‘అదంతా తర్వాత… మూర్తీ… మనం నిజంగా మార్చేస్తాం కదూ దేశాన్ని. దించేస్తాం కదూ స్వర్గాన్ని’’. ‘‘తప్పకుండా. కానీ అదంత తేలిక కాదు’’.
‘‘తేలికో, కష్టమో. ప్రాణాలు పోతాయో, ఏమవుతుందో. కానీ ఇవాళ నాకు ఆకాశాన్నందుకున్నట్టు ఉంది. ఈ ప్రపంచంలోని ప్రతి ప్రాణిని కావలించుకున్నట్టుగా ఉంది. ఎంత తొందరగా ఆ సమావేశం జరుగుతుందా అని చూస్తున్నా’’.
శారద ముఖం వేయి సూర్యుల కాంతితో జ్వలిస్తోంది. మూర్తికి ఒక క్షణం భయం వేసింది ఆ ప్రకాశ తీవ్రతను చూసి.
శారదే ఆపకుండా మాట్లాడిరది కమ్యూనిస్టు మేనిఫెస్టో గురించి.
శారద గొంతులోంచి జలపాతంలా దూకుతున్న ఆ మాటల జడిలో తడిసి ముద్దయిపోయిన మూర్తికి ప్రపంచంలో ఈ క్షణం తప్ప మరింక ఏదీ వాస్తవం కాదనిపించింది.
ఇద్దరూ ఆదర్శ లోకాలలో విహరించటంలోని అత్యున్నత ఆనందాన్ని మనసారా అనుభవించారు.
రాత్రి పొద్దుబోయాక శారదను ఇంటి దగ్గర దించి వస్తున్న మూర్తికి తన పక్కన శారద ఉన్నట్టే ఉంది. ఇంట్లో మంచం మీద పడుకున్న శారదకు తన పక్కన మూర్తి ఉన్నట్లే అనిపించింది. ప్రపంచం మీద, ప్రపంచంలోని దీనులు, పేదల మీద ప్రేమ ఒకరి హృదయంలోంచి ఇంకొకరి హృదయంలోకి ప్రవహించిన క్షణాల బలం ఎలాంటిదో ఇద్దరికీ అనుభవమైంది. ఆ బలం వారిద్దరి స్నేహానికీ అంతులేని శక్తినిచ్చింది.
… … …
‘‘విశాలాక్షి స్వయంగా వచ్చి పిలిచింది. వెళ్ళక తప్పదు’’ అనుకుని చదువుతున్న పుస్తకాన్ని పక్కనపెట్టి నాటకానికి వెళ్ళేందుకు తయారవ్వాలని లేచింది శారద.
విశాలాక్షికి ఆ సంవత్సరం ఎమ్మేలో చేరేందుకు సీటు దొరకలేదు. నాటకాల్లో వేషాలు వేయటమూ తప్పలేదు. కొత్త నాటకం వేస్తుంటే శారదను పిలిచేది. శారద ఒకసారి మూర్తిని, సుదర్శనాన్ని కూడా తీసుకెళ్ళింది. ఆ నాటకాలు పెద్ద బావుంటాయని కాదుగానీ విశాలాక్షి కోసం, కోటేశ్వరి కోసం వెళ్ళేది.
ఇప్పుడేదో సాంఘిక నాటకమని చెప్పింది.
శారద ముందుగా విశాలాక్షి ఇంటికి వెళ్ళింది. ఇద్దరూ కలిసే థియేటర్‌కి వెళ్ళారు. వాళ్ళంతా వేషాలు వేసుకుంటుంటే శారద విశాలాక్షికి సాయం చేస్తూ కబుర్లు చెబుతోంది. ఇంకో పావుగంటలో నాటకం మొదలవుతుండగా విశాలాక్షి తల్లి కోటేశ్వరి సంతోషంగా వచ్చింది.
‘‘విశాలా. నీ అదృష్టం బావుందే. బళ్ళారి రాఘవరావు గారు మన నాటకం చూడటానికి వస్తున్నారు’’. ‘‘ఎవరొస్తే మనకేమిటమ్మా. మన నాటకం మనం ఆడాలిగా. తప్పదుగా’’.
‘‘తిండి పెట్టేది అవే. ఆ నాటకాల గురించి ఎందుకట్టా మాట్టాడతావు. పెద్దాయన వస్తున్నాడు. నువ్వు వినయంగా నమస్కారం చెయ్యి. ఆయన తల్చుకుంటే నిన్ను మహానటిని చేస్తాడు’’.
‘‘మహానటిని కావాలని నాకేం కోరిక లేదు. ఐనా మహానటులు ఎవరికి వారు కావాల్సిందే. ఇంకొకరు చేయలేరు’’ దురుసుగా అంది విశాలాక్షి.
‘‘నా మాటలన్నీ నీకు తప్పుగానే వినపడతాయి. చూడు శారదమ్మా, నీ స్నేహితురాలి వరస’’ అంటూ పక్కకు వెళ్ళింది కోటేశ్వరి.
‘‘ఎందుకే, మీ అమ్మనట్లా బాధపెడతావు’’ జాలిగా అంది శారద.
‘‘నా లోపల, నా జీవితం గురించి ఎంత అసంతృప్తి ఉందో నీకు తెలియదు. ఎంత ఆపినా ఆగకుండా ఇలా పైకి తన్నుకొస్తుంది. అమ్మకూ, నాకూ ఇది అలవాటేలే’’.
‘‘బళ్ళారి రాఘవ అంటే నాకు చాలా ఇష్టం. ఎంతో మంచి నటుడు. నేను ఆయన నాటకాలు చూశాను’’ ఉత్సాహపరచబోయింది శారద.
‘‘నేనూ చూశాను. గొప్ప నటులే. కాదన్నదెవరు?’’ నిర్లిప్తత పోలేదు విశాలాక్షి గొంతులో.
ఇంతలో నాటకం మొదలవుతుందనే పిలుపులు. విశాలాక్షి వెళ్ళింది. శారద వెళ్ళి ప్రేక్షకుల్లో కూర్చుంది.అది గొప్ప నాటకం కాదు గానీ విసుగు పుట్టించలేదు.
నాటకం పూర్తయ్యాక బళ్ళారి రాఘవను స్టేజీ మీదకు పిల్చారు. ఆయన వచ్చి నాటకం గురించి నాలుగు మంచి మాటలు చెప్పి, ఆంధ్రదేశంలో గొప్ప బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చి నాటకరంగంలో చరిత్ర సృష్టిస్తున్న కొమ్మూరి పద్మావతి కూడా నాటకానికి వచ్చిందనీ, ఆమె వేదిక మీదికి రావాలనీ కోరారు. పద్మావతి స్టేజి మీదకు వచ్చి అందరికీ నమస్కారం చేసేసరికి ప్రేక్షకుల ఉత్సాహం రెట్టింపయింది.
ఆ సభా తతంగం అయ్యాక లోపల మేకప్‌ రూంలోకి చాలామందే వచ్చి అభినందించారు. రాఘవగారు, పద్మావతి గారూ నలుగురితో కలిసి వచ్చారు.
‘‘మా అమ్మాయి బి.ఎ. చదివిందండీ’’ అంది కోటేశ్వరి గర్వంగా.
‘‘మంచిది. చదువుకున్న వాళ్ళూ, కుటుంబ స్త్రీలు వస్తేనే నాటకరంగ ప్రతిష్ట పెరుగుతుంది’’ అన్నారు బళ్ళారి రాఘవ.
‘‘కుటుంబ స్త్రీలంటే ఎవరండీ? కుటుంబ స్త్రీలు కానిదెవరండి’’ చాలా కటువుగా అడిగింది విశాలాక్షి. అందరూ నిశ్శబ్దమైపోయారు.
బళ్ళారి రాఘవ పక్కనున్న తెల్లటి అందమైన మనిషి సన్నగా నవ్వి ‘‘తప్పు ఒప్పుకొని ఆ అమ్మాయిని క్షమాపణ అడగండి’’ అన్నాడు.
పద్మావతి కంగారుపడుతూ ‘‘మీరూరుకోండి’’ అన్నది.
‘‘అమ్మా… ఆయన తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను. నా పేరు గుడిపాటి వెంకట చలం. కథలూ అవీ రాస్తుంటాను. నువ్వడిగిన ప్రశ్న చాలా సరైన ప్రశ్న’’.
బళ్ళారి రాఘవ గంభీరంగా అక్కడినుంచి వెళ్ళిపోయాడు. ఆయనతో వచ్చినవాళ్ళూ వెళ్ళిపోయారు. చలంగారు రెండు నిమిషాలు నిలబడి ‘‘మీ నాటకం నాకేం నచ్చలేదు గానీ నీ మాటలూ, నువ్వూ… మర్చిపోలేను’’ అంటూ వెళ్ళిపోయారు.
శారద చలం గారిని చూసిన సంభ్రమంలో మిగిలినవన్నీ మర్చిపోయింది.
‘‘విశాలా… చలం గారు’’ అంది విశాలను కుదుపుతూ.
‘‘ఔను… అదే… చూస్తున్నా’’.
కోటేశ్వరి అందరినీ గదమాయిస్తూ సామాను సర్దిస్తోంది. ఆమెకు కూతురి మీద పట్టరాని కోపంగా ఉంది. అంత పెద్ద మనిషిని పట్టుకుని అవమానించింది. బి.ఎ. చదివానని పొగరు. దీన్తో ఎలా వేగాలో తెలియటం లేదు. ఆమెకి విశాలాక్షి భవిష్యత్తు గురించి బోలెడు భయం.
విశాలాక్షి ఇల్లు చేరాక తల్లితో పెద్ద యుద్ధమే చేసింది.
‘‘నేనింక నాటకాలు వెయ్యను’’ అని ప్రకటించేసింది.
‘‘ఒక పక్క ఆ బ్రాహ్మలావిడ నాటకాల్లోకి వస్తే… నీకు పరువు తక్కువైందా నాటకాలేస్తే’’ అని కూతుర్ని తిట్టింది కోటేశ్వరి.
‘‘ఔనమ్మా! బ్రాహ్మలు, కుటుంబ స్త్రీలు నాటకాలేస్తే గొప్ప. మనం ఏం చేసినా గొప్ప కాదు. వాళ్ళను చూసినట్లు మనల్ని చూడరు’’.
‘‘నీకు ఏం కావాలే. ఇప్పుడు నీకేం తక్కువైంది?’’ అరిచింది తల్లి.
‘‘అది నీకూ తెలుసు, నాకూ తెలుసు. మళ్ళీ నా నోటితో చెప్పాలా’’ గయ్యిమంది కూతురు.
కోటేశ్వరికి మండిపోయింది.
‘‘సరే! నోర్మూసుకుని తిండి తిని పడుకో. చేసే పని సంతోషంగా చెయ్యటం చేతకాని దద్దమ్మవి. నీ మీద నీకు గౌరవం లేదు. నిన్ను నువ్వు గొప్పనుకోవటం తెలియదు. ఎవరో నిన్ను గొప్పదానివనాలా? నీ గురించి నీకు తెలియదా?’’
విశాలాక్షికి ఎవరో గట్టిగా నెత్తిమీద కొట్టినట్లయింది.
‘‘నీ మీద నీకు గౌరవం లేదు. ఎవరో నిన్ను గొప్పదానివనాలా’’ అన్న తల్లి మాటలు అలజడి రేపాయి. ‘‘నిజమేనా, అసలు సమస్య అదేనా? లోపం తనలోనే ఉందా?’’ విశాలాక్షికి బుర్రంతా గందరగోళమైంది. ఎంత ఆలోచించినా సమస్య తెగలేదు.
‘చిన్నతనం నుంచీ తను పడ్డ అవమానాలు తనకు తెలుసు. ఇప్పటికీ ఎవరో ఒకరు ఏదో ఒక తప్పుడు కూత కూస్తూనే ఉంటారు. అవి పట్టించుకుని బాధపడకుండా తను బతికెయ్యాలా? అది తనను తాను గౌరవించుకోవటమవుతుందా? తల్లి అలాగే బతుకుతోందా? ఏనాడూ ఆమె తన వృత్తి గురించి చిన్నతనంగా అనుకోలేదు. గౌరవం లేదని బాధపడలేదు. తనకెక్కడినుంచి వచ్చిందీ బాధ. అమ్మలాగా నిబ్బరంగా జీవితంతో తలపడలేకపోతున్నదెందుకు? అమ్మకీ, తనకీ తేడా ఉండాలని ఎందుకనుకుంటోంది. అమ్మ తనను తాను గౌరవించుకుంటే తాను నలుగురి గౌరవం కోసం చూస్తోందా? అమ్మ తన జీవితాన్ని ఉన్నదున్నట్లుగా అంగీకరించి దానితో తలపడుతోంది. తను అంగీకరించకుండా దీనంతటి నుంచి బైటపడాలని పోట్లాటకు దిగుతోంది జీవితంలో. తనకు ఎక్కడినుంచి వచ్చింది ఈ అసంతృప్తి’.
కానీ తన ఆలోచనలే సరైనవి. అందరూ గౌరవించాలనుకోవటంలో తప్పేముంది?
తన కులమంటే గౌరవం లేదు తనకు. ఎలా వస్తుంది. ఆ వృత్తి మంచిది కాదు. తనకిష్టం లేదు. ఆ వృత్తి మంచిదని అమ్మెలా అనుకుంటోందో తనకర్థం కాదు. అమ్మకి అసలు ఈ వృత్తి మంచిదా కాదా అన్న ఆలోచనే లేదు. అది తమ కులవృత్తి. అంతే… మంచీ లేదు, చెడూ లేదు అంటుంది.
విశాలాక్షికి తల పగిలిపోతోంది. అతి ప్రయత్నం మీద ఆలోచనల్ని అణిచివేసి మండుతున్న కళ్ళను మూసుకుంది. కళ్ళనుంచి కన్నీళ్ళు కారి కాస్త చల్లబరిచాయి. ఎప్పటికో కాలే కడుపుతో, మండే గుండెతో నిద్రపోయింది విశాలాక్షి.
… … …
శారద ఎంతో ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. ఒకరోజు రాత్రి ఎనిమిది గంటలవుతుండగా సన్నగా, బలహీనంగా కనపడుతున్న యువకుడు వచ్చి శారద ఇంటి తలుపు తట్టాడు. శారదే తలుపు తీసింది. అతను శారద చేతిలో చిన్న కాగితం ముక్క పెట్టి ‘‘రేపు సాయంత్రం ఆరు గంటలకు పరశువాకంలో ఈ చిరునామాకి రావాలి. కాగితం చించెయ్యండి’’.
ఆ యువకుడు ఆవేశంగా ఉన్నాడు. దూరం నుంచి నడిచి వచ్చినట్లు ఆయాసపడుతున్నాడు. ఒళ్ళంతా చెమటలు.
శారద సందేహంగా ‘‘మీ పేరు? ఇంత రాత్రి వచ్చారు… ఏం జరుగుతుంది అక్కడ? నేనెందుకు?’’ అంటూ సరిగ్గా అడగలేనట్లు ముక్కలుగా ముక్కలుగా ప్రశ్నలు వేసింది.
‘‘అదంతా అక్కడకు వచ్చాక తెలుస్తుంది. ఇది చాలా రహస్య సమావేశం. ఎవరితోనూ చెప్పకండి. ఆ కాగితం చించెయ్యండి. జాగ్రత్త. మీరు రావటం ఎవరైనా గమనించి మీ వెనుక వస్తున్నారనుకుంటే మధ్యలో దారి మార్చి మీ స్నేహితుల ఇంటికి వెళ్ళిపొండి. పరిసరాలు గమనిస్తూ రండి’’.
శారదకిప్పుడు ఏ సందేహమూ లేదు. అతన్ని చూసి చిరునవ్వుతో ‘‘మీరు చెప్పినట్లే చేస్తాను. వెళ్ళి రండి’’ అని తలుపు వేసేసింది.
మర్నాడు పగలంతా కాలేజీలో, ఆస్పత్రిలో ఎలా గడిచిందో శారదకు తెలియదు.
సాయంత్రం సన్నని ఖద్దరు చీర కట్టుకుని తయారై తల్లి దగ్గరకు వెళ్ళింది.
సుబ్బమ్మ శారద ఎప్పుడు ఎక్కడికి వెళ్తున్నా ‘‘ఎక్కడికెళ్తున్నావు, ఈ వేళప్పుడేమిటి? వచ్చేసరికి ఎంత సమయం పడుతుంది’’ ఇలాంటి ప్రశ్నలు అడగదు. కూతురి మీద విపరీతమైన నమ్మకం. పిచ్చి ప్రేమ. తన కూతురి వంటి వాళ్ళు ఇంకొకరుండబోరని అనుకుంటుంది.
శారద ఈ రోజు తల్లితో వచ్చేసరికి ఆలస్యమవుతుందని, తన కోసం ఎదురు చూడకుండా నిద్రపొమ్మనీ చెప్పింది.
‘‘అలాగే… ఇవాళ ఏదో మీటింగున్నట్టుంది. రేపు నాకు ఆ విశేషాలన్నీ చెప్పాలి’’ అంది కూతురితో.
‘‘నే చెప్పకపోయినా నేను ఎక్కడికి, ఏ పనిమీద వెళ్తున్నానో నీకెలా తెలుస్తుందమ్మా’’ అనడిగింది శారద.
‘‘నీ ముఖం చూస్తేనే నాకంతా తెలుస్తుంది చిట్టితల్లీ. నా ప్రాణాలన్నీ నీ మీదే కదా. నా ప్రాణం సంగతి నాకు తెలియకుండా ఎట్లా ఉంటుంది’’. మొదటిసారి శారదకు తల్లి ప్రేమను చూస్తే భయమేసింది. తానేవేవో పనులు చెయ్యాలనుకుంటోంది. అమ్మ వాటన్నిటినీ ఆమోదించి తనతో వస్తుందా? రాకపోతే అమ్మకోసం తను ఆగగలదా? ఆగకపోతే అమ్మ ఏమవుతుంది? రెండు నిమిషాల పాటు ఆ ఆలోచన కంగారు పెడితే అలాగే ఆగి, తర్వాత ఈ పిచ్చి ఆలోచనలతో ఇప్పుడే ఆగేలా ఉన్నానని నవ్వుకుంటూ బైటికి నడిచింది. పరశువాకం శారదకు బాగానే తెలుసు. వడివేలు కోసం వెళ్ళేది. కానీ ఈ చిరునామా అంత తేలికగా దొరకలేదు. ఆ ప్రాంతపు మురికి వాడలు తెలుసు గానీ ఇది మరీ లోపలికి ఉంది. ఆ పరిసరాలు ఎప్పుడూ శారద మనసుని కుంగదీస్తాయి.
వాటిని, అక్కడి మనుషులనూ అంతా పరిశుభ్రంగా, ఆనందంగా, ఆరోగ్యం ఉండేలా చేయగలిగితే…
కమ్యూనిజంలో అది సాధ్యం. కమ్యూనిస్టులే అలా చేయగలుగుతారు అనుకుంటూ గుర్తులు వెతుకుతూ, సందులు తిరుగుతూ ఆ ఇల్లు చేరుకుంది. ఆ గది కాస్త విశాలంగానే ఉంది. పాతికమంది దాకా ఉన్నారు. శారద తప్ప అందరూ మగవాళ్ళే. ఆశ్చర్యంగా సుదర్శనం, మూర్తీ ఇద్దరూ లేరు. ఇద్దరు, ముగ్గురు విద్యార్థులు తప్ప శారదకు తెలిసిన వాళ్ళు లేరు.
అందరూ శారదను ఆశ్చర్యంగా, ఆసక్తిగా చూశారు. వడివేలు శారద దగ్గరకు వచ్చి పక్కన కూర్చుని ఒక వ్యక్తిని చూపించి ‘‘సోవియట్‌ రష్యా నుంచి వచ్చిన కామ్రేడ్‌ అతనే’’ అన్నాడు.

Share
This entry was posted in ధారావాహికలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.