అక్టోబర్ 15వ తేదీని ఐక్యరాజ్య సమితి 2007లో అంతర్జాతీయ గ్రామీణ మహిళల దినోత్సవంగా జరుపుకోవాలని ప్రకటించింది. ఆహార భద్రత మరియు గ్రామీణ పేదరిక నిర్మూలనలో గ్రామీణ మహిళలు పోషించే కీలకమైన పాత్రను గుర్తించి, ప్రోత్సహించటం దీని ఉద్దేశం.
మహిళా రైతుల హక్కుల వేదిక (మకాం) చేసిన కృషి ఫలితంగా 2017లో కేంద్ర వ్యవసాయ మంత్రి అక్టోబర్ 15వ తేదీని ‘మహిళా రైతుల దినోత్సవం’గా ప్రకటించి దేశవ్యాప్తంగా జరగుపుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. అప్పటి నుండి ప్రతి సంవత్సరం అన్ని రాష్ట్రాలలోని ప్రభుత్వ వ్యవసాయ శాఖకు చెందిన కార్యాలయాలు, పరిశోధనా సంస్థలు అక్టోబర్ 15వ తేదీన మహిళా రైతుల దినోత్సవంగా జరుపుతున్నాయి. మహిళా రైతులతో సమావేశాలు నిర్వహించి వారిని సత్కరిస్తున్నాయి.
2026ను ఐక్యరాజ్య సమితి “అంతర్జాతీయ మహిళా రైతుల సంవత్సరం”గా ప్రకటించింది. ఇది వ్యవసాయ రంగంలో మహిళలకు మద్దతుగా విధానాలలో సంస్కరణలను తీసుకురావటానికి, దాని గురించి అందరిలో అవగాహనను పెంచడానికి, మహిళలకు వ్యవసాయ వనరులపై హక్కులను కల్పించే దిశలో పనిచేయటానికి ఒక ముఖ్యమైన అవకాశాన్ని కల్పిస్తుంది.
ఈ అంతర్జాతీయ మహిళా రైతుల సంవత్సరంలో భాగంగా 2026లో అక్టోబర్ 15వ తేదీన జరుపుకునే జాతీయ మహిళా రైతుల దినోత్సవాన్ని , “మహిళా రైతులకు చట్టపరమైన గుర్తింపు ఇవ్వాలి” అనే ముఖ్య అంశంతో జరుపుకోవాలని మకాం నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా, మహిళా రైతుల సంఘాలు, సంస్థలు ప్రతి సంవత్సరం మహిళా రైతులకు (సాగుదారులు, వ్యవసాయ కూలీలకు) గుర్తింపు, నాయకత్వం, నిర్ణయాధికారం, జీవనోపాధి భద్రత మరియు సహజ వనరుల అందుబాటు వంటి డిమాండ్లతో పాటు స్థానిక సమస్యలకు అనుగుణంగా వివిధ కార్యకలాపాల ద్వారా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో రైతు ఆత్మహత్య బాధిత కుటుంబాల మహిళలపైన, అటవీ భూముల నుండి ఆదివాసుల తొలగింపు కారణంగా ఆదివాసీ మహిళలపైన, దళిత మహిళా వ్యవసాయ కూలీలపైన పైన జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా కార్యక్రమాలు జరుపుకోవాల్సిన అవసరం వుంది.
మహారాష్ట్రలోని మకాం సభ్య సంఘాలు చేసిన కృషి ఫలితంగా ఈ సంవత్సరం జులైలో “మహారాష్ట్ర మహిళా రైతుల సాధికారత చట్టం 2026” ను మహారాష్ట్ర అసెంబ్లీ ఆమోదించింది. దీనిలో ఎం ఎస్ ఎస్ ఆర్ ఎఫ్ (వీSS=ఖీ) కీలకమైన పాత్ర వహించింది. ఈ చట్టంలోని అత్యంత ప్రాధమిక అంశం మహిళా రైతులకు చట్టపరమైన గుర్తింపును కల్పించటం. వారి భూ యాజమాన్య స్థితితో సంబంధం లేకుండా, మహిళలను రైతులుగా గుర్తించడానికి ఒక స్పష్టమైన చట్టపరమైన చట్రాన్ని ఏర్పాటు చేయాలని ఈ చట్టం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ గుర్తింపు, వారికి వివిధ ప్రభుత్వ కార్యక్రమాలు, సామాజిక భద్రతా ప్రయోజనాలను పొందేందుకు మరియు నిర్ణయాధికార సంస్థలలో పాల్గొనేందుకు మార్గాలను తెరుస్తుంది. కుటుంబ భూమిని మహిళలు, పురుషుల పేరుపైన జాయింట్‌గా రిజిస్టర్ చేసి తద్వారా మహిళలను భూముల నుండి తొలగించకుండా రక్షణ కల్పిస్తుంది. మొత్తం మీద ఈ చట్టం అంచులకు నెట్టివేయబడిన మహిళా రైతులను నిర్ణయాధికారంలో భాగస్వాములవటానికి వీలు కల్పిస్తుంది.
ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో మహారాష్ట్ర తరహా చట్టాన్ని తీసుకురావాలనే డిమాండ్‌ను ముఖ్య అంశంగా పెట్టుకుని అక్టోబర్ 15, మహిళా రైతుల దినోత్సవాన్ని జరుపుకుందాం! ఈ మేరకు ఒత్తిడి తెచ్చే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వంతో కలిసి పనిచేద్దాం. ఈ సందేశాన్ని గ్రామీణ ప్రాంతాలలో మహిళా రైతులు, దళిత, ఆదివాసీ మహిళలు, వ్యవసాయ కూలీలకు విస్తృతంగా చేరవేద్దాం! మహిళా రైతులు, దళిత, ఆదివాసీ మహిళలు, వ్యవసాయ కూలీలను తమ హక్కుల కోసం రైతులుగా గుర్తింపు కోసం పోరాడే విధంగా చైతన్యవంతులను చేద్దాం!
