గత కొన్నేళ్లుగా సోషల్ మీడియా, టెలివిజన్లలో ఆడవాళ్ళూ, దళితులూ తమపై జరిగే హింస, వేధింపుల గురించి పెట్టే కేసులన్నీ అబద్ధపు కేసులేనన్న వాదనలు ఊపందుకున్నాయి. భార్య అబద్ధపు కేసు పెట్టటంతో నష్టపోయి బాధ తట్టుకోలేక చనిపోతున్నానే అతుల్ సుభాష్ వంటి భర్తల వీడియోల ఆధారంతో ఈ చట్టాలని నేర స్మ్రుతి నుండి తీసేయాలని, వీటికుండే కఠినతరమైన శిక్షలని తీసేయాలని, కోర్టుల్లో కేసు నిరూపణ కాకపోతే ఫిర్యాదు చేసిన వారిని తప్పని సరిగా శిక్షించాలనే వాదనలు, ఇంకో పక్క వేధింపుల కేసులు ఎదుర్కుంటున్న ఆధిపత్య కులాలు, మగవాళ్లందరినీ సమర్ధించే సంఘాల వాదనలు బాగా ప్రచారంలోకి వచ్చాయి.
ఈ విషయంలో వుండే సంక్లిష్టత గురించి లోతయిన పరిశోధలనలు చేసి న్యూస్ మినిట్, ఫ్రంట్ లైన్, కారవాన్ జర్నలిస్టులు, ఫిర్యాదులు, కోర్టు తీర్పుల గురించి అనేక నివేదికలు తెచ్చినా, ఒక నిముషం రీల్స్, వీడియోలకు ప్రచారానికి వచ్చే జనాదరణ వాటికి లభించట్లేదు.
హింస, వేధింపుల గురించి దశాబ్దాల పాటు చట్టాల కోసం పోరాడిన సంఘాలకి, లైంగిక, కుటుంబ హింస, సెక్స్ ట్రాఫికింగ్, లైంగిక దాడులని నేరాలుగా పరిగణించే చట్టాలు, వాటి అమలు కోసం పోలీసులకి, న్యాయమూర్తులకు తర్ఫీదు నిచ్చిన వారికి, ఆయా మహిళా బాధితులకి స్పెషల్ సెల్స్, కౌన్సిలింగ్ సెంటర్లు, సఖి సెంటర్లు ఏర్పాటు చేయించి, వాటి నుండి బయట పడటానికి ప్రయత్నించే ఆడవాళ్ళతో రోజూ మాట్లాడే వారికి ఈ వాదనలు, ప్రచారం సత్య దూరంగానూ, అన్యాయమయిందిగా, ఇంకా చెప్పాలంటే కాలాన్ని వెనక్కి తిప్పటానికి ప్రయత్నించే పితృస్వామ్య ప్రతీకార చర్యలుగా కనిపిస్తాయి. వాస్తవ పరిస్థితులకి విరుద్ధంగా ఇటువంటి ప్రచారం ఎందుకు ఊపందుకుంటోంది అనే ప్రశ్న కూడా చాలా మందికే వస్తోంది. ఈ వైరుధ్య వాస్తవాల నేపథ్యంలో హైద్రాబాదులోని గీతం యూనివర్సిటీలో, కౌటిల్య స్కూల్ అఫ్ పబ్లిక్ పాలసీ నుండి డా. వసుధ కట్జూ, యుగాంతర్ నుండి తేజస్విని మాడభూషి, ఐఐఐటి నుండి డా. రాధికా కృష్ణన్ మరియు భూమిక సంస్థ నుండి కొండవీటి సత్యవతి, నేనూ కలిసి ఈ పరిణామం గురించి గీతం యూనివర్సిటీలో రెండు రోజుల సమావేశం నిర్వహించాము. దీనిలో వివిధ రాష్ట్రాల్లో క్షేత్రస్థాయిలో పని చేస్తున్న అనేక పరిశోధకులు, మహిళా సంఘాలు, జర్నలిస్టులు, న్యాయశాస్త్ర అధ్యాపకులు, సామాజిక శాస్త్రవేత్తలు, న్యాయవాదులు, ఆక్టివిస్టులు, విద్యార్థులు పాల్గొన్నారు.
దాదాపు సంవత్సరం పాటు ముందస్తు తయారీ – పరిశోధక పత్రాల కోసం ప్రకటన, ముసాయిదా పత్రాలని చదివి వాటిని మెరుగుపరుచుకోవటానికి సూచనలు ఇవ్వటంతో సహా, ఈ సంక్లిష్టతని అర్ధం చేయించిన అనేక మందిని ఆహ్వానించటం – తర్వాత జరిగిన ఈ సమావేశం పరిశీలించిన ప్రశ్నలివి: అసలు అబద్ధపు కేసంటే ఏమిటి, దీనికి చట్టపరమైన నిర్వచనం ఉందా, దీని ప్రకారం పోలీసు రికార్డులలోకి వచ్చిన కేసుల్లో ఎన్ని అబద్ధపు కేసులుగా నేరాల గణాంకాల్లో నమోదు అవుతున్నాయి, అసలు స్త్రీలపై హింస, వేధింపుల కేసుల్లో ఫిర్యాదులు రాసే ప్రక్రియపై ఫిర్యాదీ దారులయిన స్త్రీలకి నియంత్రణ ఉంటుందా, న్యాయమూర్తులు కేసుల వాస్తవాల గురించి చేసే వ్యాఖ్యలని ఎలా అర్ధం చేసుకోవాలి, సాక్ష్యాధారాలు సేకరించే ప్రక్రియ సక్రమంగా నడుస్తుందా, ఆయా కేసుల్లో ఎంత మందికి శిక్ష పడుతోంది, అతి తక్కువ శిక్షలు పడటానికి కారణాలేమిటి, నేరం నిరూపణ కాక, శిక్షలు పడకపోతే, ఆ నేరం జరగనట్లేనా, అసలు సాక్ష్యాలని సేకరించే బాధ్యతని పోలీసులు ఏ సందర్భంలో సీరియస్గా తీసుకుంటారు, సోషల్ మీడియా, ఇంటర్నెట్లో అబద్ధపు కేసుల గురించి జరిగే ప్రచారం తీరుతెన్నులేమిటి. ఇవి కాకుండా, ఈ ప్రచార యుద్ధానికున్న దీర్ఘ కాలిక లక్ష్యాలేమిటన్న విషయం కూడా చర్చకొచ్చింది.
ప్రత్యేక ఆహ్వానితులతో కూడిన పానెల్స్, పరిశోధనా పత్రాలు ప్రధానంగా కుటుంబ హింస, 18 ఏళ్ల లోపలి పిల్లలు, యువతీ/యువకులపై హింసని నిరోధించే చట్టాలు, మహిళల రవాణా చెయ్యకుండా అడ్డుకునే చట్టాలు, అత్యాచార చట్టాలు, లైంగిక వేధింపుల చట్టాల పనితీరుతో పాటు, వీటిపైనా, దళితులూ, ఆదివాసీలపై అత్యాచార వ్యతిరేక చట్టాల పైనా సోషల్ మీడియాలో జరిగే చర్చల విధి విధానాల గురించి లోతుగా పరిశీలించాయి. సాక్ష్యాధారాలుగా – తీర్పులలో న్యాయమూర్తుల వ్యాఖ్యలు, పోలీసు ఆఫీసర్లతో, ఫిర్యాదులు చేసిన స్త్రీలతో ఇంటర్వ్యూలు, జాతీయ నేర రికార్డు బ్యూరో వివిధ రకాల నేరాల గురించి సేకరించిన అధికారిక సమాచారం, సోషల్ మీడియా పోస్టులు, వార్తా పత్రికల్లో నేరాల గురించి వచ్చిన నివేదికలు, హాస్పిటల్లో మెడికల్ రికార్డులు – ఇవి ఉపయోగించుకున్నాయి. సమాచారాన్ని సేకరించే పద్ధతులే కాక, అవగాహన కల్పించగలిగే సైద్ధాంతిక చట్రాల గురించీ, వాటికుండాల్సిన సంక్లిష్టత గురించి కూడా చర్చ జరిగింది.
న్యాయ మూర్తుల వ్యాఖ్యలు
సమావేశానికి ప్రధాన వక్తగా వచ్చిన ఫ్లేవియా ఆగ్నెస్ బొంబాయిలో మజ్లీస్ అనే న్యాయ సహాయ కేంద్రం స్థాపించి మూడు దశాబ్దాలుగా కుటుంబ హింస బాధితులకి న్యాయ పరమైన మద్దతు ఇవ్వటమే కాకుండా స్త్రీలు న్యాయం గురించి అనేక పుస్తకాలు రాశారు. మజ్లీస్ గత కొన్నేళ్లుగా లైంగిక వేధింపుల బాధితుల కోసం, ముఖ్యంగా కుటుంబ సభ్యులే అత్యాచారం చేసిన పిల్లల గురించి ప్రభుత్వంతో కలిసి కూడా పని చేస్తోంది. స్వయంగా కుటుంబ హింస బాధితురాలయిన ఆమె తన ప్రసంగంలో ఆ రెండు రోజుల్లో చర్చించబోయే అనేక అంశాలను తన విస్తృత అనుభవ జ్ఞానంతో స్పృశించారు.
మొదటిగా, ఇవన్నీ రాజ్యం నిరూపించాల్సిన నేరాలనీ, ఫిర్యాదు చేసిన వారికి తక్కువ పాత్ర ఉంటుందనీ, ఒక నేరాన్ని కోర్టు వరకూ తీసుకువెళ్లాలంటే చట్టపరమైన ప్రక్రియలో పోలీసులు, న్యాయవాదులు కీలక పాత్ర పోషించాలని వివరిస్తూ, వారు కూడా ఈ సమాజానికి చెందిన వాళ్ళే కాబట్టి అన్ని ఆధిపత్య భావజాలాలకీ వారు కూడా లోనయి ఉంటారని విశదీకరించారు.
రెండవది, ఈ అబద్ధపు కేసుల ప్రచార వ్యాప్తిలో న్యాయ స్థానాల పాత్ర, తీరు తెన్నులపై కేంద్రీకరించి, ఉన్నత న్యాయస్థానాలు ఏ ఏ సందర్భాల్లో అబద్దపు కేసుల గురించి వ్యాఖ్యలు చేశారో కేసుల్ని ఉటంకిస్తూ వివరించారు. తన ఉద్దేశంలో ఇవన్నీ బాధ్యతారహిత వ్యాఖ్యలని అన్నారు. ఎందుకంటే, అవన్నీ కేసులో విషయం గురించి సంబంధం లేనివీ, ఫిర్యాదీ దారు అడిగింది ఒకటయితే, వేరే విషయానికి ఆపాదించి చేసినవీ, ఒక వ్యక్తికీ సంబంధించిన విషయాన్ని సాధారణీకరించినవీ అనేకం వున్నాయి.
మూడవది, అసలు న్యాయ ప్రక్రియలో ఏ స్థాయిలో ఈ వ్యాఖ్యలు వస్తున్నాయన్నది కూడా ముఖ్యమని చెప్పారు. భార్యా భర్తలు ఇద్దరూ కోర్టు బయట రాజీ కొచ్చి విడాకులు మంజూరు చెయ్యమని, కుటుంబ హింస కేసు కొట్టేయమని పై కోర్టులకి వెళ్లిన సందర్భాల్లో ఈ విధమయిన వ్యాఖ్యలు చేశారని వివరించారు. అంటే, ఫిర్యాదు వివరాలు, కేసు ప్రక్రియ నేపధ్యంలో చూస్తే ఆ ప్రత్యేక కేసులో కూడా హింస జరగలేదని న్యాయ మూర్తులు అనలేదని, కేవలం అసందర్భ యధాలాప వ్యాఖ్యలు చేశారని ఎత్తి చూపారు.
న్యాయమూర్తుల వ్యాఖ్యలని గీతాంజలి జాషువా తన పరిశోధనా పత్రంలో వివిధ రకాల కేసులలో వచ్చిన తీర్పులని పరిశీలించి సామాజిక అంతరాలని బలపరిచేట్లు ఉన్నాయని చెప్పారు. భర్తలు వేధించిన కేసులలో వాటిని వేధింపులు అనక్కర్లేదని, ఆడవాళ్ళకి సహనం వుండాలని, భర్తలని, అత్తమామల్ని మంచిగా చూసుకోవాలనే వ్యాఖ్యలు చేశారు. మతాంతర వివాహాలు చేసుకున్న కేసులలో ఆయా ఆడవాళ్ళూ స్వచ్చందంగా మతం మారమని చెప్పినా, దానిని పక్కకి పెట్టి, అవి బలవంతంగా జరిగాయని నిర్ధారించి, ఆ
పెళ్లిళ్లు చెల్లవని చెప్పారు.
పోలీసుల దృష్టిలో నిరూపణ అయ్యే వరకూ అన్నీ అబద్ధపు కేసులే
పోలీసులు ఫిర్యాదు చేసిన వారిని చూసే దృక్కోణం, సాక్ష్యాధారాలు సేకరించే పద్ధతుల గురించి చాలా చర్చ జరిగింది. పోలీసుల ద్వారానే అణగారిన వర్గాలయిన స్త్రీలు, దళితులు చేసే ఫిర్యాదులు నేరాలుగా నమోదవుతాయనీ, నేర నిరూపణ వారి నిబద్ధత పైనే ఆధార పడుతుందని ఫ్లేవియా చెప్పిన విషయాన్ని వసుధ నాగరాజ్ ముందుకు తీసుకెళ్లి మరింత లోతుగా చర్చించారు. మన న్యాయ వ్యవస్థ ఏ నేరాన్నయినా ఇద్దరు వ్యక్తుల మధ్య శత్రుత్వ పోరుగా చూస్తుందని, తమ ప్రక్రియలో తామనుకున్న సత్యం తేలితే తప్ప, ప్రతీ ఫిర్యాదీని అనుమానంతో చూసి, వారి ఫిర్యాదుని అబద్ధంగా చూస్తుందనే విషయాన్ని ముందుకు తెచ్చారు. ఫిర్యాదు చేసే స్త్రీలలో ఎవరు నమ్మదగిన వాళ్ళు అనటానికి పోలీసులకి కొన్ని ముందరే పెట్టుకున్న కొలమానాలు ఉంటాయి, వాటికి చట్టాలలో, నియమాలలో క్రమంగా వచ్చిన మార్పులతో సంబంధం తక్కువ.
మొగుళ్ళు, అత్తా మామల నుండి ఎదుర్కుంటున్న హింస గురించి స్టేషన్కి వెళితే, పోలీసులు ఆమె రాసే ఫిర్యాదులో, జరిగినా, జరక్కపోయినా అదనపు కట్నం అడుగుతున్నారని రాయమంటారని అనేక మంది పరిశోధకులు, ఆక్టివిస్టులు, లాయర్లు ఎత్తి చూపారు. ఆ తర్వాత, ఆ ఫిర్యాదు పేరు మీద మొగుడిని కస్టడీలోకి తీసుకుని తిట్టడమో, కొట్టడమో చేస్తారని, మహా అయితే కొన్ని రోజులు జ్యుడిషియల్ కస్టడీకి పంపిస్తారు. ఈ విషయం మీద పరిశోధన చేసి రాసిన లా ప్రొఫెసర్ మయూర్ సురేష్ తన విశ్లేషణలో ఏమన్నారంటే పోలీసుల దృష్టిలో తాము మొగుళ్ళకి వేసే ‘ఇంత మాత్రం’ శిక్ష వారికి సరిపోతుంది. ఫిర్యాదుని కోర్టులో నిరూపించే బాధ్యత తమదని వాళ్ళు అనుకోరు. ఆ కేసులు కోర్టుకి వెళ్ళినప్పుడు దానికి తగ్గ ఆధారాలని చూపించలేరు కాబట్టి అవి వీగిపోతాయి. వీటి ఆధారంగా
ఆడవాళ్లు ‘అబద్ధపు’ ఫిర్యాదులు చేస్తారని ప్రచారం జరుగుతుంది.
హింస లేకుంటే అంగీకారమే
పెళ్లి చేసుకుంటామని వాగ్దానం చేసి లైంగిక సంబంధం పెట్టుకుని తర్వాత మోసం చేసే మగవాళ్ల ని ‘తప్పుడు సమ్మతి’ నేరం కింద కేసు నమోదు చేస్తారు. దీన్ని కూడా ఒకరమయిన లైంగిక అత్యాచారం క్రిందే పరిగణిస్తారు. పోలీసులతో ఈ కేసుల గురించి మాట్లాడిన పరిశోధకురాలు అనీషా వారి దృష్టిలో అత్యాచారం అంటే బలవంతం, హింసతో కూడుకున్నది మాత్రమేనని, ఇవి కనపడకపోతే, వాటిని ఇష్టంతో పెట్టుకున్న సంబంధాలుగానే పరిగణిస్తారనీ వెల్లడించారు. ఆ లైంగిక సంబంధానికి దారి తీసిన పరిస్థితులని, దాని పర్యవసానాలని పక్కన పెట్టేసినప్పుడు, హింస లేని సంబంధాలన్నీ వారికి అంగీకారంతో కూడిన సంబంధాలుగానే కనపడతాయని, పైగా ఇటువంటి సంబంధాల్లో మోసపోయిన స్త్రీలు ప్రభుత్వం ఇచ్చే నష్ట పరిహారం కోసమే కేసులు వేస్తారని పోలీసులు బలంగా నమ్ముతారని విశ్లేషించారు. ఆమె నష్టపరిహారం గురించిన గణాంకాలు పరిశీలించినపుడు వాటి కోసం దరఖాస్తు చేసుకున్న బాధిత స్త్రీలు 10 శాతం కూడా లేరు. అలాగే బాధితులతో మాట్లాడినప్పుడు, తమకీ సహాయం గురించి తెలియదని, తాము దరఖాస్తు చేసుకోలేదని కొంత మంది చెప్తే, మరి కొంత మంది, తమకొక్క పైసా వొద్దని, కేవలం న్యాయం కావాలని చెప్పారు.
దగ్గరి వాళ్లు తమపై లైంగిక అత్యాచారం చేశారనే స్త్రీల ఫిర్యాదులని నమోదు చేసుకోవాల్సి వచ్చినప్పుడు, పోలీసులు ఆమె అతడిచ్చిన శీతల పానీయం తీసుకుందని, ఆ తర్వాత స్పృహలో లేదని, బయట పడిన తర్వాత అత్యాచారం జరిగిందని తెలుసుకుందని రాస్తారని ఈ రికార్డులు పరిశీలించిన ఒక వక్త చెప్పారు. బాధితురాలు చెప్పిందానితో దీనికి సంబంధం ఉండదు కాబట్టి ఇది కూడా కోర్టులో నిలవదు. పోలీసులు ఇటువంటి ఫిర్యాదులని ‘నష్ట పరిహారం’ కోసం వేసినవి గానో, లేకుంటే ‘లేచిపోయిన’ కేసులు గానో పరిగణిస్తారు. అంటే ఇవేవీ బలవంతం చేసినవి కావనీ, ఇష్టంతో వెళ్లి అసత్యపు ఫిర్యాదులు చేసిన వారివనీ వీరి ఉద్దేశం. ఇలా పోలీసుల స్వంత అభిప్రాయాలతో చేసే మధ్యవర్తిత్వం అనేక కేసులని కోర్టుల్లో వీగిపోయేలా చేసి ‘అబద్ధపు’ కేసుల ప్రచారానికి భూమికని ఏర్పరుస్తోందన్న మాట.
సమస్యాపూరిత సాక్ష్యాధారాల సేకరణ వ్యవస్థ
మైనర్లపై జరిగే లైంగిక దాడుల్ని నేరాలుగా పరిగణించే పోక్సో చట్టం అబద్దపు కేసుల ప్రచార యుద్ధంలో ప్రధాన పాత్ర పోషిస్తోంది కాబట్టి దీనిలో సంక్లిష్టతని జాగ్రత్తగా అర్ధం చేసుకోవటం అవసరం. తెలుగులో కోర్టు అనే సినిమా కూడా వచ్చింది. ఈ చట్టం చిన్న పిల్లలపై దాడుల్ని, 18 ఏళ్లలో మైనర్లపై జరిగే దాడుల్ని, పరస్పర ఇష్టంతో 18 ఏళ్ల లోపు వయసు అమ్మాయిలు, అబ్బాయిలు పెట్టుకునే లైంగిక సంబందాలతో సమానంగా పరిగణిస్తుంది. 18 ఏళ్ల లోపు మైనర్లు ఎటువంటి లైంగిక చర్యలో పాల్గొన్నా ఈ చట్టం ప్రకారం తప్పు. మైనర్ల అంగీకారాన్ని ఈ చట్టం పరిగణనలోకి తీసుకోదు. ఈ చట్టం క్రింద మైనర్ల జీవితాల్లో జరిగే అంగీకారం లేని, అంగీకారం వున్న లైంగిక చర్యలని – రెంటినీ కూడా లైంగిక నేరాలుగా పరిగణిస్తారు.
దేశంలో అనేక ప్రాంతాల్లో 16 నుండి 18 ఏళ్ల లోపు వివాహ వయసు ఇంకా కొనసాగుతున్న ఈ సమయంలో ఈ చట్టం వల్ల మైనర్ అమ్మాయిలకి, అబ్బాయిలకి వచ్చే చట్ట పరమైన సమస్యలని అనేక స్త్రీల సంఘాలు ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాయి. ఈ చట్టంలో అత్యధిక శాతం ఫిర్యాదులు ఎలా, ఎందుకు నమోదవుతాయో, సాక్ష్యాధారాలు ఎలా, ఎందుకు సేకరించబడతాయో పరిశీలించినపుడు, ఈ చట్టం అమలు ఎందుకు ఇంత సమస్యపూరితమవుతోందో అర్ధమవుతుంది.
ఆయా సంఘటనల గురించి సేకరించబడే వైద్య పరమైన సాక్ష్యాధారాలపై పరిశోధన చేసిన ముంబైలోని సెహత్ సంస్థకి చెందిన ప్రతీక్ష, అనిరుద్, సంగీతలు ఈ ప్రక్రియలో సంస్థాగతంగా పేరుకున్న అసంబద్ధత, అనైతికతకి సంబంధించిన సాక్ష్యాధారాలని సమావేశంలో విశ్లేషించారు. సేకరించే డాక్టర్లకి ఏ సందర్భంలో ఎటువంటి ప్రశ్నలు అడగాలి, ఏవి అడక్కూడదు అని గైడ్లైన్స్ తయారు చేసి వారికి కొంత వరకు తర్ఫీదు ఇచ్చిన తర్వాత, వారు స్వంతంగా రిపోర్టు చేసిన సమాచారం పైన ఆధారపడి చేసిన పరిశోధన ఇది.
తమపై అత్యాచారం జరిగిందని చెప్పిన 10-12 ఏళ్ళు లోపలి పిల్లల నుండి ఎవరు, ఎక్కడ ముట్టుకుని గాయం చేశారు అన్నది తెలుసుకోమని చెప్తే, దాని గురించి డాక్టర్లు ప్రశ్నలు వెయ్యలేదు. జననాంగాలకు తగిలిన గాయాలు మాత్రమే రికార్డు చేసి, ఆయా పిల్లలు తమని అలా చేసిన వారి వివరాలు, పేర్లు చెప్పినా కూడా రాయలేదు. పైగా కారణాలలో అవి ఎట్లాగయినా తగలొచ్చు అని రాశారు. అంటే, చిన్నపిల్లలు స్పష్టంగా చెప్పింది కూడా రికార్డు చెయ్యలేదు.
రెండవ క్యాటగిరిలో వేధింపులు, హింస కారణంగా ఇంటి నుండి పారిపోయిన అమ్మాయిలపై, కేవలం వయసులో మైనర్లు కాబట్టి, ఏ నేరం జరిగిందని చెప్పకపోయినా, చేసిన పరీక్షలు, వీళ్ళు మేము ఈ కారణాల వల్లే పారిపోయాం, మాకు ఇంటికి వెళ్ళటం ఇష్టం లేదు అని చెప్పిన వాళ్ళు మా మీద ఏ అత్యాచారం జరగలేదు అని చెప్పారు. కానీ వారికి పోలీసులు లైంగిక పరీక్షలు చేయించారు. డాక్టర్లు వారు వద్దంటున్నా రెండు వేళ్ళ పరీక్ష చేసి, వారి హైమన్ చిరిగిందని రాశారు. మైనర్లు కాబట్టి వారిపై లైంగిక అత్యాచారం జరిగిందని నిర్ధారించటానికి, ఇది పోలీసులకి ‘సాక్ష్యంగా’ మారుతుంది. వారితో వచ్చిన అబ్బాయిలు ముద్దాయిలవుతారు. ఈ పరీక్షలన్నీ, కుటుంబాలిచ్చిన ‘మిస్సింగ’ ఫిర్యాదుల తర్వాత చేసిన పరీక్షలు – ఒక రకంగా కుటుంబాలని వదిలిన అమ్మాయిల కోసం రాజ్యం చేసే శీల పరీక్షలన్నమాట.
వీళ్ళిద్దరూ కాకుండా ఇంట్లోంచి తమకు నచ్చిన ఇతర కులాలు, మతాల అబ్బాయిలతో వెళ్ళిపోయి, వారిని పెళ్లి చేసుకుని కాపురం చేసి, కొన్నిసార్లు గర్భిణీ అయిన అమ్మాయిలని, అమ్మాయిల కుటుంబాలు ఇచ్చిన మిస్సింగ్, కిడ్నాపింగ్ వంటి ఫిర్యాదులని తీసుకుని పట్టుకొచ్చి, వాళ్లకి కూడా లైంగిక పరీక్షలు చేశారని రికార్డుల్లో వుంది. వీళ్ళు కూడా మైనర్లు కాబట్టి వాళ్ళ భర్తలపై కూడా పొక్సో, ఇతర కేసులు పెట్టటానికి ఈ పరీక్షలతో అవకాశం లభిస్తుంది.
ఒక పక్క బాధితులు చెప్పే విషయాన్ని రికార్డు చెయ్యకపోవటం, ఇంకో పక్క, మాకేం జరగలేదన్న వారి నుండి ‘సాక్ష్యాన్ని’ సేకరించి జరగని నేరానికి బాధితుల్ని తయారు చెయ్యటం రెండూ కూడా ఈ పోక్స్లో చట్ట అమలుని పీడించే సామాజిక, సంస్థాగత సమస్యలని సూచిస్తున్నాయని ఈ పరిశోధనా పత్రం తెలియ చేసింది.
ఇక 16-18 సంవత్సరాల ‘బాధితులు’ ఈ కేసులు కోర్టు దాకా వచ్చినప్పుడు ఏం జరుగుతుందో స్వతహాగా, ఇతరులతో కలిసి రాసిన తన పత్రంలో వివరించారు. అధిక శాతం అమ్మాయిలు తాము స్వచ్చందంగా ఈ లైంగిక సంబంధం లోకి వెళ్లామని, ఏ బలవంతం లేదని, కోర్టుల్లో సాక్ష్యం ఇచ్చారు. మరి కొంతమంది తాము సాక్ష్యం ఇవ్వమని చెప్పారు. కానీ ఇలా స్వచ్చందంగా ప్రేమ సంబంధంలోకి వెళ్లిన తర్వాత బలవంతం చెయ్యబడిన వాళ్ళు కూడా వున్నారు. అంగీకారంతో సంబంధం లేకుండా ఈ చట్టం అన్ని లైంగిక చర్యలని నేరపూరితం చెయ్యటంతో, బలవంతానికి గురయిన అమ్మాయిలకి ఈ చట్టం క్రింద న్యాయం జరక్కుండా పోతోందని ఈ పరిశోధకురాలు విశ్లేషించారు. ఈ చట్టం పరిధిలో, అమ్మాయిల ప్రమేయం లేకుండా, ప్రేమ సంబంధంలో వుండే అబ్బాయిలపై, అబద్ధపు కేసులు మోపటం జరుగుతోందని ఈ విశ్లేషణలు తెలుపుతున్నాయి. ఇది స్త్రీలపై కుటుంబాల నియంత్రణని రాజ్యం తన చట్టం ద్వారా బలపరిచే రాజకీయ ప్రక్రియలో భాగం. కానీ అబద్ధపు కేసుల ప్రచారంలో దీన్ని పూర్తిగా అమ్మాయిలకి ఆపాదించి వాళ్ళు చట్టాన్ని ‘మిస్ యూస’ చేస్తున్నారనే ఆరోపణ సృష్టిస్తున్నారు.
సాక్షులు ఎందుకు అడ్డం తిరుగుతారు?
కోర్టులో మేము సాక్ష్యమివ్వం అనే సాక్షిని ‘హోస్టయిల్ విట్నెస’ లేదా ‘అడ్డం తిరిగిన సాక్షి’ అంటారు. ఇది అన్ని నేరాల విచారణ ప్రక్రియల్లో జరుగుతుంది. సాధారణంగా నేరం చేసిన వాళ్ళ డబ్బు, అధికారం వల్ల జరుగుతుంది. స్త్రీలపైన జరిగిన వేధింపులు, హింస గురించి నమోదు చేసే కేసుల విచారణలో స్త్రీలు ఎందుకు ‘అడ్డం తిరిగే సాక్షులుగా’ మారతారు? మానవ ఆక్రమ రవాణాలో ఇరుక్కుని వ్యభిచారంలోకి నెట్టబడిన స్త్రీలని దాన్నుండి బయటకి లాగే సంస్థలో పనిచేసే ఇద్దరు పరిశోధకులు దేబ్రాతి, మెహ్రూన్ ఈ విషయాన్ని విశ్లేషించారు. బెంగాల్ నుండి మహారాష్ట్రకు రవాణా కాబడిన స్త్రీల కోసం కలకత్తాలో పనిచేసే సంస్థ ఇది.
నేర విచారణ ప్రక్రియలో స్త్రీలు అనేక సార్లు తాము పడిన హింసని పల్లెత్తు తప్పు లేకుండా పదే పదే చెప్పాలి. హింస వల్ల తీవ్రమైన బాధకి గురయిన స్త్రీలు ట్రామాకి గురవుతారు. దాన్నుండి బయటపడిన వెంటనే సాధారణ జీవితం గడపటానికి కొన్ని విషయాలని మెదడు మర్చిపోతుంది. కనీసం సంవత్సరం తర్వాత మొదలయ్యి అనేక సంవత్సరాల పాటు జరిగే చట్టపరమైన విచారణలో విషయాలని మళ్ళా మళ్ళా చెప్పాల్సి వస్తుంది. అందువల్ల ఆ బాధాకరమైన విషయాలని మెదడు తిరగతోడుతుంది. ఇది అనేక మంది బాధితులు, ముఖ్యంగా పేద కుటుంబాల నుండి వచ్చి, ఏ మానసిక ఆరోగ్య సహాయం అందని పరిస్థితుల్లో వుండే వాళ్ళు తట్టుకోలేకపోతారు. అందుకే విచారణకి సహకరించటం మానేస్తారు. విచారణ టైం లైన్ చూపించి, మానసిక శాస్త్ర దృక్కోణంతో ఈ పరిశోధకులు మానవ రవాణాలో ఇరుక్కున్న స్త్రీలు ఎందుకు విచారణ మధ్యలో అధికారులకి సహకరించకుండా పోతారన్న విషయాన్నీ విశ్లేషించారు.
దీనికి అబద్ధపు కేసులతో సంబంధం ఏంటని అడగచ్చు. ఎవరి మీదయితే హింస జరిగిందో వాళ్ళే వెనక్కి వెళ్లారంటే వాళ్ళు చెప్పినవన్నీ తప్పనే కదా అర్ధం అని అబద్ధపు కేసుల గురించిన ప్రచారం అంటుంది. కేసులు వీగిపోవటం, రాజీ పడటం, సాక్షులు వెనక్కెళ్ళటం అన్నిటినీ కూడా అబద్ధపు కేసుల ప్రచారం ముందుకి సాగదీసి ‘ఆడవాళ్లు పెట్టే కేసులన్నీ అబద్ధమే’ అనే నిర్ధారణకు వస్తుంది.
అబద్ధపు కేసుల ప్రచారం తీరు తెన్నులు
అసలు ప్రచారం ఎట్లా జరుగుతుంది అనే విషయాన్నీ దిశా వాడేకర్, ధన్య రాజేందర్లతో పాటు ముగ్గురు భిన్న పరిశోధకులు కూడా విశ్లేషించారు. న్యాయవాది దిశా వాడేకర్ అసలు చట్ట ప్రకారం అబద్ధపు కేసు అంటే ఉద్దేశ పూర్వకంగా అబద్ధపు నిందలు వేసి పెట్ట్టే కేసు అని, నేరాల గణాంకాల బట్టి చూసినా ఆ సంఖ్య తక్కువనీ, ఆ తక్కువ సంఖ్యా (7 నుండి 8 శాతం) కూడా నిరూపణ కానీ కేసులన్నీ కలిపిన కేటగిరీ తప్ప చట్టపరమైన నిర్వచనంలో ఇమడవనీ లోతుగా చర్చించారు. న్యూస్ మినెట్ సంపాదకురాలు ధన్య రాజేంద్రన్ తెలుగు సినిమా పరిశ్రమలో జానీ మాస్టర్ వేధింపులని అబద్ధపు నెపంగా ఎలా మార్చాయిన్నది చర్చిస్తూ, ఇది కేవలం ఇంటర్నెట్లో ప్రచారంగా తీసుకోకూడదని వాస్తవ జీవితంలో దీని ప్రభావం ఇప్పటికే తీవ్రంగా ఉందని చెపుతూ, భవిషత్తులో ఈ చట్టాలని ఏ మాత్రం పనికి రాకుండా చేసే చర్యలకి ఇప్పటికే పధకాలు రచిస్తున్నారని చెప్పారు. భూమిక సంపాదకురాలు సత్యవతి ఇప్పటికే 498ఏ చట్టాన్ని స్థానికంగా చాలా ప్రభుత్వాలు నీరు కార్చాయని అన్నారు.
దిశా వాడేకర్ స్త్రీ ద్వేష ప్రచారంతో పాటు రిజర్వేషన్ వ్యతిరేక ప్రచారం జరిగే విధానాన్ని కూడా ప్రాధమికంగా వివరిస్తే, ఎస్ సి. ఎస్.టిలపై జరిగే అత్యాచారాల నిరోధానికి చుండూరు దళిత మారణకాండ తర్వాత తెచ్చిన చట్టానికి వ్యతిరేకంగా ఎటువంటి ప్రచారం జరుగుతోంది అన్న విషయాన్ని అనురాధ సింగ్ పరిశీలించారు. అమర్ ఉజాలా అనే హిందీ దిన పత్రికలో 2000 సంవత్సరం నుండి పది సంవత్సరాలు ఈ సంఘటనల గురించి, దాన్నుండి వచ్చే పరిణామాలు, కేసుల గురించి ఎలా రిపోర్టు చేసిందో ఆమె విశ్లేషించారు. దళితుల మీద జరిపే హింసని ఇద్దరి మధ్య జరిగిన చిన్న తగాదాలుగా చూపించటం, అత్యాచార చట్టాన్ని అనవసమైన అధికారం కేంద్రీకరించిన చట్టంగాను, సమూహాల మధ్య వుండే మంచి సంబంధాలని పాడు చేసే చట్టం గానూ ఈ పత్రిక చూపిస్తూ వచ్చింది. హింసకి పాల్పడ్డ ఆధిపత్య కులాల మగవాళ్ళని అదుపులోకి తీసుకున్నప్పుడు, దానిని పోలీసుల దాష్టీకంగా రాసింది. ఈ అరెస్టులకు వ్యతిరేకంగా జరిగిన రాలీలని ప్రశంచించింది. దళిత బాధితులు చెప్పేది ఎప్పుడూ అనుమానాస్పదమేనని ఈ కధనాల అర్ధం.
సోషల్ మీడియాలో, లెగసి మీడియాలో కుటుంబ హింస గురించి అతుల్ సుభాష్ ఆత్మహత్య తర్వాత వచ్చిన వాదనలన్నీ తీసుకుని, బెంగుళూరులోని ఒక పోలీస్ స్టేషన్లో ఆయా కేసులు ఏ ఏ స్థితిలో ఉన్నాయో బిందు, ప్రగ్య కూలంకషంగా పరిశీలించారు. వెంటనే కేసు రిజిస్ట్రేషన్ జరుగుతుందనటానికి, విచారణ వెంటనే జరిగి, మగవాళ్లందరికీ శిక్షలు పడతాయనే నిర్ధారణలకి ఆ స్టేషన్ నుండి ఏ ఆధారాలు లభించలేదని నిరూపించారు.
ప్రస్తుత సోషల్ మీడియాలో ఈ ప్రచారం ఎట్లా సాగుతోందో పరిశీలించిన ధృవ్ వర్మ, జీవనజోథ్ కౌర్ రెడ్దిట్ వంటి సైట్లలో అబద్ధపు కేసుల గురించి, ఆయా చట్టాల పట్ల వ్యతిరేకత అల్గోరిథం ద్వారా ప్రచారం అవుతుందని విశ్లేషించారు. ఇటువంటి ప్రతికూల పోస్టులకి లైకులు ఎక్కువొస్తాయని, లైకులు, వచ్చిన కామెంట్లు అల్గోరిథమ్ అందుకుని మరింతగా వ్యాపింప చేస్తుందని, త్వరలోనే అది ఒక బలమైన పోస్టుగా తయారవుతుందని అన్నారు. సాధారణంగా ఇటువంటివి పోస్టు చేసే వాళ్ళు తమని తాము లాయర్లు గానూ నిపుణులు గానూ, లేదా ఈ సంఘటన తమకు, తమ దగ్గరి వాళ్ళకో జరిగిందని రాస్తారని, అది ఆ పోస్టుల ప్రామాణికతని పెంచుతుందని అన్నారు. అటువంటి అచ్చమైన, స్వచ్ఛమైన స్థానం నుండి మాట్లాడుతాం అంటే అందరూ వింటారు కదా?
ముగింపు : ఈ సమావేశం స్త్రీలు, దళితులు ఎదుర్కునే వేధింపులు, హింసకి వ్యతిరేకంగా చేసిన చట్టాలు అబద్దపు కేసులకి దారి తీస్తున్నాయనే ప్రచారాన్ని, దానిలో వాదనలని అర్ధం చేసుకునే ప్రక్రియని కొంత ముందుకు తీసుకెళ్లింది.
– ఒకటి, ఈ చట్టాల పనితీరుని ప్రతి స్థాయిలో అనేక రకాల శక్తులు నిర్దేశిస్తూ ఉంటాయని, ముఖ్యంగా మొదటి స్థాయిలో కుటుంబ సభ్యులు, తర్వాత పోలీసులు, లాయర్లు, ఆ తర్వాత, కోర్టులు, న్యాయ మూర్తులు అందరూ ఫిర్యాదుల నుండి, తీర్పుల వరకూ ప్రతి ప్రక్రియని నిర్దేశిస్తూ వుంటాయని చెప్పింది.
– రెండవది, స్త్రీలకి సంబంధించిన చట్టాల అమలు, ప్రక్రియల్లో, అన్ని వైపులా స్త్రీలూ, పురుషులూ వుంటారు కాబట్టి ఇవన్నీ ఒక పురుషులకి మాత్రమే వ్యతిరేకంగా జరుగుతుందనే వాదనలు చెయ్యటం కష్టమని చెప్పింది. ఎందుకంటే, ఈ ప్రక్రియలో
ఆడవాళ్లు చెప్పే విషయాలని అందరూ అన్ని రకాలుగా, తమ ఆసక్తులు, భావజాలం బట్టి ఫిల్టర్ చేస్తూ వుంటారు.
– మూడు, ఈ ప్రక్రియలో, ఆడవాళ్ళ ప్రమేయం లేకుండా, కొన్ని సార్లు వారు వ్యతిరేకిస్తున్నా పోక్సో నిబంధలు సృష్టించే నేరాలు కూడా ఉంటాయి. వీటి అమలు, జండర్తోనే కాక, ఇతర సామాజిక అంతరాలని – కుల వ్యవస్థ, హిందూ మత ఆధిపత్యం – కాపాడటం తో గాఢంగా ముడి పడి వుంది.
– నాలుగు, అబద్ధపు కేసుల ప్రచారానికి చట్ట ప్రకారం అబద్ధపు కేసుకున్న నిర్వచనంతో ఏ సంబంధము లేదు. తమకి తెలిసిన వాళ్లకి జరిగిందనో, తన దగ్గరికొచ్చిన కేసులో ఇలా జరిగిందనో అనే వాదనలతో పాటు, ఇటువంటి వాదనలని సోషల్ మీడియా అల్గోరిథమ్ పెంచి పోషించటం వీటికి ఆధారాలుగా వున్నాయి.
– ఐదవది, ఈ ప్రచారం కేవలం సోషల్ మీడియాకి పరిమితం కాదు, ఎవరో పనికి మాలిన వాళ్ళు చేసేదీ కాదు. ఇది స్త్రీలు, దళితులూ తెచ్చుకున్న ప్రగతి శీల చట్టాలని వెనక్కి తీసుకునే ప్రయత్నంలో భాగం.
