వనితా థుతుర్కర్ పట్టుదలతో కూడిన ప్రయత్నం – మకాం

“నేను పత్తి ఏరడంలో చాలా చురుగ్గా ఉంటాను”, ఆమె చేతులు వేగంగా కదులుతూ, ఆగకుండా పత్తిని ఏరుతుండగా అన్నారు వనిత. “నేను రోజుకి 50 కిలోలకు పైగా పత్తి ఏరుతాను.” తన నైపుణ్యంపై నమ్మకం ఉన్న ఆమె సాధారణంగా ఉండే స్థిరమైన రోజువారీ వేతనంపై కాకుండా గుత్తా పని ప్రాతిపదికన పని చేస్తారు.

చాలామంది మహిళలు సీజన్‌ని బట్టి, పొలం యజమానికున్న అవసరాన్ని బట్టి పనిచేసి రోజుకు 250 నుంచి 300 వరకు సంపాదిస్తారు. వనిత మాత్రం రోజుకు 600 రూపాయలు వరకు సంపాదిస్తారు. “నేను ఉదయం నుండి సాయంత్రం వరకు విరామం లేకుండా పని చేస్తాను”, మితంగా నవ్వుతూ చెప్పారామే. తన అవసరం కొద్దీ నేర్చుకున్న నైపుణ్యం పట్ల ఆమెకు గర్వంగా ఉంది. 31 ఏళ్ల వనిత థుతుర్కర్ యావత్మల్ జిల్లాలోని ఝూడ్గావ్ అనే గ్రామంలో నివసిస్తున్నారు. ఆమె భర్త జీవన్ 2022లో ఆత్మహత్య చేసుకుని మరణించినప్పటి నుండి, ఆమె బడికి వెళ్లే ఇద్దరు పిల్లలు కార్తీక్ 13, అర్పిత 11 సంవత్సరాలు, వృద్ధాప్యంలో ఉన్న అత్తమామలున్న తన కుటుంబానికి ఏకైక పోషకురాలుగా మారారు. జీవన్ జీవించి ఉన్నప్పుడు కూడా జీవితం కష్టంగానే ఉండేది, కానీ వారు తమ నాలుగు ఎకరాల భూమిని సాగు చేయడం ద్వారా, కూలి పనులు చేసి తమ ఆదాయాన్ని పెంచుకోవడం ద్వారా నెట్టుకొచ్చేవారు. జీవన్ మరణం తర్వాత కుటుంబం మొత్తం బాధ్యత వనితపై పడింది. దాంతో ఆమె పని కోసం తీవ్రమైన వెతుకులాటలో పడ్డారు. నేను నా కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. నేను ప్రతిరోజు కూలి పనులకు వెళతాను, అని ఆమె చెప్పారు. ఆమెకు ఒక్కరోజు కూడా సెలవు తీసుకోవడం సాధ్యం కాదు.
ఒకప్పుడు వారి ప్రధాన జీవనాధారంగా ఉండిన ఆ కుటుంబ భూమిలో పంటలు పండడం ఆగిపోయింది. వరుసగా మూడు సంవత్సరాలు పత్తి పంట పోవడంతో వారు ఒక బ్యాంకు నుంచి తీసుకున్న 50 వేల రూపాయలు, ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల నుంచి తీసుకున్న 30 వేల రూపాయల అప్పులు వారికి భారంగా మారాయి. “ఏమి పండడం లేదు. మేము అప్పులు తిరిగి చెల్లించలేకపోయాం, అప్పులు పెరుగుతూ పోయాయి,” అని వనిత గుర్తు చేసుకున్నారు. ఆ ఒత్తిడిలో ఆ జంట తమ భూమిని 25 వేలకు గుత్తకు ఇచ్చి ఆ డబ్బుతో కొంతవరకు అప్పులను చెల్లించారు. మేం కూలీ చేసుకొని ఆ డబ్బుతో ఇల్లు జరుపుకోగలమని, మిగిలిన అప్పును తీర్చడానికి తగినంత పొదుపు చేయగలమని అనుకున్నాం.” కొంత కాలం ఇది పనిచేసినట్లే అనిపించింది, కానీ వారి దురదృష్టం కొద్దీ ఆ తర్వాత అనుకూలమైన వాతావరణం ఏర్పడి వారు గుత్తకు ఇచ్చిన సొంత భూమిలో మంచి పంట పండింది. చేజారిపోయిన అవకాశం గురించి జీవన్ ఆలోచించకుండా ఉండలేకపోయారు. “మనమే సాగు చేసుకునీ ఉంటే, మొత్తం అప్పులు తిరిగి చెల్లించగలిగే వాళ్ళం”, అని అతను పదేపదే కుమిలిపోయారు.” వచ్చే సంవత్సరం మనమే చేద్దాం,” అని వనిత అతనికి భరోసా ఇవ్వడానికి ప్రయత్నించారు, కానీ అతని విచారం తీవ్రమైంది, తనలోకి తనే ముడుచుకుపోయి, ఆలోచనలలో మునిగిపోయేవారు. సెప్టెంబర్ 25, 2022 నాడు వనిత జీవితం ఎప్పటికీ మారిపోయింది. ఆమె తన పిల్లలిద్దరిని తీసుకొని అనారోగ్యంతో ఉన్న తల్లిని చూసేందుకు వెళ్లారు. ఆమె లేని సమయంలో జీవన్ ఉరి వేసుకుని తన బతుకు చాలించారు. తాను అక్కడే ఉండి ఉంటే దీనిని ఆపగలిగేదేమోననే అపరాధభావన వనితను తినేసింది. ఈ భావనను ఆమె కుటుంబం, సమాజం మరింతగా పెంచాయి. వారు సానుభూతి చూపించకపోవటమేకాక అతని మరణాన్ని నివారించలేకపోయినందుకు ఆమెనే నిందించారు.
జీవన్ మరణించిన తర్వాత, వనిత మరిన్ని ఎదురు దెబ్బలు ఎదుర్కొన్నారు. ప్రభుత్వాధికారులు ఆమె ఇంటికి వచ్చినప్పటికీ, ఎటువంటి అర్ధవంతమైన భరోసాను ఆమెకు ఇవ్వలేదు. జీవన్ మరణించే నాటికి భూమిని ఇతరులకు కౌలుకు ఇచ్చినందున పరిహారం కోసం ఆమె పెట్టుకున్న దరఖాస్తులు తిరస్కరించారు. సాధారణంగా, పరిహారం కౌలుదారునికి కాక భూ యజమానికి చెల్లిస్తారు. అయితే, ఈ సందర్భంలో ప్రభుత్వం ఫిర్యాదులను తగ్గించేసి, నష్టపరిహారం అందించకుండా ఉండడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. స్థానికంగా ఉన్న ఒక సంస్థ సాయంతో, పెద్ద ఎత్తున ఫాలోఅప్ చేసిన తర్వాత ఆమె వితంతు పింఛన్ పొందగలిగారు. “దరఖాస్తులు ఆమోదింప చేయడానికి నేను అన్ని రకాల ప్రయత్నాలు చేశాను,” అని ఆమె చెప్పారు. పింఛను తప్ప, ఆమెకు వేరే ప్రభుత్వ సహాయం ఏది లభించలేదు. వనిత ఇప్పుడు పూర్తిగా వ్యవసాయ కూలీ పనులపైనే ఆధారపడుతున్నారు. అయితే ఆమె ఒంటరిగా పనిచేయడం లేదు, తన గ్రామంలోని అనధికారిక కూలీల ముఠాకు నాయకత్వం వహిస్తున్నారు. నేను నాతో పాటు ఇతర మహిళలను కూడా తీసుకువెళతాను,” అని ఆమె చెప్పారు. ముగ్గురు నలుగురు మహిళలతో కూడిన చిన్న బృందంగా మొదలైన ఈ ముఠాలో ఇప్పుడు 17 నుంచి 18 మంది మహిళలు ఉన్నారు. వీరంతా పని కోసం వనితపై ఆధారపడతారు. ఈ బృందం ఏర్పాటు మహిళలకూ, రైతులకు కూడా ప్రయోజనం చేకూరుస్తుంది. “రైతులు ముఠాకూలీలని ఇష్టపడతారు, మేమంతా కలిసి పని చేయడాన్నీ సురక్షితంగా భావిస్తాం,” అని ఆమె వివరించారు. ప్రతి ఉదయం, మహిళలు వనిత ఇంటి వద్ద గుమికూడతారు. అక్కడ ఆమె రైతులతో సమన్వయం చేసుకుంటూ, వేతనాలను పర్యవేక్షిస్తుంటారు, పనులను ఏర్పాటు చేస్తుంటారు.
అయితే పనులు దొరకటం అంతకంతకు కష్టంగా మారింది. వ్యవసాయ సంక్షోభం, కలుపు మందులను అధికంగా ఉపయోగించటం, యాంత్రీకరణ కూలీల డిమాండ్‌ను తగ్గించాయి. ఈ సవాళ్ళు అన్నిటి మధ్య తనకూ, తనపై ఆధారపడిన మహిళలకు స్థిరంగా పనులు ఉండేలా చూసుకుంటూ వనిత ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతానికి వనిత మానవ, ఆర్థిక వనరులు లేకపోవడం వల్ల తన సొంత భూమిని కౌలుకు ఇవ్వాల్సి వచ్చింది. కానీ ఆమె మళ్ళీ అదే భూమిని సాగు చేయాలని కలలు కంటున్నారు. “నా భూమిలో వ్యవసాయం చేయడం గురించి నేను ఆలోచించాలి”. బతుకు పోరాటాలు ఎంత మాత్రం తన దృఢ సంకల్పాన్ని మసకబారచ లేవని వనిత అన్నారు.
(భవిష్యత్తును అభివృద్ధి చేసుకుంటూ… మహిళా రైతుల గురించి ఫోటో వ్యాసాలు పుస్తకం నుండి..)

Share
This entry was posted in మహిళా రైతుల జీవన పోరాటాలు . Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)

అ
a
ఆ
aa
ఇ
i
ఈ
ee
ఉ
u
ఊ
oo
ఋ
R
ౠ
Ru
ఌ
~l
ౡ
~lu
ఎ
e
ఏ
E
ఐ
ai
ఒ
o
ఓ
O
ఔ
au
అం
M
అః
@H
అఁ
@M
உ
@2
క
k
ఖ
kh
గ
g
ఘ
gh
ఙ
~m
చ
ch
ఛ
Ch
జ
j
ఝ
jh
ఞ
~n
ట
T
ఠ
Th
డ
D
ఢ
Dh
ణ
N
త
t
థ
th
ద
d
ధ
dh
న
n
ప
p
ఫ
ph
బ
b
భ
bh
మ
m
య
y
ర
r
ల
l
వ
v
 
శ
S
ష
sh
స
s
    హ
h
ళ
L
క్ష
ksh
ఱ
~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.