కృతజ్ఞతలు
మీరు మాతో చేయించిన నగ్నకవాతుకి కృతజ్ఞతలు
మమ్మల్ని మీరు నగ్నంగా మాత్రమే
గుర్తించినందుకు కృతజ్ఞతలు
దీనిని మేం ఎప్పటికీ గుర్తుంచుకుంటాం
మా నగ్నదేహాల భుజాల మీద నుండి మీ భవిష్యత్ కోసం
మీరు దూసే చిత్రహింసల బాణాలని
మేము లెక్కతప్పకుండా గుర్తుంచుకుంటాం
అయినా మిమ్మల్ని మేం ఎప్పుడూ మర్చిపోలేదు
ఇక ఇప్పుడైతే అస్సలు ఎప్పటికీ
మర్చిపోనేపోము
అనుక్షణం సర్కస్ పెద్దపులితో గారడీ చేసే
లేడీ రింగ్ మాస్టర్స్ మేము
మేము ఆ పెద్దపులిని భయపెడితే
మీరు మౌనంగా చూస్తారు
అదే పెద్దపులి మమ్మల్ని నోట కరచుకుంటే
మీరు చప్పట్లు కొడతారు
ఏమీ మారని నీయాండెర్తల్ హోమోసెపియన్స్!
మీ అసలైన నగ్నస్వరూపాన్ని మేము పదేపదే
చూస్తూనే ఉన్నాము
ఎప్పటికీ మర్చిపోము
ఈ నగ్నచిత్రాన్ని ఎప్పటికీ మర్చిపోము
మీ బతుకంతా మా నగ్నదేహాల నెత్తురుతో
చేసిన సంతకాల సోకాల్డ్ విజయాలే కదా!
అరేయ్! ఎన్ని ఏళ్ళయినా
మీమీ ప్రతీకారాలకి
మా శరీరమే కదరా యుద్ధభూమి!
అవును మాకున్నది ఒకే ఆయుధం
ఒకే ఒక్క శరీరం
ఆచ్ఛాదితమయినా అనాచ్ఛాదితమయినా
శరీరమొక్కటే!