గగనంలో గాన ప్రతిగానాలు
పరము నుండి జాలువారిన
వెన్నెల జలపాతాలు
వెలుగుకిరణాల బృందగానాలు
”…ఈరోజు పుడమిలోన
జయ ప్రవేశం శాంతికి
శాంతి శాంతి పరములోన
శాంతి శాంతి ఇహములోన ”
ప్రకృతి ప్రతిధ్వనించింది
పుడమి పరవశించింది
పశులపాక పాడింది జోలపాట
కాల విధాత పయనం
కాల పరిమితిలోకి
అశాంతి భువికి
ఆగమించెను శాంతి ప్రదాత
ప్రేమ భిక్షను అడుగుతూ…
ప్రేమే జీవం… ప్రేమే మార్గం
ప్రేమే ధర్మం… నీతి… న్యాయం
గుండెలో ప్రేమ ఉంటే
అక్రమం అన్యాయం… సుదూరం !
కపటాలూ… కల్లోలాలూ మటుమాయం!
తన ప్రాణమిచ్చి ప్రేమను
ప్రకటించాడు
మన ప్రేమకోసం
గుండె తలుపు తడుతున్నాడు..
పుడమి శాంతి భరిత కావాలని!!
గగనంలో గాన ప్రతిగానాలు!!!