తెలుగు మగతనం: ఒక పరిశీలన – ఎ. సునీత

గత రెండు నెలలుగా తెలుగు టెలివిజన్, సోషల్ మీడియా, సినిమా పెద్దలు, తెలుగు మహిళలు ఎలా ఉండాలని జరుపుతున్న చర్చలో తెలుగు మగవాళ్ళు చాలా ఉత్సహంగా ఆడవాళ్లు స్వేచ్చని ఎలా దుర్వినియోగం చేస్తున్నారో, ఎలా వాళ్ళని నియంత్రణ చెయ్యాలో, ఏ బట్టలేసుకుంటే గౌరవించాలో, లేకుంటే ఎలా తన్ని తరిమేయ్యలో కామెంట్లు చేస్తున్నారు. మొదట్లో వీళ్ళందరూ బోట్స్ అనుకున్నాను.

కానీ ఓపికతో ప్రొఫైల్స్ చూస్తే డిజిటల్ క్రియేటర్, మార్కెటింగ్, మేనేజిమెంట్, సేల్స్, ఆటో డ్రైవర్ వంటి రకరకాల పనుల్లో ఉన్నట్లు తెలిసింది. మగస్వామ్యాన్ని ఇంత గట్టిగా, స్పష్టంగా సమర్ధించే వీళ్ళందరికీ ఇంత సమయం ఎక్కడ దొరుకుతోంది, తమకి తెలియని ఆడవాళ్ళ గురించి ఎందుకు ఇంత ఉద్విగ్నతకు లోనవుతున్నారు, ఇటువంటి మాటలు చెప్తే వాళ్ళ కుటుంబంలో ఆడవాళ్లు ఏమంటారు అనే సందేహాల మధ్య ఈ కాలమ్ రాసాను. మనం స్త్రీల గురించి తెలుసుకోవాలంటే, వాళ్ళ చదువు, పని పరిస్థితులు, ఇంట్లో, బయటా జరిగే హింస, వేధింపులు గురించి మొదలు పెడతాం, అటువంటి సూచికలతో చూస్తే తెలుగు మగతన స్వరూపం అర్ధమవుతుందేమో చూద్దాం.
నమ్మశక్యంగా లేకపోయినా, మన మగవాళ్ళకి చదువు తక్కువ. రెండు రాష్ట్రాలు కూడా దక్షిణ భారత దేశంలో ఇతర రాష్ట్రాలతో పోల్చినా, జాతీయ గణాంకాలతో పోల్చినా విద్యా స్థాయిలో వెనకబడి వున్నాయి. 75 నుండి 78% వున్న సగటు రాష్ట్ర అక్షరాస్యత కొన్ని జిల్లాల్లో బాగా తక్కువుంది. ఆడవాళ్లకే, మగవాళ్ళకి మధ్య చదువులో దూరం కొంచెం కొంచెంగా తగ్గుతోంది, కానీ రెండు రాష్ట్రాలు సగటుగా ఎంత వెనక బడి వున్నాయంటే ఉత్తరాదిలో విద్య, ఆరోగ్యం, ఇతర అన్ని ప్రమాణాలు అన్నింటిలో క్రింద వుండే బీహార్ తో పోల్చేంత వెనకబడి వున్నాయి. కొన్ని లెక్కల ప్రకారం 2011 వరకూ తెలంగాణ రాష్ట్రంలో 14 నుండి 18 వరకు వయసున్న జనాభాలో 30% మంది స్కూళ్లల్లో లేరు. ఈ వయసు వాళ్ళు స్మార్ట్ ఫోన్ ద్వారా సోషల్ మీడియా చర్చల్లో అత్యుత్సాహంగా పాల్గొంటున్నారని అధ్యయనాలు చెప్తున్నాయి. ఎదుగుదల, జ్ఞానం, తమ చుట్టూ ప్రపంచాన్ని అర్ధం చేసుకోగలిగే అవగాహన తక్కువ స్థాయిలో వుండే ఈ అబ్బాయిలు ఎలా సోషల్ మీడియాలో ఇంటరాక్ట్ అవుతున్నారు? సోషల్ మీడియాలో సినిమా, రాజకీయ నాయకులని అనుకరించటం మాత్రమే కాకుండా కుల వ్యవస్థ, మత వివక్ష, జండర్ కి సంబంధించిన చర్చలు వీరిని ప్రగతి శీల విలువల వైపు ప్రభావితం చేస్తున్నాయా? ఇవి వారి కుటుంబ నేపధ్యం, విద్యాసంస్థల్లో టీచర్లు, విద్యార్థి సంస్థలు, కుల వ్యతిరేక ప్రజా సంఘాలు లేక ఇతర సంఘాలతో వుండే ఇంటరాక్షన్ మీద ఆధారపడి ఉంటుంది. ఏమీ లేకుంటే, హీరో వర్షిప్ ఈ వయసులో ఎక్కువుంటుంది కాబట్టి, సినిమా హీరోల ఫాన్స్‌లా, ఇతర ఇంటరాక్షన్ వున్నా సరే, ఆయా లీడర్ల ఫాన్స్ క్రింద ఎక్కువగా మారుతున్నట్లు అనిపిస్తోంది.
10వ తరగతి తర్వాత చదువు చూసుకుంటే, అమ్మాయిలు అబ్బాయిల కన్నా కాస్త ఎక్కువగా కళాశాలల్లో చేరుతున్నారు. అబ్బాయిలు ఖరీదయిన ఇంజినీరింగ్ వంటి కోర్సులలో చేరితే, అమ్మాయిలు ఇతర కోర్సులలో చేరుతున్నారు. వీటిల్లో ఆర్ట్స్, సామాజిక శాస్త్రాలు, హ్యూమానిటీస్ కోర్సులు వుండవు. చరిత్ర, పౌర శాస్త్రం, కనీసం ఆర్ధిక శాస్త్రం వంటి సామాజిక శాస్త్రాల కోర్సులు, నేర్పించే కళాశాలలు ఉండాల్సిన వాటి కంటే చాలా తక్కువగా వున్నాయి. ఐఐటి, బిట్స్ పిలానీ వంటి కొన్ని కులీన ఇంజినీరింగ్ కాలేజీలలో సామాజిక శాస్త్రాలని ప్రవేశపెట్టారు కానీ, విద్య, అదీ ఉన్నత విద్యని అస్సలు పట్టించుకోని మన రెండు రాష్ట్రాలలో, పర్యాటకం, కోడింగ్, ఏ ఐ అని ఊగిపోయే ఇద్దరు ముఖ్య మంత్రులు అటూ ఇటూ ఉండగా ఇటువంటి రాడికల్ మార్పులు ఊహించటం కూడా కష్టమే.
చదువుల్లో విమర్శనాత్మక చూపు లేకపోయినా 1990ల తర్వాత కొత్త ఆర్ధికం, మార్కెట్ కారణంగా స్వేచ్ఛ, స్వతంత్రత మన రోజువారీ భాషలోకి ప్రవేశించాయి. బట్టల్లో, బైకుల్లో, నగలలో వ్యక్తిగత టేస్ట్ ప్రాధాన్యత పెరిగింది. ఈ స్వేచ్ఛ భావనలు వ్యక్తిగత జీవితాన్ని కొంతవరకు పాత విలువల నుండి విముక్తి చేశాయి గానీ సమాజం గురించిన విమర్శనాత్మక జ్ఞానం, స్పృహ, చూపు ఇవ్వలేని చదువు కారణంగా ఈ స్వేచ్చా భావనలు ఎంత ముందుకెళ్తాయో అన్నది అనుమానమే. కులం, జెండర్ సంబంధాల్లో మార్పుల గురించి క్లాస్ రూమ్‌లలో, బయటా చర్చించే అవకాశం కూడా పరిమితంగా ఉండటం వల్ల, యువకులకు ఈ దిశలో ఆలోచించే పరిస్థితులు కూడా లేవు.
ఇలా ఏ సామాజిక అవగాహనా, స్పృహ పెంచకుండా జాగ్రత్తగా పెంచిన అబ్బాయిలకి (యువతకి కూడా) మన రాష్ట్రాలు అమెరికా వెళ్ళటం, తక్కువలో తక్కువ సాఫ్ట్వేర్ వుద్యోగంలో చేరటం, అనేవి సాంస్కృతిక ఆదర్శాలుగా తయారు చేశాయి. చాలా అరుదుగా ఈ ఆదర్శాల్లో ప్రభుత్వ ఉద్యోగాన్ని ‘కొట్టటం’ కూడా భాగమవుతుంది. 1990 తర్వాత ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించటం మానేసి, చదువుకి, ఉద్యోగానికి లింకుని కట్ చేసిన చంద్రబాబు నాయుడు పుణ్యమా అని చదువుని అమెరికాకి వెళ్లే ఒక సాధనంగా చూడటం మన సమాజాలకు మూడు దశాబ్దాలుగా ఒక అలవాటుగా మారింది. అక్కడి తమ పిల్లల డబ్బు, ఇల్లు, వస్తువుల గురించి ఇక్కడ బంధువులకి గొప్పలు చెప్పుకోవటం తెలుగు మధ్య తరగతికి ఒక సంప్రదాయంగా మారింది. అమెరికా దారి తెరుచుకోక ముందు పరిస్థితులని తెలుగు మధ్యతరగతి కుటుంబాలు ఒక భయానక కాలంగా గుర్తు చేసుకుంటాయి. అక్కడయినా, ఇక్కడయినా ఈ స్వప్రయోజనమే కేంద్ర బిందువుగా వుండే ద్రుష్టి కోణంలో, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కానీ, ప్రభుత్వ ఉద్యోగాలు కానీ తమని, కుటుంబాలని ధనవంతులు చేసేవి మాత్రమే, వీటికి అంతకంటే సామాజిక బాధ్యత, లక్ష్యాలు వుండవు, వుండకూడదు కూడా. జీవితంలో అన్నీ చేసిన తర్వాత సామాజిక బాధ్యత నిర్వర్తించొచ్చు అనే ప్రాక్టికల్ సలహాలు కూడా రొటీన్‌గా లభిస్తాయి.
అయితే, అమెరికా వలస, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు సంపాదించలేని అబ్బాయిలు ఏం చెయ్యాలి? తమ జీవితమే వైఫల్యమనే తీర్పుని మొయ్యాలి. ఇక్కడ ఎదుగూ, బొదుగూ లేని ఉద్యోగాల్లో కుదురు కోవాలి. కార్మికులకు సరయిన జీతాలని ఇవ్వక్కర్లేదని నిర్ణయించుకున్న భారత పెట్టుబడి దారీ వ్యవస్థలో రియల్ ఎస్టేట్ ఏజెంట్లు, ఆటో డ్రైవర్లు, డెలివరీ ఏజెంట్లు, ఇంకా అనేక పనులు కలిపి చేస్తూ డబ్బే అంతిమ లక్ష్యంగా చూసే సమాజంలో తమ మనిషి తనాన్ని, మగతనాన్ని నిరూపించుకుంటూ ఉండాలి. ఇంట్లో ఇచ్చేది సరిపొవట్లేదని కొట్లాడే భార్యని, ఆమెతో కొట్లాడే తల్లినీ సముదాయించాలి. మా జీవితం ఎంత గొప్పగా ఉందొ చూడండహో అంటూ అందరూ ఫోటోలు పెట్టుకునే సోషల్ మీడియాలో తమ జీవితం కూడా బాగుందని, తాము కూడా సఫలీకృతులని చూపించుకోవాలి.
ఈ నేపథ్యంలో పుట్టుకతో వచ్చిన మగ అధికారాలు కాపాడుకోవటం, తక్కువగా వున్న వాటిని బలోపేతం చేసుకోవటం అవసరంగా మారుతుంది. చెల్లెల్ని, అమ్మల్ని నియంత్రించడంలో ఏ తప్పూ కనిపించదు. అలాగే కట్నం తీసుకోవటం సరయిందిగా అనిపిస్తుంది. దాని కోసం బలవంతం చెయ్యటం కూడా బాగానే అనిపిస్తుంది. అది కూడా కుదరకపోతే కొట్టటం కూడా తప్పుగా అనిపించదు. తమ జీవితంపై నియంత్రణ తక్కువయి నపుడు, ఎక్కడో అక్కడ నియంత్రణ అవసరమనిపిస్తుంది. అటువంటి నియంత్రణ కోరే వాళ్ళని సమర్ధించాలనిపిస్తుంది. ఇంట్లో భార్య తో సహా ఎవరూ మాట వినని పరిస్థితుల్లో ఎట్లా ఆడవాళ్ళని నియంత్రించాలనే ఆలోచన బుర్ర నిండా వ్యాపిస్తుంది. అందరితో సహా తెలుగు స్త్రీత్వం ‘నిండయిన’ బట్టల్లోనే ఉంటుందని, అసలయిన తెలుగు స్త్రీలు భర్త నియంత్రణలో ఉంటారని ప్రకటించాలని అనిపిస్తుంది. హైద్రాబాదు నగరం సైబర్ నేరాల్లో, స్త్రీల పట్ల నేరాల్లో పై స్థానంలో ఉండటం యాదృచ్చికం కాదు కదా.
చారిత్రిక, వ్యవస్థీకృత మార్పుల ఫలితంగా వర్గ వ్యవస్థలో పైకి వెళ్లాలన్న మగవాళ్లందరూ పై కులాల్లో ప్రబలిన ‘గౌరవ ప్రదమైన’ కుటుంబ వ్యవస్థ కావాలనుకుంటున్నారు. మగ అధికారం సంప్రదాయంగా వుండే కుటుంబ వ్యవస్థ మొన్న మొన్నటి వరకూ ఆధిపత్య వర్గాలకే పరిమితమయింది. ఇప్పుడు ఆర్ధిక స్థాయి పెరిగిన మగవాళ్లలో అనేకులు తమ అధికారం క్రింద భార్యలు, పిల్లలు వుండే ఈ కుటుంబ రూపం కావాలని ఆరాటపడుతున్నారు. వ్యవస్థీకృతంగా ప్రభుత్వం, ఆర్ధికం సమర్ధిస్తే తప్ప అది అందరికీ అందని ద్రాక్ష. సంపాదన ఖర్చులకి చాలదు. భార్యలు బయటికెళ్లి పని చేస్తామంటే, మగతనం దెబ్బ తిన్నట్లు అనిపిస్తుంది.
తెలుగు సమాజంలో మగతనం మారుతూ వచ్చింది. వస్తోంది. ఎక్కువమంది ఆడవాళ్ళతో సంబంధాలు పెట్టుకోవటం ఒకప్పుడు సాధారణం, సమర్ధనీయం. ఇప్పుడు అది జరిగినా దాన్ని ఎవరూ సమర్ధించరు. భార్యలని కొట్టటం సర్వ సాధారణం, ఇప్పుడు అంత కాదు. ఆధిపత్య కులాల మగవాళ్ళు తమ దగ్గర పని చేసే ఆడవాళ్ళని లైంగిక దోపిడీ చెయ్యటం ఒకప్పుడు అలవాటు, ఇప్పుడు కాదు. మగవాళ్ళు పిల్లల్ని చూసుకోవటం, వంట చెయ్యటం లేదా ఇల్లు చూసుకోవటం ఒకప్పుడు నామర్దా. ఇప్పుడు కనీసం దాన్ని చర్చించే స్థాయికి వచ్చాము. బహిరంగ స్థలాల్లో ఆడవాళ్ళని వెంటపడి వేధించటం ఒకప్పుడు మామూలు, ఇప్పుడు ఎంతో కొంత దానిపై నియంత్రణ, అది చెయ్యటం తప్పనే విలువ వచ్చింది. అమెరికా వెళ్లిన కుటుంబాలలో ఇద్దరూ ఇంటి పని పంచుకోక తప్పని పరిస్థితి. భారతదేశంలో సాఫ్ట్వేర్‌లో వుండే కుటుంబాల్లో ఇద్దరూ సంపాదిస్తుంటే, ఇంటి పనిని వివిధ రకాల శ్రామికులకు ఇవ్వటం తప్పని పరిస్థితి. శ్రామిక కుటుంబాల్లో మూడు పూటలా వంట కుదరదు. దిగువ మధ్య తరగతి కుటుంబాల్లో ఇద్దరూ పని చెయ్యక తప్పని పరిస్థితి ఉంటే, పిల్లల పని పంచుకోక తప్పదు.
మగతనం గురించి ఈ రోజు మాట్లాడుకుంటున్నామంటే మన సమాజంలో కానీ, ఇతర చోట్ల గానీ మగతనం మారలేదని కాదు. భూస్వామ్య వ్యతిరేక, కుల వ్యతిరేక, స్త్రీవాద ఉద్యమాల ఫలితంగా అనేక ‘సహజ’ మగ ప్రవర్తనలని మనం ఇప్పుడు కుటుంబ హింస, లైంగిక వేధింపులు, లైంగిక దోపిడీ, కుల హింస అనే పేర్లతో పిలుస్తున్నాం. మగతనాన్ని ‘సహజం’ అని వదిలెయ్యకుండా, ఒక సామాజిక పరిణామంగా చూడటం వల్లే ఇవన్నీ సాధ్యమయినాయి. విడాకులు, వివాహ వయసు పెంచటం, ఆడవాళ్ళ పని హక్కులు, శరీరంపై దాడిని లైంగిక దాడిగా చూడటం ఇవన్నీ మగవాళ్ళు మారతారనే ముందు చూపుతో చేసినవే.
అనేక మంది మగవాళ్ళు సోషల్ మీడియాలో స్త్రీలపై ఇక కంఠంతో దాడులు చేస్తున్నారంటే, ఏదో మార్పు జరుగుతోందని అర్ధం చేసుకోవచ్చు. అది స్త్రీల ఎదుగుదల కావచ్చు. సోషల్ మీడియాలో పెరుగుతున్న గుర్తింపు కావచ్చు. తెలుగు సమాజంలో అనిశ్చితి, సందిగ్దత కావొచ్చు. మగతనం కేవలం ఆడతనంతో మాత్రమే పోటీ పడదు. ఇతర మగవాళ్ళతోటే దానికి ఎక్కువ పోటీ, సంఘీభావం కూడా. మనం చూస్తున్న ఈ మగతనం ఎప్పటి నుండో మారకుండా నడుస్తోంది కాదు. 200 ఏళ్ల నుండీ ఒక పక్క కుల వ్యవస్థ, పితృస్వామ్య వ్యవస్థ మార్పులు చెందుతుంటే, ఇంకో పక్క ఆ మార్పులని నియంత్రించే వాదనలు, కట్టి పడేసే పరిణామాలు కూడా జరుగుతూనే వున్నాయి. ప్రస్తుతం సంస్కృతి పరిరక్షకులుగా మనం చూస్తున్న సోషల్ మీడియా తెలుగు మగతనం సంస్కరణ, సంప్రదాయం మధ్య జరుగుతూ వచ్చిన సంఘర్షణలో ఒక స్టేజి మాత్రమే.

Share
This entry was posted in ఇంకు పెన్ను. Bookmark the permalink.

One Response to తెలుగు మగతనం: ఒక పరిశీలన – ఎ. సునీత

  1. మొత్తానికి మొగతనం పేరుమీద పనికిమాలిన పనులన్నీ చేయడానికి పని లేని చేతకాని వాళ్ళు ముఖ్య కారణం అని అన్నట్టు అర్థం అయ్యింది. ఈ క చదువు విచక్షణ వివేచన కూడా లేని ఒక కారణం కూడా కనిపిస్తుంది.
    చేతిలో ఫోన్ అందులో తెలుగు యాప్ యూ ట్యూబ్ లో పోర్న్ సైట్స్ వెరసి ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితి మార్పును అర్థం చేసుకోలేని పరిస్థితి,ఇలా అనేక చేసు దారులు పట్టించే పరిస్థితి.
    పని లేని ఎవరో పిల్లి తల కొరిగినట్టు, ఈ సో కాల్డ్ మొగవాళ్ళకు పనీ పాట లేకుండా ఇలా తయారయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.