అనువాదం: సుధామయి సత్తెనపల్లి
ఎన్నికల వ్యవస్థలో సరళత, పారదర్శకత కోసం తమ డిమాండ్ల విషయంలో గొంతెత్తకుండా ఉండటానికి నిరాకరించిన రూబీ వంటి అనేక మంది మహిళలు, 2026 అక్టోబర్ 2న దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసనలో పాల్గొన్నారు.
“మాకు ఒక న్యాయమైన, పారదర్శకమైన వోటింగ్ విధానం కావాలి. అది మా హక్కు.”
అక్టోబర్ 2, 2026న జంతర్ మంతర్ వద్ద ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియకు వ్యతిరేకంగా జరిగిన నిరసనలో రూబీ అలీ ఖాన్ పాల్గొన్నారు. నగరవాసి అయిన ఆమె, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉన్న ఆ నిరసన స్థలానికి చేరుకోవడానికి రెండు మెట్రో రైళ్ళు, ఒక బస్సు, రెండు ఆటో రిక్షాలను మారాల్సి వచ్చింది.
“వోటర్ల జాబితాలో మా పేర్లే లేనప్పుడు, మా నేతను (ఎన్నికైన ప్రతినిధిని) మేమెలా ఎన్నుకోగలుగుతాం?” అన్నారామె. “మేం జంతర్ మంతర్‌కు రాకుండా ఉండేందుకు వాళ్ళు (దిల్లీ యంత్రాంగం) ఈ రోజు ప్రధాన మెట్రో మార్గాలను, స్టేషన్లను మూసివేశారు. కానీ అది మమ్మల్ని ఆపగలదనుకోవడం వారి తెలివితక్కువతనం.”
ప్రస్తుతం 40ల వయసులో ఉన్న బీహార్‌కు చెందిన రూబీ, దాదాపు మూడు దశాబ్దాల క్రితం రాజధాని నగరానికి వలస వచ్చారు. వోటర్ల జాబితాలో ఆమె పేరు ఉన్నప్పటికీ, ఆమె బంధువులలో ఏడుగురి పేర్లు, చాలామంది పొరుగు వారి పేర్లు కూడా అందులోంచి తొలగించారు. “భర్తను కోల్పోయిన, ముగ్గురు పిల్లలున్న నా సొంత సోదరి పేరు కూడా అందులో లేదు. తన రేషన్ కార్డు పోతుందేమోనని ఆమె భయపడుతోంది,” ఆమె పేర్కొన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా లభించే ఉచిత రేషన్ సదుపాయం లేకపోతే చాలా కష్టమవుతుందని రూబీ చెబుతున్నారు.
రూబీ ఉదయం 10:30 గంటలకల్లా నిరసన ప్రదేశానికి చేరుకున్నారు. నలుపు, లేత గోధుమరంగు సల్వార్-కమీజ్ ధరించిన ఆమె, హిజాబ్గా కూడా ఉపయోగపడేలా దుపట్టాను కప్పుకున్నారు. నిరసన ప్రదేశంలోని వేడి, దుమ్ము కారణంగా ఆమె పెదవులకున్న ఎర్రని లిప్‌స్టిక్ వెలిసిపోయింది, మీగడ రంగు స్పోర్ట్స్ షూస్ కూడా ఇంతలోనే దుమ్ముకొట్టుకుపోయాయి.
“ఏక్ కచోరీ, దో సమోసా; బిజెపి కా నహీ భరోసా,” అక్కడ గుమిగూడిన వందలాది మంది జనసందోహంలో ఆమె గొంతు కూడా కలిసిపోతుండగా, ప్రభుత్వంపై నిరసన నినాదాన్ని ఆమె వినిపిస్తున్నారు. ఆమె చేతిలో ఎలాంటి ప్లకార్డు లేకపోయినప్పటికీ దృఢమైన ఆమె స్వరం, ముఖంలో స్పష్టంగా కనిపిస్తోన్న ఆగ్రహమే ఆమె నిరసనను తెలియజేయడానికి సరిపోయాయి.
మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా జరిగిన ఈ నిరసనలో విద్యార్థులు, పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులు, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు పాల్గొన్నారు. పోలీసులు జంతర్ మంతర్‌కు దారితీసే అశోక రోడ్డులో నిలిపి ఉంచిన అనేక ప్రైవేట్ బస్సులలోకి నిరసనకారులను బలవంతంగా ఎక్కిస్తున్నారు.
నిరసన ప్రదేశంలో అదుపులోకి తీసుకున్న వారిలో బిందియా (అసలు పేరు కాదు) కూడా ఉన్నారు. 24 ఏళ్ళ బిందియా, దక్షిణ దిల్లీలోని ఒక మహిళా కళాశాల విద్యార్థిని. “మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో పోలీసులు మమ్మల్ని ఒక ప్రైవేట్ బస్సులో తీసుకెళ్ళారు. మమ్మల్ని నిర్బంధంలో ఉంచిన ఆరు గంటలలో వాళ్ళు, అక్కడున్న సుమారు 40 మంది విద్యార్థులకు తినడానికి గానీ, తాగడానికి గానీ ఏమీ ఇవ్వలేదు,” ఆమె PARIతో చెప్పారు.
రోజు ముగిసే సమయానికి, దిల్లీ పోలీసులు 500 మందికి పైగా ప్రజలను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు విద్యార్థినులతోనూ, మహిళా జర్నలిస్టులతో కూడా దురుసుగా ప్రవర్తించారని నిరసనకారులు ఆరోపిస్తున్నారు. “వారు మమ్మల్నందరినీ లాఠీలతో కొట్టారు. కానీ ఎందుకు? మేం శాంతియుతంగా నిరసన తెలుపుతూ మా హక్కులను డిమాండ్ చేస్తున్నాం కదా,” అన్నారు బిందియా.
ఆ అమ్మాయిల విషయంలో ఆందోళన చెందిన రూబీ, ఆ తర్వాత నిరసనకారులలో కొందరిని తరలించిన ద్వారక పోలీస్ స్టేషన్‌కు వెళ్ళారు. ఇది జంతర్ మంతర్ నుండి చాలా దూరంలో ఉంది. “నేనక్కడికి వెళ్ళి, సాయంత్రం 7 గంటల ప్రాంతంలో వారు విడుదలయ్యే వరకు అక్కడే ఉన్నాను. వారు ళిఆ అమ్మాయిలురి నాకు బంధువులూ కాదు, నా ‘హిందూ బేటియాఁ’ కాదు; వారు నాతో పాటు నిరసనలో పాల్గొన్నవారు, అయితే పురుష పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. అందుకే, ఇంటికి వెళ్ళే ముందు వారిని సురక్షితంగా వారి ఇళ్ళకు సాగనంపిన తర్వాతే నేను నా ఇంటికి బయలుదేరాను.”
ఈ రోజున భారతదేశంలో మహిళగానే కాక, ముస్లిమ్ మహిళగా జీవించడం కూడా చాలా కష్టమని రూబీ ఈ రిపోర్టర్‌తో అన్నారు. తమ గళాన్ని బహిరంగంగా వినిపించినందుకు తాను, తన కుటుంబం మూల్యం చెల్లించుకోవాల్సి రావచ్చని ఆమెకు తెలుసు. “బుల్డోజర్తో నా ఇంటిని కూల్చివేయవచ్చు, లేదా నా భర్తపై కుమారులపై దాడి చేసి వారిని దుర్మార్గంగా హింసించవచ్చునని నాకు తెలుసు. కానీ నేను భయపడను,” దుపట్టాను తన తలపైకి విసురుతూ ఆమె దృఢంగా చెప్పారు.
PARIతో ఆమె సంభాషణ ముగుస్తుండగానే, తాను క్షేమంగా ఉన్నానని, ఇంటికి రావడానికి ఆలస్యమవుతుందని చెప్పడానికి, వృత్తిరీత్యా టైలర్ అయిన తన భర్తకు ఆమె ఫోన్ చేశారు.
“నేను ఈ దేశ పుత్రికను. నాలాంటి గృహిణులను సవాలు చేయడానికి, రెచ్చగొట్టడానికి ముందు ఈ ప్రభుత్వం రెండుసార్లు ఆలోచించాలి. అన్నింటికంటే ముందు నేనొక మహిళగా ఇక్కడికి వచ్చాను. మెరుగైన భారతావనికి అర్హులైన మన బిడ్డల కోసమే నేనిక్కడికి వచ్చాను.”
ఈ వ్యాసం https://ruralindiaonline.org/article/i-will-not-be-scared-te) అక్టోబర్ 07, 2026 లో మొదట ప్రచురితమైనది.)
