మహిళలకు సైన్సు విద్యాగంధాన్ని తొలుత వెదజల్లిన
శాస్త్రవేత్త మాత్రమే కాదు సంస్కరణవాది, తొలి స్త్రీవాది, మహిళలకు ఓటు హక్కు కోసం పోరాడిన వ్యక్తి, వితంతు వివాహాలకు ఉద్యమించిన శక్తి… మాత్రమే కాదు; స్త్రీలు చదువుకోవాలని, సైన్స్ చదువులు కొనసాగించాలని కాంక్షించి శ్రమించిన తొలి మహిళా కెరటం అబలాబోసు. ఆమె పేరు అబల కావచ్చు గాని, కానీ చాలా రకాలుగా ఆమె సబల.
ఆమె తండ్రి మహా దేశభక్తుడు, భర్త మహా శాస్త్రవేత్త. ఇప్పటి బంగ్లాదేశ్‌లోని ఢాకా పట్టణంలో ‘సాధారణ బ్రహ్మ సమాజం’ వ్యవస్థాపకులు దుర్గా మోహన్ దాస్, బ్రహ్మమయి దేవి దంపతులకు 1865 ఆగస్టు 8న అబల జన్మించారు. అబలకు ఐదేళ్లు వయసున్నప్పుడు, ఆమె తండ్రి ఒక వితంతు వివాహాన్ని సమర్థించారని ఆ కుటుంబాన్ని వెలివేశారు. దానితో వారంతా కలకత్తా తరలివచ్చారు. కలకత్తాలోని చరిత్ర ప్రసిద్ధి చెందిన బెథూని బాలికల పాఠశాలలో అబల చదివారు. చిన్నప్పటి నుంచే ఆమెకు సైన్స్ పట్ల ఆసక్తి ఉండేది.
అబల, ఆమె సోదరి సరళ ఇరువురూ కలకత్తా విశ్వవిద్యాలయంలో ప్రవేశం పొందిన తొలితరం మహిళలు. బాల్యవివాహాలు, సతీసహగమన ఆచార బాధితులు, బాల వితంతువులు, అనాథ బాలికలు… ఈ సామాజిక స్థితిగతులు అబలను ఎంతో వ్యాకులపరిచేవి. ఆమె తండ్రి కూడా బాలికల కోసం ప్రత్యేక విద్యాలయం ప్రారంభించిన మహనీయుడు, ఆయన చిత్తరంజన్‌దాస్‌కు సమీప బంధువు. ఈ నేపథ్యంతో అబల చాలా ప్రత్యేకమైన వ్యక్తిత్వాన్ని చిన్న వయసులోనే సంతరించుకున్నారు. బెథూని కళాశాలలో చదివేటప్పుడు అబలకు కామినీరాయ్ సహధ్యాయి. అబల స్ఫూర్తితోనే కామినీరాయ్ స్త్రీ వివక్షను గమనించి, ఆ దిశలో కృషిచేసి తర్వాతి కాలంలో తొలి ఫెమినిస్టు కవయిత్రిగా పేరుగాంచారు.
ఆ రోజుల్లో కలకత్తా మెడికల్ కళాశాలలో విద్యార్థినులకు ప్రవేశం ఉండేది కాదు. ఈ కారణంతో అమల అడ్మిషన్ సంపాదించు కోలేకపోయారు, కానీ ఈ సమాచారం ఎంతో మందిని కలవరపరిచింది వారంతా చెల్లించి ఉద్యమించారు. ఫలితంగా ప్రభుత్వం ఇచ్చే స్కాలర్షిప్ ఏర్పాటు చేసి మద్రాస్ మెడికల్ కళాశాలలో ప్రవేశం పొందడానికి ప్రోత్సహించారు. అలా 1881లో అమల మద్రాసు చేరారు. ఎంతో శ్రద్ధగా చదివారు, కానీ ఆరోగ్యం సహకరించేది కాదు చివరి పరీక్షలు కూడా రాశారు, కానీ కోర్సు పూర్తి కాలేదు. చివరకు మద్రాస్ మెడికల్ కళాశాల ఈమె ఆసక్తిని గౌరవిస్తూ ఒక హానరరీ సర్టిఫికెట్ ఇచ్చారు.
అబలకు తన 23వ యేట బ్రహ్మ సమాజ నేపథ్యం ఉన్న 31 సంవత్సరాల రేడియో శాస్త్రవేత్త జగదీష్ చంద్రబోస్‌తో 1887 ఫిబ్రవరిలో వివాహమైంది. భారతీయుడైనందుకు తక్కువ జీతం ప్రతిపాదించినందుకు నిరసనగా జగదీష్ చంద్రబోస్ ఒక మూడేళ్ల పాటు జీతభత్యాలు తీసుకోలేదు. అటువంటి పరిస్థితుల్లో కుటుంబం గడవడం ఎంత కష్టమో ఊహించవచ్చు. జగదీశ్ చంద్రబోస్ పోరాటంలో చేదోడు వాదోడుగా ఉంటూనే శాస్త్ర పరిశోధనల వివరాలను జర్నల్స్‌కు పంపడం, విదేశీ పర్యటనలు ఇలా తోడుగా నిలిచిన వ్యక్తి అబల. ఈ దంపతులకు పిల్లలు లేకపోయినా మొత్తం సమాజం గురించి ఆలోచించిన మాతృమూర్తి అబల.
భర్తతో ఇతర దేశాల సందర్శించినప్పుడు అక్కడి మహిళల స్థితిగతులు, విద్యా విధానాలు గురించి అధ్యయనం చేసేవారు; వాటి గురించి భారత సమాజం దృష్ట్యా విశ్లేషించేవారు, రామానంద చటర్జీ నిర్వహించే ‘మోడ్రన్ రివ్యూ’ వంటి పత్రికలలో క్రమం తప్పకుండా వాటిని ప్రచురించేవారు. స్వామి వివేకానంద శిష్యురాలు సిస్టర్ నివేదిత, అబలాబోస్ ఇద్దరూ విద్యకు సంబంధించి ఒకేరకమైన అభిప్రాయాలతో సాగేవారు. సిస్టర్ నివేదిత భారతదేశం వచ్చిన సం. 1898లో బాగ్ బజార్‌లో బాలికల పాఠశాల ప్రారంభించినప్పుడు అబల, ఆమె వదిన లావణ్య ప్రభ స్వచ్ఛందంగా ఆస్కూల్లో బోధించారు.
మార్కొని కంటే ముందే వైర్లెస్ రేడియో విధానం ఆవిష్కరించిన జగదీశ్ చంద్రబోస్‌కు ఆ కీర్తి ప్రతిష్టలు రాలేదు. జగదీశ్ చంద్రబోస్ విజ్ఞాన శాస్త్ర రంగంలో చేసిన రకరకాల పోరాటాలలో సిస్టర్ నివేదిత చేసిన దోహదం చాలా గొప్పది. విదేశాలలో ఉన్నప్పుడు అబల ఆరోగ్యం పాడైతే ఓ అక్కలా నివేదిత చేసిన వైద్య సేవలు విశేషమైనవి. అలాగే 1911లో నివేదిత ఆరోగ్యం దెబ్బ తినినప్పుడు అమలా బోస్ అందించిన తోడ్పాటు వెలలేనిది. అబల, జగదీశ్ చంద్రబోస్ దంపతుల ఇల్లు జాతీయ వాదానికి నెలువుగానూ, అలాగే పాశ్చాత్య కళాత్మకతకు దర్పణంగాను భాసించేది. నివేదిత చివరి రోజుల్లో డార్జిలింగ్‌లోని జగదీశ్ చంద్రబోస్ దంపతుల నివాసంలోనే ఉండేవారు.
అమలా బోస్ 1910 నుంచి ఒక పాతిక సంవత్సరాల పాటు బ్రహ్మో బాలికా శిక్షాలయ కార్యదర్శిగా సేవలందించారు. జాతుమతి ముఖర్జీ, ప్రఫుల్ల చంద్రరే, చిత్తరంజన్ దాస్, సర్ నీల్ రతన్ సర్కార్, ప్రియంవద బెనర్జీ వంటి మహామహులను కలిపి 1919లో నారీ శిక్షా సమితి ప్రారంభించి ఎంతో ప్రభావాన్ని కలుగజేశారు. తద్వారా జెండర్ సెన్సిటివ్ కర్రికులం, స్త్రీలలో విద్య వ్యాప్తి, వితంతువులకు ఆర్థిక సాయం, బాలికలకు సైన్సు చదువు మొదలైన కార్యక్రమాలు పెద్ద ఎత్తున సమాజంలోకి తీసుకువెళ్లాలని ప్రయత్నించారు.
అబలా బోస్ కేవలం విద్యా సంబంధమైన సంస్కరణలకు, వితంతు సమస్యల పరిష్కారానికి మాత్రమే పరిమితం కాకుండా మహిళలకు ఓటు హక్కు కావాలని పోరాడిన తొలి భారతీయ మహిళల్లో ఒకరు. 1917లో ఎడ్విన్ మాంటేగు (Edwin Monragu) కలిసి చర్చలు జరిపిన సరోజినీ నాయుడు, మార్గరెట్ కజిన్స్, రమాబాయి రనడే, దొరతి జినరజదాస మొదలైన బృందంలో ఒకరు. మహిళకు కూడా మొదట మేధస్సు ప్రధానం అనే అబలాబోస్ మాటను విస్తృతంగా ప్రస్తావిస్తూ ఉంటారు.
బ్రహ్మ సమాజం బాలికల పాఠశాల, వితంతు ఆవాసం, బెంగాల్ ఉమెన్ ఎడ్యుకేషన్ లీగ్, వయసులో ఉన్న వితంతువుల ఉపాధి కోసం ఇండస్ట్రియల్ కోఆపరేటివ్ ట్రైనింగ్ సెంటర్, విద్యాసాగర్ వాణి భవన్, మహిళా శిల్ప భవన్, సాధనా ఆశ్రమం ఆమె ప్రారంభించిన సంస్థలే. గ్రామీణ ప్రాంతాల్లో 200 పాఠశాలలు స్థాపించారు. అలాగే మారుమూల ప్రాంతాలలో ప్రసూతి కేంద్రాలు, శిశు ఆరోగ్య కేంద్రాలు కూడా నెలకొల్పారు. 1937లో జగదీష్ చంద్రబోస్ కనుమూసిన తర్వాత అమలబోస్ 10 లక్షల రూపాయలను విరాళంగా ఇచ్చి సిస్టర్ నివేదిత అడల్ట్ ఎడ్యుకేషన్ ఫండ్ ప్రారంభించారు. దీని ద్వారా మహిళలకు ప్రథమ చికిత్స, వయోజన విద్యా తరగతులు, ఇంటి తోటల పెంపకం, గ్రామీణ మహిళలకు ఇతర నైపుణ్యాలను పెంచడం వంటివి సాధించారు. అలాగే సాధనా ఆశ్రమం ప్రారంభించి తను 1951 ఆగస్టు 26న అబలా బోస్ కనుమూయడానికి ముందు రోజు దానిని బ్రహ్మో సమాజానికి అప్పజెప్పారు.
(ప్రముఖ పాపులర్ సైన్స్ రచయిత, ఆకాశవాణి పూర్వ సంచాలకులు)
